దినపత్రికలు.. తెల్లవారగనే
అక్షరాలు సింగారించుకొని
వాకిట్లో కొచ్చిపడుతూ ఉంటాయి
రోజు గడవగానే..అటకమీద..అలమరాలో
గుట్టలుగుట్టలుగా పేరుకుపోతుంటాయి
సంవత్సరం పూర్తిగానైనా గడవకముందే
తప్పు చేసినట్లు తలవంచుకొని కొత్త కాలెండర్లు
పాత కాలెండర్ల స్థానంలో వేలాడతాయి.
చూపుల వ్యాపారి..రెప్పల షట్టర్లు పూర్తిగా దించివేస్తే..రాత్రి
షట్టర్లు..పెద్ద చప్పుడు బార్లా తెరిచేస్తే పగలు
నీటిపంపు కింద నీవుంచిన బక్కెట్లు మాత్రమే నిండుతాయి.
నీళ్ళు వస్తూనే ఉంటాయి..
పంపును మరిచామా..
ఖాళీ..ఖాళీ..ఖాళీ
దాహంతీరక..దప్పిక ఆరక నీవే కరిగి నీరై
నీవుంచిన బక్కెట్‌లో ..నీవే మునిగిపోయి
ఊపిరాడక గిలగిల తన్నుకొనే రోజు ఎదురవుతుంది.