లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో –

నువ్వు నా పక్కన పడుకుంటే

నా ఎదురుగా నీ ముఖం: వానకి తడవకుండా ఆకుల మధ్య గుంభనంగా దాగిన ఒక ఒత్తైన తెల్లని పుష్పంలాగా –

నిన్ను పూర్తిగా చూద్దామని, శిరోజాలను కప్పుకున్న ఆ ఆకులని తొలగించే నా వేలి చుట్టూ చుట్టుకుంటుంది మట్టి తడచిన అడవి వేర్ల వాసన – చెట్టు మొదట్లో, చినుకులకి ముడుచుకునే గడ్డి పరకల వాసన. మరి గాలి వీచే చల్లని సవ్వడీనూ-

ఇక అప్పుడు, నా మెడ చుట్టూ చేతులు వేసి నువ్వు నన్ను దగ్గరకి లాక్కుంటే, మంచు రాలి కాలం వొణికే వేళల్లో,ఎవరో చివ్వున ఒక నెగడును రగిలించిన కాంతి-

ఇక ఆ అరుణిమ కాంతిలో ఎగురుతాయి మన చుట్టూ మరి మిణుగురులో లేక లేత ఎరుపు సీతాకోకచిలుకలో నిద్ర నిండిన నయనాలతో-

మరి అప్పుడే ఎక్కడో గూ గూ మని పావురాళ్ళ కువకువలు

మన శరీరాల్లోనే గూడు కట్టుకున్నట్టుగా, రెక్కలు మునగదీసుకున్నట్టుగా, రమిస్తున్నట్టుగా, గుడ్లని పొదుగుతున్నట్టుగా, రెక్కలు రాని వాటి పిల్లలు గూటిలో అలజడిగా కదులుతున్నట్టుగా-

అందుకే అప్పుడు చల్లటి గాలీ, రాత్రీ, చీకటీ: నీలో, నాలో.

అందుకే ఇక అప్పుడు, ఒకరినొకరు గట్టిగా కరచుకుని పడుకుంటామా మనం, ఏ తెల్లవారుఝామో వచ్చి, తలుపు తట్టీ తట్టీ వెళ్ళిపోతుంది మృత్యువు – మన ఆనవాలు ఏమాత్రం లేకుండా, ఏమాత్రం సవ్వడి చేయకుండా-

మరి బ్రతికే ఉన్నామా మనం, అప్పుడు?

(02-10-2013)