బందీ

నిన్ను నువ్వు నిరంతరం
తడుపుకుని
కప్పుకుని ముద్దై
అంతలోనే విప్పారి
మేను విరిచి
హొయలు చూపి
అందీ అందకుండా
పారిపోతూ
పట్టు బడుతూ
పరుగులెడుతూ
గెంతులేస్తూ
పంతం పట్టి
పగలబడి
విరగబడి
జడలు జడలుగా
మూటగట్టిన కురులన్నీ
ఒక్క సారిగా
విరబోసి
విదిల్చి
విప్పార్చి
విసిరి కొట్టి
గలగలల హోరుతో
చండ ప్రచండిలా
చెలరేగుతూ
ఏదో తెలియని
పిచ్చి తన్మయత్వాన్ని
తెరలు తెరలుగా జుర్రుకుంటున్నది చాలక…

నన్ను
ఊరించి
పిలిచి
రప్పించి
కవ్వించి
ముద్దాడి
కలహించి
అంతలోనే
సముద్రం కోసం
త్వర త్వరగా
తరలిపోతానంటావు.

నిన్ను చూస్తేనే చాలు
ఉత్సాహం ఉరకలేస్తుంది
తనువు రెక్కలు విప్పుతుంది
కాకలు తీరిన యోధులమైనా
బాల వయో వృద్ధులమైనా
నీ ముందు పసిపాపలం అయిపోవలసిందే కదా!

ఓ నయాగరా జలపాతమా! ఉత్తుంగ తరంగ ప్రవాహమా!

నిన్ను మరిచి నన్ను నేను గుర్తు తెచ్చుకోవాలో
నన్నే మరిచి నిన్ను కళ్ళకు కట్టేసుకోవాలో
తెలియని మీమాంసలో
కొట్టు మిట్టాడుతూ
తడిసి తడిసి తపిస్తున్నాను.


రచయిత గరిమెళ్ళ నారాయణ గురించి: డా. గరిమెళ్ళ నారాయణ ప్రస్తుతం హెర్న్‌డన్, వర్జీనియాలో ఉంటున్నారు. వృత్తి సైంటిస్ట్.  ...