పికిలిపిట్ట పేరు పెట్టుకుని
సముద్రాన్ని దాటి వచ్చిన
చక్రవాత వర్షపాత మొకటి
నిన్న ఆదివారం మా ఊళ్ళో
వృక్షయాగం చేసింది.
చెట్టు అన్నదాన్ని కట్టెను చేసేసి
ఊరి పచ్చదనాన్ని ఉన్నపళంగా
మున్నీట ముంచేసింది.అటూ ఇటూ చెట్లు
చెట్టు చెట్టునూ తాకుతూ కొమ్మలు
కొమ్మ కొమ్మనీ పలకరిస్తూ
సడుల, సవడుల ఆకులు
వీథి వీథీ ఊరికి
పగలు ఎండ వేళ
మువ్వల చలువ పందిరి
రాత్రి వెన్నెల వేళ
పచ్చల చాందినిగా ఉన్న
చక్కదనాన్ని ముక్కలు
ముక్కలు చేసి మా మొహాల మీదకు
విసిరేసింది.ఆంధ్ర విశ్వకళాపరిషత్ విద్యారణ్యం
అడితిగా మారిపోయిన వైనం
మీకు తెలుస్తోందా!
అక్కడి ఱంపపు కోత మోత
మీకు వినిపిస్తోందా!