అప్పుడప్పుడు
కనుకొలకుల్లో
నిప్పుకణిక ఉబుకుతుంది
ఎప్పుడూ
శరీరాన్ని
చుట్టేస్తూ
జడివాన కాలుస్తుంటుంది
అప్పుడప్పుడూ
పెదవులకు
మౌనం వేళ్ళాడుతుంది
ఎప్పుడూ
జ్ఞాపకాల నొప్పి
గొంతుకు అడ్డం పడుతుంటుంది
అప్పుడప్పుడూ
నీ ఉత్తరాల్లో సువాసనలు
అక్షరాలౌతాయి.
ఎప్పుడూ
మనం తడిసిన
మట్టి పరిమళాలు
అమ్మలా
తలలో వేళ్ళు పెట్టి నిమురుతాయి
జీవితం మనల్ని విసిరేసిందో
మనమే జీవితాల్ని ఒడిసిపట్టుకునామో
దిగంతానికి అవతలి పక్క నువ్వు, ఇవతలి పక్క నేను.
బాధ మనల్ని ముంచేసిందో
మనమే గాయాల్ని కడుక్కుని బాధని ఆరేసామో
ఇంకిపోయిన కన్నీటి గీతకు అటువైపు నువ్వు ఇటు వైపు నేను
స్మృతులు మనల్ని బూడిద చేసాయో
మనమే పూల రెమ్మల సన్నని జ్వాలల్ని
భాషగా మార్చుకున్నామో
వూగుతున్న కాలానికి ఇటు క్షణం నేను అటు క్షణం నువ్వు
రాత్రులు మనల్ని ముక్కలు చేసాయో
పగళ్ళని మనమే ఉండలుగా చుట్టి పారేసామో
దుమ్ము పట్టిన ఆకాశం డైనింగ్ టేబుల్ కి
అవతల పక్క నువ్వూ ఇవతల పక్క నేనూ
ఇద్దరి మధ్య ఒక గతమూ –
ఒక భవిష్యత్తూ –
ఒక అర్ధ భూగోళం.
పిడికిట్లోంచి జారిపోయేవి ఏడు సముద్రాల ఇసుక దిబ్బలో
చూపులని కమ్మేస్తున్నవి బూజు మబ్బుల కెరటాలో
ఎదిరిచూపుల దారాలకు ఇటు చివర నేను అటు చివర నువ్వు …
ఎప్పుడు మొదలవుతుందో తెలియని తోలుబొమ్మలాట