మరణాన్ని
మడత కుర్చీలో దాచి
కూర్చొని కాళ్ళు జాపుకొనే
వయసు నాది
ఉచ్ఛ్వాస నిశ్వాసల
గాలి సయ్యాటలతో
వేణు గానానికి
తోడైన మృదంగవాద్యం
ఎప్పటికప్పుడు
ఒడిదుడుకులు
సర్దుబాటు చేసే
హృది డమరుకం
న్యూస్ పేపర్ వెనకాల
ముఖం దాచుకునే కాలం
ఎప్పుడో జారిపోయింది
ఇప్పుడు మెడ వంచుకుని
కనిపించినంత చూసుకునే
మొబైల్ ఫోనాట
ఉద్వేగమయి
భయ విహ్వలమయ్యే
ఏకాత్మత
దారికాస్తూ
ఎండపొడకోసం
నిల్చున్న
అస్తిమితం
సముద్రమొద్దు
నదీ సంగమమసలే వద్దు
ఉత్తరాయణం వేళ
చలి తగిలిన ఎండలో
ఆకులు రాలే మంచు పొడిలో
బ్రతుకుచెట్టు నన్ను విదిలిస్తుందా!
రావి చెట్టు నీడలోనో
గంగరావి చెట్టు మొదట్లోనో
మర్రి ఊడల జడల్లోనో
తిరిగే గాలి తరగలా
దోబూచులాడే వెలుగు జాడలా
మంద వెళ్ళిపోయేక
ఒక్కర్తయి నిలబడిపోయిన
మేక పిల్లలా
మాగన్నులో కల
కాలం కదుల్తోందా?
నిద్ర దీర్ఘనిద్రగా
మిగుల్తోందా?