1. అరుగు మీద…
అరుగు మీద అమ్మా, నేనూ –
ఆవరణలో
సరస్సులాగా వ్యాపించిన
ఎండ: ఆ ఎండా ఆ సరస్సూ
తన ముఖం –
ప్రాచీనమైన ఒక లిపిలాగా
ఒక శిధిల ఆలయంలాగా –
అలసిపోయిన ఏవో సంకేత
చిహ్నాలు, తన
కళ్ళల్లో, కుంటి నడకలో
చర్మపు ముడతల్లో, విసుగు
లేకుండా ఎంతో
శ్రమించే ఆ అరచేతుల్లో –
అరుగు మీద అమ్మా, నేనూ –
పిల్లలాడుకుని
పక్కనుంచిన బొమ్మల్లాగా
మరి, వాటి నిశ్శబ్దాలలాగా!
2. చేజారినవి…
వర్షానికి ఇల్లు తడిసిపోయింది,
గోడలపై నీడల్లా
వ్యాపించే, తడి చారికలు –
ఇంటిపైన ఇష్టంగా తెచ్చుకున్న
కుండీల్లో, ఇపుడు
పూలు లేవు, వాటి ధ్వనులూ
లేవు! ఉన్నదంతా, చీకటి చేరిన
వాన నీళ్ళూ, ఏవో
రాలిన ఆకులూ, చివరిగా ఇక
గొంతు కోసుకున్న వెన్నెల మరి
రాత్రై వొణికిన,
తల్లి లేని పక్షిపిల్లల నిశ్శబ్డం!
“నన్నొదిలి వెళ్ళిపోతావా నువ్వు?”
అన్నది తను!
నాని, పెచ్చులు ఊడిపోతోన్న
ఆ ఇంటిని గట్టిగా మరి నా ప్రాణం
పోతున్నంతగా
హత్తుకుని అన్నాను ఇక:
‘లేదు. ఉంటాను, నీతోనే నేను’
3. లిప్తకాలం
కూర్చుని ఉంది అమ్మ ఒక్కత్తే, ఆవరణలో
మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని, మోకాలిపై తన
చుబుకం ఆన్చుకుని –
గోధూళి వేళ. ఇంటి ముందు మసక చీకటి.
మల్లెతీగలో మొగ్గలు చిన్నగా చలించి, అంతలోనే అట్లా
కుదురుగా సర్దుకుని –
(అవి తన కళ్ళా? నాకు తెలియదు)
ఎక్కడో పక్షి కూత. నీటిబొట్టు నేలను తాకిన
సవ్వడి. చిన్నగా పిల్లల మాటలు. తనని రుద్దుకుంటూ
గుర్‍మని చిన్నగా అరుస్తో
తిరిగే పిల్లి తిరిగి సర్దుకుని, తన చెంతే
పడుకుని: (అది నేనా? నాకు తెలియదు) లోపలెక్కడో
మరి ఒక దీపం చిన్నగా
మిణుకుమంటూ, రెపరెపలాడుతూ:
(అది తన హృదయమా? నాకు తెలియదు). ఇక తన
శిరస్సుపై వాలిన ఆకాశం
బూడిద రంగు మబ్బుల్ని లెతెరుపు
ఛాయతో క్షణకాలం అల్లుకుని, అంతలోనే రాత్రిలోకి అట్లా
తటాలున కరిగిపోయి
‘అమ్మా, ఇక నేను వెళ్తా’ అంటే
కూర్చుంది ముసలి అమ్మ ఒంటరిగా
మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని, మోకాలిపై తన
చుబుకం ఆన్చుకుని
కదలని మల్లెతీగ వైపు అట్లా చూస్తూ –
4. కొన్ని అంతే
నువ్వొచ్చి తలుపు తట్టగానే, ఆదరా బాదరాగా
లేచొచ్చి తలుపు తీసే నీ ముసలి తల్లి: తన చింపిరి జుత్తొక
సాలెగూడు –
వేసవి కాలం. వడలిపోయిన మొక్కలు
ఇంటి ఆవరణ అంతా రాలిన వేపాకులు: ఒక ముదురు రంగు.
దుమ్ము –
‘ఎన్నిసార్లు ఊడ్చినా ఇంతే,’ ఊడుస్తూ
చేస్తోంది తను పాపం నిస్సహాయంగా నీకో పిర్యాదు: కానీ
ఏం చేస్తాం?
కొన్ని అంతే. ఎప్పటికీ పోవు
నీడలు నిండిన ఆవరణలోంచి: హృదయ ప్రాంగణంలోంచీ
స్మృతులలోంచీ –
ఇక దూరంగా ఎక్కడో – నీలో, తనలో
సాయంత్రపు కాంతి ఇంకి, అతి నెమ్మదిగా చీకటి పడుతున్న
చప్పుడు!
(From upcoming Madre: Poems on M/other)