ఎవరి మీద ఎవరు
ఎందుకు యుద్ధం చేస్తున్నారో
చిక్కుముడి వీడటం లేదు
అకారణ కక్షలకు
మూలాలెక్కడ పడగ విప్పాయో
అంతు పట్టడం లేదు
మూసి ఉన్న రాజకోటల్లోంచి
బయటకు ప్రవహించే రహస్యాలు
గాలిలో వ్యాపించి గందరగోళం సృష్టిస్తాయి
క్లీన్‌చిట్ ప్రకటనలు
ప్రపంచ ఛానెళ్ళ నిండా వేళ్ళాడుతూ
వంతుల వారీగా చాటింపు వేస్తుంటాయి
పలుగులు పట్టిన
మేధావుల తవ్వకాల్లోనూ
కాలుష్యం పొర్లి ప్రవహిస్తుంటుంది
ఎవరి పల్లకీ ఎవరు
ఎందుకు మోస్తున్నారో
బోయీలకు సైతం బోధ పడదు
నెత్తికెత్తుకున్న పాపం
నిప్పుల కుంపటై కాల్చేస్తుంటే
అణ్వస్త్రాలు నిశ్శబ్దంగా వికటాట్టహాసం చేస్తుంటాయి
వీధుల్లో రక్తమోడుతున్న దేహాలన్నీ
శత్రువు ప్రేమగా పంపిన డ్రోన్ల ద్రోహాన్ని హేళన చేస్తూ
యుద్ధోన్మాదాన్ని తుత్తునియలు చేస్తూ నేలకొరుగుతాయి
మంటల మొండేలతో దూసుకొచ్చిన క్షిపణులు
ఆకాశహర్మ్యాల్ని నేలకూల్చి, మట్టిని ముద్దాడి
నేరాంగీకార పత్రాలు సమర్పిస్తుంటాయి
నిర్నిమేష హననానంతరం కూడా
లక్ష్యం తాలూకు కేంద్రబిందువు దొరక్క
గూఢచార విభాగాలు ఒక్కొక్కటే నెత్తురు కక్కుకొని చస్తుంటాయి
పీడకలల్లోంచి ఉలిక్కిపడి లేచిన దేశాలు
విదేశీ విషరసాయనాలను శుద్ధి చేసుకుంటూ
సరిహద్దుల్లో సరికొత్త కరపత్రాల పంపిణీ ప్రారంభిస్తాయి
నీటిమీదా నేలమీదా శ్వాసమీదా
ఎవ్వడూ యుద్ధం చేయాల్సిన అగత్యం లేదని
విశ్వం ఒక ప్రకటన విడుదల చేస్తుంది.