Atrophy (a ‘con’fession)
ఎందుకో కానీ నెమ్మదిగా నాకు నొప్పినీ, దుఃఖాన్నీ, మనుషుల్నీ స్పంజ్ వలె పీల్చుకుని, ప్రభావితమయ్యీ కాకుండా, కవిత్వం వంటిదేదో వ్రాసే సామర్ధ్యం, శక్తీ సన్నగిల్లుతోన్నది. నొప్పిని తీసుకునీ తీసుకునీ తీసుకునీ, ఇక అణువంత కూడా ఏ నొప్పినీ భరించలేని మొద్దుబారినతనం ఏర్పడినట్లు ఉన్నది. ఎవరూ వొద్దు అని అనిపిస్తోన్నది. స్త్రీలసలే –
సగం వీగిపోగా, పీలికలుగా మిగిలిన గూడు, బలహీనంగా కొమ్మ వేలిని గట్టిగా పుచ్చుకుని గాలికి వేలాడుతోన్నట్లు, కాలాన్ని పట్టుకుని బ్రతుకుతున్నాను నేను. ఇప్పటికీ, పీచులుగా మిగిలిన గూడునీ, ఆ పోలికనీ తలచినప్పుడల్లా మళ్ళా నీ శిరోజాలే జ్ఞాపకం వస్తున్నాయి. కిటికీ ఆవలగా, గోడపై వాలి అరిచే కాకి సన్నటి కాళ్ళనీ కళ్ళనీ చూసినప్పుడల్లా, ఎందుకో ముడతలు పడిన నీ చర్మం, నీ చేతివేళ్ళూ, బలహీనంగా రక్తహీనతతో, కొంచెం పసుపుపచ్చగా మారి చిట్లిన నీ కాళ్ళ బొటనవేళ్ళ గోర్లూ, వాటి కింది మట్టీ గుర్తుకు వస్తున్నాయి. ఇక ఏం చేయాలో తెలియక ఇక్కడ, ఈ మేఘావృత ఆకాశం కింద కోడిపిల్లనై తిరుగుతోన్నాను –
సాధ్యమైనంతగా నువ్వు గద్దల నుండి నీ పిల్లల్ని కాపాడుకున్నావు. సాధ్యమైనంతగా నువ్వు మనుషుల్నీ కవుల్నీ – మనుషులు కాలేని కవుల్నీ, కవిత్వం కాలేని మనుషుల్నీ, కీర్తి కాంక్షలో సంపుటాలుగా పెరిగి అహంతో అంధులుగా మిగిలిన వాళ్ళనీ – క్షమించేందుకే ప్రయత్నించావు. పెరట్లో పూసిన పసుపు చామంతిలాగా, మిద్దెపై కుండీలో రాత్రిలో జ్వలించిన లిల్లీ పూవులాగా తేలికైన సువాసనతో బ్రతికేందుకే ప్రయత్నించావు –
కానీ బహుశా, ఎక్కడో ఏదో తెగిపోయింది. అంటు కట్టినది బ్రతకలేదు. ఇల్లు పాడు పడిన భవంతిలాగానో, ఎవరో ఎప్పుడో సందర్శించే శిధిలస్మృతి లాగానో మిగిలిపోయింది. ఇక ఉదయం ఒక్కదానివే అక్కడ. రాత్రీ ఒక్కదానివే అక్కడ. ఓపిక తెచ్చుకుని, ఇంత అన్నం వండుకుని, తిన్నట్లు చేసి, ఆ మూడు గదుల్లోనే – అక్కడక్కడే – తచ్చట్లాడి, నరికేయగా తిరిగి చిగురిస్తోన్న వేపచెట్టు ముందో, బోరింగ్ ఆన్ చేసి నీళ్ళు పట్టుకుంటూనో, లేక టీవీ ముందు – అవే అవే విసుగెత్తించే – వార్తలతోనో, సెల్‍ఫోన్‍లో కూతురో మరి మనవరాలో పంపిన ఫోటోలను మాటి మాటికీ చూసుకుంటూనో, కరిగిపోయే కాలంలో, మృత్యువుకి చేరువయ్యే సమయంలో గాయంలో కూడా నువ్వు ఒక్కదానివే అక్కడ –
ఇక్కడ, చినుకులు రాలుతున్నవి. నువ్వు సాకిన రెక్కలపై అవి పడి, ఒక జలదరింపుకి, శరీరం మనస్సూ గురి అవుతున్నవి. ఎవరివో ముఖాలూ మాటలూ గొంతుకలూ జ్ఞప్తికి వస్తున్నవి. ప్రేమించిన వాళ్ళూ, ద్వేషించిన వాళ్ళూ, ఏదో ఆశించే దరిచేరే వాళ్ళూ, నకలుగా తయారయ్యి నిందించే వాళ్ళూ, ఉన్నవాళ్ళూ లేనివాళ్ళూ, ఉండి వెళ్ళిపోయిన వాళ్ళూ, వెళ్ళిపోవడంతోనే మిగిలినవాళ్ళూ – ఇలా ఎవరెవరో – మబ్బుపట్టి, చినుకులై రాలుతుంటిరి. ఏం చేయను?
చూడనా మళ్ళీ వీళ్ళను? నేను? చదవనా, మళ్ళా వీళ్ళను నేను? గాజుపెంకులను హృదయంలో నిండుగా దింపుకుంటో? బ్రతకనా ఇట్లనే? నువ్వు నేర్పించినట్లు? నువ్వు ప్రేమించినట్లు? చివరికి ఏమీ మిగలక, ఎవరూ కానరాక, ఇక –
ఎప్పటికీ రాయలేని కవితలాగా, క్రమేణా కాంతి కనుమరుగయ్యే ఒక దీపంలాగా, ఇలా? నీవలె? వాన వెలిసిన వెలుతురులో, తేలికైన ఆ గాలిలో, ఎవరి జీవితపు అంచునో లీలగా పారాడి, బొట్టు బొట్టుగా రాలే, సర్వం ప్రతిబింబించే నీటి చుక్కనై?
ఆ ఇల్లు
ఆ ఇంటికి వెళ్ళవు నువ్వు ఇప్పుడు: పాతబడిపోయింది ఆ ఇల్లు ఇప్పుడు. తలారబోసుకునే ఒక ముసలిదానిలా మగ్గి, రాలిపోయే వేపాకులతో పాలిపోయి వంటరిగా నిలబడి ఉంటుంది ఆ ఇల్లు: ఇప్పుడు –
రంగు వెలసిన గోడలూ, ఆవరణలో పగిలిన బండలూ, చెవులు రిక్కించి, మరి నీ చేతి కోసమో, నీ మాట కోసమో, లేక ఎవరైనా పలకరిస్తారేమోనని, తలారబెట్టుకుని వరండాలో గచ్చుపై కాళ్ళు జాపుకు కూర్చుని, వణికే చేతివేళ్ళతో, ఎండలో, చేటలో బియ్యంలో మట్టి బెడ్డలు ఏరుకుంటోనో, ఆకుకూర కట్టల్లో ఒక్కో ఆకుని శ్రద్ధగా చూసి, వేరు చేసి, ఓ పక్కగా పరిచిన పాత దినపత్రికపై ఉంచుతూ
మధ్యలో తలెత్తి, గాలికి కొట్టుకుని బలహీనంగా శబ్దాలు చేసే గేటువైపూ, నెరసిన కనుబొమ్మలపై అరచేతిని గొడుగులా ఉంచి ఓసారి ఆకాశం వైపూ, ఆనక అలజడిగా కదిలే నీడలవైపూ, మొక్కలవైపూ, వీధుల్లో రికామీగా అరుస్తో పరిగెత్తే పిల్లలవైపూ చూసే ఇల్లు. పగుళ్ళిచ్చిన ఇల్లు. ఎముకలు చీలికలిచ్చిన ఇల్లు. చిట్లిన కాలివేళ్ళ గోర్ల ఇల్లు. ముడతలు పడ్డ ఇల్లు. కంటి శుక్లాల ఇల్లు. మసక కళ్ళ ఇల్లు. కన్నీళ్ళతో అలుక్కుపోయి బూజు బూజుగా మారిన ఇల్లు. క్రుంగి కృశించి, క్రమేణా కనుమరుగు అవుతోన్న, నువ్వు వెళ్ళని ఇల్లు –
నిజం: నువ్వు వెళ్ళని, వెళ్ళాలనిపించని ఆ ఇంట్లో ఏమీ లేదు ఇప్పుడు –
ఎండ వాలిన గరకు చర్మంలాంటి, చికిలించిన కళ్ళ చుట్టూ ఏర్పడిన గీతల్లాంటి, తన కంపించే పెదాలలాంటి, కుంగిన మోకాళ్ళతో, మరి నొప్పులతో, పిగిలిపోయే శరీరంతో రాత్రిలోకి చిన్నగా కదిలే తనలాంటి మూసిన తలుపు తప్ప, అర తెరిచిన కిటీకీలు తప్ప, వాటికి వేలాడే మురికి కర్టెన్లు తప్ప, గోడలపై మరకలు తప్ప, ఎక్కడో బొట్టుబొట్టుగా రాలే నీటి చుక్కల మహాశబ్దం తప్ప, మసక బల్బుల అనారోగ్యపు కాంతి తప్ప
ఆ ఇంట్లో ఒక అమ్మ ఉన్నదా? ఆ ఇంట్లో ఒక అమ్మ ఉండినదా? మరి తను నీకు ఎన్నడైనా గుర్తుకు వచ్చినదా, ఆ ఇల్లే అమ్మనా, లేక మరి అమ్మనే ఆ ఇల్లా? అమ్మా ఇల్లూ, పిట్టా గూడూ – రెండూ ఒకటేనా? అని
మీరు ఆ ఇంటిని కానీ, ఈ కవితను కానీ నన్ను కానీ ఎన్నడూ అడగకండి!
(From upcoming Madre: Poems on Mother)