“Nothing has really happened until it has been recorded“.
– Virginial Wolf.
చరిత్ర కూడా ఇటువంటి ఆధారమే. మీ ఉనికి ఏ విధంగా నమోదు చేయబడింది, రికార్డు చేయబడిందీ అనేది ఆధునిక చరిత్రలో మీ ఐడెంటిటీని నిర్ధారిస్తుంది. ఉనికి, అస్తిత్వం కలిసిన గుర్తింపును ఇక్కడ నేను ఐడెంటిటీ అని అంటున్నాను. అంటే జరిగిన సంఘటనలూ విషయాలూ రికార్డు చేయబడతాయి అని కాదు. రికార్డు చెయ్యబడింది కనుక అలా జరిగింది, అదే వాస్తవం, అని అర్థం. అంటే వాస్తవికతని నిర్ణయించేది అది రికార్డు అయిన విధానం (documentation – how an event is documented). ఇదొక తలకిందుల పరిస్థితి. అందువల్ల ఎలా నిర్వచించబడింది, ఎలా వ్యాఖ్యానించబడింది, ఎలా నిర్ధారించబడిందీ అనేది ముఖ్యం. ఈ నిర్వచనం, వ్యాఖ్యానం, నిర్ధారణ అనేవి ఆధిపత్య శక్తుల పవర్ పాలిటిక్స్‌లో భాగం. ఏవి ఆధిపత్య శక్తులు అనేవి ఆయా స్థలకాలాలూ సందర్భం నిర్ధారిస్తాయి.
మోడర్న్ ఐడెంటిటీలని నిర్వచించి, వ్యాఖ్యానించి, నిర్ధారించే కార్యక్రమం వలస వాదంతో మొదలయింది. మతాలు, వర్ణాలు, కులాలు, జెండర్ వంటివి స్పష్టంగా ప్రామాణికంగా నమోదు చేయబడ్డాయి (formally documented). అంత క్రితం లేవు అని కాదు, ద్రవస్థితిలో ఉన్నవాటిని ఘనీభవింపజేసింది బ్రిటీషు వలసవాదం. జనాభా లెక్కలు, చరిత్ర రచన, సామాజిక శాస్త్రాలు వంటివి ఇందుకు ఉపకరించాయి. సాధారణీకరణ, సరళీకరణ, వర్గీకరణ క్రమంలో రకరకాల నమూనాలు, స్టీరియో టైప్స్, పుట్టుకొచ్చాయి. ఈ స్టీరియో టైప్స్ ఆయా వర్గాల్నీ ఐడెంటిటీల్నీ వెంటాడాయి, వేధించాయి కూడా.
ఈ ఆధునిక ఐడెంటిటీలు పైకి ఎగబాకే సోపానాలు, అదే క్రమంలో అణచివేత సాధనాలు కూడా. అదే ఈ ఆధునిక ఐడెంటిటీల లోని పరిష్కరించలేని వైరుధ్యం. ఈ చారిత్రక క్రమంలోనే ఒక దళిత నాయకుడు, మేధావిని వివాహం చేసుకున్న విద్యావంతురాలయిన ఆధునిక బ్రాహ్మణ మహిళ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంది, ఎలాంటి ఉన్నత స్థితికి చేరుకుంది, తిరిగి ఎలా అథఃపాతాళంలోకి పడిపోయిందీ లేక నెట్టబడిందీ అనేదే ఈ వ్యాసంలోని ప్రధాన విషయం.
ఆ ఆధునిక మహిళ సవితా అంబేద్కర్. ఆమెకు ఆ పేరు పెట్టింది దళిత మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. పూర్వాశ్రమంలో ఆమె పేరు శారదా కబీర్. ఆమె ఇంటిపేరు కబీర్ కావడం విశేషం. ఎందుకంటే, అంబేద్కర్ స్వయంగా కబీర్ పంథీని అనుసరించే కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన అనుసరణీయులుగా భావించిన వాళ్ళలో సంత్ కబీర్ కూడా ఉన్నారు.
మహారాష్ట్రలోని ఒక సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళ సవితా అంబేద్కర్. స్త్రీ విద్య అరుదుగా ఉండే బ్రిటిష్ పరిపాలనా కాలంలోనే వైద్యవిద్యను అభ్యసించి డాక్టరు వృత్తిని చేపట్టిన ఆధునిక మహిళ. ఇది అంబేద్కర్ రెండవ పెళ్ళి. మొదటి భార్య రమాబాయి నిరక్షరాస్యురాలయిన దళిత స్త్రీ.
అంబేద్కర్ నాయకత్వం వహించిన ఉద్యమాలలోను, రాజ్యంగ రచనలోను, ఎన్నికల రాజకీయాలలోను, బౌద్ధ మత స్వీకరణ ప్రచారంలోను, ఆయన ఆరోగ్యం పట్ల పూర్తి జాగ్రత్త వహించడంలోను, అంబేద్కర్ ఉత్తర జీవితంలోని అన్ని సంఘటనలల్లోనూ కేవలం సాక్షిగా కాక ఒక సహచరిగా, సలహాదారుగా, మేధావిగా వ్యవహరించిన సవితా అంబేద్కర్ ఆశ్చర్యంగా అంబేద్కర్‌ని హత్య చేశారన్న నేరారోపణని కొందరు దళిత నాయకుల నుంచి ఎదుర్కొన్నారు. ఆమె ఈ నేరారోపణల గురించీ వ్యతిరేక ప్రచారం గురించీ తన ఆత్మకథలో స్పష్టంగా సమాధానమిచ్చారు.
నిజానికి ఒక బ్రాహ్మణ స్త్రీ, దళితుని పెళ్ళి చేసుకోవడం ఆ రోజుల్లోనయితే పెద్ద వింత. 1948లో సవితా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ని వివాహం చేసుకున్నప్పుడు లండన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ అనే పత్రిక అభ్యంతరకరమయిన కులతత్వ వ్యాఖ్యానాలు చేసింది. అత్యంత అగ్రవర్ణమయిన సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీ ఒక అస్పృశ్య కులానికి చెందిన న్యాయశాఖా మంత్రి అంబేద్కర్‌ని పెళ్ళి చేసుకోవడం హిందు న్యాయశాస్త్ర విరుద్ధం. అందుకే ఈ పెళ్ళికి క్యాబినెట్ మంత్రులు ఎవరూ హాజరు కాలేదని రాసింది. ఈ వివక్షాపూరిత వ్యాఖ్య మనకి నాగరికతని నేర్పిన గురువు అని చెప్పుకునే ఇంగ్లండు నుంచి వెలువడే పత్రికనుంచి రావడం వింత. ఈ వార్తని ఖండిస్తూ సర్దార్ వల్లభాయి పటేల్ ప్రభుత్వం తరఫున లేఖ కూడా రాశారు. జనాభా లెక్కలలో కులాల స్థాయిని అగ్ర నిమ్న వర్ణాలుగా నిర్ధారించింది బ్రిటీషు వారే మరి. ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ప్రచారం చేసి బ్రాహ్మణులు ఆర్యులే అని చెప్పుకోడానికి అవకాశం కల్పించింది కూడా వారే.
అంబేద్కర్ దంపతులు పటేల్‌ని కలిసినప్పుడు, గాంధీ జీవించి ఉంటే మీ వివాహం చూసి ఎంతో సంతోషించేవారు అన్నారు. అయితే అంబేద్కర్ వివాహం కేవలం కొద్ది మంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. మంత్రులు ప్రభుత్వ ప్రతినిధులు ఎందుకు హాజరు కాలేదు? అందులోనూ అప్పుడు అంబేద్కర్ కేంద్ర మంత్రి కూడా. దానికి గాంధీ హత్య, తదనంతర పరిణామాలే కారణం అంటారు సవితా అంబేద్కర్. గాంధీ హత్య, అంబేద్కర్ రెండవ వివాహం ఇంచుమించు ఒకే సమయంలో 1948 లోనే జరిగాయి.
ఆశ్చర్యంగా బ్రాహ్మణిజానికి ప్రతినిధి అని అంబేద్కర్ జీవితాంతం విమర్శించిన గాంధీ ఒక బ్రాహ్మణుని చేతిలో చనిపోయాడు. అదే సమయంలో అంబేద్కర్ పెళ్ళి చేసుకున్న బ్రాహ్మణ మహిళే అంబేద్కర్‌ని హతమార్చిందని, ఆమెతో పెళ్ళి ఆయన చావుకు దారితీసిందనీ కొందరు దళితవాదులు లోకమంతా ప్రచారం చేశారు. ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. ఇది ఆధునిక ఐడెంటిటీ ఉద్యమాలు సృష్టించిన ప్రహేళిక.
చిత్పవన్ బ్రాహ్మణుడయిన గాడ్సే గాంధీకి మాత్రమే కాదు, మొత్తంగా చిత్పవన్ బ్రహ్మణులందరికీ యముడిగా మారాడు. దేశమంతా చిత్పవన్ బ్రాహ్మణులపై దాడులు, హత్యలూ మొదలయ్యాయి. ఒక్క చిత్పవనులపైనే కాదు, సారస్వత, చంద్రసేనియ, దేశస్థ, కొంకణస్థ… ఇలా అన్ని శాఖల బ్రాహ్మణులపై దాడులు చెలరేగాయి. ఈ పరిస్థితులలో అంబేద్కర్‌తో తన వివాహాన్ని రహస్యంగా ఉంచడం మంచిది అని సవిత భావించారు. అసలే ఈ కల్లోలసమయంలో పెళ్ళి విషయం తెలిస్తే తన బంధువులపైన కూడా దాడులు జరగవచ్చునని భయపడ్డారు.
ఇంతకీ ఈ దాడులు చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ వారా? కాంగ్రెస్ అనేది ఒక కులం కాదు, ఒక పార్టీ మాత్రమే. అసలు ఏ కులం వారు ఈ దాడులకి మూలం? అంటే, బ్రాహ్మణేతరులు.
బ్రాహ్మణిజాన్ని పెంచి పోషిస్తున్నాడని దళితవాదుల చేత నిందించబడిన గాంధీ హత్యకి ప్రతీకార మిషతో బ్రాహ్మణుల హత్యలూ దాడులూ జరిగాయి. 1948 జనవరి 31నాటి న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఆ ఒక్కరోజే ఎనిమిదిమంది హత్యకి గురయినట్లు వార్త వచ్చిందని మౌరీ పాటర్సన్ రాసారు. హిందూ నేషనలిజమ్ బలంగా ఉన్న ముంబై, పూణే, నాగ్‌పూర్ లాంటి నగరాల్లోనే కాదు, నైరుతి దిక్కులో చివరన ఉన్న మరాఠీ భాషాప్రాంతాలయిన సాతారా, బెల్గాం, కొల్హాపూర్ లాంటి చోట్ల కూడా దాడులు జరిగాయి. చిత్పవన్ బ్రాహ్మణుల ఆధిపత్యం బలంగా కనిపించే సాతారా జిల్లాలో ఆంటీ బ్రాహ్మిణ్ మూవ్‌మెంట్‌కి చెందిన సత్య శోధక్ సమాజ్ సభ్యులు గాడ్సే అనే ఇంటిపేరు కలవారిని ముగ్గురిని హతమార్చారు. అదీ విశేషం. ఆంటీ బ్రాహ్మిణ్ సంస్కర్త సాహూ మహరాజ్‌కి చెందిన కొల్హాపూర్ జిల్లాలో హింస చాలా ఎక్కువ.
ఇదంతా సామాజిక శాస్త్రవేత్తలు అయిన మౌరీన్ పాటర్సన్ (Maureen Patterson), కున్రాద్ ఎల్స్ట్ (Koenraad Elst) కూడా రాశారు. ఇదే విషయాన్ని సవితా అంబేద్కర్ కూడా ప్రస్తావించడం విశేషం.
అయితే ఈ చిత్పవన్ బ్రాహ్మణులు ఎవరు? మన దేశాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తున్న హిందుత్వ రాజకీయాలకి ప్రవక్తలయిన వీళ్ళ మూలాలు ఏమిటి?
బ్రాహ్మణులకి మరణశిక్ష విధించరాదు అనే బ్రాహ్మణ స్మృతిని అభాసుపాలు చేస్తూ, చట్టం కులమతాలకి అతీతం అని చాటడానికే అన్నట్లు నవ్యభారతంలో ఉరి తీయబడ్డ మొట్టమొదటి వ్యక్తి గాడ్సే. క్షమాభిక్ష కోరితే ప్రసాదిస్తామని న్యాయశాఖా మంత్రి అంబేద్కర్ పంపిన కబురుని తిరస్కరించి, నేను నాతో పాటు గాంధీ మహాత్ముని అహింసా సిద్ధాంతాన్ని ఉరికంబం ఎక్కిస్తున్నానని చెప్పినవాడు గాడ్సే. అయితే, ఈ దాడులతో కళ్ళు తెరిచి అమెరికా లాంటి అగ్రదేశాలకి తరలిపోయి వివిధ రంగాలలో ఉన్నత స్థాయిని చిత్పవన్ బ్రాహ్మణులు చేరుకున్నారని మౌరీన్ రాస్తారు.
బ్రాహ్మణులలో చిత్పవన్ బ్రాహ్మణులు కొంత వేరు, వారిది వలస సమాజం, ఒక మొబైల్ కమ్యూనిటీ. ఆచారాలతో ముడిపడని బ్రాహ్మణశాఖ. గాంధీ హత్యానంతర దాడులకి గురైన వాటిలో చిత్పవన్ బ్రాహ్మణుల అత్యాధునిక ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. చిత్పవన్ బ్రాహ్మణుల ప్రిన్స్‌లీ స్టేట్ సాంగ్లీలో ఫ్యాక్టరీలని ధ్వంసం చేశారు. ఇక్కడ జైనులు, లింగాయతులు, మరాఠాలు కలిసి దాడులు చేశారు. అంటే చిత్పవన్ బ్రాహ్మణులు పీష్వాలుగా ఆధిపత్యం చేయడమే కాదు వ్యాపార రంగంలోకి కూడా చొచ్చుకుపోయారు. వీరు జ్యోతిబాఫులే వర్ణించినట్లు ఎప్పుడో తరలి వచ్చిన ఆర్యులు కాదు.
చిత్పవన్ బ్రాహ్మణులు అమెరికాదేశం లాగే ప్రాచీనచరిత్రల మోతబరువు (baggage) లేని వారు, ఆధునికులు. ఆఫ్ఘన్ నుంచి తరలి వచ్చారని కొందరు అంటారు. పద్ధెనిమిదవ శతాబ్దం నుంచే వీరి ప్రముఖత కనపడుతుంది. మొదట వీరి వృత్తి వార్తాహరులు, గుఢచారులు. తర్వాత పీష్వాలుగా ఆధిపత్యం చెలాయించారు. గాంధీ గురువు గోఖలే, అంబేద్కర్ మెచ్చిన సంస్కర్త రనడేలు చిత్పవన్ బ్రాహ్మణులే. హిందువులని ఏకం చెయ్యడం కోసం వినాయక ఉత్సవాలని దేశవ్యాప్తంగా చేసిన తిలక్ చిత్పవన్ బ్రాహ్మణుడు. (ఆశ్చర్యంగా బాల గంగాధర్ తిలక్ కుమారుడు శ్రీధర్ బల్వంత్ తిలక్ ఆంటీ బ్రాహ్మిణ్ ఉద్యమానికి చెందినవాడు, అంబేద్కర్ అనుయాయి. ఛాందస బ్రాహ్మణుల వేధింపులకి గురై ఆత్మహత్య చేసుకొన్నాడు.)
పైన చెప్పినట్టు చిత్పవన్ బ్రాహ్మణులు సంప్రదాయ భారం లేనివారు. అంటే ప్రాచీనచరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, పరంపర లాంటివి లేనివారు. అందుకే సావర్కర్ ‘హిందూత్వ’ గ్రంధాన్ని ఆంగ్లభాషలో రాశాడు. ఆయన అన్ని రకాల బ్రాహ్మణ సంప్రదాయాలనీ తిరస్కరించాడు. స్థానికత ఆధారంగా హిందూత్వని నిర్వచించాడు. అంబేడ్కర్ నాయకత్వం వహించిన మహద్ సత్యాగ్రహాన్ని సావర్కర్ సమర్థించాడు అని ధనంజయకీర్ అంబేద్కర్ జీవిత చరిత్రలో రాశాడు.
బ్రాహ్మణులు మార్పుకి వ్యతిరేకం. మార్పులేకుండా ఒకేచోట పాతుకుపొయినవారుగా కనిపిస్తారు. అదే సమయంలో తీవ్రంగా ఇతర ప్రాంతాలు, ఇతర మతాలు, భాషాసంస్కృతుల్లోకి వలస వెళ్తారు. అదీ వైరుధ్యం. బ్రాహ్మిణ్ ఐడెంటిటీ అనేది ఆంటీ బ్రాహ్మిణ్ ఉద్యమాల గమనాన్ని శాసిస్తూ వచ్చింది. ఎవరు బ్రాహ్మణులు అనేది అనాది ప్రశ్న. బౌద్ధ జైన గ్రంథాలలో కూడా ఈ ప్రశ్న ఎదురవుతుంది. ఈనాటికీ ఆ ప్రశ్నకి సరైన సమాధానం లేదు. బ్రాహ్మణ ఐడెంటిటీని పొగడటం లేక తెగడటం చేసినా, ఆ ఐడెంటిటీని నిర్లక్ష్యం చేసినవారు మాత్రం లేరు. అదొక పద్మ వ్యూహం.
అగ్రవర్ణాలకి చెందిన బ్రాహ్మణులని అందరూ అనుసరించాలని మనుస్మృతి చెప్తోంది. ఆంటీ బ్రాహ్మిణ్ ఉద్యమ పితామహుడు, అంబేద్కర్ స్వయంగా మెచ్చుకున్న, అంబేద్కర్‌ని తమ నాయకుడిగా ప్రకటించిన కొల్హాపూర్ రాజు సాహూ మహారాజ్ తనకి వేదమంత్రాలతో పట్టాభిషేకం జరపమని బ్రాహ్మణులను కోరాడు. ఆ బ్రాహ్మణులు అందుకు తిరస్కరించారు. కేవలం పురాణ శ్లోకాలతో మాత్రమే శూద్రులకి రిచువల్స్ జరుపుతామని, వేదమంత్రాలతో జరపమనీ అన్నారు. దానికి కారణం సాహూ మహరాజ్ క్షత్రియ వంశం వాడు కాదు. దాంతో కోపోద్రిక్తుడయిన రాజర్షి ఛత్రపతి సాహూ మహరాజ్ ఆ వివక్షకి వ్యతిరేకంగా స్వయంగా వేద పాఠశాలలు 1920లో స్థాపించాడు (ఆర్య సమాజ్ కూడా ఇలాగే చేసింది). అన్ని కులాలకి అవకాశం కల్పించాడు.
అయితే ఇప్పుడు ఆ విద్యాసంస్థలో విద్యార్థులు సంఖ్య తగ్గిపోతుందని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇది కొత్త కాదు. ఆ రోజులలోనే కొందరు బ్రాహ్మణులు వేదవిద్యకి దూరమై ఆంగ్ల విద్యవైపు ప్రయాణం మొదలుపెట్టారు. వేదవిద్య అనేది పేద బ్రాహ్మల చదువుగా మిగిలిపోయింది. ఈ పరిణామం గురజాడ కన్యాశుల్కంలో కనబడుతుంది. ఇప్పుడు ఒక వైపు దళితులకి పూజారులుగా అవకాశం కల్పించాలని డిమాండు చేస్తున్నారు. తమిళనాడు కేరళలలో పూజారులుగా దళితులను నియమించాలని ప్రభుత్వాలు నిర్ణయాలు కూడా చేశాయి. కానీ మరోవైపు సంస్కృతము, వేదం, పురాణాలు మొత్తంగా దళిత బహుజనులని అణిచివేసినవి అని ప్రచారం చేస్తున్నారు. ఇదొక వైరుధ్యం. ఒక వైపు బ్రాహ్మిణిజం పట్ల వ్యతిరేకతా మరొకవైపు బ్రాహ్మిణిజాన్ని సాధించాలనే కోరిక ఐడెంటిటీ ఉద్యమాలని శాసించాయి.
అయితే ఐడెంటిటీ ఉద్యమాలకి బ్రాహ్మణ ఐడెంటిటీయే లక్ష్యం కావడం చారిత్రక విచిత్రం. నిజానికి స్థిరమయిన బ్రాహ్మణ ఐడెంటిటీ అనేది ఉందా? దళిత ఐడెంటిటీ ఉందా? వాటిలోనూ మార్పు సహజం. కానీ లేఖనం, ప్రింటు అనేవి అలాంటి స్థిరమయిన ఘనీభవించిన ఐడెంటిటీలు ఉన్నట్లు ప్రదర్శిస్తాయి. కానీ ఐడెంటిటీలు ఎప్పటికప్పుడు చెదిరిపోతునే ఉన్నాయి.
నిజానికి బ్రాహ్మణేతర సంస్కృతులని ఐడెంటిటీ ఉద్యమాలు నిర్లక్ష్యం చేశాయి. ఆ సంస్కృతులను కూడా బ్రాహ్మణ సంస్కృతి యొక్క అనుకరణగా, బ్రాహ్మణ అణచివేతలో భాగంగా భావించారు ఐడెంటిటీ ఉద్యమకారులు. అందుకే బ్రాహ్మణులు అధ్యయనం చేసే వేదమంత్రాలకి సంస్కృత భాషలోని గ్రంథానికి ప్రాధాన్యం ఇచ్చారు. బ్రాహ్మణ పురోహితులు పూజారులు వంటి వారిని ఇతర కులాలలో కూడా తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ ఎప్పటినుంచో వస్తున్న శూద్ర సంస్కృతిని నిర్లక్ష్యం చేశారు.
మాలదాసరి కుటుంబంలో పుట్టి ఆధునిక విద్య నేర్చిన ఉద్యమకారిణి, రచయిత నంబూరి పరిపూర్ణ మాలదాసరుల సంస్కృతి గురించి ఇలా చెప్పారు: “ఆనాటి అస్పృశ్యులు కొందరు వైష్ణవ దాసులుగా మారడం ఓ గొప్ప సాంఘిక చారిత్రక సంఘటనగా పరిగణించాలి. ఎందుకంటే ఈ మతశాఖ వీరికి ఇచ్చింది మతమౌఢ్యం కాదు, సదాచారాలు సద్భావన. ఈ దాసరులు అక్షరాస్యులు అవడమే కాదు, పురాణ గ్రంథ అధ్యయనశీలులు కూడా అయ్యారు. ఫలితంగా వారికి మంచి వాక్శుద్ధి పౌరాణిక జ్ఞానం అలవడ్డాయి. అంతేకాదు మత కర్మలకు చెందిన పురోహిత వృత్తి వీరిదయింది. దళిత కులాలకు చాకలి, మంగలి, కుమ్మరి, మొదలైన శూద్ర కులాలకు శుభ అశుభకార్యాలన్నిటా కర్మకాండలు జరిపిస్తుండేది ఈ దాసులే. వీరు నిరుపేద కులాల పురోహితులు.”
ఇప్పుడు ఇటువంటి సంప్రదాయాలకి ఏమాత్రం కొనసాగింపు లేదు. పునరుద్ధరించాలనే వాళ్ళు లేరు. ఎందుకంటే ఇటువంటి బ్రాహ్మణేతర సంస్కృతులు కులతత్వంగా ఈసడించుకోబడతాయి. కానీ బ్రాహ్మణ సంస్కృతి అయిన వేదాలు, పౌరోహిత్యం, పూజారిత్వం బ్రాహ్మలకే కాదు, ఐడెంటిటీ ఉద్యమకారులకి కూడా అధిరోహించదగిన శిఖరంగా కనపడుతుంది. అంటే, కుల నిర్మూలన అంటే బ్రాహ్మణిజం.
ఈ బ్రాహ్మణిజం ప్రభావం ఆధునిక కాలంలో ఎంత ఎక్కువగా ఉందంటే హిందూ కోడ్ బిల్లుని రూపొందించడం కోసం, మనుస్మృతిని స్వయంగా తగలబెట్టిన అంబేద్కర్ బ్రాహ్మణ పండితుల సహకారంతో సంస్కృతం లోని బ్రాహ్మణ స్మృతి గ్రంథాలని అధ్యయనం చేశారు. పార్లమెంట్‌లో మనుస్మృతిని ఉదహరించారు. యాజ్ఞవల్క్య స్మృతిలో విడాకులకు అవకాశం కల్పించారు అని వాదించారు. అగ్రవర్ణేతరులలో విడాకులు అప్పటికే ఉన్నాయి. ఇది హిందూ కోడ్ బిల్లు అనాలా, బ్రాహ్మణ కోడ్ బిల్లు అనాలా? హిందువులు అంటే బ్రాహ్మణులు వారి గ్రంథాలేనా?
అయితే బ్రాహ్మణ ఐడెంటిటీ సవితా అంబేద్కర్ ప్రతిష్ఠకి భంగంగా మారిందా? ఆమె ప్రతీ నిమిషం అగ్రవర్ణ అహంకారం తనకు లేదు అని నిరూపించుకోవలసి వచ్చిందా? చివరికి తాను బ్రాహ్మణ జన్మ ఎత్తినప్పటికీ భర్తను చంపుకునే దుర్మార్గురాలిని కాదు అని చెప్పుకోవడానికే ఈ పుస్తకం రాయవలసి వచ్చింది.
1984లో నవకాల్ పత్రిక కోసం మధూకర్ బాలే ధనంజయ్ కీర్‌ని ఇంటర్‍వ్యూ చేశాడు. ‘గ్రామాలలో దళితులు సవితా అంబేద్కర్, అంబేద్కర్‍గారికి విషం పెట్టి చంపిందని అనుకుంటున్నారు’ అని ప్రస్తావించాడు. అప్పుడు ధనంజయ్ కీర్ కోపంగా, ‘కులం మన రక్తంలో ప్రవహిస్తుంది. పద్ధెనిమిదేళ్ళనుంచి అనామకంగా జీవిస్తున్న సవితా అంబేద్కర్‌ని, ఈ వృద్ధాప్యంలో కూడా దళిత నాయకులు తమ స్వార్థ రాజకియాల కోసం ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు’ అని సమాధానమిచ్చాడు.
వయసు, అనారోగ్యాల కారణంగా అంబేద్కర్ తన భార్యకి మూడు లక్షణాలు ఉండాలి అనుకున్నాడు. తనకు కాబోయే భార్య విద్యావంతురాలు, వైద్యురాలు, వంటనేర్చిన వ్యక్తి కావాలని ఆయన కోరుకున్నాడు. సవితా అంబేద్కర్ ఆ పాత్రలు అన్నీ చివరివరకూ పోషించింది. ఆ విధంగా ఒక ఆధునిక ఆదర్శ గృహిణి పాత్రని పోషించినట్లుగా ఆమె కథనం ఉంది. నిజానికి మొదట్లో స్త్రీ సంస్కర్తలు భర్తని, ఇంటిని చక్కబెట్టుకోవడమే ఆదర్శంగా భావించారు.
ఈ సందర్భంలో ఈ స్టీరియోటైప్‌ని బద్దలు చేసిన కొండపల్లి కోటేశ్వరమ్మ గుర్తుకు వస్తారు. ఆవిడ ప్రముఖ నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య భార్య, స్వయంగా ఉద్యమశీలి. కారణం చెప్పకుండా వెళ్ళిపోయిన భర్త, విప్లవ నాయకుడిగా అంతర్జాతీయఖ్యాతి ఆర్జించిన భర్త, విడిపోయిన 36 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యంలో నిస్సహాయంగా తిరిగి తన దగ్గరికి వస్తే ఆమె ఏం చేయాలి? ‘ఆయనకు నిన్ను చూడాలని ఉంది’ అని బంధువు అంటే నాకు చూడాలని ఉండవద్దా? అని ఎదురు ప్రశ్నిస్తుంది. ‘మనుధర్మం హిందూ మనస్తత్వం నాలో జీర్ణం అయిపోయి ఎన్ని బాధలు పడినా కూడా పతివ్రతలా భర్తను చూస్తానని నేను ఒకవేళ అన్నా కూడా వద్దు అని కమ్యూనిస్టులుగా వారించాల్సిన మీరు, అణచబడ్డ స్త్రీకి అన్యాయం చేస్తావా అంటూ చివాట్లు పెట్టాల్సిన మీరు, ఆయనను చూడమని చెప్పడం నాకు వింతగా ఉంది’ అని నిలదీస్తారు కోటేశ్వరమ్మ.
సవిత పరిస్థితి వింత పరిస్థితి. తన కొడుకు యశ్వంత్‍కి పెళ్ళి సంబంధాలు చూసే పనిని కూడా సవితకి అప్పచెప్పుతాడు అంబేద్కర్. తన బంధువులలోని బ్రాహ్మణ పిల్లను చూసి పెళ్ళి చేయాలని అనుకుంటుంది కానీ అది కుదరదు. కుదరకపోవడమే మంచిదైంది అంటుంది సవితా అంబేద్కర్. తనపై ఎన్నో నిందలు మోపి చివరికి హత్యానేరం కూడా ఆపాదించిన దళిత నాయకులు ఇంకా ఎన్ని నిందలు మోపేవారో అని భయసందేహాలు వ్యక్తం చేస్తుంది. వయస్సు తేడా, కులం, అస్పృశ్యత… ఇలాంటి సామాజిక విలువలు వేటిని పట్టించుకోకుండా వివాహం చేసుకున్న సవితా అంబేద్కర్ ఎందువల్ల భయంకరమైన నిందని మోయవలసి వచ్చింది?
ఆమె అంబేద్కర్‌ను హత్య చేశారన్న దళిత నాయకుల ఆరోపణలను పోలీసులు, పార్లమెంటు, డాక్టర్లు, ప్రభుత్వం పూర్తిగా తప్పు అని తిరస్కరించారు. అయినా ఆ అపకీర్తి, ప్రచారం కొనసాగుతూనే వచ్చాయి, ఎందువల్ల?
నిజంగా సవితా అంబేద్కర్ నేరానికి పాల్పడిందా, లేదా అనేది అప్రస్తుతం. ఆమె హత్య చేసింది అనే ప్రచారం వెనుక ఒక బలమైన రాజకీయ కారణం ఉంది. ఐడెంటిటీ ఉద్యమం ఉంది. పవర్ పాలిటిక్స్ ఉన్నాయి.
అంబేద్కర్ మరణించిన తర్వాత సవితా అంబేద్కర్ తమ నాయకురాలు కావాలని కొందరు అంబేద్కర్ అనుయాయులు ముందుకు వచ్చారు. అంబేద్కర్ స్థానంలో రాజ్యసభ సభ్యురాలు కావాలని కూడా అన్నారు. అసలు దళిత ఐడెంటిటీ ఉద్యమానికి బ్రాహ్మణురాలు నాయకత్వం వహించటం కుదురుతుందా? యుగాలుగా దళితులు జెండాలు మోసేవాళ్ళుగానే మిగిలిపోయారని, వారు నాయకత్వాన్ని చేతుల్లోకి తీసుకోవాలని దళితవాదుల వాదన. కమ్యూనిస్టులకి రాజ్య నిర్మూలన వర్గ నిర్మూలనలు లక్ష్యాలు అంతేకానీ వారి మార్గం మాత్రం శ్రామిక వర్గ నియంతృత్వం, కమ్యూనిస్ట్ రాజ్యం. అలాగే కుల నిర్మూలన దళితవాదుల లక్ష్యం మాత్రమే, గమ్యం మాత్రమే. అందుకోసం వారు తమ కుల అస్తిత్వాన్ని బలపరుచుకోవడమే మార్గం. అయితే కులాంతర వివాహాలు కొత్త సమస్యను తీసుకువస్తాయి. నాయకత్వం అగ్రకులాల వారి చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది సమాధానం దొరకని ప్రశ్న. డీమనైజేషన్, వ్యక్తిత్వహననం అనేవి తక్షణం కనిపించే మార్గాలు. సవితా అంబేద్కర్ అనే బ్రాహ్మణ స్త్రీ గొప్ప దళితవాది అనేది ఆధునిక వ్యాకరణ విరుద్ధం. ఈ తప్పును సవరించడానికి హత్య అనే కారణం పనికి వచ్చింది.
కనుక సవితా అంబేద్కర్ లోని మంచి చెడుల చర్చ అనవసరం. ఏం జరిగింది అనేది కాదు, ఎటువంటి వ్యాఖ్యానాలు ఎలాంటి రాజకీయ సామాజిక పర్యవసానానికి దారితీశాయి అనేది ముఖ్యం. చరిత్ర అంటే వ్యాఖ్యానం మాత్రమే కానీ వాస్తవం కాదు. పురాణాల్లో వాస్తవం ఉండొచ్చు. చరిత్ర అనేది వాస్తవాన్ని భ్రమింపజేయాలే కానీ వాస్తవాన్ని చెప్పకూడదు, చెప్పలేదు. చరిత్ర అంటే మిస్టిఫికేషన్. అసలైన వాస్తవాలపై కప్పే ముసుగు.
గోపాలపూర్లో సముద్రపు అలలకేసి చూస్తూ మిత్రుడు యువ జడ్జి త్రిజీబ్ నందా నాతో అన్నాడు. “ఆధునికత అంతా రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యాలు పై ఆధారపడి ఉంది. కుల ప్రాతినిధ్యాలు, మత ప్రాతినిధ్యాలు, వర్గ ప్రాతినిధ్యాలు. వీటి మధ్య ఎడతెగని పరిష్కారంలేని ఘర్షణ ఆధునిక చరిత్ర. సమస్యల పరిష్కారం కాదు, ఎవరు ప్రాతినిధ్యం వహించాలనేదే ముఖ్యం.”
భయంకరమైన ఆరోపణల మధ్య సవితా అంబేద్కర్ తన ఆత్మకథ రాశారు. అంబేద్కర్‌తో తనకి ఉన్న సాన్నిహిత్యాన్ని బలంగా వ్యక్తం చేశారు. పెళ్ళి తర్వాత సంతానాన్ని కోరుకుంటారు అంబేద్కర్. పెంచుకుందామంటే వద్దంటాడు. చివరికి గర్భస్రావం కావడంతో కుటుంబ జీవనం పట్ల అంబేద్కర్‌కి ఆసక్తి పోయిందని రాస్తారు సవిత. అయినా తాను మంచి గృహిణిగా నిరూపించుకుంటుంది అన్ని విధాలా.
నిజానికి గృహిణి అనే ఐడెంటిటీకి కొత్త రూపాన్ని ఇచ్చింది ఆధునికత. అది బలమైన ఐడెంటిటీ. స్త్రీల ఆధునిక విద్య ఆధునిక వృత్తులు బలాన్ని చేకూర్చాయి. ఇలాంటి నిలకడ అయిన ఐడెంటిటీలతో దేవదాసీ లాంటి చెదిరిపోతున్న పాత ఐడెంటిటీలు తలపడ్డాయి. చివరికి అంతరించాయి. ఆధునికత తీసుకువచ్చిన ఈ కుంగతీసే ఐడెంటిటీ సమస్య సవితా అంబేద్కర్‌ను కూడా వెంటాడింది. అందుకే తాను అన్ని విధాలా అంబేద్కర్‌కి సరైన గృహిణిగా వ్యవహరించాలని చాటుకోవలసి వచ్చింది. మరోవైపు అంబేద్కర్ వయసు, కులము పట్ల తాను వివక్షతో వ్యవహరించలేదని చాటుకోవలసి వచ్చింది. అంతేకాదు తాను బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన భర్తని చంపుకునేంత నీచురాలని కాదని నిరూపించుకోవలసి వచ్చింది. పాత మనుస్మృతి పద్ధతిలో కాకపోయినా ఆధునిక రీతిలో తాను ఒక ఆదర్శ గృహిణి అని చాటుకోవలసి వచ్చింది.
ఆధునిక కాలంలో ఆదర్శ గృహిణి అనే భావన ఎంతగా వెంటాడిందంటే ప్రాచీన పౌరాణిక కథనాలను కూడా ఈ ఆదర్శ గృహిణి అనే ఆలోచనకి అనుగుణంగా పునర్‌వ్యాఖ్యానించారు రచయితలు. రవీంద్రనాథ్ ఠాగూర్ అభిజ్ఞానశాకుంతలం నాటకం లోని శకుంతల పాత్రని నేటికీ ఆదర్శంగా నిలబడగల ఆదర్శ గృహిణిగా చూపాలని ప్రయత్నించాడు. మొదట తన శృంగార వాంఛలను కూడా స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవడానికి ప్రయత్నించిన శకుంతల చివరికి వచ్చేటప్పటికి నైతికంగా ఆదర్శ గృహిణిగా ఎదిగిందని రవీంద్రనాథ్ ఠాగూర్ భావించాడు. దీనికి ఠాగూర్ పై యూరోపియన్ క్రైస్తవ ప్యూరిటన్ దృక్పథమే కారణం అని విమర్శిస్తారు చరిత్ర కారిణి రోమిలా థాపర్.
ఆధునిక మధ్యతరగతి ఆవిర్భావంతో ఆధునిక ఆదర్శ మహిళ అనే స్టీరియో టైప్ కూడా ఆవిర్భవించింది. మోనోగమి విడాకుల హక్కు, విద్య, ఆస్తి హక్కు లాంటి ఆధునిక చట్టాల ఆవిర్భావంతో స్థిరమైన ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థ అనే ఆదర్శం మొదలైంది. ఇది ప్రేమ అనే అమూర్త ఆలోచనలు బలపరిచింది. టాల్‌స్టాయ్ గురించి మాట్లాడే సందర్భంలో అనంతం అనే భావనని తిరస్కరించిన అంబేద్కర్ సవితా అంబేద్కర్‌కి పెళ్ళికి ముందు రాసిన ఉత్తరాలలో మాత్రం ప్రేమ అనంతం, హద్దులు లేనిది అని వర్ణిస్తాడు. మన శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే అంటాడు.
హిందూ కోడ్ లాంటివి కూడా అగ్రవర్ణ స్త్రీలు ఈ ఆధునిక కుటుంబ వ్యవస్థలో భాగం కావడానికే పనికి వచ్చాయి. ఈ ఆధునిక కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబాలని ధ్వంసం చేసింది, చిన్న కుటుంబాలని తెచ్చింది. తద్వారా పరస్పర అంగీకారం ప్రేమ లాంటి కొత్త విలువలను తెచ్చింది. అయితే ఇది పూర్తిగా ఆధునిక వ్యక్తి వాదంపై ఆధారపడింది.
అంబేద్కర్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లు గురించి సోషలిస్ట్ రామ్ మనోహర్ లోహియా విమర్శలో దీని డొల్లతనం బయటపడింది. హిందూ కోడ్ బిల్ అగ్రవర్ణ బిల్లు అని లోహియా విమర్శ. ఈ బిల్లు అతి తక్కువ మంది స్థిరజీవితం గల అగ్రవర్ణ స్త్రీల సమస్యలను మాత్రమే పట్టించుకొంది, బహుజన స్త్రీలను పట్టించుకోలేదు. అది దీని పరిమితి అన్నారు లోహియా. ఇది అంబేద్కర్‌కి కూడా తెలుసు. విడాకులు అగ్రవర్ణ ఇతరులలో ఉన్నాయి. కేవలం ఇది జనాభాలో 10శాతం మంది సమస్య అంటారు అంబేద్కర్. ఈ బిల్లుని మొదట నీరుగార్చి అంబేద్కర్ మంత్రి పదవికి రాజీనామా చేశాక రాజేంద్రప్రసాద్ అనే బ్రాహ్మణుడి చేతుల మీదుగా అంగీకారం తెలిపారు అంటారు సవితా అంబేద్కర్. ఇది సరికొత్త అస్పృశ్యత అంటారు. యాజ్ఞవల్క్య స్మృతి లాంటి బ్రాహ్మణ గ్రంథాలను బ్రాహ్మణ పండితుల సాన్నిహిత్యం ద్వారా అధ్యయనం చేసి ఎంతో కృషిచేసి అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు రూపొందించారు. కానీ అది చివరికి కాంగ్రెస్ తన క్రెడిట్‌గా చాటుకుంది అంటారు సవితా అంబేద్కర్.
అంబేద్కర్ ఎంతగానో మెచ్చుకున్న స్వామి ధర్మతీర్థ చెప్పిన మాటల్లో ఈ మితిమీరిన బ్రాహ్మణ అనుకరణకి మూలాలు ఉన్నాయి. ‘1784లో సెయింట్ విలియమ్ కోట సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సర్ విలిమ్ జోన్స్ నియమితుడయ్యాడు. ఆయనే ఆసియాటిక్ సొసైటీని స్థాపించాడు. ఆయన ప్రతిరోజు పాత సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేసి సంస్కృత పండితులతో చర్చలు కొనసాగించేవాడు. ఆయనకు బ్రాహ్మణ చట్టాలు ఎంతగానో నచ్చాయి. ఆయనే మనుస్మృతిని స్వయంగా ఇంగ్లీషులోకి అనువాదం చేశాడు. విలియమ్ జోన్స్ వంటి వారు అన్యాయమైన శాస్త్రాలకు సాధికారత కల్పించారు. కోర్టులో న్యాయమూర్తులకు న్యాయవాదులకు బ్రాహ్మణస్మృతులు అందుబాటులో ఉండడానికి వారెన్ హేస్టింగ్స్ ఇంగ్లీషులోకి అనువాదం చేయించారు’ అంటారు ధర్మతీర్థ.
నిజానికి ఈ స్మృతులతో సంబంధం లేకుండా గ్రామీణ పంచాయతీలు ట్రైబల్ పంచాయితీలపై అధ్యయనం జరిగిందా? లేదు. దేవాలయాలలో కూడా దక్షిణాదిన బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉండేవారు అని సోదాహరణంగా రాశారు ధర్మతీర్థ, అంబేద్కర్ మెచ్చిన మేధావి. కానీ హిందూ సంస్కృతి హిందూ చట్టం పేరుతో బ్రాహ్మణ స్మృతి గ్రంథాలపైనే ఎందుకు ఆధారపడ్డారు? కుల నిర్మూలన, సమానత్వం అంటే ఆంగ్లీకరణ, బ్రాహ్మణీకరణలు మాత్రమేనా? అందుకే సోషలిస్ట్ రామ్ మనోహర్ లోహియా అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్‌బిల్‌ని అగ్రవర్ణ చట్టం అన్నాడు. మారుమనువు ధర్మమే చాలామందికి. సొంత ఆస్తి ఎలాగూ లేదు కనుక ఆస్తి హక్కు సమస్య వారికి లేదు. అందుకే అంబేద్కర్ సభాముఖంగా హిందూ కోడ్‌బిల్ 10శాతం మందికి మాత్రమే చెందినది అని ఒప్పుకొన్నారు. ఇంత తక్కువ ప్రభావం గల చట్టం తీసుకురావడానికి కూడా వెనకాడుతున్నారు అని విమర్శించారు.
ఇలా ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకువచ్చిన మార్పులు కొద్దిమంది అగ్రవర్ణాల స్త్రీలని అగ్రవర్ణ విలువలని ఆధారం చేసుకుని కుటుంబాన్ని కులాన్ని ఆదర్శ మహిళ అనే భావనని నిర్వచిస్తూ వచ్చాయి. అయితే ఈ విలువలకి యూరోపియన్ క్రైస్తవ ప్యూరిటీ దృక్పథం బలం చేకూర్చింది. దీని వెనుక సుదీర్ఘమైన బ్రిటిష్ వలస చరిత్ర దాగి ఉంది.
అగ్రవర్ణ స్త్రీలకి ఆస్తి హక్కు ఏమాత్రం ఉండేది కాదు. కానీ ఆస్తి హక్కు ఉన్న స్త్రీలు ఉండేవారు. వారు దేవదాసీలు. ఈ వర్గంలో హైరార్కీ ఉన్న మాట నిజమే కావచ్చు. దేవదాసీలలో ఎక్కువ మంది విద్యావంతులే. కొందరు ఉన్నత విద్యావంతులు కూడా ఉండేవారు. వీరి సేవలకి ప్రతిఫలంగా దేవాలయ ఆస్తుల్లో భాగం ఉండేది. వీరి పనికి పాతివ్రత్యం కొలబద్ద కాదు. పోషకుల్ని ఆశ్రయించవచ్చు కూడా. అయితే వీరిని ఎన్నడు సమాజం వేశ్యలుగా పరిగణించలేదు. వీరికి ఆస్తుల్లో భాగముండేది. వీరి ఆస్తి ఆడపిల్లలకి చెందుతుంది. వీరు ఆడసంతానాన్నే కోరుకునేవారు. విద్య, కళలు కూడా హక్కుగా ఉండేవి. పురుషాధిపత్య సమాజంలో ఈ మాతృస్వామికలక్షణం ఉండడం అపూర్వం.
ఆధునిక ఆదర్శ గృహిణి అనే భావన దేవదాసీ లాంటి అస్తిత్వాలకి పోటీగానూ ముప్పుగాను పరిణమించింది. దేవదాసీల జీవిత విధానం మొత్తంగా నీతి బాహ్యమైనదిగా, అనాగరికమైనదిగా, ప్రీ మోడర్న్‌గా తిరస్కరించబడింది, నిషేధించబడింది. దానితో దేవదాసీలు కూడా ఈ ఆధునిక ఆదర్శ గృహిణి ఫోల్డ్ లోకి రావాల్సి వచ్చింది. కొందరు ఆధునిక విద్య వల్ల ఐచ్ఛికంగానే సంస్కృతీకరించబడ్డారు. అలాంటి వ్యక్తి ముత్తు లక్ష్మీరెడ్డి. దేవదాసి కుటుంబంలో జన్మించిన ముత్తు లక్ష్మి సుదర్శన రెడ్డిని వివాహం చేసుకొని రెడ్డి అనే పేరును కూడా స్వీకరించింది. బ్రిటిష్ హయాంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి దేవదాసి వ్యవస్థ రద్దు కోసం బిల్లు ప్రవేశపెట్టి నిషేధింపచేసింది. విద్యలో రాజకీయాలలో సంఘసంస్కరణలో ముందున్న ముత్తు లక్ష్మీరెడ్డి దేవదాసి వ్యవస్థని సమర్థించే వాళ్ళని తీవ్రంగా విమర్శించారు.
ఈ సంస్కరణ భావాలకి పూర్తిగా ఎదురీది తాను దేవదాసిని అని సగర్వంగా చాటుకున్న వ్యక్తి బెంగళూరు నాగరత్నమ్మ. దేవదాసి ఆస్తి హక్కు సాంస్కృతిక హక్కులు దేవదాసి వ్యవస్థ కొనసాగాలని ఆవిడ వాదించారు. నాటి ఫెమినిస్టులతో కూడా వ్యతిరేకంగా వాదానికి దిగారు. ప్రాచీన కుటుంబ వ్యవస్థని దేవదాసి వ్యవస్థని సమర్థించారు. ముత్తు లక్ష్మీరెడ్డి లాంటి ఆధునిక ఆదర్శ మహిళను అర్థం చేసుకోవడం పైకి ఎత్తడం సులభమే కానీ, నాగరత్నమ్మ లాంటి వారి పాత్రని అర్థం చేసుకోవడం కష్టం.
ప్రముఖ దేవదాసి ముద్దు పళని రాసిన రాధికాసాంత్వనం తీవ్ర వివాదాస్పదమైంది. సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు మొదలుకొని విరసం సభ్యుడు కెవిఆర్ వరకు ప్రగతిశీలులు అనుకున్న వాళ్ళు చాలామంది ఈ గ్రంథాన్ని అసభ్యమైనదిగా భావించారు. ఇటువంటి అభిప్రాయాలని ఎదురిస్తూ దేవదాసి బెంగుళూరు నాగరత్నమ్మ ఆ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకురావడానికి గొప్ప పోరాటమే చేయవలసి వచ్చింది. సంఘసంస్కరణ ఉద్యమానికి పితామహుడు ప్రముఖ రచయిత కందుకూరి వీరేశలింగం తన తెలుగు కవుల చరిత్రలో సంగీత సాహిత్యాలలో నృత్యకళలో మేటి అని తన గురించి తనే గొప్పగా చెప్పుకున్న కవయిత్రి ముద్దు పళనిని ఈసడింపుగా తీసి పారేశాడు. ఈ ముద్దు పళని వ్యభిచారి అని రాశాడు. ఒక స్త్రీ నోటి వెంట రాకూడని, వచ్చినా ఇతర స్త్రీలు వినకూడని భాగాలు ఇందులో ఉన్నాయి. శృంగారరసాన్ని సాకుగా చేసుకొని ఆమె తన కవిత్వం అంతా పచ్చి బూతు కింద దిగజార్చింది అన్నారు. వ్యభిచారకులంలో పుట్టి స్త్రీ సహజమైన లజ్జను గాలికి వదిలేసిన స్త్రీ ముద్దు పళని అని ఆయన అభిప్రాయం.
బెంగుళూరు నాగరత్నమ్మ తిరుగు జవాబు కూడా అంతే వాడిగా ఇచ్చింది. ‘బహుశా లజ్జ స్త్రీలు ఒక్కరికే అవసరం అని వీరేశలింగం అభిప్రాయం కాబోలు’ అని వెటకారంగా రాసింది. కానీ ఆవేశపూరితమైన వ్యాఖ్యలకు ఫలితం కనిపించలేదు. చివరికి బ్రిటీష్ ప్రభుత్వం ఆ గ్రంథాన్ని నిషేధించింది. నిజానికి వీరేశలింగం లాంటి వారి గ్రంథాలలో కూడా శ్రుతి మించి ఎక్కువ శృంగారమే ఉండేది కానీ స్త్రీ శృంగార కావ్యం రచించడం అభ్యంతరకరంగా నిలిచింది.
ఈస్ట్ ఇండియా పరిపాలన సమయంలో ఇక్కడి బ్రిటిష్ అధికారులు ఉద్యోగులు హిందూ పండగలలో, ఆలయ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. దేవదాసీ నృత్యాలను వీక్షించేవారు. తమిళనాడు లోని ఒక దేవాలయానికి చెందిన దేవదాసీ చనిపోయినపుడు, ఆమె కూతురును తహశీల్దారు దేవదాసీగా నియమించాడు. ఆయన ఈ విషయం కోయంబత్తూరు కలెక్టర్‌కు రాశాడు. అయితే ఇలా స్థానిక సంస్కృతిలో ఉత్సవాలలో భాగం కావడంపై క్రైస్తవ మతపెద్దలు నిరసన తెలిపారు. దాంతో భారతీయ మూఢవిశ్వాసాలకు దూరంగా ఉండమని ఈస్టిండియా కంపెనీ పెద్దలు హెచ్చరికలు జారీ చేశారు అని, రిపబ్లిక్ ఆఫ్ రెలిజియన్ అనే పుస్తకంలో అభినవ్ చంద్రచూడ్ రాశారు.
ఆరోజులలో వివేకవతి వంటి క్రైస్తవ స్త్రీ సంస్కరణ పత్రికలు కూడా ముద్దు పళని రాధికా సాంత్వనం వంటి గ్రంథాలు చదవరాదని రాశాయి. దేవదాసీ వ్యవస్థని వ్యభిచారంగా నిందిస్తూ నిషేధించాలి అన్నాయి. కానీ రాజుల కాలంలో కన్నా బ్రిటిష్ పరిపాలనా కాలంలో స్త్రీ విలువ తగ్గిపోయినట్టు కనపడుతుంది. క్రైస్తవ ప్యూరిటన్ దృక్పథం దీనికి కారణమైంది. నిజానికి జీవించి ఉన్న కాలంలో ముద్దు పళని చాలా గౌరవం పొందింది. ఆమెకి కొందరు పురుష కవులు అంకితాలు కూడా ఇచ్చారు. తంజావూరు ఆస్థానంలో ఎందరో స్త్రీకవులు ఇలాగే గౌరవం పొందారు. వారిలో రామభద్రాంబ, మధురవాణి మొదలైన వారు ఉన్నారు. ఆధునిక కాలం వచ్చేప్పటికి ఈ స్త్రీ కవులని వేశ్యలుగా అశ్లీల రచనలు చేసేవారుగా ముద్రవేశారు. వలస ఆధునికత కనబడని ఆంక్షలు విధించింది.
‘దాదాపు క్రీస్తుశకం 50 ప్రాంతంలో దేవదాసి వ్యవస్థను నిషేధిస్తూ చట్టం వచ్చింది. మేళాలను నిషేధించారు. మాన్యాలను లాక్కున్నారు. ఈ క్రమంలో పస్తులతో మాడిన కళామూర్తులను నేనెరుగుదును. కళ్ళు చెమర్చే కథలెన్నో. ఈ విధంగా సంస్కరణ ప్రభావం వలన కళకు హాని జరిగింది. శతాబ్దాల ఆంధ్ర నాట్యం అశోకవనంలో సీతలా శల్యావశిష్టమైనది. (తూర్పు గోదావరి జిల్లాలో నృత్య కళ – విశ్వనాథం సత్యనారాయణ మూర్తి.)
దేవదాసీలకు గల సామాజిక ప్రతిష్ఠ నశించడం, 1907లో ఆనంద రచించిన ‘నేను చంపిన యువతి’ అనే కన్నడ కథలో కనిపిస్తుంది. ఆధునికుడైన ఒక పెద్ద మనిషి దగ్గరికి చెన్నమ్మ అనే దేవదాసి కోరికతో వెళ్ళినప్పుడు ఆ పెద్దమనిషి ఆమెకి ఇలా బోధిస్తాడు: ‘చూడు దీనికి ముందే గతంలో నువ్వు ఎవరెవరికో సేవలు చేశావో కదా! ఒక్కడు తిన్న ఎంగిలిని ఇంకొకరికి పెట్టొచ్చా? దేవుడికి ఈ ఉచ్ఛిష్టం నైవేద్యం కాగలదా? నీకు తెలవదు. పసితనం పోలేదు నీలో. ఇది ఎంతో పాపకరమైనది. తెలిసి ఉంటే ఎప్పటికీ నీవు ఈ పాపకార్యం చేసే దానివి కాదు. నీకూ వేశ్యకూ తేడా ఏమిటి? ఆమెకు అది జీవనం. నీకు బతుకు తెరువు లోటులేదు. అయినా మీ రెండు వర్గాలు ఒకలాంటివే. భగవంతుడు ఈ పాపాన్ని ఎప్పటికీ క్షమించడు.’ మందలింపులా కనబడే ఈ తీవ్రమైన నైతిక బోధకు గాయపడి ఆ స్త్రీ ఆత్మహత్య చేసుకుంటుంది. దీనిలో దేవదాసీల పట్ల గౌరవం క్షీణించడం, చులకన భావం కనపడుతుంది.
‘ఒక నృత్యకారుని కూతురు ముత్తు లక్ష్మీరెడ్డి దేవాలయాలలో స్త్రీలని అర్పించే పద్ధతిని నిషేధించాలని బిల్లు 1930లో ప్రవేశపెట్టడం అది 1947లో చట్టంగా రూపొందడం జరిగింది. దీనితో పోలిస్తే అగ్రకులాలకి సంబంధించిన బాల్యవివాహాలు వితంతు వివాహాలు వరకట్నాలకు సంబంధించిన సంస్కరణలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నెముక అయిన ధనిక వర్గాల నుంచి చాలా అయిష్టమైన మందకొడి మద్దతును మాత్రం సాధించాయి. ఏదైనా ఆత్మగౌరవ ఉద్యమాలకు కూడా పవిత్ర గృహిణి ఆదర్శమైంది’ (‘దారులేసిన అక్షరాలు’కు ముందుమాట). పాత దేవదాసి విలాసినీ నృత్యం క్రైస్తవ ప్యూరిటన్ విలువలతో తన ఎరోటిక్ నేచర్ ని వడగట్టుకొని భరతనాట్యంగా మారి అగ్రవర్ణాల హిందూ సంస్కృతిగా మారినట్లే, పాత పతివ్రత స్థానంలో ఆదర్శ ఆధునిక మహిళ అనే స్టీరియో టైపు మొదలైంది. ఈ ఆదర్శ మహిళ అనే భావన అంతకు ముందటి అస్తిత్వాలను అనాగరికమైనవి అని నిర్ధారించి నిషేధించింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ స్థానంలో ఏకకణ కుటుంబం ఆవిర్భవించింది. స్వేచ్ఛ అనే భ్రమతో జీవించే వ్యక్తి ఆవిర్భవించాడు.
నిజానికి పెట్టుబడి దారీ వ్యవస్థ వ్యక్తిని గుర్తించదు. ఉత్పత్తిని, కొనుగోలుదారులని మాత్రమే గుర్తిస్తుంది. ఈ శూన్యాన్ని మతం కులం లాంటి ఐడెంటిటీలతో పూరించాలని అనుకుంటున్నారు, కానీ సాధ్యం కాదు ఎందుకంటే వస్తువులే కాదు ఐడెంటిటీలు కూడా మార్కెట్ సరుకులు. రాజకీయాలు పెట్టుబడి సమ్మేళనం వల్ల ఇవి చలనంలో ఉంటాయి.
బహుజన కులమైన దేవదాసి కుటుంబం నుంచి వచ్చిన సంగీత విద్వాంసురాలు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి కల్కి సదాశివన్ అనే బ్రాహ్మణుడిని పెళ్ళి చేసుకొని ఆదర్శ గృహిణికి సంకేతంగా నిలిచింది. ఆమె జీవిత చరిత్రలో జర్నలిస్టు టి.ఎస్. జార్జి అంటాడు: ‘ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగారి సంగీతపు ఔన్నత్యానికి ఆమెను సంస్కృతీకరించడంలో ఆమె భర్త కల్కి సదాశివన్ చేసిన తెలివైన నిర్వహణకు మనం ధన్యవాదాలు చెప్పాలి.’
సుబ్బలక్ష్మి భర్త కల్కి సదాశివన్ స్వతంత్ర ఉద్యమకారుడు, గాయకుడు, జర్నలిస్టు, చలనచిత్ర నిర్మాత. అన్ని రంగాలలో తన ప్రతిభను ఉపయోగించి సుబ్బలక్ష్మిని ఒక సంప్రదాయ ఆదర్శ గృహిణికి సంకేతంగా మార్చాడు. సంప్రదాయ విరుద్ధ కులాంతర వివాహం కావడం వలన మొదట వారిని ఆశీర్వదించడానికి వెనకాడిన కంచి పరమాచార్య చివరికి వారిని ఆదర్శ దంపతులుగా అంగీకరించారు. సుబ్బలక్ష్మి బ్రాహ్మణురాలు కాకపోయినా బ్రాహ్మణురాలిగా గుర్తింపు పొందింది.
దీనికి పూర్తి వ్యతిరేక మార్గంలో ప్రయాణించిన సవితా అంబేద్కర్ ప్రపంచ ప్రసిద్ధ దళిత నాయకుడిని, దళిత మేధావిని వివాహం చేసుకుంది. దళితీకరించబడాలని ప్రయత్నించింది. అన్ని విషయాలలో అంబేద్కర్ బాటలో నడిచింది. బౌద్ధం స్వీకరించింది. 1990లో దళిత రాజకీయ నాయకులతో కలిసి బాబ్రీ మసీదు స్థలం బౌద్ధులది అని వాదించిన వ్యక్తి సవిత. కోర్టులో దీనిపై కేసు కూడా నడిచింది. ఇంతలా తన ఐడెంటిటీని దళిత ఐడెంటిటీగా మార్చుకోవాలి అనుకున్న ఆమెని అంగీకరించకపోవడమే కాదు దళితులకి ఆరాధ్య దైవమైన అంబేద్కర్‍ని హతమార్చిందన్న అపఖ్యాతిని మోయక తప్పలేదు.
బహుజనురాలు అయిన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి వివాహం ద్వారా బ్రాహ్మణుల ఐడెంటిటీని సొంతం చేసుకుంది. కానీ విద్యావంతురాలు ఆధునికురాలైన సవితా అంబేద్కర్ దళితురాలుగా గుర్తింపుకి దూరంగా నిలిచిపోయింది. అంతేకాదు ఆదర్శ గృహిణి ఖ్యాతికి కూడా నోచుకోలేదు. పైగా తీవ్ర అపఖ్యాతి పాలయింది.
సుబ్బలక్ష్మి గుర్తింపు వెనుక ఆమె భర్త కల్కి సదాశివన్ ఉన్నారు. ఆయన బ్రాహ్మణుడు. సుబ్బలక్ష్మిగారి దేవదాసి ఐడెంటిటీని పూర్తిగా మరుగుపరిచి సంప్రదాయ బ్రాహ్మణ గృహిణిగా దేశంలోని అందరు హిందూ గృహిణులకు ఆదర్శంగా నిలిపారు సదాశివన్. సంస్కృత భాషా పాండిత్యం, హిందూ సంస్కృతితో గాఢమైన సంబంధం సుబ్బలక్ష్మికి కొత్తగా భర్త వల్ల సంక్రమించినవి కాదు, హిందూ ఆలయాలతో గాఢమైన సంబంధం వల్ల ఆ లక్షణాలు స్వతస్సిద్ధంగానే అబ్బాయి. అయితే దేవదాసీలకి వివాహ ఆచారం లేదు కానీ, ఆ నియమాన్ని బ్రేక్ చేసి సదాశివన్ సుబ్బలక్ష్మిని వివాహం చేసుకోవడం మాత్రమే కాదు, సమాజానికి తన అర్ధాంగిగా పరిచయం చేశారు. కంచి పరమాచార్య లాంటి శుద్ధ చాందస శంకర పీఠాలవారు కూడా ఆమెని ఆదర్శ గృహిణిగా అంగీకరించేలా చేయగలిగారు. మీరాబాయి లాంటి సినిమాలలో నటింప చేయడం ద్వారా ఒక ఆధ్యాత్మిక జాతీయ ఆవరణాన్ని దేశమంతా కల్పించారు. గాంధీ మహాత్ముని వంటి ఆధ్యాత్మికత, రాజకీయం కలగలిసిన వ్యక్తి గుర్తింపు పొందడం కూడా సుబ్బలక్ష్మిని జాతీయ ఆదర్శంగా నిలిపింది. దీని వెనుక సదాశివన్ కృషి ఉంది. అయితే సదాశివన్ దాంపత్యం సుబ్బలక్ష్మిని బ్రాహ్మణీకరించి ఒరిజినాల్టీని మరుగుపరిచిందని సంగీతకారుడు మేధావి టిఎమ్ కృష్ణ విమర్శించారు.
మరోవైపు గొప్ప దళిత మేధావి దళిత నాయకుడు అంబేద్కర్ సవిత అంబేద్కర్ తన సహచరిగా ఆదరించారు. బౌద్ధ స్వీకరణతో సహా అన్ని కార్యక్రమాలలో ఆలోచనలలో ఆమెని భాగస్వామిని చేశారు. తన కొడుకు యశ్వంత్‍తో తీవ్ర విభేదంతో పూర్తిగా దూరం అయ్యారు కానీ, సవితతో చివరి వరకు సఖ్యంగానే ఉన్నారు. కానీ బ్రాహ్మణురాలు అయిన సవితా అంబేద్కర్ దళిత నాయకుల నుంచి గౌరవాన్ని కాక తీవ్రనిందని మోయవలసి వచ్చింది. అబ్రాహ్మణుడు, శూద్రుడు బ్రాహ్మణుడిగా మారడం కష్టసాధ్యం అని పురాణాలు స్మృతులు చెప్తాయి. దళితీకరణ అసాధ్యం అని సవితా అంబేద్కర్ జీవితం నిరూపిస్తోందా?
కొన్ని ముఖ్యమయిన పుస్తకాలు
- Babasaheb: My Life with Dr Ambedkar by Savita Ambedkar, Nadeem Khan (Translator). Penguin Random House India Private Limited, 2022
- ‘విద్యాసుందరి’ బెంగళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర! ఆంగ్లమూలం: The Devadasi and the Saint: The Life and Times of Bangalore Nagarathnamma. East West Books (Madras) Pvt. Ltd., Chennai 2009 By Shriram.V. అనువాదం: టి. పద్మిని, హెచ్ బి టి, హైదరాబాద్. 2010
- దారులేసిన అక్షరాలు – ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు: సంపాదకులు: సుశి తారు, కె. లలిత, హెచ్ బి టి, 2014
- మనకు తెలియని యం.ఎస్. – దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు. టి. జె.ఎస్. జార్జి. అనువాదం ఓల్గా. హెచ్.బి.టి. 2017
- వెలుగు దారులలో… నంబూరి పరిపూర్ణ. స్వీయ చరిత్ర. ఆలంబన ప్రచురణలు, హైదరాబాద్ 2017
- హిందూ సామ్రాజ్యవాద చరిత్ర … స్వామి ధర్మతీర్థ. అనువాదం: కలేకూరి ప్రసాద్. హెచ్ బి టి 1998
- వలస రాయల సీమలో మహిళా చైతన్యం. షేఖ్ మహబూబ్ భాషా. వీక్షణం ప్రచురణలు 2021
- నిర్జన వారధి. కొండపల్లి కోటేశ్వరమ్మ. హెచ్ బి టి. 2012
- Why I Killed The Mahatma: Understanding Godse’s Defence by Koenraad Elst. Rupa Publications Delhi, 2018
- The Shifting Fortunes of Chitpavan Brahmans: Focus on 1948 by Maureen L.P. Patterson. Edited by D.W. Attwood, M. Israel and N.K. Wagle 1948
- Republic of Religion: The Rise and Fall of Colonial Secularism in India. Abhinav Chandrachud. Penguin – Viking (Penguin Random House, India, 2020)
- వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934)’, స్త్రీవాద పత్రిక భూమిక, vol.18, nos. 7, 4, 3, 2. May 2023 (pp. 34-40), February 2023 (pp. 32-37), January 2023 (pp. 28-33), December 2022 (pp. 30-36).
- Shahu Vedic School faces a shortage of students (Times of India, Sep 28, 2016)
- Śakuntalā: Texts, Readings, Histories Book by Romila Thapar. Columbia University Press 2011
- కులం పై లోహియా హెచ్ బి టి.
- రాజకీయాల మధ్య తీరిక వేళలు ఎమెస్కో
- ధన్వంతరి గారి చికిత్స కన్నడ కథల సంకలనం. అనువాదం శాఖమూరు గోపాల్. ఆభిజాత్య కన్నడ తెలుగు భాషా పరిశోధన కేంద్రం, హైదరాబాద్
- మహిళాభివృద్ధిపై ముత్తు లక్ష్మి రెడ్డి – షేఖ్ మహబూబ్ బాషా. మిసిమి మాసపత్రిక, నవంబర్ 2024
- భారతదేశ విముక్తి మార్గం – బౌద్ధం అంబేద్కర్ ప్రసంగాలు. అనువాదం గౌరవ్. ప్రత్యామ్నాయ ప్రస్థాన కేంద్రం. 2021
- తూర్పుగోదావరి జిల్లా చరిత్ర సంస్కృతి, తూ.గో.జి. చరిత్ర అధ్యయన సంస్థ – కాకినాడ. 2008