2010 ఇస్మాయిల్ అవార్డు, బ్రౌన్ పురస్కారం

ఇస్మాయిల్ అవార్డు

రాసిన పది కవితలతో తనదైన శైలిని ఏర్పరచుకోవడం, పాఠకుల మీద బలమైన ముద్ర వేయగలగడం అంత సులభం కాదు. కవి అన్నవాడు తన జీవిత కాలంలో నిర్దుష్టంగా ఒక కవిత రాసి ఉండాలి-అనగా అయోమయానికి తావు లేకుండా, గందరగోళానికి లోను కాకుండా స్ఫుటంగా, బలంగా తనదైన భావనా శక్తితో ఒక వర్ణమయ ప్రపంచాన్ని కల్పించగలిగి ఉండాలి. లేదా పాఠకులకు మిగిలేది గాడిద మోతే. దీర్ఘ కవితలతో, తీవ్ర వాదులతో విసిగి పోయి ఉన్న పాఠక ప్రపంచాన్ని ఇతని కవిత్వం కమ్మ తెమ్మెరలా లలితంగా తాకుతుంది అనడంలో సందేహం లేదు.కావున, వికృతి నామ సంవత్సరానికి గాను ఇస్మాయిల్ అవార్డుకు గండేపల్లి శ్రీనివాస రావును ఎంపిక చేశాము.

ఇతని కవిత మచ్చుకు ఈమాటలో – ప్రేమకవితలు పేరిట లభ్యం:

బ్రౌన్ పురస్కారం

మౌనంగా తన పని తాను చేసుకు పోవడం పండిత లక్షణం. దీవి సుబ్బారావు గారు ఆ కోవకు చెందుతారు. కన్నడ వచనాలను తెలుగు చేసినందుకు గాను ఈ ఏడాది బ్రౌన్ పండిత పురస్కారాన్ని వీరికి ప్రకటిస్తున్నాము. వీరు పారశీక కవిత్వాన్ని కూడా అనువాదం చేశారు సాంగ్ అఫ్ సాంగ్స్ ను కూడా సమర్థంగా తెనిగించారు. అనువాదాలతో పాటు లోగడ వీరి కథలు, కవిత్వాలు పత్రికల్లో వచ్చాయి.పుస్తకాలూ దొరుకుతున్నాయి. తెలుగు అకాడెమీ సంచాలకులుగా ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

వీరి అనువాద పుస్తక సమీక్షఈమాటలో వున్నది.

-తమ్మినేని యదుకుల భూషణ్.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...