(శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి“శిరోమణి” గారు 1982లో ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ ప్రచురించిన మూలప్రతికి వ్రాసినది)
(సువర్ణాక్షతలు)
కవుల ప్రతిభావ్యుత్పత్త్యభ్యాసములను బట్టియు, వారివారి యభిరుచులు, సంస్కారములు, స్వభావములను బట్టియు కావ్యములు సామాన్యముగాను, ప్రౌఢములుగాను, ప్రౌఢతమములుగాను రూపొందుచుండును. అవి చదువువారి యంతస్తు లను బట్టి యర్థమగుటయు, ఆదరపాత్రము లగుటయు జరుగుచుండును. సుమతి, వేమన శతకములు మొదలుకొని ‘ఆముక్త మాల్యద, వసుచరిత్ర’ల వరకుఁగల కావ్యజాత మంతయు నిట్టి సోపానక్రమములోనే సహృదయుల యాదరమును బొందుచు నాంధ్రసరస్వతి కలంకారప్రాయమై యున్నది. అట్టివానిలో ప్రౌఢతమజాతికిఁ జెందినట్టిది యీ చంద్రికాపరిణయము. దీని యంతస్తును గురించి విద్వత్సార్వభౌములు, పండితకవులు నగు బ్ర||శ్రీ || వేదము వేంకటరాయశాస్త్రులవారు ఈక్రిందివిధముగాఁ దమ యభి ప్రాయము నొసఁగినారు.
“శ్రీమత్కొల్లాపురీ సంస్థానాధీశ్వరులలో ప్రాక్తనులైన శ్రీమాధవరాయనివారు రచించిన చంద్రికాపరిణయంబను ప్రాచీన గ్రంథమును ముద్రాక్షరాంకితముగాఁ గనునట్టి భాగ్యము నేఁటికొదవినది. వసుచరిత్రకన్న శ్లేషగాంభీర్యంబు గలిగి రసనిష్యంద నంబున విజయవిలాసముం బురణించుచు కల్పనాప్రౌఢియందు ఆముక్తమాల్యదం దలఁపించుచు అటనట న్యాయవైశేషికాది శాస్త్రమర్యాదల ననుసంధించుచు నుండు నీయతిప్రౌఢప్రబంధము వ్రాఁతపుస్తకములలో బహుదోషముల పాలయి యుండినది. దీనియర్థమును భేదించుట సామాన్యపండితులకును అశాస్త్రజ్ఞులకును శక్యముగాదు. అట్టి యీ కఠినగ్రంథమును విద్వత్సార్వ భౌములగు శ్రీమద్వెల్లాల సదాశివశాస్త్రి , శేషశాస్త్రులవారలు చేపట్టినందున దీనికి సమంజసమైన వ్యాఖ్య నిష్పన్నంబయి, యిది పండితులకు సుఖముగా నాస్వాదనీయం బయినది. ఇట్టి యీకావ్యమునకు వీరిచే వ్యాఖ్య చేయించి ముద్రింపించిన ప్రభువులకు శాశ్వతకీర్తియు, ఆంధ్రపండితులకు వారింగూర్చి యఖండకృతజ్ఞతయు పృథివియందు నెలకొన్నవి.”
మదరాసు 8-11-04 వేదము వేంకటరాయశాస్త్రి
శ్రీకవిసార్వభౌములగు మ.రా.రాజశ్రీ రావుబహద్దరు కందుకూరి వీరేశలింగం పంతులవారిచ్చిన యభిప్రాయము.
“తాము దయతో నంపిన శ్రీకొల్లాపురాధీశ్వర మాధవరాయకృత చంద్రికాపరిణయమును నే నక్కడక్కడఁ జదివి చూచితిని. మూలము వసుచరిత్రమువలె శ్లేషభూయిష్ఠమయి మృదుపదఘటితమయి యత్యంతప్రౌఢముగా నున్నది. శ్రీమద్వెల్లాల సదా శివశాస్త్రులవారిచేతను, అవధానము శేషశాస్త్రివారిచేతను రచియింపఁబడిన వ్యాఖ్యానము సామాన్యముగఁ బండితులకు సహి తము దురవగాహములుగా నుండు మూలభాగముల యర్థతాత్పర్యములను స్పష్టముగా వివరించునది యయి, వారి యస మానపాండిత్యమును వెల్లడించుచు సర్వవిధముల శ్లాఘాపాత్రమయి లోకోపకారార్థముగాఁ జంద్రికాపరిణయమును ముద్రిం పింపఁ బూనిన వర్తమాన కొల్లాపురాధీశ్వరులగు సురభి రాజా వేంకటలక్ష్మారావు బహద్దరుగారికిఁ గీర్తిదాయకమయి యున్నది. ఈ సవ్యాఖ్యాన చంద్రికాపరిణయ మాంధ్రమండలమునం దంతట వ్యాపించి శాశ్వతముగా నెలకొనుఁగాక!
ఇట్లు విన్నవించు భవద్విధేయాప్తుఁడు
కందుకూరి వీరేశలింగము
పై రెండభిప్రాయములవలన నీకావ్య మెంత ప్రౌఢతమమో స్పష్టమగుచున్నదికదా! కనుకనే కీ.శే. జటప్రోలు (కొల్లాపురం) సంస్థానాధిపతులగు శ్రీశ్రీ సురభి రాజా వేంకటలక్ష్మారావు బహదర్, రాజానవాజ్‌వంతుగారు, తమ యాస్థానపండితులగు అవ ధానం శేషశాస్త్రులు, వెల్లాల సదాశివశాస్త్రులవారిచేత తమయభీష్టానుసారముగా రచింపఁబడిన శరదాగమసమాఖ్యవ్యాఖ్యా సహితముగాఁ జంద్రికాపరిణయమును క్రీ.శ. 1928లో రాజమహేంద్రవరం లలితాప్రెస్సునందు బ్ర.శ్రీ. చదలువాడ సుందరరామ శాస్త్రులవారి పర్యవేక్షణమున ముద్రింపించిరి. అట్టి చంద్రికాపరిణయప్రతులు ప్రస్తుత మాసంస్థానమువారియొద్దనే యేకొన్ని యో యున్నవి. అందఱికిని అందుబాటులో లేవు.
అందువలన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారు ఇట్టి యున్నతస్థాయికి జెందిన మహాకావ్యము బహుళవ్యాప్తినిఁ బొంద వలయునన్నచో ప్రతులు మూలమాత్రములైనను సాహిత్యప్రియుల కరకమలములం దుండుట యావశ్యకమని యెంచి విపుల మగు పీఠికతోఁ గూడ దీని పునర్ముద్రణమునకుఁ బూనుకున్నారు. మూలమునందలి పద్యములను ఆధునికములగు విరామ చిహ్నములతో నందించినచో వ్యాఖ్యానము లేకున్నను విజ్ఞులగువారు పద్యభావములను గ్రహింపఁగలరని యట్లు చేయఁబడి నది. ఇంత కఠినకావ్యము నెవ్వ రర్థము చేసికొనఁగల రన్నది సరియైన ప్రశ్న కాదు. ఇంతకఠినమని తోఁచునట్లు పద్యములు వ్రాయఁగల కవి యున్నప్పు డాపద్యముల నర్థము చేసికొని యానందింపఁగల్గువారును లభింపఁగలరు. ఇంతకు ఉత్కృష్ట భాషాపాండిత్యమర్యాదలు గల్గి సాహిత్యమంజూష లనఁదగిన మహాకావ్యములు లుప్తప్రాయములు గాకుండునట్లు వానిని పౌనఃపున్యముద్రణములచేత రసజ్ఞుల కందించుట సాహిత్యసంస్థలు చేయవలసినపని గదా! సరిగా సాహిత్య అకాడమీ అట్టి యపరిహార్యమగు విధినే నిర్వర్తించుచున్నది.
ఆధునికకాలమున వివిధసంస్కృతులతోను వివిధభాషలతోను సంబంధ మేర్పడియున్నప్పటికిని, కవితారచనలోని వివిధప్రక్రియలలో పద్యమున కున్న ప్రాధాన్యము పద్యముదే. దానివలె స్వతంత్రముగా జిహ్వాగ్రమున నిలిచి మానవుని నైతిక ధార్మిక సాంస్కృతికాద్యనుభూతులను నెమరువేయింపఁ గల శక్తి వచనాదిప్రక్రియలకు లేదు. కనుక పద్యమును వదలుట గాని వ్రాయమానుట గాని వాంఛనీయము గాదు. ఈనాటికిని సుమతి వేమన శతకములకును మరికొన్ని చాటువులకును సంస్కృత శ్లోకములకును గల ప్రాచుర్యము తిరస్కరింపరానిదికదా! అయితే పద్య మెట్టిపదజాలము కలిగియుండవలెను? ఎట్టి భావ సంపద యుండవలెను? యెట్టిశైలి కావలెను? అన్న ప్రశ్నలు రచయితయొక్కయు, అతనిరచన నర్థముఁజేసికొనఁగలిగిన సహృదయుని యొక్కయు శక్తికిని అభిరుచికిని మాత్రము సంబంధించినట్టివే కాని యెవరంటే వారికి సంబంధించినవి కావు.
కనుక ‘ఉత్పత్స్యతే మమతు కోఽపి సమాన ధర్మా, కాలోహ్యయం నిరవధి ర్విపులా చ పృథ్వీ’ అను భవభూతిమహాకవి యభియుక్తోక్తిని పురస్కరించుకొని శ్రీ సురభిమాధవరాయ రాజకవి యీచంద్రికాపరిణయప్రబంధమును రచించెను. ఇందున్న పదప్రయోగవిశేషములను, భావపరీమళమును, రసఝరీమాధుర్యమును, శ్లేషయమకచమత్కృతిని, అలంకారశోభను, ఇంకను తత్తద్గుణవిశేషములను దెలిసికొని సహృదయు లానందింతురుగాతమని యకాడమీవారు దీని పునర్ముద్రణమునకుఁ బూనుకున్నారు. యథాశక్తిగా నీకావ్యశోభను దిఙ్మాత్రముగాఁ జూపు పీఠికను రచించుటకై నన్నాదేశించినారు. ఈ బృహత్తర కార్యమున కల్పజ్ఞుఁడ నగు నన్ను బ్రేరేపించుటకు ముఖ్యకారణము శ్రీ సురభి మాధవరాయల వంశీయులగు రాజులకు భారత స్వాతంత్ర్యలబ్ధికిని, సంస్థానవిలీనములకును అతిసన్నిహితమగు కాలమువరకు రాజధానియై, ఇప్పటికిని మహబూబునగర మండలమునఁ దాలూకాకేంద్రమై యున్న కొల్లాపురముతో నాకు సన్నిహితసంబంధ ముండుటయు, నాజన్మస్థాన మా తాలూ కాయందే యుండుటయు ననుకొందును. కారణ మేది యైనను నేను ధన్యుఁడను. ఈపనికి నియోగించిన సాహిత్య అకాడమీ కార్యదర్శికిని యితరసభ్యులకును గృతజ్ఞఁడను.
రసజ్ఞశేఖరులారా! చంద్రికాపరిణయదర్శనకౌతూహలమనస్కులారా! సహృదయులారా! రండు, ‘కవి-కాలము, కవితావైదుష్యము, కథాసంవిధానము’ అన్న విభాగములతో శ్రీమాధవరాయ కవిమూర్ధన్యుఁడు మనకై సిద్ధపరచియుంచిన పద్యపాత్రలయందలి కావ్యామృతమును మనసారఁ గ్రోలి యానందింతము రండు.
కవి-కాలము
భారతదేశస్వాతంత్ర్యలబ్ధికిఁ బూర్వమునఁ బాశ్చాత్యుల పరిపాలనలో నుండిన యాంధ్రప్రాంతమందును, నిజాం పరి పాలనలో నుండిన తెలంగాణమునందును నిలిచియుండిన సంస్థానములు, జమీందారీలును జేసిన కళాపోషణము, సాహిత్య సేవయు మరువఁదగినవి కావు. తెలుఁగునాట వెలసిన దేవతావిగ్రహ, దేవాలయశిల్పములు, సంస్కృతాంధ్రకావ్యములు మొద లగు సంస్కృతిచిహ్నము లన్నియు శాతవాహన, విష్ణుకుండిన, కాకతీయ, చాళుక్యాదివంశములకుఁ జెందిన రాజులచేతను, రాణులచేతను, శ్రీకృష్ణదేవరాయ, అనవేలమహీపాల, సర్వజ్ఞసింగభూపాలాది ప్రభువులచేతను నిర్మింపఁబడి, ఈనాటి మన ఘనతకును, సంస్కృతికిని వన్నెలుదిద్దుచున్న విషయము సర్వజనవిదితము. వారిలో సర్వజ్ఞసింగభూపాలుని వంశమునకుఁ జెందినరాజు శ్రీ సురభి మాధవరాయలు.
చ. వికలిత పంకజాత నవవిభ్రమమై, ఘన గోధ్ర తాభిభూ
త కమఠనాథమై, యరుణధామ విభాసితమై, ద్విజోత్తమ
ప్రకటిత హార్దయోగభర భావుకమై, ధరయందుఁ ‘బద్మనా
యక కుల’ముద్భవించె నట, నాత్మజనుష్పద తుల్యవైఖరిన్.
అని చంద్రికాపరిణయ పీఠికాభాగమునందలి 18వ పద్యమున వర్ణింపఁబడిన పద్మనాయకకులమున (వెలమవారని ప్రసిద్ధినిఁ గన్న కులమున) వీరికి మూలపురుషుఁడైన పిల్లమఱ్ఱి బేతాళనాయఁ డుద్భవించెను (ఈయన జన్మనామము చెవ్విరెడ్డి). కాక తీయ గణపతిదేవచక్రవర్తివద్ద సేనానాయకుఁడుగా నుండి కాకతీయసామ్రాజ్యమున కెనలేనిసేవఁ జేసిన యీ బేతాళనాయని వారిని, రేచర్లగోత్రమువా రందఱును – అనఁగా వేంకటగిరి, బొబ్బిలి, పిఠాపురం, జటప్రోలు, మైలవరం మొదలగు ముప్పది యాఱు (36) వంశములవారు తమ మూలపురుషునిగా భావించుచున్నారు. నేటికిని జటప్రోలు (కొల్లాపురం) శరన్నవరా త్రోత్సవ సందర్భమున నీ బేతాళనాయనికి బలిని, పూజలను జరిపించుచున్నారు. ‘రేచర్ల’ యనునది బహుశ చెవ్విరెడ్డి జన్మ స్థానమగు గ్రామము. దానినే వీరందఱు గోత్రనామముగా స్వీకరించి యుందురు. పల్నాటియుద్ధమున సుప్రసిద్ధుఁడైన రేచర్ల బ్రహ్మనాయఁడు ఈ బేతాళనాయని మనుమఁడు. బేతాళనాయనికి నల్లగొండ మండలమునందలి రాచకొండ, దేవరకొండ గ్రామములు రాజధానీనగరములై యుండినవి. ఈతని వంశమునందు పదవతరమువాఁడు ‘సర్వజ్ఞ’బిరుదభూషితుఁడై, సాహిత్యక్షేత్రమున సుప్రసిద్ధుఁడై, శ్రీనాథాది మహాకవులను సత్కరించిన సింగభూపాలుఁడు. ‘రసార్ణవసుధాకరము’ (సింగ భూపాలీయమను నామాంతరము గల అలంకారశాస్త్రగ్రంథము), సంగీతరత్నాకరవ్యాఖ్య (దీనికి సంగీతసుధాకరము అని పేరు, ఇది నిశ్శంకశార్ఙ్గదేవుని సంగీతరత్నాకరమునకుఁ గల వ్యాఖ్యలలో నుత్తమ మైనదని విద్వాంసులు మెచ్చుకొనిరి), రత్న పాంచాలిక (ఇది కువలయావలి యను నామాంతరము గల నాలుగంకముల నాటిక) యిప్పటికి లభించిన యితని కృతులు. ఈ రాజేంద్రుని కావ్యలక్షణములను మహామహోపాధ్యాయ మల్లినాథసూరి తన వ్యాఖ్యానములలోఁ బ్రమాణీకరించెను. ఈ సింగభూపాలునిఁ జంద్రికాపరిణయ మిట్లు ప్రశంసించినది.
సీ. అరిపుర భేదనాయత దోర్బల స్ఫూర్తి, నవరాజవర్ధన వితత కీర్తి,
కనదహీనాంగద కలితబాహాలీల, ఖండితాహిత ఘనాఘన విహేల,
సద్గణరక్షణ క్షమ చరణాసక్తిఁ, బటుచంద్రకోటీరభా నిషక్తిఁ,
దత సర్వమంగళాంచిత గాత్ర రుచిపాళి, నచల ధర్మోన్నత ప్రచయకేళిఁ,
తే. బ్రకట దుర్గాధినాయకభావ భూతి, వైరి దర్పకదాంబక వహ్నిహేతి,
నవనిఁ బొగడొందె ‘సర్వజ్ఞుఁ’డనఁగ సింగ,ధరణిభృన్మౌళి తీవ్రప్రతాపహేళి.
సింగభూపాలుఁడు విద్యావిశారదుఁడై రసార్ణవసుధాకరాది గ్రంథప్రణేతయై ‘సర్వజ్ఞుఁ’డను బిరుదమును గాంచియుండఁగా, అరిపురిభేదన, నతరాజవర్ధన, అహీనాంగదకలనాది శ్లిష్టవిశేషణ రూపణాదులచేత నీశ్వరునిఁబోలిన సర్వజ్ఞుఁడని కవి యీ పద్యమున వర్ణించెను. మరియు,
తే. అర్థి సాత్కృత సురభి, పరాళి సురభి,
సుగుణవల్లీ ప్రకాండైక సురభి, కీర్తి
జిత సురభి, శౌర్యసురభి నా సింగనృపతి
పరగఁ దద్వంశమును గాంచె సురభిసంజ్ఞ.
యాచకాధీనముగాఁ జేయఁబడిన సువర్ణముగలవాఁడును, శత్రువులనెడు తుమ్మెదలకు సంపెంగ యైనవాఁడును, సుగుణము లనెడు తీగలకు వసంతుఁడైన వాఁడును, కీర్తిచేత జయింపఁబడిన కామధేనువుగలవాఁడును, శౌర్యపరిమళముగలవాఁడు నగు సింగభూపాలుఁ డుదయించటచేత నతనివంశమునకు ‘సురభి’ యను పేరు ప్రసిద్ధమై యున్నదని చెప్పెను. వస్తుతః సురభి యను గ్రామమునం దీవంశమువా రుండియుండుటచేత వీరి యింటిపేరు ‘సురభివార’ని వచ్చినదని యైతిహాసికులు విశ్వ సించుచున్నారు. ఈరాజకవి పెదకోమటి వేమభూపాలునికి సమకాలికుఁడై గ్రంథరచనయందును విద్వత్పోషణమునందును నతనితో స్పర్థ వహించి యుండెనని విమర్శకులు భావించుచుండుటచేత నితఁడు క్రీ.శ. 1403 మొదలు క్రీ.శ. 1430 వరకును, తరువాత మరికొంత కాలమును జీవించియుండె నని మనము భావింపవచ్చును.
ఇట్లు విస్తరించుచు వచ్చిన రేచర్లగోత్రజులగు జటప్రోలు సురభివారికి, బేతాళనాయనికిఁ బదిమూడవ (13) తరములవాఁ డగు మాదానాయఁడు శాఖామూలపురుషుఁడు. వీరు నల్లగొండ, దేవరకొండ ప్రాంతములందే యేలుబడిని సాగించుచు నుండి తరువాతి కాలమున జటప్రోలును రాజధానిగా నేర్పరచుకొన్నారు. జటప్రోలుకు సమీపమందున్న చిన్నమరూరు, బెక్కెం, పెంట్లవల్లి, వెల్లూరు గ్రామములలోఁ గోటలు గట్టి, తటాకములు వేయించి, దేవాలయములు కట్టించి, దేవతాప్రతిష్ఠలును జేసి, సుమారు రెండువందల సంవత్సరముల క్రింద ప్రస్తుతము రాజధానీనగరముగా నున్న కొల్లాపురమునకుఁ జేరిరి. అయినను వీరికి జటప్రోలు సంస్థానమువారన్న వ్యవహారము నైజాం రికార్డులలోను కొంతవరకు ప్రజలలోను నేటికిని నున్నది. పై మూల పురుషుని గురించి యొక పూర్వకవి యిట్లు వ్రాసెను.
ఉ. శ్రీలలరంగఁ బాండ్యగజసింహుఁడుగా నచలంబు పెంపునన్
లాలిత పట్టభూషణ లలాటము సూరనరేంద్రు మాధవుం
డాలములోన నశ్వమున కాదటఁ బెట్టినఁ జెల్లుఁగాక తా
జాలిని బూని యబ్బిరుదు చయ్యన నన్యులు పెట్టఁ జెల్లునే?
ఈమాధవుఁడే మాదానాయఁడు. ఇతని తండ్రిపేరు ఎఱ్ఱసూరానాయఁడని యీపద్యము తెల్పుచున్నది. (వెలుగోటివారి వంశ చరిత్ర. పుట 75)
అతని తరువాత పదునాల్గవ తరము (14) వాఁడైన మల్లానాయఁడు లేదా కుమార మాదానాయఁడు క్రీ.శ.1527లో ఆనెగొంది రామదేవరాయలవలన జటప్రోలు సంస్థానమును పారితోషికముగఁ గొని, విజయనగరసామ్రాజ్యమునకు సామంతరాజై యేలు బడిని సాగించెను. జటప్రోలు నగరమునందు మదనగోపాలస్వామి దేవాలయమును గట్టించి, స్వామిని ప్రతిష్ఠించి, పక్షోత్సవ, బ్రహ్మోత్సవాదుల నేర్పాటు చేసెను. ఆయన తరువాత పెద్దినేఁడు పదునైదవతరము (15)వాఁడు. ఈ పెద్దినేనినే, చంద్రికాపరిణ యము ‘పెద్దశౌరి, పెద్దవసుమతీకాంతుఁడు, పెద్దనృపతి’ యని పేర్కొని, యతఁడు గొప్ప పరాక్రమశాలియగు అశ్వరేవంతుఁ డనియు, సర్వజ్ఞసింగభూపాలుని వంశమున నుద్భవించిన సురభివారి మూలపురుషుఁ డనియుఁ జెప్పుచున్నది. ఇచ్చట మాదానాయనిఁగాక పెద్దినేనిని శాఖామూలపురుషునిఁగాఁ బేర్కొనుటకు గారణము చంద్రికాపరిణయరచనాకాలమున లభిం చిన శాసనాద్యాధారములై యుండునని యూహింపనగును. ఆ పెద్దనృపాలునికి వల్లభాంబ యను పత్నియందు మల్ల నాయఁడు జనించెను. ఇతఁడు జటప్రోలువారి పూర్వులలో మొదటి మల్లభూపాలుఁడు. ఇతనికిఁ జెన్నాంబయందుఁ బుట్టిన కుమారునికిఁ బెద్దమల్లానాయఁడని నామధేయము (ఇతఁడు రెండవ మల్లభూపాలుఁడు). ఇతఁడు మహాపరాక్రమశాలియు, దాతయు నై యుండినట్లు చంద్రికాపరిణయము వర్ణించినది. ఈ మల్లానాయని కుమారుఁడును మల్లభూపాలుఁడే (ఇతఁడు ముమ్మడి మల్లానాయఁడు, ఈపేరుగలవారిలో మూఁడవవాఁడు). ఇతనికి చెన్నాంబ, తిరుమలాంబ, మల్లాంబిక, అనంతమాం బిక యను నలుగురు భార్యలు.
ఉ. ఆవామామదనుండు మల్లవసుధాధ్యక్షుండు దచ్చెన్నమాం
బావామేక్షణయందు రామవిభునిన్, మల్లావనీవల్లభున్,
శ్రీవాసేక్షణ! నిన్నుఁ, మల్లమయెడన్ గృష్ణాధిపున్, మేదినీ
రావున్ గాంచె, నచంచలప్రమదసాంద్రా! మాధవక్షోణిపా!
అను చంద్రికాపరిణయ పద్యమువలన ముమ్మడిమల్లభూపాలునికి చెన్నాంబ యను భార్యయందు రామరాజు, మల్లనృపతి, చంద్రికాపరిణయకర్త యగు మాధవరాయలును జన్మించిరనియు, మల్లాంబికయందు కృష్ణభూపాలుఁడు, మేదినీరావు అను నిద్దఱు కుమారులు గల్గిరనియుఁ దెలియుచున్నది. కాఁగా వీరు సోదరపంచకముగా నుండి మాధవరాయల కిద్దరన్నలును, ఇద్దఱుతమ్ములును నుండిరని విశదమగుచున్నది. వీరిలోని మల్లనృపతిని వర్ణించుపట్టునఁ జెప్పిన ‘అనుపమ మల్లికార్జున యశోంచితుఁడైన కుమారమల్లనావనిపతి’ యను పద్యభాగమువలన నీవంశమువారికి శ్రీశైల మల్లికార్జునస్వామి యిష్టదైవమై యుండినట్లు తెలియుచున్నది. అందువలననే వీరిలో బెక్కండ్ర నామధేయములు పెదమల్లభూపాలుఁడు, చినమల్లభూపా లుఁడు, లింగభూపాలుఁడు, లింగాంబిక మొదలగు రీతిగా నుండుటకుఁ గారణమైనది. రేచర్లవారందరికినిఁ గూటస్థుఁడుగా భావింపఁబడుచున్న అనపోతమహారాజు శ్రీశైలమునకు సోపానములు గట్టించినట్లు ‘యశ్చారు సోపానపథేన చక్రే శ్రీపర్వతం సర్వజనాంఘ్రిగమ్యమ్’ అని రసార్ణవసుధాకరమునఁ గల శ్లోకభాగమువలన పైవిషయము దృఢీకృత మగుచున్నది. తరువాతి కాలమున నీరాజులు వైష్ణవభక్తులు నై సర్వమతసామరస్యమును బాటించిరి.
పై ముమ్మడి మల్లభూపాలుఁడే చంద్రికాపరిణయకర్త యగు మాధవరాయలకుఁ దండ్రి. తండ్రియగు మల్లభూపాలునిపై విశేషమైన భక్తి గలిగియుండిన సురభిమాధవరాయలు భర్తృహరి సుభాషితశతకత్రయిని ‘మల్లభూపాలీయము’ అను పేరున నాంధ్రీకరింపు మని మహోపాధ్యాయ యెలకూచి బాలసరస్వతికవిని ప్రార్థించుటయు, నతఁడు దానిని మల్లభూపాలున కంకి తము చేసి ‘సురభిమల్లా నీతివాచస్పతీ!’, ‘సురభిమల్లా మానినీమన్మథా!’, ‘సురభిమల్లా వైదుషీభూషణా!’ యను మకుటత్రయ ముతో నీతి శృంగార వైరాగ్య శతకముల ననువదించుటయు జరిగినది. బాలసరస్వతీమహోపాధ్యాయుని కనేకసత్కారములు ధనకనకవస్తువాహనములను మాధవరాయలవా రిచ్చియుండినట్లు ఈక్రిందిపద్యము మొదలగు మల్లభూపాలీయరచనలవల్ల స్పష్టపడుచున్నది.
శా. శ్రీమద్బాలసరస్వతీ ప్రకటలక్ష్మీహేతువై, శాంతమై,
ఆమోదావహమై, నిజానుభవవేద్యంబై, అనేహోదిగా
ద్యామేయ ప్రవిబోధ రూపమహితంబై యొప్పు తేజంబు, ప్రా
పై మీకున్ సిరులిచ్చుతన్ సురభిమల్లా! నీతివాచస్పతీ!
అట్లు తనతండ్రి కంకితముగా భర్తృహరిసుభాషితముల ననువదింపఁ జేయుటయే కాక సింగపట్టణక్షేత్రమున ‘నృసింహ సాగర’మను గొప్ప తటాకమును, మంచాలకట్టగ్రామమున మాధవస్వామి దేవాలయమును, జటప్రోలునగరమున శివాలయ మును శ్రీమాధవరాయలవారు కట్టించిరి. శ్రీయెలకూచి బాలసరస్వతీ మహోపాధ్యాయుఁడు బాలసరస్వతీయముయొక్క పీఠికాపద్యములలో ‘చంద్రాపరిణయాది సత్కృతిస్రష్టను’ అని తననుగుఱించి చెప్పుకొన్నందున, నతఁడే యాచంద్రికాపరి ణయకర్త యై యుండునని కొంద ఱనుమానించుచున్నారు. అంతకుఁదప్ప మరియొక ఆధారములేని ఆశంకను చర్చించుట యుక్తము కాదని మానివేసితిని. ఇంతకుఁ బేరులోనే వ్యత్యాస మున్నదికదా!
అన్నలు, తమ్ములు రాజ్యభారమును వహించియున్నందునఁ గాబోలు మాధవరాయలు విద్యావంతుఁడై, తర్కవ్యాకర ణాది శాస్త్రముల నభ్యసించి, బహుకావ్యవేదియై, సాహిత్యప్రియుఁడై, విద్వత్కవిగాయకుల సాహచర్యము గల్గియున్నందునఁ గావ్యరచనకుఁ బూనుకొని యతిప్రౌఢప్రబంధమైన ఈ చంద్రికాపరిణయమును రచించెను. తీరుబడితోఁ గూర్చుని, యత్యంత మైన సామర్థ్యముచేత, నీ ప్రబంధమునందలి యొక్కొక్కపద్యమును వ్రాసి తద్జ్ఞులకు వినిపించుచు, వారు ఆహా! ఔరా! యెంత బాగున్నది! యని మెచ్చుకొనుచుండఁగా నీకావ్యమును రచించుచుఁ బూర్తిచేసియుండు నని తోఁచును. ఆశ్వాసాంతగద్యలో ‘నుభయభాషాకళత్ర’ యని వేసికొన్న విశేషణము సర్వధా సత్యమని కావ్యము చాటుచున్నది.
శ్రీమన్మాధవరాయనింగారు విజయనగరసామ్రాజ్యమునకు విధేయులై శ్రీకృష్ణదేవరాయల యనంతర మా సామ్రాజ్య మును బెక్కువత్సరములు గాపాడిన అళియరామరాయలవారికి సమకాలికులు. తన పరిపాలనాకాలమున శ్రీరామరాయల సనదును గ్రొత్తచేయించుకొన్నవారు. రామరాజభూషణబిరుదాంచితుఁడగు బట్టుమూర్తి రచించిన వసుచరిత్రయు నితని చంద్రికాపరిణయమును సమకాలికరచనలని యెన్నియో అంతర్బహిస్సాక్ష్యములు గలవు. కాఁగా నీరాజకవి క్రీ.శ. 1530 నుండి క్రీ.శ. 1600వరకు జీవించియుండె ననియు, విజయనగరసామ్రాజ్యపతనము నెఱిఁగియుండె ననియు చెప్పుటకు వీలు న్నది. శ్రీఅళియరామరాయలవలెనే మాధవరాయలును దీర్ఘాయుష్మంతుఁడై యుండినట్లు చంద్రికాపరిణయము సాక్ష్య మొసఁగుచున్నది.
‘ఆ ధరాధీశు పిమ్మట నఖిలభూమి
భరము నీవు ధరించితి కిరికులేంద్ర
కమఠవల్లభ కులశైల కరటిసంస
దురగనాథులతోడఁ బెన్నుద్ది వగుచు.’
కుమారమల్లభూపాలుని (ఇతని సోదరుఁడు) పిమ్మట మాధవరాయలు రాజ్యభారము వహించియుండినట్లు తెలుపు చున్నది. విజయనగరసామ్రాజ్యము తాళికోటయుద్ధమునందు (క్రీ.శ.1565) పతనమై తదుపరి క్షీణించుచుఁబోయిన కారణ మున మాధవరాయల కడపటిదశలోను యనంతరమును జటప్రోలురాజ్యము ఖుతుబ్‌షాహీల వశమై గోలకొండసామ్రాజ్యము క్రిందికి వచ్చెను. కనుకనే మాధవరాయని యనంతరమున నతనికుమారులకు ‘సుల్తాన్ అబ్దుల్ హసన్ ఖుత్బుషా’(తానీషా) ఈక్రిందివిధముగా ఫర్మానా యిచ్చెను.
‘మీతండ్రి కార్‌కిర్దున నడుచుచున్న సంస్థానములు కదీము జటప్రోలు, వ పూట్ మొఖాసాగ్రామాలు, వ సూగూరు, కొత్త కోట వ దేహాయ నిడివెన్ను ఇజారతి దేఖీలు యెప్పటివలె మీతండ్రి మాధవరాయని కార్‌కిర్దున నడిచినట్టు మీకు శాశ్వతముగా నిరాచ్ఛేదముగా మొకరరు చేయ నవధరించినారము కాన ఖాతరుజమాతోటి కమావిసు చేసుకునేది’ ఇత్యాదిగా ఫర్మాను ఇయ్యఁబడినది.
ఆతరువాతి తరములవారందఱికిని గోలకొండ నిజాంప్రభువుల సన్నదులు లభిస్తూ వచ్చినవి. వారు, వరుసగా నరసింగ రావు, మాధవరావు, బారిగడపులరావు, పెద్దరామారాయఁడు, జగన్నాథరావు అను నామధేయములు గలవారై యుండిరి. ఇరు వదినాలుగవ (24) తరమువాఁడగు నీజగన్నాథరావునకు సంతానము లేకపోఁగా ఓరుగల్లుమండలాంతర్గత పాకాలతాలూకా లోని గురిజాలగ్రామమందుండిన ‘రావు’ వంశపువారి పిల్లవానిని దత్తు తెచ్చుకొని యతనికి ‘వేంకట లక్ష్మారావు’ అని నామకర ణముఁ జేసిరి (సురభివారు పూర్వకాలమున రావువంశపువారే యైయున్నందున ఆదత్తు సగోత్రదత్తతగా భావింపఁబడి యుండును). ఈ వేంకటలక్ష్మారావుగారు ఒక గొప్పవజ్రమును హైదరాబాదు నవాబుకు నజ్రానాగా నిచ్చి జటప్రోలు సంస్థాన మును పేష్కష్ ఏర్పాటుతో శాశ్వతకౌలుగా (బిల్‌మఖ్తాగా) సంపాదించెను. ఈప్రభువునకుఁగూడా సంతానము లేనందున తన జన్మస్థానమునుండి యొక బాలుని దత్తు తెచ్చుకొని యతనికి వేంకట జగన్నాథరావు అని నామకరణముఁ జేసెను. ఈ వేంకట జగన్నాథరావుగారు గుఱ్ఱపుఁబందెములలో మిక్కిలి నైపుణ్యము గలవారై బెంగుళూరు, మద్రాసు నగరములలో జరుగుచుండిన పందెములలో పలుసార్లు విజయమును బొందియుండిరి. కాంచీనగర వరదరాజస్వామివారికి దైనందినము బిందెసేవ కైంకర్య మున కేర్పాటు చేసిరి. సింగపట్టణం దేవాలయము నభివృద్ధిపరచి ‘లక్ష్మీనృసింహవిలాస’ మను సంస్కృతచంపూగ్రంథమును, ‘జటప్రోలు మదనగోపాల మాహాత్మ్య’మను సంస్కృతకావ్యమును హొసుదుర్గం కృష్ణమాచార్యులవారిచేత రచింపఁ జేసిరి. ఈ వేంకట జగన్నాథరావుగారికి సంతతి లేనందున వేంకటగిరి ప్రభువులైన శ్రీసర్వజ్ఞ కుమారయాచమనాయుడుగారి చతుర్థ పుత్రులయిన నవనీత కృష్ణయాచేంద్రులను దత్తపుత్రునిగా స్వీకరించిరి. ఈ దత్తపుత్రునికి తమతండ్రి పేరున శ్రీవేంకటలక్ష్మారావు గారని నామకరణము చేసిరి. ఈ దత్తస్వీకారమహోత్సవము శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామివారి సన్నధియందు క్రీ.శ. 1879 మార్చినెల 7వ తేదీకి సరియగు నీశ్వర సంవత్సర ఫాల్గున శుద్ధ తదియ గురువారము పగలు పదిగడియల సమయమున జరిగినది. క్రీ.శ. 1865 సంవత్సరమున జన్మించిన శ్రీ వేంకట లక్ష్మారావుగారి వయస్సు ఆ యుత్సవమునాటికి 14 సంవత్సరము లై యుండెను. క్రీ.శ. 1884 వ సంవత్సరం మార్చి 6వ తేదీన పట్టాభిషిక్తులై, క్రీ.శ. 1896 మార్చి 3వ తేదీన నైజాం ప్రభువు ఫర్మానా ప్రకారము జటప్రోలు (కొల్లాపురం) రాజ్యముపై నధికారము గల ప్రభువులైరి. అప్పటినుండియు ప్రజాపాలన, ధర్మకార్యనిర్వ హణ, సద్గ్రంథముద్రణాది సత్కార్యము లాచరించుచు దాదాపు ముప్పదిరెండు (32) సంవత్సరములు రాజ్యపాలనముఁ జేసి, తమపూర్వుఁడగు సురభిమాధవరాయవిరచితమగు ‘చంద్రికాపరిణయ’ప్రబంధమునకు బ్ర.వే.వెల్లాల సదాశివశాస్త్రి, బ్ర.వే. అవ ధానం శేషశాస్త్రిగార్లచేత ‘శరదాగమ’మను పేరుగల విపులమైన వ్యాఖ్యానమును రచింపఁజేసి, ముద్రణము చేయించి, పండితాశీ ర్వాదమును బొంది, పితౄణమును దీర్చికొని క్రీ.శ. 1928 ఏప్రిల్‌నెల 15వ తేదీన దివంగతులైరి. చక్కఁగా ముద్రింపఁబడిన యా కావ్యప్రతులను జూచి వారి యాత్మ యెంత సంతోషపడియుండెనో చెప్పఁజాలము.
శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరువారు సప్తసంతానములలో ముఖ్యతమమైన పుత్రరత్నము లేక యిద్దఱు పుత్రికారత్న ములుమాత్ర ముండుటచేత తమ వంశోద్ధరణమునకై తమ యన్నగారగు బొబ్బిలి సంస్థానాధీశులు శ్రీ రాజా శ్వేతాచలపతి వేంకట రంగారావు బహద్దర్ వారి పౌత్రులు శ్రీ రాజా రాజగోపాలరావుగారిని దత్తునిగా స్వీకరించి యా బాలునకిఁ దమ జనకుని నామధేయమగు శ్రీ రాజా వేంకట జగన్నాథరావు బహద్దర్ అని నామకరణముఁ జేసిరి. కాని దత్తపుత్రునికి పట్టాభిషేకమును, పరిణయమును గావింపక మునుపే శ్రీ వేంకట లక్ష్మారావుగారు దివంగతు లగుటచేత నాశుభకార్యములు వారి ధర్మపత్ని శ్రీ రాణీ వేంకటరత్నమాంబగారి కరకమలములద్వారా జరిగినవి. వారి రెండవకుమార్తె శ్రీమతి రాణీ సరస్వతీదేవిగారి పుత్రిక యగు శ్రీమతి రాణీ ఇందిరాదేవిగారిని శ్రీ వేంకట జగన్నాథరావు బహద్దరుగారి కిచ్చి వివాహమును జరిపించిరి. శ్రీ రాజా వేంకట జగన్నాథరావు బహద్దరువారు జటప్రోలు రాజ్యపట్టభద్రులై మాతృశ్రీ రాణీ వేంకట రత్నమాంబగారి యండదండలతో భారత స్వాతంత్ర్యలబ్ధియు, సంస్థానముల విలినీకరణము జరుగువరకును జటప్రోలు (కొల్లాపురం) సంస్థానమును బాలించిరి. పిమ్మట రాజ్యభారమునుండి విముక్తులై, విశ్రాంతినిఁ గొనుచుఁ బెక్కండ్రు విద్వాంసులకుఁ దమ తండ్రిగారగు రాజా వేంకట లక్ష్మారావు గారిచే నచ్చువేయింపఁబడిన చంద్రికాపరిణయప్రతులను ఉచితముగా నిచ్చిరి. పండితపోషణ, ధర్మకార్యనిర్వహణములందు శ్రద్ధాళువులై యున్న శ్రీ వేంకట జగన్నాథ బహద్దరువారు గత క్రీ.శ. 1980వ సంవత్సరమున దివంగతులైరి. శ్రీవారికి వంశోద్ధా రకుఁడైన కుమారుఁడు చిరంజీవి శ్రీ సురభి వేంకట కుమార కృష్ణబాలాదిత్యలక్ష్మారావు. (శ్రీ బాలాదిత్య లక్ష్మారావును, చిరంజీవి కుమారి శ్రీరత్నసుధాబాల యను పుత్రికయు వర్తమాన జటప్రోలు సురభివారి రాజవంశమున నున్నారు. ఈ చిరంజీవులను వారి కులదైవములగు మదనగోపాల, లక్ష్మీనృసింహస్వాములును, సురభివంశీయులగు పెద్దల సుకృతవిశేషములును బ్రోచి, రక్షించి యితోఽధిక విద్యాభోగభాగ్యసంపన్ను లగునట్లు వర్ధిల్లఁ జేయుదురుగాత.)
కవితావైదుష్యము
‘చంద్రిక’యను నాయికయొక్క పరిణయమును కథావస్తువుగాఁ జెప్పుటచేత నీకావ్యమునకుఁ ‘జంద్రికాపరిణయము’ అను నామధేయము అన్వర్థమై యొప్పుచున్నది. శృంగారరసప్రధానమైన యీకావ్య మాఱాశ్వాసములతో నమర్పఁబడి యున్నది. కావ్యమందంతటను శ్లేషచమత్కారము, పదప్రయోగచాతుర్యముఁ గల పద్యము లుండుటయేగాక చతుర్థాశ్వా సము మొత్తము యమకాలంకారములతో నిండి యొప్పారుచున్నది. న్యాయ వైశేషిక వేదాంత వ్యాకరణాది తంత్రప్రసిద్ధ కల్పనా నల్పంబై మాధవరాయల యశేష విశేష వైదుషీప్రతిభను అడుగడుగునను జాటుచునే యుండును. ఈకావ్యమును శ్రీమహావిష్ణు వునకుఁ బ్రతికృతియైన శ్రీజటప్రోలు మదనగోపాలమూర్తి, ‘శ్రీవాసజ్జటప్రోలీ, భావుకపత్తన విహార పటుశీలునకున్, గోవర్ధన గోవ ర్ధన గోవర్ధన వృష్టిహృతికి గోపాలునకున్’ అని కవి యంకితము చేసినాడు. ఈమదనగోపాలస్వామి జటప్రోలు (కొల్లాపురం) రాజుల కాదికాలమునుండి నేటివరకును గులదైవమై యిష్టదైవమై సకలసౌభాగ్యములను జేకూర్చుచున్నాడు. శ్రీశైలము జల విద్యుత్తుజలాశయమునం దీజటప్రోలు నగరము మునిగి పోవనుండఁగా, శ్రీస్వామివారి దేవాలయసహితముగా నా గ్రామమును దరలించి మరియొకచోట నిర్మించు నేర్పాటును ఇటీవలనే స్వర్గస్థులైన శ్రీశ్రీ రాజా సురభి వేంకట జగన్నాథరావు బహద్దరువారు చేసి, వంశప్రతిష్ఠను నిలిపినారు. ఆనగర మిప్పు డింకను నిర్మాణములో నున్నది.
ఈ చంద్రికాపరిణయకావ్యమునకుఁ గథానాయకుఁడు సుచంద్రుఁడు. సూర్యవంశీయుఁడై విశాలానగరమునకుఁ బరిపాల కుఁడై యుండిన యీ భూపాలాగ్రణి పుణ్యశ్లోకుఁడై బహుపురాతనరాజన్యుఁడై యుండెనని శ్రీమద్వాల్మీకి రామాయణ బాల కాండమునందలి యీశ్లోకము సాక్ష్య మొసగును.
శ్లో. విశాలస్య సుతో రామ! హేమచంద్రో మహాబలః|
‘సుచంద్ర’ ఇతి విఖ్యాతో హేమచంద్రా దనంతరః||
ఇఁక కథానాయిక ‘చంద్రిక’. ఈయువతి ‘వసంతుఁడు’ అను మునివరుని శాపముచేత మనుష్యజాతియందుఁ బుట్టిన ‘చిత్రరేఖ’ యనఁబడు దేవాంగన. మానవస్త్రీయై పుట్టిన యీమెకు పాంచాలదేశాధిపతి యగు ‘క్షణదోదయ’నరేంద్రుఁడు తండ్రి. ‘శ్యామ’ యను నామె తల్లి. ఇట్టి లోకోత్తరనాయికానాయకుల ప్రేమను ఇతివృత్తముగా స్వీకరించి వారిపరిణయముతో సుఖాంతముగా నీ కావ్యమును ముగించినాడు శ్రీ సురభిమాధవరాయలు. ఈకవి రామరాజభూషణునికి సమకాలికుఁడనియు, నీచంద్రికాపరిణ యము వసుచరిత్రకు సమకాలీన మనియు శ్రీ తిరుమలసెట్టి జగన్నాథకవి ప్రభృతులయిన సాహిత్యవిమర్శకులు నిర్ణయించుట వలన మాధవరాయలు, వసుచరిత్రయొక్క కథానాయకుఁడు ‘ఉపరిచరవసు’వనఁబడు పురాణపురుషుఁడై యుండఁగా నంత కేమాత్రము తగ్గని రామాయణమహాకావ్యమునం దుల్లేఖింపఁబడిన ‘సుచంద్రుఁ’డను మహాపురుషునిఁ దనకావ్యమునకు నాయ కుఁడుగా నేర్పరచినాడని మనము గ్రహింపవలయును. ఇఁక నాయికయగు ‘చంద్రిక’ వసుచరిత్రనాయిక యగు ‘గిరిక’కు ఏ మాత్రమును దీసికట్టుగా లేదు. అనేకఘట్టములలోను, సంఘటనములలోను, వర్ణనములలోను, విశ్రమప్రదేశములందును ‘వసు చరిత్ర’, ‘చంద్రికాపరిణయము’లకు సారూప్యమున్నది. ఇవి సమకాలికకావ్యములే యైనచో మాధవరాయలు వసుచరిత్రము ననుసరించెనా? లేక భట్టుమూర్తి చంద్రికాపరిణయము ననుసరించెనా? యను సంశయము గలుగక మానదు. కాని యిద్దఱును ఉద్దండులు. ఇద్దఱును మహాకవులు. ఇద్దఱును పదపదైకదేశ స్వారస్యసహితముగా సాహిత్యమర్మము నెఱిఁగినవారు. ఎవరి శైలి వారిదే యైనప్పటికిని రామరాజభూషణుఁడు లోకప్రసిద్ధరూఢిప్రయోగములు చేయుటలో దిట్ట యని తలంచినచో, మాధవ రాయలు యౌగికార్థసంవలితములయి, శాస్త్రనిఘంటువులయందలి యసామాన్య యౌగికార్థములు కల్పించి, పదప్రయోగ ములు చేయుటలో దిట్ట యని తలంపవలసి యున్నది.
ఉ. సురభికులామలాబ్ధిఁ బొడచూపిన ‘మాధవరాయ’చంద్రుఁడా
సరసపదార్థరంజనము సత్కవిహృద్యము గాఁగ ‘చంద్రికా
పరిణయమున్’ రచించె, నది భావ్యము; నీవసుచర్య చూడఁగాఁ
బరగె నిగూఢవృత్తి నటు నీకును వర్తిలె ‘మూర్తి’నామమున్.
ఇది యొక విచిత్రమైన చాటువు. కీ.శే.వెల్లాల సదాశివశాస్త్రిగారు రచించిన సురభివారి వంశచరిత్రలో నుదాహరింపఁబడిన పద్యమిది. దీనిని రచించిన కవి యెవరో తెలియదు. కాని, యావిద్వత్కవి మాధవరాయల యాశ్రితుఁడై భట్టుమూర్తిపై ననాద రముగలవాఁడై యుండినట్లు ఈపద్యము సూచించుచున్నది. ‘చంద్రికాపరిణయము’ సరసపదములచేతను, సరసములైన యర్థములచేతను రంజకముగా నుండి సత్కవులకు హృదయంగమముగా నున్నదనియు, అది భావ్య మనియు, మాధవ రాయల కవిత్వమును బొగడుటయు, వసుచరిత్ర నిగూఢార్థములు గలిగి, భావ్యముగా లేదని తెగడుటయు, నితని యభిప్రాయ మై యున్నది. అంతియేకాక వసుచరిత్రను రచించినందువలన నీకు ‘మూర్తి’ యనుపేరు సార్థకమైన దనియుఁ, దృణీకారమున బల్కుట చూడఁగాఁ, ‘జంద్రికాపరిణయ’మను శ్లేషయమకాది సర్వాలంకారశోభితమగు మహాకావ్య మొకటి యుండఁగా నీ ‘వసుచరిత్ర’ యెందులకోయి? యన్న యధిక్షేపము సైతము గోచరించుచున్నది. ‘మూర్తిః కాఠిన్య కాయయోః’ యను నమర వచనమువలన ‘మూర్తి’ యనఁగా కఠినుఁడు, బండ యను నర్థము వచ్చుటవలన ‘నీ వసుచర్య చూడఁగా బరగె నిగూఢ వృత్తి, నటు నీకును వర్తిలె మూర్తినామమున్’ అని యనుటలో ‘నీ వసుచరిత్ర యెవ్వరికిని అర్థము కాదు, నీవు వట్టి బండవు’ అన్న భావ మీపద్యరచయిత హృద్గతమై యున్నట్లు తోచెడిని. ఈపద్యరచయిత భావ మేదయినను, సంస్కృతాంధ్రసాహిత్యమర్యాద లెఱింగినవారు కేవలమూలములను మాత్రము చదివి చూచినచో నితనిపద్యమునందలి యభిప్రాయముయొక్క సత్యాసత్య ములు బోధపడగలవు. వ్యాఖ్యానములను జూచినచోఁ దారతమ్యము తెలియుట కష్టము. ఇంతకు సురభిమాధవరాయలును రామరాజభూషణుఁడును సమకాలికులై యుండిరనుట పరమసత్యము.
పోలికలు
సీ. సుమనోగ సమచూత సుమనోగణపరీత సుమనోగణిత సారశోభితాళి
కలనాద సంతాన కలనాదసమనూన కలనా దలితమాన బలవియోగి
లతికాంతరిత రాగలతికాంత సపరాగ లతికాంత పరియోగ లక్ష్యకాళి
కమలాలయాస్తోక కమలాలయదనేక కమలా లసిత పాక కలితకోకి
తే. జాలక వితానక వితానపాళిభూత
చారు హరిజాత హరిజాత తోరణోల్ల
సద్వ్రతతికా వ్రతతిగావ్రజ క్షయాతి
భాసురము పొల్చె వాసంతవాసరంబు. (చం.ప. ఆ 4, ప 25)
సీ. లలనాజనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగ,
మలసానిల విలోల దళసాసవ రసాలఫల సాదర శుకాలపనవిశాల,
మళినీ గరుదనీక మలినీకృతధునీ కమలినీసుఖిత కోకకులవధూక,
మతికాంత సలతాంత లతికాంతర నితాంత రతికాంతరణ తాంత సుతనుకాంత,
తే. మకృతకామోదకురవకావికల వకుల,ముకుల సకలవనాంతప్రమోదచలిత
కలిత కలకంఠకుల కంఠకాకలీ వి, భాసురము వొల్చు మధుమాస వాసరంబు.(వ.చ. ఆ 1, ప126)
సందర్భము రెండు పద్యములకును మధుమాసవాసరవర్ణనమే. అట్లే కూతురు అత్తవారింటికి వెళ్ళునప్పుడు చంద్రికతండ్రియు, గిరికతండ్రియు నోదార్చి పలికిన పలుకులలో సామ్య మీక్రిందివిధముగా నున్నది.
కం. నిచ్చలు పుట్టినయింటికిఁ
జొచ్చినయింటికి నపూర్వశుభకీర్తితతుల్
హెచ్చ మెలంగవె తల్లి! భ
వచ్చరితము భువనపుణ్యవైఖరిఁ బొదలన్. (చం.ప. ఆ 6, ప 98)
కం. నీతమ్ముల శుభవాసన
నీతలిదండ్రుల గభీరనిశ్చలగుణ వి
ఖ్యాతియును దలఁచి మెలగుము
నాతల్లీ! కులవధూజనమత్తలికవై. (వ.చ. ఆ 6, ప 55)
సీ. నిజ కటకాశ్రిత ద్విజపోషణమున నెవ్వని సార్వభౌమత ఘనతఁ గాంచుఁ
బర మహహీన సద్బల విభేదనలీల రమణ నెవ్వని నరేంద్రత్వ మలరు
గంధాంక కైరవకాండ లుంటాక ధామమున నెవ్వని యినత్వము సెలంగు
జాగ్రద్ఘనాఘన సాంద్రమదాపహశక్తి నెవ్వని మహేశ్వరత వొసఁగు
తే. నతఁడు వొగడొందు, జయశాలి, యహితసాల
కీలి, యతిదీప్తినిర్ధూత హేళి, యమర
విసర సన్నుత నయకేళి, యసమ సుగుణ
విజిత భువనాళి, శ్రీసింగవీరమౌళి. (చం.ప. ఆ 1, ప 20)
సీ. వసుమతీభార ధూర్వహత నెవ్వని యుర్వరావరాహాంక మర్థము వహించుఁ
గరగతచక్ర విక్రమశక్తి నెవ్వాని రామానుజత్వంబు రమణకెక్కు
జీర్ణకర్ణాటలక్ష్మీ పునస్సృష్టి నెవ్వాని లోకేశ్వరత్వము పొసంగుఁ
జటులశార్వరమగ్న సర్వవర్ణోద్ధారపటిమ నెవ్వని రాజభావ మెసఁగు
తే. నతఁడు ‘వీరప్రతాప, రాజాధిరాజ,
రాజపరమేశ్వ, రాష్టదిగ్రాజకుల మ
నోభయంకర’ బిరుద సన్నుత జయాభి
రామగుణహారి, తిరుమలరాయశౌరి. (వ.చ. ఆ 1, ప13)
సీ. తన కలావిభవంబు తన కలావిభవంబు కరణి సుదృగ్జాతి వఱలఁజేయఁ,
దన దానమహిమంబు తన దానమహిమంబుగతిని బ్రత్యర్థిసంఘములఁ బెంపఁ,
దన సుమనోవృత్తి తన సుమనోవృత్తిలీల సదాసవహేలఁ గూర్పఁ,
దన మహామిత్రాళి తన మహామిత్రాళి పగిది నానావనీభరణ మూనఁ,
తే. దనరు విషమాద్రి జిహ్మగ స్తబ్ధరోమ, మత్తమాతంగ కఠినకూర్మప్రసంగ
విరసవసుధావధూ భోగపర విహార,శాలి భుజకేళి మల్లభూపాలమౌళి. (చం.ప. ఆ 1, ప 20)
సీ. తన భవ్యధామంబు తన భవ్యధామంబు కరణి మిత్రోన్మేషకరము గాఁగఁ,
దన ధర్మగుణములు దన ధర్మగుణముల ట్లతులిత శ్రుతిమార్గగతుల నెసఁగఁ,
దన మహాహవదీక్ష దన మహాహవదీక్ష పగిది నానావనీపకులఁ బెంపఁ,
దన యంబకంబులు దన యంబకంబుల లట్ల పరభీరువిముఖతఁ బరిఢవిల్ల,
తే. బరఁగుఁ గఠినాద్రి జడలుఠ జ్జరఠకమఠ, కూటకిటి గూఢచరణ దిక్కోటికరటి
కుటిలతాసహ భూ సౌఖ్యఘటన భూరి, భుజబలవిహారి యార్వీటి బుక్కశౌరి. (వ.చ. ఆ 1, ప28)
చ. అలఘు మనోభవోదయకరాంగయుతిం దగు నా మిళిందకుం
తల, నలమీననేత్ర, నలతామరసానన, నాపికారవో
జ్జ్వల వరమంజులాబ్జగళసంగత, నాబిసబాహ, నాప్రవా
ళలలితపాద, నాచెలిఁ దలంపఁగ నీకె తగున్ నృపాలకా! (చం.ప. ఆ 3, ప 31)
మ. కమనీయాకృతి యోగ్యకీర్తనములం గన్పట్టు నాశ్యామ, యా
సుమబాణాంబక, యాయమూల్యమణి, యాచొక్కంపు పూబంతి, యా
సుమనోవల్లరి, యాసుధాసరసి, యాసొంపొందు డాల్దీవి, యా
కొమరుంబ్రాయపురంభ, యాచిగురుటాకుంబోడి నేకే తగున్. (వ.చ. ఆ 2, ప 52)
సీ. మంజులాహీన హర్మ్యప్రదేశంబున శుచిగరుత్మల్లీలఁ జూచికొనుచుఁ,
గలధౌతమయ శైలకందరాస్థలుల మహానంది హరిలీల లరసికొనుచు,
సుమనోనివాస భాసురనగాగ్రములందు దివ్యసారంగాభఁ దెలిసికొనుచు,
పుష్కరవీథులఁ బొలుపొందు నేకచక్రరథవిస్ఫూర్తినిఁ గాంచికొనుచుఁ,
తే. గమల దైత్యారి, శర్వాణి కమలవైరి
ధారి, పౌలోమి యుర్వరాధరవిదారి,
ఛాయ హరి, యన నలరిరి సకలకాల
సముచితాఖేలనంబుల సతియుఁ బతియు. (చం.ప. ఆ 6,ప 133)
సీ. అభిరామ నవపల్లవారామ కుంజవాటికలఁ గీరముల నాడించికొనుచుఁ,
బద్మాలయోదర ప్రౌఢసారసవీథి నంచలవేడంబు లరసికొనుచు,
గాంగేయధామ శృంగవిటంకముల నీలకంధరోజ్జ్వలగతు ల్గాంచికొనుచు,
విమలసింధుద్వీపవేదిక నరుణాప్తఖగవిహారప్రౌఢిఁ బొగడికొనుచు,
తే. రతియుఁ జేతోభవుండు, భారతియు నజుఁడు,
శచియు నమరాధినాథుండు, జలధిసుతయు
నబ్జనాభుండు, నన మించి యఖిలసమయ
సముచితక్రీడ సల్పిరి సతియుఁ బతియు. (వ.చ. ఆ 6, ప 97)
ఇట్లు చంద్రికాపరిణయ వసుచరిత్రములలో పెక్కుపద్యములు ఆదినుండి యంతమువఱకు నొకదాని నొకటి పోలియున్నవి. నాయకాలంబనములగు వీరశృంగారరసములయందును, నాయికాశ్రయమగు సంగీతకళయందును, మధ్యవర్తులగు నితర పాత్రలు నాయికానాయకులకుఁ బరస్పరానురాగముల నుద్దీపింపఁ జేయుటయందును, విప్రలంభశృంగారమున జరుగు నుద్యానవిహార జలక్రీడాదులయందును, వివాహవిధాన మంగళకార్యములందును, నాయికానాయకసంభోగమునందును బెక్కుపోలిక లుండుటచేత కవులగు సురభిమాధవరాయ రామరాజభూషణులకుఁ బరస్పరసమాగమములు గాని, యొకరి రచనావిశేషముల నొకరు తిలకించియుండుటగాని జరిగియుండునని దృఢముగా విశ్వసించుటకు వీలగుచున్నది. ఇద్దరును శ్రీకృష్ణదేవరాయల మేనల్లుఁడగు నళియరామరాయలతో సన్నిహితసంబంధము గలిగియున్నట్లు చరిత్రకారులు భావించి నందున యిట్లు తలంపవలసి వచ్చినది. అయినప్పటికి వీరిద్దరిలో నొకరు ఎక్కువయనిగాని, యొకరు తక్కువయనిగాని, ఒక్క డుత్తమర్ణుఁడు నొక్కఁ డధమర్ణుఁడనిగాని నిర్ణయించుకొని తారతమ్యమును జెప్పుట సాహసమగును. మాధవరాయలు చాల ఘటికుఁడు. వసుచరిత్ర పోలికలతోఁబాటు పూర్వకవులగు కాళిదాస, కవిత్రయ, కృష్ణదేవరాయ, పెద్దనాదుల రచనలను బోలిన పద్యములు సైత మిందులో నున్నవి. పూర్వాపూర్వభావములు సంస్కారవిశేషములచేతఁ గవియగువాని చిత్తమున నెల కొని మఱల బయల్పడుట సహజము. అతఁడు వలయునని తెచ్చుకొనఁడు. వానియంతట నవియే యట్లు దొరలుచుండును. కనుకఁ జంద్రికాపరిణయకర్త భావదారిద్ర్యముచేతఁ గాని, భాషాదారిద్ర్యముచేతఁగాని అట్లు పోలికలు తెచ్చుకొన్నవాఁడు కాడు. అది యంతయు నతనికిఁ గల సంస్కారబలముచేత కాకతాళీయముగా జరిగినదే. అసలు సమర్థుఁడగు నేకవియు నొకని రచనా పద్ధతి నెరవు తెచ్చుకొనుటకు సిద్ధపడఁడు. అట్టి పరిస్థితిలో నుద్దండకవిప్రకాండుఁడగు మాధవరాయకవీంద్రునిఁగూర్చి సాహితీ విమర్శకులు సంశయింప నవసరము లేదు.
తే.గీ. విబుధశిక్షితుఁడవు, శాస్త్రవిదుఁడ, వఖిల
కావ్యవేదివి, ఘనతార్కికవ్యవహృతి
నెఱుఁగుదువు, నీ కసాధ్యమే యింపుమీఱఁ
గృతి వినిర్మింపు మాధవక్షితిప యనిరి. (1-75)
ఇది సురభిమాధవరాయల యాస్థానమునందున్న పండితమండలి యతనినిఁ జంద్రికాపరిణయరచనకు ప్రోత్సహించిన వాక్యము. ‘కావ్యజ్ఞ శిక్షయాభ్యాసః’ అను లాక్షణికవచనానుసారముగాఁ గవియగువాఁడు చక్కని విద్యాభ్యాసమును విబు ధులవద్దఁ జేయవలయును గనుక యితఁడట్లు చేసినట్టివాఁడు. ‘శాస్త్రవిదుఁడవు’ అనుపలుకు మాధవరాయని ఛందో వ్యాకర ణాలంకారజ్యోతిషసంగీతాది శాస్త్రముల పరిశ్రమను దెలుపుచున్నది. ‘అఖిలకావ్యవేదివి’ ఇది కవియగువానికి మిక్కిలి యా వశ్యకము. ‘ఘనతార్కికవ్యవహృతి నెఱుఁగుదువు’ తర్కశాస్త్రవ్యవహారము నంతటిని యెరిఁగినవాఁడనుట. ‘కాణాదం పాణి నీయంచ సర్వశాస్త్రోపకారకమ్’ అనియు, ‘వాణీ తర్కరసోజ్జ్వలా’ అనియు విద్వాంసులచేతఁ గొనియాడఁబడుచున్న తర్క శాస్త్రమునందు సైత మీకవికి బ్రవేశమున్నచో నిఁక యతని రచనాశక్తిని గురించి వేరుగాఁ జెప్ప నక్కరలేదు. ఇట్లు మహాపండితుఁ డై, మహాకవియై విరాజిల్లిన విద్వత్కవి శ్రీసురభిమాధవరాయలు కనుక నతఁ డొకరి రచనాపద్ధతి నవలంబించు ననుమాటయే పుట్టదు. పైపద్యమునందుఁ బొందుపరచిన యతనిగుణములలో నొక్కొకదానిని స్థాలీపులాకన్యాయమునఁ జూతముగాక.
ఛందోరీతులు
కావ్యారంభమును శుభఫలప్రదమగు ‘మగణము’తోను, సర్వదోషహరమగు శ్రీకారముతోను గూర్చి, శార్దూలవృత్తము లో ‘శ్రీవక్షోజధరస్ఫురద్వర మురస్సీమన్’ అని సాగించుటచేత సత్సంప్రదాయవేత్త యని చెప్పవచ్చును.
కావ్యము పఠితలకును, యర్థముఁ జేసికొనువారికిని సులభపఠనీయమై యుండుటకుఁ గాబోలు – కొన్ని విశేషస్థలము లందుఁ దప్ప సర్వత్ర ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభవిక్రీడితము, కందము, గీతము, సీసములనే వాడెను. ఆశ్వాసముల చివర వాడినవి పృథ్వీవృత్తము, ఉత్సాహవృత్తము, కవిరాజవిరాజితము, పంచచామరము, మాలినీవృత్తము అనునవి మాత్రమే. ఇఁక నాయా విశేషస్థలములయందు రసానుకూలముగా, సుచంద్రుఁడు, చంద్రిక యున్న కొండకోనలోని కోలాటమును విని యచ్చటి కుత్సాహమున వెళ్ళునప్పుడు లయగ్రాహివృత్తమును, సుచంద్రతమిస్రాసురుల యుద్ధవర్ణనము నందు మహాస్రగ్ధరావృత్తమును, తమిస్రుఁడు సుచంద్రునిపై బాణములను ద్వరితగతితో వేయునప్పుడు త్వరితగతివృత్తమును, ఇంకను వారి యుద్ధవైచిత్రిని వర్ణించుటలో మాలిని, ప్రహరణకలితము, పంచచామరము, శిఖరిణి, భుజంగప్రయాతము, పృథ్వీ వృత్తము అను వృత్తవిశేషములను, చంద్రిక చెలికత్తె లుద్యానవనమునఁ బువ్వులు గోయునప్పుడు వారి యుత్సాహమును దెల్పు టకు వృషభగతిరగడను మాత్రము రచించెను. గర్భకవిత్వమునుగాని, బంధకవిత్వమునుగాని స్వీకరింపలేదు. ‘ళ’కార ‘ల’ కారములకు ప్రాసమైత్రి నంగీకరించెనుగాని రేఫ ‘ర’కారముల ప్రాసమైత్రి నంగీకరింపలేదు. సీసపద్యముల రచనలో, శ్రీనాథుఁడు పెట్టిన యొరవడిలోనే సమాంతరవాక్యవిన్యాసము గల పెద్దపాదములు నాలుగింటినిఁ బూరించి, పిమ్మట గీతపద్యమును జత పరచు పద్ధతిలోనే కలమును సాగించెను. ‘ళ’’ల’ప్రాసమున కుదాహరణమనఁదగిన ఈక్రిందిపద్యమువంటి పద్యము ఆముక్త మాల్యద, అనర్ఘరాఘవమువంటి కావ్యములలో మాత్రము లభించును.
మ. గళదర్కంబుఁ, బనీపతతత్కుజము, రింఖద్గోత్రగోత్రంబుఁ, జా
చల దుర్వీవలయంబు, ఫక్కదఖిలాశాకంబు, భిద్యన్నభ
స్థల మేఘౌఘము, భ్రశ్యదృక్షము, రణత్పద్మాసనాండంబునై
యలరెన్- దన్మహిపాలజైత్రగమ బంభారావ మప్పట్టునన్. (1-151)
ఇందులో ‘ళ’కార, ’ల’కారములకుఁ బ్రాసము చెల్లినది. పద్యమునందలి ‘గళత్’, ‘పనీపతత్’ మొదలగు శబ్దముల వ్యాకరణ విశేషములనుగుఱించి మరియొక శీర్షికక్రిందఁ జర్చింపఁబడును. యతులను బ్రాచీనులగు భీమన, అనంతుఁడు నిర్ణయించిన వానినే యుపయోగించెనుగాని యాధునికుఁడగు నప్పకవి చూపిన యతివైవిధ్యమును పాటించి ఉపయోగింపలేదు. ఇంతకు నప్పకవి యితనికిఁ దరువాతివాఁడేకదా! ఇఁక వచనరచనయందును తన యసాధారణప్రతిభను జూపుచుఁ గావ్యమునందు మొత్త మిరువది వచనములను, ఒక సంస్కృతదండకమును రచించెను. ఈసంఖ్యలో వచనములను పద్యకావ్యములందుఁ జేర్చిన పూర్వకవులు తక్కువ. ‘గద్యపద్యమయం కావ్యం చంపూ రిత్యభిధీయతే’ అను లాక్షణికవచనానుసారముగాఁ గద్య ములును పద్యములునుగల కావ్యమునకుఁ ‘జంపువు’ అను పేరుండుట యుక్తము. కాని మన తెలుఁగుకవులు ఆపేరును బెట్టు కొన లేదు. బహుశః తెలుఁగుభాషలో చకారము తాలవ్యము (‘చ’)గాను, దంత్యము ( ‘ౘ’)గాను ఉండుటచేత ప్రజలవ్యవహార మున ‘చంపు’ అనుటకు బదులు ‘ౘ౦పు’ అని యగునను భయముచేత వదలియుందురని భావింతును. కనుక పద్యకావ్యము నందే యవసరమని తోఁచినప్పుడు వచనములనుగూడఁ జేర్చుచు, తత్ప్రయుక్తమగు నామకరణమును మాత్రము వదలుచు వచ్చిరి. మాధవరాయల వచనరచన విశిష్టమైనట్టిది. అందులో సంసస్కృతపదభూయిష్ఠములగు దీర్ఘసమాసములతో పాటు అచ్చతెలుఁగుపలుకుల కూర్పులును, అలఁతియలఁతి పదము లుభయభాషలయందును, శ్లేషాద్యలంకారములును, విరోధా భాసలు, విశిష్టశాస్త్రమర్యాదలు మొదలగు శబ్దార్థచిత్రములు విచిత్రముగాఁ బ్రకటితములై బాణుని కాదంబరీగద్యశైలిని, దండి దశ కుమారచరిత్రవైఖరిని, పెద్దనాదుల వచనరచనావిధానమును స్మృతిపథమున నిలుపును. ఇఁక తన సంస్కృతభాషాప్రావీణ్య మును జూపుచు పార్వతీస్తవముగా రచింపఁబడిన సంస్కృతదండకమునందు విచిత్రశైలితో పాటు విశిష్టతంత్రశాస్త్రమర్యాదలును గోచరింపఁజేయును. పద్యరచనయందువలెనే గద్యరచనయందును సాటిలేని మేటికవి యితఁడనిపించును.
వ్యాకరణవిశేషములు
కం. ఆమల్లనృపతి చెన్నాంబా మానినియందుఁ గాంచె మల్లక్షితిపున్,
వ్యోమగవీ సోమగవీ రామ గవీశాచ్ఛకీర్తి రాజన్మూర్తిన్. (1-33)
ఇది మాధవరాయల వంశీయులలోఁ బూర్వుఁడగు నొక మల్లభూపాలుని కుమారుఁడు రెండవమల్లభూపాలుని వర్ణన. అతని కీర్తి వ్యోమగవీ=కామధేనువు, సోమగవీ=చంద్రకిరణము, రామ=బలరాముఁడు, గవీశ (గో+ఈశ=గవీశ)= సరస్వతీశివుల వలెను, అచ్ఛ=తెల్లనై యున్నది అని దీని యర్థము. గోశబ్దముపై సమాసాంత ‘టచ్’ప్రత్యయమును, స్త్రీత్వబోధకమగు ఙీప్ (ఈ) ప్రత్యమును వచ్చుటచేత ‘గవీ’ యనునవియు, ‘గవీశ’ అనునది అవాదేశసంధి వచ్చుటచేతను సిద్ధించిన రూపములు.
సీ. “ధర్మనిర్మథనంబు దాఁజేసి జనకజా ‘పాణౌకృతి’ క్రీడఁ బ్రబలఁడేని” (1-60)
‘పాణౌకృతిక్రీడ’ యనఁగా వివాహము. ‘నిత్యం హస్తే పాణా వుపయమనే’ యను పాణినీయసూత్రముచేత పాణిశబ్దము యొక్క సప్తమీవిభక్తికి లోపము రానందున (అలుక్) ‘పాణౌకృతి’ యను రూప మేర్పడినది. ఇది యలుక్సమాసము. ఉపయమన మనఁగా వివాహము చేసికొనుట.
మ. “చెల్మికై , కర మేగన్ సురధేను వాస్య మటుగాఁ గావించె మధ్యేసృతిన్” (1-61)
‘పారే మధ్యే షష్ఠ్యా వా’ యను సూత్రముచేత మధ్యేమార్గమువలె నీ ‘మధ్యేసృతి’ అనునదియు నలుక్సమాసమే. ‘సృ=గతౌ’ అను ధాతువుపై వచ్చిన ‘క్తిన్’ ప్రత్యయాంతరూపమే సృతి. అనఁగా సరణి, మార్గము మొదలగు అర్థములు గలది.
మ. గళదర్కంబుఁ, బనీపతతత్కుజము, రిఖద్గోత్రగోత్రంబుఁ, జా
చల దుర్వీవలయంబు, ఫక్కదఖిలాశాకంబు, భిద్యన్నభ
స్థల మేఘౌఘము, భ్రశ్యదృక్షము, రణత్పద్మాసనాండంబునై
యలరెన్- దన్మహిపాల జైత్రగమ బంభారావ మప్పట్టునన్. (1-151)
ఈపద్యమునం దాయా సంస్కృతధాతువులపై శతృప్రత్యయమును (అత్) చేర్చి వర్తమానార్థమున సమాసములయందుఁ గూర్చుట యొక చమత్కారమే కాదు, పాండిత్యవిశేషస్ఫోరకమును నగును. ధాతుజ్ఞానమును, బ్రక్రియావిశేషజ్ఞానమును నిట్టి ప్రయోగములు చేయుట కెంతయు నావశ్యకములు. గళ, పతౢ, రింఖ, చల, ఫక్క, భిదుర్, భ్రంశు, రణ ధాతువులపై శతృ (అత్) చేర్చి ‘గళత్’ ఇత్యాదిరూపములను సమాసగతములుగాఁ బ్రయోగించెను. వాటిలోను ‘పనీపతత్’, ‘చాచలత్’ అనునవి అతిశ యార్థకము లగు యఙ్ఞుగంతధాతువులపై వచ్చిన రూపములు. ‘ఫక్కదఖిలాకాశంబు’ అను ప్రయోగమునందు ‘ఆశా’శబ్దము నకు హ్రస్వము లేకపోవుటయు నొక వ్యాకరణవిశేషము. ఇది యంతయు నీకవి సంస్కృతవ్యాకరణజ్ఞత కుదాహరణము గా నోపును.
“ఆనృపతి దానెనసె మానసతటీ నివిశమాన ముదమంతన్” (2-21)
‘విశ’ధాతువు పరస్మైపదియే యైనను, ‘నేర్విశః’ అను సూత్రముచేత ‘ని’ అను నుపసర్గతోఁగూడి నప్పు డాత్మనేపదిగా మారును. అట్టి యాత్మనేపదిత్వమును బొందిన ‘విశ’ధాతువునకు, వర్తమానమును బోధించు ‘శానచ్’ప్రత్యయమును జేర్పఁగా ‘నివిశమాన’ అను పదము సిద్ధించును. ప్రవేశించుచున్న యని దాని యర్థము.
మ. వరసామ్యంబు ఘటిల్లెనంచు నృపతుల్ వర్ణింప రాజాధిరా
జు, రవిద్యోతనరూపతేజు, నితనిన్ సోమాస్య! యుద్వాహమై,
నిరతం బొప్పుము సర్వభూప హరిణీనేత్రా శిరోరత్న ది
వ్యరుచుల్ త్వత్పదవీథి యావకరసాన్వాదేశముం బూనఁగన్. (5-88)
ఓచంద్రికా! నీవీకర్ణాటభూపతిని వరించితివేని సర్వభూప ప్రియాంగనాశిరోరత్నకాంతులు నీపాదప్రదేశమునందు ‘యావక రసాన్వాదేశమున్’ లాక్షారసమునకు పౌనరుక్త్యమును బొందును. మొదట లాక్షారసముఁ బూసిన పాదములపైఁబడి, యా రత్నకాంతులు,మరల నట్టికాంతినే పాదములకుం జేకూర్చునని భావము. ‘అన్వాదేశ’శబ్దము వైయాకరణసంకేతము. ‘కించి త్కార్యం విధాతుం ఉపాత్తస్య కార్యాంతరవిధానాయ పునరుపాదాన మన్వాదేశః’ – ఒకకార్యమును విధించినదానినే మరల గార్యాంతరమును విధించుటకై గ్రహించుట ‘అన్వాదేశ’మని దాని వివరణము. అనఁగాఁ బౌనరుక్త్యమని తాత్పర్యము. ఈ ప్రయోగ మీకవియొక్క వైయాకరణసంప్రదాయవేదిత్వమును తెల్పును.
అష్టదిక్పతుల భార్యలను జెప్పునప్పు డుపయోగించిన మఘోని, అగ్నాయి, అంతకీ, తమీచరాబల, వరుణా, మారుత వధూ, ఐలబిలీ, గిరికన్యా శబ్దము లీతనికిఁ గల వ్యాకరణజ్ఞతను జాటును. ఇఁక నాయకుఁడగు సుచంద్రుఁడు పెండ్లికొడుకై పాంచాలభూపాలుని మందిరమును బ్రవేశించు మహోత్సవమున జరుగు తత్తద్విశేషముల యతిశయమును బోధించుటకై, యతిశయార్థద్యోతకములగు నాయా యఙ్లుగంతధాతువులపైఁ గూర్చిన శానచ్ ప్రత్యయాంతములగు జరీజృభ్యమాణ , వరీవృత్యమాన, నానంద్యమాన, చాంచల్యమాన, బంభ్రమ్యమాణ, లాలస్యమాన, దేదీప్యమాన, జాజ్వల్యమాన, టేటిక్య మాన, జంజన్యమాన, పాపట్యమాన, సనీస్రస్యమాన, జేగీయమాన, చరీచర్యమాణ, బనీభ్రశ్యమాన, ఫాఫల్యమాన, పోపుష్య మాణ, రారణ్యమాన, తాతప్యమాన, వావస్యమాన, నరీనృత్యమానాది శబ్దప్రయోగములు చేసి యావచనరచన కసాధారణ శోభను జేకూర్చి తన వ్యాకరణశాస్త్రపరిచయమును వెల్లడించెను. ఈ చూపఁబడిన వ్యాకరణవిశేషములు స్థాలీపులాకన్యాయ మున జూపఁబడినవే కాని సాకల్యముగాఁ జూపినవి కావు. కావ్యమునందు ప్రతిచోటను శ్రీమాధవరాయల వ్యాకరణశాస్త్రపాండి త్యము తద్జ్ఞులకు సాక్షాత్కరించుచునే యుండును. సంస్కృతవ్యాకరణమునందేకాక తెలుఁగు వ్యాకరణమునందును ఇతనికి విశేషపరిచయముండినట్లు ఈక్రింది ప్రయోగములు సూచించును.
తెలుఁగు వ్యాకరణ పరిచయము
చం. ‘అనుపమ ధాతుధూళియుతి ….. గ్రాలెడు పొన్న నృపాల! కాన్పు’ (2-9)
‘ధాతువుయొక్క కృదంతరూపము ‘కాన్పు’ చూచుట, కనుట యను నర్థములు గల యా సుబంతమును ‘చూడుము’ అను నర్థము గల క్రియగాఁ బ్రయోగించుట ఒక విశిష్టప్రయోగము. మరియుఁ ‘గాన్పుమో నృపా!” (2-14) అనియు ననెను. ‘వింటే…గొంటే యౌముని దెచ్చినాఁడిటఁ దపఃకుల్యాధ్వసంచారితన్’ – దుష్టవాచకమగు ‘కొంటె’ శబ్దమునకుఁ ‘గొంటే’ యను నది రూపాంతరము.
“ఆనారీమణులంత శోభనవితర్ద్యగ్రస్థలిన్ స్యూతర
త్నానీకం బగు పెండ్లిపీట నిడి, యందా భూపకన్యామణి
న్వ్యానమ్రాననచంద్ర నుంచి శిరసంటం జేరి రింపెచ్చ ‘శో
భానేశోభనమే’ యటంచు విబుధాబ్జాతాననల్ పాడఁగన్” (6-13)
‘శిరసంటన్’ – శిరసునంటన్ అని యుండవలసిన ‘శిరసును’ అను ద్వితీయాంతమునకు ‘శిరసు’ అను ప్రథమాంతమును స్వీకరించి, దానికి శిరసు+అంటన్=శిరసంటన్ అని సంధి చేసినాడు. అవయవవిశేషవాచకమగు ‘శిరసు’ జడవాచకమగుటచే ‘జడవాచకంబుల ద్వితీయకు ప్రథమ యగు’ నను బాలవ్యాకరణసూత్రముచేత సాధుత్వము. ‘న్వ్యా’ అను సంయుక్తాక్షరము నందలి ‘న’కారమునకు ‘శిరసంటన్’లోని బిందుపూర్వకటకారము (౦ట)నకు యతి చెల్లుట మరియొక విశేషము.
“పలుకు వాలు దొరలన్” (1-146)
‘శాపరూపవాక్కు లాయుధముగా ప్రభువులు=మునిశ్రేష్ఠులు’ అని యర్థము. చక్కని తెలుఁగు కర్మధారయసమాసము.
‘తళుకుఁబ్రాఁగెంపుమెట్టులదారి’ మెఱయుచున్న ముదురుకెంపులయొక్క సోపానమార్గము. తత్పరుషసమాసము.
“పగడపుఁగంబముల్ ———–నచ్చపు బంగరు పేరరంగునన్” (2-23)
‘పేరు+అరంగు=పేరరంగు=విశాలమైన వేదిక. ఇచ్చట కర్మధారయమునం దుత్తున కచ్చు పరంబగు నపుడు రావలసిన ‘టు’గాగమము వచ్చి ‘పేరుటరంగు’ అని యనకపోవుటకుఁ గారణము టుగాగమము వైకల్పిక మగుటయే.
‘నలువకు జొహారు గావించి నిలిచె నపుడు’ (2-43). ‘జొహారు’ జోహారునకు రూపాంతరము. ‘పడఁతి! యొకమౌని నిల మోహపరచుటెంత!’ (2-51). పడ్వాదులు పరంబులగు నపుడు ‘ము’వర్ణము లోపించును. ‘భయముపడు’ ననునది ‘భయ పడు’ అయినట్లే, ‘మోహము పరచుట’ ‘మోహపరచుట’ యైనది. ‘నృపాలు చూపుదొమ్మరి’ – రాజుయొక్క చూపులనెడు దొమ్మరి. చక్కని రూపకసమాసము (3-46). ‘నృపునేత్రములు’ – నృపునియొక్క నేత్రములు (3-47). అచ్చపు తత్సమపద తత్పురుషసమాసము.
‘నవలా యేగినదారిఁ గాంచు’ (3-96). ‘నవలా కలువకంటి నాతి గోతి’ యను నిఘంటువువలన స్త్రీపర్యాయముగా ‘నవలా’ పదము చక్కగాఁ బ్రయోగింపఁబడినది. ఇట్లు తెలుఁగు వ్యాకరణ,నిఘంటుజ్ఞానము పుష్కలముగా నుండుటచే నెన్నియో యచ్చతెలుఁగు పదములను, సంధులను, సమాసములను, చక్కని జాతీయములను జేర్చి తనయచ్ఛాంధ్రవిజ్ఞానవిశేషములను గోచరింపఁజేసినాఁడు.
తర్కశాస్త్రప్రవీణత
మ. ధరణిన్ మాధవరాయ! తావక బలోద్యద్రేణుపాళి కృతో
ద్ధుర భావత్క మహోగ్నిబుద్ధి ప్రమయై తోఁపంగ, నాన్వీక్షకీ
వరు లవ్యాప్తము ధూళి తద్బలమునన్ బాటిల్లు ధూమధ్వజా
కరధీ యప్రమ యంచు నెంచుట లిఁకన్ గైకొందురే? యెంతయున్. (1-72)
‘పర్వతో వహ్నిమాన్ ధూమాత్’ (పొగ కనపడుచుండుటవలన ఈపర్వతమునం దగ్ని యున్నది) అను నగ్నిజ్ఞానము, ‘యత్ర ధూమ స్తత్రాగ్నిః’ (ఎచ్చట పొగ యుండునో అచ్చట నగ్ని యుండును) అను వ్యాప్తిజ్ఞానమువలనఁ గల్గును. ఇది తర్క శాస్త్రమునందలి యనుమానప్రమాణ స్వరూపమును జెప్పుటలో నుపయోగించు పదజాలము. ప్రస్తుతపద్యమునందు బలోద్య ద్రేణుపాళిని (సైన్యగమనముచేత రేఁగిన దుమ్మును) ధూమముగా రూపణము చేసి, దాని వ్యాప్తిజ్ఞానముచేత మాధవరాయల ప్రతాపాగ్ని ప్రమయై (యథార్థజ్ఞానమై) తోఁచుచున్నదని నిర్ణయము. ‘యత్ర యత్ర సైన్యగమనధూళిః తత్రతత్ర మాధవరాయ ప్రతాపాగ్నిః’ – సైన్యధూళి యున్నచోట మాధవరాయప్రతాపాగ్ని యుండు నన్న వ్యాప్తిజ్ఞానము, తన్మూలకమగు ‘ప్రమ’ సిద్ధించుచుండఁగా, అన్వీక్షకీవరు లనఁగా న్యాయశాస్త్రప్రవీణులు, ‘ధూళి’ అవ్యాప్తము, దానివలనఁ గల్గు ‘ధూమధ్వజాకరధీ’ , అనఁగా వహ్నివిషయకజ్ఞానము ‘అప్రమ’ యని యెన్నఁడును దలంపరు. అట్లు తలంచువారు అతార్కికులై యుందురని భావము. ‘తస్మిన్ తత్ప్రకారజ్ఞానం ప్రమా’ (ఉన్నదున్నరీతిని గ్రహించు యథార్థజ్ఞానము ప్రమ). దానికి విరుద్ధమైనది ‘అప్రమ’ -ఇదియే భ్రమ (అతస్మిన్ తద్వత్తా బుద్ధిః). అవ్యాప్తి యనఁగా (లక్ష్యైకదేశే లక్షణస్యాసత్వం) లక్ష్యములోఁ గొన్నిచోట్ల లక్ష ణము సరిపోకపోవుట. ఈతెలుఁగుపద్యమునం దీవిధమగు తర్కశాస్త్రవిషయమును, పారిభాషికపదజాలమును గూర్చుట వలన నీకవి కాశాస్త్రమునందు దృఢప్రవేశము గలిగియుండెనని స్పష్టపడుచున్నదికదా!
స్థిరతపనీయసారసన దీప్తిమృషా తపనాతపంబు భా
స్వర కటిహర్మ్యనాభిమిషజాలకవీథికఁ బర్వినన్ దదం
తరమున నక్షిలక్ష్యగతిఁ దాల్చిన సూక్ష్మతరాణు వౌఁ జుమీ
కరికులరాజయాన నునుగౌను మనంబునఁ జింత యూన్పఁగన్’ (3-11)
నాయికయగు చంద్రిక ‘అణుమధ్య’. ఆమెనడుము అణుప్రమాణమని సామాన్యకవు లందందుఁ జెప్పినట్లుకాక సహేతుక ముగా సశాస్త్రీయముగాఁ జెప్పుట. ‘జాలసూర్యమరీచిస్థం సూక్ష్మం యద్దృశ్యతే రజః, తస్య షష్ఠతమో భాగః పరమాణుః ప్రకీర్తితః’ – గృహముయొక్క గవాక్షమార్గమునఁ బ్రవేశించు సూర్యకిరణములకాంతిలో సూక్ష్మముగాఁ గనపడు రజోరేణు వేదికలదో, దానిలో ఆరవభాగమంత యుండునది పరమాణువు. అట్టి స్థితిగల మధ్యము స్త్రీ కెచ్చట నెట్లు గోచరమగుచున్నది? అను ప్రశ్న యుదయించి నప్పు డిదిగో! ఇట్లు, అనుచు నాలంకారికతర్కపరిభాషలతోఁ జెప్పిన పద్యమిది. ‘సారసన’మనఁగా నొడ్డాణము, బంగరు నొడ్డాణపుకాంతి యనెడు సూర్యకిరణప్రసారము, కటి యనెడు మేడలోనికి నాభిరంధ్రగవాక్షముద్వారా జరుగుచున్నపు డచ్చట ననుగౌను=సూక్ష్మమగు నడుము అక్షిలక్ష్యగతిని బొందినది. అనఁగా త్రసరేణువై కవిదృష్టికి గోచ రించుచున్నదని భావము. పరమాణువు యోగిబుద్ధి సాక్షాత్కారవిషయ మగుటచేత నిచ్చట ‘నక్షిలక్ష్యగతిఁ దాల్చిన’ అని ప్రయోగించెను. వస్తుప్రమాణవిషయమందు అణుకం, ద్వ్యణుకం, త్ర్యణుకం అనునవి యొకదానికన్న నొక్కటి యెక్కువ. అణుద్వ్యణుకములు మనకుఁ గనబడవు. త్ర్యణుకము మొదలుకొని చక్షుర్గోచరము లగును. కనుక చంద్రికామధ్యము త్రసరేణు వై అక్షిలక్ష్యగతిని బొందినదని భావము. ఇదీ అణుమధ్యావ్యవహారము. అట్లే స్వయంవరవర్ణన సందర్భమునందును చంద్రికను ‘పారిమాండల్యవన్మధ్య’ అని సంబోధించెను. అచ్చటను నిదియే యర్థము. పారిమాండల్యశబ్దమునకు పరమాణువని యర్థము. ఇట్లు తన న్యాయవైశేషికశాస్త్రజ్ఞానవిలసితములగు భావములను కావ్యమునం దచ్చటచ్చటఁ బొదిగియున్నాడు. ఇట్లే జ్యౌతిష, యోగ, సాంఖ్య, వేదాంతాది శాస్త్రపరిభాషలను, తత్తద్విషయ పరిజ్ఞానమును వెల్లడించు పద్యము లాయా సంద ర్భములందుఁ గలవు.
సంగీతజ్ఞానము
బ్రహ్మదేవుని యాజ్ఞచేత చిత్రరేఖ వచ్చి వసంతమునిని మోహింపఁజేయుటకై చేసిన ప్రయత్నముల సందర్భమున:
ఆయతిలోకమౌళి హృదయంబు బయల్పడ కున్కి గాంచి యా
తోయజనేత్ర యాళితతితో మునిసన్నధిఁ జేరి జాళువా
కాయలవీణెఁ గైకొని తగన్ శ్రుతిఁ గూర్చి యొయార మెచ్చఁగా
నాయెడ నేర్పు మించ గమపాదికపుంఖణ మూన్చి వేడుకన్. (2-93)
‘గమపాదికపుంఖణ’ మనఁగా గాంధార, మధ్యమ, పంచమ స్వరముల మూర్ఛన యని యర్థము.
సీ. ఘనమార్గవిభవంబు వనిత వేణినె కాదు శ్రుతిపర్వరాగసంతతి నెసంగె,
సమతాళవిస్ఫూర్తి సతిగుబ్బలనె కాదు నవ్యగీతప్రతానముల నెనసెఁ,
గలహంసవైఖరి చెలిగతులనె కాదు సరసప్రబంధపుంజమునఁ దోఁచెఁ,
బల్లవంబుల పెంపు పడఁతికేలనె కాదు సొగసైన పదపాళి సొంపు పూనె,
తే. ననుచు వనదేవతాజనం బభినుతింప, రక్తివిధమును దేశీయరాగగతియుఁ,
జిత్రతర మంద్రరాగజశ్రీలు వెలయ, నింతి మునిచెంత వీణె వాయించె నంత. (2-94)
సంగీతశాస్త్రపరిభాషలోని శబ్దములకు చంద్రిక స్తనాద్యవయములతోడి సంబంధము నర్థభేదములచేతఁ గల్పించి చెప్పుట యీ కవి యసాధారణప్రజ్ఞను వెల్లడించుచున్నది. మార్గ,దేశి యని సంగీతము రెండువిధములు. శాస్త్రీయపద్ధతి, సంప్రదాయమును గలది మార్గసంగీతము. దేశభేదమున వైవిధ్యమును బొందునట్టిది దేశిసంగీతము. తాళవిస్ఫూర్తి సతిగుబ్బలకును గీతప్రతాన ములకును సమమట. మొదట తాళఫలప్రమాణము, పిమ్మట ఆదిరూపకాది తాళములు గీతములకు, తానములకును తగి యుండుట. ‘కలహంస’ రాగము పేరు. అట్లే ప్రబంధము, పల్లవము, పదము, రక్తి, దేశీయరాగగతి, మంద్రాదిశబ్దములు సంగీత శాస్త్రపారిభాషికములు. వాటికి చక్కని యర్థములు గల్పించెను.
చెన్నగు జాళువాయొళవు చిన్నరికెంపులమెట్లు నీలపు
న్వన్నియ నొప్పు కాయలు నవంబగు వజ్రపుకర్వె బచ్చలం
బన్నినయట్టి మేరువును బాగగు తంత్రులు మించ నొప్పు మే
ల్కిన్నర చెంతఁజేరి యొకకిన్నరకంఠి యొసంగ నయ్యెడన్. (2-95)
ఇది వీణాస్వరూపమును బాగుగా నెరిఁగిన పద్యము. కిన్నర వీణకు మరియొక పేరు.
సరసత్వంబునఁ గేలనూని యలయోషామౌళి చక్కన్ ‘రిరి
మ్మరిగామారి’ యటంచు, ‘రిప్పనిమగా మమ్మారి’ యంచు న్విభా
స్వర నానా నవరక్తి ‘దానతతి’ మించన్ ‘గౌళ’ వాయించి, ని
బ్బరపున్ వేడుకఁజేయు పంతువిధముల్ పల్కించె నప్పట్టునన్. (2-96)
శృంగారోద్దీపకమగు ‘గౌళ’ రాగమునందు తానమును వాయించి, ‘పంతువరాళి’ రాగమునఁ గీర్తనలు వాయించె నని శాస్త్రీయముగాఁ జెప్పెను. ఆపై నాచిత్రరేఖ యిట్లు నాట్యము చేసెనట:
బళిరే! మైసిరితీరు, నిల్కడలు సేబా!సయ్యరే! పేరణీ
కలనం, బౌర! పదాళికాభినయవైఖర్యంబు, మజ్జారె! కో
పులవైచిత్రి, యహో! వినిర్మలకరాంభోజాతవిన్యాస, మం
చలివేణుల్ వినుతింప సల్పె నటనం బాకొమ్మ తత్సన్నిధిన్. (2-97)
నాట్యముచేయుటలోగల మెలకువలను, పేరణి మొదలగు నృత్యములను జెప్పి తనభరతనాట్యశాస్త్రపరిచయమును దెలిపెను.
వివిధవర్ణనలు
సీ. సేసకొప్పుల నమర్చిన మొల్లమొగడచాల్ సరిగరుమాలపైఁ జక్కఁ దోఁప,
వలెవాటు వైచిన సుళువుఁజెందిరకావి వలిపముల్ పదపల్లవముల జీర,
నెలవంకరేఖలు నెలకొన్న పేరురములఁ జిల్కతాళులు తళుకుసూపఁ,
జెలువంబు నెగడఁ దీర్చిన క్రొత్తకస్తూరిపట్టెల మేల్తావి మట్టుమీఱఁ,
తే. జెక్కుఁగవ ముత్తియపుటొంట్లజిగి వెలుంగఁ,
బలుకుఁగప్రంపువీడెంబు వలపు నిగుడ,
నలరువేడుక వెనువెంటఁ జెలులు నడవ,
వేడ్కఁ జరియింతు రనిశంబు విటులు వీట. (1-107)
ఇది యానాటి శృంగారపురుషుల వేషము. సరిగరుమాల=జరీయంచుతో నుండి తలకుఁజుట్టుకొను రుమాల. సుళువుఁ జెందిరకావి వలిపముల్=లేఁత చంద్రకావిరంగుగల యుత్తరీయములు. చిల్కతాళులు=తావళములుగా నున్న హారములు. ముత్తియపుటొంట్లు=ముత్యాల చెవులపోగులు.
సీ. కట్టెండ వెడఁదకాఁకఁ గఱంగి ప్రవహించు జవ్వాదిడిగ్గియ చాలలోయఁ
బడుచు జొక్కపుఁ గ్రొత్తపటికంపుఁజఱిపజ్జ బాగైన కెంపురాపణుకువాలు
పొదరుఁ బొన్నలరాలు పుప్పొడియిసుముపైఁ బగిలి యొప్పెడు వేరుపనసపంటి
నీటికాల్వలఁ బ్రోచి పాటించు జేజేల మ్రాఁకుతీవలఁ జుట్టిరాఁగ నలరు
తే. దాకపందిలి క్రింద, నిద్దంపువేడ్క
దవిలి, కోలాటమాడు గంధర్వసతుల
చారుసౌవర్ణకటకసింజానినాద
కుల ఘుమఘుమాయమానమౌ కోనఁ గనియె. (2-20)
నాయకుఁడగు సుచంద్రుఁడు ఎండకాఁకచేఁ గఱంగి ప్రహించుచున్న జవ్వాదిచేత నేర్పడిన యొకదిగుడుబావిని, దానిప్రక్కన స్ఫటికపుదరిపై కెంపులసందులనుండి పుట్టుకవచ్చిన పొన్నచెట్లనుండి రాలిన పుప్పొడియిసుకను, దానిపైఁ బగిలిన పనసపండ్ల రసము కాల్వలుగాఁ బాఱుచుండ వాటి ప్రక్కనున్న కల్పలతలఁ జుట్టఁబడిన ద్రాక్షపందిరి క్రింద, దానిచేత నుత్సాహముతోఁ గోలాటమాడుచున్న గంధర్వయువతుల కాళ్ళయందెల చప్పుడుచేతఁ బ్రతిధ్వనించుచున్న హేమకూటపర్వతమునందలి యొక రహస్యప్రదేశమును (కోనను) జూచెనని భావము. తెలుఁగుపదము లెక్కువగా నుండి సమాంతరపాదములు లేని సీసపద్యమిది.
చం. పగడపుఁగంబముల్, తళుకుఁబచ్చల బోదెలు, కెంపుదూలముల్,
జగమఱాల దెంచికలు, చక్కనినీలపుఁ బల్కచాల్, మెఱుం
గగు తెలిమిన్నలోవయును, నచ్చపుబంగరుపేరరంగునన్
దగఁ గనుపట్టు నొక్క వికసన్మణిమండప, మప్డు దోఁపఁగన్. (2-23)
‘సమృద్ధిమద్వస్తువర్ణ ముదాత్తః’ అను లక్షణముగల ఉదాత్తాలంకారవర్ణనమే యైనను ఇది యాకాలపు గృహనిర్మాణ పద్ధతిని వివరించుచున్నది. లోవ యనఁగా చూరు. కేవలమణిమండపమని చెప్పక దాని యవయవము లెట్టు లాయామణి విశేషనిర్మితములో చెప్పుట చమత్కారము.
మ. అలసత్యాధ్వము డిగ్గి, యప్డు తప మొయ్యన్ దాఁటి, దీవ్యజ్జన
స్థల మాపిమ్మట నొంది, యంతట మహస్థానంబునుం బొంది, వే
ల్పులరావీడట వేడ్క డగ్గఱి, భువర్లోకేంద్ర మవ్వేళఁ జే
రి, లలిం గంజశరుండు దా దొరసె ధాత్రిన్ మేరుమార్గంబునన్. (2-72)
బ్రహ్మదేవుని యాజ్ఞచేత వసంతముని తపోభంగముఁ జేయఁదలఁచిన మన్మథుఁ డాముని తపమాచరించుచున్న భూలోకము నందలి పారిజాతవనమునకు, సత్యలోకమునుండి వచ్చుమార్గము మేరుపర్వతమార్గమే యనియు, నా మార్గమున సత్యలోక, తపోలోక, జనర్లోక, మహర్లోక, స్వర్లోక, భువర్లోకములను గ్రమముగా దిగి, భూమిపైకి వచ్చెనని తెలుపు నీపద్యము మాధవ రాయల పౌరాణికభూగోళవిజ్ఞానమును వెల్లడించుచున్నది. చక్కని ధారగల పద్యము.
సీ. జవరాలి నునుగుబ్బచన్నులఁ జేరుట వసుధాధరస్థలీవసతి గాఁగ
నతివ రత్యంతశ్రమాంబులఁ దోఁగుట నమరాపగావగాహనము గాఁగ
తెఱవ కెమ్మోవిక్రొందేనియ ల్గ్రోలుట నిరుపమామృతపానసరణి గాఁగ
కొమ్మతో రతికూజితమ్ములు నొడువుట సరసాగమాంతాళి చదువు గాఁగఁ
తే. దలఁప బద్మాంబకాభిఖ్యదైవతంబు, మసలక దయారసంబున నొసఁగు సుమ్మ
ఖండితానందగరిమ నిక్కలన మనుము, వట్టి యీఖేదకనివృత్తి గట్టి మౌని. (2-106)
ఇది చిత్రరేఖ వసంతముని తపోభంగమును జేయుటకై చేసిన యుపదేశము. నివృత్తిమార్గమునుండి ప్రవృత్తిమార్గమునకు మార్చుకొని, పద్మబాణుఁడగు మన్మథదైవము నారాధించుటయే నీకు అఖండానందప్రదమగునని బోధ. పర్వతాదులకు బదులు జవరాలిగుబ్బలు మొదలగువానిని సేవించి ధన్యుఁడవు గమ్మన్నది. ఇది వరూథినీప్రవరుల వాదమును స్ఫురింపఁ జేయుచు నంతకన్న విపులముగా వర్ణింపఁబడియున్నది. ఇంతకన్నను శ్లేషచమత్కారముతో మునిని సంబోధించి పలికిన రెండవ యాశ్వాసములోని 104, 105, 106, 107,108 సంఖ్యగల పద్యములలో కవి యసాధారణశక్తిని గనఁబరచినాడు.
తరుణిమొగంబె తానని సుధానిధి విష్ణుపదమ్ము ముట్టి దు
ష్కరకరజాతపాండిమ విగర్హితుఁడై యశుచిం గృశింపఁ, బం
కరుహము తన్ముఖోపమము గానని తా హరిపాదమంటి యిం
దిర దనుఁజేరఁ గీర్తిఁ గని దీపితజీవన మయ్యె నెంతయున్. (3-27)
ఇది చంద్రికాముఖవర్ణనము. చంద్రుఁడు, కమలము నను నీరెండు సమానవస్తువులలోఁ జంద్రుఁడు గర్వముచేత నేనే చంద్రిక ముఖము నని విష్ణుపాదమును బట్టి బాస చేసెను. పంకరుహము నేను చంద్రిక మొగమునకు సాటికాఁజాలనని హరిపాదము పట్టి వచించెను. చంద్రుఁ డబద్ధమాడి బాస చేసినందున దుష్కరకరజాతపాండిమవిగర్హితుఁ డయ్యెను. అనఁగా చికిత్సకు లొంగని చేతియందలి పాండురోగముచేత దూషితుఁడయ్యెను. కమలము నిజము చెప్పి నిందిర తనను జేరఁగా దీపితజీవన యయ్యెను. అనఁగా కమలమునందు లక్ష్మి నివసించుటయు, కమలముచేత జీవన మన నీరు ప్రకాశించుటయు మొదలగు కీర్తిని బొంది మేలుఁ గాంచెను. ఈపద్యమునందలి ‘విష్ణుపద, కరజాత, విగర్హిత, అశుచి, హరిపాద, దీపిత, జీవన’పదములు శ్లిష్టములు. నిజము పల్కువాఁడు మేలును బొందుననియును, అబద్ధమునకై ప్రమాణములు చేయువాఁడు పాపరోగములు గలవాఁడగు ననియు వస్తుధ్వని ప్రస్తుతముఖవర్ణనావస్తువుచేతఁ గలుగుచుండుటచే, నిది, వస్తుకృతవస్తుధ్వని. ఈ చంద్రకమలయుగప్రసక్తి యీ కవికిఁ గాళిదాసు కుమారసంభవము యీక్రింది శ్లోకభావమువలన గలుగఁగా దానిని కొంచెము మార్చి చెప్పినట్లు దోఁచును.
శ్లో. చంద్రంగతా పద్మగుణాన్ న భుంక్తే
పద్మాశ్రితా చాంద్రమసీ మభిఖ్యామ్|
ఉమాముఖంతు ప్రతిపద్య లోలా
ద్విసంశ్రయాం ప్రీతి మవాప లక్ష్మీః||
చంచలయగు లక్ష్మి యనఁగా కాంత్యధిదేవత. చంద్రు నాశ్రయింపఁగా పద్మగుణములగు పరిమళాదులు లేకపోవుటయు, అట్లు కాదని పద్మము నాశ్రయింపఁగాఁ జంద్రగుణములగు చల్లదనము, తెల్లదనము లేకపోవుటయు గల్గి, పార్వతీముఖము నాశ్రయిం చెను. అప్పు డుభయగుణప్రాప్తిచేత ప్రీతినొందె నని భావము. అనఁగా పార్వతీముఖము చంద్రారవిందములకన్న నధికమని కాళి దాసు చెప్పఁగా, చంద్రికమొగము సైతము సుధానిధి కమలములకన్న నెక్కువ శోభగలది యని యీకవి చెప్పెను. ఇట్లెన్నియో పూర్వకవుల భావములు భంగ్యంతరమున మాధవరాయల కావ్యమున నచ్చటచ్చట గోచరించుచునే యుండును.
మ. అతిశోణం బతికోమలం బతివిశాలాత్మం బతిశ్లక్ష్ణకం
బతినిమ్నం బతిమేచకం బతిదృఢం బత్యంతపారిప్లవం
బతిచక్రం బతిదీర్ఘ మౌర! బళి! యీ యంభోజపత్రాక్షి య
ప్రతిమానావయవ ప్రతానము మనఃపద్యన్ విచారింపఁగన్. (3-54)
ఇది నాయికయగు చంద్రికయొక్క సౌందర్యమును నాయకుఁడగు సుచంద్రుఁడు తనలోఁ దలఁచుకొని వలవంతఁ గ్రుంగు నప్పటి వర్ణనము. మనఃపద్యన్ అనఁగా మనోవీథియందు విచారింపఁగా నొకయువతి యవయములలోఁ గొన్ని యెఱ్ఱగను, కొన్ని నల్లగను, కొన్ని కోమలముగను, కొన్ని దృఢముగను ఉండుట యాశ్చర్యమని భావించెనట! ఇంతకును విశేషణముల చేత విశేష్యములను స్ఫురింపఁజేయు వ్యంగ్యరచనాపద్ధతిచేత నిబంధింపఁబడిన అతిశయోక్త్యలంకారమున కిది నిదర్శనము. పాదాది కేశాంతవర్ణనగా నున్న యిందులో అతిశోణంబు=మిక్కిలి యెఱ్ఱగా నున్నది పాదయుగ్మ మనియు, అతికోమలంబు= మిక్కిలి మృదువుగా నున్నది యూరువులజంట యనియు, అతివిశాలమైనది జఘననితంబప్రదేశమనియు, అతిశ్లక్ష్ణకంబు= మిక్కిలి కృశించినది నడుమనియు, అతినిమ్నమైనది నాభి యనియు, అతిమేచకంబు=మిక్కిలి నల్లనైనది నూగారనియు, అతి దృఢముగా నున్నది స్తనయుగ్మమనియు, అత్యంతపారిప్లవంబు=మిక్కిలి చపలమైనది కనుదోయి యనియు, అతివక్రంబు= ఎక్కువ వంకరలు దీరినవి ముంగురులనియు, అతిదీర్ఘము=మిక్కిలి దీర్ఘముగా నున్నది వేణి యనియుఁ దెలిసికొనవలెనని భావము. నాయకుఁడు విరహభ్రాంతిచే వనమునందలి ప్రకృతివిలాసములను జూచి నాయికకై యువ్విళ్ళూరుట యిట్లు వర్ణింపఁ బడినది.
సీ. కమ్మపుప్పొడిగాడ్పు గ్రమ్మ నొప్పగు బండిగురివెంద విరిగుత్తి కొమరుఁ జూచి,
యలరు సంపెఁగతీవ యలమ నింపుగఁ దోఁచు కలికిక్రొమ్మల్లియ చెలువుఁ జూచి,
మగతేఁటి వేడ్కమించఁగ ముద్దుగొనిన చక్కని మెట్టతామరకళుకుఁ జూచి,
సొలపు చక్కెరతిండిపులుఁగు మెక్కెడి బింబికాపక్వఫలము పొంకంబుఁ జూచి,
తే. తరుణి చనుదోయి కెంపుగందవొడిఁ బూసి, చెలువ నెమ్మేను కౌఁగిటఁ జేర్చి, కొమ్మ
మోము ముద్దిడి, పూఁబోణిమోవిఁ గ్రోలి, చెలఁగు టెపు డబ్బునో యంచు దలఁచు నృపతి. (3-94)
పై పెద్దపాదములకును గీతమునందలి పాదములకును, సంబంధమును గల్పించు క్రమాలంకారశోభతో నిది మనోహరముగా నున్నది.
సీ. బాలాంబుజతమాల మాలాభినవజాల జాలామృతోల్లోల షట్పదౌఘ,
రాగాది పరమాగ మాగాంత సుపరాగ రాగావరణభా గరాళపవన,
కేళీగృహ న్మౌళి మౌలిస్థిత పికాలికా లీనరవ లోలితాధ్వగాత్మ,
రాజీవశర వాజివాజీన నిరతాజి తాజీ జనక రాజితామ్రఫలిక,
తే. భవ్య ఋతుకాంత కాంత తాత్పర్య సృష్ట, ఘన విషమబాణ బాణసంఘాత కలిత
తిలక మధుగంధ గంధ సంచులుకితాశ, కనదచిరధామధామ! యివ్వనిక గంటె? (4-53)
ఇది కామజ్వరముచేత బాధపడుచున్న చంద్రికతోఁ జెలికత్తెలు ఉద్యానవనసౌందర్యమును వర్ణించుచుఁ బలుకు ఘట్టము లోనిది. వనిక=చిన్నవనము, ఉద్యానవనమని యర్థము. యమకాలంకారభూయిష్ఠముగా రచింపఁబడిన చతుర్థాశ్వాసములోని పద్యము లన్నియు నిట్టి శబ్దవిన్యాసము గలవియే. ఈపద్యము వాటికి మచ్చుతునుక.
సీ. నటదీశమౌళి దిఙ్నారులు చల్లు మంగళ సితాక్షత జాలకంబు లనఁగ,
నచలావపతనవేళాభ్ర లగ్న తమఃకదంబాపగా జాలకంబు లనఁగ,
వనరాశి రవి మాధవతఁ దోఁప నంబరాగమునఁ బొల్చిన జాలకంబు లనఁగఁ,
దఱి రా శుభము వేల్పుతెఱవచాల్ గన నాకఘనకుడ్యకృత జాలకంబు లనఁగ,
తే. గురుసరశ్శ్రేణి రాజీవకులము నడఁచి, యంబరస్థలి నాఱ దిష్టాఖ్యమైని
కతతి పఱచిన వరజాలకంబు లనఁగఁ, జొక్కమగు మింటఁ గనుపట్టె రిక్క లపుడు. (4-100)
ఇది నక్షత్రవర్ణనము. యమకాలంకారముకొఱకై ‘జాలక’శబ్ద మిందులో వరుసగా సమూహము, బిందువులు, మొగ్గలు, గవాక్షములు, క్రొత్తవలలు అను భిన్నార్థములం దయిదు పర్యాయములు ప్రయోగింపఁబడినది. ‘మైనికతతి’ యనఁగా మీన ఘాతుకుల గుంపు (చేపలను జంపువారలగుంపు). ‘పక్షిమత్స్యమృగాన్ హన్తి’ అను పాణినీయసూత్రముచేత తద్ధితప్రత్యయ మగు ‘ఠక్’ అనునదియు, దానికి ఇకాదేశము వచ్చి ‘మైనికః’ అను శబ్ద మేర్పడును. మీనమును జంపువాఁడని యర్థము. ‘మత్స్యపర్యాయేషు మీనస్యైవ’ అని భట్టోజీ చెప్పెను. అందువలన ‘మాత్స్యికః, మైనికః’ అనునవి మాత్రమే సాధువులు. నక్షత్ర ములు, సంధ్యానటుఁడగు శివునితలపై దిగంగనలు చల్లు తెల్లని యక్షతలవలెను, అంధకారమను నది నేలపైకిఁ బ్రవహించుటకు దిగఁగా నాకసమున నంటియున్న జలబిందువులవలెను, సముద్రమున సూర్యుఁడను వసంతుఁడు గన్పట్టగా గగనమను వృక్ష మునకుఁ బూచిన మొగ్గలవలెను, దేవతాస్త్రీలు చూచుటకు గగనకుడ్యమునకు జేయఁబడిన గవాక్షములవలెను, సంధ్యాకాల మున బెస్తవారు సరస్సులయందలి కమలము లనెడు మత్స్యములను బట్టుకొని యాకాశమున నాఱవేసిన వలవలెను గనపడు చున్నవని పద్యభావము.
మ. అనిశంబున్ బుధవర్ణ్య కల్పతరు దీవ్యద్వాసనాలబ్ధిఁ జే
కొని యద్వైతరుచిం గరంబు మను నీక్షోణీస్థలాధీశవ
ర్యుని కీర్తిప్రకరంబు మించ, సకి! యోహో! పూర్వపక్షావలం
బనతన్ రాజిలునట్టి ధ్వాంతపరధామం బెచ్చునే యెచ్చటన్. (5-70)
ఇది స్వయంవరమునకు వచ్చిన రాజులను వర్ణించు సందర్భమునందలి ప్లక్షద్వీపాధిపతి వర్ణనము. ఓ చంద్రికా! ఈరాజుకీర్తిప్రకరము కల్పతరుకాంతితో నేకీభవించిన కాంతి గలదై మించి యుండఁగా, శుక్లపక్షమందుండు చంద్రుని తేజము హెచ్చగునా? అని సామాన్యముగాఁ బద్యభావము. అద్వైతసిద్ధాంతపరులైన విద్వాంసులచేతఁ బ్రశంసింపఁబడుచున్న ‘వేదాంతకల్పతరు’గ్రంథ పఠనమననాదులచే నుదయించిన వాసనాబలముచేత బ్రహ్మాత్మైక్యానుసంధానము గల విద్వాంసుఁ డతిశయకీర్తిమంతుఁడై యుండఁగా, పూర్వపక్షమతము నవలంబించిన మాధ్వమత వేదాంతసిద్ధాంతము హెచ్చజాలదని వ్యంగ్యార్థము. పూర్వపక్ష మనఁగా అపసిద్ధాంతము, శుక్లపక్షము నని యర్థద్వయము. ‘కీర్తిప్రకర’శబ్దములోని ప్రకరశబ్దము పుంలిగమగుటచేత నొక పురుషుఁడని వ్యంగ్యార్థము. ధ్వాంతపరధామంబు=మధ్వమతసిద్ధాంత మని యర్థము. ‘ధ్వ అంతే యస్య సః ధ్వాంతః’ అను విగ్రహవాక్యముచేత ‘ధ్వ’యను నక్షరము చివరగలది ‘మాధ్వ’శబ్ద మగును. తద్వాచ్యులు మాధ్వులు, అనఁగా ద్వైతమతస్థు లని యర్థము. ఈపద్య మీక్రింది వసుచరిత్రలోని చంద్రదూషణపద్యమును బోలియున్నది.
ఉ. ఇంతుల నేచుపాతక మదింతట నంతటఁ బోదు పాంథలో
కాంతక!నిన్ను ఘోరతమమై, ఘనమై, యజహత్కళంకమై
వంతలఁ బెట్టి యాఱుపది వ్రక్కలు సేయక, పూర్వపక్షపుం
గంతుల కేమి? చూచెదవుగా తుది నీ బహుళార్తిఖేదముల్. (వసు: 4-28)
ఈకవి స్వయంవరమునందు నాయికయగు చంద్రిక, నాయకుఁడగు సుచంద్రుని కంఠమున వైచిన స్వయంవరమాలను విశేషముగా నేడు పద్యములలో వర్ణించెను. (పంచమాశ్వాసము, 130, 131, 132, 133, 134, 135, 136 పద్యములు). సుచంద్రుఁడు చంద్రికచే వరింపఁబడుట పార్వతీదేవి ప్రమథగణసాన్నిధ్యమున దక్షిణామూర్తిని వరించినట్లుండెనట. ఆవరమాల సౌగంధ్యము నకై వ్రాలిన తుమ్మెదలు, పూర్వము సుచంద్రుని విరహకాలమున మలినాత్మతో బాధించిన యపరాధమును క్షమింపుమని సుమా ర్పణముఁ జేసి ప్రార్థించుచున్నట్లుండెనట. చంద్రిక సుచంద్రుని వక్షస్థలమందుంచిన సుమనస్సరవల్లరి, యతని దేహకాంతిచే నెఱ్ఱనయి చంద్రికాకటాక్షజలపుంజములుపర్వఁగా సుచంద్రుని హృదయమందుండు మదనాగ్నిజ్వాల నిలువలేక వెలువడినదో యనునట్లు ప్రకాశించెనట. మఱియు నాపూలదండ సగము ప్రతిఫలించినదై, సుచంద్రుని హృదయమందు కలఁతఁ బెట్టు మదన బాణములను వెలికిఁ దీసికొని రాఁగలనని యతని హృదయమందుఁ జొరఁబడినదా యన్నట్లు ప్రకాశించెనట. సుచంద్రుని కంఠ మున నతని దేహకాంతిచే నెఱ్ఱబడిన యాదండ సంపెంగపూలదండ యని భయపడి తుమ్మెదలు పాఱిపోవు చుండఁగా నవి మన్మథుని కింక నీవు సుచంద్రునిఁ బొడువఁ బనిలేదు, అతనిని చంద్రిక వరించినదని చెప్పుటకు వెళ్ళుచున్నట్లుండెనట. నాయకుని కంఠమునందు నాయిక వైచినహారము, పద్మరాగమణివ్యాప్తమై యచ్చట చంద్రికారాగలక్ష్మి చేరి యతనిని గౌఁగిలింపఁగా నా రాగేందిర బాహులతాయుగ్మమా యనునట్లుండెనట. ఆ వరమాలకాంతి కతఁడు ధరించిన యితరమాలలు నిస్తేజస్కములై యుండెనట. ఇట్లు స్వయంవరమాల నత్యధికముగా నుత్ప్రేక్షించి చెప్పెను.
సుచంద్రునిఁ బెండ్లికొడుకును జేయుటకు ముందభ్యంగనముఁ జేయునప్పు డొకచెలి యతనికిఁ దలయంటెను. ఆ శిర సంటుటలో నాయువతి వంపుసొంపు లెట్లుండెనో కనులకు గట్టినట్లీక్రిందిపద్యమున వర్ణించెను.
సీ. అఱచందమామపై కుఱుకు చీఁకటిపిల్లలన, ఫాలతటిఁ గుంతలాళి జాఱ,
మదిపేరి మరుమేడఁ బొదలు ధూపము పర్వుపోల్కిఁ, గ్రొందావియూర్పులు జనింప,
నననూఁగువేడ్కఁ జేకొని మ్రోయు తేఁటిచాల్ సరి, నీలవలయముల్ చాల మొరయ,
లవలియాకులఁ గ్రమ్ము నవహైమకణముల గతిఁ, జెక్కుల శ్రమాంబుకణిక లుబ్బ,
తే. సరులు నటియింప, నునుఁగౌను సంచలింప, గుబ్బకవ రాయిడింప, సకుల్ నుతింప,
చూపు నెఱమించు మించు మేల్సొగసు నింప, నమ్మహీపాలు శిరసంటెఁ గొమ్మ యొకతె. (6-33)
బ్రహ్మ, చట్టుకూఁతు ననఁగా నొక వివేకశూన్యురాలిని సర్వజ్ఞుఁడగు శంకరునికిఁ గూర్చిన తన వక్రరచనను, ఖరపాదుని ననఁగా గాడిదకాళ్ళుగలవానిని (ఖరపాదుఁడనఁగా తీక్ష్ణకిరణములు గల్గిన సూర్యుఁడని శ్లేషార్థము) పద్మినితోఁ గూర్చిన విపరీత సృష్టిని, కుముద్వతిని, సంతోషమే యెఱుఁగని యొక స్త్రీని, సత్పతితో, ననఁగా మంచిభర్తతోఁ దార్చిన ప్రదోషసృష్టిని, సర్వాంగ ములును బంగారపుఛాయతో నున్న లక్ష్మిని చిరపూరుషుని కనఁగా నొక ముదుసలివానికిఁ గూర్చిన యతుల్యసర్గమును, ఈ తనతప్పుల నన్నింటిని లోకము మఱచునట్లు, ధీచాకచక్యము, అసమానరూపము, ఆనుకూల్యము, అనురూపయౌవనము గలి గిన చంద్రికాసుచంద్రదంపతులను జతఁ గూర్చి కీర్తిగాంచె నను వర్ణన గల యీక్రిందిపద్య మత్యంతమనోహరముగా నున్నది.
సీ. చట్టుకూఁతు నొకర్తు సర్వజ్ఞుఁడగు మహేశ్వరునితోఁ దార్చిన వామరచన,
ఖరపాదు రసవదంతర యైన పద్మినితోన గూర్చిన పవలైన చెయ్వు,
లల కుముద్వతి మనోహారియౌ సత్పతితో ఘటించిన యా ప్రదోషసృష్టి,
చిరపూరుషుని వసుస్ఫురితాంగియగు లక్ష్మితో నెనయించు నతుల్యసర్గ,
తే. మన్నియు జగంబు మఱవ నయ్యబ్జజన్ముఁ, డతుల ధీ చాకచక్యబు, నసమరూప,
మానుకూల్యంబు, ననురూపయౌవనంబు, నమర నిద్దంపతులఁ జేసె ననఘశక్తి. (6-108)
ఇట్లు వివిధవర్ణనలలోఁ దన భావకల్పన, పదరచన, సమాసగ్రథన, శ్లేషాద్యలంకారరచనాసామర్థ్యమును, తర్కవ్యాకరణ వేదాంత జ్యోతిషాదిశాస్త్రపరిశ్రమను, సంగీతకామశాస్త్ర నాట్యకళాకోవిదత్వమును, గీర్వాణాంధ్రభాషావైదుష్యమును, వైదికసంప్ర దాయములను, లోకమర్యాదలను, యుద్ధరంగవిశేషములను, తత్తదాయుధవిశేషములను దెలుపు నీకావ్యమును మహాకావ్య మనుటయందు సంశయమేమున్నది?
యుద్ధపరికరములు
1. చంద్రహాసము = ఒకవిధమగు ఖడ్గము (దీనితో సుచంద్రుఁడు కుముదుని పూర్వరూపమగు సింహముయొక్క తలను నఱికెను.)
2. నేజ = తోమరమను నాయుధవిశేషము. (పూమొగ్గనేజను మన్మథుఁడు వసంతముని వక్షస్థలమునఁ గుచ్చెను.)
3. బాగుదార = చూరకత్తి (దీనిచే మన్మథుఁడు వసంతమునిని నఱికెను.)
4. చిక్కటారు = మఱియొక విధమగు చూరకత్తి.
5. గుదియ = గద, పరశువు=గండ్రగొడ్డలి, వంకి=బాకు.
6. ద్రుఘణములు = ముద్గరములు, కుంతములు=బల్లెములు, పరిఘలు=పెద్ద ఖడ్గములు. (వీని నన్నిటిని తమిస్రాసుర యుద్ధమునఁ బేర్కొనెను. ఖడ్గాఖడ్గిలీలలు, శరాశరి యుజ్జృంభణములు, గదాగదివిలాసములు నా యుద్ధమునఁ జూపట్టెను. మరియు పరిఘ పట్టిస ముద్గర గదా భిందివాల తామర శూలాద్యాయుధములతో నా యుద్ధము జరిగెను. రథగజములు, గుఱ్ఱములు, కాలిబంటులు నిలుచు తీరులు, యుద్ధమునఁ బాల్గొనునప్పటి పద్ధతులు, బాణప్రయోగ ముల నేర్పులు మొదలయిన యుద్ధవిశేషముల నెన్నింటినో పేర్కొని తన రణవిద్యాకౌశలమును జూపెను.)
స్త్రీసంబోధనములు
పారిజాతాపహరణకావ్యమునందు ముక్కు తిమ్మన్న శ్రీకృష్ణునిచేత సత్యభామను ‘ఓ లలితేంద్రనీలశకలోపమకైశిక!’ అని పిలిపించెను. ఆపిలుపు సందర్భమునకుఁ దగినట్లున్నది. దానినిఁ జూచి యితరకవులు, విశేషించి యీచంద్రికాపరిణయ కర్తయు పెక్కు సంబోధన లట్టి దీర్ఘసమాసయుక్తములైనవాటిని, కొన్ని చిన్నసమాసములతో నున్నవాటినిఁ జేసిరి. వానిలోఁ గొన్ని:
1. విరిగల్వకంటి = వికసించిన కలువలవంటి కన్నులు గలదానా!
2. నిశాకరసోదరదాస్య = చంద్రునికి సోదరునివలె నున్న, అనఁగా చంద్రునివలె నున్న ముఖము గలదానా! ఇచ్చటి ‘సోదర’శబ్దము ఇవార్థకము. (‘వలె’ నను నర్థము గలది). ‘దేశీయ దేశ్య రిప్వాభ సోదరాద్యా ఇవార్థకాః’ అని కవికల్పలత.
3. జలజాతచ్ఛదదేశ్యనేత్ర = తామరఱేకులవంటి కన్నులు గలదానా! ఇందలి దేశ్యశబ్దము సైతము ఇవార్థకము, లేదా ఈషదసమాప్త్యర్థకము.
4. పారిమాండల్యవన్మధ్య = పరమాణు పరిమాణము గల నడుము గలదానా! పారిమాండల్య మనఁగా తర్కశాస్త్రపరి భాషలో పరమాణువు (అణువు) అని యర్థము.
5. సరసీజోపమగంధి = పద్మగంధమువంటి శరీరపరిమళము గలదానా!
6. బంధురనూతన బంధుజీవబాంధవరదనాంశుకామణి = దట్టమై క్రొత్తదై యున్న జపాకుసుమమునకు సరిపోలిన యధరోష్ఠము గల కాంతలలో శ్రేష్ఠురాలా! ఇందలి బాంధవశబ్దము ఇవార్థకము. సగోత్ర, జ్ఞాతి, బంధు శబ్దములును ఇవార్థకములే.
7. సరససితోపమాధర = రసవంతమగు చక్కెరను బోలిన యధరోష్ఠము గలదానా!
8. తరుణచపలాయమానకైతవదళాప్తకబరికాబంధ = క్రొక్కారు మెఱుపువలెఁ గనబడుచున్న మొగలిఱేకుచేతఁ బొందఁబడిన కొప్పు గలదానా!
9. వలజాలోకలలామ = సౌందర్యవతులలో శ్రేష్ఠురాలా!
10. దృష్ట్యలేహ్యవలగ్నామణి = కంటికిఁ గనఁబడని మధ్యభాగము గల స్త్రీలలో నుత్తమురాలా!
11. బలభిన్నీలసహోదరచ్చికుర = ఇంద్రనీలములకు సమానములగు కురులు గలదానా!
12. సారసజ్ఞాతినయన = కమలములవంటి కన్నులు గలదానా!
13. అంబురుహమ్మన్యముఖీమచర్చిక = తమ ముఖము కమలమువలె నున్నదని తలఁచు స్త్రీలలో నుత్తమురాలా!
‘ అంబురుహ మాత్మానం మన్యతి ఇతి అంబురహం మన్యం ముఖం యస్యా స్సా అంబురుహమ్మన్యముఖీ’ యని విగ్రహము.
14. కుందరదాలలామ = మల్లెమొగ్గలవంటి పలువరుస గలవారిలో శ్రేష్ఠురాలా! రదనము, రదము పర్యాయపదములు.
15. వాసవనీలకుంతలా = ఇంద్రనీలమణులవంటి కురులు గలదానా!
16. పక్ష్మలనేత్రామణి = దట్టమైన ఱెప్పలవెంట్రుకలుగల కన్నులతో నుండువారిలో నుత్తమురాలా!
17. అబ్జపత్రబాంధవన్నేత్ర =కమలదళములతోఁ జుట్టరికము చేయుచున్న కన్నులు గలదానా!
18. బింబవిమతోష్ఠి = దొండపండునకు విరోధి యగు మోవి గలదానా!
19. అమరేశాశ్మవిజేతృకుంతల = ఇంద్రనీలమణులను జయించు ముంగురులు గలది.
సామాన్యముగా నితరకవు లుపయోగించు కమలనయన, పంకజముఖీ, పద్మగంధి మొదలగువానితో పాటు పైవిధములగు సంబోధన లుపయోగించుటలోఁ బ్రాకరణికప్రయోజన మంతగొప్పగా లేకున్నను, పాండిత్యశౌండీర్యము మాత్రము విశేషము గా గోచరించుచున్నది. ఇవార్థకపర్యాయపదముల నన్నింటిని ఉపయోగించెను.
అరుదైన ప్రయోగములు
1. చక్కెరవిల్తుజగడంబు = సంభోగము
2. పూవిలుగలవేల్పురాసివము = మన్మథావేశము
3. తుమ్మెద కమ్మగట్టుమూఁకలు = తుమ్మెదల కమ్మకట్టు సేనలు. కమ్మకట్టుసేన లనఁగా వ్రాసుకొన్న యొడంబడిక ప్రకారము రాజునకు సహాయ్యము చేయునట్టి సేనావిశేషము (కమ్మ+కట్టు=కమ్మగట్టు). సూర్యరాయాంధ్రనిఘంటువు ‘కమ్మకట్టు’ శబ్దముక్రింద నిచ్చిన యుదాహరణములు మూడింటిలో నీచంద్రికాపరిణయమునందలి ‘చెలువగు మైత్రిఁ గోయిలవజీరులఁ దుమ్మెదకమ్మగట్టుమూఁకల, గొరువంకరాదొరల, గాటపుఁజిల్కలకాల్బలంబులన్’ ఇత్యాది ద్వితీ యాశ్వాసమునందలి 75వ పద్యమును జేర్చుట గమనింపఁదగినది.
4. నల్లపజ = కోయిలల మూఁక, కిరాతసంఘము (నల్లప్రజ) రూపాంతరము. సూర్యరాయాంధ్రనిఘంటువు ‘కలరవ మూన్చు నల్లపజ కప్పుకరా వెనువెంట రాజమం,డలి నడతేరఁ జైత్రబలనాథునిఁ గూడి’ మొదలగు చంద్రికాపరిణయ చతుర్థాశ్వాసమునందలి 85వ పద్యమును పై యుభయార్థములకు నుదాహరణముగా నిచ్చినది.
5. తాతస్తలోకవాగమృతసంభూతిన్ – తాతస్తత = అక్కడక్కడనుండి వచ్చిన, లోకవాగమృత సంభూతిన్ = జనుల యొక్క అమృతవాక్కులవలన అని యర్థము. ఇచ్చటి ‘తాతస్తత’ శబ్దప్రయోగము పాండిత్యస్ఫోరకము. ‘తత ఆగతః, అని అణ్ ప్రత్యయము, ‘అవ్యయానాం భ మాత్రే టి లోపః’ అనుటవలన టి లోపమువచ్చి యీరూపము సిద్ధించినది.
6. ఖడాఖడి = కఠినముగా (అన్యదేశ్యము)
ఇట్లు జాత్యములును, శాస్త్రీయములును అగు శబ్దప్రయోగములను విరివిగాఁ జేసెను. ఈకవి కవితావైదుష్యము శైలిలోను, పదపదైకదేశశ్లేషలలోను, ఉపమోత్ప్రేక్షాద్యలంకారఘటనములోను, చిత్రవిచిత్రభావ సన్నివేశములలోను, పదబంధముల కూర్పులోను, నూతనపదసృష్టిలోను, అచుంబితకల్పనములలోను బహుముఖముగా నున్నదని చెప్పుట కెంతయో సంత సించుచున్నాను. దీనిని చదివి యానందించుటకుఁ దగిన భాషాజ్ఞానము, విశ్రాంతి, బుద్ధివిశేషము గల చదువరు లదృష్టవంతు లని మనవి చేయుచున్నాను.
కథాసంవిధానము
మన ప్రాచీన పౌరాణికకథలలో పెక్కింటికి ప్రవచనస్థానమైన నైమిశమను పుణ్యారణ్యమునందే సూతపౌరాణికుని సన్ని ధిని శౌనకుఁడు మొదలగు మునిశ్రేష్ఠులు వెళ్ళి, మహానుభావా! మర్త్యలోకమును పాలించు రాజులలో, పుణ్యశ్లోకావతంసుఁడై, ప్రజలకు ఈతిబాధలు వాటిల్లనీక, చక్కగాఁ బరిపాలనము చేయునట్టి యొకరాజచరితమును దయామతితో మాకుఁ దెల్పవే యని ప్రార్థింపఁగా, పౌరాణికాగ్రేసరుఁడగు సూతుఁడు, చంద్రికాపరిణయప్రాధాన్యము గల సుచంద్రమహారాజు చరిత్రను ఈవిధ ముగాఁ జెప్పును. ఓమునులారా! భూమండలమునందు, సకలసంపదలకు నాలవాలమై, సమున్నతప్రాకారాదివైభవముల తోను, సకలవిద్యాపారంగతులైన భూసురులతోను, ఊర్జితతేజోయుతులైన క్షత్రియులతోను, అనంతగుణప్రవృద్ధి గల సిరులచే నలరారు వైశ్యశిఖామణులతోను, తాము పండించిన ధాన్యపుఁదిప్పలు సమున్నతములై చూచువారి కానందమును జేకూర్చు నట్టి పంటలతో విరాజిల్లు హాలికోత్తములతోను, రమణీయముగాఁ జూపట్టు మహాపట్టణమైన విశాలానగరము గలదు. ఆనగర మందు శౌర్యధైర్యస్థైర్యగుణోపేతుఁడై సౌందర్యవిజితమదనుఁడైన సుచంద్రుఁడను రాజు గలడు.
ఆరాజు, మయసభవంటి విచిత్రాలంకారపరిశోభితమైన సభామంటపమునం దొకదినమున సకలసామంతదండనాథాది జనములతోఁ గొలువుదీరి యుండెను. అప్పు డచ్చటికి భసితాక్షమాలాజటాధారి యైన సుగుణఖని శాండిల్యమౌని ఇరు ప్రక్కల నున్న జనములు నమస్కరించుచుండఁగా వచ్చెను. అట్లు వచ్చిన శాండిల్యముని కెదురేగి యర్ఘ్యపాద్యాది సత్కార ములు చేసి, యున్నతాసనమునఁ గూర్చుండఁజేసి సుచంద్రుఁడు కుశలప్రశ్నములు చేసెను. శాండిల్యముని రాజా! మీ పరాక్రమ పరిపాలనాది సద్గుణముల ప్రభావముచేత మాయాశ్రమమునందు జపములు, వేదపాఠములు, తపస్సులు, యజ్ఞములు మొద లగు ధర్మానుష్ఠానము లింతకాలమువరకు నిర్విఘ్నముగా సాగుచు వచ్చినవి. కాని యిప్పుడు మాకు మనఃక్లేశమును గల్గించు యజ్ఞవిఘ్నములు దాపురించినవి. అవి యేవి యనఁగా మాయావి, మహాపరాక్రమశాలియై యున్న ‘తమిస్రాసురుఁ’డను రాక్ష సుఁడు ఇంద్రాద్యష్టదిక్పాలకులను, సురగణములను లెక్కసేయక, తన చండదోర్దండమండలాగ్రముచేత ధీరుల నడంచుచు, మునులను బాధించుచు, మా సవనక్రియలకు విఘాతముఁ గలిగించుచు, చెలరేగి యున్నాఁడు. అతనిని సంహరించి మా యజ్ఞ ములను గాపాడఁగల నిఖిలాస్త్రవిధానశాలివైన నీవే తగుదువని నిన్నుఁ బ్రార్థింప వచ్చితిని. కనుక మా మునిసత్తముల వాంఛిత మును దీర్చుమని కోరెను. సుచంద్రఁడు, ‘మహామునీ! ఆ రాక్షసుఁడనఁగా నెంత? సకలసైన్యములతో వెంటనే మీవెంట వచ్చి, మీకృపాప్రభావమున నా తమిస్రాసురుని వధించెదను. హరిహరులు వానికి తోడుగా వచ్చినను లెక్కచేయక వాని ప్రాణములు దీసెదను. భూదేవికి రాక్షసభారము లేకుండునట్లును, దేవసంఘము స్వర్గమున నిర్విచారముగా నుండునట్లును, దేవతాసాన్ని ధ్యముచేత భూతలమున నెల్లకాలము యజ్ఞములు సాగునట్లును, మునివర్గగృహములందు నిరంతరయాగములు జరుగు నట్లును, నా నూతనబాణపరంపరలచేత ఆ రాక్షసనాయకుని సంహరించెదను. ఈకార్యమునకు మీరు విచ్చేయవలయునా? ఒక శిష్యునిద్వారా నాకు వార్త నంపియుండరాదా?’ అని పలికెను. దానికి సంతసించి, రాజు నాశీర్వదించి, శాండిల్యుఁడు తన తపోవనమునకు వెళ్ళెను.
సుచంద్రుఁడు భక్తిపురస్సరముగా శాండిల్యమునిని పంపి, కొలువుఁదీరి ఆప్తమంత్రిజనులతో సమాలోచనము చేసి, సైన్య సమూహములను రప్పించి, జయప్రయాణమును జేసెను. ఆసమయమున సైన్యము కావించిన ప్రయత్నము, మ్రోగించిన భేరీ ఢక్కాదులవలన బయలుదేరిన బంభారవము., బ్రహ్మండము నిండి, సూర్యబింబము పడిపోవునో! మహావృక్షములు కూలి పోవునో! పర్వతము లెగిరిపోవునో! భూమండలము చలించిపోవునో! దిక్కులు పగిలిపోవునో! మేఘమండలము బ్రద్దలగునో! యను మహాభయమును గల్గించెను. అప్పు డతని కనుసంజ్ఞచేత నొకసారథి, తెల్లని గుఱ్ఱములు గట్టినదియు, వివిధపుష్పమాలా లంకృత మయినదియు, ఉత్తమపతాకలతో గూడినదియు, సకలాయుధసన్నద్ధమైనదియు, సువర్ణపుఱేకులతోఁ బొదుగఁబడిన దియు నగు ఒక రత్నఖచితరథమును దెచ్చి నిలిపెను. సకలభూషణభూషితమైన తన చక్కని శరీరమునకు కుడిప్రక్కన దోపిన వజ్రపుపిడియు, బంగరునొఱయుఁ గల ఖడ్గము మిక్కిలి కాంతినిఁ జేకూర్పఁగా సుచంద్రుఁడు, శుభశకునములను జూచుచు, వివిధసామంతు లిదే సమయమని కొలువుమ్రొక్కులు చేయుచుండఁగా, వేత్రధారులు ‘అంగరాజా! పరాకు, కోసలనేతా! పరాకు, కేరళాధిపా! పరాకు’ అని మ్రొక్కుచున్న రాజులను హెచ్చరించు పరాకులు పల్కుచుండఁగా, బాలభానుఁడు పూర్వదిక్కున నుదయాద్రిపైన నధిరోహించినట్లు ఆ రత్నరథముపై నెక్కెను. సకలాయుధయుక్తమైన ఆ రథముపై సుచంద్రుఁడు బయలుదేర గా, రాక్షసయుద్ధమునందు ముందుఁజను నింద్రునివెనుక, తారకాసురసంహారత్వర గల కుమారస్వామివంటి శౌర్యధైర్యములు గల రాజకుమారులు, గుఱ్ఱములపై నెక్కి యతనిని వెంబడించిరి. ఆవెంట నలంకృతము లైన గజములతోను, రథములతోను, అశ్వములతోను, పదాతివర్గములతోను, సకలసైన్యములు బయలుదేరెను. అట్టి సైన్యముల మధ్య నున్న సుచంద్రుఁడు, సర్వ నక్షత్రగణముతో నేలకు దిగిన చంద్రునివలె చూచువారికి నేత్రపర్వముఁ గలిగించెను. అట్లు జైత్రయాత్ర సాగించిన సుచంద్రుఁడు మహారణ్య పర్వత ప్రాంతములు గడచి, కిన్నరీమణివీణానాదములచేతను, వివిధతరులతాపుష్పమకరందపానమత్తము లగు బంభరముల ఝంకారములచేతను ప్రతిధ్వనించుచున్న హేమకూటపర్వతమును గాంచెను. అట్లు చూచి, తమ విడిదిచేత నొక మహానగరభ్రాంతినిఁ గలిగించుచు, మార్గాయాసముచేత నలసియున్న సైన్యము నంతటిని ఆ హేమకూటపర్వత ప్రాంతారణ్య మందు బసచేయుట కాజ్ఞాపించెను. అట్లు సైన్యమును డించి, బంగరువస్త్రముచేత కుట్టి సిద్ధపరుపఁబడిన పటకుటీరమునందు తాను వాసము చేసి, సంతోషముతో నుండెను. అట్లుండి, తన వయస్యునితో ఆగిరీంద్రతటమునందున్న కాంచనమాలతీలతావల యములనుండి వీచుచున్న మందమారుతము హాయిని గూర్చుచున్నది.ఈపర్వతరాజు తన సమగ్రవైభవమును జూడరమ్మని పవనాంకురములను బంపినట్లుగా నున్నది. అని పల్కి యా ప్రియసఖునిచేతిని కైదండగాఁబూని, చక్కని వజ్రసోపానము లెక్కుచు, పార్శ్వములందున్న మల్లికాలతలు, దాసీజనములవలె మారుతముచే ప్రేరితములై వీవనలు వీవగా నగేంద్రము నెక్కెను. అప్పు డారాజసఖుడు, ప్రభూ! ఈశైలరాజము నీవిచ్చటఁ జేరినమాత్రమున రత్నకటకములతో, స్వర్ణమౌళితో, ఆశ్రిత రాజసింహమై, సంవృతానేకవాహినియై, చందనగంధవాసితమునై నీసారూప్యమును బొందినట్లుగా నున్నది. ఆ వజ్రమయ గండోపలము ఐరావతమును, దానిపైఁ బుష్పించిన పున్నాగవృక్షము దేవేంద్రునిఁ బోలియుండుటచేతఁ గాబోలు నీపర్వతము దేవతల కత్యంతప్రియమై యున్నది. నానావిధమణికూటములతో, మదపుటేనుఁగులతో, వాయువేగమున మ్రోగుచున్న గుహా చయముతో, వాజిసంచయముతో విరాజిల్లు నీహేమకూటము మేరుపర్వతముపైకి యుద్ధప్రయాణము చేయుచున్నట్లు గోచ రించుచున్నది. జనవరేణ్య! ఇచ్చటి చెంచువనితల మృగయావినోదసౌందర్యము, వివిధమృగప్రతిబింబములతో విరాజిల్లు సెల యేటి నీటిసోయగము, గుహాసౌందర్యమును చూడదగియున్నవి. తుమ్మెదల ఝంకారములు నారీమణుల గానంబులుగాను, మెట్టదామరలపైనుండి వచ్చు పుప్పొడి పసుపువస్త్రముగాను, శిఖరాగ్రమందున్న తెల్లమబ్బు శ్వేతచ్ఛత్రముగాను, అరఁటియా కులు జయపతాకములుగాను, నాగకన్యలు వేశ్యారత్నములుగాను, శార్దూలము లుత్తమరాజశ్రేష్ఠులుగాను గొలుచుచుండఁగా పేరోలగం బున్న రాజరత్నమువలె నీ హేమకూటధరాధరము తేజరిల్లుచున్నదని వయస్యుఁడా పర్వతసౌందర్యమును వర్ణించి చెప్పెను. అట్లు వయస్యునిచే వర్ణింపఁబడుచున్న పర్వతసౌందర్యవైభవమును దిలకించుచు సుచంద్రుఁడు చంద్రకాంతమణి ఖచితమై యిరుప్రక్కల లతాగృహములతో వెలయుచున్న గుహామార్గమున వెళ్ళుచు, ఒకద్రాక్షామండపముక్రింద బంగరుటంది యల మ్రోత వినఁబడునట్లు కోలాటమాడుచున్న గంధర్వసతులుగల కోనను జూచెను. అచ్చటికి వెళ్ళి, కోనలోనికి పద్మరాగ ములతోఁ గట్టిన మెట్లదారినుండి యామిత్రసహితముగా దిగి, యొక మణిమంటమును గని, మిత్రమా! ఇచ్చట గొంచము తడవు నిలుతమా? యని యచ్చట నున్న యొక రత్నపీఠముపైఁ గూర్చుండెను.
అప్పుడొక మణిపుత్రిక యొయ్యారముగా వచ్చి కర్పూరతాంబూలము నిచ్చెను. ఒకసాలభంజిక బంగరుపువ్వుల చెంగావివస్త్రము గల వీవనతో వీచెను. ఒకబంగరుబొమ్మ కలాచిని బట్టుకొని నిలిచెను. ఒకచొకాటపుబొమ్మ పొన్నపూవులు గూర్చిన సురటితో విసరెను. ఇట్టులు ఊడిగములు గొనుచు మిత్రసహితుఁడై సుచంద్రుఁ డానందించుచుండఁగా నొకసింహము, మృగజాతమును బెదరించుచు విశాలమైన ముఖము, వంగినగోఱ్లు, శిరస్సుపైకిఁ జేర్పఁబడిన వాలము, ఎఱ్ఱని కేసరములు, వజ్రాయుధములవంటి కోఱలు, ఎఱ్ఱనికన్నులును గలిగి యా ప్రక్కనున్న యొక పొదరింటినుండి వెలుపటికి దూకెను. దూకి, సుచంద్రాదులను బట్టుకొనుట కుంకించుచుండఁగా సుచంద్రుఁడు తనచంద్రహాసముచేత దానితలను నఱికెను. అట్లు నఱుకఁబడిన దాని శరీరమునుండి వెలువడు రక్తమను సంధ్యారాగమునుండి సూర్యబింబమునుబోలిన కాంతితో నొక పురుషరూపము గోచ రించెను. ఆ రూపమును జూచి యాశ్చర్యచకితుఁడై యున్న రాజువద్ద కాపురుషుఁడు ఒకకిన్నరుఁడై వచ్చి, వినయముతో “భానుకులాయ, శత్రుచర్యదమనపండితాయ, భవతే నమోఽస్తు” అని మ్రొక్కెను. అట్లు మ్రొక్కిన యాకిన్నరుని చేతితో నెత్తి చెంతఁ గూరుచుండఁబెట్టుకొని యతనికథ వినఁగోరి రాజిట్లనెను. ఓయీ! లోకోత్తరగుణశాలివి, కిన్నరశ్రేష్ఠుఁడవు నగు నీకు సింహత్వము గలుగుటయు, నది తొలఁగుటయు నెట్లు ఘటించెనో తెల్పుము. వినుటకు వేడుక పడుచున్నా ననఁగా నతఁడు పునఃపునరభివాదమును జేయుచు, తనకథ నిట్లు వివరించెను. ఒకప్పుడు బ్రహ్మదేవుఁడు సకలదేవబృందముతోఁ గొలువుఁదీరి యుండఁగా పారిజాతారణ్యమునందు తపస్సు గావించుచున్న వసంతుఁడను విప్రుని తపోగ్నిజ్వాలలచేతఁ గందిపోయిన మహా మనుసువర్ణదేవతలు వచ్చి, బ్రహ్మకుఁ బ్రదక్షిణముఁ జేయుచుండ వానినిఁ జూచి బ్రహ్మ మీకీ దుస్థితి యెట్లు వచ్చెనో తెల్పుడని యడిగెను. వారు ప్రభూ! పారిజాతారణ్యమునందు తన తపశ్శక్తిచేత బ్రహ్మత్వమును సంపాదింపఁ దలచిన వసంతుఁడను నొకడు మా జపవ్యాపారపారంగతుఁడై, సర్వేంద్రియనిగ్రహము గలవాఁడై, నిశ్చలాంతరంగుఁడై, మాయక్షరసంఖ్యను లక్షోప లక్షలుగా జపించుచు, మాకు తాపమును గలిగించుచున్నాఁడు. దీనిని అణగించుటకుఁ బ్రయత్నింపుమని కోరిరి. ఔరా! అతఁ డిట్లు చేయునా? యని బ్రహ్మ యాలోచించుచుండఁగా నింద్రుఁడు ప్రభూ! ఆ యతియనఁగా నెంత? వాని జపమెంత? వ్రత మెంత? తపమెంత? మేనక, ధాన్యమాలిని, ఊర్వశి మొదలగు దేవవేశ్యలు, మన్మథుఁడు నుండఁగా మీకు విచార మెందులకు? అనఁగా బ్రహ్మ సంతసించి కంతుని బిల్వఁబంచి వేల్పునవలామిన్నలను జూడఁగా వారందఱు వెలవెలపాటు నొందుచుండ, చిత్రరేఖ నలువకు నమస్కరించి నన్నుఁ బంపుడనెను. మరుని సహాయముతో నా మునితపస్సును భగ్నముఁజేసి మీ ముందు నకు దెచ్చి యుంచెద ననెను. అంతలో మన్మథుఁ డచటికి వచ్చెను. బ్రహ్మ యతనిని గౌఁగిలించి, యాసనస్థుని జేసి, యతనికి దనకార్యమును దెలిపి, యా యతిని అబలాపరిచారకునిఁ జేయుమని యంగజుని గోరెను. మన్మథుఁడీ పనికి నన్నుఁ బ్రార్థింప వలెనా? ఈ సురకార్యము నాది కాదా? యని చిత్రరేఖతోను, పికసైన్యములతోను, సకలపరివారముతోను బయలుదేరి ముని తపఃప్రదేశమును జేరఁబోవు నప్పు డెన్నియో యపశకునములు గలిగెను. ఆ యపశకునములను లెక్కింపక మన్మథుఁడు చిత్ర రేఖతో మేరుపర్వతమార్గమున సత్యలోకమునుండి దిగి, తపోలోకము దాటి, జనర్లోకము చేరి, మహర్లోకము నొంది, స్వర్లోక మును సమీపించి, భువర్లోకమును దాటి, భూలోకమునకుఁ జేరెను. అచ్చట వింధ్యాద్రిసమీపమున నర్మదానదీజలకణముల చేతఁ బుష్పించిన పారిజాతవనము కన్నుల కింపు గూర్పఁగా నచ్చటి మున్యాశ్రమము నెఱిఁగి యచ్చట మందమారుతమున మార్గాయాసమును దొలఁగించుకొనెను. తనసైన్యము నంతటిని దింపెను. కుసుమశరములు దాల్చి శుకకోకిలభృంగనాదములు చెలరేఁగగా మునిని జుట్టుముట్టెను. అబ్జాస్త్రములు నించి ప్రయోగించెను. పెక్కుబాణములు వేసి యతనిఁ జలింపఁజేయ సమకట్టిన సమయమున చిత్రరేఖ యచ్చటికిఁ జేరి, వివిధభంగిమలతో తన చక్కదనమును ముని చిత్తమున కెక్క జేయుటకుఁ బ్రయత్నిం చెను. కాని, తాపసుని వైఖరి తఱుగలేదు. అప్పుడు సంగీతపాండితితో చిత్రరేఖ వీణ వాయించెను. విచిత్రగతులతో వాయించిన వీణావాదనము ఫలింపక పోగా, నద్భుతవైఖరులతో నాట్యము చేసెను. అట్లు హాటకకింకిణికాఝణంఝణధ్వనులు చెలరేఁగ నాట్యముఁ జేయుచు మునిపాదములకు నమస్కరించి, ‘నియమిచంద్ర! వేల్పుదొరలకు విరాళిని హెచ్చించు చక్కఁదనము గల దానను, చిత్రప్రతిమలకు జీవముఁబోయఁగల పాటను నేర్చినదానను, రంభాదులు మెచ్చు నాట్యము నెఱింగినదానను, హరి హరాదుల సభలలో నెన్నియో బిరుదము లందినదానను, నీవు సరస్వతివే యని బ్రహ్మ మెచ్చుకొను సాహిత్యవిద్యాపాటవము గలదానను, నాపేరు చిత్రరేఖ, నిన్ను సేవించుటకై వచ్చితి ననుగ్రహింపు’ మనెను. ఆపలుకులు విన్న మునిశ్రేష్ఠుఁడగువసంతుఁడు కనుఁగవను సగము విప్పి చిత్రరేఖను జూచి, మరల కన్నులు మోడ్చి, నిరవధిక సమాధిలో నిమగ్నుఁడయ్యెను. అతని చిత్తగతి నెఱుఁగలేని చిత్రరేఖ సఖీజనసహితముగా మునిసమీపమునకుఁ జేరి, యుక్తి చాతుర్యమున ‘మునిచంద్రా! నిరుపయోగమగు నీ నివృత్తిమార్గమును గట్టిపెట్టి, జవరాలిగుబ్బలను జేరుట పర్వతసీమల నుండుటగాను, రత్యంతశ్రమజలమునఁ దోఁగుట గంగా వగాహనముగాను, యధరపానము నమృతపానముగాను, నారీరతికూజితములు పలుకుట నుపనిషత్పఠనముగాను దలఁచి, కుసుమాయుధదైవత మిచ్చు నఖండానందము ననుభవింపుము’. అని పెక్కువిధముల రత్యుద్దీపక ప్రసంగములు చేసి, మౌన నిమగ్నుఁడై యున్న ముని యంగీకరించినట్లు భావించి, యేమివచ్చిన వచ్చుఁగాక యన్న ధైర్యముతో నతని చేతిని బట్టుకొని తనకళాస్థానముల నుంచుచుఁ జలింపఁజేసెను. ఆచలనమువలనఁ గన్నులు విప్పి క్రోధారుణవీక్షణములతో చిత్రరేఖనుజూచుచు, తోఁకఁ ద్రొక్కినపామువలె బుసకొట్టుచు, ‘ఓ నిలింపచాంపేయగంధీ! మన్మథమదాంధకారముచేఁ గన్నుగానక వనములందుఁ దపంబుచే దినములు గడపుచున్న నన్నుఁ దెచ్చుకోలువలపునఁ జేయిబట్టి రతులకు రమ్మని పిలుతువే? ఈయపరాధమునకు ఫలితముగా నీదేవాంగనాభావంబుఁ దొలంగి మానవవనితవై పుట్టి ‘సుదోషాకర’సమాఖ్యుఁడగు నొక యిరాపుని బెండ్లియాడి యుండెదవుగాక’ యని శపించెను.
అప్పుడు మన్మథుఁడు తన యస్త్రశస్త్రముల నరణ్యమునందే పారవైచి వసంత మలయానిల శుక పికాది పరివారముతో పారి పోయెను. చిత్రరేఖ భయపడి మునిపాదములపైఁ బడి, ‘మహాత్మా! మీప్రభావము నెఱుఁగక చేసిన నా యీయపరాధమును క్షమింపుఁడు. మర్త్యకాంతనై పుట్టి దుష్టసమాఖ్యుఁడగువానిఁ జెట్టఁబట్టియుండు దుర్గతిని నాకుఁ దొలఁగింపుఁడు. మీశాపమును మరలింపు’డని ప్రార్థించెను. ఆప్రార్థనముచేతఁ గరుణాయత్తచిత్తుఁడగు ముని ‘ఓ నారీమణీ! నాశాపము అమోఘము. ఐనను దాని కన్యధార్థము గల్పించి నీ వనుభవించునట్లు చేయుదును. ‘సుదోషాకర’శబ్దమునకు అధికదోషములు చేయువాఁడను అర్థమునకు బదులు రాత్రిని గలిగించు చంద్రుఁడనియు, ‘ఇరాపుఁడు’ అనుశబ్దమునకు మద్యపానముఁజేయువాఁడను నర్థము నకు బదులు భూపాలుఁడు అను నర్థమును ఉండుటచేత నీవు ‘సుచంద్రుఁ’డను పేరుగల రాజును బెండ్లియాడుమని శాపవచనా ర్థము తేలును. కావున నీవు మర్త్యలోకమునఁ బుట్టినదానవై సుచంద్రమహారాజును బెండ్లియాడి శతసహస్రవత్సరములు సకల రాజభోగము లనుభవించి పిమ్మట స్వస్వరూపమును బొంది స్వర్గమునకు వెళ్ళెదవుగాక’ యని శాపమును సడలించెను. చిత్ర రేఖ తృప్తిపడి సఖీజనముతోఁ దన కేళికాగృహమునకుఁ జేరెను.
మునిశాపవశమున చిత్రరేఖ భూమండలమున బాంచాలదేశము నేలు ‘క్షణదోదయుఁ’డను రాజునకు ‘శ్యామ’ యను భార్యయందుఁ గన్యయై పుట్టి ‘చంద్రిక’యని పిలువఁబడెను. బ్రహ్మదేవుని కీవార్త తెలిసి చింతించి అట్లు మర్త్యస్త్రీయై పుట్టిన యామెకు పెక్కుదివ్యచిహ్నములు గలిగించెను. ‘కుముదుఁ’డను నామధేయముగల నన్ను భూలోకమునకు వెళ్ళి ‘చంద్రిక’ కు వీణావాదనము నేర్పుమని చతుర్ముఖుఁ డాజ్ఞాపింపఁగా నేను వచ్చి పూర్వస్నేహముచేత నామెను వీణావాదనచతురను గావించితిని. ఇతోధికనైపుణ్యము నాచంద్రికకుఁ గలిగింపఁ దలఁచి యొకనాడు శారదాదేవిసన్నిధి కేగి కొన్ని వింతరాగములు విని వాని నామెకు నేర్పఁదలఁచి ఆకసమునుండి భూలోకమునకు వచ్చునపుడు నిండుజవ్వనమున మిసమిసలాడు చక్కని యొక మునికాంతను జూచి యీతలిరుఁబోణిని గలియఁజాలని జన్మము జన్మమే? యని కామమోహితుఁడనై యాతాపసాం గన సంచరించు గృహమువద్ద మునులమహాసభలో నేనెఱిఁగిన శాంబరీవిద్యచేత నేనును ఒక మునితల్లజునై కూర్చుంటిని. ఇంతలో నా యువతిభర్త యచ్చటికి వచ్చి నామాయావిత్వము నెఱిఁగి ‘ఓరీ కిన్నరాధమా! నీవిట్టి పనికిఁ బూనితివా?’ యని ‘సింహరూపముతో నరణ్యమునఁ బడియుండు’మని శపించెను. భీతిల్లిన నే నామునిపాదములపైఁబడి శాపము నుపహరింపు మని ప్రార్థింపఁగా ‘నావచన మమోఘము గాన నీకు సింహత్వ మైదువత్సరము లుండు’నని యనుగ్రహించెను. తత్ఫలితముగా నేను సింహమునై యీపొదరింటిలో నుంటిని. ఇప్పుడు నీఖడ్గధారకు గురియై సింహత్వము దొలఁగి నాపూర్వరూపంబును గంటి నని చెప్పఁగా సుచంద్రుఁ డతని నభినందించి యుపలాలించెను. అప్పుడు కుముదుఁడు, సుచంద్రునితో నో రాజా! చంద్రిక యఖండసౌందర్యవిలాసము, దేవతాత్వము విడిచి మానుషీత్వమును బొందిన యామె మంజులాంగకాంతి, మెఱుపుఁదీవను మించు నామె లావణ్యము, మొగ్గలను బోలిన యాకన్యపాదనఖములు, మార్దవారుణ్యములచేతఁ బల్లవకాంతి నోడించిన యా నెలఁత యడుగుల కాంతి, ఆజవరాలి మెఱుఁగుపిక్కలసోయగము, ఏనుఁగుతొండములను యరఁటికంబములను దిరస్క రించు నామెయూరువులు, అణుమధ్యయు, నతనాభియు, లకుచకుచయు, కంబుకంఠియు, చంద్రముఖియు నగు నాచంద్రిక, ఆవామేక్షణ, ఆ వక్రాలక, ఆలేమ సౌందర్యము నుతింపఁదరముగాదు. ఓనృపాల! ఆమిళిందకుంతల, ఆమీననేత్ర, ఆతామరసా నన, ఆపికరవోజ్జ్వల, ఆయబ్జగళ, ఆబిసబాహ, ఆప్రవాళలలితపాద, ఆచెలి నీకే తగును. అని తనకథను జెప్పు సందర్భమున చంద్రిక జనన క్రమ సౌందర్యవిలాస విశేషములను జెప్పెను. ఆవృత్తాంతము విన్న సుచంద్రుని కద్భుతాశ్చర్యములు గలిగి చిత్త మునఁ బూర్వ జన్మసంస్కారముచేతనో మన్మథుని శాంబరీమహిమచేతనో చంద్రికపై ననురాగము రేకెత్తెను. ఆమెను జూచుటకు వాంఛ గల్గెను. కుముదునితోఁ దనకుఁ గలిగిన చంద్రికాదర్శనకుతూహలమును వెల్లడించెను. ఆవెంటనే కుముదుఁడు సతసించి తనవిమానమును స్మరింపఁగా నది వచ్చెను. వారిద్దఱు నావిమానము నెక్కి, యక్షుని మాయాప్రభావమున నెవ్వరికిని గనఁ బడక, గిరినదీవనములు క్షణకాలమున దాటి క్షణదోదయరాజు పట్టణమును, తదుపరి చంద్రికావిలాసవనవాటినిఁ జేరిరి. కిన్నరశ్రేష్ఠుఁడగు కుముదుఁడదిగో! యటు చూడుము అనఁగా సుచంద్రమహారాజు బంగరుపీటపైఁ గూర్చుని తన గానచాతురికి శిలలు గఱుగఁగా మణిపుత్రికలు తల లూపఁగా, లయశ్రుతులయందు సఖులు పారవశ్యమును జెందియుండఁగా, వృక్షలతాదు లానందమునఁ జిగుర్పఁగా విపంచీనాదమునఁ గంఠస్వరమును మేళవించి గానము చేయుచున్న కనకగాత్రి యగు చంద్రికను అద్భుతాశ్చర్యములు నిండిన నిండుమనస్సుతో రాగరంజితములగు వీక్షణములు నిగుడించి చూచెను. ఆ వీక్షణమువలన నత నికి మేను చెమర్చెను. పులకలు రేకెత్తెను. స్తంభోదయ మయ్యెను. చూపులు నూగారుద్వారా స్తనపర్వతములపై నిలిచి దిగ కుండెను. ముఖసుధాపానపారవశ్యమున ననిమేషత్వమును బొందెను. అట్లు చంద్రికాయత్తదృక్చకోరుఁడైన సుచంద్రుఁడు, తన మనస్సున ఈ హేమగాత్రి క్రొత్తగా సానదీరిన మన్మథునిఖడ్గము గాబోలు. ఔర! యీ చెలువచెలువము! అయ్యారె! ఈపొలఁతి యొయ్యారము! అని తదేకతానమనస్కుఁడై పొగడెను. అప్పుడు కుముదుఁడు రాజా! చూచితివిగదా! నాపలుకు నిజమేకదా! ఇఁక నేను వెళ్ళి ఈకొమ్మకు త్వదేకమతని గలిగింతు నని సుచంద్రునియాజ్ఞను గైకొని, విమానము డిగి తరులతామార్గములను దాటి, తాను సింహత్వమును బొందకమున్నున్న రూపవైఖరితోఁ జంద్రిక యున్నచోటికిఁ జేరఁగా, సఖులందఱు నబ్బురపడి గురుప్రముఖుఁడు వచ్చెసుమా! యన చంద్రిక సఖీయుక్తముగా నెదురేగి నమస్కరింపఁగా పెండ్లికూఁతురవు గమ్మని యాశీర్వ దించి, వారు చేసినపూజలు గైకొని, వారేర్పరచిన రత్నపీఠముపైఁ గూర్చునెను. అప్పుడు చంద్రిక చెలికత్తెయగు చకోరి కుము దునిఁ జూచి “మీరింతకాలము రాకపోవుటచే మేము మిక్కిలి చింత నొందుచు నిదిగో వత్తురు, అదిగో వత్తురని ప్రతీక్షించుచు నుంటిమి. ఏల యింతకాలము రాకపోయితిరి? ఏపురమున నుంటిరి? ఏయే విశేషములను జూచితిరి? ఏరాజుతోఁ జెలిమి చేసి తిరి? దయతోఁ దెల్పుడు” అని కోరఁగా కుముదుఁడు చకోరిని జూచి మధురోక్తులతో “మహాపరాక్రమవంతుఁడగు సుచంద్రుఁ డను నొక రాజచంద్రుఁడు గలఁడు. సరసకలాంచితాస్యుఁడు, చారువిలోచనపద్ముఁడు, కళంకరహితగాత్రుఁడు నగు నానృప శిఖామణిని నాగకన్యలు, దేవకన్యలు, మానవకన్యలు గోరి పంచశరవేదనను భరింపఁ జాలకుందురు. అట్టి సుగుణఖనియు, సుందరాకారుఁడును, సుక్షత్రియవతంసుఁడునైన యతనిమైత్రి గలిగియుంటిని. ఇప్పు డీ మీచెలిని జూడఁదలఁచి యతనియాజ్ఞను గొని వచ్చితిని. ఈచంద్రికను జూడఁగా నీయమ ఆరాజునకే తగును. ఆనరనాథుఁ డీజలరుహనేత్రకే తగునని నామనస్సునఁ దోచుచున్నది. కనులు వికసిల్లగా నాజనాధీశచంద్రుని జూచినఁగాని నాకోరిక తీరదు. మీరు సైతము త్వరలో నతని జూడఁగలరు” అని పలుకఁగాఁ జకోరి, “సూర్యవంశసంజాతుఁడగు నాయుత్తమనాయకుని గుణములను విని మేము వర్ణింపఁగాఁ జంద్రిక యాపతిని జూచుటకై యువ్విళ్ళూరుచున్నది. మాకును జూడ బుద్ధిపుట్టుచున్నది. ఎట్లా సుందరాకారునిఁ జూడఁగలమో తెల్పుము” అనఁగా కుముదుఁడు మీకు వాంఛ గలిగియున్నచో నాచేతివైపున చూడుడు” – అని యంతవఱ కావహింపఁజేసిన తిరస్కరిణీ విద్యాప్రభావమును దొలఁగింపఁగా, మన్మథుని మించినసౌందర్యరాశియగు సుచంద్రుఁడు విమానమునఁ గూర్చుని దర్శన మీయఁగా మేను పులకలచే నిండ, మనస్సున వలపు నిలువ, చూపున ననిమేషవిస్ఫురణము గలుగ, ప్రమోదము చిందులు ద్రొక్క, మణిపీఠమునుండి దిగి, ఒకచెలిచేతిని కైదండబూని ఆచంద్రిక యారాజకుసుమాస్త్రుని ఒకింత సిగ్గుతోఁ జూచెను. ఆ రాజుచూపులు తెల్లనిగంగాప్రవాహమువలెఁ జంద్రికపైఁ బ్రసరింపఁ జంద్రికచూపులు చేపలవలె నెదురెక్కుచుండ వారిద్దఱును పరస్పరప్రేమవీక్షణములు చేయుచు రాగరసనిమగ్ను లైరి. సుచంద్రుని యొక్కొక్క యవయవమే యనేక నల నాసత్య స్మరాదులను దలపించుచుండఁగా వారిపోలిక యితనియెదుట చెల్లదని ఆపల్లవాధర భావించుచుండెను. అట్లు మోహ పరవశమై యున్న చంద్రికవద్ది కొకచెలి వచ్చి, “రాజకుమారీ! మీతల్లి నీవీణను వినఁగోరి నిన్ను రమ్మని యాజ్ఞాపించినది” అని చెప్పఁగా నామె గురుని వినయముతోఁ గాంచెను. గురువగు కుముదుఁడు “ఓకిన్నరకంఠి! ఈనృపతికి నీవు సతివౌదువు. నా మాట తప్పదు. వెళ్ళిరమ్ము” అనఁగా గురునియాశీర్వచనమును గొని చంద్రిక తనమాత సన్నిధికి వెళ్ళెను. సుచంద్రుఁడు స్వప్నమువలె జరిగిన యీసంఘటన కుద్భ్రాంతచిత్తమున వియోగచింతాభరభరితహృదయుఁ డయ్యెను. చంద్రికాయత్త మనస్కుఁడై శారికాశుకముల పల్కులను చంద్రికామధురభాషణములుగాను, బండిగురివెంద విరిగుత్తిని చంద్రికచనుదోయి గాను, తదితరములగు ప్రకృతివైభవములను చంద్రికాసౌందర్యవిశేషములుగాను భావించుచు, నామె యేగిన దారినిఁ గాంచుచు, నామె లావణ్యవిశేషములనుఁ దలఁచుచు వలవంతలోఁ జిక్కి బాధపడుచుండఁగాఁ గుముదుఁడు “మహినాయక! యేల చింతించె దవు? నిన్నుఁ బ్రేమతోఁ జూచిన యా వధూమణిని మన్మథుఁడింతకు ముందే తనసూనబాణములచే నీయందు సమగ్రమనోరథను జేసి యున్నాఁడు. ఆమె నిన్ను తప్పక వరించును. చింత యెంతమాత్రము నీకవసరము లేదు” – అని చెప్పఁగా సుచంద్రుఁడు కుదుటపడి, విమానముపై నెక్కి, తనసైన్య మున్నచోటికి వచ్చి, కుముదుని కూర్మిమీరఁగాఁ బంపెను. పిమ్మట ముని కిచ్చిన తనవాక్కును దలఁచుకొని తమిస్రదానవుని వధించుటకై సైన్యసమేతముగాఁ బయలుదేరెను.
రణభేరిని మ్రోగించుచు హిమవత్పర్వతమును జేరిన సుచంద్రుఁడు రాక్షసునినగరమును ముట్టడించి, కరిఘీంకారములు, అశ్వహేషలు, రథనినాదములు, సైనికులవీరాలాపములు చెలరేఁగ రాక్షససైన్యమును దుత్తునియలు చేసెను. వీరాధివీరుఁడగు తమిస్రాసురుఁడు పెక్కు దుర్భాషణము లాడుచు సుచంద్రుని లెక్కింపక రణరంగమున విహరించుచుండఁగాఁ దనధనస్సున నారాయణాస్త్రమును సంధించి వానితల నఱికెను. ఆరాక్షససంహారమును గాంచిన దేవతలు, యక్షులు, కిన్నరులు, మునులు, నరనాథులు, సైనికులును ఆనందించిరి. ఇంద్రాదిదిక్పాలు రానందించి పెక్కుపారితోషికము లిచ్చిరి. సుచంద్రునివైపున యుద్ధ మొనరించి మరణించినవారి నందఱిని ఇంద్రుఁడు అమృతధారలు గురిపించి మరలఁ బ్రతికించెను. మునులు రాజున కభ్యుదయ పరంపరాభివృద్ధి యగునట్టు లాశీర్వదించిరి. సుచంద్రుఁడు ప్రతిజ్ఞ నెరవేరినందులకు సంతసించుచు, తిరుగుప్రయాణమునఁ గనుపట్టుచున్న ప్రకృతిచిత్రము లన్నిఁటియందును చంద్రికాసౌందర్యము నూహించుచు నాయింతి నెప్పుడు చేపట్టగలనో! యను చింతతో స్వనగరమును జేరి, యేకాంతమున విరహవేదనతోఁ బవ్వళించెను. అనురాగాతిశయముచేతఁ జంద్రికను దలంచుచుండఁగా సుచంద్రునికి దేహమందుఁ బులకలు, లోచనములం దశ్రువులు బొడముచుండెను. ఇఁక నక్కడ సుచంద్రునిపై మోహము బొడమిన చంద్రికకు నవపల్లవాద్యుద్దీపకదర్శనమువలన ఆకులత్వము గలిగెను. శుకకూజిత భ్రమరఝంకారా దులచేత సంతాపము మిక్కిలి యుప్పొంగెను. పికధ్వనులయం దరతి గలిగెను. కార్శ్యముచేతఁ గరకంకణములు, దైన్యము చేత నయనాశ్రువులు జాఱెను. సఖీవిరచిత సుచంద్రచిత్రవీక్షణమునఁ బ్రత్యక్షప్రియసంగమము నప్పుడప్పు డనుభవించుచుఁ గొంత యూరటఁ జెందుచుండెను. కాని మరల నుద్వేగము, మరలమరల యరతి మొదలగు ననంగదశలకు లోనై విరహవేదనాదో దూయమానచిత్తయగు చంద్రికను, వసంతోదయ మగుటవలన చెలులుకేళికావనమునకుఁ దీసికొనిపోయిరి. కాని యచ్చటను గోకిలాలాపములు, నవపల్లవములు, మందమారుతము, ఆమెను బాధించుచునే యుండఁగా, జలక్రీడ లామె ప్రియవియోగ దుఃఖము నినుమడింపఁజేయఁగా, సఖులు, మన్మథపూజవలన నీవిరహబాధ శమించునని యూహించి, సాంగసపరివారముగ కుసుమాస్త్రునిఁ గల్పించి, ఆవాహనార్ఘ్యమజ్జనాది పూజలు చేయించిరి. అదియు ఫలింపక పోగా మరల కేళికాగృహమునకుఁ దోడ్కొనిపోయిరి. సూర్యాస్తమయముల సౌందర్యము లెంత వర్ణించినను చంద్రిక సుచంద్రునిదక్క మరియొక యుపాయమున యూరటఁ జెందఁజాలదని యెఱిఁగిన సఖులు క్షణదోదయమహారాజున కెఱింగింపఁగా నతఁడు తనకూతురు సుచంద్రనరపతి యెడలఁ బ్రేమ గలిగియుండుట శుభోదర్కమని భావించి, ఆమె యిష్టార్థసంసిద్ధికై చంద్రికాస్వయంవరమహోత్సవమును జాటిం చుట కాత్మానుచరులను బంచెను. రాజభటులు సకలదిఙ్మండలములందుఁగల రాజధానులయందు చంద్రికాస్వయంవరమును జాటించిరి. ఆయా రాజకుమారులు చంద్రికను వరింపఁదలఁచి బయలుదేరిరి. సుచంద్రుఁడును పురకాంతలు పుష్పాక్షతలు చల్లుచుండఁగా, విప్రులు దీవించుచుండఁగా, భూషణభూషితాంగుఁడై యొకమదగజము నెక్కి బయలుదేరెను. అట్లు స్వయం వరమునకై వచ్చిన రాజులనందఱిని పాంచాలభూపతి యెదుర్కొని రత్నమయనివేశస్థానములందు దించెను. సకలసౌకర్య ములు గలిగించెను. మంచాధిష్ఠితుఁడైన సుచంద్రుఁడు తన సౌందర్యాతిశయముచేత నితరరాజకుమారులకుఁ దమను చంద్రిక వరించునో, లేదో, యను సంశయమును బుట్టించుచు నందఱిలో మణి యనఁదగినట్లుగా నుండెను. సర్వాలంకారశోభితమైన స్వయంవరమండపమున నిలిచి, తన తనయను రాజన్యులకు, రాజన్యులను దన తనయకుఁ బరిచయముఁ జేయుటకు జగ జ్జనని పార్వతిదక్క మరియొక్కరు సమర్థులుగారని యెంచి, యాతల్లిని పరిశుద్ధమనస్కుఁడై ప్రార్థించెను. శిరమునఁ జంద్ర లేఖయు, కనులలో దయారసమును, మందస్మితమును, ఫాలలోచనమును, చనుగవ నొరయు ముత్తెపుసరులును, బంగరు వస్త్రమును, పరిమళించు నంగలతయు గలిగి, యందఱు నాశ్చర్యపడుచుండ నాగట్టురాపట్టి క్షణదోదయుని యెదుట సాక్షా త్కరించెను. రాజులందఱును లేచి నమస్కరించిరి. పాంచాలరాజు పార్వతికి నమస్కరించి సఖులకుఁ జంద్రికను దోడితెండని యానతిచ్చెను. రాజన్యులనెడు వనములకు వసంతమువలెను, నలువ నేర్పుచే నిర్మించిన మణిపుత్రికవలెను, క్షణదోదయుని సుకృతలక్ష్మివలెను ప్రకాశించుచు, దేహకాంతిచే నినుమడించిన మణిభూషణతేజస్సుగల చంద్రిక సఖీమధ్యగతయై స్వయం వరసభాస్థానమునకు వచ్చెను. ఆమెను జూచిన రాజన్యులు ఆమె మెఱుఁగుతీఁగయో, లక్ష్మియో, రతియో, యని భావించు చుండిరి. అట్లు వచ్చిన చంద్రిక తండ్రినిఁ జేరి, యతని యనుజ్ఞచేతఁ బార్వతికి నమస్కరింపఁగా నాహైమవతి “అభీష్టార్థసంసిద్ధి రస్తు” అని దీవించి, కౌఁగిలించుకొని, చంద్రికతలపైఁ గనకమంగళాక్షతల నుంచెను. పిమ్మట పల్లకిపైఁ జంద్రికను గూర్చుండ నియోగించి, తానొక సఖీరూపమును దాల్చి, ప్రక్కన నడచుచు మేరుశృంగములపైఁ గూర్చున్న సింగపుఁగొదమలఁ బోలి యున్న రాజకుమారులను సువర్ణమంచనికాయములపైఁ జూపి యుల్లేఖించుచు, వారివారి శౌర్యధైర్యగాంభీర్యాదిసద్గుణము లను విశదపరచుచు నొక్కరొక్కరినిగా, పుష్కరద్వీపాధిపతిని, శాకద్వీపాధిపతిని, కుశద్వీపభూవరుని, శాల్మలిద్వీపనాయ కుని, ప్లక్షద్వీపాధిపతిని, జంబూద్వీపభూపాలలోకంబునందు గౌడదేశాధీశుని, మథురానాయకుని, కాశీరాజును, కర్ణాటభూప తిని, అంగదేశపురాజును, కేరళమహీపతిని, దహళభూపాలును, భోటరాజును, సింధుదేశాధిపతిని, కుకురుదేశాధిపతిని జూపి వరింపుమనఁగా, జంద్రిక వారియెడ నౌదాసీన్యంబును, నలక్ష్యభావంబును, ననాసక్తిని వెల్లడింపఁగా గౌరి యాకనకగౌరిని ముందునకుఁ దీసికొని వెళ్ళి రాజసభామధ్యమున నక్షత్రనికరాంతర ద్యోతమానుండగు సుధాకరునిఁ బోలియున్న సుచంద్ర మనుజేంద్రునిఁ జూపి, తదీయచిత్త మాతనియం దనురక్తమైయుండుట నెఱింగి యిట్లనియె. “లలనా! రవిప్రభావిరాజమానుఁడగు ఈ విశాలారాజధానీప్రభువును సుచంద్రునిఁ జూడుము. నీకరాబ్జములందున్న ప్రసూనమాల యాతనివక్షస్థలముపై విష్ణువక్షము నందు వైజయంతీమాలవలెఁ బ్రకాశించునుగాక. ఈసుచంద్రధరణీపతి శాతశరములచేత రాక్షసరక్తము అర్ఘ్యముగాను, ఆదాన వుల యేనుఁగుల తలలోని మణులు సుమాంజలిగాను, వారి యాతపత్రము లారతులుగాను జేయుచు తమిస్రాసురుని రణ చండికి బలిగా నొసంగి, మునుల యాశీస్సులను బడసిన మహావీరుఁడు. ఇతఁడు సకలనుత్యకళాశాలి, సౌరవంశమౌళి. బింబోష్ఠీ! విలంబమును మాని యితనిని వరింపు మనఁగా తన్మనోనాయకసంవరణ సముద్వేగ వలమానమానసయై తదనుజ్ఞ చేత నతఁడున్న కాంచనమంచక మెక్కి మంజుల మంగళపుష్పదామమును సుచంద్రునికంఠమున వైచెను. దమయంతి నలుని వరించినతీరున నున్న యా చంద్రికాసుచంద్రులను జూచి సూర్యచంద్రవంశ్యరాజు లందఱును సంతసించిరి. దేవతలు పుష్పవర్ష మును గురిపించిరి. తాపసాధిపులు దీవించిరి. దేవాంగనలు నృత్యముఁ జేసిరి. క్షణదోదయుఁ డానందించెను. పార్వతి తన నిజ రూపమును ధరించి సుచంద్రునికి భువనేశ్వరీమహామంత్రము నుపదేశించెను. సిద్ధసంకల్పుఁడై సుచంద్రుఁడు తన శిబిరమున కేగెను. పాంచాలవల్లభుఁడగు క్షణదోదయుఁడు సుచంద్రుఁడు చంద్రికను బెండ్లియాడఁ దగిన శుభలగ్నమును నిర్ణయింపఁజేసి ధన్యమ్మనుఁ డాయెను. పురము నలంకరించుటకు శిల్పుల నాదేశించెను. వారు నగరము నంతటిని రమణీయముగా నొన ర్చిరి. మంగళవాద్యములు భూనభోంతరాళములందు మ్రోగుట కారంభించెను. ముత్తైదువులు గౌరీకల్యాణములు పాడిరి. చంద్రికకు మంగళస్నానమును రత్నపీఠిపై నుంచి “శోభానేశోభనమే” యని పాడుచు నిర్వర్తించిరి. సుంకులు చల్లిరి.స్నానము చేయించిరి. జడ యల్లి, మొగమున చంద్రరేఖబొట్టును దీర్చి, గంధము పూసి, కంకణాద్యలంకారములు పెట్టి, మకరికాదిపత్ర రచనలు చేసి, వజ్రమాలిక వేసి అలంకరించిరి. పెండ్లికూతురును చేయుటలో శచీదేవి, స్వాహాదేవి, యమభార్య, నిరృతిభార్య, వరుణదేవుని భార్య, వాయుపత్ని, కుబేరపత్ని, పార్వతీదేవి మొదలగువారు తమతమ యంతస్తులకుఁ దగిన యాభరణము లూన్చి సహకరించిరి. అంతకు ముందే బంధు, వయస్య, దండనాథముఖ్యులు సుచంద్రునిఁ బెండ్లికొడుకును గావించుటకు తరుణులను బంపఁగా వారు మంగళవాద్యనినాదములతో, ముత్తైదువుల పాటలతో స్నానము చేయించి, తల దువ్వి, సకలాలం కారములు గైసేసి పెండ్లికొడుకును చేసిరి. ఇంద్రుఁడు ముత్యాలయంటు జోళ్ళను, అగ్ని ముత్యాలహారమును, యముఁడు మణీ హంసకమును, నిరృతి రత్నాలపతకమును, వరుణుఁడు ముత్యాలబాసికమును, వాయుదేవుఁడు కెంపులయుంగరమును, కుబేరుఁడు రవ్వలభుజకీర్తిని, ఈశానుఁడు కనకాంబరమును బంపఁగా నా యాభరణములన్నిఁటిని సుచంద్రున కలంకరించిరి. పెండ్లికొడుకై వచ్చు నతని భద్రగజముపై నధిరోహింపఁజేసి వాద్యవిశేషములతోఁ దీసికొని వచ్చుచుండఁగా నగరనారీమణులు తమ తమ మేడలపై నెక్కి యానందముతోఁ గాంచుచు ముత్యాలసేసలు చల్లిరి. అట్లు వచ్చిన సుచంద్రునిఁ గనకపీఠముపైఁ గూర్చుం డఁ బెట్టి పాదములు గడిగి, మధుపర్కము నొసంగి, తెరచాటునకు చంద్రికను దెచ్చి, కన్యావరణముఁ జెప్పి, ధవళ ములు పాడి, క్షణదోదయుఁడు సమంత్రకముగాఁ గన్యాదానముఁ జేసెను. పిమ్మట వధూవరులు జీరకగుడములను లగ్నసమ యమున పరస్పరశిరంబులం దుంచుకొనుట, వరుఁడు ‘మాగల్యం తంతునానేన’ అను మంత్రపూర్వకముగాఁ దాళిబొట్టును గట్టుట, తలంబ్రాలు బోసికొనుట, కాడినిఁ దెచ్చి కపిలావాచనము చేయుట, కంకణధారణముఁ జేయుట, లాజహోమము నెర వేర్చుట, సన్నెకల్లును ద్రొక్కించుట, ఆశీర్వచన మంగళహారతులను గొనుట, దేవతాగృహప్రవేశసమయమున వధూవరుల నామధేయములను జెప్పించుట మొదలయిన వివాహప్రక్రియలను సమంత్రకముగా సంప్రదాయప్రకారముగా నాలుగురోజులు జరుపఁగా చంద్రికాసహితుఁడై సుచంద్రుఁడు మిక్కిలి యానందించెను. ఇట్లు వేదవిధానమును బ్రాహ్మణులు దెలిపి శేషహోమాం తము మంగళాచరణము లన్నియుఁ దీర్చి యాశీర్వదించిరి.
బంధువులు, నానాదేశరాణ్మణులు, హితులు, మంత్రులు నాసుచంద్రునికి రత్నములను, ఆభరణములను, పైఁడివల్వలను కట్నములుగా నొసంగిరి. పాంచాలభర్త యల్లునికి భద్రవారణశతములను, హయకులములను, ఉజ్జ్వలరథములను, దాసదాసీ జనములను, వజ్రవైడూర్యాదిమణులను, మణిచాపమును, బాణసముదాయమును, ఖడ్గమును, ముద్గరము మున్నగు నాయుధ ములను ఇచ్చి, పుత్రికకు పురశతములను పసుపుఁగుంకుమకై యిచ్చెను. రతనాలసొమ్ములు, జల్తారుచీరలు, క్రొత్తకస్తురివీణ,
చామీకరపేటికోత్కరములు మొదలయిన వాని నెన్నింటినో యిచ్చెను. బ్రాహ్మణపురంధ్రులు, దిక్పాలవనితలు పెండ్లికూఁతును దీవించిరి. పార్వతి, తనమహిమచేత చంద్రికకు నిత్యాంగరాగము, చేయని సింగారము, వాడనివిరి , పాయని తారుణ్యము, వీడని సొంపుపెంపును గలిగియుండునట్లు దీవించెను. అంతేకాక ప్రేయసీప్రియుల పొలయలుకలను భావికాలమునఁ దీర్పఁగల చిలుకను, సకలఋతువులందును వికసించి పరిమళము గురియు నొక పువ్వును, కోరిక లిచ్చుచు దేవకాంతలను మించు చక్క దనమును గూర్చు నొక రత్నమాలికను సైత మిచ్చి, కౌఁగిలించుకొని యాశీర్వదించి, కైలాసమున కేగెను. పెండ్లికి వచ్చినవా రందఱును బహుమానము లందుకొని వెళ్ళిపోయిరి.
క్షణదోదయుఁడు చంద్రిక నత్తవారింటికిఁ బంపువాఁడై కౌఁగిటఁజేర్చి, కన్నీరు గార్చుచు, “తల్లీ! పుట్టినయింటికిని మెట్టిన యింటికిని శుభకీర్తులు వచ్చునట్లు మెలఁగుము. ఈనారి వంశధర్మనిరూఢిని గాపాడినది. ఈశ్యామ గురుతరులకు వన్నెఁ గూర్చినది. ఈపద్మిని యినోదయమున కానందించును. ఈకొమ్మ ద్విజరాజులను బోషించును. అని జగము మెచ్చ నడుచు వనితజీవనమే జీవనమని యెంచుమమ్మ!” అనఁగా, తల్లి చేరఁదీసి కన్నుల నశ్రులు రాల్చుచు “లతాంగీ! చంద్రశేఖరుఁడు శైలేంద్ర తనూజ యంతటి దానిని అర్ధాంగీకారముగా నుంచినాఁడు. కనుక భర్త చిన్నచూపుఁ జూచినను సమయానుకూలముగా వర్తిం పుము. భర్త యత్యధికప్రేమను జూపినను నీవు వినయముతోనే యుండుము. భర్తతోఁ గలిసిమెలసి యుండుము” – అని బుజ్జ గించి పంపఁగా సుచంద్రుఁడు చంద్రికాయుతముగా సువర్ణమయరథము నెక్కి స్వనగరముఁ జేరఁబోయెను. పౌరాంగనలు సౌధ ములపై బారులు దీరి కంకణఝణత్కారములు మొరయఁగా వధూవరులపైఁ బుష్పాంజలులు చల్లి యానందించిరి.
పిమ్మట ఇంద్రనీలమణిస్తంభములతోను, రవ్వలబోదెలు, తామరల రత్నాల కుక్షి, పన్నీటియంత్రములు, బంగరు బొమ్మల చేతులలో నుంచబడిన వట్టివేరుల సురటీలు మొదలగు వైభవములు గల క్రీడాగృహమునందు, రతిరహస్యశృంగార కళలకు నిలయమైన కుసుమతల్పమున లజ్జాభరావనతవదనయైన చంద్రికను జేర్చి, చెక్కిలిపై నఖక్షతములు బడనీక, గుబ్బల కధికసమ్మర్దము నీయక, అధరోష్ఠపానమున దంతక్షతముల చిహ్నములు లేకుండునట్లుగ, తనూలత కధికశ్రమము గలుగనీయక, సుమశస్త్రశాస్త్రరహస్యతత్త్వము నెఱిఁగిన సుచంద్రుఁడు చంద్రికకు అతనుశాస్త్రస్వరూపముల నెఱుకపరచుచు, నద్వయ భావనాయత్తవృత్తి యేర్పడునట్లు ప్రియసాయుజ్యసుఖమును గలిగించెను. అట్లు వారు, హర్మ్యప్రదేశములందును, శైలకంద రాస్థలులందును, ప్రకృతిసౌభాగ్యములఁ గనుచు, లక్ష్మీనారాయణులు, భవానీశంకరులు, శచీపురందరులు, ఛాయా సూర్యులు సకలకాలముల సుఖించినట్లు నిరంతర మిష్టోపభోగములఁ దేలుచు సుఖముండిరి. అట్లు చంద్రికాయుక్తుఁడై దేశప్రజ లను బాలించు సుచంద్రుని రాజ్యమునందు దుర్మార్గులు నశించిరి. దుష్టులసంపదలు నశించెను. దారిద్ర్యము తొలఁగిపోయెను. శత్రుబాధ దూరమయ్యెను. ధర్మము, నీతియు వృద్ధిఁజెందెను. అవినీతి నశించెను. ప్రజలు శుభకార్యములతో సంతోషముతో నాయుర్భాగ్యములతో నుండిరి.
ఇది చంద్రికాపరిణయ కథాసంగ్రహము.