Madre: Poems on M/other

1. నీ వేళ్ళతో గాలి

అందరూ గెలలు కోసుకున్నాక, తెగ నరికిన
అరటి చెట్టులాగా అమ్మ –


పల్చటి చలికాలపు ఎండ. ఎండిపోయిన తన
వేర్ల వంటి శరీరం, ఒకప్పటి
మట్టి వాసనతో, ఇప్పుడిక నీటి దాహంతో –

రాలిపోగా మిగిలిన, పీచువంటి తెల్లని జుత్తుని
అప్పుడప్పుడూ, వొణికే
బొమికల వంటి చేతివేళ్ళతో త్రోసుకుంటో

“కాళ్ళల్లో గడ్డలు: నడవలేకపోతున్నాను. మొన్న
నీళ్ళు పడుతూ కళ్ళు తిరిగి
పడిపోతే, అదృష్టం, దెబ్బలేమీ తగల్లేదు,

కానీ, భయంగా ఉందిరా,” అంటోంది. అప్పుడు
తన కళ్ళల్లో పగిలిన పావురం
గుడ్లు. గొంతులో రెక్కలు విరుగుతోన్న శబ్దం –

నిర్జీవమవుతున్న ఒక ఒంటరి ఊయల, నీడలు
నిద్ర మాత్రలయ్యి, గొంతు
చుట్టూ బిగుసుకునే ఆవరణ ఇక మరి, తన

హృదయంలో, calcium లేక చిట్లే ఆ శరీరంలో!


నలుపు తెలుపు అస్పష్ట చిత్రంలాంటి గృహం –

గుమ్మం ముందు తారట్లాడే ఒక పిల్లి: మరో
మార్గం లేక, తాను రోజూ
ముందు గదిలో sedate అయ్యే టీవీ, ఫోన్

thyroid, cholesterol, vitamin B 12, Uric acid కో
మందుల ప్లాస్టిక్ డబ్బా,
ఎంతో మృత్యువుని నింపుకున్న మంచంతో

ఐదారేళ్ళ పాప కళ్ళతో, అట్లా చూసే అమ్మ!

2. ఆకృతి

ఒత్తిగిల్లి ఒకవైపుకి, నిద్రపోతోంది
అమ్మ. బుగ్గ కిందుగా
మణికట్టు. శిశువు పిడికిలిలాగా

అరచేయి. పక్కగా పెయిన్ బామ్ –
కృతిమంగా
మగ్గపెట్టిన మామిడిపండులా

నలిగి, తన చర్మం. మసక బల్బు
వెలుతురులో
రోడ్డు పక్కగా వానలో నిండా

తడిసి, మూలుగుతున్న రెండు
కుక్కపిల్లల్లాగా
ఉన్నాయి, మూతపడ్డ తన

బరువైన కనురెప్పలు. జలుబై
శ్వాస సరిగ్గా
ఆడని, ఆగీ ఆగీ వినిపిస్తోన్న

తన గురక మాత్రమే, నీకు ఇక
మరెవరిదో
ఒకప్పటి యాతననీ, వణికిన

ఆ రాత్రినీ గుర్తుకు తెస్తుంది!


ఒత్తిగిల్లి ఒకవైపుకి, నిద్రపోతోంది
అమ్మ. నానిన
ఆకుల వాసనేదో గదిలో. తన

నిద్రలోనూ ముఖంలోనూ, వాన
ఆగాక బయల్పడే
మృదువైన వెలుతురు, గాలి –

బహుశా, తన కలల్లో, ఎన్నటికీ
నేను చూడలేని
పగిలిన బొమ్మలూ, ఒక ఇల్లు!


ఒత్తిగిల్లి ఒకవైపుకి, నిద్రపోతోంది
అమ్మ. అలసి
కుంచించుకుపోయి, అట్లా

రంగు వెలసిన నారింజ చీరలో
క్రమేణా క్షీణిస్తూ
అయినప్పటికీ వెలుగుతూ

మట్టి ప్రమిదెలాగా, అమ్మ!

(from upcoming Madre: Poems on M/other)