వర్ల్‌డ్ వితిన్

ప్రపంచాన్ని కత్తిరించి
కిటికీలకు కుట్టేశారు
నదులను కుదించి
బ్రిడ్జీలకు కట్టేశారు
అతడి మెడవిరిచి
ఆమె వక్షస్థలానికి ముడేశారు
బ్లాక్‍బోర్డుని ఎవరో డస్టర్‌తో తుడిచేసి
చీకటిని ఆహ్వానించారు
కరెంట్‌ను తరిమికొట్టి
నక్షత్రాలు వెలిగించారు
ఎక్కడో, ఈ భూగ్రహంపైనే
గాలి చెలరేగిందిట.
ఎవరో సత్యాన్ని కనుగొన్నారట.
ఆమె మాత్రం
బట్టలెగిరిపోతాయేమోనని
ఆందోళన పడుతోందిట
కర్టెన్‌ల చాటుగా
ఏవో పచ్చని నీడలు కదిలాయిట
ధిక్కరించిన నదులన్నీ
సముద్రంతో చేతులు కలిపాయిట
తనవల్ల కాదని,
తోక ముడిచిన
అతడి నగ్న పాదాలకు
ఆమె లేపనం అద్దుతోందిట.