మాటలు ఉండాలి

మాట్లాడ్డానికి
మనుషులు ఉంటే సరిపోదు
మాటలు ఉండాలి
ముట్టుకుంటే కందిపోయే లాంటి
మాటలు
మెత్తని పండు లాంటి మాటలు
వింటేనే కోసుకుపోయే లాంటి
మాటలు కావు

గొప్పు తవ్వి
నీళ్ళు పోసినట్లు
పుణికి పువ్వులు పుచ్చుకున్నట్టు
కిందపడ్డ పొగడపువ్వులు
ఏరుకున్నట్టు

జ్ఞాపకాల్లోకి వెళ్ళడానికి
దారితీసే మాటలు
పెదాలమీదకి తుళ్ళుకుంటూ వచ్చే
బాల్యం లాంటి మాటలు

ఎండిన గొంతులోకి
బెల్లపు పానకంలాగ

చెవితో వినే మాటలని కూడా
కళ్ళతో పలికించాలి
నవ్వుతో తడిపి
చేతి స్పర్శతో
అందించాలి

సంధ్యావతరణ వేళ
రంగులంటే మాటలు
ముఖమల్ గుడ్డలాంటి
మాటలు

నిద్రలోకి
అనాయాసంగా జారుకొనే
మధుతంత్రుల మంద్ర వీచికలు

మాటలుండాలి
అంత్యశయ్య మీద
నిప్పు రాజుకునే ముందు
తరాల జ్ఞానాన్ని అందించే మాటలు
దుఃఖాన్ని తేలిక పరిచే
నిశ్శబ్దాన్ని విప్పి చెప్పే
మాటలుండాలి మాటలు