కావ్యాన్ని ముక్కలు చేసి
చిదిమేయకు
చలిమంటలో పడేయకు
ఏ వాక్యంలో
ఏ విస్ఫోటనం ఉందో!
తెల్లారిందని
దీపం ఆర్పేయకు
ఆకాశం నిండా
నల్ల నల్లని మబ్బులు
సూర్యుణ్ణి మింగేసిన చీకటి
మొదటి మెట్టు ఎక్కేనని
సంబరపడకు
ఇది నిచ్చెనల వ్యవస్థ
బంగారం పండిందని
బోర విరుచుకోకు
దళారీలకి
ధర ఎప్పుడు పడేయాలో
వెన్నతో పెట్టిన విద్య
మాటలతో ఉచ్చులు
బిగించే వాళ్ళు
అంతా నీ కోసమే అని
రోజూ మిద్దెక్కి కూసే
దొంగ కోళ్ళు
రహస్యాలన్నీ
పంచేసుకోకు
తీపి వలల్లో
జారిపడకు
ముడి విప్పుకుని
తప్పుకునే
చిట్కా ఎప్పుడూ
మరచిపోకు
పద్యాన్ని వెలకట్టి అమ్మేయకు
ఎప్పటికైనా పనికొస్తుంది
తాటాకు చూరులో
తాళపత్రం మీద కవితలా
ప్రాణాల్ని రక్షిస్తుంది