శిశిర చిత్రాలు

లోతుగా
పాతుకు పోయిన వాటిని
చేతులతో పెకలించే కన్నా
కలిసిన రోజుల
రంగురంగుల
జ్ఞాపకాల ఆకులను
పెళుసు కొమ్మలతో
దులుపు కోవడమే
మేలు.


గుమి గూడిన ఆకులను
ఎగుర గొట్టి
గిరగిరా తిప్పి
నేల రాలుస్తుంది
సుడిగాలి.


గాలి వీచినప్పుడల్లా
పసిపిల్లల్లా
రోడ్డుకటూ ఇటూ
పరుగులు తీస్తాయి
రాలిన ఆకులు


ఎండిన చెట్టును
అంటి పెట్టుకొనే ఉంది
పండిన ఆకు
వెండిలా వెలిగే పగటి ఎండ-
ఉండుండి వీచే గాలి
వేచి చూస్తోంది.


చుట్టూ
ఆకులను రాల్చుకొని
మిగిలిన రంగుల ఆకులతో
గుట్టుగా రోజులు
నెట్టుకొస్తోంది
సంసారి చెట్టు.


తేమతో కూడిన పిల్లగాలి
ప్రేమగా వీచినా అసలు
ఆకులు రాల్చనంది
సోమరి చెట్టు:
లేత ఎండలో
అల్లాడుతూ
వెలిగిపోయే
పసుప్పచ్చ ఆకులు.


అన్ని ఆకులు రాల్చిన చెట్టు :
నిలువు గుబురు కొమ్మలను
వెలిగిస్తుంది వెన్నెల
నీ దిగులు జ్ఞాపకాల్లా…


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...