శ్రీసుధ మోదుగు కథల్లో మొదటి వాక్యం ఎప్పుడూ టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్ లాంటిది. కథ లోతు ఊహించలేం. ఇంకా చెప్పాలంటే, పజిల్ బిల్డింగ్ బ్లాక్స్‌లో ఒక ముక్కను విసిరేసి పాఠకులను మేధోపరమైన ఆటకు ఉద్యుక్తులను చేసినట్టే.
ప్రస్తుత పుస్తకం జాగృత స్వప్నంలో కథలు అంతకుముందు ఈమాటలో చదివినవైనా ఇలా ఒకచోట ఒకసారి చదవగలగడంలో సౌలభ్యం, ప్రయోజనం ఎక్కువ. కథలన్నిటిలో దాగి ఉన్న ఏక ప్రధాన సూత్రాన్ని చూడగలరు పాఠకులు.
పుస్తకం శీర్షికలో కల ఉన్నది. మెలకువ ఉన్నది. ఈ కలల ప్రముఖత కానీ వాటి ఉనికి కానీ మొదట్లో పాఠకుల గ్రహింపుకు రాదు, ఎంత శీర్షికలో ఉన్నా ఆ మాట.
కథ చాలా మామూలుగా సాదాసీదా వాస్తవ జాగృత ప్రపంచంలోనే మొదలౌతుంది. కథాగమనంలో ఎప్పుడు మరో వేరే తలంలోకి వచ్చిపడ్డామో తెలియదు. కలలే కాదు, జ్ఞాపకాలు, కలలూ జ్ఞాపకాలు పెనవేసుకున్న అనుభవాలు, అతీంద్రియ శక్తులు; రెక్కలతో, నాలుగు కాళ్ళో, వెన్నెముక లేని మెత్తగా సాగే శరీరాకృతో రావటం, ఇవన్నీ కథలో అహమిహగా వచ్చేస్తుంటాయి.
సరే!
మరి వీటి పని ఏమిటి ఇక్కడ? ఆ పనిని అవి ఎంత సమర్థవంతంగా చేస్తున్నాయి? వాటి వల్ల కథకు ఏమిటి ప్రయోజనం?
మొదటి ప్రయోజనం కథను ఆసక్తికరంగా చదివించేట్టు చేయడం. రెండవది, అసలు కథంతా అందుకోసమే రాసినది; ప్రధాన పాత్రలకు, తమకు ఉన్నాయనే తెలియని ప్రశ్నలు, వాటి స్వరూపాలు వాళ్ళకి తెలిసిరావటం. మూడవది వాటికి సమాధానం ఆ మాధ్యమాల ద్వారానే దొరకటం.
ఈ క్రియలకు స్థలం కాలం ఉన్నాయా? ఆ రెండూ భౌతికంగా ఉండనవసరం లేని జాగృత స్వప్నావస్థలను దాటిన స్థితిలో జరిగిన కథలివి.
Self psychoanalysis, psychotherapy and healing జరుగుతున్నదా ఈ పాత్రలకు అనిపించే ఇటువంటి కథలకు అవసరమైన మనిషి సైకాలజీకి సంబంధించిన పరిజ్ఞానం రచయిత్రికి ఉండటం వల్ల ఈ కథనాలు సులభం అయి ఉండవచ్చు. కానీ, ఎక్కడా ఆ వైద్యపరిభాష రచనలో ప్రదర్శింపబడలేదు.
ఇంక, కథనం విషయానికి వస్తే, కథ మొదలు నుంచే చదువరికి అప్రమత్తత అవసరం. ఒక వాక్యం దాటేసినా, వెనక్కి నడవవలసి ఉంటుంది జారవిడిచిన క్లూ కోసం వెదుకుతూ. మూడు, నాలుగు పేజీలకు మించి ఉండని ఈ కథలు మనిషి తాలూకు బాహ్యాంతర ఆవరణల సమస్తమే కాక, వారి చేతన ప్రయాణించే వివిధ తలాలను దృశ్యమానం చేస్తాయి. దృశ్యాలు క్షుణ్ణంగా విశదంగా కనపడుతూనే, తర్కంతో ఛేదించలేని ఒక పారదర్శక మార్మికత తెర వెనక నిలుచుని ఉంటాయి. దాన్ని బట్టే జాగృతికీ సుషుప్తికీ మధ్యదైన స్వప్నావస్థను ఒకటిగా కాక అక్కడ చైతన్యాన్ని ఎన్నో పొరలున్నదానిగా చూస్తాం.
కాబట్టే, పరస్పర విరుద్ధమైన రెండు సమర్థతలను – కథను మేధతో తార్కికంగా వివేచించగలగడం, అదే సమయంలో కథలోకి పోయేకొద్దీ ఆ తార్కికమేధను విడిచిపెట్టగలగడం – పాఠకుల నుంచి కోరే రచనలు ఈమెవి. ఈ రెండూ ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా కాకుండా రిలే మారథాన్ రేసులో ఆటగాళ్ళలా పనిచేస్తేనే శ్రీసుధ కథల ఆంతర్యం లోకి ప్రవేశం దొరికేది. గట్టి వాస్తవంలో మొదలైనట్టు కనపడుతూ కథ ఒక్కోసారి ఒక్క దుముకులో, కొన్నిసార్లు మెల్లిగా, ఈ తార్కికతలం నుంచి అతీంద్రియావస్థల తలాలలోకి పాకిపోతుంది.
‘గణా!’ అంటూ మెలకువ లోని సంభాషణ జ్ఞాపకం రావడంతో మొదలైన ‘విభాజకం’ కథ, గణ చేసే అనేక యోచనల స్మృతుల తర్జనభర్జనలతో సాగి ఊగి రైలు ప్రయాణంలో రాత్రి నిద్ర లాగా, తీరా తనకు కావలసిన మనిషిని తనున్న ప్లాట్‍ఫామ్ మీదకు తీసుకురావలసిన రైలు వచ్చేసరికి అతని స్థితి మారిపోయింది. రైలెక్కి పారిపోయింది అతని చేతన. ఇప్పటి ఈ పరుగు, వర్తమానం నుంచి చేస్తున్న ఈ పలాయనం అతని జాగృతా? స్వప్నమా? ఇది విముక్తి అనుకోవాలా విభజన భీతి నుంచి, అందులో ఓటమి అనుకోవాలా?
స్వతహాగా అలౌకిక శక్తులు ఉన్న ‘ముజు’ వంటి వారిని లోకం బహిష్కరిస్తుంది. ముజు వదిలేసిన ద్విపాదసంచార లోకాన్ని విసర్జించి వెళ్ళిపోతారు అలౌకిక నిధి విలువ తెలిసిన మిగతావారు కూడా, చతుష్పాదులుండే అడవే మేలని. ‘రబీరా’లో గాడిద మనిషి హెన్నీ, మేను చెయ్యి పట్టుకుని నీవు దేవతవు అన్నాడు. పూర్వం ఒకడు ఆమెను విషం నిండిన దయ్యం అన్నాడు. జంతువులకు స్పర్శ సునిశితం కదా అనుకోవాలి.
జాగృత స్వప్నం కథల్లో పలు విదేశాలలో మనవాళ్ళు, మరో పరాయి చోటునుంచి అక్కడకు వలస వచ్చినవారూ ఉంటారు. ప్రవాసుల బ్రతుకులు, వాటి అధ్వాన్నత, కథలుగా వస్తే అందులో సామాన్యంగా వలసవెళ్ళిన వారు పరాయితనం ఫీలవుతూ చెప్పిన కథలు ఎక్కువ ఉంటుంటాయి. ఈమె కథలు ఆ దేశాల నేటివ్‌లు, అబారిజినల్స్ వైపు నుంచి చూసిన కథలు.
నిజానికి, సూక్ష్మంగా చెప్పాలంటే ఈ కథలు నేటివ్స్, ఇమిగ్రెంట్స్, వారి వారి దృక్పథాల గూర్చి కంటే మౌలికమైన మానవుల ‘నేటివిటీ’ని మాట్లాడిన కథలు అనిపిస్తుంది. మనిషి లోపల ఎంత మంది జనం, ఎన్ని తత్వాలు పరాయివారిలా వచ్చి తరతరాలుగా అక్కడే నివాసులుగా నిలబడిపోయారో, వారికీ వారి వల్ల అసలు మనిషికీ కలిగే సాధక బాధకాలేంటో ఈ కథల్లోని విషయం. ఎవరు స్వదేశస్తులో, ఎవరు ప్రవాసులో ఎవరిది దురాక్రమణో తెలియకుండా సఖ్యత లేని సహజీవనం చేస్తుంటాయి విరుద్ధ గుణాలు ఒకే మనిషి లోపల.
మౌలికంగా అదే ఈ కథల సబ్జెక్ట్.
అందుకే శ్రీసుధ కథల్లో మనుషులు మంచివారా చెడ్డవారా, మతి స్థిమితం లేనివారా తెలివైనవారా అనే పాఠక విచారణకు నిలబడరు. ఒకవేళ ఏదో ఒక పరీక్ష అనివార్యం అనుకుంటే ఆమె పాత్రలన్నీ తమకు తాము చేసుకుంటున్న మనస్తత్వ విశ్లేషణలో ఎంత దూరం వెళ్తున్నాయో, అంతర్హితంగా వాళ్ళలోనే ఉన్న సత్యానికి వాళ్ళెంత చేరువగా జరుగుతున్నారో చూడవచ్చు.
కథల్లో ప్రధాన వ్యక్తులకు తక్కిన పాత్రలకూ తేడా ఇదే. ప్రధాన పాత్ర తనకు వివేకాన్ని కలగనివ్వడమే, దాని వివరమే కథలో విషయం. అందుకు తోడ్పడేవే తక్కిన పాత్రలు. అవి స్థలాలు కావచ్చు, కాలాలు కావచ్చు, పాంచభౌతిక వాతావరణం కావచ్చు, స్మృతులు, కలలు, కలల్లో అగుపడే జంతువులు, అలౌకిక జీవులు కావచ్చు. గతించిన కాలాల మనుషులు, ‘ది గోల్డెన్ టస్క్’లో పెరియార్, ‘కాసిల్ ఆఫ్ ఆల్బకర్కీ’లో వెంటాడే ఆత్మ, ఆల్బెర్తో గోన్సాల్బెస్ వంటి వారూ ఉండవచ్చు.
కానీ, నిజానికి వీటినన్నిటినీ సృష్టించుకున్నది ఎవరు? ఎందుకు? వీటి పని ఏంటి?
తమ, తమ ఆంతరిక రంగులు, లోతులు తెలుసుకోవడానికి ఆ పాత్రలు చేసుకున్న సృజనలే ఇవన్నీ అని అనుకోవలసిందే.
మెలకువలో దొరకని తెగువను మనిషికి కల ఇస్తుంది, తన లోపలి శత్రువును నేరుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే తెగువను. పశుప్రవృత్తి అంటూ తప్పు పడతాం కానీ పశువులకు ప్రవృత్తి ఒక్కో రకానికి ఒకటే ఉంటుంది. అదీ తేటతెల్లంగా ఉంటుంది. ఈ కథల్లో ప్రొటాగనిస్ట్‌కు సగం విజయం తన ప్రవృత్తి ఏ రకమైనది అని సులువుగా చూసుకోగలగడంలో ఉంది, కలలో కనిపించిన పశు ప్రతీకలతోనే అది సాధ్యమైంది.
ఈ పద్ధతిలో మనిషి తన అస్వస్థతను నూరుశాతం సరిగ్గా నిర్ధారించుకుంటాడు. Diagnosis is the cure.
ఈ ‘గ్రహింపు’ అనే ప్రక్రియ ముగిసేటప్పటికి మిగిలిన మనిషి, కథ మొదట్లో కనపడిన మనిషి ఒకరు కాదు. ప్రక్షాళన, శుశ్రూష, పరామర్శ, స్పష్టతతో తనకు తనను ఆవిష్కరించుకున్న మనిషికి బయటకు వచ్చాక మెలకువలో మొదటి పరీక్ష, ‘ఇక శాండ్రా కోరిక ఇంకా చేతిలో ఉన్న పేపర్లు’గా ఎదురవుతుంది.
‘పరి అలియాస్…’ కథ ఒకటే పూర్తి మామూలుగా నడిచిన కథ అనిపిస్తూనే, పరి కథ చివర అనే మాట, ‘కొన్ని విషయాలను ఎక్కువ అర్థం చేసుకోవాలని, లోతుగా తెలుసుకోవాలనీ అనుకోకూడదేమో’ అనగానే అల్లరిగా నవ్వుతున్న సత్యం గుర్తు వచ్చాడనడంలో చమత్కారం!
ఇక్కడ సత్యం ఒక మనిషా?
తనను మించి తనను తరచిచూడగలదెవరు అనే సూత్రం మీద నడుస్తాయి సుధ మోదుగు కథలు. మనిషి ఆంతరీకంలో అనాదిగా బందీలై ఉండిపోయిన పలు మృగాల కథలివి. చిన్నచిన్న ఈ కథలు ఒక్కో దాంట్లో ఒక పూర్తి జీవితం ఉంది…
పెద్ద సముద్ర శబ్దాన్ని తనలో మోస్తున్న శంఖం వలెనే.
సంపుటి: జాగృత స్వప్నం
రచన: శ్రీసుధ మోదుగు
ప్రచురణ: బోధి ఫౌండేషన్, 2024.
వెల: ₹150.00
ప్రతులకు: నవోదయ, అమెజాన్.