“What then is time? If no one asks me, I know what it is. If I wish to explain it to him who asks, I do not know.“
– Saint Augustine.
కాలం అంటే ఏమిటి? నన్నెవరూ అడగకపోతే, అదేమిటో నాకు తెలుసు. కానీ చెబుదామని ప్రయత్నించినపుడే నాకదేమో తెలియదు – సెయింట్ అగస్టీన్.
కాలం క్షణికమా? శాశ్వతమా? స్థిర రాశా? చర రాశా? మనం పరిశీలిస్తున్న వస్తువులలో వచ్చిన మార్పుని కొలిచే సాధనమా? లేక మార్పుకి మరో పేరే కాలమా? అది మనలో భాగమా? పరిశీలించే హృదయానికే దాని అస్తిత్వం అవగతమౌతుందా? లేక ఇతర అస్తిత్వాలతో సంబంధం లేకుండా తన కొక ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నదా?
రెండువేల సంవత్సరాలకు పైగా ఈ ప్రశ్నలు వివేకవంతులని, శాస్త్రజ్ఞులని, తత్త్వవేత్తలనీ సమానంగా సవాలు చేశాయి. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో మనిషి కూడా విశ్వాసాలనుండి వివేకం వైపు, పరిశీలన నుండి పరిశోధన వైపు, ప్రయాణం సాగించాడు.
ఇప్పుడు ‘టైము ఎంత అయింది?’ అని ఎవరైనా అడిగితే, వాచీ చూసో, సెల్‌ఫోను చూసో, లేకుంటే అలెక్సాను అడిగో ఠక్కుమని చెప్పగలుగుతున్నాం. ఒకటి రెండు శతాబ్దాల క్రితం వరకు అటువంటి పరిస్థితి లేదు. నిజానికి శతాబ్దం క్రిందట మీ దగ్గర జేబు గడియారం (Pocket watch) ఉంటే అది గొప్ప ఫాషన్. పెద్ద పెద్ద కుటుంబాలు తమ భవనాల మీదో, వాకిటి ముంగిట్లలోనో ఛాయా యంత్రాలు (Sundials) తమ హోదాకు తగ్గట్టుగా పెట్టుకునేవారు. ఫూకో (Leon Foucault) ‘భూమి తన ఇరుసుమీద 24 గంటలకి ఒకసారి పరిభ్రమిస్తుందని’ ఋజువు చేసిన తర్వాతే ప్రపంచ వ్యాప్తంగా టైమ్ జోన్ల వ్యవస్థకి పునాది పడింది. గ్రీన్‌విచ్‌ని సున్నా డిగ్రీల రేఖాంశంగా గుర్తించడానికి ముందు వరకు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రామాణిక సమయం అమలులో ఉండేది.
కాలం విషయంలో తాత్త్వికులకే కాదు, శాస్త్రజ్ఞుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు. భౌతికవాదులు గతంలోని సంఘటనలు వర్తమానం లోకి, వర్తమానం నుండి భవిష్యత్తు లోకీ ప్రవహించే ప్రక్రియే కాలం అంటారు. సమతౌల్యంలో ఉన్న ఒక వ్యవస్థలో ఏ మార్పూ లేనట్టయితే అక్కడ కాలం ప్రసక్తి లేదని మౌలికంగా వారి వాదన.
కాలం గురించి చెప్పాలన్నపుడు మనందరి అనుభవం కూడా దాదాపు సెయింట్ అగస్టీన్‌కి తీసిపోదు. మనం ఇంద్రియాలద్వారా కాలాన్ని అనుభూతి చెందలేక పోయినప్పటికీ చేతనాచేతన ప్రకృతిలో కనిపించే మార్పుల ద్వారా మనం కాలచలనాన్ని అవగాహన చేసుకోగలం. అంచనా వెయ్యగలం. సర్ ఐజాక్ న్యూటన్ (Isaac Newton) కూడా కాలాన్ని స్థిర రాశిగాను (constant), పదార్థానికి అణువుల్లా, కాలశకలాలతో కూడి సరళరేఖలో పయనించేది (linear) గానూ భావించాడు. కాలం ఈ సృష్టికి అతీతమైనదని, కనుక దానిని సృష్టితో నిమిత్తం లేకుండా విడిగా కొలవాలనీ అన్నాడు. ఈ సృష్టిలోని సమస్త పదార్థం నశించినప్పటికీ కాలం కొనసాగుతూనే ఉంటుందని, అది ఒక పాత్ర వంటిదని, అందులో ఈ సృష్టికి చెందిన సమస్త భౌతిక సంఘటనలూ ముందుగా ఊహించగలిగే రీతిలో (in a deterministic way) జరుగుతాయని, అన్నాడు. అతని మాటల్లోనే చెప్పాలంటే: ‘సర్వ స్వతంత్రమైన, నిజమైన, కచ్చితమైన కాలం, తనకు తానుగా, దాని స్వభావసిద్ధంగా, ఏ బాహ్య వస్తువుతో సంబంధం లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా అన్ని దిక్కులలో ఏకరీతిగా ప్రవహిస్తుంది.’ మనం సాపేక్ష, దృశ్యమాన, సామాన్య కాలాన్నే అనుభూతి చెందగలమని; సూర్యుడు, చంద్రుడు వంటి గోచరమైన వస్తువుల చలనాలను కొలవడం ద్వారాను, భూమి మీద గడియారాల చలనం ద్వారానూ కాలాన్ని అనుభూతి చెందగలమని న్యూటన్ అన్నాడు. మనకి దృశ్యమాన కాలానికి, అనంతమైన స్వయం ప్రతిపత్తి గల కాలానికీ మధ్య వైరుధ్యాలు కనిపిస్తే అవి కేవలం భూమి చలనం వల్ల ఏర్పడినవే అని తీర్మానించాడు.
ఐజాక్ బారో (Isaac Barrow) కాలం స్వయంప్రతిపత్తి గలదని ముందు భావించినవాడు. కాలాన్ని ఒక తార్కిక భావనగా (mathematical concept) సరళరేఖకు దీటుగా దానికి ఒక దైర్ఘ్య ప్రమాణాన్ని, అన్ని భాగాలలోనూ ఏకరూపతగా ఉండే సముదాయంగా, లేదా వాటన్నిటినీ ఒకదాని వెనుక ఒకటి పేర్చితే ప్రవహించే కాలశకలంగా ఊహించాడు.
నిజానికి మనం రోదసిని అంతటినీ పరిశీలించలేము. మనం పరిశీలించగలిగేదల్లా, దృశ్యమాన జగత్తులోని వస్తువుల సాపేక్ష స్థానచ్యుతిని (relative displacement) మాత్రమే. కనుక రెండు వస్తువులు సాపేక్షంగా చలనంలో ఉన్నపుడు ఒకటి నిజంగా కదులుతోందని, లేదా రోదసితో సాపేక్షంగా కదులుతోందనీ చెప్పడం, ప్రయోగాత్మక విజ్ఞానపు పరిధులను దాటి చెప్పడమే. ఏవి కదులుతున్నాయో చెప్పాలంటే, ఒక ప్రామాణిక మూలాధార వ్యవస్థని (reference frame) ఏర్పాటు చెయ్యాలి.
కాలం అంటే ఏమిటో తెలుసుకుందికీ అవగాహన చేసుకుందికీ ఆదిమ మానవుడినుండి నేటి వరకూ నిరంతరాయంగా చేసిన ప్రయత్నాలు ఆకాశంలో నక్షత్రాల, గ్రహాల భ్రమణాలను నిశితంగా పరిశీలించడం దగ్గర నుండి సృష్ట్యాది నుండి ఇప్పటి వరకు గడిచిన సమయాన్ని కొద్ది సెకనుల తేడాతో అంచనా వేయగల అటామిక్ గడియారాల నిర్మాణం వరకూ దారి తీసింది.
తొలి తాత్త్విక భావనలు
అరిస్టాటిల్, సెయింట్ అగస్టీన్ వంటివారు కాలం అస్తిత్వాన్ని గురించి లోతుగా ఆలోచించారు. కాలం అంటే, మన పరిశీలిస్తున్న వస్తువులలో వచ్చిన మార్పుని కొలిచే సాధనమా? లేక, మనిషి పరిశీలనతో నిమిత్తం లేకుండా కాలం స్వీయ అస్తిత్వం కలిగి ఉందా? అన్నవి తొలి భావనలు. ఆ ఆలోచనలే, మనిషి చైతన్యపరిధిలో కాలాన్ని ముఖ్యభూమికలో నిలబెట్టి ఆధునిక మానవుడి ఆవిర్భావానికి పునాది వేశాయి. కాలం ఒక ప్రాథమిక భావనగా ఏర్పడిన తర్వాత, అది మనిషి అనుభూతిలో ఒక భాగమైన తర్వాత, క్రమంగా దాని స్వరూపస్వభావాలను నిర్ణయించడంలో, తరతరాల తాత్త్వికులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, ఔత్సాహిక ఖగోళ పరిశీలకులూ ఎందరో తమ వంతు పాత్ర పోషించారు.
కాలము, ఖగోళశాస్త్రము నాగరిక మానవుడి జీవితంలో అంతర్భాగాలు. ఈ ప్రపంచంలో ఒక క్రమపద్ధతి తీసుకురావడానికి, లేదా ఇక్కడ జరుగబోయే సంఘటనలకు సూచికలు గుర్తించడానికి పూర్వీకులు ఆకాశం వంక చూసేవారు. ఇప్పటికీ ఖగోళంలో చక్రీయంగా జరిగే మార్పులతో మన జీవితాలను అనుసంధానం చేస్తుంటాం. కాలం అంటే ఏమిటి అన్న ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయత్నంలో, ఆకాశంలో జరిగే మార్పులలో ఖగోళ శాస్త్రజ్ఞులు ఒక క్రమాన్నీ (order), మార్పులలో కొన్ని నమూనాలని (patterns), వాటి పునరావృత సమయం యొక్క ఖచ్చితత్త్వాన్నీ అంచనావేసి మనకి అందించారు, అందిస్తున్నారు. కాలం సర్వవ్యాపి. మన అస్తిత్వంతో బాటు, మనకు ఈ క్షణంలో తెలిసిన అన్నిటి అస్తిత్వమూ దానిలో అంతర్భాగం. భిన్న సంస్కృతులలో, తాత్త్విక చింతనలలో, శాస్త్రీయ సిద్ధాంతాలలో, కాలం గురించి భిన్నమైన ఆలోచనల సరళి ఉంది.
కాలం సరళరేఖ వంటిది: కాలానికి ఆవల దేనికీ అస్తిత్వం లేదు. అస్తిత్వం ఉన్న అన్నింటిలోనూ, కాలం ముందుకే ప్రవహిస్తుంది వెనుకకు ప్రయాణించదు. కాలాన్ని ఒక బిందువు నుండి మరొక బిందువుకి కొనసాగే సరళరేఖలా, ఒక అవిచ్ఛిన్న స్థల-కాల ప్రవాహంలా (space-time continuum) ఊహించడం అత్యంత సహజ స్ఫురణతో కలిగే భావన. ఈ రకమైన కాలగతిలో, కాలం ఒక దిశలోనే ప్రయాణిస్తూ ఒక మౌలిక కాలప్రమాణం నుండి తర్వాతి కాలప్రమాణం లోకి కలిసిపోతుంది.
మరికొందరు కాలం సరళ రేఖాత్మక ప్రగతి కాదని, ఈ క్షణానికే మరికొన్ని ప్రతిరూపాలు ఉండవచ్చునని, అందులో మనము గాని లేదా మనలాంటి వ్యక్తులు గాని జీవిస్తూ, అక్కడి వస్తుసంచయంతో వేరేవిధంగా అనుభూతి చెందుతూ ఉండవచ్చుననీ ప్రతిపాదించారు.
కాలం చక్రం వంటిది: గడియారం ముల్లులా, సూర్యోదయ సూర్యాస్తమయాల్లా, చంద్రుడి కళల్లా, సూర్య-చంద్ర గ్రహణాల్లా, ఒక నియమిత వ్యవధిలో చక్రీయంగా పునరావృతం అయే కాలం కూడా మనకు పరిచితమే. ఒక నిర్ణీత కాలవ్యవధి తర్వాత, సృష్టి పునరావృతం అవుతుందని, అన్నీ మొట్టమొదట ఉన్న స్థితికే చేరుకుని, తర్వాతి ఆవృతి మళ్ళీ ప్రారంభం అవుతుందన్నది ఇందులోని మౌలిక భావన. కాలంలో కనిపించే ఈ చక్రీయతను పరిశీలించిన హీబ్రూలు ‘కాలం అనంతం’ అన్న భావనకి వచ్చారు. పురాతన గ్రీకు, మాయా, హిందూ సంస్కృతులు కాలం చక్రీయమనే విశ్వాసంతో బాటు, అదే కారణం వల్ల, మనిషికూడా మరణానంతరం తిరిగి పుడతాడని, లేదా తిరిగి వస్తాడని భావించాయి. మనకి ఇప్పుడు వింతగా కనిపించ వచ్చు గాని, మొదట్లో కాలం చక్రీయమన్న విశ్వాసమే బలీయంగా ఉండేది. కాలం సరళ రేఖాత్మక (Time is linear) మన్న భావన సాపేక్షంగా నవీనమైనది. గ్రెగోరియన్ పంచాంగం (Gregorian Calendar) సామాన్య శకం 1582 వరకు ఆవిర్భవించనే లేదు.
నిజ కాలపరిమితి (Real Duration): ఆన్రి బెర్గ్‌సన్ (Henri Bergson) అన్న తత్త్వవేత్త కాలాన్ని మనం ఇప్పటి వరకు చూసిన వాటికంటే భిన్నంగా చూస్తూ ఇలా అంటాడు:
కాలం అంటే, నిజమైన కాలపరిమితి లేదా జీవించిన కాలం (lived time). మనం అనుభూతి చెందే కాలం. అది కాలాన్ని కొలిచే ఇతర భౌతిక సాధనాల ద్వారా చెప్పే సరళ రేఖాత్మక, చక్రీయ కాలం కాదు. అవి అనుభూతిలో, గాఢతలో ఒక్కలా ఉంటాయి. కాని కాలం మనం అంతరాంతరాల్లో ఎలా అనుభూతి చెందుతాం అన్నదాన్ని బట్టి మారుతుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు, విపరీతమైన బాధకి లోనయినపుడూ మన అనుభూతి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కాలాన్నీ అనుభూతినీ విడి విడిగా చూడలేము. ఉదాహరణకి మీకు ఇష్టమైన వస్తువుని తింటూ, ఒక నిముషం కుర్చీలో హాయిగా వెనక్కి చారబడి, కిటికీలో దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారనుకోండి. తర్వాతి నిముషంలో అనుకోకుండా ఒక బరువైన వస్తువు మీ కాలు మీదపడి ఒక నిముషం పాటు తీవ్రమైన బాధను అనుభవించారనుకోండి. వ్యవధిలో ఈ రెండు నిముషాలూ ఒకదానికొకటి సమానమైనప్పటికీ, అనుభూతి గాఢత విషయంలో ఈ రెండూ పూర్తిగా భిన్నం. నిజమైన కాలవ్యవధిని, పైన చెప్పిన కాల స్వభావాలకంటే భిన్నంగా, ఆ వ్యవధిలో మనకు కలిగే అనుభూతి నుండి వేరుచేసి చూడలేము.
ఆ కారణంగా బెర్గ్‌సన్ – కాలంలోకి త్రిమితీయ రోదసికి చెందిన, నిర్దాక్షిణ్యమైన, కచ్చితమైన, గణితశాస్త్ర భావనలను ప్రవేశపెట్టి, అనుభూతి రహితమైన వస్తువుగా నిర్వచించినందుకు, సైన్సును విమర్శించాడు. అది ఒక ముఖ్యమైన ప్రశ్నని లేవనెత్తుతుంది: దానిని గుర్తించడానికి ఒక వ్యక్తి లేనపుడు కాలం గురించి ఇచ్చే ఏ నిర్వచనానికైనా ప్రయోజనం ఏమిటి? కాలానికి ఇచ్చే ఇతర నిర్వచనాలకి భిన్నంగా, కాలవ్యవధి, దాని స్వభావాన్ని అనుభూతి చెందే వ్యక్తి అనుభూతి సాంద్రతతో, సందర్భంతో, పరిస్థితులతో, సంఘటనలతో పంచుకుని ఆ క్షణంలో జరిగిన, జరుగుతున్న అనుభూతి సాంద్రతతో మాత్రమే జీవించబడుతుంది. ఎందుకంటే ఒక ఏడాదిపాటు ఆసుపత్రిలో అచేతనంగా పడి ఉన్న సంవత్సరము, ప్రతి క్షణం మీకు ఇష్టమైన పని చేస్తూ గడిపిన సంవత్సరమూ ఒకటి కావు కదా! నిజమైన కాలపరిమితిలో, కాలం ఆ వ్యవధిలో జరిగే అనుభవ పరంపర సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది.
గ్రీకు తత్త్వవేత్తలలో ఆంటిఫోన్ (Antiphon) కాలం ‘ఒక భావన, ఒక ప్రమాణం’ తప్ప ఏ వస్తువులోనూ అంతర్భాగం కాదు అన్నాడు. సామాన్య శకం ముందు 5వ శతాబ్దికి చెందిన పరామెనీడెస్ (Parmenides) కాలాన్ని, కాలంతో పాటు సహజమని మనం భావించే మార్పులను ‘అభాసలు’ అన్నాడు. అస్తిత్వం ఈ క్షణానికే పరిమితమని, భూత భవిష్యత్తులు కేవలం మిథ్య అన్నాడు. అతని సమకాలీనుడైన హెరాక్లీటస్ (Heraclitus) దానికి వ్యతిరేకంగా, ‘కాల ప్రవాహం’ నిజమేనని, ఆ మాటకి వస్తే ‘వాస్తవానికి సారాంశం కాలమే’ అనీ అన్నాడు. అరిస్టాటిల్ ‘స్థానభ్రంశానికి కాలం విశేషణమని, దానికి స్వయంప్రతిపత్తి లేదని, మార్పు లేని చోట దానికి అస్తిత్వం ఉండదని, అసలు మార్పుని గుర్తించే ఆత్మ ఉన్నపుడే దానికి అస్తిత్వం ఉంటుందనీ’ వాదించాడు. కాలం అవిచ్ఛిన్నమని, అది పదార్థం (matter) లోని అణువుల్లా గుర్తించదగిన మౌలిక విభాగాల సముదాయం కాదని, సరళరేఖలా అనంతంగా విభజించుకొంటూ పోగలమని అతని భావన.
కాలం స్థానభ్రంశానికి విశేషణమని, స్వయం ప్రతిపత్తిలేక అది వస్తువుల చలనానికి సాపేక్షంగా అస్తిత్వాన్ని కలిగి ఉంటుందనీ అరిస్టాటిల్ భావించాడు. కాలాన్ని అతను నిరంతర చలనానికి అంక రూపకం (measure) లేదా,‘పరిణామానికి ముందు స్థితిని, తర్వాత స్థితినీ సూచించే మార్పులోని అంకె (index)’ అన్నాడు. మౌలికంగా, కాలం మార్పుకి ఒక మాపకం కనుక ఒక అనుక్రమణ, మార్పు లేని చోట దానికి అస్తిత్వం ఉండదని, ఆ మార్పుని అంక రూపకంగా గుర్తించగల ఆత్మ కూడా ఉండాలనీ వాదించాడు. అయితే, కాలం మాపకం అయినప్పటికీ దానినే మార్పుగా గుర్తించలేమని, ఈ మార్పు తొందరగానో, నెమ్మదిగానో జరుగవచ్చుననీ అన్నాడు. ఈ సృష్టి పరిమితమైనప్పటికీ కాలం మాత్రం అనంతమని, ఈ సృష్టి అనాదిగా అస్తిత్వం కలిగి ఉందని, దాని అస్తిత్వం అలాగే కొనసాగుతుందనీ నమ్మాడు.
తొలి క్రైస్తవ తత్త్వవేత్తల్లో, సెయింట్ అగస్టీన్ ఒక్కడే ప్రాచీన గ్రీకు తత్త్వవేత్తల తర్వాత అంతలోతుగా కాలం, దాని స్వభావం గురించి లోతుగా ఆలోచించినవాడు. కాకపోతే, అతని ఆలోచనలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. ప్లోటినస్ (Plotinus) వంటి నియో-ప్లేటోనిస్టుల వ్యాఖ్యలనే తిరిగి చెబుతూ, మనందరి అనుభవాన్నే చాలా సంక్షిప్తంగా ఒక గుళికలో చెప్పాడు: కాలం అంటే ఏమిటి? నీకు తెలుసా? అంటే తెలుసును అంటాను. కానీ దాని గురించి చెప్పబోతేనే, నాకేమీ తెలీదని అనిపిస్తుంది. కాలం మన మనసులో కలిగే ఉబ్బు (distension) వంటిదని, మన మనసు జ్ఞాపకాల ద్వారా గతాన్ని, అవధానం (attention) ద్వారా వర్తమానాన్నీ, నిరీక్షణ (expectation) ద్వారా భవిష్యత్తునీ సంభావించడానికి దోహదం చేస్తోందని అన్నాడు. అంతే కాదు, కాలం గురించి ఆత్మాశ్రయ భావనని వెలిబుచ్చాడు: వాస్తవానికి కాలం ఏదీ కాదని, దానికి మనసులో వాస్తవం గురించి కలిగే అనుభూతికి అనుగుణంగా అస్తిత్వాన్ని కలిగి ఉంటుందనీ చెప్పాడు.
కాలం ఎప్పుడు ప్రారంభం అయింది?
కాలం ఎప్పుడు మొదలయిందన్న దాని మీద చాలా అభిప్రాయాలే ఉన్నాయి. ఈ సృష్టికి సంబంధించి, కాలం ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా మొదలయింది. 13.9 బిలియను సంవత్సరాల క్రిందటి ‘మహా విస్ఫోటనం’తో (Big Bang) ప్రారంభం అయిందని సైన్సు చెబుతోంది. భారతీయ తత్త్వచింతన సృష్టి ‘అనాది’ అని, వంద బ్రహ్మ సంవత్సరాల తర్వాత (4.32 బిలియను సంవత్సరాలకు ఒకసారి) సృష్టి అంతరించి తిరిగి ప్రారంభం అవుతుందని చెబుతుంది. ఇటువంటి భావన, బౌద్ధంలోనూ ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త ఓర్ఫియస్ (Orpheus) అనుయాయులైన ఓర్ఫిక్స్, పైథాగొరాస్ (Pythagoras) అనుయాయుల్లోను, మాయా నాగరికత, పెరూకి చెందిన ఎఎరో (E’ero Indians) తెగలలో, ఆరిజోనాకి చెందిన హోపీ ఇండియన్స్‌లో కూడా కనిపిస్తుంది. అయితే భారతీయ దార్శనికులు కణాదుడు, గౌతముడు వంటివారు, సృష్టి ‘నశ్వర’మని అంగీకరిస్తూనే, కాలం ‘గతం నుండి భవిష్యత్తులోకి నిరంతరాయంగా ప్రవహిస్తుం’దని భావించారు. ఇతర వస్తువుల అస్తిత్వంతో నిమిత్తం లేకుండా, స్వీయ అస్తిత్వం కలిగిన సృష్టిలోని తొమ్మిది నిత్య ద్రవ్యాలలో, ఇంద్రియ గోచరం కాని ద్రవ్యంగా వైశేషికము కాలాన్ని పేర్కొంటుంది. (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనసు అన్నవి ఆ తొమ్మిది).
జోరో-ఆస్ట్రియనిజం మతం వల్ల ప్రభావితమైన మార్మిక ‘మైత్రాయిజం’ మతం సామాన్య శకం తొలి శతాబ్దులలో క్రైస్తవానికి పోటీదారుగా ఉండేది. వారు అనంత కాలపాత్రలో, 12 వేల సంవత్సరాల దీర్ఘ ప్రమాణం గల కాలపాత్రలు ఉంటాయని, ఆ వ్యవధిలో సంఘటనలు పునరావృతం అవుతాయని నమ్మారు. జోరో-ఆస్ట్రియనులు మనని ఆవరించిన ఈ విశాలసృష్టి అంతా చెడు, మంచి దైవాల మధ్య యుద్ధరంగమని, కాలం ఆ యుద్ధం జరిగే కాలమనీ భావించారు.
మధ్యయుగాల్లో, క్రైస్తవ, ముస్లిం తత్త్వవేత్తలు అరిస్టాటిల్ అభిప్రాయాలను తమ ధర్మశాస్త్రాల్లో భాగంగా చెయ్యడానికి ప్రయత్నించారు కాని, కాలం అనంతమన్న భావన వారికి పెద్ద చిక్కు సమస్యని తెచ్చిపెట్టింది. భగవంతుని సృష్టితో కాలాన్ని అనుసంధానం చెయ్యవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అలెగ్జాండ్రియాకి చెందిన ఫిలిప్పోనస్ (John Philoponus), ఆక్వినాస్ (Thomas Aquinas) మొదలైన వారు కాలం అనంతమన్న గ్రీకు తత్త్వవేత్తల అభిప్రాయాలకి భిన్నంగా ఒక్క భగవంతుడు మాత్రమే అనంతమని, తక్కినవన్నీ అతని సృష్టి కనుక వాటికి పరిమితి ఉందని, కనుక కాలానికి కూడా కచ్చితమైన ప్రారంభం ఉందని, సృష్టితో పాటే కాలం కూడా ఏదో ఒక రోజు ముగుస్తుందని వాదించారు. 13వ శతాబ్దికి చెందిన ఇటాలియన్ వేదాంతి ఆక్వినాస్ ‘కాలం అనంతం’ అనడాన్ని వ్యతిరేకించాడు. సైద్ధాంతికంగా ఈ విశ్వం గతంలో ఎప్పటి నుండో అస్తిత్వం కలిగి ఉన్నప్పటికీ అది దేవుని సృష్టి అవడం వల్ల దానికి ఒక ప్రారంభం ఉందని, వాస్తవాన్ని అర్థం చేసుకుందికి అన్ని వేళలా ఊహని నమ్మకూడదని హెచ్చరించాడు. ఇటలీకి చెందిన ఘెంత్, గిలెస్ (Ghent, Giles) వంటి తాత్త్వికులు కాలం మనసుమీద ఆధారపడ్డ భావన కాదని, అది వాస్తవమని, మనసు మాత్రమే దాని ‘ముందు, వెనుకల’ తేడాలు గుర్తించగలదని అన్నారు.
దేముడు దేవుడు సృష్టి ఎప్పుడు చేశాడన్నది వివాదాస్పదమైన విషయం అయినప్పటికీ, మధ్య యుగాలకు చెందిన బిషప్ అషర్ (Bishop James Ussher) సామాన్య శకానికి పూర్వం, 23 అక్టోబరు 4004 ఆదివారం సాయంత్రం 6 గంటలకి సృష్టి చేశాడని మన జ్యోతిష్కులు చెప్పినంత కచ్చితంగా చెప్పాడు. బైబిలులోని జెనెసిస్ ‘లేలేత పసికందు భూమిని భగవంతుడు 6 రోజులు శ్రమించి సృష్టించా’డని చెబుతోంది. 4.6 బిలియను సంవత్సరాల క్రితం భూమి అస్తిత్వంలోకి వచ్చిందన్న సైన్స్ పరిజ్ఞానాన్ని కొందరు స్వంతం చేసుకుని, జెనెసిస్‍లో చెప్పిన 6 రోజులు, మన రోజులు కావని, దేవుని ప్రమాణం ప్రకారం రోజులనీ వాదించసాగారు.
కాలాన్ని గురించిన అధ్యయనాన్ని మొదటిసారిగా శాస్త్రీయ, తార్కిక, గణితశాస్త్ర పునాదుల మీద నిలబెట్టినవాడు బహుశా, ఫ్రెంచి గణిత శాస్త్రజ్ఞుడు నికోల్ ఒరేస్మ్ (Nicole Oresme: 1325 – 1382). సూర్యుడు, చంద్రుడు, గ్రహాలని దేవుడు సృష్టిస్తే, వాటికి భ్రమణకాలాలు ఉంటే, అన్ని భ్రమణాలకీ ఒక మొదలు ఉంటుందని, దానిని సంవత్సరం, నెల, తేదీతో సహా వెనక్కి వెళ్ళి గుర్తించవచ్చని* ప్రతిపాదించాడు. మరి కొంచెం ముందుకు వెళ్ళి, వాటి భ్రమణకాలాలు కట్టి, చివరకు ఏ రెండు గ్రహాల భ్రమణకాలాలూ రోజులలో పూర్ణాంకాలు కావని, కనుక వీటన్నిటినీ ఒకే రోజు సృష్టించే అవకాశం లేదనీ నిగ్గు తేల్చాడు.
*[కుతూహలం రేకెత్తించే విషయం, ఈతని భావన నేపథ్యంలో, గ్రహాల ఆధునిక భ్రమణకాలాలు తీసుకుని కనిష్ట సామాన్య గుణిజం కడితే, మనకి 237443642486904337684200 రోజులు వస్తుంది (పైథాన్ ద్వారా లెక్కిస్తే). వాటినే, సమీప దినాల్లోకి కుదించి తీసుకుని క.సా.గు. కడితే, 4210594648655966856 రోజులు వస్తుంది. సౌర సంవత్సరం (365.24219) తీసుకుని భాగిస్తే 11,52,82,26,37,67,39,135 సంవత్సరాలు వస్తుంది. ఇది భూమి పుట్టి 4.8 బిలియను సంవత్సరాలని సైన్సు చెబుతున్న సంఖ్య కంటే కూడా చాలా పెద్దది.]
సృష్టికర్త ఈ ప్రపంచాన్ని సృష్టించిన సమయంలోనే కాలాన్ని కూడా సృష్టించాడని ప్లేటో నమ్మాడు. ప్లేటోకి విషువత్తులు (equinoxes) ప్రతి ఏడూ వెనక్కి జరుగుతాయని తెలుసు. స్థిరమైన నక్షత్రాలు, గ్రహాలూ భ్రమణాలు చేస్తూ చేస్తూ మహాసంవత్సరం (Great Year) అనబడే 36000 సంవత్సరాల తర్వాత, తిరిగి మొదటి స్థానానికి వస్తాయని ఊహించాడు. పైథాగరస్ అనుయాయులూ, క్రైసిప్పుస్ (Chrysippus) వంటి కొందరు స్థితప్రజ్ఞతావాదులు ఈ సమయం తర్వాత కాలం అంతరిస్తుందని, తిరిగి చరిత్ర మళ్ళీ పునరావృతమౌతుందని నమ్మారు.
మౌలిక రూపంలో, కాలం ఈ అనంతమైన సృష్టిని తన ఇరుసు మీద నిరంతరాయంగా నడుపుతోంది. మనిషి దానిని గుర్తించి, ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేయకముందే, అసలు మనిషి పుట్టకముందు నుండే, కాలం ఈ సృష్టిలో చక్రీయంగా మార్పులని నిర్వహిస్తోంది… నక్షత్రాలు ఏర్పడ్డాయి, అంతరించాయి; గ్రహాలు రకరకాల కక్ష్యలలో తిరిగి ఒక స్థిరమైన కక్ష్యని చేరుకున్నాయి; ఎన్నో చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలూ ఏర్పడ్డాయి.
చక్రీయంగా వస్తున్న రాత్రింబవళ్ళు, చంద్రకళల్లోని మార్పులు, ఋతు భ్రమణం, ఆలోచనాపరుడైన మానవుడి వివేకాన్ని తట్టిలేపింది. అసలు, వాటి చక్రీయతను గుర్తించడమే మానవుడు నాగరికుడుగా మారిన ప్రక్రియలో తొలి మెట్టు. కాలాన్ని కొలవడానికి ఒక రాత్రి-పగలు సమయం తొలి ప్రమాణం అయింది. పౌర్ణమి నుండి పౌర్ణమి ఒక నెలకీ; చెట్లు చిగుర్చడం నుండి, పుష్పించి, ఫలించి, ఆకులు రాల్చి, తిరిగి చిగుర్చే దాకా గడిచిన సమయం ఒక సంవత్సరానికీ; ప్రాథమిక ప్రమాణాలు తయారయ్యాయి. వాటి ఆధారంగానే, తర్వాత చాంద్రమాన, సౌరమాన పంచాంగాలు తయారయ్యాయి. వ్యవసాయ ఆధారిత సమాజాలకి అవి అత్యంత ఆవశ్యకమైన సాధనాలు.
అయితే, దిన ప్రమాణాన్ని గుర్తించడంలో ఖగోళమే కాదు, జీవశాస్త్రం కూడా తన వంతు పాత్ర పోషించింది. సమస్త జంతు, వృక్ష, జీవ ప్రపంచంలోనూ – మేలుకోవడం, ఆహార సేకరించడం, నిద్రించడం – దైనిక వ్యాపారాలు సూర్యోదయ సూర్యాస్తమయాలతో ముడిపడి ఉన్నాయి. అవి ఆ జీవుల మనుగడకి సంబంధించిన అత్యావశ్యక విషయాలు. దీనిని సిర్కేడియన్ లయ (circadian rhythm) అంటారు. దీనికి భంగం వస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జంతువులు కూడా ఈ లయకి నిబద్దమై ఉంటాయి. ఋతువులలో వచ్చే మార్పులకి అనుగుణంగా సంచార జంతువులు దూర ప్రయాణాలకు సిద్ధమౌతాయి. సుప్తావస్థ (hibernation) సంతానోత్పత్తి వంటి కీలకమైన విషయాలని తిరుగులేని కచ్చితత్వంతో పరిసరాలలోని మార్పులకి అనువుగా మలుచుకుంటాయి.
భూమి కూడా తనదైన శైలిలో, మహాపర్వతాలు ఏర్పడటం, ఖండాలు చీలడం, సముద్రాలు ఏర్పడటం, హిమయుగాలు ఏర్పడి అంతరించడం వంటి స్థూల ప్రమాణాలతో, కాలానికి కొలబద్దగా ఉంటూనే ఉంటుంది. జీవ వైవిధ్యాన్ని కొనసాగించడం, కొత్త జీవులు ఆవిర్భవించడం, బలమైన జీవరాశి అంతరించడం వంటి ప్రమాణాలలో కాలం పరిణామక్రమం మీద తన ప్రభావాన్ని చూపుతూనే ఉంటుంది. రాత్రింబవళ్ళు, ఋతు చక్రం, లయబద్ధమైన ఖగోళ వ్యాపారాలూ కాలంతో మనిషి తొలి పరిచయాలు అయితే, ప్రకృతిలో జీవుల దైనందిన జీవ వ్యాపారాలన్నిటినీ ఈ సిర్కేడియన్ లయ శాసిస్తుంది. క్షణాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు, హిమయుగాలు, లోహ యుగాలూ మొదలైనవన్నీ ఆదినుంచీ ఇప్పటి వరకు… ఆవిర్భవించి, అంతరించిన సంస్కృతులన్నీ కాలగమనాన్ని అంచనా వెయ్యడానికి చేసిన ప్రయత్నాలు మాత్రమే.
కాలమాపకాలు
ఖగోళశాస్త్రానికీ కాలానికీ అవినాభావ సంబంధం ఉంది. వేల సంవత్సరాలుగా మనుషులు తమ వేట, వ్యవసాయ, మతపరమైన క్రతువుల నిర్వహణ, తమ దైనందిన జీవనవ్యాపారాలను నిర్వహించడం మొదలైన వాటికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గమనాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు. ఖగోళశాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, కాలగణనకూడా మరింత కచ్చితం అవుతూ వచ్చింది.
కాలాన్ని సూర్యచంద్రుల, నక్షత్రాల గమనాల ఆధారంగా కాలాన్ని కొలిచే సంప్రదాయం తొలినాటి నాగరికతలనుండే ఉన్నది అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. చరిత్ర పూర్వయుగం నుండీ ఈజిప్షియన్లు, బాబిలోనియన్లూ ఖగోళంలో జరుగుతున్న మార్పుల్ని పరిశీలించి, కాల గమనాన్ని నమోదు చేసి మొట్టమొదటి కాలయంత్రాలు (time keeping devices) వాడిన దాఖలాలు ఉన్నాయి.
- ఇరవై వేల సంవత్సరాలకు పూర్వం (Upper Paleolithic Era) – పురాతత్త్వవేత్తల తవ్వకాలలో రాళ్ళూ ఎముకలమీద చంద్రుడి కళలను దగ్గరగా పరిశీలించి వేసిన గుర్తులు లభ్యం అయ్యాయి.
- 10,000-4500 సా.శ. పూర్వం – పంటలు పండించడానికి కోతలు కొయ్యడానికి వ్యవసాయాధారిత నాగరికతలకు మరింత కచ్చితత్వంతో, నైపుణ్యం గలిగిన సాధనాలతో ఆకాశాన్ని పరీక్షించవలసిన ఆవశ్యకత ఏర్పడింది.
- 3000 సా.శ. పూర్వం – ఈజిప్షియన్లు సరళమైన నీడ గడియారాలు (Sundial) తయారు చేసుకున్నారు. చంద్ర కళల ఆధారంగాను, ప్రతి ఏడూ జూలియన్ కాలెండరు ప్రకారం సెప్టెంబరు 11వ తేదీ చుట్టు ప్రక్కల వచ్చే వరదలతో, ‘సిరియస్’ నక్షత్రం కనిపించడంతో, సంవత్సరం ప్రారంభం అయే కాలెండరు వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత సౌరమానానికి మారారు. సుమేరియనులు, బాబిలోనియన్లూ (2000 సా.శ.పూ.) షాష్టిక పద్ధతి (Sexagesimal system) ప్రవేశపెట్టి కాలగణనకి మరింత పదునుబెట్టారు. ఆ కొలమానమే ఇప్పటికీ కొనసాగుతోంది.
- ప్రాచీన చైనా (1400 సా.శ.పూ.) – నీడ గడియారాలు (sundials), నీటి గడియారాలు (Clepsydras) కనిపెట్టారు. వాటిని కాలగణనకు, ముఖ్యంగా ఖగోళ విజ్ఞానానికి, పరిపాలనలకీ వినియోగించేవారు.
- ప్రాచీన గ్రీసు (325 సా.శ.పూ.) – నీడ గడియారాలు, నీటి గడియారాలను మెరుగుపరచడంతో పాటు, జ్యామితి, ఖగోళశాస్త్రాలను అభివృద్ధిపరచారు.
ప్రాచీన భారతదేశం
ప్రాచీన భారతంలో నీటి గడియారాలూ నీడ గడియారాలే గాక, కాల ప్రమాణాన్ని నిర్వచించి, నిర్ధారించడానికి ఛందస్సుని, స్వరశాస్త్రాన్నీ కూడా ఉపయోగించేవారని క్రింది శ్లోకాలద్వారా తెలుస్తోంది.
గుర్వక్షరాణిషష్టిర్వినాడికార్క్షీ షడేవ వా ప్రాణాః
ఏవం కాలవిభాగః క్షేత్రవిభాగస్తథా భగణాత్ – (ఆర్యభట్టీయ కాలక్రియా శ్లో.2)
సంవత్సరానికి 12 నెలలు. నెలకి 30 రోజులు. రోజుకి 60 నాడులు/నాడికలు. 60 వినాడికలు (వినాడులు) ఒక నాడి. ఒక నాక్షత్రిక వినాడిక (మనిషి సాధారణంగా ఉచ్చరించే సందర్భంలో) 60 దీర్ఘాక్షరాలు సాధారణ వేగంతో ఉచ్చరించడానికి పట్టే సమయం లేదా 6 సార్లు ఊపిరి తీసి విడిచిపెట్టడానికి పట్టే సమయం. ఇదే విభాగం వృత్తానికి (ఇక్కడ జ్యోతిశ్చక్రం) వర్తిస్తుంది.
వసంత విషువత్తు రెండుసార్లు వరుసగా మధ్యాహ్నరేఖను దాటడానికి పట్టే సమయం ఒక సౌరదినం (sidereal day). ఇది సగటు దినప్రమాణం కంటే 4 నిముషాలు తక్కువ ఉంటుంది. సౌర దినప్రమాణం 60 నాడికలు గాను, ఒక నాడికకి 60 వినాడికలు గానూ చెప్పి, ఒక వినాడిక ప్రమాణాన్ని, ఒక ఆరోగ్యవంతుడైన మనిషి 6 సార్లు ఊపిరి తీసుకున్న సమయంగాను, లేదా 60 దీర్ఘాక్షరాలు పలకడానికి పట్టే సమయం గానూ ఆర్యభట్టీయం 3వ అధ్యాయం (కాల క్రియ) 2వ శ్లోకం నిర్వచిస్తోంది.
అంతే కాదు, పగటి పూట ఏ సమయంలోనైనా 12 అంగుళాల శంకు నీడను బట్టి, రాత్రిపూట శీర్షంలో ఉండే నక్షత్రాన్ని బట్టీ స్థానిక కాలాన్ని గణించేవారు. లంక-ఉజ్జయిని నగరాలగుండా పోయే రేఖాంశాన్ని సున్నా రేఖాంశంగా పరిగణించి దానికి తూర్పుకి గాని, పడమరకి ఒక ప్రదేశము ఉన్న దూరాన్ని బట్టి, ఈ క్రింది శ్లోకం అనుసరించి కాల నిర్ణయము చేసేవారు:
‘త్రికృతి’ ఘ్నాత్ ‘ఖవసు’ హృతాద్ యోజనపిణ్డాత్ స్వతాడితాజ్జహ్యాత్
అక్షద్వయవివరకృతిం మూల్యాః షట్కోద్ఢృతా నాడ్యః (పణ్చసిద్ధాంతిక మూడవ అధ్యాయం-శ్లో.24)
రేఖాంశము తేడాను బట్టి కాలంలో తేడాను గణించవలసిన ఏ రెండు ప్రదేశాల మధ్య దూరాన్నైనా యోజనాలలో తీసుకుని దానిని 9చే గుణించి 80చే భాగించాలి. వచ్చే ఫలితం రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని డిగ్రీలలో ఇస్తుంది. ఈ విలువకి వర్గము తీసుకుని, రెండు ప్రదేశాల మధ్య అక్షాంశము తేడా వర్గాన్ని తగ్గించి, వర్గమూలము తీసుకోవాలి. అది రెండు ప్రదేశాల మధ్య రేఖాంశాల తేడాని డిగ్రీలలో ఇస్తుంది. దానిని 6చే భాగిస్తే నాడికలలో రెండు ప్రదేశాల మధ్య స్థానిక సమయంలో తేడా వస్తుంది.
పైన 60 దీర్ఘాక్షరాలు పలకడానికి పట్టే సమయాన్ని ఒక వినాడికగా ఇచ్చిన నిర్వచనాన్ని బట్టి, ఒక పాత్రలో నీరు ఖాళీ అవడానికి పట్టే సమయాన్ని, ఉచ్చరించే దీర్ఘాక్షరాలతో కొలిచి, సమయాన్ని లెక్కించడానికి నీటి గడియారాలని కూడా వాడేవారు. పూర్వకాలం శివాలయాలలో బిల్వపత్రం మీదుగా శివలింగం మీద బిందువు బిందువుగా నీరు పడేటట్టు కనిపించే గొలుసులతో కట్టి ఉండే కలశాలు (ధారపాత్రలు) బహుశా ఇటువంటివే అయి ఉంటాయి. భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు కాలాన్ని అతి చిన్న ప్రమాణాలలోకి విభజించారు. అన్నింటిలోకి అతి చిన్న ప్రమాణం తృటి (సుమారుగా 29.6 micro seconds); నిమేషము = కనురెప్ప వేసి తెరవడానికి పట్టే సమయం = 0.213 సెకన్లు; క్షణము = 1.6 సెకన్లు.
యుగ ప్రారంభం – దిన ప్రారంభం
రోమక, పౌలిశ సిద్ధాంతాల ప్రకారం యుగారంభం యవనపురంలో (Alexandria) సగం సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రారంభం అవుతుంది. ఇప్పటికీ కొన్ని సంస్కృతులలో సూర్యాస్తమయం తర్వాతే రోజు ప్రారంభం అవుతుంది. ఒకటవ ఆర్యభట అనుయాయుల ప్రకారం ముందు అర్ధరాత్రినుండి రోజు ప్రారంభం అయినప్పటికీ తర్వాత అది సూర్యోదయానికి మారింది. కానీ, చంద్రుడినీ అతని కళలను పరిశీలించడంలో ఉన్న సౌలభ్యం కారణంగా చాలా నాగరికతలలో అమావాస్య తర్వాత తొలిసారి కనిపించే చంద్రరేఖ (నెల బాలుడు) కనిపించడంతో ప్రారంభం అయ్యేది.
ఈ నాగరికతలన్నిటికీ జ్యోతిశ్చక్రం (ecliptic) ఒకసారి తిరగడానికి చంద్రుడికి సుమారు 28 రోజులు పడితే, సూర్యుడికి సుమారు 365 రోజులు పడుతుందని తెలుసు. వేదకాలంలో భారతీయులు 12 చాంద్రమాసాలకీ (synodic month), సౌర సంవత్సరానికీ ఉన్న 11 రోజుల తేడాని నెలకీ-నెలకీ మధ్య ఒక రోజు విడిచిపెట్టడం; ఋతువుకి, ఋతువుకి మధ్య కొంత సమయాన్ని విడిచిపెట్టడం; అనంతరం 32/33 చాంద్రమాసాలకి ఒక అధికమాసం కేటాయించడమూ చేస్తే, కెల్టిక్ సంస్కృతిలో నెలకి 28 రోజుల చొప్పున సంవత్సరానికి 13 నెలలను, 13 చెట్ల/మొక్కల పేరుతో తీసుకుని (ఆయా నెలలలో ఆ చెట్లు/మొక్కలు నాటడానికి గాని, కోత కొయ్యడానికి గాని అనువైన సమయం), మిగిలిన ఒక రోజు చివర విడిచిపెట్టేవారు.
మతపరమైన విధివిధానాలను నిర్వర్తించడానికి దీనివల్ల పెద్ద తేడా పడకపోయినా, వ్యావసాయిక కార్యక్రమాలన్నీ ఋతువులమీద, అవి సూర్యగమనం మీద ఆధారపడి ఉండడం వలన కొంతకాలానికి సౌరమానం అనుసరించవలసిన అవసరం ఏర్పడింది.
జూలియస్ సీజరు ఆదేశంతో సొసీజెనిస్ (Sosigenis) సలహా మేరకు సౌర సంవత్సరాన్ని 365.25 రోజులుగా తీసుకుని సవరించిన కాలెండరు, 11 నిముషాలు ఎక్కువ ఉండడంతో, ప్రతి 132 సంవత్సరాలకూ ఒక రోజు చొప్పున గతి తప్పి ఋతువులు ముందుకు జరగడంతో, పోప్ గ్రెగరీ XIII కాలానికి 10 రోజుల తేడాకి చేరుకుంది. అధికారిక ప్రకటనతో 4 అక్టోబరు 1582 తర్వాతి రోజు 15 అక్టోబరుగా ప్రకటించి చేసిన సవరణతో గ్రెగేరియన్ కాలెండరు అమలులోకి వచ్చింది.
ప్రపంచంలో అనేక సంస్కృతులు కాలగమనాన్ని అనుసరించడానికి నీటి గడియారాలు, ఇసుక గడియారాలు, నీడ గడియారాలు మొదలైనవి అనుసరించాయి. వరరుచివంటి భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు రాత్రి పూట కూడా, శీర్షం (zenith) మీద ఉన్న నక్షత్రాన్ని బట్టి (అప్పుడు parallax సున్నా) ఏ రాశిలో ఎంత గడిచింది తెలియజెప్పే సూత్రాలను 27 వరరుచి వాక్యాలుగా అందించారు. నీటి గడియారాలు నిజానికి ఘడియ (24 నిముషాలు) ప్రమాణానికి ఇంత నీరు బయటకు ప్రవహించాలన్న నియమాన్ని, 3600 దీర్ఘాక్షరాలు పలకడానికి పట్టే సమయంగా ప్రామాణీకరించి, పరిశీలనకు అనువుగా స్థిరపరిచారు. విషువత్తులలో (equinoxes) స్థానిక మధ్యాహ్నవేళ 12 అంగుళాల శంకుతో పట్టిన నీడకు ఒక ప్రాంతపు అక్షాంశానికీ ఉన్న అనుబంధాన్ని బట్టి, సూర్యుడు ఏ అక్షాంశములో ఉంటే ఆ అక్షాంశములో మధ్యాహ్నపు నీడ సున్నా అవుతుందన్న వాస్తవాన్ని బట్టి, దిౙ్మండలము నుండి ఉన్మండలానికి పట్టే సమయాన్ని (చారను) బట్టి, నీడ గడియారాల ద్వారా పగటిపూట కాలాన్ని, లగ్నాన్ని నిర్ణయించారు.
సామాన్య శకం 1000 వచ్చేసరికి పశ్చిమ యూరప్‍లో గంటలు కొట్టే యాంత్రిక గడియారాలు వచ్చాయి. అయితే అందులో సెకన్లు, నిముషాలు, గంటలు సూచించే ముల్లులు ఉండేవి కావు. 13వ శతాబ్దానికి ముఖ సూచికలు (Dials), గంటల ముల్లుతో పాటు చంద్రుడి కళలని (Phases), ఆయనాలనీ విషువత్తులనీ సూచించే ఎన్నో సదుపాయాలు ఉండేవి. 17వ శతాబ్దంలో డచ్ భౌతిక శాస్త్రజ్ఞుడు క్రిస్టియాన్ హయ్‍గన్స్ (Christiaan Huygens) లోలకాల వినియోగం ద్వారా కాలాన్ని సూచించే పరికరానికి (pendulum clock) పేటెంటు సంపాదించాడు. 1676లో లండను దగ్గర గ్రీన్‌విచ్ వేధశాలలో 4 మీటర్ల పొడవైన రెండు లోలకాలు కాలగణనకి నెలకొల్పబడ్డాయి. మొట్టమొదటి ప్రభుత్వ ఖగోళ శాస్త్రజ్ఞుడు జాన్ ఫ్లామ్‍స్టీడ్ (John Flamsteed) భూమి తన ఇరుసుమీద స్థిరమైన వేగంతో తిరుగుతోందని ఋజువు చేసి రేఖాంశాన్ని బట్టి సమయాన్ని నిర్ణయించగల అవకాశానికి తెరతీశాడు. 19వ శతాబ్దం అంతానికి జేబు గడియారాలు వచ్చాయి.
మనిషి కాలినడకన, గుర్రాలమీద ప్రయాణించే రోజుల్లో స్థానిక సమయానికి, ప్రామాణిక సమయానికీ మధ్య ఉండే తేడా పెద్దగా పరిగణించేంత ఉండేది కాదు. కాని రైళ్ళ రాకతో అంతా తారుమారు అయ్యింది. మళ్ళీ ఖగోళశాస్త్రమే సమస్యని పరిష్కరించడానికి ముందుకు వచ్చింది. ప్రామాణిక మధ్యాహ్నరేఖకి తూర్పు-పడమర దిక్కులలో ప్రతి 15 డిగ్రీల రేఖాంశములోని తేడాకి సమయంలో ఒక గంట హెచ్చు తగ్గులు ఉంటాయని స్థిరీకరించింది. అంటే ప్రతి డిగ్రీ రేఖాంశానికి 4 నిముషాలు తేడా. ఇంగ్లండు వంటి చిన్న దేశాల్లో రైళ్ళు, స్థానిక సమయాన్ని నీడ గడియారాల బట్టి స్థిరీకరించుకున్నా సరిపోతుంది. కాని, తూరుపునుండి పడమరకి మూడున్నర గంటలు పైగా తేడా ఉండే విశాలమైన అమెరికా వంటి దేశాలలో, స్థానిక ప్రభుత్వాలు నీడ గడియారాలని బట్టి సమయాన్ని స్థిరీకరిస్తే, రైలు కంపెనీలు వాటి సమయ సూచికల్లో వేరు వేరు టైమ్ జోన్లు పాటించేవి. పొంతన లేని ఈ సమయాల గందరగోళం నివారించడానికి ఖగోళ శాస్త్రజ్ఞులు భూగోళాన్ని 24 టైమ్ జోన్లుగా విభజించారు. ప్రతి టైమ్ జోనుకీ అక్కడి వేధశాలలు చేసే పరిశీలనల ఆధారంగా మధ్యాహ్న రేఖలు నిర్ణయించారు.
భూగోళం అంతటా టెలిగ్రాఫ్ సదుపాయం ఉండటంతో, కాలాన్ని గురించిన సంకేతాన్ని పంపడానికి అనువుగా ఉండేది. 1833లో గ్రీన్‌విచ్ వేధశాల ఒక ఎర్రని టైమ్ బాల్‌ని నెలకొల్పింది. ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంటకి అది క్రిందకు జారేది. దానిని బట్టి ఠేమ్స్ నదిమీద ప్రయాణించే నౌకలు తమ సమయాన్ని సరిదిద్దుకునేవి. 1870లు వచ్చేసరికి, దేశమంతటికీ కాలాన్ని తెలియపరచడం ప్రభుత్వ కర్తవ్యంగా భావించి సర్ జార్జ్ ఎయ్‌రీ (Sir George Airy) సమయాన్ని గురించిన సంకేతాల్ని పంపేవాడు.
అమెరికాలో ఖగోళ శాస్త్రజ్ఞులు కాలాన్ని పంపిణీ చేసేవారు. 1869లో పిట్స్‌బర్గ్ లోని అలెగెనీ వేధశాల (Allegheny Observatory) ఖగోళ శాస్త్ర పరిశోధనలకు కావలసిన ధనాన్ని సమకూర్చుకుందికి ఈ సమయానికి చెందిన సమాచారాన్ని రైలు రోడ్డు కంపెనీలకి, నగల వర్తకులకీ అమ్మి డబ్బు వసూలు చేసేది. (Time is money అంటే ఇదేనేమో కదా!)
19వ శతాబ్దం వచ్చే సరికి పరిస్థితి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ 24 టైమ్ జోన్లను ఏకీకరిస్తూ, ఒకదాన్ని సున్నా డిగ్రీల ప్రధాన మధ్యాహ్నరేఖగా గుర్తించడానికి 1884లో ప్రపంచం నలుమూలలనుండి ప్రతినిధులు అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ చేరుకున్నారు. సమయ నిర్ణయంలో గ్రీన్‌విచ్ వేధశాలకి ఉన్న చారిత్రాత్మక ప్రాధాన్యత కారణంగాను, అప్పట్లో సముద్ర వ్యాపారంలో బ్రిటనుకి ఉన్న ఆధిపత్యం కారణంగానూ గ్రీన్‍విచ్ ఎంపిక చెయ్యబడింది.
కాలగమనదిశ
కాలం ముందుకే గాని వెనుకకు ఎందుకు వెళ్ళదు?
ఊహాత్మక రచనలలోనూ గణిత సూత్రాలలోనూ కాలం ముందుకు వెనక్కు నడిపించవచ్చు. కాని, వాస్తవంలో కాలం ముందుకే గాని వెనుకకు ప్రవహించదు. దానికి సంప్రదాయ తాపగతి శాస్త్రం (classical thermodynamics) ఇచ్చే వివరణ వాస్తవిక ప్రపంచం దాని నియమాలను అనుసరిస్తుందని. అందులో రెండవ నియమం ‘ఏ వివిక్త వ్యవస్థలో (isolated system) నైనా, దాని జడోష్ణత (entropy) నిలకడగానైనా ఉంటుంది, లేదా హెచ్చు అవుతూ ఉంటుంది’ అని చెబుతుంది. జడోష్ణత అంటే, ఆ వ్యవస్థలో యాంత్రిక క్రియకి (Mechanical work) లభ్యం కాని ఉష్ణశక్తి. అది ఆ వ్యవస్థలోని అవ్యవస్థిత లేదా అస్తవ్యస్తత (disorder)/యాదృచ్ఛికతతో (randomness) ముడిపడి ఉంటుంది. అందువల్ల జడోష్ణత దానంతట అది తగ్గిపోదు. అంటే, కాలక్రమంలో ఆ వ్యవస్థ సమతౌల్యంలోకి వచ్చి, దాని అవ్యవస్థిత/యాదృచ్ఛికత గరిష్ఠంగా ఉంటుంది.
దానినే సరళంగా చెప్పాలంటే, ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఇంతకు ముందు క్షణంలో ఉన్న స్థితికి ఈ విశ్వం ఎన్నడూ రాలేదు. అందువల్ల కాలం వెనుకకు ప్రవహించ లేదు.
గణాంక భౌతిక శాస్త్రం (Statistical Physics) ప్రకారం వ్యవస్థ స్వరూపంలో తేడా లేకుండా, వ్యవస్థలోని అణువులని ఎన్ని భిన్నమైన మార్గాల్లో ఉంచగలిగితే, ఆ వ్యవస్థలో అంత ఎక్కువ అవ్యవస్థిత ఉన్నట్టు. ఆ స్థిరరాశిని ఆస్ట్రియన్ భౌతిక శాస్త్రవేత్త బోల్జ్‌మన్ పేరుతో (Bolzman’s Constant) వ్యవహరిస్తారు. సమాచార సిద్ధాంతంలో (Information Theory) సమాచార వ్యవస్థలలో ఉన్న సమాచారాన్ని దానిలో ఉన్న యాదృచ్ఛికతతో సూచిస్తారు. నికరంగా చెప్పాలంటే, నియమ నిబద్ధతలతో నడిచే వ్యవస్థలో జడోష్ణత తక్కువగానూ, అస్తవ్యస్తంగా ఉండే వ్యవస్థలలో జడోష్ణత అధికంగానూ ఉంటుంది. ఈ భావన ప్రభావం రసాయన, భౌతిక శాస్త్రాలే గాక, జీవ, ఆర్థిక, తదితర శాస్త్రాలకు కూడా విస్తరించింది. ప్రస్తుత ప్రపంచ రాజకీయాలలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది.
కాలానికి అంతం ఉందా?
దీనికి ఏ సమాధానం ఇచ్చినా, అది కేవలం ఊహాత్మకమే. ఈ రోజు మనకున్న అవగాహనల మేరకు సంభావ్యతల ఆధారంగా చేసే ఊహాగానమే.
ఈరోజు మనకి తెలిసిన పరిజ్ఞానాన్ని బట్టి, విశ్వం అనంతంగా వ్యాకోచించుకుంటూ పోతే, దాని ఉష్ణోగ్రత క్రమంగా క్షీణించి అపారమైన కాలవ్యవధిలో అనేకమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. గెలాక్సీలు ఒకదానికొకటి అతి దూరంగా జరగవచ్చు. ఈ దూరాలకు సృష్టిలో అధికభాగంగా ఉన్న కృష్ణశక్తి (Dark energy) కారణం అవుతుంది. విశ్వంలోని ఉష్ణోగ్రత క్షీణించడం వలన ద్రవ్యరాశితో నిండిన నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలూ ఏర్పడే అవకాశం ఉంది. కానీ, విశ్వం అనంతంగా వ్యాకోచిస్తూ పోయిన తర్వాత, నక్షత్రాలన్నిటిలోనూ న్యూక్లియర్ శక్తి పూర్తిగా నశించి, కొత్త నక్షత్రాలు ఏర్పడే అవకాశం లేక, విశ్వం కృష్ణబిలాలతోను, న్యూట్రాన్ స్టార్స్‌తోను, మరుగుజ్జు నక్షత్రాలతోనూ ఇతర అవశేషాలతోనూ నిండి చీకటి యుగం (Dark Age) చేరుకోవచ్చు. ప్రోటాన్లు క్షీణించి, తమ శక్తినంతటినీ కోల్పోయి విశ్వం తక్కువ శక్తిగల కణాలతో నిండి మృత్యుస్థితి (Heat death) చేరుకోవచ్చు.
విశ్వంతో పడుగు-పేకలా పెనవేసుకుపోయిన కాలం, ఈ స్థితిలో తాపగతి శాస్త్రం ప్రకారం, జడోష్ణత అత్యధికమై, ఉష్ణగతిక (thermodynamic) చలనానికి అవకాశాలు మృగ్యమై, కాలం అస్తిత్వం కలిగి ఉన్నప్పటికీ దానిని కొలవడానికి ఏ సంఘటనలు, ప్రక్రియలూ లేని స్థితిలో ఉంటుంది. ఆ స్థితిలో కాలం దాని వ్యావహారిక అర్థాన్ని కోల్పోతుంది. కొన్ని క్వాంటమ్ మెకానిక్స్ సిద్ధాంతాలు, మౌలిక క్వాంటమ్ ప్రక్రియల ఫలితంగా కాలం ఆవిర్భవిస్తుంది అని చెబుతున్నాయి. అదే నిజమైతే, అటువంటి ప్రపంచంలో కాలం అర్థం వేరుగా ఉంటుంది.
కొన్ని ఖగోళ శాస్త్ర నమూనాల ప్రకారం, విశ్వం మహాసంకోచం (Big Crunch) జరిగి తనలోకే ముడుచుకుపోయి, మరొక మహావిస్ఫోటనానికి దారితీయవచ్చు. అప్పుడు సరికొత్త సృష్టిలో కాలం సరికొత్తగా మొదలవవచ్చు.
కాలం సృష్టిలో అంతర్భాగమా? లేక మనిషి మనస్సు సృష్టించే అభాసా? అన్నది ఎడతెగని తార్కిక వివేచన. అది సృష్టిలోని మౌలికభాగం అయి ఉంటే, ఏ మార్పులూ లేని, నిర్జీవ విశ్వంలో భాగంగా కొనసాగుతుంది. అది అభాసే అయితే, దాని గురించిన ఎరుక (consciousness) నశించిన ఉత్తర క్షణంలో అది కూడా నశిస్తుంది.
సంక్షిప్తంగా చెప్పాలంటే, కాలం గురించి నేడు మనకున్న అవగాహనకి అర్థం కనిపించని భౌతిక స్థితికి ఈ విశ్వం చేరుకున్న తరుణంలో, కాలం యొక్క మౌలిక భావన ఇంకా మిగిలి ఉండే అవకాశం ఉంది. కాల పరిసమాప్తి అంటే, మనకు తెలిసిన అర్థంలో, దానిని పరిశీలించి, కొలవడానికి అనువైన అన్ని ప్రక్రియలూ, మార్పులూ ముగిసిన స్థితి.