కిటీకీలోంచి రోడ్ మీద పోయే కార్లు కనిపిస్తున్నాయి. ఎక్కడో హారన్ మోగీ మోగనట్టు. గడియారం మూడు గంటలు కొట్టింది. ఇద్దరి మధ్యా రెండు కాఫీ కప్పులు.
అతడు తల అడ్డంగా ఊపాడు నవ్వుతూ.
“ఏమయింది?” ఎదురుగా కూచున్న మిత్రుడు అడిగాడు.
“మళ్ళీ మొదటికొచ్చాం!”
“మొదటికి రావడమేమిటి?”
“నీతో చెప్తూనే ఉన్నాను. మొదటికొచ్చేసరికి నీకేమీ గుర్తుండదు. మనమొక లూప్‌లో పడిపోయాం.” మిత్రుడు నోరు తెరిచి ఏదో అనబోయేంతలో చేయెత్తి వారిస్తూ అన్నాడు. “నువు నమ్మవని తెలుసు. అయినా చెప్పాలి. ఇదే లూపో నాకు తెలియడంలేదు. మామూలుగా అయితే నా లోపాల్ని దిద్దుకుంటూ, చుట్టూ జరిగే అవకతవకలేవో సరిచేస్తూ, అందరి కథలూ సుఖాంతమయ్యేలా చేసినప్పుడు లూప్ లోంచి బయట పడాలి. ఇక్కడ నాకా అవకాశం ఏదీ దొరకడం లేదు. అంతా ముందే రాసినట్టు నేనివే మాటలు తూచా తప్పకుండా మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఒక జరిగిపోయిన సంఘటనను మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ చేయమని నిర్దేశించబడినట్టు ఇంతకు ముందు లాగా, తర్వాత జరగబోయేలా తప్ప మరేదీ చేయలేం నువ్వూ నేనూ.”
“ఏం మాట్లాడుతున్నావు?”
“నేనిప్పుడే నిన్నిక్కడే వొదిలేసి వెళ్ళిపోవొచ్చు. కానీ లేవను, లేవలేను.”
“నువ్విలాగే మాట్లాడితే నేనే వెళ్ళిపోతాను.”
“నాకు తెలుసు నువ్వా మాట అంటావని. కానీ నువ్వూ వెళ్ళవు, నేనూ వెళ్ళను.”
“అయితే ఏం జరుగుతుందంటావు ఇప్పుడు?”
“ముందు ఆ మూలన కూచున్న టేబుల్‌లో చిన్న పాప స్పూన్ కింద పడేస్తుంది. తర్వాత డోర్ తెరుచుకుని జీన్స్, తెల్ల చొక్కా వేసుకున్న కుర్రాడు, గోధుమరంగు మీద తెల్ల పోల్కా డాట్స్ ఉన్న డ్రెస్ వేసుకున్న అమ్మాయీ పెద్దగా నవ్వుకుంటూ వస్తారు.”
ముందు ఆ మూలన కూచున్న టేబుల్‌లో చిన్న పాప స్పూన్ కింద పడేసింది. తర్వాత డోర్ తెరుచుకుని జీన్స్, తెల్ల చొక్కా వేసుకున్న కుర్రాడు, గోధుమరంగు మీద తెల్ల పోల్కా డాట్స్ ఉన్న డ్రెస్ వేసుకున్న అమ్మాయీ పెద్దగా నవ్వుకుంటూ వచ్చారు.
“ఇంటరెస్టింగ్! అయితే తర్వాత ఏం జరుగుతుంది?”
“నీకు ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. నాకు తిక్క పుట్టుకొస్తూంది. ఈ లూప్ నుంచి ఎట్లా బయటపడాలో తోచక కొట్టుకుచస్తున్నాను. నాకేమనిపిస్తుందంటే, నన్ను నేను సరిదిద్దుకునే అవకాశం లేకపొతే, నిన్ను సరిదిద్దడమే దీన్నుంచి విముక్తి అని. ఇప్పుడు నిన్నా తప్పు చేయకుండా ఆపగలిగితే బయటపడిపోతాం!”
“ఆగాగు, నేను బయటే ఉన్నాను. ఇంతకూ ఏ తప్పు చేస్తానంటావు?”
“మూడూ యాభై ఆరుకి నీకు ఒక మెసేజ్ వస్తుంది. నువు దాన్ని చూస్తావు. నీ జేబులో గన్ తీసి నన్ను కాల్చి చంపుతావు.”
మిత్రుడు పగలబడి నవ్వాడు. “నీకు నిజంగా తిక్కే పట్టింది. నేనెందుకు చంపుతాను నిన్ను? ఏమోలే, ఈ సోది ఇట్లాగే చెప్తూంటే నాకే చిరాకేసి కాల్చిపడేస్తానేమో!” అని మళ్ళీ నవ్వాడు.
“అదే నాకూ అర్థం కానిది. ఆ మెసేజ్‌లో ఏమున్నదో ఊహించలేను. నేను నీకు చేసిన ద్రోహం ఏదీ లేదు. మన బిజినెస్‌లో డబ్బులేమీ నొక్కేయలేదు. అయినా అంతమాత్రానికే కాల్చిపడేయరు కదా ఎవరూ! నీ గురించి చెడు ప్రచారమేదీ చేయలేదు నేను. నీకు రావలసిన దేన్నీ తన్నుకుపోలేదు. మా మధ్య ఏదన్నా నడుస్తుందని అనుమానించడానికి సుజనతో అంత క్లోజ్‌గా ఎప్పుడూ లేను.” ఆగి అన్నాడు, “ఎవడన్నా నా మీదో, సుజన మీదో కోపం పెట్టుకుని ఫొటోలు మార్ఫింగ్ చేసి నీకు పంపుతారంటావా?”
మిత్రుడేమీ మాట్లాడలేదు. కప్పు తీసుకుని పైకెత్తి తాగకుండానే కిందపెట్టాడు.
“నేను చెప్పేదేమిటంటే, ఆ మెసేజ్ నువ్వు చూడకు. చూసినా అందులో ఏముంటే అది గుడ్డిగా నమ్మకు. కోపం తెచ్చుకోకు. నీకేదో తెలిసిపోబోతుందని నేనేమీ నాటకాలు ఆడట్లేదు. నీకు తెలుసుగా ఎన్ని అబద్ధాలు నిజాలుగా చలామణీ అవుతున్నాయో! నువు చూసింది తప్పని నేను నిరూపిస్తాను. అందుకు ఒక్క అవకాశమే నేనడిగేదల్లా.”
“నాకంత కోపం రావడం చూశావా ఎప్పుడయినా? ఈ గన్ కూడా సెక్యూరిటీ కోసమే పెట్టుకున్నాను గానీ! ఇప్పుడే ఈ గన్ నీకిచ్చేద్దును గానీ, అది నన్ను నేను అవమానించుకున్నట్టే!”
అతను నవ్వాడు. “తెలుసు, నాకు తెలుసు. మన సంభాషణ అచ్చం ఇలాగే నడవాలి.” ఆగి అన్నాడు, “నాకు ఆశ్చర్యమేసేది ఎక్కడంటే నాకు మళ్ళీ మళ్ళీ ఇది జరగడమే తెలుసు గానీ ఇది మొదటిసారి జరగడం గుర్తులేదు. అప్పుడది ఇలా ముందు జరిగినట్టు నాకు తెలిసి ఉండదు కదా! నాకు గుర్తున్నదల్లా ఇలా లూపులో పడి కొట్టుకోవడం.”
మళ్ళీ అతనే అన్నాడు. “ఇదంతా చెపుతున్నాను కానీ దీనివల్ల జరగబోయేది ఇసుమంతైనా మారబోదని తెలుసు. తప్పనిసరిగా అనుకున్నదే జరుగుతుందని తెలియడంలో ఒక సుఖముంది. మళ్ళీ ఇంకో అవకాశమున్నదన్న ఆశ కూడా.”
“అయితే ఇదంతా ముందు జరిగినదనీ, ఇదే జరగబోతుందనీ నువు నిజంగానే నమ్ముతున్నావన్నమాట!”
“అదేమిటి ఇందాకట్నుంచీ నేను మొత్తుకునేది విని కూడా. తర్వాత ఏం జరగబోతుందో చెప్పి చూపించాను కదా!”
“అవి నువ్వు ముందే ఏర్పాటు చేసి ఉండొచ్చు! ఇట్లా అనుమానిస్తానని నీకు ముందే తెలియదు కదా!”
అతను నవ్వాడు. “తెలుసు. ఇదంతా మనం ఒక కథలో ఇరుక్కుపోయినట్టు. మనం ఉన్న ఈ రీల్ ఆటో-ప్లేలో పదేపదే నడుస్తూన్నట్టు. నా దురదృష్టమేమిటంటే ఆ విషయం నా ఒక్కడికే గమనింపుకు రావడం. ఇప్పుడు మనం ఇలా తప్ప మరోలా ఆలోచించలేం, ప్రవర్తించలేం!”
మిత్రుడి సెల్ టింగుమంది మెసేజ్ వచ్చినట్టు. తీసి చూశాడు. చూస్తుండగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి. మొహం జేవురించింది. అసహ్యమూ క్రోధమూ నిండిన కళ్ళతో అతడి వైపుకు చూస్తూ “ఇందుకా ఈ డ్రామా అంతా ఆడుతున్నావు అప్పట్నుంచీ, నిన్ను వదలకూడదు!” అంటూ జేబులోంచి గన్ తీసి కాల్చాడు. అతని తల కిటికీ వైపు వొరిగింది. ఏదో చెప్పబోయేందుకు తెరిచిన నోరు నవ్వుతున్నట్టు ఉంది.
కిటీకీలోంచి రోడ్ మీద పోయే కార్లు కనిపిస్తున్నాయి. ఎక్కడో హారన్ మోగీ మోగనట్టు. గడియారం మూడు గంటలు కొట్టింది. ఇద్దరి మధ్యా రెండు కాఫీ కప్పులు.