కా. రా. కథలు రెండోసారి చదవడానికి ముందు

కాళీపట్నం రామారావుగారు తెలుగులో కథలు రాస్తున్న వాళ్ళలో అగ్రశ్రేణికి చెందినవారని ఎందరో పాఠకులూ విమర్శకులూ ఒప్పేసుకున్నారు. ఈవాళ ఆయన్ని నాలాంటివాడు ప్రత్యేకంగా పొగడవలసిన అవసరం లేదు. ఆయన కథలు ప్రపంచ సాహిత్యంలో గొప్ప స్థానం పొందాయి. తెలుగువాళ్ళు ఈ శతాబ్దిలో సాధించిన సాహిత్య పరమార్థం ఏమిటని అడిగితే మనం గర్వంగా చూపించే ఉత్తమ సాహిత్యంలో ఆయన కథలు వుంటాయి. అయితే ఈ వ్యాసం ప్రయోజనం ఇలాంటి పొగడ్తలు చెప్పేసి వూరుకోవటం కాదు. ఆయన కథలు ఇంత గొప్ప ఎలా అయ్యాయో మరొకసారి సవిమర్శంగా పరిశీలించటం.

రామారావుగారు ఆట్టే కథలు రాయలేదు. ఆయన రాసినవన్నీ ఈ పుస్తకంలో వున్నాయి. దాదాపు ఆయన రాసిన వరసలోనే ఈ కథలు ప్రచురించటం వల్ల కథారచయితగా ఆయన పొందిన పరిణామం కూడా బోధపరచుకోవడానికి వీలుగా వుంది ఈ పుస్తకం. ఆయన తొలి కథల్లో చాలాభాగం పైకులాల్లోని మధ్యతరగతి కుటుంబాల గురించి రాసినవి. 1964 నుంచి అనుకుంటాను – ఆయన కథల్లో వస్తువు మారటం మొదలుపెట్టింది. ‘యజ్ఞం’ కథతో ఆయన పల్లెటూళ్ళ, పేద రైతుల నిరుపేద కుటుంబాల జీవితాల గురించి రాయటం మొదలుపెట్టారు. తొలి కథల్లో కానివ్వండి, తర్వాతి కథల్లో కానివ్వండి, ఆయన కథల్లో మన మనస్సులకి ఆహ్లాదం కలిగించే విషయాలు ఆట్టే కనిపించవు. సాహిత్యం సుఖం కలిగించాలి అనుకునేవాళ్ళకు ఇవి నప్పవు. అలా అని రామారావుగారి కథలు మనని దుఃఖపెట్టవు కూడా. లోకంలో కావలసినంత దుఖం వుంది. దాన్ని సాహిత్యంలో ఏడుపుగా మార్చి పాఠకులకి కన్నీళ్ళు తెప్పించి అలా ఏడవగలిగిన పాఠకులు హాయిగా తృప్తి పొందే కథలూ, కావ్యాలూ మనం ఎరుగుదుం. రామారావుగారి కథలు ఈ పని చెయ్యవు. ఇవి మనం భరించలేని అశాంతిని మనలో కలిగించి మనకి స్తిమితంగా నిద్రపట్టకుండా చేస్తాయి. మనకి ఏది తెలియకపోవడం వల్ల మన జీవితాల్లోనూ, సమాజంలోనూ వున్న పరిస్థితులతో సర్దుకుపోతూ బతుకుతున్నామో అది తెలియజెప్పేస్తాయి. ఇంక ఆ తర్వాత మనం నిబ్బరంగా వుండలేం. వున్న పరిస్థితులకి మనం కారణమనేనా ఒప్పుకోవాలి లేదా అవి మార్చడానికి బాధ్యతేనా వహించాలి.

గొప్ప పుస్తకాలు మనకి హాయి కలిగించవు. మనని మనకి విప్పి చెప్పేసి అల్లరి పెడతాయి. మనని నిలదీసి ప్రశ్నిస్తాయి. నిలబెట్టి నడిపిస్తాయి. ఏదైనా చివరికి అశాంతే ఫలితం. అలాంటి విప్లవకరమైన అశాంతికి కారకులైన, ప్రమాదకరమైన రచయితలలో చాలా కొద్దిమందిలో ఒకరు రామారావుగారు.

అయితే ఈ అలజడి కలిగించే పని రామారావుగారు పరమ నిదానంగా చేస్తారు. ఆయన కథలు బహునెమ్మదిగా నడుస్తాయి. ఏ మాటా దూకుడుగా వుండదు. ఏ వాక్యమూ కోపంగా నడవదు. మొత్తం కథంతా నిండా నీళ్ళున్న లోతైన చెరువులా, నిశ్చలంగా వుంటుంది. కథ చదివిన పాఠకుడు మాత్రం విపరీతంగా అలజడిపడతాడు.

రామారావుగారు జీవిత సంఘటనల్ని, పాత్రల ప్రవర్తనల్ని, వాళ్ళ మాటల్ని వున్నవి వున్నట్లుగా ఎంతో వాస్తవికంగా రాశారు. రామారావుగారికి మనుష్యుల నైజాల్ని నిశితంగా పరిశీలించే నేర్పు వుంది. కాని అదొక్కటే ఆయనలో చెప్పుకోదగ్గ విశేషమైతే రామారావుగారు మంచి రచయిత అవుతారు గాని గొప్ప రచయిత అవరు. గొప్ప రచయిత కావటానికి అంతకన్నా విశేషం ఏదో వుండి వుండాలి. ఆ సంగతి వివరంగా చూపించటానికి మచ్చుకి రెండు కథలు తీసుకుంటాను. ఒకటి ఆయన రాసిన తొలి కథల్లోది ‘అభిమానాలు’ అనే కథ. రెండోది ఆయన తర్వాత రాసిన కథల్లో అందరికీ ప్రచురంగా తెలిసిన ‘యజ్ఞం’.

‘అభిమానాలు’ బ్రాహ్మణ కులం వాళ్ళ కథ, కుటుంబంలోని వాళ్ళు ఒకరి మీద ఒకరు చూపించుకునే అభిమానాలు, వాటి క్లిష్టతలు ప్రధానాంశం. సామాజిక వ్యవస్థలో వున్న వర్గ సంఘర్షణలు, వైషమ్యాలు ఇందులో లేవు. ఇందులో వున్న పాత్రలన్నీ ఒక వర్గానివే. వాళ్ళు తిండికి లేని పేదవాళ్ళు కాదు. అంచేత పేదరికం వల్ల వచ్చే ఇరకాటాలు ఇందులో లేవు. ఇలాంటి కథల వల్ల మన సమాజ వ్యవస్థకి సంబంధించిన తాత్విక అవగాహన కలగదని, వీటిలో సామాజిక చైతన్యం వ్యక్తం కాలేదనీ విమర్శకులు అనుకోవటం కద్దు. అయినా ఈ కథని కొంచెం వివరంగా చూస్తే ఏం తెలుస్తుందో చూద్దాం.

రామారావుగారు కథలు చాలా క్లిష్టంగా రాస్తారు. అంచేత ఆయన కథల్ని తిరిగి నా సొంత మాటల్లో క్లుప్తంగా చెప్పటానికి వీలవదు. కాని ఈ కథలో పాత్రల్ని మాత్రం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. పద్మనాభంగారు, ఆయన తమ్ముడు భాస్కరం, పద్మనాభంగారి భార్య లక్ష్మమ్మగారు, భాస్కరం భార్య రాఘవి, పద్మనాభంగారి కొడుకు చలపతి వీళ్ళు ముఖ్య పాత్రలు. పద్మనాభంగారి ఆడపిల్లలూ, భాస్కరం కూతురు – వీళ్ళు చిన్న పాత్రలు.

ఈ కథ కొంతసేపు చదివాక గాని తెలియదు. పద్మనాభంగారూ, లక్ష్మమ్మగారూ భాస్కరాన్ని చిన్నప్పటి నుంచి కొడుకులా పెంచి పెద్దచేశారని, భాస్కరం తన తండ్రిలాంటి అన్నగార్ని కాదని రాఘవిని పెళ్ళి చేసుకున్నాడని, ఆ తర్వాత అన్నగారు కక్షపట్టి భాస్కరాన్ని వెలివేశారని, చివరికి భాస్కరం కూతురు బారసాలకి కూడా వెళ్ళలేదనీ.

సరే ఇది అర్థమైంది. కాని ఇక అసలు విషయం పద్మనాభంగారు తన కొడుకు చలపతిని పట్నంలో హైస్కూలులో చేర్పించారు. ఆ వూళ్ళో ప్రైవేటు మాస్టారి ఇంట్లో వాడికి బస ఏర్పాటుచేశారు. ఆ మేస్టరు ఓ కర్కోటకుడు. వాళ్ళ ఇంట్లో చలపతి నానా కష్టాలు పడుతున్నాడు.

చలపతిని భాస్కరం దగ్గర పెట్టి చదివించొచ్చు. ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు సజావుగా వుంటే అదే జరిగేది. తనని కొడుకుగా పెంచి పెద్దచేసిన అన్నగారి కొడుకుని తను తన కొడుకుగా చూసుకుని, దగ్గర పెట్టుకుని చదివించి తను తృప్తిపడగలడు భాస్కరం. ఆ తృప్తి భాస్కరానికి లేకుండా చేశారు పద్మనాభంగారు.

అయితే ఈ కథలో అసలు మెలిక ఏమిటంటే చలపతి పట్నంలో నానా బాధలు పడుతున్నాడని పద్మనాభంగారు గుర్తించరు. వాడి ప్రైవేటు మాస్టారు క్రూరంగా ప్రవర్తిస్తే అది క్రమశిక్షణగా భావిస్తారు. తల్లిదండ్రుల అభిమానాన్ని పొందడానికి వాడు రెండు రోజులు సెలవులకి ఇంటికి వచ్చినా వాడిని ఆదరించక క్రూరంగా వెనక్కి పంపించేస్తారు. చివరికి వాడు జబ్బుపడతాడు. సరిగ్గా అదే సమయంలో పద్మనాభంగారి భార్యకు పురిటి రోజులు. ఈ క్లిష్ట పరిస్థితిలో భాస్కరం భార్యతో సహా వెళ్ళి చలపతిని ఆదుకుంటాడు. అప్పటికి పద్మనాభంగారికి తన తమ్ముడి భార్య మంచితనం తెలుస్తుంది. చలపతిని భాస్కరం, రాఘవి తమ వూరు తీసుకెళ్ళడంతో కథ ముగుస్తుంది.

ఈ కథ చెప్పిన తీరువల్ల ఇందులో పాత్రల సంఘర్షణలు, వాళ్ళు బతుకుతున్న కుటుంబ వ్యవస్థ లోపల అభిమానాల ముసుగులో అణచి పెట్టబడిన క్రౌర్యం వ్యక్తమయ్యేట్టు చేశారు రామారావుగారు. ఈ కథలో పాత్రలెవరూ ఒకరితో ఒకరు హాయిగా తమ ఇబ్బందులు చెప్పుకోలేరు. అలా చెప్పుకోడానికి వాళ్ళకు తెలియని సంకెళ్ళేవో వాళ్ళకు అడ్డొస్తాయి. పద్మనాభంగారు భాస్కరానికి తండ్రి స్థానంలో వున్నారు. తన కొడుకులాంటి భాస్కరం తన ఇష్టాన్ని కాదని రాఘవిని పెళ్ళి చేసుకోవడం ఆయన భరించలేని సంఘటన. అలా తన మీద తిరగబడ్డ కొడుకు మీద అతనికి తగని కక్ష. అది ఆయన వొప్పేసుకుంటే దాని నుంచి ఆయన విముక్తి అయ్యేవాడు. కానీ అభిమానం పేరుతో ఆ కక్షను ఆయన అణగదొక్కుకుంటాడు. తీర్చుకోలేని, బయట పెట్టుకోలేని ఈ కక్ష ఆయన్ని జంతువుగా మారుస్తుంది. నిస్సహాయుడుగా వున్న తన సొంత కొడుకుమీద ఆయన కసి తీర్చుకోవడం మొదలుపెడతాడు. మళ్ళీ ఇది కూడా ఆయన అభిమానం పేరుతోనే చేస్తాడు. పద్మనాభంగారు తన భార్యతో మాట్లాడే తీరు కూడా మానవ సహజమైన లైంగిక ప్రేమ వ్యక్తమయ్యేలా వుండదు. తనకు భర్త ద్వారా తీరని ప్రేమని ఆవిడ ఏడవడం వలన తీర్చుకుంటుంది. ఈ ఏడుపు, కొడుకు కోసం తల్లి ఏడ్చే ఏడుపుగా, అంటే సమాజం వొప్పుకునే పద్ధతిలో కనిపింపచేసి, ఆవిడ తన కోరికల్ని తీర్చుకుంటూ వుంటుంది.

ఈ ఘర్షణలో నలిగిపోయిన చలపతి లోపలి వేదన చివరికి జబ్బుగా పరిణమిస్తుంది. అంటే సమాజం వొప్పుకునే పద్ధతిలో తీవ్రంగా జబ్బుపడడం ద్వారా మాత్రమే తనకు కావలసిన తండ్రి ప్రేమను తెచ్చుకోగలుగుతాడు చలపతి.

పొడుగ్గా సాగిన ఈ కథలో పాత్రలందరూ పైకి చెప్పుకోలేని, తమలో అణిగిపోయిన తీరని కోరికలతో నలిగిపోతుంటారు. తమలోని ఘర్షణ తమ వాళ్ళ మీద కసిగా మారుతూండగా దానికి అభిమానాల ముసుగు వేసుకుని తమను తాము హింసించుకుంటూ తమ వాళ్ళని హింస పెడతారు. మనుష్యుల మామూలు జీవితంలో చెప్పడానికి పెద్ద సమస్యలు లేని మధ్య తరగతి కుటుంబాలలో ఇంత భయంకరమైన హింస జరుగుతూంటుందని ఈ సమాజం గుర్తించదు.

తరతరాలుగా వస్తున్న ఆస్తుల్ని, వాటి హక్కుల్ని, ఒక పద్ధతిలో రక్షించడం కోసం ఏర్పడిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వ్యక్తి చైతన్యం ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎదగదని, బోనులో పెట్టిన జంతువుల్లా మనుషులు ప్రవర్తిస్తారనీ రామారావుగారు గుర్తించారు. ఆ భయంకర పరిస్థితిని చిత్రించిన బలీయమైన కథ ఇది.

కేవలం మధ్య తరగతి కుటుంబంలో అభిమానాలు చిత్రిస్తున్నట్లు అమాయకంగా కనపడే ఈ కథలో అంతర్గతంగా ఒక సామాజిక స్వరూపం వుంది. ఆ సమాజంలో వ్యక్తులు అంతరంగాలను నిర్మించే, నిర్ణయించే భావజాల వ్యవస్థ స్వరూపం వుంది.

ఈనాటికీ ఈ సమాజంలో మానవ వ్యక్తి ఆరోగ్యకరంగా ఎదగడానికి కావలసిన మానసిక అవసరాల పట్ల, లైంగిక అవసరాల పట్ల సరైన గుర్తింపు లేదు. శారీరకమైన జబ్బులు, ఆర్ధికమైన ఇబ్బందులు వీటిని గురించి మాట్లాడానికి ఈ సమాజం వొప్పుకుంటుంది కానీ, కామాన్ని గురించి మాట్లాడ్డానికి వొప్పుకోదు. అంచేత మనం అభిమానాల పేరుతో చూపించే హింసను కూడా హింసగా గుర్తించడానికి వొప్పుకోదు. ఇంకా అంతకన్నా ముఖ్యం ఈ అనారోగ్యకర వ్యవస్థకంతటికి ఆస్తుల వ్యవస్థ, ఉత్పత్తి సంబంధాలు – ఇవి బలీయమైన మూల కారణాలుగా వున్నాయని వొప్పుకోదు. అయినా కొంత నయం. ఆర్థిక రాజకీయ సమస్యల గురించి మాట్లాడ్డానికి కనీసం సామాజికమైన వొప్పుదల వుంది. క్రమంగా రామారావుగారు ఈ క్లిష్ట సంఘర్షణల సామాజిక అనారోగ్యానికి మూల కారణాలు గుర్తించడం మొదలుపెట్టారు. 1964 తరువాత ఆయన రాసిన కథలన్నిటిలో ఈ గుర్తింపు వలన కలిగిన పరిణామం కనిపిస్తుంది. ఆ కథల్లో గొప్ప కథలు చాలా వున్నాయి – ‘యజ్ఞం’, ‘ఆర్తి’, ‘భయం’, ‘చావు’, ‘నో రూమ్’.

వీటిలో ‘యజ్ఞం’ కథమీద విశేషమైన చర్చలు జరిగాయి. కథా యజ్ఞం (1982 హైదరాబాద్ బుక్ ట్రస్ట్) ‘యజ్ఞం’ మీద చాలామంది విమర్శకులు రాసిన వ్యాసాల సంపుటి. అంతకన్న ముందు రంగనాయకమ్మగారు ‘యజ్ఞం’ మీద చాలా విమర్శనాత్మకమైన వ్యాసం రాశారు. (ప్రజాసాహితి, సెప్టెంబరు 1977). కథాయజ్ఞం ప్రచురించబడిన తరువాత రంగనాయకమ్మగారు మరొక వ్యాసం రాసి (1982 డిసెంబరు) రెండు వ్యాసాలూ కలిపి ఒక పుస్తకంగా ప్రకటించారు (‘యజ్ఞం’ కథ మీద రెండు వ్యాసాలు. స్వీట్ హోమ్ పబ్లికేషన్స్ 1983, విజయవాడ). ఇంత విపులమైన చర్చ ఒక్క కథమీద జరగడం తెలుగు సాహిత్య చరిత్రలో అపూర్వం. ఇంత చర్చ జరిగిన మీదట ఈ కథ మీద ఇంకా చెప్పవలసిన సంగతులు వున్నాయా అంటే – వున్నాయనే అనిపిస్తోంది.

ఈ కథ మీద విమర్శకులలో చాలా తీవ్రమయినది రంగనాయకమ్మగారు చేసినది. ఆవిడ అభిప్రాయంలో ఇది చాలా లోపభూయిష్టమైన కథ. ఆవిడ మాటల్లో చెప్పాలంటే: “రచయిత అవగాహనలో అనేకమైన పొరపాట్లు ఉండడం వల్ల ఇది పేదలకు ఏమీ ప్రయోజనాన్ని ఇవ్వలేని కథ అయిపోయింది.”

రంగనాయకమ్మగారి విమర్శ క్లుప్తంగా ఈ కింది మూడు అంశాలమీదా ఆధారపడింది. 1. రచయిత శ్రీరాములునాయుణ్ణి తీవ్రమైన వైరుధ్యాలతో చిత్రించారు. ఒకపక్క అతను గాంధీవాదం పట్ల విశ్వాసం వున్న ఆదర్శ నాయకుడుగానూ ఇంకొక పక్క అతను మోతుబర్ల కొమ్ముకాసే కపటిగానూ రెండు రకాలుగానూ కనిపిస్తాడు. దీనికి కారణం రచయితకు గాంధీవాదం పట్ల స్పష్టమైన అవగాహన లేకపోవడం. గాంధీ నిజాయితీపరుడైన వాడని,  ఆయన కేవలం ధనిక వర్గానికే ఉపయోగపడ్డాడనీ రెండు పరస్పర విరుద్ధ దృక్పథాలున్నాయి రచయితకి. 2. అప్పల్రాముడికీ గోపన్నకీ వర్గ వైరుధ్యం లేదు. ఇద్దరూ పేదవారే. ఒక పేద రైతుకీ, మరొక పేద షావుకారుకీ అప్పు తగాదా పెట్టి, అది వర్గ వైరుధ్యంగా – అప్పులిచ్చినవాళ్ళకీ, అప్పులు పుచ్చుకునేవాళ్ళకీ తగాదాగా చిత్రించడం పొరపాటు. 3. కథ ముగింపు జుగుప్సాకరంగా వుందేగాని కథకి ఏమీ ఉపయోగకరంగా లేదు.

రంగనాయకమ్మగారి అభిప్రాయంలో ‘యజ్ఞం’ కథ వర్గచైతన్యానికి ఉపయోగపడాలంటే ఇంకో విధంగా వుండాలి.

1. శ్రీరాములు నాయుడికి అమాయకమైన మంచితనం కారణంగా గాంధీవాదం పట్ల భ్రమలు వుండాలి.

2. గాంధీవాదం పేద ప్రజలకి మేలు చెయ్యలేకపోయిందని అతను కథా క్రమంలో తెలుసుకోగలిగి వుండాలి.

3. అప్పల్రాముడికి అప్పు ఇచ్చినవాడు ధనికుడైన, దుష్టుడైన షావుకారు ఆయి వుండాలి.

4. కథ ముగింపు వర్గ చైతన్యానికి తోడ్పడేదిగా వుండాలి.

ఇలాంటి కథ బాగా రాస్తే అది వర్గ పోరాటానికీ, విప్లవోద్యమానికి సమర్థంగా ఉపయోగిస్తుందనడంలో నాకేమీ సందేహం లేదు. రంగనాయకమ్మగారు ఈ రకమైన విమర్శ చెయ్యడంలోనూ, కథ బాగుపడడానికి ఈ రకమయిన సూచనలు ఇవ్వడంలోనూ, ఒక నిర్దిష్టమైన విమర్శ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆవిడ అనుసరించిన విమర్శ విధానంలో లోపం వుందని చెప్పడానికి ఏమీ అవకాశం లేదు.

ఒక ఉద్యమం ఒక నిర్దిష్ట విలువలతో సమాజాన్ని సమూలంగా మార్చే ఆశయంతో సాగుతున్నప్పుడు సాహిత్యం ఆ ఉద్యమంలో భాగం అవాలని, రచయితలు ఆ ఉద్యమానికి అనుగుణంగా సాహిత్యాన్ని సృష్టించాలనీ ఆ ఉద్యమంలో ఉన్న విమర్శకులు కోరతారు. చదివేవాళ్ళకి స్పష్టంగా, సులభంగా, తెలియవలసిన మార్గం తెలియాలి. తెలుపేదో నలుపేదో ఖచ్చితంగా విడిపోయి కనిపించే పాత్రలతో, అంతరార్థాలూ గూఢార్థాలూ లేని శైలిలో రచనలు చెయ్యాలి. ఇలా మార్గదర్శక సూత్రాలు నిర్దేశించినంత మాత్రాన ఆ రకంగా నిర్మించబడిన సాహిత్యం చవకబారు ప్రచార సాహిత్యం అయిపోదు. ఆ ఉద్యమపు విలువలతో తన చైతన్యాన్ని రంగరించుకున్న మంచి రచయితలు ఉంటే – వాళ్ళ చేతిలో ఈ రచనాసూత్రాలు బలీయమైన కళాత్మక రూపం పొంది ఉత్తమ సాహిత్యనిర్మాణానికి ఆలంబనం అవుతాయి.

మార్క్సిస్టు ప్రచారం చేసే సాహిత్యం అంటే ఇష్టం లేనివాళ్ళు ఈ విషయంలో రుజువు కోసం హైందవ భక్తిసాహిత్యాన్ని పరిశీలించొచ్చు. ఉదాహరణకి భాగవత పురాణం చూడండి. హిరణ్యకశిపుడు రాక్షసుడు, ప్రహ్లాదుడు భక్తుడూ నిక్కచ్చిగా అయితీరాలి. అందులో ఎక్కడా అనవసరమైన క్లిష్టతలు వుండకూడదు. హిరణ్యకశివుడు తన తండ్రి అయినా సరే, ప్రహ్లాదుడు విష్ణువు పక్షంచేరి అతన్ని క్రూరంగా చంపించాలి. ఈ కథలో ఎవరు దుష్టులో ఎవరు శిష్టులో స్పష్టంగా తెలిసిపోవాలి. దుష్టశిక్షణ ఎవరు ఎలా చేస్తారో కూడా ఖచ్చితంగా వర్ణించబడాలి.

భాగవతం మంచి సాహిత్యం కాదని, కేవలం చవకబారు ప్రచార సాహిత్యం అనీ అనడం కుదరదు. అలాగే వర్గపోరాటం స్పష్టంగా బోధపరిచే కథలు, ఎన్నతగినవి, తెలుగులో చాలా వున్నాయి. రావిశాస్త్రిగారి ‘వేతన శర్మ’, ఆయనదే ‘పిపీలికం’ మంచి సాహిత్యంలో చేరదగినవి కావని ఎవరూ అనలేరు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, రంగనాయకమ్మగారి విమర్శ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆవిడ సూచనల ప్రకారం ఎవరేనా మంచి రచయిత కథ రాస్తే- అది కూడా తప్పకుండా గొప్ప కథ అయేందుకు వీలుంది.

ఎటొచ్చీ రామారావుగారు అలాంటి కథ రాయలేదు. ఆయన వేరే రకం కథ రాశారు.

మంచి సాహిత్యం ప్రధానంగా రెండు రకాలు. ఒకటి -ఉండవలసిన పరిస్థితి ఎలా వుండాలో చెప్పేది. రెండోది -ఉన్న పరిస్థితి ఎలా వుందో చూపించేది. మొదటి రకం, ఒక దారిని స్పష్టంగా నిర్దేశించి, చదివే వాళ్ళకి ఆ దారిని నడవమని ప్రోత్సహిస్తుంది. రెండో రకం సాహిత్యంలో అలాటి దారి స్పష్టంగా కనిపించదు. అది ఉన్న పరిస్థితిని ఉన్నంత క్లిష్టంగానూ ప్రదర్శిస్తుందంతే. మొదటి రకం సాహిత్యంలో పాఠకుడు ఆలోచించవలసిన దానికన్నా అనుసరించడానికే ప్రాధాన్యం. రెండో రకం సాహిత్యంలో పాఠకుడు ఆలోచించవలసిందే ఎక్కువ వుంటుంది.

ఈ విభజన ప్రాధాన్యతల దృష్టిలో చేసిన విభజనే కాని, రెండు ముక్కలుగా సాహిత్యాన్ని విడగొట్టడానికి చేసిన విభజన కాదు. అంటే – ఉండవలసిన పరిస్థితి చెప్పే సాహిత్యంలో కూడా ఉన్న పరిస్థితికి సంబంధించిన సమాచారం పుష్కలంగా వుంటుంది. కాని ప్రాధాన్యం మాత్రం ఉండవలసిన స్థితిని నిర్దేశించే పనిదే. అలాగే ఉన్న పరిస్థితిని చెప్పే సాహిత్యంలో కూడా – ఉండవలసిన స్థితికి సంబంధించిన సూచనలు వుంటాయి. కాని అవి ఎట్టఎదుట కన్పించవు.

రామారావుగారి కథలు చాలా భాగం, ముఖ్యంగా ‘యజ్ఞం’, ఉన్న పరిస్థితిని చెప్పే కథలు. రంగనాయకమ్మగారి విమర్శ విధానం, ఈ కథలకి నప్పదు. ఇది ఆ విమర్శ విధానంలో లోపం కాదు. ఆ విమర్శ విధానాన్ని, అది వర్తించని వేరే రకమయిన సాహిత్యానికి వర్తింపజెయ్యబోవడం పొరపాటు – అంతే.

ఇకపోతే, రామారావుగారు కథ నిర్మించే తీరులో ఒక ప్రధానమైన క్లిష్టత వుంది. అది దాదాపు ఆయన కథలకే వర్తించే క్లిష్టత. రామారావుగారు రచయితగా తన కథల్లో తరుచు కనిపించరు. ‘యజ్ఞం’లో అసలు కనిపించరు. ఆయన తన కథా వివరణ కోసం ఒక వక్తని వేరే తయారుచేస్తారు. మామూలుగా రచయిత మాటల్లా – తరుచు తెలుగుకథల్లో కనిపించే మాటలన్నీ ఈ వక్తవి. కథలో సంఘటనలని, ఇతర సమాచారాన్నీ మనకి వ్యాఖ్యానించే ఈ వక్తకి, కథలో ఇతర పాత్రలకీ వెనకాతల రచయిత రామారావుగారు వుంటారు. ఈ సంగతి బోధపరుచుకోకపోతే, ఈ కథలో వక్తమాటలు రచయిత మాటలే అనుకునే ప్రమాదం వుంది. కథలో పాత్రలకి గాని, ఈ వక్తకి గాని లేని అవగాహన రచయితకి మాత్రం వుంటుంది. ఈ అవగాహన పాఠకుడికి అందడానికి కథ అంతా సావధానంగా, పూర్తిగా చదవాలి. మొదటిసారి చదివేటప్పుడు పాత్రల మాటల, వక్త వ్యాఖ్యానాల పైపై అర్థాలు మాత్రమే తెలుస్తాయి, రచయిత ఈ కథలో అడుగున ఉద్దేశించిన తాత్విక అవగాహన అందుకున్నాక, రెండోసారి చదువుతూంటే, అప్పుడు ప్రతి పాత్ర మాటలకీ, కథలో వక్త చేసే వ్యాఖ్యానాలకీ వెనక వున్న రచయిత కనిపిస్తాడు. ప్రతి మాటకీ, అప్పుడు – మొదట స్ఫురించని రెండో అర్థం స్ఫురిస్తుంది.

రామారావుగారు కథ మనకి చెప్పరు. కథ జరుగుతూంటే, ఆ జరుగుతున్న క్రమంలో జరుగుతున్న సంఘటనలే మనకి కథ చెప్పేలా చేస్తారు. అకస్మాత్తుగా ఒక ఆగంతకుడు సుందరపాలెం ప్రవేశిస్తాడనుకోండి. అతనికి అక్కడి సంగతులు వినగా, చూడగా క్రమక్రమంగా కథ బోధపడుతుంది. రామారావుగారి కథ చదవడం అంటే, అలా ఆగంతకుడిలా ఒక పరిస్థితిలో ప్రవేశించి క్రమక్రమంగా జరుగుతున్న సంగతులు ఎప్పటివి అప్పటివి వింటూ మొత్తం కథ తెలుసుకోవడం.

ప్రతి సమాజంలోనూ ప్రతి దశలోనూ ఒక భావజాలానికి లోబడిన మాటలు గౌరవార్థంలో వాడబడుతూంటాయి. ఆ మాటకి మామూలు మనుషులు లోబడి ప్రవర్తిస్తారు. రామారావుగారి కథల్లో మాటలకి అర్థాలు ఆ భావజాలపు వ్యవస్థని చూపించే పనిలో జాగ్రత్తగా వాడినవి.

‘యజ్ఞం’లో, ఉదాహరణకి, రచయిత చెప్పినట్లు కనిపించే మాటలన్నీ ఇవే. ఈ కథ జాగ్రత్తగా చదివి చూడండి. మనం పూర్తిగా కొత్తవాళ్ళంగా సుందరపాలెంలో ప్రవేశిస్తాం. ఆ వూరు గురించి తొలిగా మనకి తెలియవలసిన సంగతులు ముందు తెలుస్తాయి. ఆ తరవాత అప్పల్రాముడిని గురించి నాలుగు మాటలు తెలుస్తాయి.

“మాటకు నిలబడేవాడూ, మర్యాదగా బతకాలనుకునేవాడూ మాలల్లో అతనొక్కడేనని అందరూ చెప్తారు”.

ఆ తరవాత మాజీ షావుకారైన గోపన్న గురించి తెలుస్తుంది. “అతను పరమ సాత్వికుడు. గొప్ప ఓర్పు కలవాడు. ఒకప్పుడు ఘనంగా బతికి ఇప్పుడు చితికిపోయిన పెద్ద మనిషి, వీళ్ళిద్దరూ తుమ్మకొయ్యల్లా వుండేవారట పూర్వం. ఈనాటికి పేదతనం వాళ్ళను రచ్చకెక్కించింది అని నొచ్చుకుంటున్నారు తెలిసిన వాళ్ళంతా”.

ఇందులో ఏ అభిప్రాయమూ రచయిత చెప్పింది కాదని, రచయిత నిర్మించిన వక్త చెప్పినవే ఇవన్నీననీ గుర్తుంచుకోండి. పైగా ఈ మాటలన్నీ ఆ సమాజంలో వున్న భావజాల వ్యవస్థ గౌరవకరంగా తయారుచేసిన మాటలు, మాటకి నిలబడడం, మర్యాదగా బతకటం, సాత్విక గుణం, ఓర్పు, ఒకప్పుడు ఘనంగా బతికి ఇప్పుడు చితికిపోవడం, పేదతనంవల్ల రచ్చకెక్కవలసిరావడం – ఇవన్నీ ఒక పరిమిత వ్యవస్థలో గౌరవకరమైన మాటలు. అన్యాయంగా తప్పు తూనికలు తూచి, తప్పు లెక్కలు చెప్పి అప్పు ఇవ్వవలసిన స్థితికి ఒక మాలవాణ్ణి మరొక షాపుకారు తీసుకొచ్చాడన్న సంగతి బయటపెట్టడానికి ఈ వ్యవస్థలో మాటలు లేవు. అంచేత ఈ కథలో వక్త ఆ మాటలు చెప్పడు కూడా. ఆ సంగతి పాఠకుడికి ఆలోచన వల్ల తెలియాలి. ఇందులో అన్యాయం వ్యక్తం అవడానికి కూడా వీల్లేనంతగా ఆనాటి ధర్మపు ఊబిలో కూరుకుపోయిందని, అందులో అందరూ దిగబడిపోయారని రచయిత ఎక్కడా నోరు విడిచి చెప్పడు, కాని కథ వల్ల పాఠకుడికి తెలియవలసింది ఇదేనని రచయితకు తెలుసు.

ఇంకా కథ చదివితే తెలుస్తుంది. శ్రీరాములు నాయుడి గురించి, అతను ఆ ఊరికి తెచ్చిన కొత్త న్యాయవ్యవస్థని గురించి. “పదిహేనేళ్ళ క్రితమైతే ఆ తగువు తీర్చడానికి వాళ్ళకింతసేపు పట్టదు. శ్రీరాములు నాయుడు వచ్చి అంతా మార్చేశాడు. ఈయన అన్నింటికీ శాంతమే నంటాడు.” అంటే పదిహేనేళ్ళ క్రితం ఊరి షావుకార్లు నాలుగు తన్ని మాలవాడి దగ్గిర్నుంచి అప్పు వసూలు చేసేవారు. అప్పుడు మాలవాడికి తెలిసిపోయేది ఆ వూళ్ళో తన స్థానం ఏమిటో. కాని శ్రీరాములు నాయుడు స్థాపించిన న్యాయవ్యవస్థ అదంతా మార్చి మాలవాళ్ళని ఒక మాయలో పెట్టింది. అయితే ఈ సంగతి పాఠకుడికి వెంటనే తెలియదు. శ్రీరాములు నాయుడు పెట్టిన మాయలోనే పాఠకుడు కూడా వుంటాడు అప్పటి వరకూ. క్రమంగా కథ నడుస్తుండగా తెలుస్తుంది. శ్రీరాములు నాయుడు ప్రవర్తన అక్షరాలా ఆ నాటికి పెద్ద మనిషి తరహా అనిపించుకునే మాటల్తో పాఠకుల్ని కూడా ఆకట్టుకుంటుంది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని, సంఘ బాధ్యతల్నీ క్లిష్టపరిస్థితుల్లో సమన్వయించుకుంటూ “ప్రజాభిమానమా, సీతాదేవా అంటే తడుముకోకుండా జవాబిచ్చిన ఆనాటి శ్రీరామ చంద్రుడిని” ఆదర్శంగా పెట్టుకుని అందుకు తూగలేక పోయినందుకు గ్రామ ప్రజలకు క్షమార్పణ చెప్పుకునేటంతటి ఉన్నత వ్యక్తి.

క్రమంగా తెలుస్తుంది శ్రీరాములు నాయుడు కట్టించిన న్యాయ మండపం సంగతి, ఆ వూరు ఆదర్శ పంచాయతీ అవడం, ఇలాటి సంగతులు. ఇవీ పాఠకుడిని చాలా గౌరవకరమైన భావజాలపు ఉచ్చుల్లో వుంచే మాటలే. కథ చివరి వరకూ చదివిన పాఠకుడికీ తెలుస్తుంది. ఇవన్నీ రచయిత ఒక ఉద్దేశంతో చెప్పిన మాటలేనని. కాని ఆ క్షణానికి ఇది పాఠకుణ్ణి కూడా ఆ ఉచ్చులో అట్టే పెడతాయి.

ఇంకా వుంది. ఆ వూరికి శ్రీరాములు నాయుడు తెచ్చిన అభివృద్ధి స్కూలు, రోడ్లు, ఆ స్కూలుకి ఆ వూరి పెద్ద షావుకారు, నిలవ ధనంలోంచి కాణీ కదపని సూర్యంగారు, ఇరవై వేలు విరాళం ఇవ్వడం. కాని ఇది జ్ఞానం కాబట్టి గొప్ప విరాళం. అది సాధించిన శ్రీరాములు నాయుడు మహత్యం వల్ల జరిగిన మార్పు అది. అంతే అనుకుంటాడు పాఠకుడు.

గోపన్నకి ఈ న్యాయమండపం మీద విశ్వాసమూ అంత గౌరవకరమైన మాటల్లోనే బయటికి వొస్తుంది. తను కోర్టుకి చచ్చినా వెళ్ళనని ప్రతిజ్ఞ చేస్తాడు గోపన్న.

తగువు ముదిరి, మర్యాదల ముసుగు తొలగి జనంలోంచి వొచ్చిన ఒక అనామకుడు, శ్రీరాములు నాయుడి దూరపు బంధువు అన్నయ్య కాస్త దురుసుగా “ఎదవ నాకొడుకుల్లారా, మీ బాబుగారి సొమ్మా? మీ తాతగారి సొమ్మా? ఇవ్వకెక్కడికి పోతారు. తంతాం అని ఒక్కడూ అడగడేం” అని పెద్ద మనుషుల మీద నోరు చేసుకునేసరికి అప్పల్రాముడు చుట్టం, పేరు లేని వాడొకడు అతన్ని మర్యాదగానే కనిపించే మాటల్లో మందలించి “ఆ పత్రం కోర్టుకెల్తే ఏఁవవుద్దో తఁవకు తెలియక పోవచ్చుగాని ఆరికి బాగా తెలుసు” అని ఒక మాట బయట పెట్టేసరికి కథలో లోపలి పొర ఒకటి వుందని తెలుస్తుంది.

ఈ మర్యాదల మప్పితాల ధర్మపన్నాల మాటల పైమెరుగుల కింద వున్న అసలు రంగు కాస్త కనిపించేసరికి పాఠకుడు ఉలిక్కిపడతాడు. ఈ సంగతి బయటపెట్టే పని ఎవరో అనామకులు, దూరపు చుట్టాలూ చేస్తారే గాని కథలో పెద్ద పాత్రలెవరూ చెయ్యరని గమనిస్తాడు పాఠకుడు. కాని శ్రీరాములు నాయుడు “అరాచకాన్ని” సహించడు అని చెప్తాడు కథ చెప్పే వక్త. భావజాలం బద్దలవడానికి కథలో మొదటి సూచన అదే. అన్యాయాన్ని బయట పెట్టేది “అరాచకం” అయితే, “రాచకం” అన్యాయాన్ని కప్పిపెడుతూందా ఏమిటి చెప్మా అని పాఠకుడికి సందేహం కలుగుతుంది. అయినా పదిమందీ ఒక దారీ తెన్నూ లేకుండా గోలగోలగా ఉద్రేకాలు ప్రదర్శించుకోవడం అరాచకమే అనే పాఠం నిత్యజీవితంలో నేర్చుకున్న పాఠకుడు, ఈ కథలో వక్త వాడిన “అరాచకం” అనే మాట బలానికి లొంగిపోయి కథ చదువుతాడు.

అప్పల్రావుడే స్వయంగా – “బాబయ్యా అది అప్పో, అప్పుకాదో, అయితే ఏనాటి అప్పో, ఎలాతేలిన అప్పో, అదంతా సదువుకోని మొద్దులం మాకు తెలీదు, పెద్దలు తఁవరున్నారు ఆపైని శ్రీరాఁవులు బావున్నారు. తఁవరాలోసించి సెప్పాల” అని ‘శాంతంగా’ అనేసరికి కథ నిజంగా లోతవుతుంది.

దీనికి శ్రీరాములు నాయుడి సమాధానం భూస్వామ్య సమాజపు భావజాల వ్యవస్థలో తగువులు తీర్చబడే పద్ధతికి అమోఘమైన ఉదాహరణ.

శ్రీరాములు నాయుడు వెంటనే అప్పల్రాముడితో – ‘గోపన్నకి నువ్వు ఏం బాకీ లేవ’ని చెప్పేసి, గోపన్నతో ‘మీరు ఎల్లుండి కనపడండి – మీ నోటు చెల్లుపెడతాన’ని అని, సభ ముగించబోతాడు. ఆయన ఎందుకిలా అన్నట్టు? ఇది కోపం – అయినా కోపంలా కనిపించదు. నిజానికి ఆ మాటని అలాగే నిలబెట్టుకోమని అప్పల్రావుడు అమాయకత్వం నటించి ఇంటికి వెళ్ళిపోతాడనుకోండి. ఇక అతను ఆ వూళ్ళో బతకలేడు. ఇదేం తీర్పు. ఇందులో న్యాయాధికారి వివాదంలో భాగస్వామి అయిపోయి, అప్పు తీర్చని వాడి తరఫున తను అప్పు తీరుస్తాడన్న మాట. ఇది అప్పు కాదని ప్రకటిస్తే అది నిజమైన న్యాయం. అది అప్పల్రావుడు కోరుకునేదీ, ఆ సమాజ వ్యవస్థ బాగుపడడానికి కావలసినదీని. కాని ఆ వ్యవస్థని “శాంతంగా” నిలబెట్టాలని కంకణం కట్టుకున్న శ్రీరాములు నాయుడు తనకి అదనంగా త్యాగమూర్తి పేరు తెచ్చుకుని తను అప్పు తీరుస్తానంటాడు. ఇందువల్ల ఆ తప్పుడు అప్పుల వ్యవస్థ కాపాడబడుతుంది. దానికి తోడు శ్రీరాములు నాయుడికి ధర్మరాజు అనే పేరొస్తుంది. అప్పల్రావుడికి ఆ వూళ్ళో పరపతి, ప్రతిష్టా లేకుండా పోతుంది.

ఇంత జరగబోయే మాట శ్రీరాములు నాయుడు అన్నాడని అప్పల్రావుడికి తెలుసు. ఆ వూళ్ళో, ఆ వ్యవస్థలో తల పండిన అప్పల్రావుడికి ఆ మాత్రం తెలియకపోలేదు. ఎటొచ్చీ పాఠకుడికే అది బోధపడడానికి కొంతసేపు పడుతుంది.

ఆ తరువాత బోలెడు మెలికలు తిరిగిన మాటల చక్రబంధాల ఫలితంగా అప్పల్రావుడు రూఢి చేసుకుంటాడు. అతను జ్ఞానోదయం అయిన వాడిలా అంటాడు శ్రీరాములు నాయుడుతో “నీ దెబ్బన్నది తగిలిన సోట కనపడదు. నువ్వేం జేసినా సాపకింద నీరులాగ సల్లగ ముంచుతావు”. ఇక్కణ్ణుంచి మొదలు – కథలో శ్రీరాములు నాయుడు ఏర్పరచిన గాంధీ తరహా శాంత విధానమూ, గ్రామాభివృద్ధీ, వాటికి అంతకుముందున్న గౌరవ స్థానాన్ని కోల్పోవడం మొదలవుతుంది. అప్పల్రావుడు నెమ్మదిగా అయినా శ్రీరాములు నాయుడు తొడుక్కున్న కోటు పొరలు పొరలుగా వొలిచెయ్యడం మొదలుపెడతాడు. అప్పల్రావుడు చివరికి ఇది న్యాయమైన అప్పేనని శ్రీరాములు నాయుడి చేత అనిపించమని నిలదీసేసరికి శ్రీరాములు నాయుడు అజాగ్రత్తగా బయటపడిపోయి “ఇది అప్పే! అప్పే! అప్పే!” అనేస్తాడు ఉద్రేకంగా. అది గమనించేసిన అప్పల్రావుడిని మభ్యపరచడానికి మళ్ళా అతి పురాతనమైన కర్మ సిద్ధాంతాన్నీ, పునర్జన్మ సిద్ధాంతాన్ని వాడుకుని – అప్పూ పాపమూ ఒకటేననీ, కోర్టుకు వెళ్ళి గెల్చినా ఈ రుణం ఎప్పటికీ తప్పించుకోడానికి వీల్లేదనీ, ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో కూడా తీర్చక తప్పదనీ – బహు హుందాగా ఉపదేశిస్తాడు.

ఈ దెబ్బతో అటు అప్పల్రావుడికీ, ఇటు పాఠకుడికీ కూడా ఈ వ్యవస్థ ఎవరి ఎవరి వేపు పనిచేస్తుందో బోధపడిపోతుంది. ఆ తరవాత, అనుభవంలో తననూ తనలాంటి వాళ్ళనీ ఉపయోగించుకుని అభివృద్ధి పేరుతో, శాంతి అహింసల పేరుతో పైకివచ్చిన వాళ్ళెవరో – ఏ మార్క్సిస్టు ఆర్థికవేత్తకీ తెలియరానంత స్పష్టంగా అప్పల్రావుడు చూడగలుగుతాడు. ఆ ఉపన్యాసం లాంటి మాటల్లో – ఒక జీవితం నేర్పిన అనుభవమూ, ఆ క్షణంలో కలిగిన అవగాహనా రెండూ వున్నాయి. పైగా పాఠకుడు ఈ విషయం బోధపరచుకోడానికి సిద్ధంగా వున్నాడు కూడా.

అయితే, ఈ సమాజంలో మోసపోయిన వర్గంలోవాడైనా అప్పల్రావుడి మీద ఈ వర్గ సమాజపు భావజాల వ్యవస్థ పెట్టిన బరువు ఇంకా అలానే వుంది. అందుకే స్పష్టంగా అయినా మర్యాదగానూ, కరుగ్గానే అయినా నమ్రంగానూ వుంటాయి అతని మాటలు.

అతనికి శ్రీరాములు నాయుడు నాయకత్వం వహించిన వ్యవస్థలోని అన్యాయం బోధపడినా, దాన్ని మార్చడానికి కావలసిన ధైర్యమూ లేదు, మార్గమూ తెలియదు. పైగా కథాంతాన కొడుకుని చంపుకున్న సీతారాముడు చెప్పినట్టు అప్పల్రావుడిలో జీర్ణించుకుపోయిన ఒక గుణం వుంది. అతనికి జనం మెప్పు కావాలి. “అప్పల్రావుడు శాన మంచోడు. ఆడి తప్పనోడన్న మాట కావాల, అమాయకుడన్న పేరు కావాలి. నీ బిడ్డ పాపలెలాగట పోనీ”.

ఈ కథ ముగించిన తీరు చాలామందిని కలవరపరిచింది. కాని అందులో బలీయమైన నిజం వుంది. ఆర్థిక వ్యవస్థ, దాన్ని అనుసరించిన, అంతకన్నా బలీయమైన భావజాల వ్యవస్థ ఈ మనుషుల్ని శతాబ్దాల పాటు అణిచిపెట్టి, దారిలేని పరిస్థితిలో పెట్టినప్పుడు, ఆ పీడన నుంచి బయట పడడానికి చేతకాని క్రోధం పెల్లుబికినప్పుడు, మనుషులు తమని తామే హింసించుకుంటారు.

ఈ కథలోనే కాదు – రామారావుగారు చాలా కథల్లో ఇలాంటి పరిస్థితినే చూపించారు. ‘నో రూమ్’ కథలో అతృప్త కామం – సరిగ్గా ఆర్ధిక వ్యవస్థలాగే మనిషిని కుంగదీస్తుంది. సమాజపు నీతి వ్యవస్థ (భావజాల వ్యవస్థలో ఇది ఒక భాగమే) మనిషిలో సహజమైన, ఆరోగ్యకరమైన కోరికలకి భరించరాని అన్యాయం చేస్తుంది. అప్పుడు ఆ అన్యాయానికి గురైనవారు చేసేదేమిటి? సరిగ్గా తనలాంటి అనుభవమే వుండి, తన కష్టాన్ని అర్థంచేసుకున్నవాడు, సానుభూతితో అడిగినవాడూ అయిన దేవుడనే ముసలివాడిని కలబడి కొట్టెయ్యడం. ఇది వెనక్కెళ్ళి చూస్తే ‘అభిమానాలు’ కథలో కూడా అంతే. తన లోపల అణిచిపెట్టబడిన ఆవేశాలకి దారిలేక పద్మనాభంగారు తన కొడుకునే హింసించుకుంటారు.

రామారావుగారి కథల్లో సమాజంలో మనుషులు ప్రవర్తించే తీరు కేవలం నిజంగా వుండడమే కాదు, సమాజపు భావజాల వ్యవస్థ, దాని బరువు కింద కనిపించకుండా అణిగివున్న సామాజిక వ్యవస్థా వ్యక్తమవుతాయి. అంత గాఢంగా సమాజం అడుగున వున్న నిజాన్ని చూపిన రచయితలు ఏ సాహిత్యంలోనూ ఎంతోమంది వుండరు.

రామారావుగారి కథలు దాదాపు ఏవీ పైకి తెలిసిపోవని, పురాతన చరిత్ర కోసం భూమి పొరలను తవ్వే ఆర్కియాలజిస్టు పొర పొరా వేరు వేరుగా విడదీసి చూపేదాకా చరిత్ర సమాచారం ఆవిష్కృతం కానట్టు – ఆయన కథలు కూడా, పొర పొరా జాగ్రత్తగా విప్పితే కాని కథలో ఏమాట ఎందుకు అన్నారో బోధపడదనీ, ఆ కథ రెండోసారి చదివేటప్పుడు – అంతకు ముందు, మొదటిసారి చదివినప్పుడు తోచని లోతులు, గూఢార్థాలు తెలుస్తాయనీ మరొకసారి చెప్పడం అవసరం. ప్రతి కథనీ ఈ పీఠికలో ఇంత వివరంగా పరిశీలించడం సాధ్యం కాదు కాబట్టి, ఈ దృష్టితో ఆయన మిగతా కథలు కూడా చదవండి మరోసారి.

రామారావుగారి కథలు చదివించవని చాలామంది అంటే, అలా తప్ప మరోలా రాయలేక పోయానని ఆయన వినయంగా అన్నారు. ఆ మాటలకీ, ఆ వినయానికీ అర్థమేమిటంటే, ఆ కథలు అలానే రాయాలి అని. నాకు తెలిసిన ప్రపంచ సాహిత్యంలో రామారావుగారిలా కథ చెప్పేవాళ్ళు ఎంతోమంది లేరు.

(యజ్ఞంతో తొమ్మిది పుస్తకానికి రాసిన ముందుమాట. అక్టోబర్ 1986.)


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...