ఇప్పుడూ అదే చెబుతున్నాను, ఆకస్మికంగా ఎప్పటి దృశ్యమో తట్టి: వేసవి రాత్రి. ఆవరణలోని పనస చెట్టు కింద ఉన్న మోరీ వద్ద కూర్చుని, నువ్వు గిన్నెలు కడుక్కునే దృశ్యం. వరండాలో కూర్చుని ఉన్నాను నేను, చేతులు చుట్టుకుని ముంజేతిపై చుబుకం ఆన్చుకుని నిన్ను చూస్తో – ఎన్నేళ్ళు నాకు అప్పుడు? ఇప్పుడు చప్పున తట్టడంలేదు. బహుశా ఎనిమిది? నీ వయస్సెంతో తెలీదు కానీ జీవంతో ఉన్నావు అప్పుడు నువ్వు – లేత బొప్పాయి ఆకులాగా, దాని పూవులాగా. పైన వెన్నెల. పౌర్ణమి రాత్రినా? ఆ చంద్రకాంతిలో చిన్నగా వీచే గాలికి నేలపై ఊగిన ఆకుల నీడలూ, నీళ్ళ వాసనా బాగా గుర్తు –
నీ ముఖం కూడా గుర్తుకు ఉంది. బంతిపూవు రంగు అనుకునేవాడిని కానీ, వెన్నెల పడిన నీ ముఖం పనస తొన రంగుతో మెరిసింది. ఇప్పుడు తట్టే ఇంకొక పోలిక ఏమిటంటే, బాగా కాగిన పాలరంగు వంటి లిల్లీ పూవులాగా ఉండింది నీ ముఖం, ఆ రాత్రిలో. అదే సువాసన, లిల్లీపూల వనాల్లో వేసవి రాత్రుల్లో ఉండే సువాసన. నీళ్ళు తాకి మెరిసే పూల సువాసన: ఎంతో చక్కగా, తేలికగా, పచ్చగా…
ఎందుకో నవ్వావు అప్పుడు నన్ను చూసి, ముంజేతితో నుదుట వాలిన జుత్తుని వెనక్కి తోసుకుంటూ. ‘ఆకలవుతుందా?’ అని అడిగావు. తల ఎటు ఊపానో కానీ, నీ నవ్వు ముఖమే శాశ్వతమై ఉన్నది ఇప్పటికీ. గెలుచుకున్న గోళీలను దాచుకుని ఆనక ఎవరూ లేనప్పుడు తీసి చూసుకుని సంతోషపడతాడే చిన్న పిల్లవాడు, అలా ఇప్పుడు అప్పటి నీ నవ్వు ముఖాన్ని తలుచుకుంటాను. కలుక్కుమంటుంది కూడా లోపల ఇప్పుడు, ఆ ముఖం ఇక మిగిలి లేదు, తిరిగి కనపడదు అని తెలిసినప్పుడు –
నువ్వు ఆనాడు (ఎంతో కాలం) కట్టుకున్న లేత నీలంరంగు చీర, ఆ తరువాతి దినాలలో రంగు పోయింది. ఆనక, రెండుగా మారి ఇల్లు తుడిచేందుకు ఉపయోగించే గుడ్డగా మారింది. ఆనక స్నానాల గది ముందూ, గడప ముందూ కాళ్ళు తుడుచుకునే గుడ్డగా మారి, చివరికి పీలికలై – ఎటో కనుమరుగయ్యింది. ఎప్పుడు చివరిగా చూసింది దానిని? బహుశా, ఇంటి వెనుక నిమ్మ చెట్టుకి ఎంతో కాలం గట్టిగా ఒక పీలికగా పట్టుకుని విడువక ఊగిసలాడిన జ్ఞాపకం! ఎప్పుడు, ఎలా మాయం అయిందది? ఎటు వెళ్ళిపోయింది అది? అప్పుడు దిగిన నిమ్మ ముల్లు, ఇప్పటికీ ఎట్లా సలుపుతోంది?!
ఎన్నాళ్ళ క్రితమో ఇలా అన్నాను. ఇన్నేళ్ళ తరువాత కూడా ఇలానే అంటున్నాను: “ప్రేమించడం తేలిక, అన్నీ అయ్యి పట్టించుకోవడమే కనా కష్టం” అని –
ఇప్పుడూ అదే అంటున్నాను, నువ్వు ఎటో వెళ్ళిన తరువాత మిగిలిన నిశ్శబ్దంలో, ఆవరణలోని రాతి అరుగుపై కూర్చుని. అదే వేసవి, అదే ఇల్లు. నీ మోకాళ్ళు కలుక్కుమన్నట్లు చప్పుళ్ళు, ఎండి రాలే వేప ఆకుల్లో, సన్నని కొమ్మల్లో. వెన్నెల రాత్రి కాదు కానీ, వేసవి కాంతి ప్రజ్వలించే పగలు! ఏం చూడగలను నేను? ఇప్పుడేవీ స్పష్టంగా కనపడవు. కనిపించే ప్రతీదానిలోనూ, బొత్తిగా పేరుకున్న ఎప్పటివో చిహ్నాలు. చేతివేళ్ళకు మట్టి. ఖాళీ వీధి. ఎండిన నేల. గాలీ వెలుతురూ సరిగ్గా ప్రసరించని పరిసరాలు.
ఇంటి వెనుక తుప్పు పట్టిన ఇనుప తీగకు ఆరేసి తీయని తువ్వాలుని కోసి మిగిలిన ఆ తీగ మరకలాగా, కమిలిన దినాలు. మిద్దెపై కుండీల్లో వడలి రాలిపోయిన మొక్కలు. ఒకప్పుడు, ఆ ఇంటి ఒంటరితనంలో తిరుగుతూ కొన్ని క్షణాలు తన అరుపులతో తోడునిచ్చిన తెల్లని పిల్లి కూడా ఇప్పుడు ఎవరికీ తెలీకుండా, కానరాక ఎటో వెళ్ళిపోయి, అనంతమైన నిశ్శబ్దాన్ని అక్కడ మిగిల్చి…
(from upcoming Madre: Revised Edition)