ఆకాశంలో వినిపించే స్వరాలు

ఆర్.ఎమ్.వి.ఎస్. తోటాన్ తల తిప్పుకుంటూ నెమ్మదిగా లోపలికి వచ్చారు. మా స్విచ్-రూమ్‌ను చేరుకోవడానికి మూడు గదులను దాటాలి. ఒక్కో తలుపూ దాటిన తర్వాత ఒక్క క్షణం ఆగారు. ‘సరే’నని తల ఊపి ముందుకు నడిచి స్విచ్-రూమ్‌ను చేరుకోగానే గొడుగుని కొక్కానికి వేలాడించారు. సరిగ్గా దానికిందే సంచిని పెట్టి గోడకేసి చూస్తూ కాసేపు అలాగే నిల్చున్నారు.

స్విచ్-రూమ్‌లో స్విచ్ ప్యానెల్స్‌ను ఆపరేట్ చేస్తూ కూర్చున్న మేము ఎనిమిదిమంది టెలిఫోన్ ఆపరేటర్లమూ ఆయన్నే చూస్తున్నాము. ఒక్కోసారి గంటసేపు దాకా అలానే నిల్చుని ఉండిపోయేవారు ఆయన. ఇదంతా రోజువారీ తంతే అయినప్పటికీ, చూడ్డానికి సరదాగా ఉండేది మాకు. శీల, గీత నన్ను చూసి కళ్ళతోనే నవ్వారు. టి.ఎమ్. రాజన్ కనుబొమ్మలు ఎగరేశాడు.

కానీ తోటాన్ వెంటనే వెనకకు తిరిగారు. కుర్చీ లాక్కుని సరిగ్గా మాకు ఎదురుగా వేశారు. సరిగ్గా ఉందా అని ఒకటికి రెండుసార్లు చూసుకుని మరీ నెమ్మదిగా కూర్చున్నారు. పెద్దగా నిట్టూర్చి మాకేసి చూశారు.

నేను “గుడ్ మార్నింగ్, తోటాన్‌గారూ” అన్నాను.

“ఎస్. గుడ్‌మార్నింగ్‌” అన్నారు తోటాన్‌. ఆయన ఏం మాట్లాడినా గాబరాపడుతూ చెప్తున్నట్టు ఉంటుంది.

శీల నవ్వుతూ, “గుడ్ మార్నింగ్ సార్” అంది.

“గుడ్ మార్నింగ్” అన్నారు కంగారుగా! ఆయన మా రూమ్ సూపర్‌వైజర్. సీనియర్ కాబట్టి ఆయన్ని మరెక్కడా నియమించలేరు. సాధారణంగా సూపర్‌వైజర్ ఏమీ చేయనవసరంలేదు. తోటాన్ విషయానికి వస్తే ఆయన ఏమీ చేయకుండా ఉంటేనే పదివేలు. కానీ ఆయన అలా ఉండరు.

తోటాన్ మినిట్స్ పుస్తకాన్ని అందుకుని నాలికతో వేలు అద్దుకొని దానితో పేజీలు తిరగేశారు. కొత్త పేజీకి వెళ్ళి అందులో ఏం రాసుందో చూశారు. వరుస కింద తన పేరు రాసి లోపలికి వచ్చిన టైమ్ రాసి సంతకం చేశారు. పుస్తకం మూత పెట్టి దూరంగా పెట్టి పెన్ను దాని మీద పెట్టి ఫోన్ తీశారు.

“నాకు జీరో డయల్ ఇవ్వు” అన్నారు.

“తోటాన్‌గారూ, జీరోల కాలం కొండెక్కేసిందిగా?” అన్నాను.

“అవును, అవును” అంటూ తలను తిప్పి “కొండెక్కేసింది” అన్నారు.

పాత స్ట్రౌజర్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజిల్లో ఇంటెగ్రేటెడ్ మెషీన్ ద్వారా డయల్‌టోన్ ఇవ్వబడేది. ఇది పిల్లి పుక్కిలించినట్లు వినిపించేది. అందులో జీరోకి ఎప్పుడూ డయల్‌టోన్ ఉంటుంది. వంద కాంటాక్ట్స్ వరకు ఇచ్చినా స్పష్టంగా, సజావుగా క్రాస్‌టాక్‌ లేకుండా ఉండేది.

అన్ని బోర్డుల్లోనూ జీరో డయల్ ఉంటుంది. “ఇది శుభసూచకమైన సంఖ్య. అది ఏ ఒక్కరి సొమ్మూ కాదు. జీరో అనేది లెక్కలకు ఆధారం, ఆయువుపట్టు. ఇది ఏ సంఖ్యతోనైనా కలుస్తుంది. మరొక సంఖ్యకు విలువను పెంచుతుంది, విలువను తగ్గిస్తుంది. కానీ దానికంటూ ఏ విలువా లేదు” అని శిక్షణా తరగతుల్లో మొదటిరోజే కుంజరామన్ మాస్టారు అన్నారు.

తోటాన్ అందులోకి కనెక్ట్ చేసుకుని రిసీవర్ చెవికీ భుజానికి మధ్య నొక్కి పట్టుకుంటారు. అదే ఒకే తీరున చెవిలో ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్ మంటూ మోగడం మొదలవుతుంది. పిల్లి ముడుచుకుని, కళ్ళు మూసుకుని, మోర దించుకుని గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. తోటాన్ అది వింటూ ఉంటారు. ఆయన తల వేలాడదీసిన లోలకంలా అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. కాసేపటికి ఒక పక్కకు ఒరిగిపోతుంది. కళ్ళు మూసుకుపోయి, నోరు తెరుచుకుని, భుజాలు సడలి పక్కనున్న ఆలివ్ గ్రీన్ బీరువా మీదకు ఒరిగిపోయి కూర్చునుంటారు.

మధ్యాహ్నం భోంచేయరు. లఘుశంకకు కూడా లేవరు. ఒక్కోసారి ఏదైనా చప్పుడు విని ఉలిక్కిపడి లేస్తే ఒళ్ళు తారుమారుగా ‌వణికిపోయేది. మూర్ఛరోగం వచ్చినట్టు చేతులు కాళ్ళు ఈడ్చుకుంటున్నట్టు తోచేది. “హాఁ? ఏం? ఏఁవిటి? ఏఁవైంది?” అని పిచ్చి ప్రశ్నలు వేసేవారు.

అతన్ని పట్టుకుని కూర్చోబెట్టాలి. “ఏమీ లేదు తోటాన్‌గారు. ఏమీ లేదు. కూర్చోండి…” అని కూర్చోబెట్టి రిసీవర్‌ని చెవిదగ్గర పెట్టేయాలి. ఆయన మళ్ళీ మెల్లగా డయల్‌టోన్ అనే ప్రణవనాదంలో ఐక్యమైపోయేవారు.

మా టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ క్రాస్‌బార్ టెక్నాలజీకి మారి ఒక సంవత్సరం అయ్యింది. అదివరకు ఉన్నదానికంటే దీని నిర్మాణం భిన్నంగా ఉంటుంది. దీనికి సంబంధించిన యంత్రాలన్నీ మరో గదిలో ఉన్నాయి. దీని డయల్‌టోన్ హార్మోనికాపై నోటును సాగదీసి నొక్కినట్లుగా వినిపిస్తుంది. ఏ సంఖ్యలోనూ మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉండదు.

స్ట్రౌజర్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ పాతబడిపోయి కొత్తవి వచ్చేశాయన్న సంగతి ఆయన బుర్రలోకి ఎక్కనేలేదు. ప్రతిరోజూ “జీరో ఇవ్వు” అనేవారు. “తోటాన్‌గారూ జీరో లేదిప్పుడు!” అని ఆయనకు గుర్తుచేస్తూ ఉండేవాళ్ళం. ఆయన అవుననేవారు. కానీ మళ్ళీ కాసేపటికే మరిచిపోయేవారు. ఎప్పుడూ కుదురుగా ఉండలేరు.

తోటాన్ లేచి గడియారంకేసి కాసేపు చూశారు. మళ్ళీ వచ్చి కూర్చున్నారు. తల ఊగుతూనే ఉంది. మళ్ళీ లేచి బయటకి వెళ్ళి వచ్చారు. జుట్టులేని తన నుదుటిని తడుముకున్నారు. రిసీవర్ తీసుకుని చెవిలో పెట్టుకున్నారు. దాని డయల్‌టోన్ చప్పుడును విన్నారు. అది ఆగిపోయాక లేచి విసుక్కుంటూ వెళ్ళిపోయారు.

ఆయన్ని అలా చూడటం కష్టంగానే అనిపించేది. “మీ శాస్త్రీయ సంగీతకారులదగ్గర ఒక పెట్టె ఉంటుంది కదా?” అని అడిగాను.

“శ్రుతి బాక్సా?” అంది దుర్గ.

“అవును, అదే. అలాంటిదొకటి కొనిస్తే పోలే?” అన్నాను.

“అది డయల్‌టోన్‌లా మీటినట్టు ఉండదు. అది అలలు అలలుగా ఒక క్రమంలో మోగుతుంటుంది” అంది దుర్గ.

తోటాన్ మళ్ళీ వచ్చి కూర్చుని రిసీవర్ చెవి దగ్గరకు తీసుకున్నారు. విసుగ్గా దాన్ని కింద పెట్టేశారు. లేచి అటూ ఇటూ నడిచారు.

నా టీ బ్రేక్ వచ్చింది. లేచి మినిట్ బుక్‌లో రాసేసి బయటకు నడిచాను. ఒక టీ, ఒక సిగరెట్. కంపనీకి ఎవరైనా వస్తారేమో అని చూశాను. అప్పుడే అతన్ని గమనించాను. అతను మెట్ల కింద నిల్చుని ఉన్నాడు.

“ఎవరు?” అన్నాను.

అతడు కన్నడ వ్యక్తి అని తెలిసింది. భట్ లేదా శెనాయ్ అయుంటాడు.

“నేను ఎస్.జి. శాంతి భర్తని. కొప్పల్ నుండి వస్తున్నాను. నా పేరు టి.వి. కృష్ణ భట్” అన్నాడు.

“రండి” అన్నాను.

“ఇది సబ్ డివిజనల్ ఆఫీసర్ ఉండే ఆఫీసే కదా?”

“అవును.”

“ఇక్కడే కదా టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఉండేది?”

“అవును. ఎవరిని చూడాలి?”

“సబ్ డివిజనల్ ఇంజనీర్ మిస్టర్ రాఘవను.”

“ఉన్నారు, రండి.”

నేను అతన్ని పైకి తీసుకెళ్ళాను. అతను, “నేను బ్యాంకులో పని చేస్తున్నాను. కెనరాబ్యాంక్” అన్నాడు.

“నాకు తెలుసు… నేను మీ పెళ్ళికి రాలేకపోయాను. కొప్పల్లో జరిగింది కదా?”

“అవును” అతని గొంతు ఒక్కసారిగా బొంగురుపోయింది. నేను అడక్కుండా ఉంటే బాగుండేది అనిపించింది. శాంతి రెండేళ్ళ క్రితం చనిపోయింది. ఒక ప్రమాదంలో. ఆమె ఇల్లు మంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉండేది. రోడ్డు దాటుతున్నప్పుడు ఆమెను ఒక ట్రక్కు గుద్దేసింది.

“సారీ” అన్నాను.

“లేదు, పరవాలేదు” అతను రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు. ముక్కు బాగా ఎర్రబడిపోయింది. చెవితమ్మెలుకూడా ఎరుపెక్కాయి.

“ఇదే ఎస్.డి.ఇ. రాఘవన్ గది. అక్కడ కూర్చోండి. ఆయన రౌండ్స్‌కి వెళ్ళే టైమ్… కాసేపట్లో వచ్చేస్తారు.”

“సార్ మీరు కూడా రండి… నాకు ఒక సాయం కావాలి. ఒక పర్సనల్ హెల్ప్… రాఘవన్‌కి మీరు చెప్పండి.”

“అది రాఘవన్‌కి మీరే చెప్పొచ్చు కదా?” అడిగాను.

“చెప్పాను. కుదరదని చెప్పారు. ఇక్కడికి రావద్దు అన్నారు.”

“అవునా? ఏం సాయం?”

“నాకు శాంతి వాయిస్ కావాలి…”

నేను ఆశ్చర్యపోయి “శాంతి వాయిస్?” అని అడిగాను.

“అవును, ఇదివరకు కుంబళాలో ఫోన్‌ అనౌన్స్‌మెంట్లన్నీ ఆమె గొంతులోనే వినిపించేవి…”

నేను “అవును” అన్నాను.

“నాకు ఆమె వాయిస్ కావాలి…” అని అన్నప్పుడు అతని గొంతులో దుఃఖం పొంగుకొచ్చింది. రుమాలుతో మళ్ళీ కళ్ళు తుడుచుకున్నాడు. “ఆమె అందమంతా ఆమె గొంతే. ఆమె గొంతు వినే పెళ్ళి చేసుకున్నాను. నా దగ్గర ఆమె వాయిస్ లేదు. అప్పుడు రికార్డ్ చేసిపెట్టుకోవాలని తట్టలేదు. ఆమె వాయిస్ అనౌన్స్‌మెంట్లు దొరికితే ఆమే తిరిగి వచ్చినట్టు ఉంటుంది నాకు.”

“నేను చెప్తాన్లే… ఆయన వచ్చాక” అన్నాను.

లోపలికి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టాను. నేను కూడా కూర్చున్నాను.


కుంబళా, ఉప్పళా ఈ రెండూ తీరప్రాంతాన ఉండే చిన్న టౌన్లు. రెండేళ్ళకు మునుపుకూడా అవి ఎలక్ట్రానిక్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలుగానే ఉండేవి. తర్వాత మా ఈ సెంట్రల్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ క్రాస్‌బార్ టెక్నాలజీకి మారినప్పుడు ఆ చిన్న టౌన్ల ఎక్స్‌ఛేంజీలు మాతో కలిపేసి ఒకే టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్‌గా చేసేశారు.

పాత ఎలక్ట్రానిక్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలను టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలు అనడమే సరికాదేమో. కొంచం పెద్ద సైజు సూట్కేసులు. అంతే. మహా అంటే ఒక యాభై నెంబర్ల వరకు కలపవచ్చు. కానీ అవి యాభై ఏళ్ళ నాటి స్ట్రౌజర్ ఎక్స్‌ఛేంజీల కంటే సాంకేతికంగా అభివృద్ధి చెందినవే. అంతా ఆటోమేటిక్. మనుషుల చేతులకు పనిలేదు వాటిలో.

కుంబళా, ఉప్పళా, మంజేశ్వరం, నీలేశ్వరంతో మొదలుపెట్టి ఎనిమిది ఎలక్ట్రానిక్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలను అప్‌గ్రేడ్ చేసి మా సెంట్రల్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్‌కు తీసుకొచ్చి కలిపేశారు. ఇప్పుడు ఆ చిన్న టౌన్లలో ఒకే ఒక్క లైన్‌మెన్‌ మాత్రమే ఉంటాడు. ఒకే ఒక గది ఉన్న చిన్న భవనం. పొద్దున్నే ఆఫీసు తెరుచుకుని కూర్చోవాలి. ఎవరైనా ఫోన్ పని చెయ్యలేదని కంప్లయింట్ చేస్తే నెంబర్లు రాసుకుని ఇక్కడికి పంపించేస్తే పని అయిపోతుంది. ఇతర లైన్‌మెన్‌లతో పేకాడుకోవచ్చు, రాత్రిపూట మందుకొట్టి పడుకోవచ్చు.

ఎలక్ట్రానిక్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ అనగానే అదేంటో తెలుసుకోవాలని చాలా ఉత్సాహం ఉండేది. ఇది అత్యాధునిక జపనీస్ టెక్నాలజీ. స్ట్రౌజర్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ అనలాగ్ టెక్నాలజీ. ఎలక్ట్రోమేగ్నెటిక్ విధానంతో పనిచేస్తుంది. పాతబడిపోయిన జర్మన్ టెక్నాలజీ.

“ఎద్దుల బండిపై రాకెట్‌ను ఎక్కించుకు పోతున్న ఒక ఫొటో చూశాను. అలా ఉంది ఇది” అన్నాడు కామ్రేడ్ నందకుమార్. “ఇదంతా రష్యాలో వచ్చి ఇప్పటికే ఇరవై ఏళ్ళయింది.”

అయితే ఎనిమిది ఎలక్ట్రానిక్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలు అన్నీ ఒకే ఆటోలో రావడంతో గాలి తీసినట్టు అందరికీ చప్పగా అయిపోయింది. “ఈ ఎనిమిది పెట్టెలా ఒక టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్? విడ్డూరంలా ఉందే!” శ్రీధరన్ అన్నాడు.

“రేయ్, ఇది ఒకటి కాదు. ఎనిమిది టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలు” మేడమీదనుండి టెక్నీషియన్ థామస్ అన్నాడు.

శ్రీధరన్ నోరెళ్ళబెట్టాడు.

అప్పటి ఎస్.డి.ఇ. జోసెఫ్ కాట్టుక్కారన్ గొప్ప పనిమంతుడు. మేనేజ్‌మెంటులో అటూ ఇటూ ఉన్నప్పటికీ, సాయంత్రం అయ్యాక రెండు లార్జీలు లోపలికి వెళ్ళగానే సోషలిజం మాట్లాడి ఊదరగొట్టినప్పటికీ, టెక్నికల్ విషయాలు నేర్చుకోవడంలో మహా గట్టోడు. ఎనిమిది టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలను అతను ఒంటిచేత్తో ఇన్‌స్టాల్ చేశాడు.

ఎనిమిదిట్లోనూ ఆటోమేటిక్ వాయిస్ అనౌన్స్‌మెంట్ మెసేజీలు మనుషులతో చెప్పించి రికార్డ్ చేసి పెట్టొచ్చు. అప్పటివరకు మా టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలోని అన్ని సందేశాలకూ టోన్ శబ్దాలే ఉండేటివి. ఎంగేజ్ టోన్, బిజీ టోన్, ఫాల్ట్ టోన్ ఇట్లా అన్నిటికి వివిధ టోన్‌లతోనే ‘కనెక్షన్‌లు లేవు’, ‘అన్ని కనెక్షన్‌లు ఉపయోగంలో ఉన్నాయి’, ‘కాల్డ్ నంబర్ తీసుకోలేదు’ వంటివి సూచించబడేవి. కానీ ఎలక్ట్రానిక్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలలో అసలు మానవ స్వరంలో ‌వివిధ మెసేజీలను వినిపించగలం అన్నది చాలా ఆశ్చర్యం కలిగించింది.

ఎస్.డి.ఇ. జోసెఫ్ కాట్టుక్కారన్ వాయిస్ శాంపుల్స్ కోసం మా ఆఫీసులో ఆడిషన్లు మొదలుపెట్టాడు. ఈ అవకాశం ఆడవాళ్ళకు మాత్రమే. వారు ఒక్కొక్కరూ వెళ్ళి వారి వాయిస్‌లను రికార్డ్ చేసి వచ్చారు. అందగత్తె, కర్ణాటక సంగీత గాయని అయిన పాలక్కాడు దుర్గా అయ్యర్ వాయిస్ ఎంపిక అవుతుంది అని మేమందరం నిర్ణయించేసుకున్నాము. కానీ శాంతి వాయిస్ ఎంపికైంది.

మేము శాంతిని ఎప్పుడూ పట్టించుకుని ఎరగము. ఆమెకు పిల్లి కళ్ళు, బక్కపలచగా ఉండే శరీరం, వెనుకా ముందూ ఏమీ లేవు. పాలమీగడ ఛాయ, కానీ అందమైన ముఖం అని చెప్పలేం. పళ్ళ మధ్య సందులుండటం వల్లే ఆమె అందంగా అనిపించదు అని నాకు తర్వాత తెలిసింది. ఆమె ఎప్పుడూ, ఏమీ మాట్లాడేది కాదు. ఆమె పిచ్చాపాటీ కబుర్లలో మాట కలపదు, ఎందులోనూ జోక్యం చేసుకునేది కాదు. ఆమె మా ఆఫీసులో పని చేస్తుందన్న విషయమే ఎప్పుడోగానీ గుర్తుకు రాదు. పై అధికారులకైతే ఆమె పేరే గుర్తుండేది కాదు.

ఆమె వాయిస్‌ ఆడిషన్‌కి వెళ్ళలేదు. సీనియర్ సూపర్‌వైజర్ మాణిక్యవల్లిగారు అమ్మాయిలందరూ వెళ్ళాల్సిందేనని చెప్పి, ఎర్రటి పెన్నుతో ఆ చిన్న లిస్ట్‌లోని పేర్లను టిక్ చేశారు. ఆ లిస్టు చూసి మళ్ళీ శాంతిని గట్టిగా అదిలించి మరీ వెళ్ళిరమ్మని చెప్పారు. ఆమె బెరుకుగా, ఇబ్బందిపడుతూ గోడ పక్కనే పాకే చిట్టెలుకలా వెళ్ళింది.

తన గొంతును ఎంపిక చేశారన్న విషయాన్ని శాంతి అసలు నమ్మలేదు. వాళ్ళు తనని గేలి చేస్తున్నారేమో అనే అనుకుంది. “నిజంగా నీ గొంతే… నమ్ము” అన్నాను. కన్నీళ్ళతో నిండిపోయి ఏడుస్తున్న ఆమె కళ్ళు మెరిశాయి. సాయంత్రం ఎస్.డి.ఇ. జోసెఫ్ కాట్టుక్కారన్ స్వయంగా వచ్చి ఆమెకు చెప్తేగానీ నమ్మకం కలగలేదు. బల్లమీద తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

ఆమె గొంతు ఎంత మధురంగా ​​ఉందోనన్నది ఫోన్‌లో వినిపించినప్పుడే మాకు తెలిసొచ్చింది. తియ్యటి స్వరం. “వాట్ ఎ వాయిస్! వాట్ ఎ వాయిస్! ఎస్. జానకి ఏం చెయ్యాలి?” అని ఎస్.డి.ఇ. జోసెఫ్ కాట్టుక్కారన్ చాలాసార్లు చెప్పాడు. దుర్గ కూడా “నీది మంచి గాత్రం, శాంతి! నువ్వు సంగీతం నేర్చుకోలేదా?” అని అంది. “మా నాన్నకి అలాంటివేం ఇష్టం ఉండవు” ఆమె నేలకేసి చూస్తూ సమాధానం చెప్పింది.

అలా ఎక్కడినుంచో శాంతి గొంతు వినడం మాకు సరదా. “అన్ని లైన్‌లు ఉపయోగంలో ఉన్నాయి” అని ఆమె గొంతు చెవిలో వినిపిస్తుంటే “నోరు మూసుకో” అని మేము ఆట పట్టించేవాళ్ళం. శాంతి చేతిని నోటికి అడ్డం పెట్టుకుని నవ్వుకునేది.

ఆమెకు కూడా ఆమె వాయిస్ మీద చెప్పలేనంత పిచ్చి ప్రేమ వచ్చేసింది. ప్రతిరోజూ ఆమె తన గొంతును చాలాసార్లు వింటూ ఉండేది. అలా వినడంకోసమే ఉప్పళా, కుంబళా లాంటి ఊర్లకు అవసరం లేకుండా ఫోన్ చేస్తుండేది.

హఠాత్తుగా ఒక రోజు వచ్చి ‘నాకు పెళ్ళి’ అని సిగ్గుపడుతూ శుభలేఖలు పంచినప్పుడు ఆమె కొంచెం అందంగా మారిపోయినట్టు కనిపించింది. కొప్పల్లో పెళ్ళి. మంగళూర్లో రిసెప్షన్. పెళ్ళికి, రిసెప్షన్‌కి వెళ్ళి వచ్చినవాళ్ళు ఆమె భర్త చాలా అందగాడు అని చెప్పారు. శాంతి కంటే చాలా అందంగా ఉన్నాడు అంది గీతా శెనాయ్.


రాఘవన్ చిటపటలాడే మొహంతో లోపలికి వచ్చారు. కృష్ణ భట్ మాట్లాడటం ప్రారంభించక ముందే, “చూడండి, నేను మీకు ఇదివరకే చెప్పాను. అసలు కుదరదు. మేము అన్నింటినీ స్క్రాప్ చేసేశాము. ఆ రికార్డ్ బిట్‌లు ఎక్కడా లేవు, దొరకవు! అలా దాచి ఉంచే పద్ధతి కూడా లేదు” అన్నారు.

నేను “ఇక్కడేవైనా…” అని చెప్పబోయాను.

“మీరేం మాట్లాడుతున్నారు? మనదగ్గర ఆ అనౌన్స్‌మెంట్ బిట్‌లెక్కడ దాచామని? మీకు తెలియదా? మనం కండెమ్డ్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలను డిస్‌మాంటిల్ చేసి పంపించేస్తాం కదా? అవి ఇప్పుడు ఎక్కడా లేవు. వాటిని అప్పుడే పగలగొట్టేసుంటారు. వాటిని వేలం వెయ్యడానికి వీల్లేదు. కచ్చితంగా పగలగొట్టాల్సిందే. లేకపోతే మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకుండే సవాలక్ష పనుల్లో నేను వాటికోసం ఎక్కడ వెతకాలి? ఈ విషయాన్ని అధికారికంగా లేఖ రాసి అడగ్గలమా ఏంటి?”

“కానీ…”

“వీల్లేదు, అంతే. వెళ్ళొచ్చు.”

నేను లేచాను. అతను కూడా లేచాడు. బయటకు వస్తూ ఏడుస్తున్నాడు.

నేను, “ఏడవకు. ఎక్కడో ఒకచోట ఉంటుంది. ఈ టెలిఫోన్ ఒక మహా పెద్ద వల. ఎక్కడో ఒకచోట కచ్చితంగా ఉంటుంది. ఎక్కడున్నా వెతికి పట్టేయొచ్చు. కొంత టైమ్ పడుతుందంతే. నేనే వెతికి పట్టుకుని నీకు ఇస్తాను” అన్నాను.

ఏడుస్తూనే తలూపాడు.

కాసిన్ని మంచి మాటలు చెప్పి ఓదార్చి అతన్ని పంపించి స్విచ్ రూమ్‌కు వెళ్ళాను. విషయం చెప్పగానే శీల, గీత షాక్ అయ్యి కాసేపు బాధపడ్డారు.

దుర్గ, “రాఘవన్ చెప్పింది నిజమే. ఆ వాయిస్ ఇప్పుడు ఎక్కడా లేదు… క్రాస్‌బార్ టెక్నాలజీ కూడా పోయింది. నెక్స్ట్ జెనరేషన్ డిజిటల్ ఎక్స్‌ఛేంజీలు వచ్చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఎక్స్‌ఛేంజ్ అన్నదే ఒక పాతపడిపోయిన జోక్. అది ఎక్కడా ఉండదు” అంది.

“నేను వెతుకుతాను” అన్నాను.

“నీకు వేరే పని లేదా?”

“వెతికి చూద్దాం… గుర్రం ఎగరావచ్చు” అన్నాను.

అప్పటికే వాళ్ళు నన్ను పిచ్చోడిలానే చూసేవాళ్ళు. కాబట్టి నేను వెతకడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు.

నేను ప్రతిరోజూ రెండు గంటలు భారతదేశంలోని అన్ని చిన్న టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలకు ఫోన్‌లు చేశాను. అన్ని చోట్లా క్రాస్‌బార్ టెక్నాలజీ ఎక్స్‌ఛేంజీలే ఉన్నాయి. వాటన్నిటికీ వాయిస్ రికార్డు ఢిల్లీలోనే చేశారు. యావత్ భారతదేశానికి ఒకే వాయిస్.

నాలుగైదు రోజుల్లో భారతదేశంలోని వివిధ పట్టణాల పేర్లను వినడం నాకు ఆసక్తిని కలిగింది. నేను టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ డైరెక్టరీ ముందేసుకుని వెతుకుతూ ఉన్నాను. దానికి నైట్ షిఫ్ట్ అనుకూలంగా ఉంటుంది. రాత్రుల్లో కాల్స్ పెద్దగా ఉండవు. నేను, మరొకతను మాత్రమే ఉండేవాళ్ళం డ్యూటీలో. ఆ నిశ్శబ్దమూ ఏకాంతమూ ఆహ్లాదాన్ని నింపే ఆ రాత్రి వేళల్లో, నక్షత్రాలు నిండిన ఆకాశంలో శాంతి స్వరం కోసమై నా అన్వేషణ హాయిగా సాగుతుండేది.

ఒకరోజు తోటాన్‌గారు వచ్చారు. ఆ రోజు ఆయనకు పగలు డ్యూటీ లేదు. మామూలుగా ఆయనకు నైట్ షిఫ్ట్ వెయ్యరు, ఆ రోజు రూస్టర్ తయారీలో ఏదో తప్పు జరిగినట్టుంది. ఆయన టేబుల్ దగ్గర్నుండే నాతో “జీరో ఇవ్వు” అన్నారు.

ఈ రోజు నా బుర్ర తినేస్తాడు ఈయన అని అనిపించింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. “తోటాన్‌గారూ, వచ్చి ఇక్కడ కూర్చోండి. ఇక్కడ నా కోసం ఒకటి వెతికి పెట్టండి” అన్నాను.

“ఏంటి?”

“ఈ హెడ్‌సెట్‌ చెవులకు పెట్టుకోండి. ఈ రంధ్రాలకు ఈ వైర్‌ను కనెక్ట్ చేయండి. వాయిస్‌లు వినాలి. ఇందులో శాంతి గొంతు వినిపిస్తే నాకు చెప్పండి.”

“శాంతి గొంతా?”

“అవును.”

“ఆమె ఎక్కడ ఉంది?”

“తోటాన్‌గారూ, ఆమె వాయిస్ ఈ ఫోన్ నెట్‌వర్క్‌లో ఎక్కడో ఉంది.”

“ఎక్కడ?”

“ఎక్కడో!”

ఆయన తనకు తానే “ఎక్కడో!” అని చెప్పుకున్నారు.

నేను ఆయనకు వరుసగా అన్ని నెంబర్లనూ ఎలా చూడాలి అని నేర్పించాను. ఆయన వెతికి పట్టుకోలేకపోయినా, అందులో మునిగితే నా బుర్రతినకుండా ఓ చోట గమ్మున ఉంటారు కదా అని అనుకున్నాను.

కానీ తోటాన్‌గారు ఆ పనిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఊపిరి పీల్చుకుంటూ కూర్చుని గొంతు కోసం వెతకడం మొదలుపెట్టారు. పలకమీద అక్షరాలు రాస్తున్న పిల్లాడిలా నోరు తెరిచిపెట్టుకు కూర్చుని రాత్రంతా వెతుకుతూ ఉన్నారు.

ఉదయం ఆఫీసు నుండి వెళ్ళేప్పుడు ఏమీ మాట్లాడలేదు. కానీ నాలుగు రోజుల తరువాత, ఒక రోజు నేను పగటిపూట ఆఫీసుకి వెళ్ళినప్పుడు, తోటాన్‌గారు బోర్డు దగ్గర కూర్చుని, హెడ్‌సెట్ ధరించి, శ్రద్ధగా కూర్చుని తీవ్రంగా పని చేసేస్తున్నారు.

“వాయిస్ కోసం వెతుకుతున్నారు” కరుణాకరన్ కన్నుగీటాడు.

నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చుని “మీకు ఏమైనా దొరికిందా?” అన్నాను.

“చాలా గొంతులు…” అన్నారు. “చాలామంది ఆడవాళ్ళవి. వేలల్లో! అన్ని స్వరాలూ ఆకాశంనుండి వస్తున్నాయి. అనేక స్వరాలు భూమినుండి ఆకాశానికి వెళ్తున్నాయి.”

“అవును” అన్నాను.

ఆయన ఆత్రుత నిండిన కళ్ళతో నా వైపు చూస్తూ, “భూమి నుండి ఆకాశానికి వెళ్ళే స్వరాలకంటే ఆకాశంనుండి వచ్చే స్వరాలే ఎక్కువ!” అన్నారు.

“నిజంగానా?”

“ఆకాశంలో శాంతి స్వరం ఉంది…”

“అవును” అన్నాను. అతని ఈ కొత్త లోకంలోకి ప్రవేశించడం ఇష్టం లేక నేను లేచి, “నేను వెళ్ళొస్తాను, తోటాన్‌గారూ!”

“ఆక్కడే ఆకాశంలో లిజ్జీ స్వరం కూడా ఉంది. లిజ్జీ! అక్కడ! పైన!” తోటాన్ చేయి పైకి చాపారు.

నేను ఆశ్చర్యపోయాను. నేను మిగిలినవాళ్ళకేసి చూశాను.

దుర్గ, “పద్దాకా ఇదే అంటున్నారు!” అంది.

లిజ్జీ తోటాన్ భార్య. ఒకసారి వాళ్ళిద్దరూ కణ్ణూరు నుంచి మొపెడ్ మీద వస్తుంటే కారుకు దారి ఇవ్వబోతూ బైక్ స్కిడ్ అయ్యి రోడ్డుమీద పడ్డారు. వెనుక వచ్చిన ఒక బస్ లిజ్జీ తలపై ఎక్కేసింది. ఇది జరిగి ఇప్పటికి పద్దెనిమిదేళ్ళయింది.

నేను అప్పుడు ఆఫీసునుండి తిరిగి వెళ్ళేప్పుడు నేను ఆయన్ని తప్పుగా ఉసిగొల్పానా అని నాకు అనుమానం కలిగింది. కానీ మరో మార్గం లేదు. స్ట్రౌజర్ ఎక్స్‌ఛేంజ్ డయల్‌టోన్ యుగం ముగిశాక ఆయన మనసు ఏకాగ్రతకి, కుదురుకోడానికి ఇది ఎంతగానో సాయపడుతోంది అనిపించింది.


నాకు రాత్రి షిఫ్ట్ అలవాటయిపోయింది. రాత్రి ఏకాంతం నచ్చింది. రాత్రిపూట వినిపించే మనుషుల గొంతులు వింతగా ఉంటాయి. గంధర్వులు నిజంగా మనుషులతో మాట్లాడాలంటే వాళ్ళు ఈ ఎలెక్ట్రోమేగ్నెటిక్ వేవ్స్‌లోకి చొచ్చుకుపోవాల్సిందే. ఫోన్లలోకి వచ్చి మాట్లాడాల్సిందే.

నేను శాంతి వాయిస్ కోసం వెతకడం తాత్కాలికంగా ఆపేశాను. దానికి బదులుగా రాత్రిపూట టెలిఫోన్ సిగ్నల్స్‌లో వివిధ శబ్దాలు వచ్చి కలిసిపోవడాన్ని నేను గమనించసాగాను. ఎక్కువగా ఎక్కడెక్కడివో రేడియో సిగ్నల్స్. శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా రేడియోలు. మరెన్నో హామ్ రేడియోలు. పోలీసు వైర్‌లెస్‌లు. మిలిటరీ వైర్‌లెస్‌లు. ఇరాన్ రేడియో కూడా ఒకసారి వివిపించింది. తరచుగా అస్పష్టమైన, అర్థంకాని మాటలు కూడా. అప్పుడప్పుడు గుసగుసలు, ఏడుపులు, కేకలు, గద్దింపులు.

“ఎవరూ?” అని ఒక గొంతు అదిలించేది, “నన్ను వదిలేయకండి” అని ఒక ఆడగొంతు ప్రాధేయపడేది. “ఇదెక్కడ విడ్డూరం!” ఒక వృద్ధుడు ఆశ్చర్యపోయేవాడు. మరో చోట హార్మోనియం మీద వేళ్ళు నర్తిస్తాయి. మరో గొంతు ‘నన్ను కాదని ఇక్కడ ఏమీ జరగదు’ అని ఒక స్వరం గర్జించేది.

నిజానికి ఈ సిగ్నల్స్ ఏవీ కూడా వాటికి నిర్ణయించిన పరిమితులు దాటి మరో దానితో కలిసిపోకూడదు. అవన్నీ డి.ఎన్.ఎ. హద్దుల్లాగా ఒక్కోటీ ఒక్కో అలవరుసకు చెందినవి. కానీ అప్పటికి ఆ టెక్నాలజీలో పరికరాలంత కచ్చితమైన బేండ్‌విడ్త్ పరిధిలో ఒదిగిపోయి ఉండేవి కావు. ట్యూనింగ్ ఎర్రర్స్. ఇంకో అలవరుసలోకి చొచ్చుకు పోయినప్పుడు అంతా కలగాపులగంగా అయ్యి పెద్ద తేనెటీగల గుంపులా చెదిరిపోతుంది. రకరకాల శబ్దాలు, స్వరాలూ ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయి చెదిరిపోయేవి.

ఒకదానికొకటి కోసుకుంటున్న, ఒరుసుకుంటున్న రేజర్ బ్లేడ్‌ల లాగా గీకినట్లు అనిపించేవి ఆ గొంతులు నాకు. రేజర్ బ్లేడ్‌లే రెక్కలుగా పొందిన సీతాకోక చిలుకలు వేల సంఖ్యలో ఎగురుతున్న చీకటి ఆకాశం. అనంతమైన ఆకాశం. చనిపోయినవాళ్ళు, ఇంకా పుట్టని వాళ్ళూ ఉన్న శూన్యప్రదేశం.

ఆకాశం భూమికి మాత్రమే చెందినది కాదు. కోట్లాది ఆకాశాలు. అన్నిటి నుండి వచ్చే అసంఖ్యాకమైన సంకేత కిరణాలు, అలల రూపంలో. ఆకాశం అన్నది అసంఖ్యాక కిరణాలు ఐక్యమయ్యి ఎగసిపడుతున్న అలవరుసల సముద్రం. వాటిలో ఒకటే శబ్దం. ఒక కిరణాన్ని మరో కిరణంగా మార్చవచ్చు. కంటికి కనబడని అలలరూపమే కిరణాల భాష.

ఒక అలవరుస నిర్మాణాన్ని మరో నిర్మాణానికి మార్చవచ్చు. ఆ మార్పిడి చేసే మాయారూపమే టెలిఫోన్. శబ్ద తరంగాలను విద్యుత్తరంగాలుగా మార్చి, మళ్ళీ శబ్ద తరంగాలుగా మార్చవచ్చని గ్రామ్‌బెల్ కనుగొన్నాడు. అంతుచిక్కని అనంతాకాశపు వీధుల్లో ఒకదాన్ని కళ్ళెమేసి ఒడిసి పట్టుకున్నాడు. మూసివున్న వేల తలుపుల్లో ఒక్క దానిని తెరిచాడు.

ఆ తర్వాత ఎన్ని తలుపులో! అప్పుడే ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ వస్తూ ఉండేది. ఇది శబ్ద తరంగాలను విద్యుత్తరంగాలుగా చేసి, విద్యుత్తరంగాలను కాంతి తరంగాలుగా మార్చి రోమపరిమాణంలో ఉండే సన్నటి గొట్టాల ద్వారా పంపిస్తుంది. అవి మళ్ళీ విద్యుత్తరంగాలుగా మారి, శబ్ద తరంగాలయ్యి, మాటలుగా, అర్థాలుగా, భావాలుగా మారి చెవులకు చేరుతాయి.

అన్ని రకాల కిరణాలూ ఆకాశంలో ఉన్నాయి. అ‌వి నిర్విరామంగా ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఒకచోటి నుంచి మాయమైతే మరో చోటికి వెళ్తున్నాయని అర్థం. అన్నీ సాగిపోతూనే ఉన్నాయి. వెళ్ళే దిశ అనంతం. గగన స్థలం కాబట్టి అవి వాటి రూపంతో, వాటికి నిర్దేశించబడిన వేగంలో నిర్విరామంగా వెళుతూనే ఉంటాయి.

ఇక్కడ వినిపించే అన్ని స్వరాలూ ఆకాశంలో తిరుగుతూనే ఉన్నాయి. కొన్ని స్వరాలు కోట్లాది కిలోమీటర్లు ప్రయాణించేసి ఉంటాయి. అర్జునుడి స్వరం, కృష్ణుడి స్వరం పాలపుంతలను దాటి వెళ్ళిపోయుండచ్చు ఇప్పుడు. బుద్ధుని స్వరం, గాంధీ స్వరం వాటిని అనుసరిస్తూ ఉంటాయి. శాంతి స్వరం, లిజ్జీ స్వరం, ఇంకా పేరులేని కోట్లాది మంది ప్రజల స్వరాలు.

అవతల నుండి వేరే స్వరాలు కూడా ఇటు రావచ్చు. మేము పరిచి పెట్టిన టెలిఫోన్ లైన్ల చిన్న సాలీడు వలను అవి కంపింపజేస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు కలగాపులగంగా మారిపోయి గందరగోళంగా వినిపిస్తున్న ఈ శబ్దం సుదూర ప్రాంతంలో ఎక్కడో నాకు తెలియని ఆత్మది అయుండొచ్చు. బహుశా దాని అంతులేని దుఃఖం కావచ్చు.

ఒక పట్టణంలో రాత్రిపూట ఒకే ఒకడు మాత్రమే మేల్కొని ఉండటం కంటే పిచ్చేక్కించేది మరోటి లేదు. ప్రతి ఆలోచనా పిచ్చితనపు అంచును గట్టిగా మోదుకుని అంతే వేగంగా వెనుతిరుగుతుంది.


ఒకరోజు తోటాన్ నన్ను చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ పగటి పూట, నేను పనిలో మునిగిపోయున్నాను. “శాంతి… శాంతి గొంతు!” అన్నారు.

నేను ప్రశ్నార్థకంగా చూశాను. తోటాన్ ఏదో భ్రమలో ఉన్నాడని అనుకున్నాను. అయినా “ఏదీ?” అన్నాను.

తోటాన్ తన హెడ్‌సెట్‌ని నాకు అందించారు. నేను మరోసారి ఆయన డయల్ చేసిన నంబర్‌కి డయల్ చేశాను. శాంతి గొంతు “అన్ని కనెక్షన్‌లు ఉపయోగంలో ఉన్నాయి” అని వినిపించింది.

నా చేతులు వణికాయి. నేను భ్రమపడటంలేదు కదా అని అనుమానిస్తూ మళ్ళీ ప్రయత్నించాను. మళ్ళీ అదే గొంతు. ఇది మణిపూర్‌లో ఒక చిన్న ఎక్స్ఛేంజ్. నేను ఆ పేరును రాసుకున్నాను.

వెంటనే రికార్డ్ చెయ్యాలి. టేప్ రికార్డర్ కావాలి. నేను లేచి బయటకు పరుగెత్తాను. అందరూ నా వైపు వింతగా చూశారు. “శాంతి గొంతు! మణిపూర్‌లో” అన్నాను.

“నిజంగానా?”

“అవును.”

నేను బయటకు వెళ్ళి రిక్రియేషన్ రూమ్‌లో పాడుతున్న టేప్ రికార్డర్‌ని తీసుకుని వెనక్కొచ్చాను. అప్పటికే అందరూ ఆ గొంతును వినేశారు.

వెంటనే టేపులోని క్యాసెట్‌ని చెరిపేసి శాంతి వాయిస్‌ని రికార్డ్ చేశాను. అసలు దొరకనే దొరకదు అనుకున్నది దొరికింది. ఇదీ చెరిగిపోతే? నేను మళ్ళీ మళ్ళీ రికార్డ్ చేశాను. రెండు మూడు క్యాసెట్లలో రికార్డ్ చేశాను.

మణిపూర్‌లోని ఒక ఎక్స్‌ఛేంజ్‌లో తాత్కాలికంగా ఎలక్ట్రానిక్ ఎక్స్‌ఛేంజ్ మెషిన్‌ని ఉపయోగిస్తున్నట్టున్నారు. అది ఒకప్పుడు ఇక్కడ కుంబళాలో ఉండేది. దాన్ని ఢిల్లీకి పంపించారు. అక్కడినుండి మణిపూర్‌కు ఇచ్చినట్టున్నారు.

కృష్ణ భట్‌కు ఫోన్ చేశాను. కొప్పల్ పట్టణంనుండి అతని గొంతు నిస్సత్తువగా వినిపించింది.

“కృష్ణ భట్ కదా?”

“అవును.”

“నేను రామచంద్రన్ మాట్లాడుతున్నాను… శాంతి వాయిస్ దొరికింది. ఇది టేపులో రికార్డ్ చేసి ఉంచుతాను, వచ్చి తీసుకోండి.”

అవతల వైపు అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. మా టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ మొత్తం సంబరాలు చేసుకుంది. శాంతి మనిషిగా తిరిగి వచ్చినట్లు.

“పాపం శాంతి… కనీసం ఆమె గొంతు అయినా ఉంది.”

“అతను దాన్ని జీవితాంతం దాచుకుంటాడు!”

మధ్యలో బోర్డ్ రూముకేసి చూసినప్పుడు తోటాన్ మళ్ళీ బోర్డు దగ్గర కూర్చుని వెతుకుతుండటం కనిపించింది.

“తోటాన్‌గారూ, ఇంకా అక్కడేం చేస్తున్నారు? శాంతి వాయిస్ దొరికేసింది కదా?”

“లిజ్జీ వాయిస్?”

అందరూ మౌనంగా ఉండిపోయారు. నేను దుర్గకు మాత్రం వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను.

మరుసటి రోజు కృష్ణ భట్ క్యాసెట్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నా చేతులు పట్టుకుని నా కళ్ళలోకి చూస్తూ పట్టలేని ఆనందంతో గట్టిగా ఏడ్చాడు. అందరం అతనిని చుట్టుముట్టాము. అతడ్ని ఓదార్చలేకపోయాము. అతనికి కరచాలనం చేసి, భుజాలు పట్టుకుని మాటల్లేక తలవంచుకున్నాం. ఆడవాళ్ళు ఏడ్చారు. రాఘవన్‌కు కూడా కళ్ళు చెమర్చాయి. అతనికి క్షమాపణ చెప్పారు.

శాంతి గురించి ఎప్పటికప్పుడు చర్చలు తలెత్తాయి – ఒకటి రెండు వారాల్లో మెల్లగా తగ్గింది. కొన్నాళ్ళకు పూర్తిగా మరిచిపోయాం. కొన్నేళ్ళకు ఎన్నెన్నో మార్పులు, చాలామంది కొత్తవాళ్ళొచ్చారు, పాతవాళ్ళు వెళ్ళిపోయారు.

కానీ తోటాన్ మాత్రం క్రాస్‌బార్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ శబ్దాల్లోనే మునిగిపోయి ఉన్నారు. మేము దాదాపుగా ఆయన్ని పట్టించుకోవడం మానేశాము.

ఒకరోజు ఆయన ఏమి చేస్తున్నారో గమనించి చూశాను. ఆయన బోర్డు దగ్గర కూర్చుని ఒక లైన్‌లోకి ప్రవేశించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు ఈయన మాటలు వినబడవు. ఆయన వాళ్ళ మాటలు వినవచ్చు. దానికి మరో లైన్‌కి కనెక్ట్ చేశారు. ఆ రెండు శబ్దాలూ కలిసి ఆయన చెవుల్లో కేకలుగా అయ్యాయి. మరో లైనునీ కలిపారు. అది మరింత గోలగా మారింది. ఇలా పదికి పైగా లైన్‌లను కలిపినప్పుడు అది అడవిలో చిమ్మెటల శబ్దంలా వినిపిస్తోంది. అనంతమైన తరంగాల్లా నిర్విరామంగా ప్రయాణించే ఒక ఝుంకారం అయిందది.

తోటాన్ కళ్ళు మూసుకుని అది వింటూ కూర్చుని ఉన్నారు. ఆయన తల ఊగుతోంది. క్రమంగా నిశ్శబ్దంగా మారింది. ఒక పక్కకి వంగి కళ్ళు మూసుకుని నోరు తెరుచుకుని అందులో లీనమైపోయారు.

ఇప్పుడు ఇంకా ఎన్నెన్నో మార్పులు వచ్చేశాయి. ముప్ఫై ఏళ్ళలో క్రాస్‌బార్ టెక్నాలజీ పోయి డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. అంతలో సెల్‌ఫోన్ వచ్చింది. నేను టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగం మానేశాను. ఎన్నో ఊళ్ళకు మారాను.

చాలా ఏళ్ళ తర్వాత నా పాత స్నేహితుడు కరుణాకరన్‌ని కలిసినప్పుడు, “మన తోటాన్‌గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? రిటైర్ అయిపోయారు కదా?” అని అడిగాను.

“ఆయనా! నీకు తెలియదా? ఆయన చనిపోయి పదకొండేళ్ళయింది.”

ఒకరోజు బోర్డ్ ఛెయిర్‌లో గోడకు ఆనుకుని కళ్ళు మూసుకుని, నోరు తెరుచుకుని, నవ్వు ముఖంతో ఉన్న తోటాన్‌గారిని తర్వాతి షిఫ్టుకు వచ్చిన చంద్రకుమార్ తట్టి నిద్ర లేపాడు. అతను ఆయన్ని తాకగానే పక్కకు ఒరిగిపోయారట. గంట క్రితమే చనిపోయిన ఆయన దేహం చల్లబడసాగిందట.

(మూలం: వానిల్ అలైయుమ్ కురల్గళ్ , మార్చ్ 31, 2020)


జయమోహన్

రచయిత జయమోహన్ గురించి: జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు. ...