కొన్ని జీవ వాక్యాలు

అర్థం అయ్యీ కానీ
అసుర సంధ్య
వార్ధక్యపు నడక
వాక్యంలా జీవితం

మంచినీళ్ళ పెద్ద ఊట చెలిమి
ఇప్పుడు ఎండిపోయింది
బతుకు గానుగ ఎద్దై
చుట్టుచుట్టూ తిరుగుతుంది

చీకటిలో గుసగుసల
కాపురం చేయక
కలవర పెడుతున్న
తొణకని బెణకని ఒంటరి
కల కుంటుతుంది

తడి ఆరిన ఎడారి జీవితం
ఒయాసిస్ మీంచి వీచిన
సమీరంలా మా మనుమరాండ్ల
చిన్న చిన్న మాటల మూటలు
మా జీవితకాలాన్ని పొడిగించే
జీవవాక్యాలు రోజూ కొన్ని కొన్నీ…