[భారతీయ పరిచయక్రమం అన్న శీర్షిక కింద సూరపరాజు రాధాకృష్ణమూర్తి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. అందులో మొదటిది – అస్తిత్వవాద సాహిత్యం. ఈ పుస్తకంలో కీర్కెగాడ్, దోస్తోయెవ్‌స్కీ, నీచ, పిరాన్దెల్లో, కాఫ్కా, హైడెగర్, సార్త్ర, కామూ పరిచయం చేయబడ్డారు. అదే వరుసలో తిరిగి ఈమాటలో వ్యాసాలుగా పరిష్కరించి ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకపు ముందుమాట ఇక్కడ చదవండి.]
కీర్కెగాడ్ వచనాలు:
– మనది అవగాహనాయుగం. ఆలోచనే కాని, ఆర్తి లేదు. (Two Ages: A Literary Review.)
– శ్రద్ధ మనిషిలో ఉండదగిన అత్యుత్తమ ఉద్వేగం.
– నాకు మాత్రమే సత్యమైన సత్యాన్ని నేను కనుగొనాలి. (Journal entry, Gilleleie: 1 August 1835)
– మంద అసత్యం.
– నమ్మకం కలగడం అంతకష్టం ఎందుకంటే, నమ్మింది చేయడం అంతకష్టం కనుక.
జీవితం
సోరెన్ ఆబీ కీర్కెగాడ్ (Søren Aabye Kierkegaard; డేనిష్ ఉచ్చారణ: కీర్-గె-గార్) 5 మే, 1813 జననం. తండ్రి మైకెల్ కీర్కెగాడ్ గొర్రెలకాపరి. ఒక రోజు ఒళ్ళు మండి దేవుణ్ణి తిట్టాడట తన పేదరికానికి. అది అతడి జీవితంలో మొదటి పాపం. దేవుణ్ణి తిట్టిన తరువాత (తిట్టినందువల్ల కాకపోవచ్చు!) మైకెల్ సంపన్నుడైనాడు. ఎంత సంపన్నుడంటే, డెన్మార్క్ దేశపు రాజు తన ఇంటికి విందుకు వచ్చేవాడట! అతడి మొదటి భార్య జబ్బుపడి ఉండిన చివరి రోజులలో, ఇంటి పరిచారికను మైకెల్ గర్భవతిని చేశాడు. ఇది రెండవ పాపం! ఆ తరువాత మైకెల్ ఆమెను (Anne Lund Kierkegaard) వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న తరువాత కూడా, మైకెల్‌కు తను పాపం చేశానన్న భావం యావజ్జీవము వెంటాడుతూనే ఉండింది.
వారికి ఏడుగురు పిల్లలు. సోరెన్ ఏడవ సంతానం. పాపభావం వలన మైకెల్ తన పిల్లల పట్ల ధార్మికకాఠిన్యంతో ప్రవర్తించేవాడు. తన పాపం వలన తన పిల్లలు ఆయుష్మంతులు కారని గట్టిగా నమ్మేవాడు. అలాగే జరిగింది కూడా. సోరెన్ కీర్కెగాడ్ నలభైరెండు సంవత్సరాలు మాత్రమే జీవించాడు. సంక్రమించిన పాపచింతతో, అల్పాయువునన్న భయంతో, రెండు చేతులతో అన్నట్టు పాతిక గ్రంథాలు రాశాడు. (తండ్రి సంపన్నుడు కనుక, తన పుస్తకాలు తానే అచ్చు వేసుకున్నాడు.) ఆ రచనల్లో ప్రధానవిషయం, తాను, తన తండ్రి, తను ప్రేమించి పెళ్ళి చేసుకోని రెజీనా. తమ పెళ్ళి నిశ్చయమైన తరువాత, ఆ నిశ్చయాన్ని భంగం చేసుకున్నాడు కీర్కెగాడ్. ఆమె దోషం (కుజదోషం లాంటిది) ఏమీ లేదు. ఎందుకు భగ్నం చేసుకున్నాడో తనకు తాను చెప్పుకున్న సమాధానమే అతని సమస్తరచనల ప్రధాన విషయం అంటారు. అతడు పైకి చెప్పిన కారణం, అది దైవాజ్ఞ అని. కాని తనకు దైవమందు శ్రద్ధ లేకపోవడం కారణమని కూడా అన్నాడు! (If I had faith I would have remained with Regina.) ఈ విధమైన ద్వైవిధ్యం అతని రచనలనంతా నిండి ఉంటుంది. తండ్రి ఆధిపత్యం మరో ప్రధానవస్తువు అతని రచనల్లో. తన ప్రసిద్ధ రచన ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్‍లో (Fear and Trembling) అబ్రహాం తన కొడుకును బలి ఇచ్చినట్టే తనను తన తండ్రి బలి ఇచ్చాడని కీర్కెగాడ్ అంతరంగంలో అవ్యక్తంగా నిలిచి ఉండిన భావం. (ఈ తండ్రి ఆధిపత్యం కాఫ్కా, నీచ రచనలను కూడ పూర్తిగా ఆవహించిన విషయమే.) వ్యక్తిగత సంఘర్షణను మనిషి సంఘర్షణగా మార్చగలిగాడు కనుకనే ఇవి మనకు చదవవలసినవి అయినాయి.
ప్రేమనుండి పారిపోయి బెర్లిన్ యూనివర్శిటీలో హెగెల్ తత్త్వశాస్త్రంపై తరగతులకు వెళ్ళాడు. అక్కడ ఎంగెల్స్ (Engels), లుడ్విగ్ ఫ్యూర్‍బాక్ (Ludwig Feuerbach) అతని సహాధ్యాయులు. అతడు తన జీవితకాలంలో కోపెన్‍హేగెన్ వదిలివెళ్ళింది చాలా తక్కువ. ఒకరోజు కోపెన్‍హేగెన్ వీథులలో నడుస్తూ నడుస్తూ పడిపోయాడు. పక్షవాతంతో నలభై అయిదురోజులు మంచంలో పడి మరణించాడు (1855, వయసు 42).
కీర్కెగాడ్ తన మాతృభాష అయిన డేనిష్ భాషలో రచనలు చేశాడు. అతడికాలంలో దేశంలోని విశ్వవిద్యాలయాలలో జర్మన్ మాత్రమే గుర్తింపబడింది. కీర్కెగాడ్ తన సిద్ధాంతవ్యాసం మాతృభాష డేనిష్‌లో రాయడానికి ప్రత్యేకమైన అనుమతిని సంపాదించుకున్నాడు. మరో ప్రసిద్ధ రచయిత ఇబ్సెన్ (Henrik Ibsen) కూడా, తను నార్వే వాడైనా డేనిష్ భాషలోనే రాశాడు.
ఇరవయ్యో శతాబ్దంలో కీర్కెగాడ్ రచనలు ప్రచారంలోకి వచ్చాయి. హైడెగర్, కాఫ్కా, సార్త్ర, కామూ (Heidegger, Kafka, Sartre, Camus) వంటి ప్రసిద్ధ రచయితలు అతన్ని అస్తిత్వవాదానికి ఆదిపురుషుడుగా ప్రకటించారు. ఇరవయ్యో శతాబ్దంలోని ప్రధాన తత్త్వసిద్ధాంతాలకు, సాహిత్యధోరణులకు కీర్కెగాడ్ రచనలు ప్రేరణ. మానసిక వైద్యశాస్త్రంపై కూడా ఇతని భావాల ప్రబలప్రభావం ఉన్నది.
కీర్కెగాడ్ తాను తత్త్వవేత్తను కానని కచ్చితంగా చెప్పుకున్నాడు. అతని రచనలలో ప్రధానంగా కనిపించేది క్రైస్తవధర్మం పట్ల ఆర్తి. తాను కవినని, కాని అంతకంటే ముందే ధర్మం తనను సొంతం చేసుకున్నదని అంటాడు. (I am a poet. But I was made for religion long before I became a poet.) కీర్కెగాడ్ రచనలు, ముఖ్యంగా ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్, సాహిత్యంలా చదవాలి.
ముఖ్యరచనలు
ఇతడు తన ముఖ్యరచనలన్నీ రెండు సంవత్సరాలలో (1843-44) చకచకా రాసేశాడు, చావు తరుముకొస్తున్నది అన్నట్టు. రచనల ఆంగ్లానువాదాల పేర్లు:
-Either/Or
-Fear and Trembling
-Three Edifying Discourses
-Four Edifying Discourses
-Philosophical Fragments
-The Concept of Anxiety
ఈ పుస్తకంలో నేను ప్రధానంగా వివరించింది అతడి ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. ఈ పేరుకు నా అనువాదం ‘భయము-కంపము’.
భయము-కంపము (Fear and Trembling)
భయము-కంపములో ప్రధాన విషయాలు విశ్వాసము (Faith), త్యాగము (Sacrifice). భయము, కంపము వాటిలో అనుషంగికం. కీర్కెగాడ్ ఈ గ్రంథంలో ఏ తాత్త్వికసిద్ధాంతమూ చేయడం లేదు. ఏ విషయంలోను తన నిర్ణయం ఇది అని మనమీద రుద్దడం లేదు. ప్లేటో సంభాషణలలో సోక్రటీస్, ప్రశ్నకు సమాధానమివ్వడు. ప్రశ్న అడిగినవాణ్ణి సమాధానం వైపు నడిపిస్తాడు. కీర్కెగాడ్‍ను ‘డేనిష్ సోక్రటీస్’ అంటారు. కాని అది కూడా సరికాదు. అతడు సమాధానం చెప్పడు, సమాధానం వైపు నడిపించడు కూడా. ‘ఇది దారి’ అంటాడు. [కామూ కథలో (అతిథి: L’hote) అరబ్బుకు రెండు దారులు చూపిన దారు (Daru) లాగా.] ఎవడి నడక వాడిదే. తన రచనలకు తనకు మధ్య అతడు అనేక ప్రాకారాలు నిర్మించుకున్నాడు. ఆ ప్రాకారాలన్నింటికీ అవతల తాను నిలబడతాడు.
కీర్కెగాడ్ రచనలను ప్రధానంగా రెండుగా విభజించవలె. ఒక రచయితను కల్పించి ఆ కల్పిత రచయిత రచనలుగా రాసినవి మొదటి విభాగం. తన పేరుతో రాసినవి రెండవ విభాగం. ఐదర్/ఆర్ (Either/Or), ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ (Fear and Trembling) మొదటి విభాగంలోని ప్రధానరచనలు. ‘నేను ఎడంచేత్తో రాసిన పుస్తకాలు పట్టుకొని, కుడిచేత్తో రాసినవి వదిలేశారు’ అని వాపోయాడు కీర్కెగాడ్ తన చివరిరోజుల్లో. తన పేరుతో రాసినవి కుడిచేత్తో రాసినవి అని అర్థం చేసుకోవాలేమో? ఈ ఎడమచేతి రచనలలో రచయిత తనను తన రచనలకు చాలా దూరంలో నిలబెట్టుకున్నాడు. ఉదాహరణకు భయము-కంపము అన్న పుస్తక రచయిత ‘జాన్ ముని’ అట! (Johannes de silentio. యోహాన్నెస్ దె సిలెంటియో అంటే మానంగా ఉంటాడని అర్థం. చాలానే మాట్లాడుతాడు. కాని, అతడు మాట్లాడనిది ఎక్కువ అర్థవంతం. ఆ మౌనాన్ని అతి మెలకువతో పట్టుకోవలె పాఠకుడు. ఇలా చాలా ‘రచయిత’లను సృష్టించుకున్నాడు కీర్కెగాడ్.) ఇన్ని ప్రాకారాలను, ఇంతమంది రచయితలను, తనకు తన రచనకు మధ్య నిర్మించడంలో కీర్కెగాడ్ ఆశయం ఏమిటి? రచనకు తన బాధ్యతనుండి తప్పుకోడానికా? కాదు. ‘[ఈ నా రచయితల] అభిప్రాయాలు ఏవీ నావి కావు. నావి కాకుండా పోవు కూడా’ అని అంటాడు కీర్కెగాడ్. అతడి ఆశయం పాఠకుడు ఆలోచించి తన అభిప్రాయం ఏర్పరచుకోవలె అని. ఇది కీర్కెగాడ్ అస్తిత్వవాదంలో ప్రధానమైన అంశమే. విషయరూపంలో కాక విధానంలోనూ ఇదే విషయాన్ని చెబుతాడు. ఎవడి సత్యం వాడే సాక్షాత్కరించుకోవలె. అంతే కాదు, అలా సాక్షాత్కరించుకొన్న సత్యం తనకు మాత్రమే సత్యం. సార్వకాలిక సార్వజనీనమైన సత్యం ఉండదు: I must find a truth that is true for me. నాకు మాత్రమే సత్యమైన సత్యాన్ని నేను కనుగొనవలె. జీవితపరమార్థమైనా, గ్రంథార్థమైనా ఎవడికివాడు తెలుసుకోవలె. కనుక ఇంతమంది రచయితల పేర్లు. ఇన్ని గ్రంథప్రాకారాలు. ఇది వైయక్తికత కాదు, ఆత్మత. అస్తిత్వవాదం వ్యక్తి ఆత్మను (Individual Self) ఆవిష్కరిస్తుంది. కాని ప్రాథమ్యం వ్యక్తిపై (Individual) కాదు, ఆత్మపై (Self).
అనగనగా ఒక మనిషి
భయము-కంపము ముందుమాటలో రచయిత (యోహాన్నెస్ దె సిలెంటియో) అంటాడు: ‘ఈ యుగంలో, మనిషికి శ్రద్ధ (faith) ఉంటే చాలటంలేదు, దానికంటే పైదేదో సాధించాలన్న తపన. శ్రద్ధకంటే పైది ఏది?’ హేతువాదమని యీ యుగభావం. అదే ఈనాడు ఆధిపత్యం చేస్తోంది. ఈ గ్రంథమంతా హేతువాదపరిమితిని వ్యంగ్యంగా విమర్శించడం, శ్రద్ధను నొక్కి చెప్పడం.
ముందుమాట తరువాత, ప్రధానగ్రంథం ‘అనగనగా ఒక మనిషి’తో మొదలవుతుంది: అనగనగా ఒక మనిషి తన చిన్నతనంలో బైబిల్ లోని అందమైన అబ్రహాం కథను విన్నాడు – ఎలా భగవంతుడు అబ్రహాంను పరీక్షించింది, అబ్రహాం ఆ పరీక్షకు ఎలా నిలబడింది, ఎలా అబ్రహాం తన కొడుకును అనూహ్యమైన రీతిలో తిరిగి పొందింది… అతడు పెరిగి పెద్దయిన తరువాత ఆ కథను మరింత మెచ్చుకునేవాడు. పెద్దవాడవుతున్నకొద్దీ అతడికి ఆ కథలో ఆసక్తి బలమవుతూ వచ్చింది. కాని అవగాహన అంతకంతకూ తగ్గుతూవచ్చింది.
ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్‍కు ఉపనామం డయలెక్టికల్ లిరిక్ (Dialectical Lyric). ‘అనగనగా ఒక మనిషి’ అంటూ మొదలైన ఈ కథ, లేక గేయం (lyric) ‘ఒకానొక మనిషి’ కథ కాదు. అది ‘మనిషి’ కథ, వ్యష్టిగా సమష్టిగా కూడా. అంటే, కాలగమనంలో మనిషిని, మనిషి జీవితంలో కాలగమనాన్ని, రెంటినీ చెబుతున్నాడు రచయిత ఈ ‘మనిషి’ ద్వారా. అంటే, వ్యక్తి జీవితంలో వయోదశలు, సమాజచరిత్రలో దశలు కూడా. ఒక ఘటన అది జరిగిన కాలంలో ఒక విధంగా అర్థమవుతుంది. కొంత కాలం గడిచిన తరువాత వేరొక విధంగా అర్థమవుతుంది. చాలా కాలం గడిచిన తరువాత అర్ధమైనట్టుంటుంది, కాని కాదు. ఘటన చరిత్ర అవుతుంది. చరిత్ర పురాణం అవుతుంది. ఇది కాలగమనంలో మనిషి విషయం. అనుభూతిరూపంగా అర్థమవడం తగ్గిపోతుంది కాలక్రమంలో.
ఇక మనిషి జీవితంలో కాలగతి. చిన్నతనంలో విన్న కథలో ‘అందం’ కనిపిస్తుంది. కొంత ఎదిగిన తరువాత అదే కథలో అందం బదులు ‘ఆశ్చర్యం’ కలుగుతుంది. మరి కొంత వయసైన స్థితిలో అందము ఆశ్చర్యము అణగిపోతాయి, ‘ఆసక్తి’ ఉంటుంది. అంటే వయసుతో క్రమక్రమంగా చిన్నతనపు అనుభూతి అణగిపోతుంది. మొదటి వాక్యంలోనే మనిషి అన్న పదాన్ని ఇంత మెలకువతో ప్రయోగించాడు రచయిత. పుస్తకమంతా ఇంత మెలకువతో చదవాలి. కీర్కెగాడ్ ఈనాటి ‘మనిషి’లో భావతీవ్రత లోపించడాన్ని నిరసిస్తాడు. ఈనాటి మనిషిలో చింతన ఎక్కువ, ఆర్తి తక్కువ. ఈ ఉద్వేగరహితమైన జవము జీవము లేని బతుకు బతుకు కాదు అంటాడు కీర్కెగాడ్. శ్రద్ధ ఉద్వేగ శిఖరం. (Faith is the highest passion in a person.) శ్రద్ధతోటి కలిగే భావతీవ్రతే నిన్ను భగవంతుని వద్దకు దాటించగలదు (leap of faith). ముందుమాటలో ప్రారంభవాక్యం ‘అనగనగా ఒక మనిషి’. మనిషి అంటాడు కాని, సమాజం అనడు కీర్కెగాడ్. అతడికి సమాజం అంటే మంద. (Crowd is the untruth అన్నది అతని ప్రసిద్ధవాక్యం.) మనిషి మాత్రమే తరించగలడు (leap) సమాజం ఎప్పటికీ తరించదు. అది సమాజమే, దానికి సుఖం చాలు. సుఖము, ఆర్తి సహజీవనం చేయలేవు. (An easy life is the privilege of the slave. – The Karamazov Brothers: Dostoevsky.) కావ్యంలోని ఈ ప్రారంభవాక్యప్రాముఖ్యాన్ని, దాని విస్తృతిని చూద్దాం.
ఒక ప్రశ్న. టి.వి.లో వ్యాపారప్రకటనల్లో కొన్ని సాహసాలు (stunts) చూపిస్తారు, ఒకడు బైక్ మీద ఒక కొండ కొననుండి మరో కొండపైకి దూకుతాడు. ఆ ప్రకటనతో ఒక హెచ్చరిక ఉంటుంది: ‘మీరు చూస్తున్నది శిక్షణపొందినవారి పర్యవేక్షణలో చేసినది. ఎవరూ అనుకరించవద్దు’. అదే టి.వి. రామాయణకథలో హనుమ నూరుయోజనాల సముద్రం లంఘించడం చూపిస్తుంది. కాని అప్పుడు అనుకరించవద్దు అన్న హెచ్చరిక ఉండదు. కారణం? ఒక సంఘటన ప్రత్యక్షంగా చూచినపుడు అది అనుభవం. విన్నప్పుడు అది వార్త. కంటితో చూచినప్పుడు ఆ ఘటన మనసుపై వేసే ముద్రకున్న బలం విన్నప్పుడుండదు. అట్లాగే, ఈనాడు పొందిన అనుభవం రేపుండదు. ఈవేళ పోతే రేపటికి రెండు అనే నానుడి ఉంది. మనిషి జీవితంలో లాగానే సమాజంలోనూ. కాలగమనంతో ఒక ఘటన గురించిన మన అవగాహన మందం అవుతుంది, అనుభవతీవ్రత తగ్గుతుంది కనుక. అనుభవమే అవగాహన. ఏదైనా అర్థం చేసుకోవడమంటే, అనుభూతి పొందడమే. దానిని గురించిన ఆలోచన, భావాలు, సిద్ధాంతాలు కావు. అనుభవం వర్తమానం. రేపు వార్త. ఆ మరునాడు చరిత్ర. మరో యుగంలో పురాణం. అంటే కాలక్రమంలో అనుభూతి ఉండదు. హనుమ సముద్రం దాటడం కథ. అందులో భయం లేదు, సంశయం లేదు. కంపం కలగదు. ఉద్వేగం ఉండదు. ‘అయ్యో యిప్పుడు హనుమ ఏమైపోతాడు?’ అన్న ఉద్వేగం ఉండదు. కనుక, హనుమ అప్పుడు ఏమి అనుభవించాడో మనకు అనుభవం కాదు. హనుమ తనను, తనలోనుండి తనను, బాణపుకొనతో నిశ్శేషంగా కోసేసుకుని, కేవలం తనను కోసిన రామబాణంగా మిగిలిపోయాడు. (యథా రాఘవనిర్ముక్త శ్వసనవిక్రమః) ఆ కోత (angst) మనకు అనుభవం కాదు. మనకది కథ. ఇది ఉత్తి కథ అని మనం అనుకున్నట్టే ఆనాడు అబ్రహాం ‘ఇది భగవంతుడు పెడుతున్న ఉత్తుత్తి పరీక్ష. ఇది నిజం కాదు, నేను నా ప్రియమైన కొడుకును బలి యివ్వవలసిరాదు’ అనుకుని ఉంటే, ఆ భయము కంపము పొందకపోయి ఉంటే, అబ్రహాం కథ బైబిల్‌లో ఉండేదా? మనకు తెలుసు, మనందరికీ, అది వఠ్ఠి పరీక్ష అని. ఆ క్షణంలో అబ్రహాం అనుభవించిన భయం, బాధ, ఉద్వేగం, కత్తి ఎత్తిన చేయి వణుకు, అన్నీ ఆ పురాణకాలంలో పురాణం కావు. నవవ్రణంగా అనుభూతమయేవి. కనుక అర్థమయేవి. బైబిల్ కథ చిన్నతనంలో వినడం, చరిత్ర చిన్నతనంలో వినడం, యుగాలు గడచిన తరువాత వినడం ఒకటి కావు. పైన కథాభాగంలో చెప్పింది అదే, అబ్రహాం కథ ఈనాడు కేవలం కథ. ఇదీ భయము-కంపము కావ్యప్రారంభవాక్య ప్రాముఖ్యం. ఎవడి అనుభూతి వాడిది. అనుభూతమయిందే సత్యం.
జీవితానికి ప్రయోజనం, జీవితానికి అర్థం, జీవితసత్యం ఎవడిది వాడికే. సార్వజనీనమైన సత్యం ఉండదు. సమస్తవిశ్వానికి ఒకే ధర్మం ఉండదు. ఒకే న్యాయం ఉండదు. ఉన్నా, అది ఎవడికి వాడు సాధించి సంపాదించుకోవలసిందే, అనుభవంలో తెలుసుకోవలసిందే. శ్రుతి చెప్పిందే అయినా (వేదం, బైబిల్, ఖుర్‍ఆన్ మరేదైనా), ఆ శ్రుతి బయటనుండి కాదు, లోపల పలకాలి. అప్పుడే అది వేదం. తరువాతి కాలంలో ఈ కీర్కెగాడ్ వాక్యం నిజంగా వేదమయింది, అస్తిత్వవాదానికి (Existentialism), అసంబద్ధవాదానికి (Absurdism), ఇంకా అనేక వాదాలకు.
అబ్రహాం వ్యథ
అబ్రహాం మూడు సంస్కృతులకు మూలపురుషుడు (యూదు, క్రైస్తవ, ఇస్లామ్). అబ్రహాం బిడ్డలు, ఇస్మైల్, ఐజక్.
యెహోవా ఒక రోజు అబ్రహాంతో ‘నీ సంతతిని గొప్ప జాతిని చేస్తాను. వారు గొప్పవంశస్థాపకులై దేశాలేలుతారు. నీకు నేనొక దేశం చూపిస్తాను. నీవు నీ తండ్రిని నీ బంధువులను విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు’ అన్నాడు. అబ్రహాం అలాగే, తండ్రిని ఉన్న ఊరును వదిలి, భార్య సేరాతో (Sarah) యెహోవా చూపిన స్థలానికి వెళ్ళిపోయాడు. అతడు సంపన్నుడైనాడు. రాజ్యమేలాడు. ఎంత సంపద ఉండి ఏం సంతోషం? సంతానం లేదు. అతనికి నూరేళ్ళు, అతని భార్యకు తొంభై ఏళ్ళు. అబ్రహాం భార్య సేరా, తన భర్తకు సంతానం కలగాలి అని, తన దాసి హాగర్‍ను (Hagar హీబ్రూలో, ఇస్లామ్‍లో Hajar) భర్తకు రెండవభార్యగా నియోగించింది. వారికి ఇస్మైల్ పుట్టాడు. కొడుకు కలుగగానే హాగర్‍కు అభిమానం పెరిగి, సేరాను చిన్నచూపు చూచింది. హాగర్‌ను, ఆమె కొడుకును ఇంటినుండి వెళ్ళగొట్టమన్నది సేరా. తనకు ఇష్టం లేకపోయినా అబ్రహాం ఆమె కోరినట్లే వాళ్ళను ఇంటినుండి పంపివేశాడు.
యెహోవా మరల కనిపించి, అబ్రహాంకు సేరా వలన కొడుకు పుడతాడని వరమిచ్చాడు. అది విని తొంభై ఏళ్ళ సారా నవ్వింది. కాని యెహోవా మాట ప్రకారం వారికి ఐజక్ పుట్టాడు.
భగవంతుడు అబ్రహాం నమ్మకాన్ని పరీక్షించదలచాడు. ఒకరోజు అతనితో, ‘నీవు నీకు అత్యంత ప్రియమైన నీ ఒక్కగానొక్క కొడుకును మోరియాకు తీసుకొని వెళ్ళు. అక్కడ నేను చెప్పిన కొండపై నీ కొడుకును నాకు బలిగా అగ్నిలో ఆహుతి యివ్వు’ అన్నాడు. – బైబిల్ ఆదికాండము.
బైబిల్ లోని ఈ అబ్రహాం కథను కీర్కెగాడ్ నాలుగు విధాలుగా చెప్పించాడు తన రచయిత జాన్ ముని చేత. నాలుగూ బైబిల్ మూలకథకంటే భిన్నంగా ఉంటాయి.
‘తెల్లవారుతూంది. అబ్రహాం వేళకు లేచాడు. గాడిదలను సిద్ధం చేసి, గుడారం నుండి బయలుదేరాడు, ఐజక్‍తో. భార్య సేరా కిటికీ దగ్గర నిలబడి చూస్తోంది, వాళ్ళు లోయ దిగి వెళ్ళిపోయే వరకు. మూడు రోజులు ప్రయాణం చేశారు. మాట లేదు.’
బలి ఇవ్వడానికి బయలుదేరవలసిన రోజు తెల్లవారుతుండగా అబ్రహాం ‘వేళకు’ లేచాడు. నిద్రలేచాడు అనలేదు. కొడుకును బలి ఇవ్వడానికి బయలుదేరే ముందు రాత్రి తండ్రి నిద్రపోగలడా? వేళకు లేచాడు – పక్కమీదినుంచి లేవడానికి తొందరపడడు. ఆలస్యమూ చేయడు, దైవకార్యం. (నాలుగు కథనాలలోనూ మొదటి వాక్యం ఒకటే: తెల్లవారుతూంది. ప్రత్యూషసమయం. ఏ సనాతనధర్మంలోనూ దైవకార్యానికి విశిష్టం. ఉషస్సే బలిపశువు అని కదా ఉపనిషత్తు: ఉషా వా అశ్వస్య మేధ్యస్య శిరః. బృ.ఉ.) కొడుకు ఐజక్‍ను తీసుకుని అబ్రహాం వెళుతుంటే, తల్లి సేరా వాళ్ళు కనిపించినంతదూరం చూస్తూ నిలబడింది కిటికీ దగ్గర.
మొదటి కథనం:
బలి ఇవ్వవలసిన స్థలం మోరియా కొండ. గాడిదపై మూడురోజుల ప్రయాణం. మూడు రోజుల మౌనం. అబ్రహాంకు తెలుసు ఎక్కడికి వెళుతున్నారో, ఎందుకు వెళుతున్నారో. ఐజక్‌కు తెలియదు. తండ్రిమీద విశ్వాసంతో నడుస్తున్నాడు. అబ్రహాం మనసులో ఎంతటి కల్లోలమో ఊహించవలసిందే. ఇద్దరికీ నోరు తెరిచే ధైర్యం లేదు. మోరియా కొండను సమీపిస్తుండగా, అబ్రహాం కొడుకుకు విషయం చెప్పాడు. ఐజక్ తలపై తండ్రి చేయి ఉంచాడు ఆశీర్వదించడానికి. ఐజక్ ఆశీర్వాదం కోసం తల వంచాడు. అబ్రహాం ముఖంలో పితృవాత్సల్యము, చూపులో మార్దవము. పిల్లవాడు తండ్రి మోకాళ్ళకు చుట్టుకొని, తాను పసివాడినని, చంపవద్దని ప్రార్థించాడు. అబ్రహాం పిల్లవాణ్ణి లేవనెత్తి, అతని చేయి పట్టుకొని, అనునయిస్తూ, బోధచేస్తూ నడిచాడు. బలిస్థలం చేరుకొన్నారు. అబ్రహాం ఐజక్ నుండి ఒక్క క్షణం తల తిప్పుకున్నాడు. తిరిగి కొడుకువైపు మళ్ళినపుడు, ఐజక్ తండ్రి ముఖం చూచాడు, ఆ ముఖంలో క్రౌర్యం, రౌద్రం. ఐజక్‍ను నిర్దయగా పట్టి కిందకు పడదోసి ‘మూర్ఖుడా! ఏమనుకొంటున్నావ్? నేను నీ తండ్రిననుకొంటున్నావా? నేనొక విగ్రహారాధకుణ్ణి! ఇది దేవుడి ఆజ్ఞ అనుకొంటున్నావా? కాదు, నేను చేయాలని చేస్తున్నపని.’ ఐజక్ వణికిపోయాడు, దుఃఖంతో ఏడ్చాడు. ఐజక్ దేవుణ్ణి ప్రార్థించాడు, ‘ఈ లోకంలో నాకు తండ్రి లేకపోతే, నీవే నా తండ్రివి’. అబ్రహాం తనలో అనుకున్నాడు, ‘దేవా! వీడు నేను రాక్షసుణ్ణని నమ్మనీ. నాకు ఇష్టమే. కాని వీడికి నీ పై నమ్మకం తొలగరాదు.’
బలి ఇచ్చే సమయంలో, అబ్రహాం రాక్షసముఖంతో కొడుకుకు కనిపించడం ఎందుకు?
అబ్రహాంకు సమస్త సృష్టిలో అత్యంత ప్రియమైన వస్తువు తన బిడ్డ. (హాగర్‌కు తన వల్ల కలిగిన ఒక బిడ్డను, భార్య సేరా కోరికకు తల వంచి అడవులపాలు చేశాడు.) ఐజక్ తనకు మిగిలిన ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డను యెహోవా బలి కోరినప్పుడు, అతడు ‘దేవా! నా కొడుకుకు బదులు నన్ను బలితీసుకో’మని ప్రార్ధించి ఉండవచ్చు. అబ్రహాం తాను రాక్షసుడిగా మారినట్టు నటించవలసిన అవసరం ఏమిటి? భగవంతుడు కరుణామయుడు అన్న నమ్మకం ఐజక్‌లో చెడకూడదు. పసివాడి ప్రాణం బలి కోరేవాడు దేవుడెలా అవుతాడు? పసివాడి మనసు క్రూరుడైన మనిషినుండి తొలగి, కరుణామయుడైన భగవంతునియందు నిలవాలి. తన తండ్రి రాక్షసుడనుకొన్నా ఫరవాలేదు. భగవంతుడు క్రూరుడు అన్న భావం కలగకూడదు. బిడ్డకు తనమీద నమ్మకం పోనీ, భగవంతుని మీద నమ్మకం చెడకూడదు.
ఇందులో రెండు అంశాలున్నాయి. ఒకటి, తండ్రికి బిడ్డపై నిజమైన ప్రేమ స్వరూపం. రెండు, భగవంతునియందు అచంచల విశ్వాసం. ఆ బిడ్డ హృదయంలో తాను తొలగి, అక్కడ భగవంతుని ప్రతిష్ఠించడం బిడ్డపై నిజమైన ప్రేమ. తన శ్రేయస్సుకంటే బిడ్డ శ్రేయస్సు కోరడం నిజమైన పుత్రవాత్సల్యం. కొడుకు తన తండ్రి రాక్షసుడని నమ్మినా మేలే. కాదు, తప్పక నమ్మవలె. అప్పుడే అది గొప్ప త్యాగం అవుతుంది. తను రాక్షసుడని కొడుకు నమ్మడం ఎందుకు అవసరం? దేవా! నాకు ప్రియమైన నా కొడుకు బదులు నన్ను బలి తీసుకో – అని ఉంటే, అప్పుడు కొడుకు దృష్టిలో తాను దేవుడవుతాడు, దేవుడు దిగిపోతాడు. అలా అయితే అది భగవంతుని కించపరచడం, భగవంతునియందు తన విశ్వాసం చలించడం. అలా కాకూడదు. అలా అయితే తాను నిజంగానే రాక్షసుడైనట్టు. భగవంతుని కించపరచడం, భగవంతునియందు విశ్వాసం చలించడమే కదా రాక్షసుడిగా మారడమంటే? తాను నిజంగా రాక్షసుడిగా మారకూడదంటే, తను రాక్షసుడిగా మారినట్టు నటించవలె. తన తండ్రి రాక్షసుడని తన కొడుకు నమ్మవలె. ఈ లోకంలోని తండ్రిపై ప్రేమ పరలోకంలోని తండ్రివైపుకు మళ్ళించవలెనంటే, అబ్రహాం తన ముఖానికి రాక్షసత్వపు మసి పూసుకోవలె. (‘బిడ్డను స్తన్యం మాన్పించడానికి తల్లి స్తనాలకు మసిపూసుకున్నట్టు’ అది అబ్రహాం త్యాగంలోని నిజతత్త్వం.) అతడు బలి ఇవ్వడానికి సిద్ధమయింది కొడుకును కాదు, తనను. ఈ ఆత్మబలిలో ఒకేసారి రెండు సిద్ధించాయి, బిడ్డయందు ఉండవలసిన నిజమైన ప్రేమ, భగవంతునియందు చలించని విశ్వాసం. ఇంతకంటే గొప్ప బలి కాని, బలమైన కథనంగాని, ఏముంటుంది? ఈ కథలో కరుణ, భయము (frightful pathos) నిండి ఉన్నాయి. కదిలి కదిలించే కథ.
బిడ్డకు స్తన్యం మానిపించేటప్పుడు తల్లి, స్తనాలకు మసి పూస్తుంది. పాలు తాగకూడనప్పుడు అవి అందంగా ఉండడం అన్యాయం కదా? బిడ్డ అనుకుంటాడు. స్తనాలు మారాయి, తల్లి మారలేదని. ఆమె చూపులో అదే ప్రేమ, అదే ఆప్యాయత. తల్లి వద్ద పాలు మాన్పించడానికి ఇంతకంటే భయంకరమైన ఉపాయాలు అవసరం కాని బిడ్డ ఎంత అదృష్టవంతుడు!
(తల్లి బిడ్డకు స్తన్యం మానిపించడం అనే ఈ ఉపమానం, నాలుగుకథనాల చివరనూ ఉంది, ఒక్కొక్క కథనంలో కొంత మార్పుతో.)
రెండవకథనం:
తండ్రికొడుకులు బయలుదేరారు. నాలుగోరోజు అబ్రహాం తలెత్తి దూరంగా కనిపిస్తున్న మోరియా కొండను చూశాడు. కాని వెంటనే చూపు నేలకు వాల్చాడు. మాటలేదు. కట్టెలు పేర్చాడు. ఐజక్‌ను కట్టేశాడు. నిశ్శబ్దంగా కత్తి తీశాడు. అప్పుడు చూశాడు, యెహోవా అక్కడ సిద్ధంగా ఉంచిన గొర్రెను. దానిని బలి ఇచ్చి ఇంటికి తిరిగొచ్చాడు. ఆనాటినుండి అబ్రహాంను ముసలితనం ఆవహించింది. ఐజక్ ఎప్పటిలా వృద్ధిలోకి వచ్చాడు. కాని అబ్రహాంకు ముసలితనం వచ్చింది. అతడికి జీవితంలో ఆనందం లేదు.
ఈ కథనంలో విశేషం, యెహోవా అక్కడ గొర్రెను బలికి సిద్ధంగా ఉంచడం. ఆ గొర్రెను బలి ఇచ్చి తండ్రికొడుకులు తిరిగిరావడం. ఆ తరువాత ఐజక్ వృద్ధిలోకి వచ్చాడు. ఇంతకాలమూ తనను ఆవేశించని ముసలితనం అబ్రహాంను ఆవేశించింది. ఏమిటి దీని అర్థం? ఈ కథనంలో విశ్వాసం కలిగింది ఐజక్‌కు. అతడు వృద్ధిలోకి వచ్చాడు. మరి అబ్రహాంకు జరిగిందేమిటి? రచయిత చెప్పడు. అబ్రహాంలో ఈసారి వ్యథ (fear, angst) లేదు. ఇది వఠ్ఠి పరీక్ష, యెహోవా ఇది చేయడు. నా కొడుకును బలి ఇవ్వనీయడు. తప్పకుండా తప్పిస్తాడు – అని నమ్మాడు. ఇది యెహోవాయందు విశ్వాసం చలించడం. నిజమైన విశ్వాసం ఏది? బలి ఇచ్చినా, తిరిగి నా బిడ్డను బతికించగలడు అని నమ్మడం విశ్వాసం.
నాలుగోరోజు అబ్రహాం తలెత్తి దూరంగా కనిపిస్తున్న మోరియా కొండను చూశాడు. కాని వెంటనే చూపు నేలకు వాల్చాడు. నేలమీదినుండి చూపు మరల్చకుండా నడకసాగించాడు. ఈ కథనంలో ఇది మరో ముఖ్యమైన అంశం, తలఎత్తి పైకి చూడడం, వెంటనే చూపు నేలకు వాల్చడం ప్రతీకాత్మకం. అబ్రహాం పైలోకంలో ఉన్నతిని కోరడంలేదు. అతడు కోరేది ఇహం, పరం కాదు. పరం ‘దూరపు కొండ’. మనిషి నడవవలసింది నేలమీద. ఇది అస్తిత్వవాదపు పునాది.
మూడవ కథనం:
మూడవకథలో బలి జరిగిననాటి వర్ణన లేదు, అది జరిగిపోయిన తరువాత. అబ్రహాం ఆ ఘటనాస్థలానికి చాలా తరచుగా ఒంటరిగా, వెళ్ళివచ్చేవాడు. ఆ కొండపైకి వెళ్ళినపుడు ప్రత్యూషం కాదు, ప్రదోషం. (ప్రశాంతమైన సాయంకాలం.) ఆ ఘటనను మళ్ళీ మళ్ళీ తలచుకునేవాడు, తరచుకునేవాడు. (తరచు వెళ్ళేవాడు ఒక్కడూ.) కాని అప్పుడు కూడా కత్తి తీసేవాడు. ఎందుకు? ఆ ఘటనను మళ్ళీ మళ్ళీ వాస్తవంగా అనుభూతి చెందడానికి. తలపు (reflection) వేరు, అనుభూతి తీవ్రత (passion) వేరు. (మనం ఆలోచనాయుగంలో ఉన్నాం, ఆర్తిలేదు – కీర్కెగార్డ్).
అంతేకాదు. ఈ కథనంలో అబ్రహాం మథనం ఉంది, తనకు అత్యంతప్రియమైన తన కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడడం పాపమెలా అవుతుంది అని. పాపమయింది అని అబ్రహాం అనుకోడానికి కారణమేమిటి? దాని తర్వాత వాక్యంలో ఉంది. తన కొడుకుకు బదులు తన ప్రాణాన్ని, ఒకసారి కాదు ఎన్ని సార్లయినా, బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కదా, అంటాడు. అంటే, అబ్రహాంకు భగవంతుడిమీదకంటే తన కొడుకుపై ప్రేమ ఎక్కువ. అది పాపం.
మొదటి కథనంలో ఐజక్‌కు తనమీద ప్రేమ తొలగి, తన తండ్రి రాక్షసుడని నమ్మినా ఫరవాలేదు. అతడికి భగవంతునియందు ప్రేమ కలగాలి, పెరగాలి. మూడవకథనం దానికి విపర్యయం.
నాలుగవ కథనం:
అబ్రహాం నమ్మిన బంటు ఎలిజార్ వాళ్ళిద్దరితో కొంత దూరం నడిచి, వెనకకు వచ్చాడు. వాళ్ళిద్దరూ, అబ్రహాం ఐజక్, ఒకరికొకరు తోడుగా మోరియా కొండవరకు వెళ్ళారు. అక్కడ అబ్రహాం బలికి అంతా సిద్ధం చేశాడు, ప్రశాంతంగా నిశ్శబ్దంగా, కాని అతడు అటువైపు తిరిగినపుడు అబ్రహాం ఎడమచేయి దుఃఖం వల్ల బిగుసుకుపోవడం, అతని శరీరంలో ఒక కంపము, చూచాడు ఐజక్. అయినా, అబ్రహాం కత్తి తీశాడు. ఆ తరువాత ఇంటికి వచ్చారు ఇద్దరూ. సేరా వాళ్ళకు ఎదురు వెళ్ళింది పరుగెత్తుతూ. కాని, ఐజక్‌కు విశ్వాసం పోయింది. దాని గురించి లోకంలో ఒక్కమాట మాట్లాడినవాడు లేడు. ఐజక్ ఎవరితోనూ ఆ విషయం గురించి చెప్పలేదు. అబ్రహాంకు అనుమానం లేదు, ఎవరైనా అది చూశారేమోనని.
మొదటి కథనంలో తండ్రిముఖంలో క్రౌర్యం చూసి ఐజక్ వణికాడు. నాలుగవ కథనంలో, అబ్రహాం ఎడమచేయి బాధతో బిగుసుకుపోయింది, ఒళ్ళంతా వణికింది. ఏమిటి దీని అర్థం. రెండూ సహజమే స్పష్టమే. కాని ఒకరికి భయంతో ఒకరికి బాధతో భయము, కంపము కలిగాయి. రెండూ ఒకరికే కలిగినట్టు, ఒకే కథనంలో చెప్పవచ్చు కదా? లేదు, అనుభవంలో కలిగేది, దానిని తెలిసినపుడు అనుభవించినవాడికి కూడా కలిగినట్లే కలగాలి. ఇక్కడ ఐజక్ ముందుమాటలో చెప్పిన ‘అనగనగా ఒక మనిషి’ స్థానంలో ఉన్నాడు. అంటే అబ్రహాం కథ విన్నవాడు కథను కేవలం హనుమ సముద్రమును లంఘించెను అన్న పురాణంగా కాక, ఆ సన్నివేశాన్ని అందులోని భయాన్ని అనుభవించాలి.
ఈ నాలుగో కథలో ముఖ్యమైన వాక్యం, ‘దానిని గురించి లోకంలో ఎవ్వడూ మాట్లాడలేదు’. అంటే, ఆ రోజు వాస్తవంగా ఏం జరిగిందో తెలిసిన ఐజక్ ఎవ్వరికీ చెప్పలేదు. ఎవరైనా చూసి ఉంటారన్న అనుమానం అబ్రహాంకు కలగలేదు. దీని పరమార్థం ఏమిటి? మొదటి మూడు కథలలో తండ్రికొడుకుల విశ్వాసవిషయం. చివరిదైన నాలుగో కథలో విషయం వ్యష్టినుండి సమష్టికి విస్తరించింది. ఇందులో కేవలం వ్యక్తుల విశ్వాసం నిలవడమో చలించడమో కాదు. లోకంలో దేవునిపై ఉన్న నమ్మకం చెడకుండడం నాలుగో కథలో విషయం. అబ్రహాం తన నమ్మకం చెడనీ, కాని కొడుకు నమ్మకం చెడకూడదని మొదటి మూడు కథలలో అనుకున్నట్లే, ఈ నాలుగో కథలో తండ్రికొడుకులు ఇద్దరూ తమ నమ్మకం చెడనీ, లోకం నమ్మకం నిలవాలని కోరుకున్నారు. ఈ భావం ఉనమూనో (Unamuno) నవలికకు (Saint Emmanuel the Good, Martyr) ప్రేరణ అని ఖచ్చితంగా చెప్పవచ్చు1.
1[కీర్కెగాడ్ తన సోదరుడు అని చెప్పుకున్నాడు ఉనమునో: అతనిలో నేనొక సోదరుణ్ణి చూచాను. ఇంచుమించు మరొక నేను. అతని ఆత్మను ఆలింగనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. (Miguel de Unamuno: Preface to the Danish translation of Del sentimiento tragico de la vida.)
వీరి సోదరభావానికి మరో మచ్చు: హృదయంలో ఆర్తి లేదు, సంశయంలేదు, అనిశ్చయం లేదు, ఎన్నడూ నిస్పృహ కలగదు, కాని మాకు దేవునియందు విశ్వాసం ఉంది అని విశ్వసించేవారు, నిజంగా విశ్వసించేది దేవుని కాదు, దేవుడనే భావాన్ని మాత్రమే, ఎంతమాత్రము దేవుణ్ణికాదు… ఆ నవలిక ఒక పాస్టర్ కథ. అతడికి భగవంతుడిమీద విశ్వాసం ఉండదు. కాని, తన అవిశ్వాసాన్ని తనలో దాచుకుని తన పాస్టర్ విధులు నిర్వర్తిస్తాడు. లోకాన్ని మోసం చేయడానికి కాదు. లోకానికున్న విశ్వాసాన్ని కాపాడడానికి.]
మరొక్క విషయం. అబ్రహాం, ఐజక్‌ల విశ్వాసము, అవిశ్వాసము నాలుగింటిలోనూ ప్రసక్తం. మరి సేరా విశ్వాసప్రసక్తి ఎక్కడైనా ఉందా? ఆమె మూగబాధ చెప్పాడు. ఆమె సంతోషం చూశాం, ఐజక్ మోరియా కొండనుండి తిరిగి వస్తున్నపుడు ఆమె ఎదురు పరుగెత్తడంలో. ఆమె విశ్వాసవిషయం ఎక్కడైనా చెప్పాడా? రెండవకథలో అబ్రహాం విశ్వాసం సడలడం, దాని ఫలం చెప్పాడు: ఆనాటినుండి అబ్రహాంను ముసలితనం ఆవహించింది. దేవునియందు చలించని విశ్వాసం మనిషిని ముసలితనంనుండి కాపాడుతుంది. ఆ విశ్వాసమే కదా అబ్రహాంకు నూరేళ్ళు, సారాకు తొంభై ఏళ్ళు వచ్చినా సంతానం కలగడానికి కారణం! ఆ విశ్వాసం సడలగానే అబ్రహాంను ముసలితనం ఆవహించింది. సేరా విశ్వాసవిషయం నాలుగు కథలన్నిటిలోనూ ఒకే ఒక్క విశేషణపదంలో ధ్వనింపజేశాడు: యువ (ఐజక్ తల్లి యువ సేరా). ఆమెను వీడని యవ్వనం ఆమె సడలని విశ్వాసానికి సాక్ష్యం. సుమారు రెండువేలపదాల కథనంలో, సారా విశ్వాసానికి సాక్ష్యం ఆ ఏకైక ‘యువ’ పదం! జాన్ ముని అనే ఈ రచయిత రచనాశిల్పానికి యింతకంటే నిగూఢనిదర్శనం ఏముంటుంది?
ఈ నాలుగో కథ తండ్రికొడుకులకు పరిమితం కాదు. అది సమష్టి విషయం, లోకానికి సంబంధించింది. అక్కడ అబ్రహాం వ్యక్తిగతమైన చూపు ప్రసక్తి కాదు.
విశ్లేషణ
త్యాగంలో అంచెలుంటాయి. వరదలో నీ ఇల్లు కూలబోతోంది. నీ బంగారం, నీ బ్యాంకు డిపాజిట్లు నీటిలో కొట్టుకుపోతున్నాయి. నీ బిడ్డ వరదలో చిక్కుకున్నాడు. ఆ పరిస్థితిలో నీవు ముందు దేనిని కాపాడవలెననుకుంటావు అని అడగక్కరలేదు. విశ్వామిత్రుడు ‘నీ కొడుకు రాముణ్ణి నాతో పంపు’ అని అడిగినపుడు, దశరథుడు ఏమన్నాడు? రాముడు నాకు స్నానమగు రాముడు నాకు జపంబు ధ్యానమున్/ రాముడె యెల్ల నా బ్రతుకు, రాముడు నన్నును గన్న తండ్రి యీ/ రాము వినా నిమేషమవురా మనజాలను, కాదయేని నీ/ రాముని వీడి యీ యఖిలరాజ్యము గాధిసుతా! గ్రహింపవే (కల్పవృక్షము: విశ్వనాథ). బాధ ఎక్కడ గాఢంగా కలుగుతుంది? రాజ్యం కన్నా ఎక్కువ, కన్న కొడుకు. ఒక ధనవంతుడు క్రీస్తును అడిగాడు, నేను స్వర్గం పొందవలెనంటే ఏం చేయమంటావు, అని. నీ ఆస్తులు అమ్మి నా వెంట రా, అన్నాడు క్రీస్తు (మాథ్యూ: 19:16-30). ఆ ధనవంతుడు తన ఆస్తులు అన్నీ అమ్మి పేదలకు దానాలు చేసినా, అది గొప్ప కాదు. బిడ్డను బలి ఇవ్వడంతో అది సమానం కాదు. అబ్రహాం కథలో మనం ప్రధానంగా అర్థం చేసుకోవలసింది అంచులు తాకిన అబ్రహాం వ్యథ.
అబ్రహాం కథ తండ్రికొడుకుల అనుబంధవిషయం. అబ్రహాం త్యాగంలోని వైశిష్ట్యం, అతడు తనకు అత్యంత ప్రియమైన ఒకే ఒక బిడ్డను బలి ఇవ్వడం కాదు. బలి ఇచ్చిన తన బిడ్డను భగవంతుడు తనకు తిరిగి ఇస్తాడన్న విశ్వాసం. బలి ఇచ్చిన కొడుకు బతికిరావడం బుద్ధికందని, లోకం దృష్టిలో బుద్ధిలేని, విశ్వాసం. అది అసంభవం, అసంబద్ధం, అహేతుకం. అబ్రహాం విశ్వాసంలో మరో ముఖ్యాంశం, అది ఐహికం పారలౌకికం కొరకు కాదు. అబ్రహాం లోకమందు విరక్తుడు కాడు. అతడు సన్యాసి కాడు. సన్యాసం వేరు, విశ్వాసం వేరు. ఇది కీర్కెగాడ్ రచనలలోని తాత్పర్యం.
ఇంతకూ, కీర్కెగాడ్ ఇన్ని విధాలుగా ఈ కథను కల్పించి చెప్పడంలో ప్రయోజనం? అబ్రహాం ఎదుర్కొన్న సమస్యలోని సంక్లిష్టతను, నిర్ణయంలో సంఘర్షణను, ఉద్వేగాన్ని, సంక్షోభాన్ని అనుభూతం చేయడానికి. అబ్రహాంకు నాలుగింటిలో ఏ నిర్ణయం తీసుకోడానికైనా స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉంది కనుకనే ఇంత ఘర్షణ. ఇదీ అస్తిత్వమంటే. మనిషికి స్వేచ్ఛ ఒక శిక్ష. (Man is condemned to be free – Sartre.) ఆ స్వేచ్ఛారూపశిక్షే అతన్ని మనిషిని చేస్తుంది. ఆ అనుక్షణశిక్షే జీవితం. ఆ స్వేచ్ఛ ఉంటే మనిషి. లేకుంటే వాడు బాధలేని బండరాయి.
ఇంతవరకు మనం అబ్రహాం కథ నాలుగు ముఖాలు చూశాం, కథనశిల్పపరిశీలనం ప్రధానంగా. ఆ వివిధ కథనాల ఆశయమేమిటో చూద్దాం. కీర్కెగాడ్ రచనలన్నీ ‘సత్యం సహేతుకం’ (The real is the rational) అన్న హెగెల్ తీర్మానాన్ని తిరస్కరించడానికే. అరిస్టాటిల్ నుండి హెగెల్ వరకూ పాశ్చాత్య తత్త్వశాస్త్రం ఆ హేతువాదపు పునాదిపై లేస్తూ వచ్చింది. ఆ పునాదిని కీర్కెగాడ్ ఒక ఊపు ఊపాడు, వ్యంగ్యశైలిలో. ‘వ్యంగ్యం నాలో గుచ్చుకున్న బాణం’ అంటాడు కీర్కెగాడ్. బాణం తీసెయ్, ప్రాణం ఉండదు. కీర్కెగాడ్ తత్త్వం వివరించడమంటే, అతని శైలికి గుచ్చుకున్న బాణం పీకేసి, పలికించడమే. అది ప్రాణంలేని పలుకు. హేతువాదంపై ఈ వ్యంగ్యం అందుకున్నవాడు దోస్తోయెవ్‍స్కీ. అతని నవల నోట్స్ ఫ్రమ్ అండర్‌గ్రౌండ్ (Notes From Underground) అస్తిత్వవాదసాహిత్యానికి ఆది కావ్యం అంటారు2.
2[దోస్తోయెవ్‍స్కీ, కీర్కెగాడ్ సమకాలికులు. కాని దోస్తోయెవ్‍స్కీ రాయడం మొదలుపెట్టేటప్పటికి కీర్కెగాడ్ రాయడం ముగించేశాడు. కనుక ప్రభావం అనడంకంటే, వారిద్దరిదీ సమానస్వరమని చెప్పవచ్చు. దోస్తోయెవ్‍స్కీ ప్రారంభరచనల్లో (Notes from the Underground, The Dream of a Ridiculous Man) కీర్కెగాడ్‍లో లాగే వ్యంగ్యమే ప్రధానగుణం. కాని తన ప్రధాననవలల్లో (Crime and Punishment, The Brothers Karamazov) వ్యంగ్యాన్ని దాటి విషాదగాంభీర్యం అందుకున్నాడు.]
ఐజక్ బలి, సామాజిక సందేశం
అబ్రహాం కథ సమాజంలో ఎటువంటి అనర్థకరపరిణామాలకు దారి తీయదా? అసలే ధర్మం (మతం) పేరుతో హింస పెరిగిపోతున్న ఈకాలంలో ఇటువంటి కథలు ప్రవచనాలు ప్రమాదకరం కావా? ఆధ్యాత్మిక అధికారం ఉన్న ఏ కొద్దిమందికో మాత్రమే రహస్యంగా ఉపదేశించవలసినదా ఈ కథ? బాహాటంగా చర్చిలలో ఆదివారాలలో పాస్టర్ భక్త్యావేశంతో, గంభీరస్వరంతో, ఉదాత్తానుదాత్తస్వరసహితంగా ఈ కథ చెబుతూనే ఉన్నాడు వేల సంవత్సరాలుగా. ఎంతమంది తమ నిద్ర పోగొట్టుకున్నారు? కథ చెప్పిన పాస్టర్, ప్రవచనానికి పదిహేను నిమిషాలముందు వరకు సుఖంగా నిద్రపోయాడు. కథ విని ఇంటికి వెళ్ళిన భక్తులు అరగంటలో నిద్రపోయారు. నిద్రలో ఎవరూ కలవరించలేదు. తెల్లవారి ఎవరూ కథను తలవలేదు.
పాస్టరు చెప్పిన కథలో ఏమిటి లోపించింది? భయము, కంపము. లోకంలో సాధారణంగా వింటుంటాం, ఒకడు ఏమీ కష్టపడకుండా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైనాడని. ఆధ్యాత్మిక మార్గంలో అటువంటి అద్భుతాలు జరగవు. ఇక్కడ ప్రతిక్షణము చెమటోడ్చి సంపాదించుకోవలసిందే. ‘అబ్రహం నిద్రపోతూ గొప్పవాడైపోలేదు… కత్తి దూసినవాడే ఐజక్‌ను పొందుతాడు’ (పుట.57). లోకధర్మాన్ని అనుసరించి అబ్రహాం చేసేది హత్య. కాని పారమార్థికదృష్టిలో అది దైవప్రీతికోసం జరిపే యజ్ఞం. ఈ వైరుధ్యంలో ఉన్నది, నిద్రపోనివ్వని సంఘర్షణ, సంక్షోభం, కత్తికోత. ఆధ్యాత్మిక మార్గం అనుక్షణం కత్తి అంచుమీద నడవడం వంటిదే. విశ్వాసమహాసి మనిషిని రెండుగా చీల్చిగాని రక్షించదు. పాస్టర్ చెప్పిన అబ్రహాం కథనంలో లోపిస్తున్నది ఈ కత్తికోత. అది లేనిదే అబ్రహాం లేడు. ఈ కోత లేనిదే మనిషికి జీవం లేదు. ఆ కత్తికోత అస్తిత్వధర్మం.
అబ్రహాం కథను వాచ్యార్థంలో ఎవరూ గ్రహించరు. అందరికీ తెలుసు, అది ఒక రూపకం (allegory). రామాయణకథ విని ఎవడూ హనుమలా సముద్రం దాటే ప్రయత్నం చేయడు. ‘అబ్రహాం కథలో గ్రహించవలసిన పాఠం హింస కాదు, విశ్వాసం’ (పుట.61). విశ్వాసం హత్యను యజ్ఞంగా మారుస్తుంది.
అయితే, ఈ అబ్రహాంను ఎలా తెలుసుకోవడం? అతడు ఎలా మాట్లాడుతాడు (కా భాషా?). ఏం తింటాడు, ఎలా ఉంటాడు? అతని తల వెనుక ఒక వెలుగుచక్రం తిరుగుతూ ఉంటుందా? ఉండదు. నీలాగా నాలాగా మీ పక్కింటి బిల్ కలెక్టర్ లాగా, ఉప్పులో కలిసిన కప్పురంలాగా ఉంటాడు. ‘ఓస్, వీడా!’ అనేటట్టుంటాడు. జీవితకాలమంతా ‘వెదకి చూచినా’ అతడు ఎదురుగా నిలిచినా, అతన్ని మనం గుర్తించలేం.
జాన్ ఇద్దరు యోధులను చెబుతాడు. వైరాగ్య యోధుడు (Knight of Infinite Resignation); విశ్వాస యోధుడు (Knight of Faith). వైరాగ్యం మనిషి సంకల్పం, మనిషి నిర్ణయం, మనిషి నిశ్చయం. విశ్వాసంలో నాదేమీ లేదు, అంతా భగవదిచ్ఛ.
రాగం లేని వస్తువును వదులుకోడం వైరాగ్యం కాదు. ఇది విలువలేనిది, లేక దీనిపై నాకు విసుగు వస్తోంది, అన్న భావంతో వదులుకోడం వైరాగ్యం కాదు. విలువ తెలిసి, ప్రేమించిన వస్తువును వదలడమే నిజమైన వైరాగ్యం. అబ్రహాం లోకమంతటిలో తనకు అత్యంతప్రియమైన ఐజక్‌ను బలి ఇస్తున్నాడు. ఐజక్‌ను అంతగా ప్రేమించకపోతే అతని త్యాగానికి విలువ లేదు. వైరాగ్యం సామాన్యవిషయం కాదు. ఎంతో ధీరుడు నిర్జితేంద్రియుడు అయితే కాని తన సర్వస్వాన్ని ‘నాది కాదు’ (న మమ) అనలేడు. ‘అలా అనగలగడం తనను తాను శాశ్వతంగా గెలుచుకోడమే. శాశ్వతుడు పరమాప్తుడు అయిన పరమాత్మకు ప్రియమాచరించడమే’ (పుట. 77). వైరాగ్యంలో లక్ష్యమూ అల్పం కాదు కాని, లక్ష్యం స్పష్టం. విశ్వాసంలో లక్ష్యం తెలియదు. అది భగవదిచ్ఛ. అబ్రహాంకు ముందే తెలుసా, తిరిగి తాను ఐజక్‌ను పొందగలనని? తెలియదు. బలి అయినవాడు తిరిగిరావడమేమిటి? అర్థంలేని మాట. అసంభవం అని తెలుసు. అయినా అతని విశ్వాసం చలించలేదు. అసంభవమని తెలిసికూడా, సంభవమే అని విశ్వసించడమే నిజమైన విశ్వాసం. అసంభవం, వాస్తవం సంఘర్షిస్తూనే ఉంటాయి. అబ్రహాం కథలో పాస్టర్ వదిలేసేది ఇదీ, ఈ ఘర్షణ, ఈ వ్యథ. ఇదీ అస్తిత్వవాదంలో కీలకాంశం.
వైరాగ్యం విశ్వాసానికి మెట్టు. కాని సాగిపోవలసిన మెట్టు, ఆగిపోవలసిన మెట్టు కాదు. అబ్రహాం వైరాగ్యపు మెట్టు దగ్గరే ఆగిపోయి ఉంటే కూడా, అతడి త్యాగం సామాన్యమైనదేమీ కాదు. వైరాగ్యంలో కొడుకును భగవంతుడికి అర్పించి ఉంటే కూడా, లోకం అతన్ని మహాత్ముడు అని కీర్తించేది. అలా కోరినవారిని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అబ్రహాం అలా ఆగిపోలేదు. అబ్రహాం విరాగి కాడు. పితానైవమే నైవమాతాచ జన్మ నబంధుర్న మిత్రం అని సన్యాసిగీతం పాడలేదు. సుతునందు మోహవిచ్ఛేదము సేయుమయ్య అని ప్రార్థించలేదు. వైరాగ్యభావంతో ఐజక్‌ను బలి ఇవ్వడమంటే ఐజక్, అబ్రహాంకు అత్యంతప్రియమైన వస్తువు కాదనడమే కదా? అలా తనకు అనురాగం లేని తన కొడుకును తిరిగి పొంది, అతనితో జీవితం అబ్రహాం ఆనందంగా గడపగలిగేవాడా? భగవంతుడికి నివేదన చేసేది నీకు అత్యంతమూ ఇష్టమైన వస్తువు అయి ఉండవలె. ఇష్టంలేని వస్తువు నివేదించి, ఆ నైవేద్యాన్ని ఏం చేస్తావు? తినలేవు, చెత్తలో వేయలేవు. ఇష్టంలేని కందదుంప కాశీలో వదిలినట్టు. ఇష్టమైన వస్తువు నివేదన చేస్తే నైవేద్యం ప్రసాదం, పూర్వాధికప్రియం. ఇష్టం లేని వస్తువు ప్రసాదం కాదు, విషాదం. భగవత్ప్రసాదంగా తిరిగి పొందిన ఐజక్‌తో అబ్రహాం ఆనందంగా ఎలా జీవించగలడు? అబ్రహాం కోరింది పరలోకంలో మేలు కాదు. ఇహంలో ఆనందం. తనకు అత్యంతమూ ప్రియమైన ఐజక్‌ను నివేదించాడు. కనుక, భగవంతుడు ఐజక్‌ను తిరిగి తనకు యిచ్చినపుడు, మహాప్రసాదమని మహానందంతో స్వీకరించాడు. ప్రపంచాన్ని ప్రేమించు. దానిని భగవంతుడికి అర్పించు. అప్పుడు ప్రపంచం పూర్వాధికమధురప్రసాదమవుతుంది. వైరాగ్యం గొప్పదే. కాని ఈ విశ్వాసం దాని పైది. భగవంతునికి ఏదీ అసంభవం కాదు అన్న నమ్మకమే నిజమైన నమ్మకం (faith in the absurd).
వైరాగ్యానికి విశ్వాసం అవసరం కాదు. కాని విశ్వాసానికి వైరాగ్యం అవసరం. అది విశ్వాసానికి ముందుమెట్టు. ‘వైరాగ్యంలో నేను సర్వమూ పరిత్యజిస్తున్నాను. కాని, విశ్వాసంలో నేను ఏదీ వదులుకోడం లేదు. పైపెచ్చు, విశ్వాసంలో నేను సమస్తమూ పొందుతాను’ (పుట.77). ఈ తిరిగిపొందడాన్నే కీర్కెగాడ్ ఉభయచర్య (double movement) అంటాడు.
భక్తిజ్ఞానవైరాగ్యాల త్రికూటానికి అవతలిది విశ్వాసశిఖరం. అబ్రహాం ఆ ఆధ్యాత్మిక శిఖరంపై నిలిచి ఉన్నాడు.
– మనం విశ్వాసం వద్ద ఆగిపోవడం లేదు. దానిని దాటిపోవాలనుకొంటున్నాం. ఒకానొక కాలంలో విశ్వాసం ఒక జీవితకాల సాధన. దానిని మించి సాధించదగింది లేదు. ఈనాడు, ‘నేను విశ్వాసిని’ అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నాం. మనకు విశ్వాసం వద్దు. అది మూఢులకు. మనం మేధావులం.
– విశ్వాసం నీళ్ళను మద్యంగా మారుస్తుంది. మనకీనాడు మద్యం మంచినీళ్ళు.
మనకు మద్యం చాలు, నైవేద్యం వద్దు.
వైరాగ్యము విశ్వాసము భారతీయ వేదాంతంలో తరచు వినిపించే మాటలు. భారతీయ దృక్పథంలో వాటిని స్థూలంగా పరిశీలించవచ్చు. ముందుగా, పారిభాషిక పదాలు. ఇక్కడ faith అన్న పదానికి తెలుగు సమానార్థకంగా విశ్వాసం అన్న పదం వాడుతున్నాం. వైదికపరిభాషలో శ్రద్ధ అనే శబ్దం వాడుతారు. (శ్రద్ధయా ఆస్తిక్యబుద్దా. శం.భా.గీత.6.37.) ఆస్తిక్యబుద్ధి అంటే కేవలం భగవంతుడున్నాడన్న విశ్వాసం కాదు. భగవంతుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపి సర్వసమర్థుడు అన్న విశ్వాసం. మనిషికి అసంభవం అయింది, లోకం దృష్టిలో అసంబద్ధం అయింది, భగవంతుడికి సంభవమే. ఆయనకు ఏదీ అసంభవం, అసంబద్ధం కాదు. అది తెలియడమే నిజమైన శ్రద్ధ (faith in the absurd). అసంబద్ధమందు ఆస్తిక్యబుద్ధి.
వైదికపరిభాషలో శ్రద్ధ, వైరాగ్యము – వీటి వివేచన ఎలా చేశారు? వైరాగ్యం మోక్షానికి ప్రథమ కారణం అన్నారు. ఏమిటా వైరాగ్యం? నిత్యానిత్యవస్తువివేకఫలం. (మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంతమనిత్యవస్తుషు. వివేకచూడామణి. 69.) జాన్ ఏమంటున్నాడు? ‘వైరాగ్యంలో నేను సర్వమూ పరిత్యజిస్తున్నాను. విశ్వాసంలో నేను ఏదీ వదులుకోడం లేదు. పైపెచ్చు, విశ్వాసంలో నేను సమస్తమూ పొందుతాను’ (పుట.77). సర్వపరిత్యాగంలో నేను తిరిగి సర్వము పొందుతాను అన్నది వైదికభావం కూడా. అనిత్యాన్ని త్యాగం చేసి, నిత్యమేదో దానిని పొందుతాను. ఎలా? ఇదంతా ఈశ్వరునిదే అన్న భావంతో ఆయనకు నివేదించి, తిరిగి దానిని ప్రసాదంగా పొందడం. తేన త్యక్తేన భుంజీథాః (నా ఈశోపనిషత్తు వ్యాఖ్యకు ఉపశీర్షిక: ప్రవృత్తి-నివృత్తి-ప్రవృత్తి). ఇది కీర్కెగాడ్ చెబుతున్న ఉభయచర్య. అల్పాన్ని వదిలి అనల్పాన్ని పొందడం మంచి బేరమే కదా? యో వై భూమా తత్సుఖం. నాల్పే సుఖమస్తి (ఛాం. ఉప.7.23.1).
అబ్రహాం కథలో మూడు ప్రశ్నలు
- ధర్మాన్ని అతిక్రమించవలసిన సందర్భం ఉంటుందా?
- దైవం పట్ల ఉల్లంఘించరాని కర్తవ్యం ఉందా? అబ్రహాంకు తన కొడుకు పట్ల బాధ్యత లేదా?
- అబ్రహాం తన కర్తవ్యం సేరాకు గాని, ఎలిజార్‌కు గాని, ఐజక్‌కు గాని చెప్పకపోవడం న్యాయమా?
లోకధర్మాన్ని అనుసరించి, అబ్రహాం చేసింది హత్య. అబ్రహాం దృష్టిలో అది యజ్ఞం. హత్య యజ్ఞం ఎప్పుడవుతుంది? విశ్వాసంలో (faith). విశ్వాసమంటే I అసంబద్ధమే. సమష్టి కంటే వ్యష్టి ఉన్నతుడు. ఎలా? సమష్టి నుండి విడివడి కాదు. సమష్టిలో అంగమై, ఆ అంగమే సమష్టిని పొదుగుకొని దానిని మించి ఎదగడం. శ్రద్ధ అంటే వ్యక్తి, ఒక్కడు, సమష్టికంటే ఉన్నతుడు అన్న అసంబద్ధతే… సమష్టిలో అంగమై, ఆ ఒక్కడూ సమష్టి నుండి విడిగా నిలబడతాడు, విశ్వానికి అతీతుడైన విశిష్టుడిగా (పుట. 84). సమష్టిలో అంగమై, సమష్టిని దాటి పోవడమనేది తర్కానికి అందని అసంబద్ధం (absurdity), వైరుద్ధ్యం (paradox).
లోకం ఏమంటుంది? తల్లిదండ్రులను సేవించు. భార్యను పిల్లలను సోదరీసోదరులను ప్రేమించు. వారి పట్ల నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కాని, విశ్వాసం? ‘నా వద్దకు వచ్చినవాడు ఎవడైనా, తన తల్లిని తండ్రిని భార్యను పిల్లలను తోబుట్టువులను ద్వేషించకపోతే, అతడు నా శిష్యుడు కాలేడు’ (లూక్ 14:26). ఈ వాక్యాన్ని వ్యాఖ్యానిస్తూ సాధారణంగా, ద్వేషం (hate) అంటే ద్వేషం కాదు, తగుమాత్రం ప్రేమించు – అని అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తారు. అది సరి కాదు, భగవంతుడు ‘నీ భార్యను బిడ్డలను ఇంతగా ప్రేమించవద్దు, కొంచెం తక్కువ ప్రేమించండి’ అనడంలేదు. అబ్రహాం ఐజక్‌ను తక్కువ ప్రేమించలేదు. అతడికి ఐజక్‍ని మించి ప్రపంచంలో ప్రియమైన వస్తువు లేదు. కాని, అతడు చేసింది లోకం దృష్టిలో కన్న కొడుకును దారుణంగా ద్వేషించి, చంపడమే. దైవశాసనాన్ని ఉల్లంఘించి నిర్వర్తించవలసిన కర్తవ్యం ఏదీ లేదు.
నిర్ణయం లోకం దృష్టిలో అసంబద్ధము, అధర్మము అయినప్పుడు లోకం చెప్పినా అర్థం చేసుకోదు.
స్థూలంగా, హెగెల్ తాత్త్వికదర్శనం భారతీయ ధర్మంతో సమానమనవచ్చు. వ్యష్టి తనను సమష్టిలో లయం చేసుకుని, సమష్టి శ్రేయస్సుకొరకు జీవించవలె అంటాడు. సనాతనధర్మం చెప్పేది కూడా అదే. కాని, సనాతనధర్మం ఈ కర్మచక్రంతో ఆగిపోదు. కర్మచక్రాన్ని మించి మరేమీ లేదు అనేవారిని, నాన్యదస్తీతి వాదినః, భగవద్గీత ఖండించింది కూడా. భగవద్గీతలోని కర్మయోగాధ్యాయమంతా ఈ కర్మచక్రప్రవర్తకమైన ధర్మవిషయమే. కాని, అదే గీత, ధర్మాలనన్నిటినీ వదిలి నన్నే పట్టుకో, నిన్ను నేను కాపాడుతాను (సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ) అంటుంది. అంటే, లోకధర్మాలేవీ పరమం కావు. వాటిని వదిలి పరమాత్మను పొందు, అని అంటుంది. గీతలోని ఆ చరమవాక్యాన్నే కీర్కెగాడ్ ప్రతిధ్వనిస్తున్నాడు. హెగెల్ సమష్టి శ్రేయస్సు కోసం వ్యష్టిలయం చెబుతాడు. కీర్కెగాడ్ సమష్టిని స్వీకరించడు. గుంపులో గోవిందా, అతనికి నచ్చదు. మంద మందబుద్ధులకు అంటాడు. మంద అసత్యం (crowd is the untruth) అనేది అతని ప్రసిద్ధవాక్యం. (Everyone is the other and no one is himself. Every man is born as many men and dies as a single one – Heidegger.)
మనిషిని మందనుండి వేరుచేసి నిలపడం అస్తిత్వవాద మూలసత్యం. ఇది విశృంఖలవైయక్తికత కాదు. వ్యష్టి సమష్టి నుండి విడివడడం కాదు ముఖ్యం. మనిషి వ్యక్తిత్వం కంటే, అతని ఆత్మ (self) ముఖ్యం. సత్యం ఎవడికి వాడు తెలుసుకోవలసింది, ప్రతి ఒక్కడూ. ఒకడు తెలుసుకున్న సత్యం మరొకడికి పనికిరాదు. తను అనుభవించిన సత్యానికి అనుగుణమైన నిర్ణయం తానే తీసుకోగలుగుతాడు. ‘యుగాలుగా ఎందరో అనుసరించారు, నీవూ ఇదే అనుసరించు’ అనలేము. అలా అనడం ఎట్లా ఉంటుందంటే, ‘ఈ కళ్ళజోడు మా తాతలకాలంనుండి వాడుతున్నది, నీవూ వాడు’ అనడం వంటిదే. ఇది, స్థూలంగా వ్యక్తివాదం. సమాజం పట్ల ఏ మాత్రము బాధ్యతలేని విశృంఖలవైయక్తికత. కాని, కీర్కెగాడ్ ఆశయము ప్రయోజనము అది కాదు. అతడు కోరేది వ్యక్తి ముక్తి. ప్రతివ్యక్తి భగవంతుడితో ఐకాంతిక అనుబంధం ఏర్పరచుకోవచ్చు, ఏర్పరచుకోవలె. మధ్యలో సమాజము, చర్చి ప్రవేశించవలసిన అవసరం లేదు. అనర్థకరం కూడా. లోకధర్మం కంటే అతీతమైనది ఉన్నది. కాని, అదేదో నిర్వచించడం సాధ్యం కాదు. అర్థమయేటట్టు వివరించడం వీలుకాదు. లోకం దృష్టిలో అహేతుకము అసంబద్ధము అసంభవము అయింది ఎలా సంభవమో బుద్ధికి అందదు. కనుక వివరించడమూ కుదరదు.
భారతీయసంస్కృతిలో, పురాణాలలో లోకధర్మానికి అతీతమైన ఆచరణ అపూర్వమేమీ కాదు. అనేక కథలున్నాయి. ప్రసిద్ధమైనది, భాగవతంలోని దశమస్కంధంలోని రాసక్రీడలు. కృష్ణునికై గోపికల ప్రేమ లోకధర్మానికి అతీతమైనది. లోకం దృష్టిలో నిర్ద్వంద్వంగా అధర్మమే. లోకం ఎన్నటికీ అర్థం చేసుకోలేనిది, సమర్థించలేనిది. రాసక్రీడలు స్త్రీపురుషుల శృంగారం కాదని, అది జీవాత్మ పరమాత్మల సంయోగాన్ని అన్యార్థంగా చెప్పడమని, చెప్పి తప్పుకుంటాం. అది తప్పుకోవడమే. ఎందుకంటే, అలౌకికాన్ని ఆమోదించలేము, కథను కాదననూ లేము.
భగవంతుని పిలుపు వినబడినవానికి, లోకధర్మం ఎంత పెద్దగా అరిచి చెప్పినా, వినపడదు. ఆ వేణుగానం వినపడగానే, అత్త మామ భర్త బిడ్డ, లౌకిక బాధ్యతలు, అన్నీ విప్పి చలిమంటలో విసిరేసి పరుగెత్తుతారు. అయితే, ఆ వేణుగానం వినబడుతుందా? సమాజం ‘లేదు’ అంటుంది. మానసిక వైద్యుడు అంటాడు, ‘అది ఆమె వినడం కాదు, వినబడుతోందన్న జబ్బు’ (She is hearing voices). లోకం అర్థం చేసుకోలేనిది, వ్యక్తి తనకు తాను నిర్ణయించుకోకుండా ఉండలేనిది కీర్కెగాడ్ చెబుతున్న అసంబద్ధము. ఆ నిర్ణయం కేవలం తనకూ దైవానికి సంబంధించింది.
తరువాతి అస్తిత్వవాదులు దైవాన్ని తొలగించి, మనిషిని నిలిపే ప్రయత్నం చేశారు. ‘దేవుడు లేకుంటే ఏదైనా చేయొచ్చు’ అన్నాడు దోస్తోయెవ్‍స్కీ నవల కరమజోవ్ సోదరులు నవలలో ఇవాన్. నీచ అతిమానవుణ్ణి (Superman, Overman, Ubermensch) ఆవాహనం చేశాడు.
కీర్కెగాడ్ కు వీడ్కోలు చెప్పేముందు, అతన్ని గురించి చెప్పుకోవలసిన మాట ఒకటుంది. హైడెగర్ (Heidegger) అ-వస్తువును (No-thing) కనిపెట్టెను అని చెప్పుకుంటారు ఈనాడు, భారతీయులు శూన్యము (zero, సున్నా) కనిపెట్టిరి అన్నట్టు. కాని ఈ ఖ్యాతి, లేక కొందరి దృష్టిలో అపఖ్యాతి, కీర్కెగాడ్ కు చెందవలె. (నఞ+వస్తువు, అ-వస్తువు, No-thing, అవిషయము, అసత్, శూన్యము, అభావము.)
‘ఈ స్థితిలో [అవస్తుస్థితిలో] విశ్రాంతి, ప్రశాంతి; అదే సమయంలో మరొకటి కూడా ఉంటుంది వీటికి భిన్నంగా, కాని అది విభేదం కాదు ఘర్షణ కాదు. ఎందుకంటే ఘర్షణ పడడానికి మరొకటి లేదు. మరి ఏమిటది? అవస్తువు (Nothing). అయితే, ఆ అవస్తువు ఏ భావస్థితిని కలిగిస్తుంది? అది భయం (dread) కలిగిస్తుంది. [పాపమెరుగని] అమాయకత్వంలోని మహద్రహస్యం యిదే, అది ఏకకాలంలో భయం కూడా. ఆత్మ తన వాస్తవం తాను సృజించుకొంటుంది, కాని ఆ వాస్తవం అవస్తువు, యీ అవస్తువు నిరంతరం అమాయకత్వం తన వెలుపల చూస్తుంది.’
‘In this stage there is peace and repose; but at the same time there is something different which is not dissension and strife, for there is nothing to strive with. What is it then? Nothing! But what affect does nothing produce? It begets dread. This is the profound secret of innocence, that at the same time it is dread. Dreamingly the spirit projects its own reality but the reality is nothing, but this nothing constantly sees innocence outside of it.’ (Kierkegaard: The concept of Dread)
కీర్కెగాడ్ వాక్యాన్ని (Nothing! It begets dread) హైడెగర్ తిరగతిప్పి చెప్పాడు (Dread reveals No-thing).
‘సరి అయిన భయం పొందగలిగినవాడు అతిముఖ్యమైన విషయం తెలుసుకున్నాడు… భయం మనిషికి మాత్రమే సాధ్యం.’
‘He therefore who has learned rightly to be in dread has learned the most important thing”… “It is only human beings that can be in dread’. (Kierkegaard: The Concept of Dread)
ఈ విషయం, లేక అవిషయం, హైడెగర్ అధ్యాయంలో వివరంగా చర్చకు అంశం.