రహస్యం

మొలకెత్తడానికి
తలవంచిన విత్తనం రహస్యం
వానకోసం ఆవిరయిన
సముద్రమే రహస్యం

రహస్యమే పగలు
రహస్యం రాత్రి
సంధ్య ఒక్కర్తీ
రంగులు విప్పుకున్న మయూరం

తెరిచిన పుస్తకంలో
కళ్ళు మూసిన అక్షరాలు
అక్షరాల మధ్య
గగుర్పొడుస్తున్న అర్థవిన్యాసం

కంఠంలో ఇరుక్కున్న విషం
విషాద మేఘాల కంట తడి
తెల్ల గుర్రపు తోకమీద నల్లని మచ్చ
నీళ్ళలో వదిలేసిన తల్లి రహస్యం

వేషభూషణాల రంగస్థలం మీద
తూగే మాటల శర పరంపరలో
అప్రకటిత భాష
ప్రేక్షకుడి కనురెప్పపాటులో
చెవిలో పడ్డ చేప

రహస్యానికి రహస్యం లేదు
బహిరంగంగా
అందరికీ అర్థమయ్యే భాషలోనే
ఆడిన అబద్ధం

ద్వేషగీతానికి కట్టిన బాణీ
అందరూ చూస్తుండగానే
పేలిన మందుపాతర
ఛిద్ర శరీరాల చితాభస్మమే
రహస్యం