మూడు కవితలు

ఎంపిక

భగవంతుని ముందు అరచేతులు
ముకుళించినట్లు
చేతులు చాపి ఉన్నాను, రాత్రిలో–

ఒక చేతిలో ప్రేమా, మరొక చేతిలో
కన్నీళ్ళూ ఉన్నవి;
దేనిని ఎన్నుకోవడం? దేనిని

వదులుకోవడం? రెండు చేతుల్లోనూ
అదే ముఖం,
లోకంలోని అన్ని సరస్సుల్లోనూ

ఒకే జాబిలి ప్రతిఫలించినట్లు, ఇక
ఆ అగ్నిలో
నువ్వు దగ్ధమయ్యి, నీ చూపు

పూర్వజ్ఞానం లేని సృష్టిలోకి, ఒక
తల్లి చేతుల్లోకీ
తొలి బిడ్డలాగా వొదిగినట్లూ…

కాంతి; నొప్పి. బ్రతికి ఉన్నావన్న
స్పృహ. వాసన,
బొడ్డు తాడు తెగిన, వాసన-


భగవంతుని ముందు అరచేతులు
ముకుళించినట్లు
చేతులు చాపి ఉన్నాను, రాత్రిలో–

ఇదొక మృత్యువు ఊయల; రెండూ,
అన్నీ కూడా
నీవే అయినప్పుడు, కన్నీళ్ళూ

ప్రేమా ఒకటే అయినప్పుడు, మరి

ఎలా నేను, ఒకదానిని ఎంచుకోడం?

దాచుకోలేనివి

మరి ఒకటే ఉండేది, అప్పుడు నాకు
స్కూలు జత-
తెల్లని షర్టు జేబు చినిగి

వేలాడుతో ఉండేది. ఇక కాలర్ పైన
ఎప్పుడూ, చిక్కగా
కాటుకలాంటి, మట్టి మరక–

ఎప్పుడైనా, ఏవైనా జేబులో భద్రంగా
దాచుకుందామా
అంటే, వీలు పడేదే కాదు

మరమరాలో, చేతివేళ్ళ చుట్టూ వెలిగే
పసుపు రంగు
నల్లీలో, రేగు పండ్లో, ఉప్పు

జల్లిన జామ ముక్కలో! నా పిర్రలు
కనిపించేలా
చినిగిన చెడ్డీ చూసి, పక్కున

నవ్వే వాళ్ళు, నా స్నేహితులో లేక
తోటి పిల్లలో,
అడపాదడపా టీచర్లో, నువ్వో!


నా అరచేతుల్నిండా నిన్ను నువ్వు
పోసుకుని,
జాగ్రత్తగా దాచుకొమ్మన్నావు కానీ,

చూడు, ఇప్పటికీ లోపల అదే మనిషి!
ఏమీ దాచుకోలేక,
కారే ముక్కుని, ముంజేతితో

తుడుచుకుని, అర్థంకాక నీవైపు అట్లా
చూసే, ఇప్పటికీ
జేబుల్లేని, జాగ్రత్త లేని మనిషి–

“పెన్సీల్ ఇవ్వవే, రాసుకుని మళ్ళా
ఇచ్చేస్తాను” అని
ప్రాధేయపడ్డ మనిషే ఇక్కడ

ఇప్పటికీ నీ ముందు, నిన్ను జేబుల్లోకి
కుదించుకుని మరి
తిరగలేకా, చిరుగుల్ని దాచలేకా!

బంతిపువ్వు

అప్పుడు, నీ కాళ్ళు వొణుకుతాయి-
క్షణకాలం, గుండె
ఆగిపోతుంది. పెదాలు ఎండి

తల దించుకుంటే, పైన ఆకాశంలో
మబ్బులు: నల్లగా-
పెద్దగా వీచిన గాలికి వేపపూలు

జలజలా రాలతాయి. ఎక్కడో, వాన-
దాని తడీ వాసనా
నీలోనా, వెలుపలా? తెలియదు-


ఎప్పటికో “వెళ్ళనా?” అని వినపడి
మరి తలెత్తి చూస్తే,
ఆక్కడే ఒక చక్కని ముఖం, ఇక

తేటగా, వాన వెలిసి, మబ్బుల్లోంచి
బయటపడి మెరిసే
సూర్యబింబంలా, చినుకులు

ఆగి, గాలికూగే బంతిపువ్వులా!