సాయం సంధ్య వేళల్లోనో
అర్ధరాత్రి ఉన్నట్టుండి మెలకువై
ఆరుబయట తిరుగుతూనో!
అప్రయత్నంగా పైకి చూసినప్పుడు…
చాన్నాళ్ళ కింద ఎటో వెళ్ళిపోయి
హఠాత్తుగా మార్కెట్‌లో కలిసిన మిత్రుడిలా
ఒరైయన్ నక్షత్ర మండలం
కనిపించి మురిపిస్తుంది!
వృషభ రాశిలో పైన మూడు
కింద రెండు మధ్యలో
అడ్డంగా మూడు నక్షత్రాలతో
కాల పురుషుడు నాలోని స్తబ్దతను
తరుముతుంటాడు!
ఓ నవమినాటి వెన్నెల
చెంపల్ని చల్లగా నిమురుతుంది!
నీలో ఏ మూలోవున్న దిగులు
తెలిమబ్బై తేలిపోతుంది!
మర్నాడెప్పుడో ఓ చీకటి సాయంత్రం వేళ
చంద్రుడింకా క్షితిజం మీదకు ఎగబాగక ముందు…
నిర్మానుష్యపు తావులలో…
ఒంటరిగా నడుస్తున్నప్పుడు…
శుక్రవంక నీలివెన్నెలలో
నీ నీడకనిపించి మనసు అంబరమౌతుంది!
పగటి వగలు మొహంమొత్తి
డాబా మీదకెక్కి ఎప్పట్లాగే
ఆకాశంలోకి దూకుతాను!
ఉత్తరాన సప్త ఋషులు
దక్షిణాన వృశ్చిక రాశుల
ప్రదక్షిణా వాలులలో
మహా ఇష్టంగా ఈదుతాను!
భయపెట్టే శని కూడా
ఓ పౌర్ణమినాటి నడిరేయి
చంద్రుడి వెనక్కు వెళ్ళి
నాతో దాగుడమూతలు ఆడతాడు!
అరుదుగా ఎప్పుడో
ఓ శుక్ల పక్షపు తొలిరోజున
నెలవంక కొనమీద శుక్రవంక
ముక్కెరయి మెరుస్తుంది!
స్తబ్దంగా కనిపించే నిశీధిలో
మనసు పాలపుంతై విరుస్తుంది!
ఉలికిపడే ఉల్కల క్షణికావేశాలు
గ్రహాల గ్రహణాల అహాల పట్టువిడుపులు
తరచి చూస్తే ఎన్ని అందాలు అర్థాలు!
నీలతారలు అరుణతారలు
ధవళతారలు జంటతారలు
వామనతారలు బృహత్తారలు
నవ్యతారలు కాలం తీరిన వృధ్ధతారలు!
నిష్ఠగా అడిగితే నిశీధి నీ మెడకు
తారాహారాలు వేనవేలు
ప్రసాదిస్తుంది!
మనకు లాగే గగనానికీ
ఓ గాంధీ1 ఉన్నాడట తెలుసా!
గాంధీ పోయినరోజు తప్ప
364 రోజులు కనిపిస్తాడట!
వింటే ప్రతిచుక్కా
ఇలాంటి కథేదో చెప్తుంది!
కథ కంచికి చేరేలోపు
విహారం కట్టిపెట్టి
ఇంటి పెట్టె తెరుస్తాను!
ఇక్కడా ఓ చిన్న
ఆకాశం దర్శనమిస్తుంది!
నా చుట్టు తిరిగే నక్షత్రంలా మావిడ!
మాబుల్లి ఉపగ్రహాలు!
ఒక్కటిలా కనిపించే
సిరియస్2 జంట నక్షత్రంలా
ఒక్క క్షణం అర్థం కాదు
ఎవరు ఎవరిచుట్టూ తిరుగుతారో!
తను లేకుండా ఈ విహరాలేంటని
అర్ధాంగి అరుణతారౌతుంది
ఉక్రోషాల ఉల్కాపాతాలు కురిపిస్తుంది!
అప్పటికి నివ్వెరపడి చిన్నబుచ్చుకున్నా…
అలకల అమావాస్యలు తీరి
మర్నాటికి మోమున
చిర్నవ్వుల నెలవంకలు
వికసించడం చూసి
మనసు మానస సరోవరం అవుతుంది!
శుక్లపక్షాలు కృష్ణపక్షాలు అలవాటై
ఇరుపక్షాల సంధ్యలలో
నేను మరోసారి ఆకాశంలోకి దూకేస్తాను!
- Gandhian Star disappears on 30th January every year, and it can be seen rest of the days. Dineb is the name of this Star it has been named as Gandhian Star in token of recognition of his service.
- Sirius is a dual star. It looks as single star to normal eyes. But with telescope it can be seen in Orion constellation.