కావలించుకుంటాయి, ఆ చేతులు నిన్ను –
చీకటి నదిలో తేలే రెండు
తెల్లని బాతుల్లాగా, ఆ అరచేతులు
నడిరాత్రిలో, నీ పైకి కదులుతాయి. మరిక
‘క్వాక్ క్వాక్’ మని నీ చెవిలో
గుసగుసలాడతాయి. పూల భాషలో
నవ్వుతాయి. నీలో సరస్సులపైకి చిన్నగా
వ్యాపించే పొగమంచు
అప్పుడు: ఆ పొగమంచు కమ్మిన
మంద్రమైన వెన్నెల, నీలోకి చేరినప్పుడు –
అలలు, ఒడ్డుని మెత్తగా
తాకే శబ్దం నీలో అప్పుడు: నీలోని
వ్యర్థాలని కడిగి, ఆ చేతులు వెనకకు ఇక
వెళ్ళిపోయినప్పుడు –
తిరిగి, నీ మెడ చుట్టూ చేరినప్పుడు –
కావలించుకుంటాయి, ఆ చేతులు నిన్ను –
మరి బ్రతికి ఉన్నావనే
స్పృహను నీకు ఇచ్చి, నీ అరచేతిని
పుచ్చుకుని, నీలో వేళ్ళూనుకుని, గాలిలో
ఊగే చెట్టులాగా నిన్ను
మార్చి, నిశ్చింతగా నిదురపోతాయి
పూలకాడల్లాంటి, ఆ చిన్ని చేతివేళ్ళు!