సార్థక నామం: అధోలోకం

అధోలోకం! ఇది నిజంగా సార్థక నామమే!

నెమ్మి నీలం అనే అద్భుతమైన కథల నిధిని చదివాక నాకు జయమోహన్ జ్వరం పట్టుకుంది. ఆ వేగంతో ఇంటర్నెట్ అంతా కలియ తిరిగి ఎక్కడ ఏ జయమోహన్ కథ కనిపించినా ఆత్రంగా చదువుతూ పోయాను. కొన్ని రోజుల క్రితం ఛాయా వాళ్ళు అధోలోకం నవల గురించి ఫేస్‌బుక్‌లో పెట్టిన టీజర్ పోస్ట్ చూసి ఆసక్తితో ఆ నవల గురించి వివరాలు అడిగాను. పుస్తకం ఈ జనవరిలో వస్తుందని నాకు పుస్తకం డ్రాఫ్ట్‌ను ఈమెయిల్లో పంపించారు.

మొదటి చాప్టర్లు చదువుతుంటే ఇది నిజంగా జయమోహన్ రచనేనా అన్న అనుమానం మొదలైంది. మళ్ళీ పిడిఎఫ్ మొదటి పేజీకి వెళ్ళి చూశాను. అధోలోకమనే టైటిల్ తప్ప జయమోహన్ పేరుగానీ అనువాదం చేసిన వారి పేరుగానీ లేదు. నెమ్మి నీలం కథలెక్కడ? హాటకం, తమ్ముడు, బహుదూరం, ఏరు, సన్నటి నూలుపోగు, శివమయం, తాళంచెవి వంటి కథలెక్కడ? బీభత్సమైన భాషతో, కథనంతో భయపెట్టే ఈ నవలెక్కడ? అసలు ఇది జయమోహన్ రాసుంటాడన్నదానికి కావలసిన ఆనవాళ్ళు ఏవి? ఇంత జుగుప్స కలిగించే మాటలు ఆ పెద్దమనిషి రాశారా? రాసినా దాన్ని తెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? సున్నితమనస్కులు దీనిని పూర్తిగా చదవగలరా? ప్రశ్నలే ప్రశ్నలు నాకు. ఈ నవలను చదివానని బయటకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతాననిపించి నావల్ల కాక చదవటం ఆపేశాను కూడా. కానీ చిత్రం, చదివిన ఆ రెండు చాప్టర్లూ రకరకాలుగా మళ్ళీ మళ్ళీ బుర్రలోకి వచ్చి తొలిచేస్తున్నాయి. మొత్తం చదివితే గాని ఈ గందరగోళం మనసుని విడిచి పెట్టేలాగా లేదని తీసి కొనసాగించాను. చదవకపోతే ఏం పోగొట్టుకొనేదాన్నో పుస్తకం చివర్లో తెలిసింది.

అసలు ఇట్లాంటి ఒక ప్రపంచం మనం బతుకుతున్న ఈ సమాజంలోనే ఉందని, కనిపిస్తే ముఖం తిప్పుకుని మనం ఏమాత్రం పట్టించుకోని ఆ మనుషులకు ఒక లోకం ఉందని, ఆ లోకంలో ఇలాంటి జీవనం ఉందనీ… చేయి పట్టుకెళ్ళి వాళ్ళ మధ్యలో మనల్ని కూర్చోబెట్టి ఆ జీవితాన్ని మనకు చూపించడంలో నవల విజయం సాధించింది. ఈ రచయిత సామాన్యుడు కాడు – రాక్షసుడు, అసలా దారుణమైన భాషేంటని ఒకటి రెండు చాప్టర్లలో నివ్వెరపోతూ చదివినా ముందుకు సాగుతున్న కొద్దీ మెల్లగా ఆ భాషే సహజమైనదన్న భావనని కలిగించాడు రచయిత. అనువాదకుడి పని మాత్రం చాలా కష్టం అని అర్థం అయింది.

టైటిల్ తమిళమూలంలో ఏళాం ఉలగం. అంటే ఏడో లోకం అని అర్థం. మనకు మొత్తం పధ్నాలుగు లోకాలున్నాయంటారు కదా? వాటిలో పైన ఏడులోకాలు, కింద ఏడు లోకాలున్నాయంటారు. కింద అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు. వాటిలో అట్టడుగున ఉన్నది పాతాళ లోకం – దాన్నే ఏడో లోకం అనిపెట్టాడు రచయిత. తెలుగులో అట్టడుగున ఉన్న పాతాళ లోకాన్ని అధోలోకం అని అంటారు. నవలంతా చదివాక తెలిసేదేంటంటే ఎక్కడో ఉంటుంది అనుకునే అధోలోకం నిజానికి మనచుట్టూనే ఉందని.

‘కాయకష్టం చేసుకుని బతికేవారికి వారి శరీర బలమే మూలధనం, చదువుకుని తెలివితేటలతో పెద్ద సంస్థల్లో ఉద్యోగం చేసేవారికి వారి బుద్ధే మూలధనం. అంగవైకల్యం ఉన్నవారికి ఆ వైకల్యమే వారి మూలధనం.’ అనే ఒక బిచ్చగాడి మాటల్లో ఈ భూమిమీద అట్టడుగు వర్గం నుండి అత్యంత ధనికుల వరకూ ప్రతి ఒక్కరూ కేపిటలిజంతోనే బతుకుతున్నారు అన్నది స్పష్టంగా అర్థం అవుతుంది.

గుళ్ళకు వచ్చే భక్తులకు తమ అంగవైకల్యాన్ని ప్రదర్శిస్తూ, భక్తుల గుండెల్లో జాలిని కలిగించి డబ్బులు అడుక్కునే బిచ్చగాళ్ళ దగ్గర నుండి దోచుకుంటాడు పండారం. భక్తుల్లో జాలి అనే భావనను కలిగించి తద్వారా బిచ్చగాళ్ళకు వచ్చే ఆ డబ్బుని దోచుకునే పండారంకు జాలన్నదే తెలీదేమో అనుకుంటాం! నాణేల కొట్టు ఓనర్ చెక్కియార్, రోడ్డుమీద వెళ్ళే ఆడపిల్లల గూర్చి తప్పుగా మాట్లాడుతూ కాలం చెడిపోయింది అంటాడు. ముగ్గురు కూతుళ్ళకు తండ్రి అయిన పండారం, అందరాడపిల్లల్నీ ఒకే గాటికి కట్టరాదని ఖండిస్తాడు. పాపం తన పిల్లల లాంటి ఆడపిల్లల మీద జాలి కలిగిందాయనకు! బిచ్చగాళ్ళు ఆయన పిల్లలలాంటి వాళ్ళు కాదు మరి… అందుకే వాళ్ళదగ్గర ఎంత క్రూరంగా అయినా ఉంటాడు.

తన కూతుర్లను ఎంతో గారాబంగా చూసుకుంటూ, వాళ్ళకు ఏ చిన్న సమస్యలు వచ్చినా విపరీతంగా కుంగిపోతాడు పండారం. కానీ బయటకు రాగానే అవన్నీ మరిచిపోయి అంగవైకల్యంతో పుట్టిన ఒక బిచ్చగత్తె బిడ్డను ఎండలో పడుకోబెట్టి దారిన పోయేవాళ్ళ మనసులో జాలి కలిగించి డబ్బులు రాలేలా చూస్తాడు. అంత దారుణమైన వ్యాపారాన్ని చాలా సహజంగా, ఏ మాత్రం తప్పు అనే భావన లేకుండా, నిర్లిప్తంగా చేస్తాడు. అదే తన కుటుంబం దగ్గరికి వచ్చేసరికి మాత్రం విపరీతమైన భావోద్వేగంతో ఉంటాడు. పుస్తకంలో రెండు కథలూ సమాంతరంగా నడుస్తుంటాయి. పండారం ఒక మధ్య తరగతి తండ్రిగా, బిచ్చగాళ్ళ దళారిగా ద్విపాత్రాభినయం చేసినట్టు ఉంటుంది.

తన దగ్గర పనిచేసేవాళ్ళతో మాట్లాడేప్పుడు పెద్ద తత్వవేత్తలా లెక్చర్లిస్తాడు పండారం – జ్వరం వచ్చిన పిల్లాడిని ఎండలో వెయ్యి, ఎండ మంచిది, బలం, చెట్లూ చేమలకి ఎండే బలం, సరుకులకూ అంతే అని అంటాడు.

‘సరుకంతా మిగిలి ఉన్న అవయవాలతో డేక్కుంటూ పడిలేస్తూ మండపంలో అక్కడక్కడా సర్దుకుంది.’ ఇదీ వాళ్ళ దీనస్థితి. ఇక్కడ సరుకులు అనే మాట చదివిన ప్రతిసారీ గుండె గొంతులోకి వస్తుంది. వందల సంవత్సరాల కింద ‘కుంటా కింటే’ లాంటి వాళ్ళను అమ్మి పశువుల్లా కిక్కిరిసిన వాహనంలోకి తోసి తరలించిన సంఘటన చదివి విపరీతంగా బాధపడి, చివరికి ‘ఏడు తరాలు’ గడిచాక చాలా మార్పు వచ్చిందిలే అని సంబరపడిపోయాం. కానీ ఈ పుస్తకం చదివాక ఇప్పటికీ మనతో పాటు మన చుట్టూ ఉన్న, మనకు తెలియని బానిసల ప్రపంచాన్ని చూసి ఉలిక్కిపడతాం.

పండారం, అతని దగ్గర పనిచేసేవారు బిచ్చగాళ్ళపై చేసే హింసను చూసి చలించిపోతాం. వాళ్ళను ఎన్ని రకాలుగా వాడుకుంటారో తెలిశాక, వాళ్ళలో మరీ బలహీనులదీ స్త్రీలదీ దుస్థితి చూశాక సాటి మనుషులుగా సిగ్గుతో తలవంచుకుంటాం. వాళ్ళ ప్రాణాలకు ఏ విలువ లేకుండా బిచ్చగాళ్ళను, వాళ్ళ అవయవాలను అమ్మటం చాలా మామూలు విషయం ఈ వ్యాపారులకు. వాళ్ళ సంఖ్య పెంచటానికి, అందునా అంగవైకల్యం ఉన్న పిల్లలే పుట్టాలని లెక్కలు వేసి బలవంతంగా అలాంటివాళ్ళతో కలిపి పిల్లల్ని కనే యంత్రాలుగా కొందరు బిచ్చగత్తెలను మారుస్తారు.

మరో క్రూరత్వం, ఇందులో పోలీసుల వైఖరి. కాళ్ళు లేని బిచ్చగత్తెను ఎత్తుకుపోయి కోరిక తీర్చుకోవటం, పండారంని కొట్టి డబ్బులు లాక్కోవడం. నీచత్వానికి పరాకాష్ఠ ఈ పుస్తకంలోనే చూశాను. ఇంకా ఈ అధోలోకంలో జరిగే అనేక దుర్మార్గాలు, క్రూరత్వాల గురించి చెప్పటానికి మాటలు కూడా చాలవు. మానసికంగా సిద్ధమయే ఈ పుస్తకంలోకి అడుగు పెట్టాలి. అసలు ఇదంతా చదువుతుంటే, ఊహించి రాసిన విషయాలు అని మాత్రం అనిపించదు. చాలా దగ్గరగా, లోతుగా గమనించి, ఒక్కో మనిషినీ క్షుణ్ణంగా అర్థం చేసుకొని రాసినట్టుగా అనిపించింది. ఇవి చూడడానికి ధైర్యం కావాలి. రాయడానికి ధైర్యం కావాలి. చదవడానికి కూడా ధైర్యం కావాలి.

ఇంత బాధాకరమైన బతుకులు అయినా ఒక్కో భిక్షువును, వాళ్ళ ప్రత్యేకతలను, వాళ్ళలో దాగున్న మరో కోణాలనూ ఎంతో హృద్యంగా చూపించారు. రోజూ చూసే మనుషుల గురించి, రాజకీయాల గురించీ వాళ్ళ అనాలసిస్ వింటే అవాక్కవాల్సిందే. యజమానికి తెలియకుండా కొన్ని చిల్లర డబ్బులు అతి కష్టం మీద దాచుకుని వాటిని చిన్న సరదాలకు సమష్టిగా వాడుకోడం చదువుతుంటే బాగుంటుంది. ముఖ్యంగా దాచుకున్న డబ్బుతో కొనుక్కున్న గంజాయి మత్తులో వారి బాధలన్నీ మర్చిపోయి ఆడిపాడుతారు. అది చదువుతుంటే తప్పు అనిపించదు. హమ్మయ్య! వాళ్ళకూ కాసిన్ని బతికిన క్షణాలున్నాయి అనిపిస్తుంది.

తమిళనాడు, కేరళలోని కొన్ని గుడుల గురించీ అక్కడి పద్ధతుల గురించీ కొత్త విషయాలు తెలిశాయి. పండారంకు చాలా దగ్గరివాడైన గుడిపూజారి ‘పోతి’ తప్పకుండా ప్రస్తావించాల్సిన పాత్ర. వివిధ సందర్భాలలో అతని తెలివి, చాకచక్యం, హిపోక్రసీ అన్నీ ఆసక్తిగానే ఉంటాయి.

జయమోహన్ వాక్యంలోని బలం తెలిసిందే. మాంగాండి స్వామి అనే బిచ్చగాడి పాత్రతో పుస్తకమంతా తాత్విక కవిత్వం ఒలికించారు. ఇతని తాత్విక బోధనలు విని ఒక ముఠా ఏకంగా గురువును చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సంఘటనలో స్వామి ప్రవర్తన చదివి తీరాల్సిందే.

అవికాక కథనంలో ఇలాంటి వాక్యాలు పుస్తకమంతా మెరుస్తూనే ఉంటాయి.

– కలిసి నవ్వే క్షణాల విలువ పది రూపాయలయితే… కలిసి ఏడ్చే విలువ వంద రూపాయలు.

– మంచి పేరు హోదా ఉంటాయి అంటే అది కేవలం డబ్బులుండటంవల్లే.

– పెళ్ళిళ్ళ సీజన్‌లో ప్రతోడూ వంటోడి అవతారమెత్తుతాడు.

– మనుషులు వాళ్ళ బాధల గురించి నోరు తడారిపోయేదాకా మాట్లాడ్డం తప్ప ఇంకే పనీ చెయ్యరు. మాటలు… అంతే, మాటలు, మాటలు, మాటలు… తప్ప ఇంకేవీ ఉండదు. మాటలనేవే లేకపోతే జీవితంలో మిగిలేది చెత్తే.

మనం హాయిగా ఉన్న ప్రపంచాల నుండి మనని ఇబ్బందిపెడుతూ పక్కకి లాగేవన్నీ మనకు ఆనందాన్నిచ్చే రచనలు కాకపోవచ్చు, కానీ బలమైన రచనలు. సమాజం నింపాదిగా విస్మరించే సామాజిక బాధ్యత, రకరకాల విశృంఖల రూపాల్లో తిరిగి దానికే తారసపడుతూ ఉంటుంది. అది ఊడలు పెంచుకుని వెయ్యి దిక్కుల్లో వెయ్యి రకాలుగా కుదురుకుంటుంది. మూలం మనం గమనించుకునే సౌలభ్యం కూడా మిగలదు. అధోలోకం లాంటి నవలలు వాటి నిజ స్వరూపాన్ని ఇంత పచ్చిగా మన కళ్ళ ముందుకు తెచ్చినప్పుడు, ఆ తొలిచేసే ఇబ్బందిలో నుండి రచయిత సూటిగా చెప్పకుండానే కొన్ని నిజాలు మనకి అర్థమవుతాయి. రచయిత నేర్పకుండానే కొన్ని ఆలోచనలు మన మెదళ్ళలో చెయ్యాల్సిన పనులు చేస్తాయి. తన రచన మీద ఆ నమ్మకం ఉంది కాబట్టే జయమోహన్ ఒక్క ముగింపు వాక్యం కూడా కలపకుండా నవలను అంత నిజాయితీగా ముగించి పాఠకులను హింస పెట్టాడు – అచ్చం అతను కోరుకున్న మోతాదులోనే!


(ప్రచురణ వివరాలు త్వరలో)