జనవరి 2025

Issue Index Image

అమద్యాబాద్, 1 జనవరి: నూతన సంవత్సర సందర్భంగా నగరంలో తెలుగు తాగుబోతుల సమావేశం అట్టహాసంగా జరిగింది. ఎప్పణ్ణుంచో తాగుతున్నవాళ్ళు, ఇప్పుడిప్పుడే తాగడం మొదలు పెట్టినవాళ్ళు, అదుపు తప్పి తాగడం గొప్పనుకునేవాళ్ళు, అదుపు తప్పకుండా తాగడం చాతకానివాళ్ళు, తమకు తప్ప ఇంకెవరికీ తాగడం రాదనుకునేవాళ్ళు, ఏది ఎలా తాగాలో తెలియనివాళ్ళు, అసలెప్పుడూ తాగకుండానే తాగుడు గురించి మాట్లాడేవాళ్ళు అందరూ ఈ సమావేశానికి హాజరయారు. అందరూ ఒకర్నొకరు కౌగిలించుకున్నారు, ఇంతకు ముందు కౌగిలించుకున్న తాగుబోతు గురించి ఒక బూతుకూత చెప్పుకుని నవ్వుకున్నారు. సమావేశపు పెద్ద ముందుగా, తాను ఎలా ఒంటిచేత్తో తాగుడు సంప్రదాయాన్ని ఆటుపోట్లకు వెరవకుండా కొనసాగిస్తున్నాడో, ప్రతీ ఏడాది వీకెండ్ పార్టీలు పెట్టి తాగడం ఎలా నేర్పిస్తున్నాడో, తనవల్ల ఎందరు కొత్త తాగుబోతులు తయారవుతున్నారో స్మగ్వినయంగా తెలియప్రసంగించాడు. తనవంటి కొత్త తాగుబోతులను ఎవరూ ఆదరించటం లేదని, తాము ఏం తాగుతున్నామో ఎందుకు తాగుతున్నామో కాక, తాగుతున్నాం అని మాత్రమే సమాజం గుర్తించాలని, కేవలం నోటి వాసన మాత్రమే తాగుబోతు అనిపించుకోవడానికి సరిపోవాలని ఒక యువతాగుబోతు ఆవేశం ప్రకటించాడు. ఎప్పటినుంచో అమ్ముడవుతున్న ఆ కొన్ని బ్రాండుల మద్యమే ఇప్పటికీ అందరూ కొని తాగుతున్నారని, తన పెరట్లో కాచిన సారాయి ఊరికే ఇచ్చినా ఎవరూ తాగటం లేదని, ఇందులో అగ్రబట్టీల అజెండా ఉందని, చిన్నకారు సన్నకారు బట్టీదారుల తరఫున ఒక కుట్రకారు బట్టీదారు ఆరోపించాడు. కుళ్ళిపోయిన కల్లును సీమ లిక్కర్ అని నమ్మించి కొనిపిస్తున్నారన్న ఆరోపణ వినపడగానే సదరు డిస్ట్రిబ్యూటరు బస్తీమేసవాలని టేబుల్ మీదకెక్కి తొడలు చరుచుకున్నాడు. మా సారాయి మేమే కాచుకుంటాం, మేమే తాగుతాం, అంతా మా ఇష్టం అని కొందరరిచారు. మేమెలా తాగాలో మాకెవరూ చెప్పక్కర్లేదు. మేం ఏం తాగితే అదే మందు, ఎలా తాగితే అదే పద్ధతి అని మరికొందరు వంతపాడారు. ఎవరో ఉగ్గు పడితే నాలుగు చుక్కలు చప్పరించిన ఒక పిల్ల తాగుబోతు ఇప్పటిదాకా ఉన్నారని, తాగుతున్నారని ఎవరికీ తెలియని విస్మృత అనామక తాగుబోతులందరినీ సమాజం మధ్యకు తెస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మద్యపీఠ్ అవార్డు ఇక వరుసగా ప్రతీ ఏడూ తనదే అని రొమ్ము చరుచుకుని పడుకున్నాడు. అమద్యాబాద్ తాగుబోతులు ఇంకెవరినీ పట్టించుకోటం లేదు, వారిలో వారు కుమ్మక్కై సీసాలను ఇంకెవరి దాకా రానియ్యటం లేదని కొందరు ప్రతిఘటించారు. అప్పటికప్పుడే కళింగ, కోస్తా, గోదావరి, సీమ తదితర ప్రాంతీయ సంఘాలు ఏర్పరిచారు, ఆయా ప్రాంతాల తాగుబోతులందరూ గ్రూపులుగా చీలిపోయారు. ఆ తొక్కిసలాటలో, ఎక్కడి మద్యాన్నైనా షరాబ్ అనడం తమ అస్తిత్వంపై దాడి అని, అమద్యాబాద్ ప్రాంతంలో తయారయేది మాత్రమే షరాబ్ అనాలని, ఆ పదం ఇతర ప్రాంతాల వాళ్ళు వాడకూడదంటూ ఇంతలో ఒక షరాబీమియా మైకు లాక్కోబోయాడు. ఉన్నదే కొంచెం మందు, అందరం కలిసి తాగుదాం అని గొణిగిన సీనియర్ తాగుబోతులు ఒకరిద్దరిపై కొందరు ఎదురు తిరగడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. సమాజంలో ప్రతీ ఒక్కరికి ఒక చుక్క హక్కుగా రావాలని, తాగడం వెనక ఉద్దేశ్యం నిజానికి అదే కావాలని, అందువల్ల ఎవరు ఏ సీసాలో ఏది పోస్తే అదే మందు అనుకోవాలి తప్ప అది మద్యమా కాదా అని చూడకూడదని -మద్యం విలువ తెలిసి తాగే తాగుబోతులంటే పడని కొందరు -తాగుబోతు అనిపించుకోడం కోసం ఏదయినా చేయగలిగిన కొందరు తూలుతూలేచి అరిచి మళ్ళీ కూర్చోడంతో సభలో గందరగోళం నెలకొంది. పట్టుమని వందమంది కూడా లేని ఈ కోలాహలానికి దూరంగా, నిజమైన మద్యపు రుచి, నాణ్యత, విభిన్నత తెలిసిన వేలవేల మద్యప్రేమికులు ఏకాంతంలో ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు, తమ అభిరుచిని కొనసాగించుకుంటున్నారు కూడా అని విశ్వసనీయ వర్గాల భోగట్టా. (మద్యజ్యోతి, లిక్కర్ డెస్క్.)