గలగల్లాడతాయి రావి ఆకులు
కదలదు కాకి
పొగలూరే పొయ్యి కింద
తాపీగా కాలుతాయి కట్టెలు
విసన కర్ర చెప్పినట్టల్లా
తలలాడిస్తాయి మంటలు
ఉబుకుతాయి మసి కాగులో
వేడి నీటి బుడగలు
తమ బూడిద రెప్పలు విప్పి
ఎర్రని కళ్ళు తెరుస్తాయి నిప్పులు
ఎండు పుల్లలు జాలిగా వింటాయి
ఊదు గొట్టం చెప్పుకునే రహస్యాలు
కాలుతున్న పిడకల మీద
చిన్ని చేతుల ముద్రలు
వీపున ఉప్పాటాడతాయి
పొద్దుటి చలి గాలులు
వెచ్చని వేళ్ళతో బుగ్గలు పుణికే
రాళ్ళ పొయ్యి సెగలు
ఇంకా నీళ్ళ దగ్గరే చచ్చావూ!
పరిగెత్తిపోతాయి
పనిపిల్ల పాదాలు
కదలవు రావి ఆకులు
ఎగిరిపోతుంది కాకి