జీవకాంతి

పొలాల్లో
నాట్లు వేస్తున్న స్త్రీలు పాటలు
పాడుతున్నారు
లెక్కతీయలేనన్ని మార్లు
గాయపడ్డ నేల
మరోమారు
పురిటి నొప్పులకు
సిద్ధపడుతోంది

పైన పోతున్న పక్షుల గుంపు
పచ్చదనాన్ని పాటగా
గూట్లోకి తీసుకెళ్తున్నాయి
పాటలు వింటున్న పీతలు
బొరియల్లో
మాగన్నుగా కునుకు తీశాయి
గెనాల మీద కూర్చున్న
కొంగల గుంపు
ఏపుగా ఎదిగిన
పైరును కలగంటున్నాయి

మేఘం
చినుకులతో
చిటికెలు వేస్తోంది
తూనీగల సంబరం
మాములుగా లేదు

నాలుగు
దిక్కుల్లోను
జీవకాంతి