1. అప్పుడు, అక్కడ
అప్పుడు, అక్కడ, తల వంచుకుని కూర్చుని ఉంటుంది
నీ ముసలి తల్లి: ఆ చిన్ని వరండాలో, తన
జుత్తు విరబోసుకుని తల దువ్వుకుంటూ –
చెట్టుపైకి వొంగి, చెమ్మగిల్లిన నింగి –
రాలిపోతున్న పసుపు
వేపాకులు. పాలిపోయిన ఆ కాంతిలో
చెట్టు బెరడుని గీకుతూ, గుర్రుమనే పిల్లులు –
కంపించే నీడలు –
అక్కడక్కడా పిల్లలు వొదిలి వేసిన
పగిలిన బొమ్మలు. అద్దం పెంకులూ –
వెనుకగా పక్షి పిల్లలు లేని ఒక ఒంటరి గూడు –
అక్కడక్కడా, కొమ్మల మధ్యలో
ఊగే సాలెగూళ్ళు. అలసిన తన, ఎండిన
పెదాలను కోసుకుని ఉబికే నెత్తుటి తడీనూ –
ఇక, ఉన్నట్టుండి వీచిన చల్లని గాలికి తను
తల ఎత్తి చూస్తే, ఎప్పట్లా
నిన్ను చూసి నవ్వితే, ఎదురుగా నువ్వు –
అదే … దారి తప్పో, దారి మరచో, ఇంటికి
వచ్చిన నువ్వు, ఇక
అక్కడ ఉండాలేకా, వెళ్ళిపోనూ లేకా
మాట్లాడలేకా, తనకి ఏమీ కాలేక …
2. వేళ్ళకు అంటిన నీళ్ళు
నువ్వు చూసి ఉండవు: గాలికి
తెరచి ఉంచిన ఒక పుస్తకపు పుట ఏదో మరలినట్టు, తను
ముఖం తిప్పుకున్నప్పుడు
వేగంగా పూలతోటల మీద
వ్యాపించిన నీడలని. పైన, గుమికూడిన కారు మబ్బులనీ,
లేచిన ధూళినీ –
కళ్ళల్లో దుమ్ము పడకుండా
నువ్వు చటుక్కున చేతులు అడ్డం పెట్టుకుని ఇంటి దారి
పట్టావు కానీ, అక్కడే
నుల్చుని ఉండిపోయింది నీ తల్లి
వణుకుతున్న చేతులతో, రాలి నేలపై దొర్లిపోయే ఎండిన
ఆకులని చూస్తూ, నెమ్మదిగా
మొదలయ్యిన జల్లులో
ఆరేసిన దుస్తులు తీయడం మరచిపోయి, అట్లా తడచిపోతూ
ఏదో గొణుక్కుంటూ –
ఆనక, ఇక నువ్వు ఇంటికి వచ్చి
ఒక కవిత్వం పుస్తకం తెరిచి, నాలుగు వాక్యాలేవో రాసుకుని,
వేలితో చాలా యధాలాపంగా
పుటను తిప్పితే, నీ వేళ్ళను
వదలకుండా అంటుకున్న అశృవులూ, నీ నాలిక పైకి పేగు
తెగిన నెత్తురు రుచీ
ఎక్కడి నుంచి వచ్చాయో ఇక
నీకు ఎప్పటికీ అర్థం కాదు –
3. స్పష్టత
స్పష్టమైన కారణం ఏమీ కనపడలేదు ఇంకా: కానీ, నువ్వు
నా వైపు చూసినప్పుడు, నీ చుట్టూతా
ముసిరిన నీడలు –
“నీ కళ్ళు అప్పుడు, రహదారిని దాటేందుకు అటూ ఇటూ
కంగారుగా తిరిగే, తల్లి లేని, వీధి కుక్కపిల్లల
బెదురు నయనాలు”
అని నేను అనుకుంటాను కానీ
బరువు తగ్గిన నీ శరీరంలో నేను చూడలేని నొప్పీ, ఒక
వాన హోరు. చీకట్లలో ఎక్కడో, చెట్లు
తెగిపడుతున్న చప్పుడు
అప్పుడు
నీ అరచేతులలో, అంతం లేని రాత్రుళ్ళు –
నీ హృదయమే నిన్ను ఒక క్రూర మృగమై వెంటాడితే
వేటాడితే, నీ ఎదురుగా నెత్తురు కక్కుకునే
నిర్మానుష్యపు దారులు
శోకనివారణ లేని
గృహాలూ
ఇళ్ళూ –
నిజమే. స్పష్టమైన కారణం ఏదీ కనిపించలేదు. నిన్ను
హత్తుకునే మనిషే ఇంకా ఎక్కడా
దొరకలేదు –
ఇక్కడ, ఇంకా
ఒక మనిషి మరొక మనిషికి అంకితమయ్యే సహనమే,
ఎవరికీ అలవడలేదు. ఎవరికీ
మిగల లేదు –
ఇక, నిన్ను నువ్వే అడుగు లేని ఒక బావిగా మార్చుకుని
నిన్ను నువ్వే తోడుకుని
ఆ నీళ్ళల్లో
నిన్ను నువ్వు చూసుకుంటూ, గుక్క గుక్కగా
నిన్ను నువ్వు త్రాగుకుంటూ
బ్రతకడమే
ఇక్కడ, చివరికి అందరికీ మిగిలిన జీవన విధానమనీ,
అంతిమమనీ, చెప్పలేదా
ఎవరూ నీకు
అమ్మా?
(ఈ నెలలో వస్తోన్న ఈ పుస్తకంలోని పలుకవితలను వరసగా ప్రచురించిన ఈమాటకి కృతజ్ఞతలు – శ్రీ.)