బ్లిస్ హోమ్

మీరు వెళ్లిపోయారు –
తలదాచుకున్న గూటిని గానీ
గూడులాంటి మీ బొందిని గానీ
తీసుకుపోకుండా;
సంపాయించుకున్న సంతోష రేఖల్ని గానీ
పోగొట్టుకున్న విషాద గురుతుల్ని గానీ
మోసుకుపోకుండా;
ప్రేమాద్వేషాలు సహా దేన్నీ
మూటగట్టుకుపోకుండా;
ఉన్నచోటే అన్నీ వదిలేసి
ఏ ఒట్టి చేతులతో వచ్చారో అలానే
తిరిగి వెళ్లిపోయారు.

మీరు ఖాళీ చేసిన ఇంటిలో
కొత్తగా మేము అడుగుపెట్టాం
మళ్ళీ మీరెక్కడ ఏ నేలమ్మ కడుపున
ఎంత చక్కటి వసతులున్న ఏ గడ్డమీద
ఏ ఆకాశకుటీరం లాంటి అతిథి గృహంలో అడుగుపెట్టారో…
మేమక్కడికొచ్చేసరికి అది కూడా ఖాళీచేసి
వేరొక అవని మీద మరో ఇంటికి వెళ్తారా?
ఇంటి నుండి ఇంటికి
ఈ విస్థాపన ఎన్ని యుగాలు!

మీ పురాస్మృతుల జాడల్లో సాగుతున్నాం
మీరు నడయాడిన ప్రతి యింటిని
మా గుండె నెలవులో బొమ్మగీసి పెట్టుకున్నాం
మీ ప్రతి ఆవాసం మా ఆనందాల రాజసౌధం
మా ఒక్కో నివాసం మీ జ్ఞాపకాల రాజధాని!

ఏ నేలైనా ఊహించిందో లేదో గానీ
మట్టిమంచం దిగువపొరల నుండి వచ్చే
మీ దీర్ఘశ్వాసలతో
కొన్ని లేతమొక్కలు ఊపిరిపోసుకోవడం
పైన గాలైతే గమనించింది.

ఆ మొక్కలూ మొదళ్ళ చుట్టూ మన్నూ
పచ్చని తోటగా కొత్తరూపులెత్తాక
కొమ్మకొమ్మకూ పిట్టలు చేరికయ్యాయి
వాటిలో యాంగ్రీబర్డ్స్ కొన్నుంటాయని
అవి యుద్ధానికి కాలు దువ్వుతాయని
మాకు తెలీలేదు
మీకూ తెలిసినట్టు లేదు.

ఈసారి ఈ భూసదనం నుండి
వేరెక్కడో మీరుండే పుడమిటింటికి
వసతి వెదుకుతూ మేమొచ్చేసరికి
మీరక్కడ ఖాళీ చేయకుండా ఉందురూ…
ఒక్కసారైనా ముఖాముఖి కలుసుకోవాలి
మీతో బోలెడు కబుర్లు పంచుకోవాలి
మన పచ్చని తోటల్లో చిచ్చుపెట్టే
యాంగ్రీబర్డ్స్ అన్నింటినీ ఏరిపారేయాలి.

రేపు మేము ఖాళీచేసే నివాసంలోకి
రాబోయే అతిథుల కోసం
‘బ్లిస్ హోమ్’ లాంటి స్వచ్ఛమైన పుడమినీ
అమితాభ లాంటి ఆనందాల విడిదినీ
మిగిల్చాలి!