రచయిత వివరాలు

పూర్తిపేరు: శ్రీకాంత్
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

నేనొక్కడినే కూర్చున్నాను అక్కడ, పిగిలి –
ఎదురుగా, ఎవరో
తరుముతున్నట్లుగా, పరిగెత్తి పోయే

నీడ లేని మనుషుల్లో, నువ్వూ కలిసిపోయి
క్షణకాలం ఆగి, నను
వెనుదిరిగి చూసి, వాళ్ళలో కనుమరుగై!

అక్కడ! వెలసిపోయినా పాత చీరలో
కళ్ళు చికిలించి
పగుళ్ళిచ్చిన అరిపాదంపై పెగిలిన

చర్మాన్ని, నీ వొణికే వేళ్ళతో లాగుతూ
గేటు వంకా, ఆపై
వీధి వంకా, మాటి మాటికీ చూస్తూ

ఇప్పుడూ అదే అంటున్నాను, నువ్వు ఎటో వెళ్ళిన తరువాత మిగిలిన నిశ్శబ్దంలో, ఆవరణలోని రాతి అరుగుపై కూర్చుని. అదే వేసవి, అదే ఇల్లు. నీ మోకాళ్ళు కలుక్కుమన్నట్లు చప్పుళ్ళు, ఎండి రాలే వేప ఆకుల్లో, సన్నని కొమ్మల్లో. వెన్నెల రాత్రి కాదు కానీ, వేసవి కాంతి ప్రజ్వలించే పగలు! ఏం చూడగలను నేను? ఇప్పుడేవీ స్పష్టంగా కనపడవు. కనిపించే ప్రతీదానిలోనూ, బొత్తిగా పేరుకున్న ఎప్పటివో చిహ్నాలు. చేతివేళ్ళకు మట్టి. ఖాళీ వీధి. ఎండిన నేల.

మంద్రమైన వెన్నెల, నీలోకి చేరినప్పుడు –
అలలు, ఒడ్డుని మెత్తగా
తాకే శబ్దం నీలో అప్పుడు: నీలోని

వ్యర్ధాలని కడిగి, ఆ చేతులు వెనకకు ఇక
వెళ్ళిపోయినప్పుడు –
తిరిగి, నీ మెడ చుట్టూ చేరినప్పుడు

మధ్యలో ఎందుకో ఆ కనురెప్పలు తెరచి
ఎరుపు మొగ్గల్లోంచి
నిను చూస్తో, చిన్నగా నవ్వినప్పుడు

నీ చేతిని తమ చేతిలోకి తీసుకుని, తిరిగి
కళ్ళు మూసుకుని
ఆ భద్రతలో ఎటో తేలిపోయినప్పుడు!

చెట్టుపైకి వొంగి, చెమ్మగిల్లిన నింగి –
రాలిపోతున్న పసుపు
వేపాకులు. పాలిపోయిన ఆ కాంతిలో

చెట్టు బెరడుని గీకుతూ, గుర్రుమనే పిల్లులు –
కంపించే నీడలు –
అక్కడక్కడా పిల్లలు వొదిలి వేసిన

పగిలిన బొమ్మలు. అద్దం పెంకులూ –

“నన్నొదిలి వెళ్ళిపోతావా నువ్వు?”
అన్నది తను! నాని, పెచ్చులు ఊడిపోతోన్న
ఆ ఇంటిని గట్టిగా మరి నా ప్రాణం
పోతున్నంతగా హత్తుకుని అన్నాను ఇక:
‘లేదు. ఉంటాను, నీతోనే నేను’

ఒత్తిగిల్లి ఒకవైపుకి, నిద్రపోతోంది
అమ్మ. నానిన
ఆకుల వాసనేదో గదిలో. తన

నిద్రలోనూ ముఖంలోనూ, వాన
ఆగాక బయల్పడే
మృదువైన వెలుతురు, గాలి –

ఇక్కడ, చినుకులు రాలుతున్నవి. నువ్వు సాకిన రెక్కలపై అవి పడి, ఒక జలదరింపుకి, శరీరం మనస్సూ గురి అవుతున్నవి. ఎవరివో ముఖాలూ మాటలూ గొంతుకలూ జ్ఞప్తికి వస్తున్నవి. ప్రేమించిన వాళ్ళూ, ద్వేషించిన వాళ్ళూ, ఏదో ఆశించే దరిచేరే వాళ్ళూ, నకలుగా తయారయ్యి నిందించే వాళ్ళూ, ఉన్నవాళ్ళూ లేనివాళ్ళూ, ఉండి వెళ్ళిపోయిన వాళ్ళూ, వెళ్ళిపోవడంతోనే మిగిలినవాళ్ళూ – ఇలా ఎవరెవరో – మబ్బుపట్టి, చినుకులై రాలుతుంటిరి.

అమ్మ, ఉద్యోగానికి వెళ్ళేది-
అన్నం, పప్పు
ఇవి మాత్రమే చేసేది–

మధ్యాహ్నం స్కూల్ నుంచి
వస్తే, నాకు
ఆ వంటగదిలో, ఒక

నీడ కనపడేది;

ఎప్పుడైనా, ఏవైనా జేబులో భద్రంగా
దాచుకుందామా
అంటే, వీలు పడేదే కాదు

మరమరాలో, చేతివేళ్ళ చుట్టూ వెలిగే
పసుపు రంగు
నల్లీలో, రేగు పండ్లో, ఉప్పు

జల్లిన జామ ముక్కలో!

ఇక అప్పుడు, నా మెడ చుట్టూ చేతులు వేసి నువ్వు నన్ను దగ్గరకి లాక్కుంటే, మంచు రాలి కాలం వొణికే వేళల్లో, ఎవరో చివ్వున ఒక నెగడును రగిలించిన కాంతి-
మరి అప్పుడే ఎక్కడో గూ గూ మని పావురాళ్ళ కువకువలు
మరి బ్రతికే ఉన్నామా మనం, అప్పుడు?

నువ్వు పరాకుగా ఒంటరిగా సంచరిస్తున్నప్పుడు, నీ ఇంటి పెరట్లోనో
రద్దీ వీధులలోనో ఒక హస్తం నిన్ను తాకి వెళ్ళి పోతుంది. అప్పుడే ఉతికి
ఆరవేసిన వస్త్రం గాలికి కదిలి ఇంత తడిని నీ ముఖాన చిమ్మినట్టు-