నువ్వొక్కదానివే కూర్చున్నావు అక్కడ
ఎండలో, బస్ స్టాండ్‌లో –
వేల స్టీలు బ్లేడ్‌ల వేడిమి నిన్ను కోస్తో –
నీ జుత్తు, రేగిపోయి ఉంది. నీ శరీరమేమో
వొణుకుతుంది. చెప్పు
అన్నం తిని ఒక రోజు దాటింది కదా?
నువ్వు కట్టుకున్న తెల్లని చీర, మలినమై
స్పృహ తప్పేలా ఉన్న
నీ ముఖంలా ఉంది. అలసిపోయింది.
“నీళ్ళు” అన్నావు. ఇచ్చాను. ముడతలతో
నీ ముఖం, నలిగిన ఒక
కాగితం. “ఏమయ్యింది?” అడుగుతాను
శుష్కించిన నీ ముఖంపై, చిన్నగా నవ్వు –
పాలిపోయిన మచ్చలు
బుగ్గపై. మానిన దెబ్బలా అవి? లేక
పోషకాహార లోపమా తెలియదు కానీ ఇక
నవ్వుతావు నువ్వు –
పెద్దగా, బస్ స్టాండంతా ఉలిక్కిపడి తల తిప్పి
నీవైపు చూసేటట్లు. ఆ తరువాత, నువ్విక
నా చేతిని మెత్తగా మరి
గరుకైన నీ అరచేతితో వొత్తి, “వెళ్తాను”
అని నువ్వు నిస్సత్తువుగా, ఆకులన్నీ రాలి
ఎండీ, విరిగీ, వొరిగీ
చీలికలుగా చిట్లిపోయే, ఒక చెట్టువైతే
నేనొక్కడినే కూర్చున్నాను అక్కడ, పిగిలి –
ఎదురుగా, ఎవరో
తరుముతున్నట్లుగా, పరిగెత్తి పోయే
నీడ లేని మనుషుల్లో, నువ్వూ కలిసిపోయి
క్షణకాలం ఆగి, నను
వెనుదిరిగి చూసి, వాళ్ళలో కనుమరుగై!