చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2

[మొదటి భాగం]

చిన్నయ సూరి, మెకాలే (Macauley)

చిన్నయ సూరి బాలవ్యాకరణం 1858లో అచ్చవడమే మొదలుగా ప్రతులు బాగా అమ్ముడుపోయాయని అంకెల వల్ల తెలుస్తోంది. 1900నాటికి అది 17ముద్రణలు పొందింది[1]1900 నాటికి బాలవ్యాకరణం 17 సార్లు అచ్చయ్యింది. 1900 తరువాత దీని ప్రాచుర్యం బాగా పెరిగిందని నిడదవోలు వెంకటరావు అభిప్రాయ పడ్డారు. 1911 తరువాత వావిళ్ళ వారు బాలవ్యాకరణాన్ని తరచుగా ప్రచురించారు. తొలి ముద్రణలకు సంబంధించిన మరిన్ని వివరాలు నిడదవోలు వెంకటరావు, చిన్నయ సూరి జీవితచరిత్ర-రచనలు (సాహిత్యోపన్యాసములు, 1962) అన్న వ్యాసంలో చూడవచ్చు.. ఈ పుస్తకం ఇంత ప్రచారంలోకి రావడానికి కారణం తెలుగు పాఠాలు చెప్పే పండితులా, లేకపోతే ఈ పుస్తకమే వాడాలని స్కూల్ బుక్ సొసైటీ వారి ఉత్తరువా అన్న సంగతి స్పష్టంగా చెప్పడానికి కావలిసిన సమాచారం మన దగ్గర లేదు. కానీ తెలుగు వ్యాకరణాలు అమ్ముడు పోయేవి అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు దొరుకుతున్నాయి. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు 1916లో ప్రచురించిన తా. వెంకయ్య రాసిన ఆంధ్ర వ్యాకరణము మూడవ ముద్రణ అయిదువేల కాపీలు వేశారని మొదటి అట్టమీద ఉంది. ఈ పుస్తకం వాడాలని స్కూల్ బుక్ సొసైటీ వాళ్ళు చెప్పే అవకాశం లేదు. అలాగే ఎవరు రాసినా 1830-1930 మధ్యకాలంలో వ్యాకరణం పుస్తకాలు పలు ముద్రణలు పొందాయి. అంచేత పిల్లలకి తెలుగు చెప్పవలసిన అవసరమూ, ఆ తెలుగు చెప్పడానికి వ్యాకరణం కావాలని ఒక అభిప్రాయమూ వున్నాయి కాబట్టి ఈ వ్యాకరణాలు ఇంత బాగా అమ్ముడు పోయాయని అనుకోవాలి[2]జోళెపాళయం మంగమ్మగారి The Rate Schools of Godavari (1973) అన్న గ్రంథంలో 1871-72 సంవత్సరంలో గోదావరి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో వాడిన పుస్తకాల గురించిన సమాచారం ఉంది. వ్యాకరణ పుస్తకాల జాబితాలో 20 బడుల్లో వెంకయ్య వ్యాకరణం, 2 చోట్ల ఉదయగిరి శేషయ్య వ్యాకరణం, 44 బడుల్లో చిన్నయ సూరి రాసిన విభక్తి బోధిని వాడబడ్డాయి. వచన పుస్తకాలుగా 107 బడుల్లో బాలశిక్ష, నాలుగు చోట్ల పెద్దబాలశిక్ష, 121 బడుల్లో నీతిసంగ్రహము చదివేవారని తెలుస్తోంది. మరిన్ని వివరాలకి చూ. Appendix F – List of books used in the primary schools (Telugu) in 1871-72, page 93.. చిన్నయ సూరి బాలవ్యాకరణం కూడా ఈ కారణం చేతనే బాగా అమ్ముడు పోయి వుంటుంది. అది అమ్ముడుపోడానికి స్కూల్ బుక్ సొసైటీ వాళ్ళ తాఖీదు ఒక కారణం కాని అదే కారణమని మనం అనుకోనక్కరలేదు[3]

ఆరుద్ర గారు తమ సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో: “చిన్నయ సూరి గ్రంథానికి వ్యాఖ్య రాయించాలని గాజుల లక్ష్మీ నరసు శెట్టి గారు ప్రయత్నించారుగాని ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. … ఇరవయ్యో శతాబ్దంలో వ్యాఖ్యానాలు వెలువడ్డాక గాని బాల వ్యాకరణం రాజ్యమేలడం ప్రారంభించలేదు. పందొమ్మిదో శతాబ్దం ద్వితీయార్థంలో శేషయ్య వ్యాకరణం, వెంకయ్య వ్యాకరణం వంటివే పఠన పాఠనాదులలో ప్రసిద్ధాలు.” అన్నారు. ఈ వివరాలు ఆయన ఎక్కడ సేకరించినది మనకి చెప్పలేదు. (చిన్నయ సూరి పెద్దరికం; స.ఆం.సా; సంపుటం 10, 1990, పేజి 36) నిడదవోలు వెంకటరావుగారు పైన చెప్పిన వ్యాసంలోనే (1962) 1887 నాటికి బాలవ్యాకరణం 8 ముద్రణలు పొందితే శేషయ్య వ్యాకరణం, వెంకయ్య వ్యాకరణం 10-12 ముద్రణలుపొందాయని చెప్పారు.

ఉదయగిరి శేషయ్య రాసిన “తెలుగు వ్యాకరణము” (1857) 19వ శతాబ్దం రెండవ భాగంలో వచ్చిన వ్యాకరణాల కంటే చాలా భిన్నమయింది. దీనిలో భాష సరళంగాను, పుస్తకం అచ్చు వేసిన తీరు కంటికి చాలా సొంపుగాను ఉంటుంది. తక్కిన వ్యాకరణ పుస్తకాల రచయితలతో పోలిస్తే శేషయ్య పెద్ద హోదాలో పని చేయలేదు.
.

చిన్నయ సూరి పుస్తకం బాగా వాడుకలోకి రావడానికి రెండవ కారణం పండితుల ఆదరణ. తా. వెంకయ్య పేరుతో వున్న వ్యాకరణానికి[4]“శేషయ్య వ్యాకరణం ఇప్పుడెక్కడా కనపడడం లేదు. అది వెంకయ్య వ్యాకరణానికి బదులుగా బయలుదేరింది. వీరభద్ర పళ్ళేనికి హనుమత్పళ్ళెం వంటిది. శేషయ్య అనే ఆయన వ్రాశారని తోస్తుంది. వెంకయ్య వ్యాకరణం మాత్రం వెంకయ్య వేయించిందిగాని రచించిందికాదు. అయితే ఆయన పేరుతో వ్యవహరించడం “పుణ్యైర్యశోలభ్యతే” అనే అభిప్రాయానికి ఉదాహరణం అనుకోవాలి. నన్నయభట్టీయం సూత్రాలకు బాలసరస్వతి వ్రాసిన టీకను విడదీసి తాడినాడ వెంకయ్యగారు అచ్చువేయించినారు. ఇప్పటికీ ఆ పేరుతోనే వ్యవహరింపబడుతూ ఉంది.” (చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, కథలు గాథలు, ఫ్రథమ భాగం, పేజి 405). చిన్నయ సూరి వ్యాకరణానికి భాష విషయంలో తేడా లేదు. రెండూ వ్యాకరణ మర్యాదలకి లోబడిన భాషనే ప్రమాణీకరిస్తున్నాయి. మాట్లాడుకునేప్పుడు వాడే భాషను తా. వెంకయ్య గ్రహించలేదు. అంతే కాదు, అప్పటికి రాసిన అన్ని వ్యాకరణాలు ఒకే రకమైన భాషకి నియమాలు చెప్తున్నాయి. ఉదాహరణకి బాలవ్యాకరణం కంటే ముందు వచ్చిన వేదం పట్టాభిరామశాస్త్రి రాసిన ఆంధ్ర వ్యాకరణము (1810ల నాటి రాతప్రతి, మొదటి ముద్రణ 1951); రావిపాటి గురుమూర్తిశాస్త్రి రాసిన తెనుఁగు వ్యాకరణము (1836, పునఃప్రచురణ 1951); పుదూరి సీతారామశాస్త్రి రాసిన ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము (1834, 1852, 1859); వేదం వేంకటరమణశాస్త్రి రాసిన తెనుగు లఘువ్యాకరణము (1856); ఇవన్నీ ఒక రకమైన భాషకే వర్తించే వ్యాకరణాలు. వ్యాకరణం అంటే అప్పటి వాళ్ళందరికి ఒక రకమైన భాషే మనసుల్లోకి వచ్చింది. ఇది లాక్షణిక భాష. ఇది కాక ఆ కాలం నాడే అచ్చయి చదువుకున్న వాళ్ళ చేతిలో ప్రచారంలోకి వచ్చిన పుస్తకాలు–ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర, ఎర్రమల్లి మల్లికార్జునుడి చార్ దర్వీషు కథలు (1876), రావిపాటి గురుమూర్తి శాస్త్రి విక్రమార్క కథలు (1819) ఇలాంటివి. వీటిలో వున్న భాష వ్యాకరణాలలో ఉన్న భాష కాదు. ఇది నేర్పక్కరలేకుండానే వచ్చే భాష. దీనికి వ్యాకరణ గ్రంథాలలో గ్రామ్యము అని పేరు.

సరిగ్గా ఆ రోజుల్లో కుంఫిణీ ప్రభుత్వం వాళ్ళు మెకాలేస్ మినిట్ (Macaulay’s minute) అనే పేరుతో వున్న అభిప్రాయం ఆధారంగా పరిపాలన అంతా ఇంగ్లీషులో మొదలుపెట్టారు. తెలుగుకి ప్రభుత్వ ఆదరణ తగ్గిపోయింది. అయినా స్కూళ్ళలో తెలుగు పండితులు తెలుగు పాఠాలు చెప్పేటప్పుడు ఈ వ్యాకరణాలే అనుసరించారు. చిన్నయ సూరి వచ్చిన తరవాత ఆయన వ్యాకరణమే పండితులందరికీ ఆమోదయోగ్యమయింది. అప్పటి రోజుల్లో చిన్నయ సూరికి అధికార వర్గాలలో మంచి పేరే వుండేది. ఒక వంక అర్బత్ నాట్ లాంటి తెల్ల దొరలు, గాజుల లక్ష్మీనరసయ్య శ్రేష్టి, కోమలాపురం శ్రీనివాస పిళ్ళే వంటి ధనవంతులైన అబ్రాహ్మణులు చిన్నయ సూరికి దన్నుగా వుండేవాళ్ళు. పాండిత్య ప్రపంచంలో మద్రాసులో బ్రాహ్మలదే ప్రాపకం అనీ ఆ బ్రాహ్మణుల్లో స్మార్తులు, వైష్ణవులు రెండు వర్గాలుగా చీలి వుండేవారనీ ఇంతకుముందే చెప్పాం[5]చూ: ఆరుద్ర, స.ఆం.సా; సంపుటం 10, 1990, పేజి 28-29.. అటువంటి పరిస్థితులలో సాతాని కులంలో పుట్టిన అబ్రాహ్మణుడైన చిన్నయ సూరికి ఇంత ప్రాధాన్యం రావడం, అతని పుస్తకాన్ని బ్రాహ్మణ పండితులు కూడా అంగీకరించడం ఎలా జరిగిందో మనకి స్పష్టంగా తెలియదు. అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులు ఉన్నట్టుగా నిర్ణయించడానికి తగినంత విస్తృతమైన పరిశోధన ఇంతవరకూ ఎవరూ చేయలేదు.


ఈ సందర్భంలో శిష్టు కృష్ణమూర్తి కవిని గురించి చెప్పుకోవాలి. ఆయన చిన్నయ సూరికి సమకాలికుడు. ఈయన గురజాడ శ్రీరామమూర్తి లెక్క ప్రకారం 1800-1877 ప్రాంతంలో జీవించాడు. ఈయన సంస్కృతంలోను, తెలుగులోను, సంగీతంలోను గొప్ప ప్రజ్ఞ కలవాడు. పురాణం చెప్పేటప్పుడు మధ్యలో పుస్తకం మూసేసి సొంతంగా పద్యాలు ఆశువుగా చెప్తూ మళ్ళా కొంచెంసేపు తరవాత పుస్తకం తెరిచి పద్యాలు చదివేవాడని, వినేవాళ్ళకి ఆ రెండు రచనలు ఒకే రకంగా వుండేవని ఒక ప్రసిద్ధి ఉండేది. దానితో పాటు వసుచరిత్రలో పద్యాలకి ఎనిమిదేసి అర్థాలు చెప్పేవాడని ఒక వాడుక కూడా వుంది. ఈయన రకరకాల జమిందార్లను కలుసుకుని వాళ్ళందరి దగ్గరా కొన్నేసి సంవత్సరాలు జీవించాడు. ఈయన చాలా పుస్తకాలు రాశాడని పేరుంది కాని సర్వకామదా పరిణయం ఒక్క దానిని గురించే కవిజీవితములలో గురజాడ శ్రీరామమూర్తి కొద్దిగా ప్రస్తావించారు. ఆ పుస్తకంలో పిండిప్రోలు లక్ష్మణకవి చాలా తప్పులు పట్టుకున్నాడని కూడా శ్రీరామమూర్తి రాశారు. శిష్టు కృష్ణమూర్తి కవి గొప్ప వైణికుడట. ఆయన వీణావాయిద్యాన్ని గురించి చెప్పిన ఒక పెద్ద ఉత్పలమాలిక శ్రీరామమూర్తి ఉదాహరించారు[6]కవిజీవితములు – గురజాడ శ్రీరామమూర్తి (1913, 3 ed.) – పే. 447-49.. కృష్ణమూర్తి కవి పెద్దపెద్ద ఉత్పలమాలికలు ఆశువుగా రచించడంలో నేర్పరి.

కృష్ణమూర్తి కవిని గురించి ప్రచారంలో వున్న కథల్లో ఒక కథ ఇక్కడ చెప్పడం అవసరం. కృష్ణమూర్తి కవి మాడుగులలో వుండగా అక్కడి జమిందారు కొడుకు జగన్నాథుడు అనే వాడు ఒక గుర్రం మీద మోజుపడి కొందామనుకున్నాడు. కానీ అశ్వశాస్త్రవేత్తలు దాని మెడ కింద గోగు(అంటే యేమిటో మాకు తెలియదు-ర.) ఉందని, అది ఒక దోషమని చెప్పారట. అయినా ఆ కుర్రవాడు ఆ గుర్రాన్ని వదిలిపెట్టలేక కృష్ణమూర్తి కవికి కనుసన్న చేసి, ‘ఈ కవిగారు అశ్వశాస్త్రంలో చాలా పండితుడు, ఈయన దగ్గర ఉన్న పుస్తకాలలో యేముందో కనుక్కుందాం’ అని అన్నాడట. ఆ జమిందారు కృష్ణమూర్తి కవిని మీదగ్గర ఉన్న అశ్వశాస్త్రంలో యేముందో చెప్పండి అని అడిగితే కృష్ణమూర్తి కవి చూసి మీకు రేపు చెప్తాను అన్నారట. ఈ జగన్నాథుడనే అబ్బాయి కృష్ణమూర్తి కవి ఇంటికి వెళ్ళి మీరు గాని ఆ గుర్రంలో దోషమేమీలేదని చెప్పినట్లైతే మీకు బోలెడు డబ్బిస్తానని ఆశ పెట్టాడట. కృష్ణమూర్తి కవి రాత్రికిరాత్రి కొన్ని వందల శ్లోకాలతో అశ్వశాస్త్రం చెప్పారట. ఆయన మనవడు కృష్ణమూర్తి కవి దగ్గరున్న పాతతాటాకులు తీసుకుని ఆ శ్లోకాలన్నిటినీ ఆ తాటాకులమీద రాశాడట. సంస్కృతంలో నారద మహాముని ఒక మహారాజుకు చెప్పినట్లున్న ఈ శాస్త్రం జమిందారుకు చూపించి అటువంటి గుర్రానికి అటువంటి గోగు ఉండటం దోషం కాదు సరికదా దానివల్ల చాలా శుభాలే కలుగుతాయని కృష్ణమూర్తి కవి ఋజువు చేశారట. కృష్ణమూర్తి కవి ఈ పుస్తకాన్ని ఆశువుగా చెప్తునప్పుడు స్వయంగా అక్కడ ఉండి విన్న అప్పట్లో ఇరవైయేళ్ళ ఒక యువకుడి ద్వారా కవిజీవితాలు రాసిన గురజాడ శ్రీరామమూర్తి ఈ కథనంతటినీ తెలుసుకున్నారు[7]కవిజీవితములు – గురజాడ శ్రీరామమూర్తి (1913, 3 ed.) – పే. 455-56..

కాళహస్తి ఆస్థానంలో పని చేసేటప్పుడు ఒకసారి, వెంకటగిరి సంస్థానంలో మరోసారి, శిష్టు కృష్ణమూర్తి చిన్నయ సూరితో ఘర్షణ పడినట్లు వేదం వెంకటరాయశాస్త్రి మనవడి ద్వారా తెలుస్తోంది. చిన్నయ సూరి బాలవ్యాకరణం అంత శాస్త్రసమర్థంగా వుండడం, ఈ సాతాని పండితుడు బ్రాహ్మణులని తలదన్నేలా వ్యాకరణ నిర్మాణం చెయ్యడం శిష్టు కృష్ణమూర్తి కవికి నచ్చలేదు. ఈ విధంగా చిన్నయ సూరి మీద అసూయ పడిన కృష్ణమూర్తి కవి బాలవ్యాకరణం చిన్నయ సూరి స్వతంత్రంగా రాసింది కాదని, అది హరికారికలకి అనువాదమని ఒక వాదం తెచ్చిపెట్టాడు. హరికారికలు హరిభట్టు అన్న ఆయన రాశాడని అధర్వణుడు చెప్పడమే కాని నిజంగా ఆ గ్రంథం ఎవరూ చూడలేదు. చిన్నయ సూరి బాలవ్యాకరణాన్ని అనుసరించి, కృష్ణమూర్తి కవి సంస్కృతంలో ఆ గ్రంథాన్ని తానే రాసి చూపించాడు. శిష్టు కృష్ణమూర్తి చేసిన ఈ పని మంచి పని కాదని, అలాంటి ‘అసత్యవాదము చేయఁగూడదని’ వేదం వెంకటరమణశాస్త్రి హెచ్చరించారట[8]చూ. వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము (1943, మద్రాసు), పు. 9. దీనిని బట్టి చిన్నయ సూరి తన జీవితమంతా కేవలం మద్రాసులోనే గడపలేదనీ, కొన్ని తెలుగు సంస్థానాలకి కూడా వెళ్ళాడని తెలుస్తుంది. శిష్టు కృష్ణమూర్తిని గురించి, ఆయనకు చిన్నయ సూరికి మధ్య జరిగిన వివాదం గురించి మరికొన్ని వివరాలు కందుకూరి వీరేశలింగంగారి ఆంధ్రకవుల చరిత్రము – మూడవ భాగములో (1950) చూడవచ్చు..

ఈ కథ ఆ కాలంలో ఎవరు నమ్మారో తెలియదు కానీ తరవాత చాలా సంవత్సరాలకి కల్లూరి వేంకట రామశాస్త్రి తన బాలవ్యాకరణం వ్యాఖ్యానం గుప్తార్థప్రకాశికలో (1915, 1929) మాత్రం ఇది నిజమని చాలా బలంగా ప్రతిపాదించారు. వేంకటరామశాస్త్రి ప్రకటించిన గుప్తార్థప్రకాశిక టైటిల్ పేజిలోనే ఈ విషయం స్పష్టంగా వుంటుంది[9]కల్లూరి వేంకటరామశాస్త్రి; బాలవ్యాకరణ గుప్తార్థప్రకాశిక; రెండవ ముద్రణ 1929 (మొదటి ముద్రణ 1915).(బ్రహ్మశ్రీ శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి పండితవర్యప్రణీత హరికారికాంధ్రీభూత పరవస్తు చిన్నయసూరికర్తృక బాలవ్యాకరణంబునకు వ్యాఖ్యానము.)

వేంకటరామశాస్త్రి ఇలా వాదించడానికి ఒక కారణముందని అంటారు. కల్లూరి వేంకటరామశాస్త్రి తన వ్యాఖ్యానం రాస్తున్న రోజుల్లో ఆయన శిష్యుడైన సుంకర రంగయ్య అనే కుమ్మరి కులస్తుడు ఆయనకు లేఖకుడిగా పని చేశాడు. ఆ పుస్తకంలో మొదటి భాగాన్ని–కారక పరిఛ్ఛేదంలో చివరి వరకు ఉన్నదానిని– రాసి, ఆ ప్రతికి శుద్ధప్రతి తయారుచేస్తానని తీసుకెళ్ళి తన పేరుతో ఈ రంగయ్య ప్రకటించుకున్నాడు[10]సుంకర రంగయ్య పేరుతో ‘బాలవ్యాకరణ గుప్తార్థప్రకాశిక’ అన్న 176 పేజీల పుస్తకం 1908లో రాజమండ్రిలో అచ్చయ్యింది. ఈ పుస్తకం గురించి నిడదవోలు వెంకటరావు తన సాహిత్యోపన్యాసములలో (1962) ప్రస్తావించారు. ఈ పుస్తకం ప్రతి బ్రిటిష్ లైబ్రరీలో వుంది. ఈ ప్రతి 110 సంవత్సరాల తరవాత మొదటిగా తెరిచి చూసింది ఈ వ్యాస రచయితలే. రంగయ్య పుస్తకానికి రాసిన పీఠికలో వేంకటరామశాస్త్రిని, చిన్నయ సూరిని చాలా గౌరవంతో ప్రస్తావిస్తే వేంకటరామశాస్త్రి పుస్తకానికి రాసిన ముందుమాటలో రంగయ్యనీ, చిన్నయ సూరిని అంత తీవ్రంగా విమర్శించడాన్ని చూడవచ్చు. వీరిద్దరి మధ్య వివాదాలు చివరకు కోర్టులకెక్కి ఎవరెంత భాగం ప్రచురించుకోవాలో కోర్టులు నిర్ణయించాయి. ఈ కారణం చేతే రంగయ్య పుస్తకం అర్ధంతరంగా ఆగిపోతుంది. మరొక చమత్కారం ఏమంటే 1915 నాటి తొలి ముద్రణలో ప్రస్తావించబడిన ఈ కోర్టు గొడవలు 1929 నాటి రెండవ ముద్రణలో వుండవు.
 
పాత్రోచితభాషపైన జరిగిన వాదనల్లో కొక్కొండ వెంకటరత్నం, కందుకూరి వీరేశలింగం, వేదం వెంకటరాయశాస్రి, శ్రీపాద కృష్ణమూర్తి లాంటి వారు కూడా తమ ప్రత్యర్థులతో ఎంత తీవ్రంగా వ్యక్తిగత దూషణలతో తగువులు పడ్డారో తెలిసినదే.
. ఈ లోపున వేంకటరామశాస్త్రికి శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి మనవడు (తాతగారి పేరే గల ఆయన) తన తాతగారు రాసిన హరికారికల రాతప్రతిని వేంకటరామశాస్త్రికి సర్వాధికారాలతో (స్టాంపు పేపరు మీద రాసి) దానంగా ఇచ్చాడు. అది చదివిన వేంకటరామశాస్త్రికి అది బాలవ్యాకరణానికి మూలగ్రంథం అని, బాలవ్యాకరణం కేవలం దానికి అనువాదమే అనీ నమ్మకంగా అనిపించింది. రంగయ్య వంటి శూద్రుడి మీది కోపాన్ని శూద్రుడైన చిన్నయ సూరి మీదికి మళ్ళించారు వేంకటరామశాస్త్రి. అప్పట్నుంచి పండితలోకంలో చిన్నయ సూరి పట్ల అపప్రథ మొదలయింది[11]హాస్యం కూడా కొన్ని సార్లు హద్దులని మించి గిడుగు, ఆరుద్ర లాంటి వాళ్ళు కూడా చిన్నయ సూరిని గురించి తేలిగ్గా మాట్లాడటం వరకు వెళ్ళింది. ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో “[చిన్నయ సూరి] పుట్టినప్పుడే ఆ శిశువు కుడికంట్లో నల్లగుడ్డు కొంచెం స్థలంమారి ఉంది. పెద్దయ్యాక చిన్నయ్య దృక్పథం వేరవడంలో ఆశ్చర్యం లేదు” అని రాశారు (సంపుటం 10, పేజి 26) గిడుగు కూడా “ఎందునా పొందని నేటి అధ్వాన్నపు తెలుగు పరవస్తు చిన్నయసూరి గారి మూలముగా దాపరించినది. … ఆయన మాత్రము వింత తెలుగు వ్రాసేవారు” అన్నారు. (చూ. ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేజం)..

బ్రాహ్మణ పండితులు ఆ వాదాన్ని ఆధారంగా చేసుకుని చిన్నయ సూరికి నిజంగా ఏమీ రాదని అతని పేరుని చిన్న+అసూరి (చిన్న అపండితుడు) అనీ, పర-వస్తు చిత్+నయ సూరి (ఇతరుల వస్తువులు దొంగిలించుటలో పండితుడు) అని అతని గురించి హాస్యంగా అనుకునేవారట[12]దువ్వూరి వెంకటరమణశాస్త్రి; బాలవ్యాకరణ హరికారికల పౌర్వాపర్య విమర్శనము; ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక; సంపుటం 15, సంచిక 5-6; 1927; పే. 32-70..

దువ్వూరి వెంకటరమణశాస్త్రి ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికలో కల్లూరి వేంకటరామశాస్త్రి వాదాన్ని ఖండిస్తూ,ఒక పెద్ద వ్యాసం ప్రకటించి, రమణీయం అన్న పేరుతో రాసిన తన బాలవ్యాకరణంలో ఈ అపప్రప్రథలనన్నింటినీ ఖండించి చిన్నయ సూరి పాండిత్యాన్ని, అతని భాషా సౌందర్యాన్ని, అతని మౌలికతని బలంగా సమర్థించేదాకా చిన్నయ సూరి పేరు కళంకరహితంగా పండితలోకంలో స్థిరపడలేదు[13]ఆంధ్ర కవుల చరిత్రము; కందుకూరి వీరేశలింగం; విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్; 2005, పే. 962-63..


రామాయణంలో పిడకల వేటలాగా వచ్చిన ఈ కథలు ఇలా ఉండగా, ప్రభుత్వాదరణ అంతగా లేకపోయినా స్కూళ్ళలో తెలుగు చెప్పడం కొనసాగింది. పంతొమ్మిదవ శతాబ్దం మొదటి భాగంలో చెన్నపట్నంలో మూడు ఉన్నత పాఠశాలలు ఉండేవి. అప్పటికి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడలేదు. అంటే ఇవే ఉన్నతమైన విద్యాసంస్థలు. వాటిలో ప్రతిష్ఠాత్మకమైనది ప్రెసిడెన్సీ లేక బోర్డు హైస్కూలు. దీనిలో ఎక్కువ భాగం తెల్లవాళ్ళే చదువుకునేవారు, కాని 1840 ప్రాంతం తరువాత భారతీయుల్ని కూడా చేర్చుకున్నారు. రెండవది చెన్నపట్నంలోని ప్రముఖ హిందువులు స్థాపించిన పచ్చయప్ప హైస్కూలు. మూడవది కేవలం క్రైస్తవ మిషనరీల కోసం యేర్పరచిన (ఆప్టన్) మిషనరీ హైస్కూలు. చిన్నయ సూరి ఈ మూడు సంస్థల్లోను పనిచేశారు. 1836-37 ప్రాంతాల్లో చిన్న జీతంతో మిషనరీ హైస్కూలులో ఉద్యోగాన్ని ప్రారంభించి తన పాండిత్యంతో నగరంలో పేరు ప్రఖ్యాతులు గడించిన తరువాత 1844లో పచ్చయప్ప హైస్కూలులో తెలుగు పండితుడి స్థానానికి, మూడేళ్ళ తరువాత 1847లో ప్రెసిడెన్సీ హైస్కూలులో ప్రధాన తెలుగు పండితుడి స్థానానికి ఎదిగారు. మద్రాసులో యూనివర్సిటీ ఏర్పడినప్పుడు అక్కడి తెలుగు పండిత స్థానానికి కూడా చిన్నయ సూరే ఎంపిక చేయబడ్డారు (1857-1861). అంటే చిన్నయ సూరి ఉద్యోగం ఆ రోజుల్లో తెలుగుకి గొప్ప ఉద్యోగం. ఇక మిగిలిన తెలుగు ఉద్యోగాలు చాలా చిన్నవి. వాటికి చెప్పుకోదగ్గ గౌరవం కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చెప్పుకోదగ్గ స్థాయిలో వుండడం, 1853 తరువాత చిన్నయ సూరి పుస్తకాలు బాగా అమ్ముడు పోవడం (నీతిచంద్రిక-1853, బాలవ్యాకరణం-1858), కారణంగా చిన్నయ సూరి సుఖంగానే జీవించారు.

ఇది ఇలా వుండగా ప్రధానమైన రాజకీయ భాష ఇంగ్లీషే అయింది. అంచేత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారందరూ ఇంగ్లీషే నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషులోనే ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. ఆరోజుల్లో వాళ్ళు ఆఖరికి వాళ్ళ ఉత్తరాలు, డైరీలు కూడా ఇంగ్లీషులోనే రాసేవారు. విద్యావంతుల్లో తెలుగు నీరసించడం మొదలయ్యింది[14]వెన్నెలకంటి సుబ్బారావు 1820లో మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ వారికి ఇచ్చిన నివేదకలో ఇంగ్లీషు చదువులపై పెరుగుతున్న ఆసక్తిని గురించిన చెప్పిన మాటలు గమనించదగ్గవి. సుబ్బారావు ప్రకారం 1820 నాటికే మద్రాసులోని మౌంట్‌రోడ్డు పైన సుమారు ఐదు వందల ఇంగ్లీషు నేర్పే (“…best training in English…”) బళ్ళు ఉన్నాయి. (చూ: పేజి 67-68; V. Venkata Gopal Row (ed.); The Life of Vennelacunty Soob Row (Native of Ongole); Translator of the Late Sudr Court; Madras, from 1815 to 1829 (As Written by Himself) (Madras, 1873). అలాగే 1836-39 మధ్య కాలంలో రాజమండ్రి ప్రాంతంలో వున్న ఒక కలెక్టర్ భార్య రాసిన ఉత్తరాలలో కూడా మరిన్ని వివరాలు చూడవచ్చు: పేజి 16-25, 56-60 Julia C Maitland; Letters from Madras: During the Years 1836-1839; 1846. ఇంగ్లీషు భాష పైన ఒక వైపు మోజు పెరుగుతుంటే మరొక పక్క సంస్కృత పండితులకి ‘తెలుగు ఒక సభ్యభాష కాదు.’20వ శతాబ్దపు తొలి దశాబ్దాల్లో కూడా ఇలాంటి భావాలు ఎంత బలంగా వుండేవో చూడాలంటే దేవులపల్లి రామానుజరావు (తెలంగాణాలో జాతీయోద్యమాలు, 1964, పేజి 63), దువ్వూరి వెంకటరమణశాస్త్రి (స్వీయచరిత్ర, 1976, పేజి 46), శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిల (అనుభవాలూ-జ్ఞాపకాలూను, మొదటి సంపుటం, 1955, పేజి 216-17) జ్ఞాపకాలు చదివితే తెలుస్తుంది. అక్కిరాజు ఉమాకాన్తంగారు కూడా “తెలుగు యెప్పుడుగాని ఉత్తమ విద్యాద్వారంగా వుండలేదు. నన్నయ కాలంనుండి మదరాసు విశ్వవిద్యాలయం వచ్చేవరకు విజ్ఞానప్రదమైన ఉత్తమవిద్య అంతా సంస్కృతంద్వారానే విద్యాపీఠాల్లో అభ్యస్తమౌతూ వుండేది. మద్రాసువిశ్వవిద్యాలయం వచ్చినతరువాత మనలో అనేకులు ఇంగ్లీషు ద్వారా ఉత్తమ విద్య అభ్యసిస్తున్నారు. కనుక ప్రాచీనకాలంలోగాని యిప్పుడుగాని తెలుగు ఉత్తమవిద్యాద్వారంగావుండే ఉదాత్తప్రతిపత్తి పొందలేదు.” అన్నారు (శ్రీనాథభట్టకృతి పల్నాటి వీర చరిత్ర – పాఠనిర్ణేతృరచితమైన ద్వితీయభూమిక, గుత్తికొండ, 1955, పేజి 12). బాగా చదువుకున్నవాళ్ళు, అంటే లాయర్లు, పెద్ద పెద్ద రెవెన్యూ ఉద్యోగస్తులు గొప్ప కోసం మాకు తెలుగు రాదని చెప్పుకోవడం మర్యాదయింది.

ఒక పక్క విద్యారంగంలో తెలుగు బలహీనపడుతూండగా, ఇంకొక పక్క అచ్చుయంత్రం వాడుకలోకి రావడం మొదలయింది. తెలుగు పుస్తకాలు అచ్చులోకి వస్తున్నాయి. తెలుగు, సాహిత్యేతర వ్యవహారాలకోసం–అంటే, రాజకీయ, లౌకిక వ్యవహారాలకు–వచన రూపంలో అభివృద్ధి కావలసిన అవసరం వుందని చిన్నయ సూరి గమనించారు. ఈ భాష ఆధునిక వ్యవహారాలకి ఒక నియతమైన రూపంలో యేర్పడాలని ఆయన అభిమతం. తెలుగు పదాల వర్ణక్రమం ఎవరి అవసరాలకి సామర్థ్యానికి తగినట్టుగా వారు రకరకాల పద్ధతుల్లో రాస్తున్నారు. ఈ వర్ణక్రమాన్ని ఒక దారిలో పెడితే తప్ప తెలుగు పదాలకి ఒక స్థిరత్వం యేర్పడదు. ఇటు పండితులు రాసే వ్యాఖ్యానాలలోను, అటు పండితులు అయిన వాళ్ళు, కాని వాళ్ళు పాడే పాటల్లోను, ఆ కాలంలో ప్రకటింపబడ్డ శాసనాల్లోను రకరకాల వర్ణక్రమాలు వున్నాయని గుర్తించి వాటిని ఒక స్థిరమైన రూపంలో ఆధునీకరించ తలపెట్టిన వ్యక్తి చిన్నయ సూరి. అందుకని మొదటిసారిగా తెలుగు భాషలో వచనం రాయడానికి అనువైన, సలక్షణమైన భాషని సూత్రబద్ధంగా నిర్మించారు. దానితోపాటు తెలుగుని ఒకవంక అందమైన భాష గాను, ఇంకొకవంక అందం కోసం కాకుండా కేవలం వ్యవహార అవసరాలకి తగిన భాష గానూ రూపొందించి చూపించాలి. ఇంత పెద్ద ఊహ మనసులో పెట్టుకుని ఒక పక్క వ్యాకరణము, ఇంకొక పక్క నీతి చంద్రికలో మొదటి రెండు భాగాలు, కేవలం లౌకిక వ్యవహారానికి పనికొచ్చే హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము సూరి ప్రకటించారు.

కానీ 1862లో చిన్నయ సూరి అకాల మరణం తరవాత ఆయన దృక్పథానికి కొనసాగింపు లేకపోయింది సరికదా దానికి వక్రీకరణలు ఆరంభమయ్యాయి. ఆ తరవాత చిన్నయ సూరి మిత్రలాభం, మిత్రభేదంలో వున్న వచనాన్ని అనుసరిస్తున్నామనుకొని ‘బండరాళ్ళ లాంటి శుష్క వచనం’ రాసిన వీరేశలింగం పంతులు[15]చూ. §163 Appa Rao G.V; The Minute of Dissent to the Report of the Telugu composition sub-committee; Vavilla; Madras; 1914., కొక్కొండ వెంకటరత్నం పంతులు ఆ వచనాన్ని పాఠశాలలో విద్యార్థులపై బలవంతంగా రుద్ది, తెలుగు భాష అలాగే రాయబడాలని మార్గ నిర్దేశం చేశారే తప్ప చిన్నయ సూరి ఉద్దేశాన్ని సరిగా బోధపరుచుకోలేదు. చిన్నయ సూరికి భాషా సౌందర్యం పట్ల ఉన్న సామర్థ్యాన్ని కూడా వాళ్ళు గుర్తించలేదు. చిన్నయ సూరే హిందూ ధర్మశాస్త్ర సంగ్రహంలో ఎంత సులభమైన, స్పష్టమయిన వచనం రాశాడో ఎవ్వరూ మాట వరసకు కూడా అనలేదు. ఆ పుస్తకం ప్రతులు ఎవరికీ అందుబాటులోకి కూడా వచ్చినట్లు లేదు. దాన్ని తను రాసిన చిన్నయ సూరి జీవిత చరిత్రకి అనుబంధంగా ప్రకటించిన నిడదవోలు వెంకటరావు హిందూ ధర్మశాస్త్ర సంగ్రహాన్ని లండనులో బ్రిటిష్ లైబ్రరీ నుంచి ఫోటోకాపీ తెప్పించుకున్నామని చెప్పారు[16]చూ. అనుబంధము; హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము – గ్రంథ ప్రకాశక విజ్ఞప్తి, పేజి 6 (నిడుదవోలు వేంకటరావు; చిన్నయ సూరి జీవితము; రెండవ ముద్రణ; మద్రాసు, 1962) ఈ అనువాదానికి మూలం.. దీన్ని బట్టి ఈ పుస్తకం ఎవరికీ అందుబాటులో లేదేమో అని అనుమానించడానికి ఆస్కారం వుంది. ఒక్క గురజాడ అప్పారావు మాత్రం పాఠ్యగ్రంథాలుగా వాడుతున్న నీతిచంద్రికలో చిన్నయ సూరి రాసిన మిత్రలాభం, మిత్రభేదం అందమైన వచనమని; వీరేశలింగం రాసిన భాగాలే గడ్డు వచనం, శుష్క వచనం అని గుర్తించారు.

చిన్నయసూరి మరణించిన తరవాత తెలుగు ఒక విధమైన దురవస్థలో పడింది. మెకాలే చెప్పిన మాటల ఆధారంగా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఇంగ్లీషులోనే జరిగేవి. అంచేత తెల్లదొరలు తెలుగు నేర్చుకోవలసిన అవసరం పోయింది. గ్రామ పరిపాలనలోను, రైతులనుంచి పన్నులు వసూలు చేయడానికి కావలసిన లెక్కలు రాయడంలోను తర్ఫీదు పొందిన కరణాలు వాళ్ళకలవాటయిన భాషలో ‘కరణీకపు తెలుగు’ రాస్తుండేవారు. ఈ కరణీకపు తెలుగు సర్కారు జిల్లాల్లో ఎంత విస్తృతంగా అమలులో వుందో మెకంజీ తరపున కావలి సోదరులు సంపాదించిన, కైఫీయత్తులలో వివరంగా తెలుస్తుంది[17]చూ. §158-159, §163 Appa Rao G.V; The Minute of Dissent to the Report of the Telugu composition sub-committee; Vavilla; Madras; 1914.. ఆ కైఫీయత్తుల లోని భాష నాలుగైదు భాషల్లో అవలీలగా వ్యవహరించగల కరణాలు తయారు చేసిన భాష. అప్పటికే దక్షిణాంధ్ర యుగంలో యక్షగానాల్లో చాలా పాత్రోచితమైన భాష వాడబడింది. దానితో పాటు విజ్ఞానశాస్త్ర గ్రంథాలయిన ఖడ్గలక్షణశిరోమణి వంటివి కూడా తెలుగులో వచ్చాయి. కాకపోతే ఆ పుస్తకాలు అచ్చులోకి రావడానికి దాదాపు 1940 దాకా పట్టింది. ఇవేవీ తెలియని తెలుగు పండితులకి అందుబాటులో వున్నవి తెలుగు కావ్యాలే. అందులోను మరీ ముఖ్యంగా ద్వ్యర్థికావ్యాలు, బంధకవిత్వము, చిత్రకవిత్వము పండితుల మేధాశక్తికి పదును పెట్టే జటిలమైన గ్రంథాలు ప్రచారంలో వుండేవి. నన్నయ నుంచి మొదలుపెట్టి నాటివరకు ఉన్న పుస్తకాలన్నీ పండితుల దృష్టిలో ప్రామాణిక గ్రంథాలు.

ఈ కాలంలో, తెలుగు పండితులకి ప్రభుత్వాదరణ పోయి జమిందార్ల ప్రాపకంలో మెలగవలసిన స్థితి వచ్చింది. అక్కడ సంస్కృత పండితులదే ప్రాబల్యం. సంస్కృత వ్యాకరణ సంప్రదాయంలో అంటే పాణిని, పతంజలి, భట్టోజి దీక్షితులు, అలాంటి వారితో పోటీ పడగల వ్యాకరణాలు తెలుగుకి సంస్కృతంలో కొన్ని ఉన్నాయని తెలుగు పండితులు వాదించడం మొదలుపెట్టారు. నన్నయ ఆంధ్రశబ్దచింతామణి నిజంగా నన్నయ రాసింది కాదు. కానీ అది నన్నయే రాశాడని తెలుగు పండితులు నమ్మవలసిన అవసరం వచ్చింది. చిన్నయసూరి కూడా నన్నయని పరమగౌరవంగా వాగనుశాసనులు అని వ్యవహరిస్తారు[18]9 volumes published by AP archives , Tarnaka, Hyderabad. తెలుగు కైఫీయత్.. బాలవ్యాకరణం పేరుకి బాలురకోసం రాశానని చిన్నయ సూరి చెప్పినా, అది పండితులకి పరమ ప్రామాణికం అయింది. దానిలో సూత్రరచనా నిర్మాణ దక్షత వాళ్ళని ముగ్ధుల్ని చేసింది. ముఖ్యంగా చిన్నయ సూరి వ్యాకరణం శాస్త్రబద్ధంగా కనిపించింది. అంచేత తెలుగు పండితులు ఈ వ్యాకరణాన్ని ప్రధానమైన ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు.

స్కూళ్ళలో చెప్పే తెలుగు వ్యాకరణం కూడా చిన్నయ సూరి వ్యాకరణానికి అనుకూలమైనదిగా చేసి, చిన్నయ సూరి కంటే జటిలంగా చిన్నయ సూరి వచనంలోని అందం ఏ కోశానా లేకుండా వీరేశలింగం పంతులు రాసిన సంధి, విగ్రహము అనే పంచతంత్ర భాగాలు స్కూలు పిల్లలకి పాఠ్య గ్రంథాలుగా చెప్పేవారు. లోకానికి పనికొచ్చే భాష ఇంగ్లీషు కాబట్టి ఆ ఇంగ్లీషులోనే ప్రపంచ విషయాలన్నీ విశ్వవిద్యాలయాలలో పెద్ద చదువులు చదువుకున్నవాళ్ళు రాస్తూ వుండగా తెలుగు పండితులు ఇంకా ఇంకా పాత పద్ధతుల్లోకి వెళ్ళి విద్యార్థులు రాసే తెలుగులో సున్నలు, అరసున్నలు, ఱ-లు ఉన్నాయో లేవో చూసే పనిలో పడ్డారు. జీతాలు, అవకాశాలు తక్కువయిన ప్రపంచంలో కార్పణ్యాలు కక్షలు విపరీతంగా వుంటాయి. పండితులు ఒకరి పుస్తకంలో ఒకరు దోషాలు వెతకడమే పనిగా పెట్టుకున్నారు. తిరుపతి వెంకటకవులు ఒక పక్క ధారాళంగా ఆశుకవిత్వం చెబుతూ, తమ కవిత్వంలో వ్యాకరణ దోషాలు చూపించేవాళ్ళతో అంత తీవ్రంగాను యుద్ధాలు చేస్తూ, తెలుగు సాహిత్యానికి ఒక పక్కన ప్రచారము, ఇంకోపక్క చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం లేకపోతే అది మంచి కవిత్వం కాదనే వాదనకి బలము రెండూ తెచ్చిపెట్టారు. ఆ కాలంలోనే,

కవనార్థం బుదయించితిన్ సుకవితా కార్యంబె నావృత్తి యీ
భవమద్దాన తరింతు తద్భవమ మద్భాగ్యంబు సర్వంబు మృ
త్యువు నేదాన జయించితిన్‌రుజ జయింతున్‌దానిచేన్ అట్టి నా
కవనంబున్ గురుడేమి లెక్క హరుడే కాదాడ వాదాడెదన్

లాంటి పద్యాలు వచ్చాయి.

సామినేని ముద్దునరసింహం నాయుడు

సామినేని (స్వామినీన) ముద్దునరసింహం నాయుడు హితసూచని అన్న పేరుతో 1855 నాటికే ఒక ప్రతిభావంతమైన కొత్త పుస్తకం రాశారు. ఇది 1862లో అచ్చయ్యింది.

పురాణాల్లో వాస్తవమైన సంగతులు, వాస్తవం కాని సంగతులు కలిపేసి కొన్ని చోట్ల ధర్మశాస్త్రానికి సంబంధించిన సంగతులు కొన్ని ఒకదానికొకటి భేదించియుండే నిర్ణయములు చేసి ఇష్టానుసారముగా దిద్దుబాటు చేయబడుచూ వుండటంవల్ల జీవితానికి అవసరమైన విద్యలు, శరీరారోగ్యానికి అవసరమైన సంగతులు బాగా తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల‘ ముద్దునరసింహం నాయుడు తన పుస్తకంలో అనేక వైజ్ఞానిక విషయాలు, సామాజిక విషయాలు వ్యాసాలుగా రాసి వాటికి ప్రమేయములు అని పేరు పెట్టారు. ఆయన పుస్తకంలో విద్యా ప్రమేయము, వైద్య ప్రమేయము, సువర్ణ ప్రమేయము, మనుష్యేతర జంతు సౌజ్ఞా ప్రమేయము, రక్షప్రభృతి ప్రమేయము, మంత్ర ప్రమేయము, పరోక్షాది జ్ఞాన ప్రమేయము, వివాహ ప్రమేయము అని తొమ్మిది ప్రమేయాలున్నాయి.

ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుగులో లేవని గుర్తించడంతో పాటు ముద్దునరసింహం నాయుడు అవి రచించవలసిన తెలుగు భాషాశైలిని గురించి కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. పద స్వరూపం ఎలా వుండాలో తన ఆలోచనలు చెప్తూ భాష సాధ్యమైనంత సులభంగా వుండాలని ఆయన గుర్తించారు. అరసున్నలు ఉండాలని లక్షణ గ్రంథాలలో చెప్పినా, అరసున్నలు లేకుండా తెలుగులో పదాలు వాడుకలో వున్నాయని గమనించి అరసున్నలు లేకుండా ఆయన పదాలు రాశారు. అలాగే శకటరేఫ, సాధురేఫ రెండిటికీ మధ్య ఉచ్చారణ భేదం పోయినందువల్ల ఆ తేడా పాటించవలసిన అవసరం లేదని శకటరేఫ వాడుకని ఆయన మానివేశారు. సంధులు కలపడంలో లక్షణ గ్రంథాలు చెప్పిన నియమాలు వాడుకలో లేవని సంధి నియమాలు లేకుండా తమ వాక్యాలు రాశారు.

సంఘ సంస్కారం విషయంలో ఆరోగ్యకరమైన జీవితానికి కావలసిన వైజ్ఞానిక విషయాలు తెలుగులో కావాలని చెప్తూ స్త్రీలకు విద్య కావాలని, వాళ్ళకి వ్యక్తి స్వాతంత్ర్యం కావాలని, రజస్వలానంతరమే వాళ్ళ ఇష్టాన్ని అనుసరించి వివాహం చెయ్యాలని ఎంతో ముందుచూపుతో రాసినవారు ముద్దునరసింహం నాయుడు.

తెలుగు భాష ఆధునిక కాలంలో ఆధునిక, వైజ్ఞానిక వ్యవహారానికి ఏ రూపంలో వుండాలో ఆయన స్పష్టంగా చెప్పి, తన పుస్తకంలో ఆయన వాడి చూపించారు. అందులో ఆధునిక విశ్వవిద్యాలయాల ద్వారా పాశ్చాత్య ప్రపంచం నుంచి వస్తున్న అనేక ఆలోచనలు శాస్త్ర విషయాలు తెలుగులోకి రావలసిన అవసరం వుందని, ఆ విషయాలు రాయడానికి అప్పటికి తెలుగు కావ్యాలలో వున్న భాష పనికిరాదని కూడా ఆయన గమనించారు. హితసూచనిలో మిగతా భాగాలు చూస్తే ఆయన ఉద్దేశం మనకి బాగా బోధ పడుతుంది.

తెలుగులో వచనం అనే మాట ఇప్పుడు మనం అనుకునే అర్థంలో అప్పుడు వాడుకలో లేదు. పద్యకావ్యాలలో వచన భాగాలే మనకు వచనం. దానికి గద్యం అనే పేరు కూడా ప్రబంధాలు వచ్చిన తర్వాత ఏర్పడింది. వచనంలో విషయ ప్రధానమైన పుస్తకాలూ లేవు, అలాటి పుస్తకాలని గుర్తించడానికి ఒక పేరూ లేదు. ముద్దునరసింహం నాయుడు వాటికి వాక్యగ్రంథాలు అని పేరు పెట్టారు. ఇలాంటి వాక్యగ్రంథాలు రావాలని, అందుకు అనువైన తెలుగు భాష మనం తయారు చేసుకోవాలని ఆయన ప్రతిపాదించారు. వాక్యగ్రంథాలలో,

“బాలురకు అక్షరములయొక్క జ్ఞానమిన్ను వాటిని కూర్చేశక్తిని సలక్షణముగా వచ్చేకొరకు అచ్చులు హల్లులు మొదలైన వాటి వివేకముతో ఒకపత్రిక వ్రాయించి అదిన్ని శబ్దశబ్దార్థముల యొక్క జ్ఞానము వారికి కలుగడమునకు ఏయేదేశ భాషలయందు వాడికలోనుండే పదములలో వారుచ్చరించడమునకు అనుకూలముగానున్ను అర్థావగాహన చేసుకోవడమునకు జురూరుగానున్ను ఉండే పదములు ఏర్పరచి వర్గులుగానున్ను లక్షణక్రమముగాను (అనగా) నామవాచకాదిభేదముల వరుసనున్ను సులభముగా బోధకాతగిన ప్రతిపదములతో జాబితా వ్రాయించి అదిన్ని విభక్తులు మొదలైన హద్దులు వివరముగా తెలియడమునకు తగిన పత్రికయొకటి వ్రాయించి అదిన్ని వాక్యరచనాసార్థ్యము సలక్షణముగా కలుగడమునకు కర్తరిప్రయోగము మొదలైనవాటి వివకముగల పత్రికయొకటి వ్రాయించి అదిన్ని యొక పుస్తకముగాచేర్చి అచ్చువేయించి వారికి క్రమముగా చెప్పించవలసినది, …

అని. అంటే ఈ వాక్యగ్రంథాలలో వాడే భాష ఎవరికి తోచినట్టు వారు రాయడం కాకుండా కొన్ని నియమాలతో కూడిన ఒక పత్రిక (ఇది ఇప్పుడు మనం స్టైల్ మాన్యువల్ అని అంటున్న దానికి పర్యాయ పదం) కావాలని ఆయన అప్పుడే ఊహించారు. అలాగే,

“ఐతే, సంస్కృతము వగైరా భాషలయందు శారీరశాస్త్రము మొదలైనవి రచించబడి యున్నవి కాని ఆ గ్రంథములు బహు ప్రాచీనములైనవిన్ని దరిమిలాను పరిశీలనవల్ల తెలియవచ్చిన సంగతులచేత అభివృద్ధిని పొందించ బడనివిన్ని ఐయున్నందున వాటిని పట్టియేయే దేశభాషలను సంగ్రహములు చెయ్యడము కంటే యింగిలీషున ఇప్పట్లో వాడికెలో నుండే జిఆగ్రఫి, జిఆమిత్రి, ఎరిధ్మిటిక్‌, ఎస్త్రాన్మీ, ఫిలాస్సాఫి, ఎనాట్టొమి, అనే గ్రంథముల యొక్క సంగ్రహములు ఏయే దేశభాషలను వ్రాయించి విద్యార్థులకు చెప్పించడము జురూరై యున్నది.”

“ఈ అనుక్రమముగా విద్య చెప్పించేయెడల స్త్రీ జాతి ఎవరెవరి మర్యాదకున్ను స్థితికిన్ని అనుకూలమని తోచిన మట్టుకు విద్య చెప్పించవచ్చును సాధ్యమైనంతమట్టుకు గ్రంథములు స్త్రీలున్ను చదవడమునకు లాయబుగానుండేలాగు రచించబడవలసినది,…”

అటు సంస్కృతములోను ఇటు ఇంగ్లీషులోను ఉన్న విషయాలని కలుపుకుని వాటిని దేశభాషల్లోకి అనువాదం చేసి అందరికీ అర్థమయ్యే తెలుగులో పుస్తకాలని రాయించాలని ఆయన ఆలోచన. ఈ అభిప్రాయాలు 1862 వరకు ఎవరికీ తెలియకుండా వుండిపోయాయి. ఆ తరవాత కూడా గ్రాంథిక వ్యావహారిక భాషావివాదాలలో ముద్దునరసింహం నాయుడు చెప్పిన మూడు ముఖ్యమైన విషయాలు విస్మరించబడ్డాయి.

  1. ఆధునిక విజ్ఞానము; ప్రాచీన గ్రంథాలలో వుండే సమాచారము, ఇంగ్లీషు పుస్తకాల్లో వుండే సమాచారము రెండూ కలిపి, ఆలోచనాపూర్వకంగా సమన్వయించి పాఠ్య గ్రంథాలలో రాయాలి.
  2. ఆ వాక్య గ్రంథాలలో రాసే తెలుగు ఎలా వుండాలో చెప్పే నియమాలతో ఒక ‘పత్రిక’ తయారు చెయ్యాలి.
  3. ఇంగ్లీషు లోను, సంస్కృతం లోను వుండే పుస్తకాల లోని విషయాలు తెలుగు లోకి తర్జుమా చేయించాలి కాబట్టి ఆ భాషల్లో సమర్థులైన వాళ్ళని ఈ పనికి నియమించాలి.

ఈ మూడు విషయాలు అప్పటికే కాదు, ఇప్పటికి కూడా ఎవరికీ తట్టడం లేదు. ఆ పుస్తకాన్ని చూసి గిడుగు రామమూర్తి ముద్దునరసింహం నాయుడు మనవడైన ముద్దుకృష్ణ దగ్గర దాన్ని ప్రశంసించారు[19]బాలవ్యాకరణం, సంధి పరిఛ్ఛేదం, సూత్రం 13. కాని ఎందుచేతనో ఆ పుస్తకం ప్రసక్తి కానీ, ఆయన పేరు కానీ గిడుగు రామమూర్తి తమ పుస్తకాల్లో, వ్యాసాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. మేము ఆయన చెప్పిన విషయాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించాం. ఆయన చెప్పినవన్నీ పూర్తిగా బోధపడాలంటే ఆ పూర్తి పుస్తకం చదవాలి.

[ఈ పుస్తకాన్ని ఈ సంచికలో ప్రకటించి ఈమాట గ్రంథాలయంలో చేరుస్తున్నాం. దీనిని టైపు చేసి ఇచ్చిన వాడపల్లి శాయిగారికి మా కృతజ్ఞతలు. – సం.]

ముద్దునరసింహం నాయుని పుస్తకం అచ్చయిన నలభయి ఏళ్ళకి లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయాల పనిని గూర్చి సమీక్షించడానికి సెప్టెంబరు, 1901లో సిమ్లాలో పదహారు రోజుల పాటు ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశం తరువాత, అప్పటివరకూ జరిగిన విద్యాభివృద్ధిని గురించి ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసేందుకు ఒక సంఘాన్ని 1902లో నియమించాడు. ఆ సంఘం ఉద్దేశం బొంబాయి, మద్రాసు, కలకత్తా నగరాలలో 1852లో ఏర్పాటు చేసిన మూడు విశ్వవిద్యాలయాలలోను తయారయిన పట్టభద్రులు ఏమి చేశారో పరిశీలించడం. అక్కడ తయారయిన పట్టభద్రులు తమ తమ ప్రాంతీయ భాషల ద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని, ఆధునిక భావాలను ప్రచారం చేయగలరని ప్రభుత్వం భావించింది. కానీ ఈ సమావేశంలో పాల్గొన్న విద్యావంతులు 1905 సంవత్సరంలో సమర్పించిన నివేదికని బట్టి చూస్తే విశ్వవిద్యాలయాలలో తయారయిన విద్యావంతులు ప్రాంతీయ భాషలలో ఏ రకమైన కృషి చేయలేదని బోధపడుతుంది. వాళ్ళందరూ ఇంగ్లీషులో విద్య నేర్చుకున్నారు, వాళ్ళ వాళ్ళ సొంత భాషల్లో వాళ్ళకి ఏ రకమైన శిక్షణా లేదు. అందుచేత సొంత భాషల్లో ఏమీ రాయలేరు. దానితో పాటు ప్రాంతీయ భాషల్లో ఇంగ్లీషులో వున్న కొత్త విషయాలు చెప్పడానికి కావలిసిన మాటలు కూడా లేవు. దీనికంతటికీ కారణం విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషని నిర్లక్ష్యం చేయడమే. ప్రాంతీయ భాషలు ఈ విశ్వవిద్యాలయాలలో బోధనా భాషగా ఎప్పుడూ లేవు. ఈ చర్చల ఆధారంగా కర్జన్ విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషలు నేర్పడం మొదలు పెట్టాలని, ప్రాంతీయ భాషల్లో వ్యాసరచన ఇంగ్లీషునించి ప్రాంతీయ భాషలోకి అనువాదం ప్రత్యేక అంశాలుగా ప్రవేశపెట్టాలని నిర్ణయాలు చేశాడు. ఈ నిర్ణయాలు 21 మార్చ్ 1904 నాటినుండి చట్ట రూపంలో అమలులోకి వచ్చాయి. కానీ ఈ చట్టాన్ని ఆ సంఘంలో సభ్యులుగా ఉన్న ఆర్. జి. భండార్కర్, బి. కె. బోస్ లను మినహాయించి భారతీయులందరూ వ్యతిరేకించారు, ముఖ్యంగా గోపాలకృష్ణ గోఖలే, అశుతోష్ ముఖోపాధ్యాయ ఈ చర్చలు జరిగిన రెండు సంవత్సరాల పాటు తీవ్రంగా ప్రతిఘటించారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తోందని ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోకి ప్రవేశించి వాటిని కూడా పాడు చేయదలుచుకుందని గోపాలకృష్ణ గోఖలే వాదన[20]హిత సూచిని పుస్తకానికి ఆరుద్ర రాసిన ప్రవేశిక, పేజి II, 1986..

కర్జన్ బిల్లు ఫలితంగా స్కూలు ఫైనలు బోర్డ్ వాళ్ళు 1909లో ఒక నిర్ణయం చేశారు. తెలుగులో వున్న రెండు రకాల తెలుగు శైలుల్ని గుర్తులో పెట్టుకుని కాబోలు విద్యార్థులు పరీక్షల్లో మోడర్న్ లేదా క్లాసికల్ తెలుగు రెండింటిలో ఏ శైలిలోనయినా రాయవచ్చునని అనుమతిచ్చారు.[21] మరిన్ని వివరాలకు Ghosh; The Genesis of Curzon’s University Reform:1899-1905; Minerva; Vol. 26; N0. 4; 1988. B.R. Nanda; Gokhale The Indian Moderates & The British British Raj; Princeton University Press, Princeton, 1992. N.N; Report of the Indian Universities Commission; Simla; 1902.
 
కంపెనీ వారి ఉన్నత విద్యా విధానాలపైన క్లుప్త పరిచయాలు ఇక్కడ: బెంటింక్, వుడ్స్, కర్జన్
. వాళ్ళ అభిప్రాయంలో మోడర్న్ తెలుగు అంటే బ్రౌన్ రీడర్ లోను, ఆర్డెన్ తెలుగు గ్రామరు లోని మొదటి భాగం లోను, ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర లోను ఉన్న రకమైన భాష. దీన్ని వాళ్ళు వ్యావహారిక భాష అనలేదు. మోడర్న్ తెలుగు భాష అని మాత్రమే అన్నారు. ఈ మోడర్న్ అన్న మాటకి అర్థం వివరించి చెప్పినవాళ్ళు ఎవరూ లేరు. అంతే కాదు, ఈ పుస్తకాలు చదివిన విద్యార్థులు ఈ పుస్తకాలలో వున్న భాషలోనే సమాధానాలు రాయాలా లేకపోతే ఇంకే శైలిలోనయినా సమాధానాలు రాయవచ్చా అన్న దాని గురించి మనకి ఏమీ తెలియదు.

ఒక పక్క కర్జన్ బిల్లు పైన దేశవ్యాప్తంగా వ్యతిరేకత సాగుతుండగా ఆధునిక గ్రంథాల పేరుతో సెట్టి లక్ష్మీనరసింహం రాసిన గ్రీకు మిత్తులు, వేదం వెంకటాచలయ్య రాసిన విధిలేక వైద్యుడు స్కూలు ఫైనలు విద్యార్ధులకు నాన్-డిటెయిల్డ్ పాఠ్యగ్రంథాలుగా పెట్టారు. ముఖ్యంగా గ్రీకు మిత్తులు పుస్తకంలో వాడిన భాష, అంతకన్నా ఆ పుస్తకానికి పి. టి. శ్రీనివాస అయ్యంగార్ రాసిన ముందుమాట పండితుల కోపానికి గురయ్యింది. అలాగే శ్రీనివాస అయ్యంగార్ ప్రాంతీయ భాషల గురించి రాసిన (Death or Life: A plea for the Vernaculars, 1909) అన్న 41 పేజీల చిన్న పుస్తకం కూడా ఆధునిక విద్యావిధానం పైన వాదనలు మరింత వేడెక్కటానికి దోహదపడింది[22]శ్రీనివాస అయ్యంగార్ రాసిన పుస్తకం పైన పెద్ద ఎత్తులో దుమారం చెలరేగింది. వ్యతిరేకంగా సభలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంలో పత్రికలకు రాసిన నిరసన లేఖలు వావిలికొలను సుబ్బారావు తదితరులు చేసిన ఉపన్యాస పాఠాలు పుస్తక రూపంలో వచ్చాయి. చూ. The Gramya Controversy – Published by The Telugu Students at Madras; Puranam Suri Sastry (Ed.); Madras; 1913] బూదరాజు రాధాకృష్ణగారు వ్యావహారిక భాషావికాసము (1972) అన్న పుస్తకంలో (పేజి 87) “బుర్రా శేషగిరిరావు, సెట్టి లక్ష్మీనరసింహంగారు తమ శక్తికి మించిన ఉత్సాహశక్తి గలవాళ్ళు. వీరిలో రెండోవారు “గ్రీక్పురాణకథ” లనె పుస్తకాన్ని అర్థ గ్రాంథికంలో కృత్రిమ వ్యావహారికంలో రాసి వ్యావహారికోద్యమానికి అశక్తసహాయం చేసి ఇబ్బందులు తెచ్చి పెట్టేరు” అన్నారు. అక్కిరాజు రమాపతిరావు (1971), బూదరాజు రాధాకృష్ణ (1972) గారి పుస్తకాల్లో గ్రాంథిక, వ్యావహారిక వాదనలపైన మరింత సమాచారం లభిస్తుంది..

ఆధునిక గ్రంథాలు పాఠ్యగ్రంథాలుగా పెట్టాలనే కొత్త నియమాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని తాము రాసిన పుస్తకాలని పాఠ్యగ్రంథాలుగా చేయించుకోవాలనే వాళ్ళు కొందరు వుండేవాళ్ళు. సెట్టి లక్ష్మీనరసింహం, వేదం వెంకటాచలయ్య ఆ కోవలో వాళ్ళేనా? కాకపోతే వీళ్ళ పుస్తకాలకి ఆధునిక గ్రంథాలుగా గుర్తింపు కాని వాటి పట్ల ఆమోదం కాని లేకుండా ఇవి పాఠ్య గ్రంథాలుగా ఎలా ప్రవేశపెట్టబడ్డాయి అనే ప్రశ్నకి సమాధానం దొరకదు. ఉదాహరణకి విధిలేక వైద్యుడులో వేదం వేంకటాచలయ్య రాసిన వాక్యాలు చూడండి:

తిమ్మా. – మరండి అందరంటుండారు, ఇట్టాటి కొత్త మందు లెట్టుండాయో కనుక్కోవాల్నని రోగుల కిచ్చి సంపేస్తారంట వొయిద్దులు. ఇంకా యెక్కవమందిని సంపితేనేగాని గొప్ప వొయిద్దుడు కాడంట. అందుశాత యీలైనప్పుడల్లా యిట్టాటి మందులిచ్చి సంపేస్తుంటారంటండి మా వొంటి బీదవోల్లను.

జాన. – ఔను, వింతేమి? ఆమెకు యిష్టంలేని వానికి ఆమె నిస్తనంటిరి. ఆమె కోరుకున్న లింగంనాయని కేల ఆమె నీరాదూ అంటా. ఆయన కిస్తే ఆమె సుకం గుంటది. ఆయనేమో ఈమెను ఇప్పుడూ యెంత రోగంతో ఉణ్ణా చేసుకుంటాడు; నిశ్చయం.

దీనితో తెలుగు సాహిత్యంలో మంచి పుస్తకాలు మీకేమీ దొరకలేదా అని పండితులు ప్రశ్నలు లేవదీశారు. అక్కడితో ఆగక, ఈ పుస్తకాల వల్ల తెలుగు భాష పాడైపోతుందని జయంతి రామయ్య పంతులు ఒక ఉద్యమం మొదలుపెట్టారు. రామయ్య పంతులు మొదలుపెట్టిన ఉద్యమం తీవ్రంగానే నడిచింది. ఆయనకి వున్న అధికార స్థానం బహుశా ఉపకరించడం వల్ల కావచ్చు, ఈ ఉద్యమానికి పెద్ద పెద్ద జమీందార్ల సహకారం ఆయనకి లభించింది. గ్రామ్యభాషలో వున్న గ్రీకు మిత్తులు, విధిలేక వైద్యుడు లాంటి చవకబారు పుస్తకాల్ని పిల్లలకి పాఠ్య గ్రంధాలు చెయ్యడాన్ని నిరసిస్తూ తెలుగు దేశంలో చాలా వూళ్ళలో సభలు, పెద్ద ఎత్తులో సంతకాల సేకరణలు జరిగాయి. ఈ సభలలో పెద్ద పెద్ద పండితులు–కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు, వీరేశలింగం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, మొదలైనవాళ్ళు పాల్గొన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మద్రాసు విశ్వవిద్యాలయ సిండికేట్ ఒక సంఘాన్ని (Telugu Composition Committee) నియమించింది. ఈ సంఘం చాలాసార్లు సమావేశమై 20 సెఫ్టెంబర్ 1912న వ్యావహారిక భాష వాడుకకు అనుకూలంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తరువాత ఒక నెల రోజులకు ఆధునిక భాష అంటే ఏమిటో ఒక వివరణ కూడా ప్రకటించారు. ఈ రెండు సవరణలు జరిగిన మూడు నెలల లోపే మరొక సవరణ తెచ్చిపెట్టారు. ఇదంతా తీవ్రమైన గందరగోళానికి దారితీసింది[23]Extract from No.3098 dated 20-9-12 of the Secretary to the S. F. Board, Madras:
I have the honor (by direction) to inform you …That the pupils in Telugu will be examined on the Supposition that they write modern or classical Telugu according to the declaration of the school they come from (…) In the case of Telugu (group A and Group C) information as to the number of pupils who will answer the papers in Classical Telugu should also be furnished in the statement.
(Sd.) Geo Maddox, Secretary.
 
ఆ తరవాత నెల రోజులకే ఆధునిక భాష అంటే ఏమిటో వివరిస్తూ ఈ కింది ఉత్తరువు జారీ చేశారు. Extract from No.3479, Dated 29-10-12:
By ‘Modern Telugu’ the Board means language of the kind Used in such Books as Brown’s Reader, the first part of the Arden’s Telugu Grammar and Enugula Veeraswamiya’s Kasiyatra Charitram. Schools which do not favour this kind of Telugu need make no declaration.
It was reported to the Board that one and the same school proposed to send up some pupils of the school in classical Telugu and the remaining pupils in ‘modern’ Telugu. It is the desire of the Board that all the pupils belonging to a school should be examined alike, that is, either in classical Telugu alone or in Modern Telugu alone, not in both : it is accordingly requested that this may be borne in mind in filling in the enclosed form ; there is thus to be only one entry under Telugu-either against classical Telugu or against modern Telugu.
(Sd.) Geo Maddox
Secretary
 
No. 20, Dated 10-1-13
It having come to the notice of the President of the School Leaving Certificate Board that there are good grounds for individual pupils writing in a style differing from that of the majority of pupils for a school, heads of institutions are informed in modification of Circular No. 3479, dated 29-10-12, that all pupils will be required in the Examination to mark their answer books ‘Modern’ or ‘Classical’ and that their will be valued accordingly. This will admit of the same pupil answering papers in different styles as well as of pupils from the same school using different styles.
(Sd.) Geo Maddox
Secretary
 
(అక్కిరాజు రమాపతిరావు, వ్యావహారిక భాషా వికాసం – చరిత్ర, ఎం. శేషాచలం అండ్ కంపెనీ, మచిలీపట్టణం, మద్రాసు, 1971, పేజి 85).
.

ఇదే సమయంలో, అప్పటిదాకా ఉన్న ఎఫ్.ఎ. (F.A) పరీక్షకు బదులు రెండేళ్ళ పరిమితితో ఇంటర్‌మీడియట్ చదువులు ప్రవేశ పెట్టబడ్డాయి. ఇంటర్ పరీక్షలలో వ్యాసరచనకు అనుసరించవలసిన శైలి గురించి కూడా ఒక కమిటీ ఏర్పాటయింది. దీనికి ‘ఇంటర్‌మీడియట్ కాంపోజిషన్ కమిటీ’ అని పేరు. ఈ కమిటీవారు 1911-1914 మధ్య కాలంలో ఏడు సార్లు సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చలు జరుగుతున్న కాలంలో వ్యావహారిక భాష అమలుకి వ్యతిరేకంగా నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. 1914వ సంవత్సరం జూన్-జులై నెలల్లో గ్రాంథికవాదులు (పండితులు) 24 ఊళ్ళలో సభలు జరిపి[24]కాకినాడ, బెజవాడ, నూజివీడు, గుంటూరు, పిఠాపురం, కడప, పెద్దాపురం, తుని, తిరుపతి, పొద్దుటూరు, అమలాపురం, ఎలమంచిలి, తణుకు, రాజమండ్రి, అనంతపురం, బందరు, బళ్ళారి, కర్నూలు, పెనుగొండ, నెల్లూరు, బరంపురం, అనంతపురం – Appendix to అక్కిరాజు రమాపతిరావు, వ్యావహారిక భాషా వికాసం చరిత్ర, ఎం. శేషాచలం అండ్ కంపెనీ, మచిలీపట్టణం, మద్రాసు, 1971., దాదాపు పదివేల సంతకాలతో ప్రభుత్వానికి ఈ పుస్తకాలకి వ్యతిరేకంగా ఒక మహజరు సమర్పించారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి, తెలుగులో విద్యార్థులు, మోడర్న్ తెలుగు, క్లాసికల్ తెలుగు, ఈ రెండింటిలో ఏ భాషలోనైనా రాయవచ్చుననే వెసులుబాటుని 11 ఆగస్టు 1914 నాడు ఉపసంహరించుకుంది. దీన్ని గ్రాంథికవాదులు పెద్ద విజయంగా సంబరపడ్డారు.


ఇక మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ ఏర్పరిచిన కమిటీ లాక్షణిక భాషే వాడాలనే నిర్ణయం చేసిన తరవాత జరిగిన మార్పులు చూద్దాం. హైస్కూలు విద్య వరకు అన్ని సబ్జెక్టులు తెలుగులోనే చెప్పాలనే నియమం వుండేది. చరిత్ర, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, గణితం ఇవన్నీ తెలుగులో చెప్పవలసిన అవసరాన్నిబట్టి పాఠ్య గ్రంథాలు తయారయ్యేవి. ఆయా శాస్త్రాలలో సామర్ధ్యం వున్న పెద్ద ప్రొఫెసర్లకి మంచి తెలుగు రాదు. మంచి తెలుగు వచ్చిన వాళ్ళకి ఆయా శాస్త్రాలలో చెప్పుకోదగ్గ పాండిత్యం లేదు. అందుచేత కేవలం సిలబస్ మాత్రమే ఆధారంగా హైస్కూలు పిల్లలకి పాఠ్యగ్రంథాలు తయారయ్యాయి. దాంతోపాటు ఆ భాష లాక్షణిక భాష అవాలనే నియమం వుండబట్టి అవి ఇంకా గందరగోళంగా వుండేవి. ఆ పుస్తకాలనీ ఎవరూ జాగ్రత్తగా పరిశీలించి ఆ పుస్తకాలలో వుండే భాష, విషయము ఏ స్థాయిలో వున్నాయో సరిగా చర్చించలేదు. కానీ Indian Ocean అనే మాటకి హిందూ మహాసముద్రము, Mediterranean sea అనే దానికి మధ్యధరా సముద్రము, Bay of Bengal అనే దానికి బంగాళాఖాతము లాంటి కొత్త మాటలు పిల్లల మనసుల్లోకి ప్రవేశించాయి. ఈ విషయాలలో పరీక్షలు దిద్దేవాళ్ళకి కూడా లాక్షణిక భాషలో చెప్పుకోదగ్గ ప్రావీణ్యం లేకపోవబట్టి వాళ్ళకి అలవాటయిన ఆధునిక భాషనే కృతకంగా మార్చి అదే ఆధునిక భాష అనే అభిప్రాయంతో పేపర్లు దిద్దేవారు.

మద్రాసు యూనివర్శిటీ సిండికేట్ ఇంటర్‌మీడియట్ పాఠ్యగ్రంథాలలో ఏ రకమైన తెలుగు శైలి వాడాలో నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు చూస్తే అందులోని సభ్యులకు భాషని గురించి ఎటువంటి అభిప్రాయాలు వుండేవో మనకి తెలుస్తుంది. ఆ చర్చలన్నీ ఇంగ్లీషులో జరిగాయని వాళ్ళ పుస్తకాలన్నీ ఇంగ్లీషులోనే రాశారని గమనిస్తే ఇంకా కొన్ని చమత్కారాలు బోధపడతాయి. ఇంగ్లీషు భాషలో తెలుగుని గురించి రాయడంలో కొన్ని పరిమితులున్నాయి. ఆ పరిమితుల వల్ల ఇటు జయంతి రామయ్య పంతులు దగ్గర మొదలుపెట్టి అటు గురజాడ అప్పారావు వరకు ఇంగ్లీషులో తమ ఊహలు చెప్పడంలో బోలెడు ఇబ్బందులు పడ్డారు. పైగా వాళ్ళు మాటమాటకి యూరోపియన్ భాషలో ఏం జరిగిందో ఉదాహరణలు ఇవ్వడం మరీ ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఈ శ్రమంతా ఎందుకు కలిగిందంటే ఈ వాదనలకి నిజమైన శ్రోతలు ఇంగ్లీషు మాత్రమే వచ్చిన మద్రాసు యూనివర్శిటీ సిండికేటువారు కావడం.

ఈ వాదనలలో పట్టుదలగా పాల్గొన్న వాళ్ళు ముగ్గురు: 1. గిడుగు రామమూర్తి పంతులు, 2. గురజాడ అప్పారావు, 3 జయంతి రామయ్య పంతులు. ఈ ముగ్గుర్ని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం.

గిడుగు వెంకట రామమూర్తి

గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగస్టు 29న పుట్టారు. ఆయన పుట్టింది శ్రీకాకుళం ప్రాంతంలో పర్వతాలపేట అనే గ్రామంలో. చిన్నప్పటినుంచి ఏకసంథాగ్రాహి. సంస్కృతంలో శబ్దమంజరి అంతా ఎనిమిది సంవత్సరాలకే నేర్చుకున్నారు. బాలరామాయణంలో శ్లోకాలు, భారత, భాగవతాల్లో పద్యాలు ఆయనకు కంఠస్థంగా వచ్చేవి. 1875లో విజయనగరంలోని మహారాజావారి కళాశాలలో చేరారు. అప్పుడు ఆ కాలేజి ప్రిన్సిపాలు చంద్రశేఖరశాస్త్రి మంచి సంస్కృత పండితుడు. ఆ కళాశాలలోనే, ఆ ప్రిన్సిపాలుగారి ఇంట్లోనే గిడుగు రామమూర్తికి గురజాడ అప్పారావుతో పరిచయం అయ్యింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. 1879లో గిడుగు రామమూర్తి మెట్రిక్ పాసయిన తరువాత చదువు మానేయవలసి వచ్చింది. మన్యప్రదేశంలో మలేరియా తీవ్రంగా వ్యాపించే ప్రాంతంలో పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో నెలకి 30 రూపాయిలకి ఉద్యోగం దొరికింది. అదే సమయంలో విజయనగరానికి దగ్గరలో కోనాడ అనే వూళ్ళో నెలకి 25 రూపాయలకి స్కూలు మాస్టారి ఉద్యోగం వుంది. కానీ ఆ అయిదు రూపాయిలు ఆ రోజుల్లో ఎక్కువ డబ్బే. అంచేత గిడుగు పర్లాకిమిడి వెళ్ళి అక్కడే వుద్యోగంలో చేరారు. దాదాపు 56 సంవత్సరాలు అక్కడే వుండిపోయారు. రామమూర్తి పంతులుకి పర్లాకిమిడి ప్రాంతంలో వుండే కొండజాతి సవరలతో పరిచయం యేర్పడింది. అమాయకంగా ఆధునిక పద్ధతులేమీ తెలియని ఆ జాతి సంస్కృతి మీద ఆయనకి ఆసక్తి పుట్టింది. మూడేళ్ళల్లో వాళ్ళ భాష బాగా నేర్చుకున్నారు. ఆ తరవాత అక్కడికి దగ్గరలోనే వున్న ముఖలింగం క్షేత్రానికి వెళ్ళారు. ఆ ముఖలింగం ఆలయంలోని శాసనాలని రాసుకుని కళింగదేశచరిత్ర రాయాలనే ప్రయత్నంలో పడ్డారు. ఆ శాసనాలు ఆయన గడగడా చదువుతూ వుంటే అక్కడివాళ్ళందరూ ‘ముక్కు మీద వేలు వేసుకున్నారట. ఆ శాసనాలని దేవతలే రాశారని మానవులకర్థం కాని భాష అందులో వుందని స్థానికుల నమ్మకం’[25]హెచ్. ఎస్. బ్రహ్మానందం; గిడుగు రామమూర్తి -జీవిత సంగ్రహం, పే. 16.. గంజాం జిల్లాలో వున్న సవరల విద్యాభివృద్ధి మీద దృష్టి పెట్టి వాళ్ళ భాషని, సంస్కృతిని నేర్చుకున్నారు. వాళ్ళతో పాటు కొండల్లో తిరిగి వాళ్ళ పాటలు, కథలు, ఆచార వ్యవహారాలు తెలుగు లిపిలో రాసి పెట్టుకోవడం మొదలుపెట్టారు. అలా కొండల్లో తిరుగుతుండగా ఆయనకి మలేరియా జ్వరం వచ్చింది. ఆ రోజుల్లో మలేరియాకి క్వినైన్ ఒక్కటే తెలిసిన మందు. క్వినైన్ 40 రోజులపాటు వేసుకునేసరికి ఆయనకి చెవులు వినిపించడం మానేశాయి. అప్పటినుంచి ఆయనకు వినికిడి పూర్తిగా పోయింది. అప్పుడే గిడుగు రామమూర్తికి జె. ఎ. యేట్స్‌తో పరిచయం అయ్యింది. యేట్స్ స్కూళ్ళ ఇన్స్‌పెక్టర్‌గా రావడానికి, కర్జన్ ప్రాంతీయ భాషల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలనే నిర్ణయానికి ప్రత్యక్షంగా సంబంధం వుందో లేదో తెలియదు కానీ యేట్స్ తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు[26]ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం-సంపుటి 4, పేజి 277, revised edition 2004, reprint 2005.. దానితో నేర్చుకునే భాషకి మాట్లాడే భాషకి మధ్య అంత తేడా వుండటాన్ని చూసి ఆశ్చర్యపోయిన యేట్స్ ఆ విషయం పి. టి. శ్రీనివాస అయ్యంగార్‌తో చెప్పారు. అయ్యంగార్‌కి తెలుగు భాష నేర్పడం గురించి కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ తను తమిళుడు కాబట్టి గురజాడ అప్పారావుతోను, గిడుగు రామమూర్తితోను మాట్లాడమని సలహా యిచ్చారు. అప్పటికి గిడుగు రామమూర్తికి తెలుగు సాహిత్యం గురించి తెలియదు[27]అక్కిరాజు రమాపతిరావు, వ్యావహారిక భాషా వికాసం చరిత్ర, ఎం. శేషాచలం అండ్ కంపెనీ, మచిలీపట్టణం, మద్రాసు, 1971, పేజి 81.
 
సరిగ్గా ఎవరన్నారో, ఎప్పుడన్నారో తెలియదు కాని వ్యావహారికవాదాన్ని సమర్ధించిన ఈ నలుగురినీ–గిడుగు వెంకట రామమూర్తి, గురజాడ అప్పారావు, పి.టి. శ్రీనివాస అయ్యంగార్, జె. ఎ. యేట్స్–దుష్టచతుష్టయం అనేవారు. [Gidugu Sitapati, 1968]
.

ఈ కాలంలోనే గిడుగు రామమూర్తి తెలుగు సాహిత్యాన్ని మామూలు పండితులకు కూడా సాధ్యం కానంత సూక్ష్మదృష్టితో అధ్యయనం చేశారు. ఆయన జ్ఞాపకశక్తి చాలా గొప్పది. ఎక్కడెక్కడ ఏ మూల ఏ కవి వాడిన పదస్వరూపాలనయినా క్షణమాత్రంలో గుర్తుకు తెచ్చుకుని ఉదాహరణగా చూపించగల సామర్థ్యం ఆయనకి ఉండేది. చాలా జాగ్రత్తగా ఆయన చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం వున్న భాషకి; పూర్వపు తెలుగు కవులు వాడుతూ వచ్చిన భాషకి; వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం పంతులు మొదలైన వాళ్ళు లాక్షణికం అనుకున్న భాషకి, తేడాలున్నాయని గమనించారు. పూర్వకవులు వాడిన భాష కాలక్రమాన మారుతూ వచ్చిందని, చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం సాధించదగిన భాష ఇంకొక కొత్తరకమయిన భాష అని, కొక్కొండ వెంకటరత్నం పంతులు, వీరేశలింగం పంతులు వాడినది ఇంకొక రకమైనదని గమనించారు. వీటన్నిటికీ కలిపి ఒక పేరు పెట్టకుండా కావ్యాల్లో వాడిన భాష నిజమైన గ్రాంథికమని; చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం రాసేది దక్షిణాది తెలుగు అని (దీని గురించి కొంతసేపట్లో వివరిస్తాం); కొక్కొండ వెంకటరత్నం పంతులు, వీరేశలింగం పంతులు వాడే భాష కృతక గ్రాంథికమని; నిర్దేశించారు. ఆయన దృష్టిలో ఏ కాలం లోనూ ఎవరూ కూడా తమ కాలంలో వాడుకలో వున్న భాషని వ్యతిరేకించి దాని ప్రభావం తమ మీద పడకుండా రాయడం అసాధ్యం. అంచేత లాక్షణిక భాష రాస్తున్నాం అనుకునే వాళ్ళందరూ చిన్నయ సూరి వ్యాకరణాన్ని అనుకరించలేదనీ, వ్యవహారంలో వున్న మాటలకే కృతక రూపాలు కల్పించి అదే లాక్షణికం అనే భ్రమలో రాస్తున్నారనీ ఆయన వందల కొద్దీ వుదాహరణలతో చూపించారు. చిన్నయ సూరి వ్యాకరణానికి లొంగని, చిన్నయ సూరి గమనించని, పూర్వ కవి ప్రయోగాలు ఉన్నాయని ఆయన సోదాహరణంగా చూపించారు. అంచేత ఆయన వాదం ప్రకారం లాక్షణిక భాష ఎవరూ రాయలేరు. ఆఖరికి చిన్నయ సూరి కూడా రాయలేడు.

ఆ రోజుల్లో మద్రాసులో వున్న తెలుగు పండితుల్లో ఉత్తరాదివాళ్ళు, దక్షిణాదివాళ్ళు అనే తేడాలు ఉండేవి. చిన్నయ సూరి, వేదం వెంకటరాయశాస్త్రి దక్షిణాదివాళ్ళు. వీళ్ళ తెలుగుకి అరవ తెలుగు అని గిడుగు రామమూర్తి పేరు పెట్టారు[28] వెన్నెలకంటి సుబ్బారావు 1820లో మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ వారికి ఇచ్చిన నివేదికలో దక్షిణ ప్రాంతం వారి తెలుగు ప్రశస్తమైనది కాదనే అభిప్రాయంతో ఉత్తరాది జిల్లాల తెలుగు వాళ్ళని ఉపాధ్యాయులుగా నియమించేవారని రాశారు. గమ్మత్తుగా చిన్నయ సూరి తరువాత ఆయన స్థానంలో తెలుగు పండితులైన కొక్కొండ వెంకటరత్నం పంతులుతో నాటకాల్లో పాత్రోచిత భాషపై తీవ్రంగా వాదులాటలయినప్పుడు వేదం వెంకటరాయశాస్త్రి కొక్కొండ తెలుగు ‘అరవ తెలుగ’ని, ‘మదరాసు తెలుగ’ని, ‘గుజరాతీపేట తెలుగ’ని ఎత్తి పొడిచారు. నిజానికి కొక్కొండ గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతం నుండి ఉద్యోగరీత్యా దక్షిణ ప్రాంతానికి వలస వెళ్ళారు.. ఆ తెలుగునే చిన్నయ సూరి తన వ్యాకరణంలో ఉద్దేశించి దానికే వ్యాకరణం రాశాడని ఆయన వాదన. అంచేత ఆయన దృష్టిలో ఈ తెలుగు గ్రాంథికం కాదు.

డానియల్ జోన్స్ (Daniel Jones) ఓట్టో యెస్పర్సన్ (Jens Otto Harry Jespersen), ఫిలిప్ హార్టోగ్ (Philip Hartog) రాసిన పుస్తకాలు, వాళ్ళ ఆలోచన విధానం దానితో పాటు భారతీయ భాషల్ని ఆర్య భాషలు, ద్రావిడ భాషలు అంటూ విడదీస్తూ రాబర్ట్ కాల్డ్‌వెల్ చేసిన సిద్ధాంతాన్ని గిడుగు రామమూర్తి పూర్తిగా ఒప్పేసుకున్నారు. దానితోపాటు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాకి నేతృత్వం వహించి భారతీయ సాహిత్యాల గురించి చాలా అభిప్రాయాలను చెప్పిన జార్జ్ గ్రియర్సన్ అభిప్రాయాలు పూర్తిగా ఆయన అంగీకరించారు. అయితే, ముఖ్యంగా వ్యాకరణం అనే భావానికి అర్థం మారుతోందని ఆధునికుల దృష్టిలో వ్యాకరణం భాషని శాసించేది కాదని భాషని అనుసరించేదని గిడుగు రామమూర్తి పాశ్చాత్య ప్రభావం వల్లే గ్రహించారు[29]హార్టోగ్ రాసిన The Writing of English, Oxford, 1907 అన్న పుస్తకం రామమూర్తిగారిని ప్రభావితం చేసినట్లుగా తెలుస్తుంది. యెస్పర్సన్ రాసిన A shorter English Grammarని రామమూర్తి తెలుగులోకి అనువదించారు. (చూ. బూదరాజు రాధాకృష్ణ; వ్యావహారిక భాషావికాసము; 1981, పేజి 86) అలాగే జోన్స్ మద్రాసులో ఫొనెటిక్స్ పైన ఉపన్యాసాలు ఇస్తున్నాడని తెలిసి వాటికి హాజరయ్యారు..

ఆ కాలంలో ఇంగ్లీషు విద్యావంతులకు విక్టోరియన్ నైతిక దృష్టి ప్రభావం వల్ల అశ్లీలమనే కొత్త భావం ప్రవేశించి తెలుగు సాహిత్యంలో చాలాభాగం అశ్లీలంగా కనిపించింది. ఈ వాదానికి బలం చేకూర్చినవారు ఇద్దరు: కందుకూరి వీరేశలింగం, కట్టమంచి రామలింగారెడ్డి. ఆ దృక్పథాన్ని గిడుగు రామమూర్తి నిరభ్యంతరంగా అంగీకరించారు. ఆయన దృష్టిలో ముద్దుపళని బజారు వేశ్య. కేవలం రాజుల మెప్పు కోసం మాత్రమే స్త్రీల అంగాంగవర్ణనలు చేస్తూ తెలుగు కవులు చవకబారు వర్ణనలు చేశారు. అందుచేత విద్యార్థులచే చదివించే పాత తెలుగు పుస్తకాలని జాగ్రత్తగా పరిశీలించి అశ్లీల భాగాలని పరిహరించాలని రామమూర్తి పంతులు గట్టిగా వాదించారు. వీటివల్ల గిడుగు రామమూర్తి మీద వలసవాద భావాల ప్రభావం ఎంత బలంగా వుందో గమనించవచ్చు.

దాదాపు ఈ కాలంలోనే రాసిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజంలో గిడుగు రామమూర్తి గ్రాంథిక భాష ఎవరూ రాయలేరని, చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం చిన్నయ సూరి కూడా రాయలేదనే ప్రతిపాదనకి ఎక్కువ వివరంగా ఉదాహరణలు ఇచ్చారు. ఆయనే తరువాత సంకలనం చేసిన గద్యచింతామణిలో పూర్వం వచనం రాసిన వాళ్ళనించి కొల్లలుగా ఉదాహరణలు ఇస్తూ అదంతా వ్యావహారికమేనని వాదిస్తూ, వ్యావహారికం పూర్వకాలం నుంచి తెలుగులో చాలామంది రాశారని చూపించారు. ఇది దాదాపుగా గిడుగు రామమూర్తి వాదన యొక్క సారాంశం.

రామమూర్తి పంతులుకి పండితులంటే అభివృద్ధి నిరోధకులని, కొత్త ఆలోచనలకు అడ్డొచ్చేవారని, ప్రపంచంలో వున్న జ్ఞానం యేదీ తెలుగులోకి రాకుండా వాళ్ళ పట్టుదల వల్లే ఆగిపోతోందని తీవ్రమైన అభ్యంతరం వుంది. అయితే పండితుల్లోనే ఆయనకు మంచి స్నేహితులున్నారని, తన అభిప్రాయాలను ఆమోదించిన వారున్నారని రామమూర్తి పంతులు మనకి జ్ఞాపకం చేస్తారు[30]అయితే పండితుల్లోనే ఆయనకు మంచి స్నేహితులున్నారని, తన అభిప్రాయాలను ఆమోదించినవారున్నారని రామమూర్తి పంతులుగారు మనకి జ్ఞాపకం చేస్తారు. “I earnestly wish it to be understood that I have much respect for the Pandits and their erudition. I have many friends among them. There are aso some who support my views. What I deplore and hold up is their pedantry, bigotry and opposition to progress. “Pandit” is used by me in this sense.” (A Memorandum on Modern Telugu, 1913, page 29.)
 
“I have used the word ‘Pandit’ in this pamphlet to mean pedantry, bigotry, dogmaticism, unreasonableness, impracticable purism, exclusive spirit and such other characteristics of the average Pandit. I know a good many Pandits who are distinguished by their liberal culture. Some of my best friends are among the Pandits of these two classes. I should be very sorry if what I have said against pedantry should be taken to mean anything disrespectful to the person of any Pandit.“ (page 59.)
 
“I wish it likewise to be understood that I have no intention whatever to put a slur on the reputation of the other class of Telugu writers who oppose the ‘modern movement.’ I fully appreciate their services and sincerity of purpose. But I feel convinced that their views are as faulty as the traditional views of the Pandits on the fundamental points connected with the subject. They are “English educated” gentlemen, and I hope, misinterpret my criticism of their views. I look upon the problem under discussion as a most important social question, on the right solution of which depends the welfare of the Telugu community.” (Page 59.)
.

గురజాడ 1915లో పోయారు. ఆయన మరణం వ్యావహారికవాదులకి పెద్ద దెబ్బ అయ్యింది. గిడుగు రామమూర్తి దాదాపుగా ఒంటరి అయిపోయారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన దాదాపు 25 ఏళ్ళపాటు ప్రభుత్వాన్ని, యూనివర్శిటీ సిండికేటు వాళ్ళ సభల్ని వదిలిపెట్టి ఊరూరా తిరిగి వీలున్నంతమంది పండితుల్ని వ్యక్తిగతంగా కలుసుకుని వాళ్ళతో వాదించి వ్యావహారిక భాష గురించి తన అభిప్రాయాలని వాళ్ళు ఒప్పుకునేట్లు చేసి అలా ఒప్పుకున్నట్లు కాగితం మీద రాయించి పుచ్చుకున్నారు[31]చూ. అక్కిరాజు రమాపతిరావు; 1971; పేజి 128-129, ఆరుద్ర, స.ఆం.సా; సంపుటం 11, 1990 పేజి 408.. తన వాదనలు ఒప్పుకోని పండితులనుంచి తాము ఒప్పుకోవడం లేదన్న సంగతిని కూడా కాగితం మీద రాయించి తీసుకున్నారు. ఈ రకంగా ఆయన పండితుల అభిప్రాయాన్ని ఒకరొకరుగా ఎదుర్కున్నారు. ఈ పని పట్టుదలగా చేయడంవల్ల ఆయన వాదాన్ని పండితులు కూడా లోపల ఒప్పుకున్నా లేకపోయినా పైకి కాదనగల పరిస్థితి లేకుండా పోయింది. అంతకన్నా ముఖ్యంగా ఆయన సభల్లో గట్టిగొంతుకతో పుంఖానుపుంఖాలుగా ఉదాహరణలిస్తూ గ్రాంథికవాదాన్ని చితకకొడుతూ వ్యావహారికాన్ని సమర్థించడం వల్ల ఆయనకి పండితలోకంలో అసామాన్యమైన పేరు వచ్చింది. ఆయన సూర్యరాయాంధ్ర నిఘంటువుని విమర్శిస్తూ అందులో లోపాల్ని పరమ సమర్థంగా చూపించేవారు. అంచేత గ్రాంథికం అనే మాటకి క్రమక్రమంగా బలం తగ్గి ఈయన ప్రతిపాదించిన వ్యావహారికం అనే మాట నిత్యవ్యవహారం లోకి వచ్చింది. తెలుగుభాషకి గ్రాంథికత్వం చిన్నయ సూరి వల్లే వచ్చిందని, రామమూర్తి పంతులు వ్యతిరేకిస్తున్న కృతక గ్రాంథికానికి చిన్నయ సూరే కారకుడని ఒక సామాన్యాభిప్రాయం తెలుగులో కొత్తగా రాసేవారందరిలోను ఏర్పడింది. భాషని పాడు చేసింది చిన్నయ సూరే అని, దానికి లేనిపోని సంకెళ్ళు తగిలించి ఎవరూ రాయలేనంత క్లిష్టంగా ఎవరికీ అర్థం కానంత కష్టంగా చిన్నయ సూరే తెలుగుని తయారు చేశారని, ఒక అనాలోచితమైన అభిప్రాయం కొత్త రచయితల్లో బలపడింది[32]ఆరుద్ర బాలవ్యాకరణాన్ని ‘కబ్బాల వ్యాకరణం అని, పబ్బాల వ్యాకరణం’ అని వేళాకోళం చేశాడు. (స.ఆం.సా; సంపుటం 10; 1990; పేజి 39). ఈ ప్రవాహంలో చిన్నయ సూరి చేసిన పనిని సమర్థంగా బోధపరుచుకునే పని ఎవ్వరూ చేయలేదు. అంతకన్నా ముఖ్యంగా చిన్నయ సూరి రాసింది అందమైన భాష అని ఒక్క గురజాడ తప్ప ఎవరూ గుర్తించలేదు[33]దరిమిలా దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారే చిన్నయ సూరి వ్యాకరణంలో సూత్రపద్ధతి శాస్త్ర సమర్ధంగా వుండటమే కాకుండా అందంగా వుంటుందని చూపించారు.. ఈ కారణాలవల్ల క్రమంగా లాక్షణికము, గ్రామ్యము అనే మాటలు పోయి గ్రాంథికము, వ్యావహారికము అనే మాటలే ప్రచారంలోకి వచ్చాయి.

గురజాడ అప్పారావు

(గురజాడ అప్పారావు జీవితచరిత్ర దాదాపుగా తెలిసినదే కనుక ఆ వివరాలలోకి మేము వెళ్ళటం లేదు.-ర.)

జయంతి రామయ్య పంతులు రాసిన రిపోర్టును (A Defense of Literary Telugu) కాదంటూ గురజాడ అప్పారావు, గ్రాంథికవాదుల వాదాలు ఎలా తప్పో చూపిస్తూ, నన్నయ కాలం నుంచి కూడా కావ్యేతరమైన భాషలో ‘చున్న’ బదులు ‘స్తున్న’ ఎలా వాడుకలో వుందో చాలా వివరంగా ఉదాహరణలు ఇస్తూ, ఒక 152 పేజీల వ్యాసం (Minute of Dissent) రాశారు[34] కొమర్రాజు లక్ష్మణరావుగారు రాసిన “A Memorandum on Telugu Prose” అన్న వ్యాసానికి కూడా ఈ “Minute of Dissent” ప్రత్యుత్తరం.. ఆ తరవాత రామయ్య పంతులు తమ రిపోర్టులో ఆర్కయాక్ (archaic), కరెంట్ (current) అనే విభజన చూపించలేదని; చాలా మాటలు పాతబడి పోయినవి, కేవలం అలంకార సౌందర్యం కోసం వాడినవి, నిత్య వ్యవహారంలో అవసరం లేదని; కావ్యేతర వ్యవహారంలో వున్న భాష వర్ణక్రమాన్ని సోదాహరణంగా వివరించారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో పై తరగతి విద్యావంతులు మాట్లాడే భాష ఆధునిక వ్యావహారిక భాష అవ్వాలని వాదించారు. చిన్నయ సూరి నీతిచంద్రికలో నిజంగా అందమైన వచనం రాయగా కందుకూరి వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం దాన్ని అనుకరించబోయి భయంకరమైన, గొడ్డు గ్రాంథికభాష రాశారని[35]నిరంతర పరిపుల్ల వనమల్లికా వల్లికా మతల్లికా వేల్లిత నికుంజ పుంజరంజితంబయి, కుసుమవిసరపరిమళమిళిత గళితమకరందబిందు సందోహాస్వాదనాగతమిళిందబృందసుందరంబయి, నికటవిటపివిటపఛ్ఛ టారటఛ్ఛకుంత సంతానాశ్రాంత తతరవాక్రాంతదిగన్తరాళంబయి
 
“Even elementary school readers are not free from these features. A woman is not స్త్రీ or ఆడుది, but నెలతుక, ముద్దియ, పొలఁతి. సందేహము is సందియము; To come is not వచ్చుట, but అరుదెంచుట, To speak is not అనుట or even పలుకుట but వక్కాణించుట. The school reader also aims to cultivate in the little urchins a taste for long Sanskrit compounds. ఏకసహచరాను గమ్యమానుండు, అతిరుచ్య ఫల భార వినమృలై, విమలచారిత్రశిక్షకా చార్యకము, మందహాస సుందరవదనారవింద లావణ్యాతిశయము.”
 
“All these usages are picked up from a school reader which bears on the title page the name of Rao Bahadur K. Veeresalingam Pantulu Garu, the leader of the Neo-Kavya school!”
 
Another book which deserves mention is Chardarvish by Yerramilli Mallikarjuna Kavi. In his preface to this work, the author stated that he had employed the spoken idiom as he had found that the literary dialect could not render thoughts adequately. It was first published in 1863. It has passed through innumerable editions and is immensely popular at the present day. Prose works in the traditional blend have a real currency in the country which most prose in the Kavya and Neo-Kavya dialects has not.
; ఇలాంటి వచనమే స్కూలు పిల్లలకి తెలుగు వచనం పేరుతో బోధిస్తున్నారని; చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం చేసే సంధులు తెలుగులో పండితులు కూడా నిత్యం వాడ్డంలేదని; ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రాచరిత్ర, ఎర్రమల్లి మల్లికార్జునుడి చార్ దర్వీషు కథలు ఈ గ్రాంథికవాదుల దృష్టికి రాలేదని చూపించారు.

చిన్నయ సూరి రాసిన వచనం గ్రాంథికమైనా అందమైనదని గుర్తించినందుకు గురజాడ అప్పారావుని మెచ్చుకోవలసి వుంది.

తెలుగులో కళ, ద్రుతప్రకృతికము అనే తేడా చాలా కాలంగా పోయిందని చిన్నయ సూరి ఆ విభాగాన్ని బతికుంచడానికి ప్రయత్నం చేసినా గ్రాంథికవాదులు కూడా ఆ తేడాని పాటించలేక పోతున్నారని ఉదాహరణలతో సహా నిరూపిస్తారు గురజాడ అప్పారావు. అంతకన్నా ముఖ్యమైన విషయమేమిటంటే తెలుగులో బ్రిటిష్‌వాళ్ళకి పూర్వం అందరికీ పాఠం చెప్పే బడులు లేవు; సర్వత్రా నేర్పబడుతున్నది గ్రాంథిక భాష కాదు;, గ్రాంథిక భాష అనేది పూర్వం లేదు; అసలు పూర్వం ఎప్పుడూ గ్రాంథిక భాష అనేది పాఠంగా చెప్పబడలేదు; ఈ గ్రాంథిక భాష బ్రిటిష్‌వాళ్ళు తమ విద్యాశాఖ ద్వారా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ద్వారా, టెక్స్ట్ బుక్ కమిటీల ద్వారా ప్రచారంలోకి తెచ్చారు; కాని, ఇవాళ వ్యావహారిక భాష పిల్లలకి చెప్పాలని వాదిస్తున్నారని; గురజాడ అప్పారావు రాసిన ఈ మినిట్ ఆఫ్ డిసెంట్ వ్యాసం పరిశీలనగా చూస్తే ఆయన వాదన ఎంత సహేతుకమైనదో, గ్రాంథికమే ఎందుకు కృతకమైనదో, ఛందస్సుల్లో ఉన్న కావ్యాల్లో లేని భాష–ఎంత విస్తృతంగా వ్యవహారంలో వుందో తెలుస్తుంది.

ఇంత శ్రమ పడిన తరువాత కూడా గురజాడ ఆధునిక రచనా భాషకి కొన్ని కట్టుబాట్లు అవసరమని, నిజానికి ఇప్పుడు కావలిసింది ఒక ‘కొత్త గ్రాంథికం’ అని స్పష్టంగా చెప్పలేదు. అచ్చు యంత్రం వచ్చిన తరవాత భాష మీద దాని ప్రభావాన్ని ఆయన గుర్తించారు[36]Gurajada; Minute of Dissent; §196: After the introduction of printing into the country, a vast mass of popular literatures has sprung up in this dialect and appealed to a much larger reading public than prose works in the kavya dialect.. పూర్వకాలంలో వున్న రకరకాల వ్యావహారికాలకు ఆయన బలమైన ఉదాహరణలు చూపించినా అచ్చు యంత్రం వచ్చిన తరవాత భాష ఆధునిక, వైజ్ఞానిక వ్యవహారాలకి వాడబడుతుందని, అయినా గ్రంథప్రచురణకర్తలు భాషా స్వరూపాన్ని సమర్థంగా నిర్ణయించరని, వాళ్ళు అచ్చు పుస్తకాల్లో వాడే భాష వ్యహారంలో వుండే తెలుగుకి దగ్గరలో వుండేదే కానీ ఇది అక్షరాలా ఎవరూ మాట్లాడే తెలుగు కాదని, గురజాడ అప్పారావు గుర్తించలేదు. అందుచేత ఆయన వ్యాసం అంతా గిడుగు రామమూర్తి పంతులు పద్ధతిలో గ్రాంథిక భాషని కాదనడానికే ఉపయోగపడింది కానీ ఆధునిక తెలుగు ఎలా వుండాలో నిర్ణయించడానికి ఉపయోగపడలేదు.

చివరి మాటగా చెప్పాలంటే ఈ వివాదాల వల్ల గ్రాంథిక భాష ఎందుకు పనికిరాదో చెప్పడానికి బలం యేర్పడింది కాని ఆధునిక తెలుగు ఏ రూపంలో వుండాలో చెప్పడానికి మంచి రచనలు తయారవలేదు.

జయంతి రామయ్య పంతులు

జయంతి రామయ్య పంతులు 1860 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరంలో పుట్టారు. పుట్టిన ఇరవయ్యొకటో రోజున దత్తతకు వెళ్ళారు. ఆయన అక్షరాభాస్యం వీధి బళ్ళో సాంప్రదాయిక పద్ధతిలో జరిగింది. అప్పుడు రాయడానికి పలకలు బలపాలు వుండేవి కావు. నేలమీద ఇసకలో గుంట ఓనమాలు దిద్దటం నేర్చుకున్నారు. తరవాత కంఠోపాఠంగా బాలరామాయణం, అమరకోశం చెప్పించుకున్నారు. 1870లో ఆయన చదివే స్కూలు గ్రాంట్-ఇన్-ఎయిడ్ (Grant in aid) పాఠశాలగా మారింది. 1874లో రామయ్య పంతులుకి ఆయన అన్నయ్య ద్వారా ఇంగ్లీషు విద్యలో ప్రవేశం కలిగింది. ఆ ఇంగ్లీషు త్వరగా నేర్చుకుని హైస్కూలు చదువు పూర్తి చేసి 1877లో మెట్రిక్యులేషన్ పరీక్ష, తరవాత ఎఫ్.ఎ. కూడా మొదటి తరగతిలో ప్యాసయ్యారు. స్కూల్లో ఉపాధ్యాయుడిగా వుద్యోగం చేద్దామనుకున్నారు కానీ అప్పటి కాలేజి ప్రిన్సిపల్ మెట్‌కాఫ్ (Metcalfe) సలహా మీద బి.ఎ.లో చేరి లాజిక్, ఫిలాసఫీ, ఎథిక్స్, మెటాఫిజిక్స్ చదివారు. రామయ్య పంతులు మొదట్లో పిఠాపురం లోని మహారాజావారి హైస్కూల్లో హెడ్మాస్టరుగా పనిచేసి 1886లో ఆ ఉద్యోగం వదిలేసి ఆపైన న్యాయశాస్త్రం చదివి బి.ఎల్. డిగ్రీ తెచ్చుకున్నారు.

ఆ తరవాత రెవెన్యూశాఖలో వుద్యోగంలో చేరి క్రమక్రమంగా డెప్యూటీ కలెక్టరు అయ్యారు. ఆ రోజుల్లో డెప్యూటీ కలెక్టరు వుద్యోగం చాలా పెద్ద ఉద్యోగం. రెవెన్యూ శాఖలో భారతీయులు పొందగలిగిన అతి పెద్ద ఉద్యోగం అదే. ఆ పైస్థానంలో వుండే కలెక్టరు ఎప్పుడూ తెల్లవాడే వుండేవాడు. ఇంగ్లీషు చదువుకుని రెవెన్యూ శాఖలో వుద్యోగం చేస్తూ ఆఫీసు ఫైళ్ళలో తలమునకలుగా వుండే రామయ్య పంతులు ఎప్పుడు నేర్చుకున్నారో, ఎవరి దగ్గర నేర్చుకున్నారో సమాచారం లేదు గాని ఆయనకి తెలుగు కావ్యాల మీద, సంస్కృత భాష మీద ఒక పెద్ద పండితుడికి ఉండదగినంత సామర్థ్యం వచ్చింది. ఆయన లాక్షణిక భాషావాదాన్ని సమర్ధిస్తూ రాసిన పెద్ద వ్యాసం (A defense of literary Telugu) చదివితే ఈ సంగతి స్పష్టంగా తెలుస్తుంది. దీనితో పాటు ఆంధ్ర సాహిత్య పరిషత్తు నిర్మాణం లోను, గ్రాంథికవాదుల్ని కూడగట్టుకుని వారి వాదానికి జమిందారుల ప్రాపకం సంపాదించడం లోను, సూర్యరాయాంధ్ర నిఘంటువు సంపాదకత్వం తన చేతులోకి తీసుకోవడం లోను ఆయన రాజకీయంగా కూడా చాలా బలమయిన మనిషి అని కూడా తెలుస్తుంది.

దాదాపుగా తన చివరి రోజుల్లో (1934లో) ఆయనిచ్చిన ఉపన్యాసాలని, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగులో ఆధునికాంధ్ర వాఙ్మయ వికాసవైఖరి పేరుతో 1937లో అచ్చు వేశారు. ఆ పుస్తకం చదివితే ఆయనకి ఆధునిక తెలుగు సాహిత్యం గురించి, తెలుగు భాష గురించి ఉన్న అభిప్రాయాలు ‘ఎ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు’ రోజులనుంచి చాలా మారాయని, ఎక్కువ ఉదారంగా తయారయ్యారని మనకి అనిపిస్తుంది. అంతే కాకుండా సాహిత్య విమర్శ గురించి ఆయన అభిప్రాయాలు కూడా స్పష్టంగా తెలుస్తాయి. ముఖ్యంగా ఆ ఉపన్యాసాలలో ఆయన చిన్నతనంలో తెలుగు చదువులు ఎలా వుండేవి, బళ్ళలో ఏ పుస్తకాలని ఎలా చెప్పేవారు అనే వాటి గురించి చాలా వివరంగా సమాచారం ఇచ్చారు.

ఆయన అభిప్రాయంలో వర్తమాన కాలంలోనే వచనగ్రంథాలు వచ్చాయి. అంతకుముందు ఉన్నవన్నీ పద్యగ్రంథాలే! తెలుగులో వచనయుగాన్ని మొదలుపెట్టినవాడు చిన్నయ సూరి. రామయ్య పంతులు దృష్టిలో చిన్నయ సూరి వచనం గొప్ప వచనం. ఆ తరవాత ఆయన మెచ్చుకున్నవాళ్ళలో ముఖ్యుడు వీరేశలింగం పంతులు. రామయ్య పంతులుకి తంజావూరు, మధుర రాజ్యాలలో తెలుగు పుస్తకాలు చాలా వచ్చాయని తెలుసు. ఆ కాలంలో వచ్చిన యక్షగానాలు, వచనగ్రంథాలు ఆయన చదివారు, అయినా ఆ యక్షగానాలు ఆ కాలానికి ప్రేక్షకులకి ఆనందం కలిగించేవే కానీ అవి మంచి రచనలు కావని ఆయన నమ్మకం. తరవాత వీరేశలింగం, ఆయనను అనుసరించి చిలకమర్తి లక్ష్మీనరసింహం, రాసిన నవలల్ని కూడా ఆయన తన ప్రసంగాలలో కొంత ప్రశంసాపూర్వకంగానే ప్రస్తావించారు. ఆధునిక కాలంలో తెలుగులో నాటకనిర్మాణం సంస్కృత నాటకాలకి ఇంగ్లీషు నాటకాలకి అనువాదంగా వచ్చిందని ఆయన వివరించారు.

అప్పటికి తెలుగులో వచ్చిన పుస్తకాలన్నిటినీ దాదాపుగా పూర్తిగా చర్చించిన ఈ వ్యాసంలో ఆయన గుర్తించినవి, మెచ్చుకున్నవి అన్నీ లాక్షణికభాషలో రాసినవే. దీనితో పాటు ఇంగ్లీషులో చదివి ఆ విషయాలు తెలుగులో చెప్పాలనే కోరికతో రాసిన శాస్త్రగ్రంథాలను గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగులో ఆధునిక శాస్త్ర విషయాలు చెప్పడానికి కావలసిన పరిభాషాపదాలు లేవు కాబట్టి కొత్తగా తయారుచేసుకోవలసిన అవసరం వుందని కూడా ఆయన గుర్తించారు. పాశ్చాత్యదేశాల్లో శాస్త్ర పరిభాషాపదాలన్నీ గ్రీకు నుంచి లాటిన్ నుంచి తెచ్చుకున్నట్టుగా మనం కూడా భారతీయ భాషలన్నిటికీ సమానంగా సంస్కృతం నుంచి పరిభాషా పదాలు తయారు చేసుకోవాలని, ఇవి అన్ని భారతీయ భాషలకి సమానంగానే పనికొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నిఘంటువులు దగ్గరికి వచ్చేసరికి ఆయన శబ్దరత్నాకరాన్ని ప్రత్యేకంగా ప్రశంసించి, అయినా అది సమగ్రం కాదు కాబట్టి పిఠాపురం మహారాజావారి డబ్బుతో తయారవుతున్న సూర్యరాయాంధ్ర నిఘంటువు గురించి ప్రస్తావించారు[37]అయితే ఈ నిఘంటు సంపాదకత్వం విషయంలో జరిగిన రాజకీయాలు ఆయన చెప్పలేదు, ఆ వుపన్యాసాలలో చెప్పలేరు కూడా, కాని మనం తెలుసుకోవాలి. ఇలాంటి నిఘంటువొకటి తయారు చేయాలని కందుకూరి వీరేశలింగం సూచనమీద ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రారంభించిన మొదట్లోనే ఒక తీర్మానం చేసి దానికి వేదం వెంకటరాయశాస్త్రిని ప్రధాన సంపాదకులుగా నెలకు 250 రూపాయల జీతం మీద నియమించారు. ఆయనకు సహాయకులుగా మరో యిద్దరిని నెలకు నూరేసి రూపాయిల జీతం మీద నియమిస్తామని మాట ఇచ్చారు కాని, నియమించలేదు. వేదం వెంకటరాయశాస్త్రి తాను ఒక్కడే ఆ పని చేయడం మొదలుపెట్టారు. వేదం వెంకటరాయశాస్త్రి మద్రాసులోని పుదుపేటలో చుట్టుపక్కల వుండేటటువంటి కుళ్ళువాసనలన్నీ భరిస్తూ కష్టపడి పనిచేశారు కాని నిజానికి ఆయనని ఎలాగోలా తప్పించి నిఘంటు కార్యస్థానం పిఠాపురానికి మార్చి పిఠాపురం మహారాజావారి ఆర్ధిక సహాయంతో కొనసాగించాలని ఒక నిర్ణయం చేశారట. ఆ తరువాత వేదం వెంకటరాయశాస్త్రి సంపాదకత్వం పోయి అప్పటికి ఉద్యోగంనుంచి విరమించిన జయంతి రామయ్య పంతులుగారి చేతిలోనికి సంపాదకత్వం వచ్చింది. (“వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము”; మద్రాసు; 1943; పేజి 150-159.)
 
ఏమయినా సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలో గిడుగు రామమూర్తిగారి సహాయం కావాలంటూ జయంతి రామయ్య పంతులుగారు ఉత్తరంరాశారట. దానికి గిడుగు రామమూర్తిగారి సమాధానం యిది. (మరోసారి గిడుగు రామమూర్తి; చేకూరి రామారావు (సం); 1988; పేజి. 45) ఈ పాఠం గిడుగు రామమూర్తిగారు 1924 మార్చి 7వ తేదీనాడు వేటూరి ప్రభాకరశాస్త్రిగారికి రాసిన ఉత్తరంలోనిది.]
 
“అయ్యా! మన మతాలు వేరు. నేను అవునన్నది మీరు కాదంటారు. మీకు అచ్చు ప్రతులలోని శబ్దాలు సాధువులు; నాకు వ్రాత ప్రతులలోనివి సాధువులు. మీకు బాలవ్యాకరణము ప్రమాణము; మాకు కవి ప్రయోగము ప్రమాణము. శబ్దాల వలెనే శబ్దార్థాలు కూడా శబ్దరత్నాకర మందు దోషయుక్తమై ఉన్నవి. వ్యుత్పత్తులు కూడా శ.ర.లో తప్పులున్నవి. ఇంతే కాక ప్రాచీనాంధ్ర శబ్దములకు వర్తమాన వ్యావహారికాంధ్రములో అర్థము చెప్పడము పూర్వ పండితుల సంప్రదాయము. నాగదేవ భట్టోపాధ్యాయుడున్నూ, తాళ్ళపాక వారున్నూ, నామలింగానుశాసనమునకు, తెలుగు టీకలు అట్లే వ్రాసినారు. పరవస్తు శ్రీనివాసాచార్యులుగారు సర్వశబ్ద సంబోధినిలో సంస్కృతాలకు తెలుగున వాడుక మాటలతో అర్థము చెప్పినారు. మామిడి వెంకయ్య ఆంధ్రదీపిక అట్లే రచించినాడు. సంస్కృతాంధ్ర కావ్యాలకు టీకలు రచించిన పండితులందరూ వ్యావహారికమే వాడినారు. బ్రౌణ్య నిఘంటువు కూడా ఆ సంప్రదాయము ననుసరించే గొప్ప పండితుల రచించినారు. ఆ శిష్టాచారము మీరు కూడా అవలంబించే యెడల కూలి ఏమీ కోరకుండా సేవ చేస్తాను. లేదా మీరు గ్రంథమంతా సిద్ధము చేసిన తర్వాత నేను వచ్చి చూచి, దానిలో చేర్చవలసినవీ, తొలగించవలసినవీ, మార్చవలసినవీ సప్రమాణముగా తెలియజేస్తాను. నా ఉపదేశము మీరు అంగీకరించినప్పుడు ఒక్కొక్క అంశమునకు ఒక్కొక్క రూపాయి చొప్పున ఈనాము దయచేయవలెను.” దీనికి రామయ్య పంతులుగారు సమాధానం రాయలేదట.
 
సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణ సమయంలో రామయ్య పంతులుగారి వ్యవహార నిర్వహణపైనా, మొదటి సంపుటాలు అచ్చయిన తరవాత అంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన పండితుల పేర్లను అచ్చులో పేర్కొనక పోవడం గురించి చాలా విమర్శలున్నాయి. ఉదాహరణకి మొదటి భాగం (అ నుండి ఔ వఱకు) ‘పండిత సాహాయ్యమున జయంతి రామయ్యపంతులు బి. ఏ., బి.ఎల్. గారిచే రచింపఁబడి’నట్లుగా వుంటుంది. 1910-1914 మధ్య కాలంలో రామయ్య పంతులుగారితో చాలా దగ్గరగా పని చేసినవాళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వ శైలి కారణంగానో మరో కారణం చేతనో త్వరగా దూరమయ్యారు. ఉదా. చిలుకూరి వీరభద్రరావు (చూ. ఆంధ్రుల చరిత్రము-3వ భాగము; 1916) పానుగంటి లక్ష్మీనరసింహరావుగారి ఆంధ్రసాహిత్యపరిషత్తు పదవ అధ్యక్షోపన్యాసంలో కూడా విభేదాలని గమనించవచ్చు.
.

కొమర్రాజు లక్ష్మణరావు మొదలుపెట్టిన ఆంధ్ర విజ్ఞానసర్వస్వం మూడు సంపుటాలు వచ్చాయని, ఇటువంటి పుస్తకాలు పూర్వం తెలుగులో లేవు కాబట్టి ఇంగ్లీషునుంచి తెచ్చుకున్నప్పటికీ ఇవి మనకు అవసరమని రామయ్య పంతులు గుర్తించారు. చరిత్రకు సంబంధించినంత వరకు సంస్కృతంలోను, తెలుగులోను కూడా చాలా సమాచారం దొరుకుతుంది కానీ అందులో అనేక అతిశయోక్తులు, కొంత సత్యము కలిసిపోయి ఉంటాయని ఆయన గమనించారు: ‘న్యాయమూర్తియైన ధర్మాధికారి వాది ప్రతివాదులు తెలుపు విషయములఁ బరిశీలించి సత్యమును గని పెట్టునట్లు–ఐతిహాసికుడు కూడా సామగ్రిని మధ్యస్థభావముతో నిష్పక్షపాతముగఁ బరిశీలించి సత్యమును గనిపెట్టవలయును, గాని, వేగిరపాటుతో నపసిద్ధాంతము చేయఁగూడదు.’

రాజమండ్రిలో చిలుకూరి వీరభద్రరావు నాయకత్వంలో స్థాపించిన ఆంధ్రా హిస్టారికల్ సొసైటీని గురించి కూడా రామయ్య పంతులు ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. ఇంగ్లీషులో జాన్సన్ రాసిన లైవ్స్ ఆఫ్ పొయట్స్ లాంటివి తెలుగులో వస్తున్నందుకు సంతోషిస్తూ, ఆ విషయంలో గురజాడ శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం మొదలుపెట్టిన పనిని గురించి కూడా ప్రస్తావించారు. తెలుగులో స్వీయచరిత్రలు లేవన్న విషయం గుర్తించి వీరేశలింగం స్వీయచరిత్ర, ఇంకా ఇతర స్వీయచరిత్రలు, ముఖ్యంగా చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి జాతకచర్య గురించి వివరంగా చర్చించారు. కావ్యవిమర్శలో కూడా మృదువైన పద్ధతిని అనుసరించాలి కాని ఒకరినొకరు తిట్టుకునే పద్ధతి కూడదని సూచించారు. ఆధునిక కాలంలో అప్పటికి ఉన్న సాహిత్య సమాచారమంతా సేకరించి వాటిగురించి చాలా వివరంగా చెప్పిన ఉపన్యాసాలు ఇవి.

మొత్తం మీద ఈ ఉపన్యాసాలన్నీ చదివితే తెలుగు ఆధునికీకరించబడాలని, తెలుగులో లేని ప్రక్రియలు అవసరమయినంత వరకు తెచ్చుకోవాలని రామయ్య పంతులు స్పష్టంగానే చెప్పారని బోధపడుతుంది. ఐతే, భావకవిత్వాన్ని గురించి ఆయనకి అంత మంచి అభిప్రాయం వున్నట్టు లేదు. రవీంద్రనాథ్ టాగోరుని అనుసరించి, ఇంగ్లాండులో షెల్లీ, కీట్స్ మొదలయిన కవుల ప్రభావాన్ని అంగీకరించి, తెలుగులో భావకవిత్వం వచ్చిందని చెప్తూ ‘భావకవిత్యమందుఁ బెక్కుమందికి స్పురించుచున్న పెద్ద దోషము భావాభావము.’ అన్న అభిప్రాయం వెలిబుచ్చారు. అనంతపంతుల రామలింగస్వామి రాసిన శుక్లపక్షము ఆయనకి చాలా నచ్చింది. ఇక తెలుగు భాష పరిస్థితికి వచ్చేసరికి వ్యవహారంలో వున్న భాష ఒక ప్రాంతంవారి భాష ఇంకో ప్రాంతంవారికి అర్థం కాదని, ఒక కాలంలో రాసిన భాష ఇంకొక కాలంవారికి అర్థం కాదని, విద్యావంతులైన బ్రాహ్మణులు మాట్లాడే భాష కూడా ప్రాంతంనుంచి ప్రాంతానికి మారుతుందని, ఇలాంటి భాషలో రచనలు చెయ్యకూడదని ఆయనకు గట్టి నమ్మకం. అందుచేత లాక్షణికమైన భాషే రచనల్లో వాడాలని ఆయన అభిప్రాయం. తెలుగులో కవిత్రయంవారి మహాభారతం చదువుకోని పల్లెటూరివాళ్ళకి కూడా అర్థం అవుతుందని, కేవలం ప్రబంధాలే పండితులకు మాత్రమే అర్థమయ్యే పుస్తకాలని రామయ్య పంతులు వివరించారు:

భారతము మొత్తముమీఁద ప్రౌఢగ్రంథమేకదా! ఆ గ్రంథము పల్లెటూళ్ళలోఁ బురాణముగాఁ జదువు నాచారము చిర కాలమునుండి యున్నది. ఒకరు పుస్తకము చదువుట యింకొకరర్థము చెప్పుట యాచారము. ఇంచుమించుగా గ్రామములో నున్న వాఱందరును వచ్చి యాపురాణము విందురు. స్త్రీలు ముఖ్యముగా వత్తురు. చదువువాని కంటె నర్థము చెప్పువాఁడు గట్టివాఁడుగా నుండవలయును గదా! వ్రాలుచేయనేరని వారు శ్రుతపాండిత్యముచేతనే భారతమున కర్థము చెప్పుట నే నెఱుఁగుదును. ప్రతిపదార్థముతో నన్వయించు సామర్థ్యము లేకున్నను సభ్యులలో ననేకులకు పద్యము చదువఁగనే దాని ముఖ్య భావము బోధపడును.

లాక్షణిక భాషలో రాసినా వీరేశలింగం పుస్తకాలు, అలాగే చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన గయోపాఖ్యానం కొన్నివేల ప్రతులు అమ్ముడు పోవటం గుర్తించారు. లాక్షణిక భాష కూడా చిన్నయ సూరి రాసినట్టే కాకుండా అవసరమైన చోట విసంధి పాటిస్తూ రాయాలని ఆయన అభిప్రాయం: ‘ఏమార్పులు చేసినను నియమములకు లోఁబడి యుండవలెను గాని విచ్చలవిడిగా నుండరాదు.‘ ఈ నమ్మకమే గ్రాంథిక భాషావాదంగా పేరుపడ్డ ఉద్యమానికి ఊపిరి.

ఇంతకీ, విశ్వవిద్యాలయాలల్లోను, పాఠశాలల్లోను దేశభాషలు ప్రవేశ పెట్టాలి, దేశభాషల్లో ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు రాయించాలి అన్న లార్డ్ కర్జన్ ఆలోచన తెలుగుదేశం దాకా వచ్చేసరికి లాక్షణిక, గ్రామ్య భాషావిభేదాలుగా పరిణమించింది.

జయంతి రామయ్య పంతులు మొదలైన వారిని గ్రాంథిక భాషావాదులు అని గిడుగు రామమూర్తి పెట్టిన పేరు ఒప్పేసుకోకుండా వాళ్ళ వాదన ఏమిటో నిశితంగా పరిశీలించినవారు ఇంతవరకూ ఎవరూ లేరు. ఈ భాషావాదాలని గురించి బూదరాజు రాధాకృష్ణ, అక్కిరాజు రమాపతిరావుల దగ్గరి నుంచి భాషా శాస్త్రజ్ఞుడు భద్రిరాజు కృష్ణమూర్తి వరకు గ్రాంథికము, వ్యావహారికము అన్న మాటలనే వాడుతూ వచ్చారు. నన్నయ కాలంలోనే నన్నయ తన భారతంలో రాసిన భాషకి, ఆ కాలంలో శాసనాల్లో వున్న భాషకి తేడా వుందని కృష్ణమూర్తి గమనించారు. కానీ నన్నయది ప్రాచీన (Archaic) భాష అని కృష్ణమూర్తి అన్నారు. ఈ మాట తప్పు. ఏ భాషలో అయినా కావ్యాలలో ఉపయోగించే భాష ఒకటి, లౌకిక వ్యవహారంలో ఉపయోగించే భాష ఒకటి, రెండు వేర్వేరు భాషలు ఉంటాయి. నన్నయది ఛందస్సు బలం వల్ల ఏర్పడిన కావ్యభాష. ఈ భాష ఛందస్సు బలం వల్లే, ఛందస్సు ఒప్పుకున్న చిన్న చిన్న మార్పులతో, దాదాపు 900 సంవత్సరాలపాటు కొనసాగిందనీ ఇంతకు ముందే చెప్పాం. అంచేత ఇది ఆర్కయాక్ భాష కాదు, కావ్యభాష. వ్యవహారంలో వచనం రాయవలసిన అవసరం అచ్చుయంత్రం వచ్చిన తరవాత 19వ శతాబ్దం ఆరంభంలోనే కలిగింది. లౌకిక వ్యవహారంలో వున్న తెలుగు అనేక రూపాల్లో ఒక స్థిరమైన వర్ణక్రమం లేకుండా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు రాసేవారు. ఇలాంటి తెలుగే మనకు పండితులు రాసిన వ్యాఖ్యానాల్లో కూడా కనిపిస్తుంది. పాటల్లో అయితే ఆ పాటలు పాడేవాళ్ళ స్థాయిని బట్టి–అన్నమయ్య దగ్గరనుంచి దంపుళ్ళ పాటలు పాడే ఆడవాళ్ళవరకు– వాళ్ళ వాళ్ళ ఛందస్సులకి అనువైన పద్ధతిలో మాటలు వాడేవారని, వీటన్నిటికి కలిపి వ్యావహారికం అనే పేరు పెట్టడం వల్ల చాలా గందరగోళం ఏర్పడిందని, ఇది ఒక వ్యావహారికం కాదు, అనేక వ్యావహారికాలు అని గుర్తించాలి అని, మేము ఇంతకు ముందు చెప్పివున్నాం.

గిడుగు రామమూర్తి పంతులు మనం వాడవలసిన భాషకి వ్యావహారిక భాష అని పేరు పెట్టారని మనం ఇంతకు ముందు చూశాం. కానీ ఎవరు వ్యవహరించే భాష వ్యావహారిక భాష అని అడిగితే ఆయన స్పష్టంగా చెప్పలేక శిష్ట వ్యావహారిక భాష అనే మాట అన్నారు. శిష్టులంటే ఎవరు? గోదావరి జిల్లాల్లో చదువుకున్న బ్రాహ్మణులు. వాళ్ళు కూడా ఉచ్ఛరించే పద్ధతిలోనే తెలుగు రాయరు. అందుచేత శిష్ట వ్యావహారికం అనే మాటకి స్పష్టమైన నియమాలు చెప్పటం కష్టమై కూర్చుంది. వీళ్ళల్లో గురజాడ అప్పారావు నిజంగా ఆలోచనాశీలి అయిన మనిషి. ఆయన కూడా తాను రాసిన పుస్తకాలలో ఎక్కడా శిష్ట వ్యావహారికం అంటే ఏమిటో ప్రదర్శించి చూపించలేదు. ఆయన రాసిన కన్యాశుల్కం వ్యావహారిక భాషలో రాసిన మొదటి సాహిత్య గౌరవం గల రచన అని అందరూ అనడం మొదలు పెట్టారు. కానీ జాగ్రత్తగా చూస్తే కన్యాశుల్కంలో భాష రామమూర్తి పంతులు అడిగిన శిష్టవ్యావహారికం కాదు. అందులో వున్న భాష పాత్రోచితంగా రాసిన భాష. ఏ పాత్ర ఏ కులానిదో, సమాజంలో ఏ స్థాయిదో గమనించి వాళ్ళు ఉచ్చరించే పధ్ధతి జాగ్రత్తగా అనుసరించి రాసిన నాటకం కన్యాశుల్కం. ఒకే పాత్ర తాను ఎవరితో మాట్లాడుతున్నది అనే దాన్ని బట్టి ఉచ్చారణని మారుస్తుంది అని కూడా గమనించి ఆ ఉచ్చారణ అచ్చులో చూపించడానికి అవసరమైన అక్షరాలు లేకపోతే వాటిని సూచించడానికి ప్రత్యేకమైన మార్గాలు అనుసరించి రాసిన పుస్తకం కన్యాశుల్కం. కన్యాశుల్కం తర్వాత తర్వాత అచ్చు వేసిన కొంతమంది ఈ విశేషాలని గమనించలేక ఆయా మాటల వర్ణక్రమాన్ని మార్చేశారు కూడా.

ఇకపోతే అప్పారావు స్వయంగా రచయితగా రాయవలసి వచ్చిన ఉపోద్ఘాతం, అంకితం మొదలైనవన్నీ ఇంగ్లీషులో రాశారు. నాటకం లోపల పాత్ర ప్రవేశాన్ని, అంకాన్ని, రంగాన్ని సూచించే భాష కేవలం గ్రాంథికం, అంటే చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం రాసినది. ఆయన రాసిన వ్యాసం (Minute of Dissent) ఇంగ్లీషులో రాశారు, తన సొంత డైరీలు ఇంగ్లీషులో రాశారు. చాలా వ్యక్తిగత విషయాలయిన తన ఆరోగ్య పరిస్థితిని గురించి డాక్టరుకి రాసిన సమాచార పత్రం కూడా ఇంగ్లీషులోనే రాశారు. ఇవన్నీ చూస్తే అప్పారావు ఆలోచించే భాష ఇంగ్లీషా, తెలుగా అని అనుమానం కలుగుతుంది. ఆయన వ్యావహారికవాదే కానీ వ్యావహారిక భాషలో వచనం ఎలా ఉంటుందో రాసి చూపించలేదు. నీలగిరిపాటల దగ్గరనించి ముత్యాలసరాల వరకు పాటలో వుండే సాహిత్యంలో తెలుగు ఎంతో అందంగా పట్టుకోగలిగిన అప్పారావు; నిత్య వ్యవహారంలో రకరకాల సందర్భాలలో రకరకాల మనుషులు మాట్లాడే తెలుగు అంత స్పష్టంగానూ పట్టుకోగలిగిన అప్పారావు; ఆధునిక వ్యవహారానికి ఆలోచనలు, శాస్త్ర విషయాలు, చరిత్ర, విమర్శ చెప్పగలిగే వచనం ఎందుకు రాయలేదో మనం ఊహించలేము. కళింగదేశ చరిత్ర రాస్తానని ఒప్పుకున్నారని తెలుస్తుంది; అందుకు కావలసిన పుస్తకాలు,శాసనాలు సంపాదించారని కూడా అంటున్నారు కానీ ఆయన ఆ పుస్తకం కనీసం మొదలు పెట్టినట్టు కూడా రుజువులు లేవు. ఆయన రాతప్రతులు అన్నీ ఏమైపోయాయో తెలియదు/ అవి ఎక్కడికి వెళ్ళాయో, ఎవరి దగ్గర ఉండేవో పరిశోధించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. మాకు తెలిసినంత వరకు తార్నాకలో (హైదరాబాదు) వున్న ఆర్కయివ్స్‌లో భద్రపరచపడిన కాగితాలే అందరికీ దొరికేవి[38]Pennepalli Gopalakrishna, Diaries of Gurajada, A.P Gov. oriental manuscripts library, Hyderabad, 2009.. ఆయన రాతప్రతులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు మనకు తెలిసినవాళ్ళు అవసరాల సూర్యారావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, నార్ల వెంకటేశ్వరరావు, మరీ ముఖ్యంగా విశాలాంధ్ర ప్రచురణ సంస్థ వాళ్ళు. తార్నాక ఆర్కయివ్స్‌కి చేరిన ఆ కొన్ని కాగితాలూ ఎవరు వాళ్ళకి ఇచ్చారో ఆచూకీ తెలియదు. గురజాడని మహాకవి అని, యుగకర్త అని పొగిడిన కమ్యూనిస్టులు, ఆయనకి విగ్రహాలు వేయించిన ఆధునికులు, ఆయన కాగితాలని భద్రపరచడంలో కానీ ఆయన పుస్తకాలని అచ్చు వేయించడంలో కానీ కొంచెం కూడా శ్రద్ధపెట్టలేదు. ఇక విశాలాంధ్ర సంస్థ గురజాడ పుస్తకాలని తమకి తోచినంత గందరగోళంగా, లెక్కలేనన్ని అచ్చుతప్పులతో ప్రచురించిన తీరు చూస్తే గురజాడని మావాడు అని చెప్పుకోవటంలో వున్న ఆసక్తి, పట్టుదల ఆయన పుస్తకాల పట్ల, పుస్తకాల ప్రచురణ పట్ల లేదని స్పష్టమవుతుంది.

ఇక గురజాడ పరిస్థితి ఇలా ఉండగా గిడుగు రామమూర్తి రాసిన తెలుగు, పేరుకి వ్యావహారికమే కానీ నిజానికి గ్రాంథికానికే దగ్గరగా ఉంటుంది. ఇంతకన్నా చమత్కారమైన విషయం ఇంకొకటి ఏమిటంటే ఈ వ్యావహారిక భాషావాది తన సొంత విషయాలు తన భార్యకు రాసిన ఉత్తరాలలో చక్కని పద్యాల్లో రాశారు. ఆయన భార్య కూడా అంత చక్కని పద్యాల్లోనే సమాధానం రాశారు. పద్యాల్లో సొంత ఇంటి సంగతులు భార్యాభర్తలు మాట్లాడుకోడానికి పనికి వచ్చినప్పుడు, ఇతర లౌకిక వ్యవహారాలకి ఎందుకు పనికిరాదని ఆయన అనుకున్నారో చెప్పడం కష్టం. ఇది ఇలా ఉండగా రామమూర్తి పంతులు చిన్నయ సూరి నీతిచంద్రికలో వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు చూపించి ఆ భాష చిన్నయ సూరి కూడా వాడలేదని; అందుచేత ఆధునిక వ్యవహారానికి పనికిరాదనీ వాదించారు. కానీ చిన్నయసూరే స్వయంగా హిందూధర్మశాస్త్రసంగ్రహం అన్న పుస్తకంలో ఆధునిక న్యాయవ్యవహారాన్ని గ్రాంథిక భాషలో రాసి చూపించాడని రామమూర్తి పంతులు గుర్తించలేదు. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్క రామలింగారెడ్డి వంటి ఆధునికుడు ఆధునిక సాహిత్యవిమర్శకే మూలగ్రంథమని అందరూ అనే కవిత్వతత్త్వవిచారము, ఎవరూ పట్టించుకోకపోయినా నిజంగా పట్టించుకోవలసిన అర్థశాస్త్రము గ్రాంథిక భాషలోనే రాశారు.


స్థూలంగా చెప్పాలంటే, భాషలో రకరకాల శైలులు వున్నాయి. సాహిత్యంలో వాడే భాష ఒక రకం, శాస్త్ర విషయాలు, ఆలోచనలు చెప్పటానికి వాడే భాష ఇంకొక రకం, ఈ రెండురకాల భాషలకి మధ్య తేడా ఉంది. మొదటి దాంట్లో ఏం చెప్పాలి అనే అనే విషయం మీద కాకుండా ఎలా చెప్పాలి అన్న విషయం మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది, రెండవ దాంట్లో స్పష్టతకు, తార్కికతకి, సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కానీ చెప్పే విషయం అందంగా ఉందా లేదా అన్న విషయం మీద దృష్టి ఉండదు. ఇలా విడదీసి చూస్తే గ్రాంథికవాదులకి మూలమైన చిన్నయ సూరి రెండు రకాల శైలుల్లోనూ పుస్తకాలు రాశాడని, వ్యావహారికవాదులు ఆ పని చేయలేదని చెప్పొచ్చు.

గ్రాంథిక వ్యావహారిక భాషావివాదం అంతా కూడా పదాలు, వాటి వర్ణక్రమాలు, మరీ ముఖ్యంగా క్రియా పదాలు ఎలా ఉండాలి అనే. దీని తరువాత వ్యావహారికవాదులు ముఖ్యంగా చర్చించిన విషయం సంధులు ఎక్కడ విడతీయొచ్చు, ద్రుతప్రకృతికాలు, కళలు వీటిని పాటించాలా వద్దా, సరళాదేశాలు, గసడదవాదేశాలు పాటించి తీరాలా, అరసున్నాలు వాడకపోతే వచ్చిన నష్టమేమిటి–ఇలాటివి. తెలుగులో వచనం అప్పుడప్పుడే అలవాటు లోకి వస్తోంది కాబట్టి అందంగా వుండే వచనం, స్పష్టంగా వుండే వచనం, ఈ రెంటి మధ్యా ముఖ్యమైన తేడా ఉండాలి అన్నది ప్రధానంగా చర్చకు రాలేదు. సాహిత్య వచనం రకరకాల అలంకారాలతో, చమత్కారాలతో ఉండేది సరే. కానీ విషయం ప్రధానంగా వుండే వచనంలో స్పష్టత కావాలి కానీ అందం కోసం ప్రయత్నం అక్కర్లేదు అన్న విషయాన్ని విడదీసి చర్చించిన దాఖలాలు కనిపించవు. ఉదాహరణకి ‘మీ వుత్తరం అందింది, సంతోషించాను’ అని రాయవలసిన అవసరం వచ్చినప్పుడు ‘అమందానందకందళిత హృదయారవిందుడనైతిని’ అని రాయక్కర్లేదు. ఈ తేడా గ్రాంథికవాదులు ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. వ్యావహారికవాదులు కూడా మాటల విషయంలో పేచీపడ్డారు కానీ, స్పష్టతకు ఉపయోగపడే వచనం రాసి చూపించలేదు.

ఇది ఇక్కడ ఆపి ఒక ముఖ్యమైన విషయం చూద్దాం. మన వ్యాకరణాలన్నీ పదస్వరూపాన్ని నిర్ణయించేవే. అంటే ఒక పదానికున్న సాధుత్వ, అసాధుత్వాలని నిర్ధారించేవే. ఏదైనా ఒక వ్యాకరణం ప్రకారం సాధించడానికి వీలు లేకపోతే ఆ పదం అసాధువు. అంటే అన్నీ సాధు పదాలే వాడి వాక్యాన్ని గజిబిజిగా రాయవచ్చు అనే ఊహ వాళ్ళు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఉదాహరణకి గ్రాంథిక భాషకి ప్రామాణికంగా పనికొచ్చే బాలవ్యాకరణంలో ఒక సూత్రం వుంది చూడండి:

ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వ పదంబులు క్రమ నిరపేక్షంబుగం బ్రయోగింపంజను (కారక పరిఛ్ఛేదము 37).

పూర్వమిది పరమిది యను నియమ మపేక్షింపక వాక్యమందెల్ల పదంబులు వలచినట్లు ప్రయోగింపందగును – ఏనిప్రభృతిశబ్దములు కొన్ని నియమసాపేక్షంబు లయియుండు – గాలి చల్లగా వీచెను – వీచెను జల్లగా గాలి – చల్లగా గాలి వీచెను – వీచెను గాలి చల్లగా – గాలి వీచెను జల్లగా – చల్లగా వీచెను గాలి.

అని వాక్య నిర్మాణాన్ని గురించి ఒక చిన్న మాట చెప్పి ఊరుకున్నాడు చిన్నయ సూరి. నిజానికి వాక్యనిర్మాణాన్ని గురించి ఇంత తేలికగా చెప్పి వూరుకోవడానికి తెలుగు భాష ఒప్పుకోదు. తెలుగు వాక్యనిర్మాణంలో ఇన్ని రకాల క్లిష్టతలు ఉన్నాయి. వాక్య నిర్మాణానికి రచనలో ఎంత శ్రద్ధ కావాలి అన్న విషయం ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో చేకూరి రామారావు రాసిన తెలుగు వాక్యం అన్న పుస్తకం చదివితే తెలుగు వాక్యనిర్మాణానికి ఉన్న కొన్ని నియమాలైనా బోధపడతాయి. తెలుగు సాంప్రదాయక వ్యాకరణం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కేవలం పదస్వరూపాన్ని గురించిన చర్చలతోటే ఆగిపోయింది.

భిన్న స్వరాలు

టేకుమళ్ళ కామేశ్వరరావు భారతి పత్రికలో (1936) రెండు వ్యాసాలు ప్రచురించి వాటి ద్వారా వ్యావహారిక భాషకి కొన్ని నియమాలు ఏర్పరుచుకోవాలా అన్న విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు. అప్పటికే కొన్ని పత్రికలు, శిష్ట వ్యావహారిక భాష అనే ఒక రకమైన భాష రాస్తున్నాయి. చాలామంది రచయితలు కూడా శిష్ట వ్యావహారికంలో కథలు, వ్యాసాలు రాస్తున్నారు. కానీ పద్యాలు మాత్రం (ఇంతకుముందే చెప్పినట్లు ఛందస్సు బలం వల్ల) లాక్షణిక భాషలోనే వస్తున్నాయి. ఈ భాషలో రకరకాల పదాలు, రకరకాల వర్ణక్రమాలు ఉన్నాయని గమనించిన మండపాక పార్వతీశ్వరశాస్త్రి భాషని నాలుగు రకాలుగా విభజించవచ్చునని చూపించారు (Archaic, Classical, Standard, Dialectical)[39]‘ఆంధ్రభాష’, భారతి, సంపుటి 11, సంచిక 2, 1934, పే. 307-310.. అందులో ‘స్టాండర్డ్’ అని ఆయన నిర్దేశించిన పదాలతో వున్న భాషని ప్రమాణీకరించి అదే వాడాలని చెబితే ఇంగ్లండులోని కింగ్స్ ఇంగ్లిష్ లాగా ఒక ప్రామాణికమైన తెలుగు భాష ఏర్పడుతుందని ఆయన అభిప్రాయం. అయితే ఆయన రాసిన రెండు వ్యాసాలు చాలా చిన్నవి కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువ వివరంగా అనేక ఉదాహరణలతో ఆయన వివరించలేదు. ఆ రకమైన తెలుగులో ఏకత వుంటుందని కావ్యభాషలో అలాంటి ఏకత వుంది కాని దానిలో జీవం లేదని, వ్యావహారిక భాషలో జీవం వుంది కాని ఏకత లేదని, ఇటు జీవము అటు ఏకత వున్న ఒక మధ్య మార్గమొకటి కావాలని పార్వతీశ్వరశాస్త్రిగారి వాదన. (అయితే ఈ వ్యాసాలు రెండూ కూడా లాక్షణిక భాషలోనే రాశారు అన్నది గమనించవలసిన విషయం.)

‘వాడుక భాషలో ఏకత కలిగింపవలసినదని నా ఉద్దేశము కాదు. కావ్యభాషకు నానాత్వము కలిగింపవలసినదని రామమూర్తిపంతులుగారి ఉద్దేశమును కాదు. విశ్వవిద్యాలయము, శాసన సభలు — ఈ సంస్థలలో ఉపయోగింపవలసిన భాష, ఈ సంస్థలతో సంబంధించిన వచనరచనలలో ఉండవలసిన భాష – కేవల కావ్యములు మాత్రమే కాదు, చరిత్ర, గణితము, భౌతికాదులగు శాస్త్రములు, కళలు, వీటితో సంబంధించిన రచనలు, ఉపన్యాసములు — వీటిలోని భాష — ఈ భాషలో ఒక ఏకత ఉండవలసి ఉన్నదనిన్నీ, ఈ ఏకతయే ఆంధ్రత్వమును నిలుపగలదనిన్నీ, ఈ నూతనాను శాసనము ప్రాచీనాంధ్రమునకున్ను, అభినవాంధ్రమునకున్ను కొంతకొంత భేదించి ఉన్నను ఈ రెంటిని కలుపగలిగిన అనుసంధానమై యుండవలసినదనిన్నీ దానికి వర్తమానాంధ్ర మనవలసియున్నదనిన్నీ నా అభిప్రాయము.’

పార్వతీశ్వరశాస్త్రి వర్తమానాంధ్రభాష అన్నప్పుడు ఆయన ఉద్దేశించినది ఆధునిక రచనాభాషనే. దీన్ని గురించి ఈ వ్యాసంలో తర్వాత చెప్తాం. పార్వతీశ్వరశాస్త్రి చెప్పిన దానికన్నా ఎక్కువ వివరంగా, ఎక్కువ స్పష్టంగా టేకుమళ్ళ కామేశ్వరరావు వాడుక భాష: రచనకి కొన్ని నియమాలు పుస్తకంలో చెప్పారు[40]అంతకు ముందు ఆయన ‘వ్యావహారిక రచనకు కొన్ని నియమాలు’ అన్న శీర్షికతో రెండు వ్యాసాలు భారతి పత్రికలో (సంపుటి 13, సంచిక 4-5, 1936) ప్రచురించారు. టేకుమళ్ళ కామేశ్వరరావు; వాడుక భాష: రచనకి కొన్ని నియమాలు; నవ్య సాహిత్య పరిషత్తు; గుంటూరు; 1938..అందులో అప్పటి కాలంలో తాము రాస్తున్నది వ్యావహారికం అనే అభిప్రాయంతో తెలుగు రాస్తున్న వాళ్ళ ప్రచురణల్లోని మాటలనే ఉదాహరణలుగా చూపించి వాటిలో ఏకత్వం వుండటానికి, స్పష్టత ఉండటానికి కొన్ని సూచనలు చేశారు. అందులో ఉన్న సూచనలు ఇప్పటికీ అనుసరణ యోగ్యంగానే వున్నాయి.

ఈ పుస్తకానికి పీఠిక రాసినది గిడుగు రామమూర్తి పంతులే. ఆ పీఠికలో ఆయన కామేశ్వరరావు వ్యాసాలనే కాకుండా పార్వతీశ్వరశాస్త్రి వ్యాసాలను కూడా ప్రసక్తికి తీసుకువచ్చి తమ అభిప్రాయాలని స్పష్టంగా చెప్పారు. ఈ పీఠికలో రామమూర్తి పంతులు సౌజన్యము, తన వాదన మీద పట్టుదల రెండూ కనిపిస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే గిడుగు రామమూర్తి అభిప్రాయంలో వ్యావహారిక భాషకి ఏ నియమాలు అక్కరలేదు. కాలక్రమాన భాష మారుతూ వుంటుంది, కుదుటపడుతూ వుంటుంది. అంచేత ‘వ్యవహారిక భాషారచన చక్కగా అభ్యసించినవారు మంచి పుస్తకములు వ్రాసి ప్రకటిస్తే అవి సామాన్యులకు ఆదర్శములుగా ఉపచరిస్తవి.‘ అని చెప్తూ మర్యాదగా కామేశ్వరరావు సూచనలని, పనిలోపనిగా పార్వతీశ్వరశాస్త్రి సూచనలని, రెండింటినీ తిరస్కరించారు.

[ఈ పుస్తకపు పీఠిక, ఈ సంచికలో చదవగలరు. పూర్తి పుస్తకపు పిడిఎఫ్ ప్రతి. వి. ఎస్. టి. శాయి, గుంటూరు గ్రంథాలయం లైబ్రేరియన్‌లకు కృతజ్ఞతలతో – సం.]

ఏ దేశంలోనూ మాట్లాడే భాషే మాట్లాడినది మాట్లాడినట్టుగా రాయరని, రాయడానికి వేరే భాష ఉంటుందనీ గిడుగు రామమూర్తి గుర్తించలేదు. ఇంగ్లీషులోనే వాట్ డిడ్ యూ డూ (What did you do), అనే నాలుగు పదాలు, ఉచ్చారణలో వాజ్జిజ్యుడూ అని వినిపిస్తాయనీ, అయినా వాళ్ళు రాతలో అలా రాయరనీ ఆయన గ్రహించలేదు. నిఘంటువులూ, నిక్కచ్చిగా నిర్దేశించిన వ్యవహార నియమాల గ్రంథాలూ (Books on usage) వ్యవహర్తలు రాసేటప్పుడు అనుసరించవలసిన రచనా నియమాలని సూక్ష్మాతిసూక్ష్మంగా నిర్దేశిస్తాయని, ఈ పనిలో పత్రికలూ, ప్రచురణ సంస్థలూ పట్టుదలగా పనిచేస్తాయనీ గమనించలేదు. గాలికి వదిలేసిన వ్యవహారంలో వున్న భాష దానంతట అది రచనా భాష అయిపోదని ఆయనకి బోధపడలేదు.

టేకుమళ్ళ కామేశ్వరరావు తమ దృష్టిలో వ్యవహారిక భాషకి వుండవలసిన నియమాలు రాసేనాటికే గిడుగు రామమూర్తి పంతులుకి చాలా పెద్ద పేరు వచ్చింది, ఆయన సభల్లో పెద్దగొంతుకతో గర్జించేవారట. ఇంతకుముందే చెప్పినట్టు ఆయనకి గొప్ప జ్ఞాపక శక్తి వుండేది. కొన్ని వందల గ్రంథాలనుంచి కొన్ని వేల మాటలు దేనికైనా ఉదాహరణగా తడుముకోకుండా ఆయన చూపించేవారు. దీనికి తోడు ఆయనకు విపరీతమైన చెముడు కారణంగా ఎవరు ఏమి మాట్లాడినా వినిపించేది కాదు. ఆయన అనర్గళమైన ఉపన్యాస ధోరణికి, పుంఖానుపుంఖాలుగా యిచ్చే ఉదాహరణల ప్రవాహానికి శ్రోతలందరూ ముగ్ధులైపోయేవారు. అంత పేరున్న మహా పండితుణ్ణి ఎదుర్కోగలిగిన శక్తి టేకుమళ్ళ కామేశ్వరరావు వంటి యువకులకి ఉండకపోవడంలో ఆశ్చర్యం లేదు.

ఆంధ్ర సాహిత్య పరిషత్తు 1911లో ఏర్పడి అందులో వున్న పెద్ద పండితులంతా ఎందుకంత పట్టుదలగా లాక్షణిక భాషనే వాడాలి అని అంటున్నారో కొంతసేపు సానుభూతితో చూసి వుంటే గిడుగు రామమూర్తి వాదన అంత వ్యతిరేకంగా కాకుండా కొంత సానుకూల దృష్టితో వుండి వుండేది. గ్రాంథిక భాష ఎవరూ రాయలేరని, వాళ్ళందరూ రాసేది వ్యవహారంలో వున్న మాటలకి కృతకరూపంలో తయారు చేసిన మాటలతో ఒక కృతక గ్రాంథికం మాత్రమే అని గిడుగు రామమూర్తి బలంగానే వాదించారు. సరిగ్గా ఆ పనే అంతకన్నా సున్నితంగా గురజాడ అప్పారావు చేశారు. అసలు గ్రాంథికమనేది స్కూళ్ళలో తెలుగు పండితులు తయారు చేసిన భాష అని, అది అంతకు ముందు లేదని ఆయన గట్టిగానే చెప్పారు. అయితే వీళ్ళిద్దరూ గమనించని విషయం ఒకటి వుంది. వీళ్ళు చెప్పే వ్యావహారానికి ఏ నియమాలు అక్కరలేదా, ఎవరికి తోచిన వర్ణక్రమంతో వాళ్ళు మాటలు వాడుతుంటే అవన్నీ రచనలో ఉపయోగపడాలా, వాటన్నిటినీ ఒప్పుకోవాలా? ఈ ప్రశ్నని వాళ్ళు వేసుకోనూ లేదు, దానికి సమాధానం వెతకనూ లేదు.

లాక్షణిక భాష నిర్బంధంగా నేర్పకపోతే మన పాత పుస్తకాలు చదివి అర్థం చేసుకునేవాళ్ళు ఎవరూ వుండరని, భాషకు ఒక నియమం లేకపోతే అవ్యవస్థ పాలవుతుందని పండితుల వాదన. నిజానికి ఉభయులూ పూనుకుని–1. అవును. భాషకి నియమం కావాలి, నిత్య వాడుకలో భాష ఎన్ని రకాలుగా వున్నా రచనలో ఒక నియమితమైన భాషే వుండాలి. 2. వచనం ఇప్పటి వైజ్ఞానిక అవసరాలకు పనికొచ్చేది కావాలి. కాబట్టి, ఒక ఆధునిక రచనా భాషని మనం తయారు చేసుకోవాలి. అంటే ఆధునిక గ్రాంథికం కావాలి. 3. మాట్లాడేటట్లుగా ఏ భాషా ఎవరూ రాయడానికి ఉపయోగించరు; అనే సంగతులు ప్రతిపాదనకి తెచ్చి ఒక అంగీకారానికి వచ్చివుంటే ఏ రకమైన సమస్య వుండేది కాదు.


ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం.

తెలుగు ఎప్పుడైనా రాజభాష అయిందా అంటే (నిడదవోలు వెంకటరావుగారి మాట నమ్మాలంటే) ఒక్క నాయక రాజుల కాలంలోనే అయ్యింది[41]నిడుదవోలు వెంకటరావు దక్షిణదేశీయాంధ్ర వాజ్మయము; మదరాసు విశ్వవిద్యాలయము; 1954.. ఆ కాలంలోనే రాజ్యవ్యవహారాలు తెలుగులో నడిచాయి. అంతకుముందు సంస్కృతం రాజభాష. ఆ తరవాత పర్షియన్ రాజభాష. కృష్ణదేవరాయల కాలంలో ఏది రాజభాషో మనం నిక్కచ్చిగా చెప్పలేం. కృష్ణదేవరాయలు తను తెలుగులో కావ్యం రాసినా చాలా శాసనాలు నాలుగు భాషల్లో వేశాడు; సంస్కృతం, కన్నడం, తెలుగు, తమిళం. కృష్ణదేవరాయల కాలంలో మనం గొప్పగా చెప్పుకునే పెద్దన్న, తిమ్మన్న తెలుగు కావ్యాలే రాసినా, కృష్ణదేవరాయలది తెలుగు సామ్రాజ్యం అని మనం చెప్పుకున్నా, రాయలు ఆముక్తమాల్యద తెలుగులోనే రాశాడు కాబట్టి ఆయన తెలుగువాడే అని మనం పొగుడుకున్నా, కన్నడులు అంత గట్టిగాను కృష్ణదేవరాయలు కన్నడిగుడే అని నమ్ముతారు. ఆయన సామ్రాజ్యం కన్నడ సామ్రాజ్యమే అనుకుంటారు. అంచేత నిక్కచ్చిగా నాయక రాజుల కాలంలోనే తెలుగు భాష రాజభాషగా వర్ధిల్లిందని వెంకటరావు ఊహ. ఆ కాలంలోనే కవిత్వం ఒక్కటే కాకుండా తెలుగులో శాస్త్రగ్రంథాలు వచ్చాయి. ఖడ్గలక్షణ శిరోమణి, అశ్వశాస్త్రం, ఔషధ యోగములు, ధనుర్విద్యా విలాసము, ఇంకా ఇలాంటివి. తెలుగులో కవిత్వమే కాకుండా విజ్ఞానం అందించేవి కూడా వచ్చాయి అని వెంకటరావు సరిగానే గుర్తించారు.

ఈ పరిస్థితి ఇలా కొనసాగితే ఎలా వుండేదో మనం చెప్పలేం కాని దీనికి ఇంగ్లీషువాళ్ళు అధికారంలోకి రావడంతో పెద్ద అడ్డొచ్చింది. వాళ్ళు వచ్చిన తొలి రోజుల్లో తెలుగు నేర్చుకుని తెలుగులోనే పరిపాలన చేయాలి అని అనుకున్నారు. కాని పరాయి వాళ్ళకి తెలుగు ఎలా నేర్పాలో మన పండితులకి తెలియలేదు. వాళ్ళు ఈ తెల్లవాళ్ళకి తెలుగు నేర్పడం పేరుతో నన్నయభట్టీయం (ఆన్ధ్రశబ్దచింతామణి) నేర్పేవాళ్ళు. కచేరీలలో పరిపాలనకి ఎందుకూ పనికిరాని ఈ భాషతో ఏమి చెయ్యాలో తెలియక, ఇంక ఏ దారీ బోధ పడక, వాళ్ళు తమకి కావలసిన వ్యాకరణాలు తామే రాసుకున్నారు; కావలసిన నిఘంటువులు వాళ్ళే తయారు చేసుకున్నారు–విలియం క్యారీ, ఎ. డి. క్యాంప్‌బెల్, సి. పి. బ్రౌన్, ఆర్డెన్, మొదలైనవాళ్ళు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు పరిపాలనా భాష అయి వుండేది. తెలుగులో వివిధ విషయాల మీద వచన గ్రంథాలు వచ్చి వుండేవి. అప్పటికే ప్రచారం లోకి వచ్చిన అచ్చు యంత్రం సహాయంతో తెలుగు కొత్త పుంతలు తొక్కేది. అన్యాయంగా ఈ పురోగమనానికి తీవ్రంగా అడ్డొచ్చినవాడు మెకాలే. అప్పటినుంచి ఇంగ్లీషు ప్రభావం ఫలితంగా మనలో ఒక ఆత్మన్యూనతాభావం మొదలయింది. మన పాతభాషని నిలబెట్టుకోడానికి వ్యాకరణాల పేరుతో గిరి గీసుకుని కూర్చోవడం మొదలయింది. విశ్వవిద్యాలయాలు ఇంగ్లీషు నేర్పుతూ వుంటే మన మేధావులు ఎంతో హాయిగా నేర్చుకుని తెలుగు తమకి రాదని, రానక్కర్లేదని పట్టుదలగా కూర్చున్నారు. మన మేధావులంతా కేవలం ఇంగ్లీషే నేర్చుకుని అందులోని విషయాలనే–హిస్టరీ, జాగ్రఫీ–మొదలైనవి జ్ఞానపరమావధిగా భావించారు. లార్డ్ కర్జన్ ఇలా ఇంగ్లీషు చదువుకున్నవాళ్ళు తమ భాషలకి ఏ ఉపకారమూ చెయ్యటం లేదని గమనించి ఒక సభ పెట్టి విశ్వవిద్యాలయాలలోనూ, ఇతర కాలేజీల్లోనూ, హైస్కూళ్ళల్లోనూ తెలుగు నేర్పాలనీ, ఇంగ్లీషులోంచి తెలుగులోకి అనువాదం ఒక ప్రధాన విషయం చెయ్యాలనీ అనుకోవడం ఆచరణలోకి వచ్చేసరికి తెలుగులో అతని అసలు ఉద్దేశం పక్కకు పోయి లాక్షణిక-గ్రామ్య/గ్రాంథిక-వ్యావహారిక వివాదంగా పరిణమించిందని మనం చూశాం. ఒక పక్క తెలుగు పండితులూ, తెలుగులో మిగిలిన ఒకరో ఇద్దరో మేధావులూ ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ వుంటే బయట అందరూ ఇంగ్లీషే నేర్చుకుంటున్నారనీ, అందులోని విజ్ఞానమే నిజమైన విజ్ఞానం అని అనుకుంటున్నారని మనం మర్చిపోకూడదు. ఈ పండితుల వాదప్రతివాదాలు కూడా ఇంగ్లీషులోనే జరిగాయనీ మనం మరీ గుర్తించాలి. ఈ వరసలో సామినేని ముద్దునరసింహం నాయుడు లాంటి తెలివైన వాళ్ళ మాటలు ఎవరూ పట్టించుకోలేదు. పండితులు గిరి గీసుకుని వాళ్ళ గొడవలను అదే ప్రపంచం అన్నట్టుగా వాళ్ళ పత్రికల్లో ఒకపక్క రాసుకుంటూ వుంటే,ఇంకోపక్క చివరికి టేకుమళ్ళ కామేశ్వరరావు, మండపాక పార్వతీశశాస్త్రి లాంటి వాళ్ళ ఆలోచనలు కూడా ఎవరూ ఉపయోగించుకోలేదు. చిన్నయ సూరి కూడా అంత పట్టుదలగా కావ్యభాషకి వ్యాకరణం రాసి దాన్ని వచనంలో కూడా వాడచ్చని హిందూ ధర్మశాస్త్రంలో ఉపయోగించి చూపించాడని మనం మెచ్చుకున్నాం సరే. కానీ లోకంలో కళ, దృతప్రకృతికాలు, గసడదవాదేశాలు జ్ఞాపకం లోంచి పోయాయని ఆయన గుర్తించి ఉంటే నిజంగా బాగుండేది. అతని దృష్టిలో చిన్న పిల్లలు కూడా క్లిష్టమైన పదాలని తగిన వర్ణక్రమంలో నేర్చుకోవడమే ప్రధానం[42]చిన్నయ సూరి, అక్షరగుఛ్ఛం, 1865. ఈ పుస్తకం మొట్టమొదటిగా ఎప్పుడు అచ్చయిందో తెలియదు కాని ప్రాథమిక పాఠశాలల్లో ప్రైమర్‌గా వాడబడింది. మచ్చుకి పిల్లల కోసం చిన్నయ సూరి ఎన్నుకున్న రెండు, మూడు అక్షరాల పదాల్ని గమనించండి.. చివరికి ఇన్నాళ్ళుగా సాగిన ఇన్ని చర్చలూ తెలుగు భాష అభివృద్ధికి నిజంగా ఉపయోగించలేదు. ఇప్పటికి కూడా తెలుగు భాష కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయింది కానీ కొత్త ఆలోచనలు తయారు చేసే భాష కాలేదు. దీన్ని గురించి ఇంకొన్ని వివరాలు వచ్చే భాగంలో రాస్తాం.

(సశేషం)


అధస్సూచికలు[+]

రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం \"తెలుగులో కవితా విప్లవాల స్వరూపం\" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...