మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి

భద్రిరాజు కృష్ణమూర్తిగారు తెలుగులో M.A. చేశారు. తెలుగు శాఖనించే భాషాశాస్త్రం మీద అభిరుచి ఆయనకి కలిగింది. అక్కణ్ణించే ఆయన అమెరికా వెళ్ళారు. వెళ్ళింతర్వాత తిరిగి తెలుగులో ఆయన చాలా కొత్త పనులు చేయడానికి తలపెట్టారు. ఆయన భిన్నభాషలలో పోలికలు పరిశీలించే శాస్త్రంలో ఆధునిక విధానాలు అమెరికాలో నేర్చుకుని అప్పటికే అంతర్జాతీయంగా ప్రాముఖ్యత పొందిన ద్రావిడభాషల పరిశీలనలో ప్రత్యేకమైన కృషి చేశారు. అందులో ఆయన పని ఇప్పుడు ప్రపంచంలో చెప్పుకోదగ్గంత గొప్పది. ఆ శాస్త్రంలో ఎవరు ఏ పని చెయ్యాల్సొచ్చినా ఆయన చేసిన పనిని ఆధారంగా చేసుకుని ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది. ద్రావిడభాషలలో, శాస్త్రీయమార్గాలలో పనిచేస్తూ ద్రావిడభాషా కుటుంబాలు ఏర్పడ్డ విధానాలను గురించి ఇంకొంత నిశితంగా పనిచేద్దామనుకున్నవాళ్ళూ, సాధ్యమైతే ఆ స్థితిని మార్చి ద్రావిడభాషా కుటుంబాలు ఉన్నాయనే సిద్ధాంతాన్ని నవీకరించడమో, నిరాకరించడమో చేద్దామనుకునే ఉత్సాహవంతులూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఆయన పని తోటే వాళ్ళ పరిశోధన ఆరంభం కావాలి. ఇది ఆయన ద్రావిడభాషావిజ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా చేసిన ఉపకారం.

అమెరికా నించి కృష్ణమూర్తిగారు తిరిగి వచ్చిన తరవాత తెలుగుశాఖ వాళ్ళే ఆయనని తమ శాఖలో కలుపుకుని ఉంటే ఏమయి ఉండేది అన్న ప్రశ్న నన్నెప్పుడూ ఆలోచింపజేస్తూ ఉంటుంది. మొదటిది, పరిశోధనలో అంతర్జాతీయంగా ఒప్పుకున్న ప్రమాణాలు ఆయన తెలుగుశాఖలలో అమలులోకి తెచ్చేవారు. ఏ విషయాన్ని గూర్చి అయినా తెలుగులో నిశితంగా, అన్యూనాతిరిక్తంగా శాస్త్రీయమైన వచనం రాసిన కొద్దిమందిలో ఆయన ఒకరు. ఆయన దగ్గర తెలుగు విద్యార్థులు తయారయి ఉంటే తెలుగులో వచ్చే Ph.D.లకి ఒక అంతర్జాతీయ ప్రామాణికత, శాస్త్రబద్ధత ఏర్పడి ఉండేది. ఆ ప్రయోజనాన్ని తెలుగు శాఖలు దాదాపుగా పొందలేక పోయాయి. తెలుగుశాఖలలోనే ఉంటూ వ్యాకరణాల మీదా, భాషావిషయాల మీదా పనిచేసిన బొడ్డుపల్లి పురుషోత్తం, అమరేశ్వర రాజేశ్వర శర్మ లాంటి వాళ్ళ పని కృష్ణమూర్తిగారి దగ్గర జరిగి ఉంటే ఇంకొక రకమైన ఆకారాన్ని పొంది ఉండేది. తెలుగుశాఖల్లో పఠన పాఠనాలలో ఉన్న వ్యాకరణ సంప్రదాయం భాషాశాస్త్ర సంప్రదాయంతో కలుపుకొని ఉంటే దాని ఫలితంగా రెండూ ఒకదాన్నొకటి బలపరచుకొని ఉండేవి. వ్యాకరణమంటే పాణిని, పతంజలి, కాశికాకారుడు, భట్టోజీ దీక్షితులు – ఇది సంస్కృతమర్యాద. దీనికి బలహీనమైన కొనసాగింపుగా తెలుగు వ్యాకరణ సంప్రదాయం ఏర్పడింది. ఆంధ్రశబ్ద చింతామణి, ఆధర్వణుడు, అహోబల పండితుడు, వాళ్ళ ద్వారా చిన్నయసూరి ఆ తరవాత ప్రౌఢవ్యాకరణం – ఈ మార్గంలో ఉండేదే తెలుగు వ్యాకరణం. ఇదే వ్యాకరణం అన్న విశ్వాసం తెలుగుశాఖల్లో గూడు కట్టుకుపోయింది. ఈ గూటికి కిటికీలు, తలుపులు లేక బైట ప్రపంచంలో, వ్యాకరణాల విషయంలో ఏం జరుగుతోంది అనే ఊహల గాలి తెలుగుశాఖలని తాకలేదు. కృష్ణమూర్తిగారే తెలుగు శాఖలో ఉంటే ప్రాక్పశ్చిమ సంప్రదాయాల మధ్యన ఆయన ఒక ప్రయోజనకరమైన వారధిగా పనిచేసి ఉండేవారు.

మాండలిక పదకోశాలు, వృత్తి పదకోశాలు తయారు చేయాలన్న ఊహ కూడా కృష్ణమూర్తిగారిదే. మాండలిక పదకోశాలకి ఆయన ఏర్పాటు చేసిన విధానం, వాటికి ఆయన రాసిన పీఠిక తెలుగులోనే ఉన్నాయి. ఆ రకమైన ఊహ మనకి ఎందుకు, ఎలా పనికివచ్చిందో ఆలోచించి, అలాంటి పనుల్ని కొనసాగించాలి అనే ఉద్యమం కూడా తెలుగుశాఖల్లో ఏర్పడలేదు.

సాహిత్యవిమర్శలో కృష్ణమూర్తిగారు చేసిన పని తక్కువదేమీ కాదు. తిక్కనలో నాటకీయత గురించి ఏ రకమైన తాత్విక భూమికా లేకుండా గాలి కబుర్లు చెప్పే తెలుగు విమర్శకుల అలవాటుని మార్చి ఆయన తిక్కన కవిత్వంలో విశేషాలని భాషాప్రయోగ పరిశీలనమార్గంలో సమర్థంగా ప్రపంచించి చూపించారు. ఆయన ఊహలని తిరిగి మళ్ళా చెప్పక్కర లేకుండా ఆయన ఆలోచన విధానాలనీ, పరిశీలన మార్గాలనీ, వాక్యవిన్యాసరీతులనీ ఆకళింపు చేసుకున్నా తెలుగు వచనం ఎంతో బాగుపడేది.

తాను తెలుగు శాఖలకి బయటేవున్నా ఊరుకోక ఆయన తన శాయశక్తులా తెలుగులో వైజ్ఞానిక పరిస్థితిని మార్చడానికి కష్టపడి కృషి చేశారు. కవులకు పదప్రయోగకోశాలు తయారుచేయాలి అనే ఊహతో తిక్కన పదప్రయోగకోశం తయారు చేయడంలో ఆయన ప్రతిపాదనలు, కట్టవలసిన ఒక పెద్ద భవనానికి పునాదుల్లా పనికివచ్చాయి. అందులో ఆయనతో కలిసి, ఆయన ఆలోచనలు తీసుకుని, పనిచేసినవాళ్ళు అబ్బూరి రామకృష్ణారావుగారు, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారు. వీరిద్దరూ తెలుగులో ప్రామాణిక పండితులే అయినా, తెలుగుశాఖల్లో వారికి ఉద్యోగాలు లేవు. అప్పుడు తెలుగుశాఖలలో ఉన్న పెద్ద ఉద్యోగస్థులు కృష్ణమూర్తిగారి ఆలోచనలలో పాలుపంచుకోవడం గానీ, వాటిలో ఉన్న కొత్తదనాన్ని ఉపయోగించుకోవడంలో గానీ ఉత్సాహం చూపించలేదు. ఒకరి దగ్గర ఉద్యోగం కోసం తాపత్రయపడే, తలవంచే వ్యక్తిత్వం కృష్ణమూర్తిగారిది కాకపోవడంతో ఆ విషయంలో ఆయనకీ తెలుగు శాఖలకీ మధ్య సౌమరస్యం గానీ వైమనస్యం గానీ ఏదీ లేకుండా, ఒక రకమైన పరాయితనం మాత్రమే ఏర్పడింది.
ప్రతిభావంతులు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా గొప్ప పనే చేస్తారు. అలాంటి ప్రతిభావంతులని మన రంగంలోకి తెచ్చుకోవాలి అనే ఊహ లేకపోవడం మూలంగా తెలుగుశాఖలు చాలా కోల్పోయాయి.

కృష్ణమూర్తిగారు పోయిన తరవాత ఆయన్ని గురించి ఎంతో అభిమానంతో, గౌరవంతో, భక్తితో రాసిన వ్యాసాలు చాలా చదివాను. కొన్ని వ్యాసాలు చదువుతూంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆయన మనస్సులోని వెచ్చదనం, స్నేహితుల పట్ల అభిమానం, ప్రేమ ఎంత గొప్పవో నాకు వ్యక్తిగతంగా తెలుసు. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థిని కాకముందునుంచి కూడా ఆయన చేస్తున్న పనుల పట్ల ప్రోత్సాహం పొంది ఆయన మాటలు వినడానికి, ఆయన ఊహలు తెలుసుకోవడానికి ఆయన్ని కలుసుకుంటూ ఉండేవాడిని. చిన్న పెద్దా తేడా లేకుండా ఆపేక్షగా మాట్లాడే ఆయన మాట తీరు, వ్యక్తిత్వమూ నా కళ్ళల్లో ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది.

అన్నిటి కన్నా ఆయనలో నాకు గొప్పగా కనిపించేది తర్కసహమైన అభిప్రాయాలమీద ఆయనకున్న పట్టుదల, కొత్త ఆలోచనలమీద ఆయనకున్న మమకారం, ఉన్నతప్రమాణాల విషయంలో ఆయనకున్న నిక్కచ్చితనం. ఆయన అభిప్రాయాలలో పట్టుదలతో మాట్లాడడం వల్ల, ప్రమాణాల విషయంలో రాజీకి రాలేకపోవడం వల్ల ఎంతోమందిని దూరం చేసుకున్నారు. వ్యక్తులుగా ఆయనకి ఎవరి మీదా అగౌరవం లేదు. ప్రమాణాల విషయంలో ఆయనకి ఎవరితోనూ రాజీ లేదు. ఇదీ ఆయన దగ్గర నించి విశ్వవిద్యాలయాల శాఖలు నేర్చుకోవలిసిన ప్రధాన విషయం. ఆయన్ని పొగడడం కన్న ఈ విషయంలో ఆయనని అనుసరించడం మనం చెయ్యదగ్గ పని. అదే ఆయనకి నిజమైన గౌరవం.


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...