మా ఇంటికి దారి

తలపైన వేలాడే
పూల గుత్తులతో
నిలిచిన వంతెన

నవ్వుతున్న ముగ్ధ

లేత ఎండలతో
బాటల మీదుగా
బారుగా లేచివచ్చే
నీడలసైన్యం

మలుపు తిరిగాక..

ఇరువైపులా
గుబురుకొమ్మల
తరువులతో
ఎవరూ ఎరుగని
ఏకాంతపు దారి
ఎదురవుతుంది

అంతుపట్టని ప్రౌఢ!

రంగుపూవులు పూచిన వనం
కొన్ని బాతులు తేలాడే జలం
ఎన్నడూ చూడని పక్షుల గానం
‘ఇక్కడ ఇల్లేమిటి’ అన్న సందేహం

నీకు వచ్చిందంటే…
అదే మా ఇంటికి దారి!


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...