ఆంధ్రప్రదేశ్ సంగీత, రంగస్థల కళారంగం: ఒక పర్యావలోకనం

ఇ) జానపద రూపకములు: జానపదుల నోటి వెంట మొదట పాట, మాట, నృత్యం, సంగీతం, వేషధారణ, చిత్రలేఖనం, సంభాషణలు మొదలగునవన్నీ కాలక్రమంలో క్రమానుసారంగా వెలువడి వికాసము చెందియుండవచ్చును. జానపదుల సంగీతం, నృత్యం కలసి జానపదుల రూపకాన్ని సుసంపన్నం చేసినవి. రూపకాన్ని జానపదులు ఆట అంటారు. భరత ముని తన నాట్యశాస్త్రంలో రూపకాలను, వాటి లక్షణాలను వివరించాడు. దీనినిబట్టి చూస్తే అప్పటికే జానపదుల్లో రూపక ప్రదర్శనలున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. నాటకం, ప్రకరణము, సమవాకారము, ఈహమృగము, డిమము, వ్యాయోగము, అంకము, ప్రహసనము, భాణము, వీధి అనునవి భరతముని తెలిపిన దశరూపకాలు. జానపదుల రూపకాలకు శిష్టుల రూపకాలకు భేత సాదృశ్యాలున్నాయి. ఎలుగుబంటి వేషం, కప్పల కావడి, కరగనృత్యం, కరువ నృత్యం, కలాపం, కురవంజి నృత్యం, చెంచుల కథలు, జట్టిజాము, జేగంట భాగవతులు, జోకుమార సంప్రదాయము, తప్పెటగుళ్ళు, తోలుబొమ్మలాట, దాసర్లు, పగటి వేషము, పాముల వాళ్ళు, పులివేషము, బయలాట, బహురూపులు, బాలసంతువారు, బుట్టబొమ్మలు, బుడబుక్కలవారు, బుర్రకథ, భజన కూటాలు, మారెమ్మ ఉత్సవం, మెరవణి, మోడి, యక్షగానం, గిరిజనుల కళలు, వాలకము, వీధి భాగోతం మొదలగునవి జానపద కళా రూపాలుగా పరిగణించవచ్చును.

1. ఎలుగుబంటి వేషము: మానవుల పురోగతికి పక్షులు, జంతువులు, ప్రకృతి దృశ్యాలు ఎంతగానో తోడ్పడ్డాయి. పక్షులు జంతువులను మానవుడు అనుకరించి అనుసరించసాగాడు. ప్రకృతి దృశ్యాలను చూచి కళానైపుణ్యాన్ని పెంచుకున్నాడు. మానవునికి దగ్గరి పోలికలున్న జంతువులలో ఎలుగుబంటి, కోతి ప్రధానమైనవి. ఎలుగు క్రూరజంతువు అయినప్పటికీ దానిని మచ్చికచేసుకొని, దానిచేత గంతులు వేయిస్తూ ఆబాల గోపాలాన్ని ఆనందింజేస్తారు జానపద భిక్షుకులు. మరికొందరు ఎలుగుబంటి వేషమే ధరిస్తారు. జానపదులకు ఎలుగుకు చాలా అవినాభావ సంబంధమున్నది. చిన్నపిల్లలు భయపడకుండా ఉండుటకు వారి మొలతాడుకు ఎలుగు వెంట్రుకలు కట్టుదురు. మరికొందరు తాయెత్తులలో వెంట్రుకలు కట్టుకని ధరిస్తారు. విజయదశమి, దీపావళి, వినాయకచవితి, సంక్రాంతి, మొహర్రం తదితర పర్వదినాలలో జానపదులు ఎలుగుబంటివేషం ధరించి నృత్యం చేయుదురు. అచ్చంగా ఎలుగుబంటి లక్షణాలతో ప్రవర్తింతురు.

2. కప్పల కావడి: సకాలంలో వర్షాలు పడక పొలాలకు పశువులకు నీటికొరత ఏర్పడినప్పుడు కరువు పరిస్థితులు ఎదురౌతాయని భావించి జానపదులు ‘కప్పల కావడి’ కార్యాన్ని చేయుదురు. మట్టి మూకుడులో తంగేడాకు పెట్టి దానిలో కప్పల నుంచి నెత్తిన పెట్టుకొని గాని కావడికి తగిలించుకొని గాని ‘వానల్లు కురవాలి వానదేవుడా! పంటల్లు పండాలి వానదేవుడా! మా గరిసె నిండాలి వానదేవుడా! మా చెరువు నిండాలి వానదేవుడా! అంటూ పాటపాడుతూ గ్రామమంతా ఇల్లిల్లూ తిరిగి పూజచేయుదురు. కప్ప ఉభయ చరమైనప్పటికిని జానపదుల దృష్టిలో అది బావుల్లో, చెరువుల్లో ఉంటుందని, దాని మనుగడ కోసమైనా వర్షాన్ని కురిపించమని ప్రార్థిస్తారు.

3. కరిగ: మట్టితో కుండను చేసి దానిని పూలతో అలంకరించి తలపై ధరించి పాటలు పాడుతూ నృత్యం చేయుటను కరిగ నృత్యం అంటారు. జానపదులు దీనిని గరిగ నృత్యమని కూడా అంటారు. దీనికొక కథ కూడా బహుళ ప్రచారంలో ఉంది. ద్రౌపది పంచపాండవులను వివాహమాడే సమయంలో సంతోషంతో చేతిలోని కలశాన్ని తలపై పెట్టుకున్నదని, దానికి గుర్తుగా వీరు గరిగ పెట్టుకుంటున్నారు. రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులో ఈ గరిగ నృత్యం బహుళ ప్రచారంలో ఉంది. దేవాలయ ఉత్సవ కార్యక్రమాలందు ఉత్సవ విగ్రహాలకు ముందు ఊరేగింపుగా గరిగ నృత్యకారులు నృత్యం చేస్తూ ముందుకు కదులుదురు. కొన్ని ప్రాంతాలలో గరిగ కుండను పసుపు కుంకుమలు, వేపాకులతో కొత్త గుడ్డలతో అలంకరించి తలపై ధరిస్తారు.

4. కరువ నృత్యం: ఎనిమిది మంది మగవారు శ్రీకృష్ణుని వేషాన్ని, ఎనిమిది మంది సత్యభామ రుక్మిణి మొదలగు అష్టభార్యల వేషాలను గాని, గోపికల వేషాలను గాని ధరించి వర్తులాకారంగా నిలబడగా మధ్యలో రాధాకృష్ణుల వేషాలు ధరించి నిలబడతారు. అందరూ లయబద్ధంగా నృత్యం చేస్తారు.

5. కలాపము: దీనినే భామాకలాపమని కూడా అంటారు. కూచిపూడి నృత్యానికి ఇది అనుకరణమని కొందరు భావిస్తారు. దీనిని ముఖ్యంగా స్త్రీలు నిర్వహిస్తారు.

6. కురవంజి: పిల్లనగ్రోవులూదుతూ డమరకము వాయిస్తూ పాటలు పాడుతూ కుండలాకారంగా నృత్యం చేస్తారు. ఇందులో ఎందరైనా పాల్గొంటారు. పర్వదినాలలోను, ఇలవేల్పుల తిరునాళ్ళలోనూ ఈ నృత్యం చేస్తారు. కురబలు, పాల ఏకరులు ఈ కురవంజి నృత్యం చేస్తారు. ఈ నృత్యాన్ని రాయలసీమ ప్రాంత జానపదులు చేస్తున్నారు. తంజావూరు రఘునాథరాయలు కాలంలో (క్రీ.శ 17వ శతాబ్ది) కురవంజి పేరుతో కొన్ని యక్షగానాలు కూడా వెలువడ్డాయి. వీటిలో కులపెద్ద స్త్రీకి ప్రాధాన్యముంటుంది. ఈమె జాతకం కూడా చెబుతుంది. దీనినే ‘గద్దె’ అంటారు. వర్తమాన భూత భవిష్యత్తులను కూడా వీరు చక్కగా చెబుతారని జానపదుల నమ్మకం. వీరు కోరిన వారి చేయి, వీపులపై పచ్చ పొడుస్తారు. ఆ పచ్చ చెరిగిపోదు. ఆకు పసరుతోనే వారు పచ్చ (రసము) తయారుచేసి సన్నని ముల్లుతో చుక్కలుగా పొడుస్తూ తాము కోరుకున్న చిత్రాన్ని గాని, పేరును గాని పొడుచుటలో నిష్ణాతులు. వీరు చాలా తక్కువ చదువుకున్న వారే.

7. కొండరెడ్లు: ఆయా బుతువులలో ఫలించే వృక్షాలను వీరు పూజిస్తారు. ముఖ్యంగా వీరు మామిడి చెట్లను పూజిస్తారు. ముత్యాలమ్మ, కొండదేవత వీరి ఆరాధ్య దైవాలు. వారు ఎక్కువగా కొండ ప్రాంతాలలో నివసిస్తారు. వీరు వివిధ రోగాలకు మూలికా వైద్యం చేస్తారు. తంబుర మీటుతూ ప్రశ్న చెబుతామని ఊరూరూ తిరుగుతారు. చేతికి కడియాలు కర్ణకుండలాలు, నుదుట పెద్ద నామము, తలపాగాకు నెమిలి పింఛాలు పెట్టుకొని ధరిస్తారు. వీరిని కొండ మామలని కూడా పిలుస్తారు. వీరు ఎక్కువగా విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో తక్కిన జిల్లాలలో తక్కువ సంఖ్యలోనూ నివసిస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రవృత్తి ‘ప్రశ్న’ చెప్పడం.

8. కొయ్యకాళ్ళు: కాళ్ళకు కొయ్యలు కట్టుకొని ఉత్సవాలు, జాతరలు, పండుగలలో నడుస్తూ, నృత్యం చేస్తారు. కాలి ఆకారంతో కొయ్యలను తయారుచేసి కాళ్ళకు కట్టుకుంటారు. అవి సుమారు మూడడుగుల పొడవుంటాయి. కొయ్యకాళ్ళు కట్టుకుని నృత్యం చేయడం అంత సులభం కాదు. ఎంతో అభ్యాసం చేయాలి. డప్పు శబ్దానికి అనుకూలంగా నృత్యం చేస్తారు. కయ్య కాళ్ళతోనే వంగి ప్రేక్షకుల వద్ద డబ్బులు వసూలు చేసుకుంటారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మే నెలలో జరిగే గంగజాతరలో కయ్యకాళ్ళతో నృత్యం చేసే కళాకారులు ఎక్కువగా కనిపిస్తారు.

9. కొయ్య బొమ్మలాట: అరువది నాలుగు కళల్లో సూత్రక్రీడ అనే ఆట ఉంది. జానపదుల దృష్టిలో అదే కొయ్యబొమ్మలాటగా రూపుదిద్దుకొన్నది. సూత్రధారుడు తెరవెనుక ఉంది బొమ్మలను సూత్రాల (దారాలు) సహాయంతో ఆట ఆడిస్తాడు. దీనిలో బొమ్మలను కొయ్యలతో తయారుచేస్తారు. తేలికైన బూరగ, ప్రత్తి, మునగ మొదలగు కొయ్యలతో తయారుచేస్తారు. బొమ్మ ముఖం, చేతులు, కాళ్ళు చేయడానికి ‘సరివి’ కొయ్యను ఉపయోగిస్తారు. మగ, ఆడ, నకిలి అను మూడు రకాల బొమ్మలుంటాయి. మగ బొమ్మలు ఒకటిన్నర అడుగుల నుంచి రెండున్నర అడుగుల వరకు పొడవుంటాయి. ఆడబొమ్మలు కొంచెం చిన్నవిగా ఉంటాయి. సాత్వికము, రౌద్రము మొదలగు రసాలు పోషించడానికి పాత్రలకు తగిన రంగులు వేస్తారు. స్త్రీ పాత్రలకు గాజులు, హారాలు మొదలగు ఆభరణాలుంటాయి. మగ పాత్రలకు విల్లు, గద, చక్రం, కిరీటం మొదలగు ఆయుధాలుంటాయి. ప్రతిబొమ్మకు తలకు రెండు దారాలుంటాయి. వీటిని సూత్రధారుడు తలకు కట్టుకుంటాడు. చేతులకు కక్కీలుంటాయి. వాటిని చేతితో పట్టుకుంటాడు. పాట, మాట, కథకు తగినట్టుగా బొమ్మలను ఆడిస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తారు. ఈ బొమ్మలాటలను గురించి పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో ప్రస్తావించాడు.

‘‘భారతాది కథలు జీరమఱుగల
నారంగ బొమ్మల నాడించువారు
కడు నద్భుతంబుగుగంబ సూత్రంబు
లడరంగ బొమ్మల నాడించువారు’’
-పండితారాధ్య చరిత్ర – ప్రథమ ప్రకరణము –

ఇందులో కంబసూత్రముల ఆడే కొయ్య బొమ్మలాట. దీనినిబట్టి చూస్తే క్రీ. శ. 13వ శతాబ్దానికి పూర్వమే ఈ ఆట ఉన్నట్టు తెలుస్తుంది. కొయ్యబొమ్మలాటకు ఆంధ్రదేశంలో కొండపల్లి బొమ్మలు బహుప్రసిద్ధం. కొండపల్లి కొండమీద దొరకెడి ప్రత్యేకమైన కఱ్ఱతో బొమ్మలను తయారుచేసి రంగులు వేయుదురు. ఈ కొయ్య బొమ్మలు పాశ్చాత్య దేశాలలో గూడా ప్రచారం పొందాయి. కృష్ణరాయ విజయంలో గూడా ఈ కొయ్య బొమ్మల ప్రస్తావన కలదు.

‘‘మదనుడను బొమ్మలాటగాడదనెఱింగి

రాజు నెదుటికి దెరలోన రహిజెలంకు

మెచ్చు బంగారు ప్రతిమను దెచ్చె ననుగ

వచ్చె బెండ్లి కుమారి చెల్వంబు మీఱి’’

ఒకానొకప్పుడు కొయ్యబొమ్మలాటలకు రాయలసీమ పెట్టింది పేరు. కడప జిల్లా కమలాపురం మండలం చిడిపిరాల గ్రామాన్ని బొమ్మలాట రైతు చంద్రయ్య, బొమ్మలాట అమృతకవి తెరనాటకం ఆడడానికి పెద్ద చిట్టయ్యకు ఇచ్చారని ఒక శాసనంలో ఉన్నట్టు ఆర్‌.వి.ఎం. సుందరం గారు తన జానపద విజ్ఞానం అనే గ్రంథంలో తెలిపారు. ఇవేగాక ‘కీలుబొమ్మలాట’ అనే మరొకటి కలదు. ఇవికూడా కొయ్యతో బొమ్మలను చేసినవే. కీలుబొమ్మలాటలో వెనుక తెర మాత్రమే ఉండును. కథానుసారంగా బొమ్మలు తెరచాటు నుంచి వచ్చుచుండును. సరస్సు నుంచి వెలుపలికి వచ్చెడి స్త్రీలు తెరవాసివచ్చు జిగి బంగరు జంతువు బొమ్మలటులు ఉన్నారని అబ్బయామాత్యుడు తన అనిరుద్ధ చరిత్రలో 11-59 వచనములో తెలిపాడు.

10. తోలుబొమ్మలాట: జానపదుల రూపకాలలో విశిష్ఠమైనది, వారి కళానైపుణ్యానికి గీటురాయి వంటిది తోలు బొమ్మలాట. దీనిలో చిత్రకళ, ఆట, సాహిత్యం, గాత్ర సంగీతం, వాద్య సంగీతం ఉండుట వలన ఇదొక సమాహారకళగా జానపదులను అలరిస్తుంది. బొమ్మలాడించే వారు తెర వెనుక ఉండి పద్యాలు, పదాలు, దరువులు చెబుతూ ఆయా పాత్రలకు తగినట్టు సంభాషణలు, సంధివచనాలు పలుకుతూ కథను నడుపుతారు. దీనిలో గద్యపద్యాలలో పద్యానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. గేయాలకు కూడా తగిన స్థానముంది. తెలుగువారి తోలుబొమ్మలాటకు రామాయణ భారత ఇతివృత్తాలే ప్రధాన ఆలంబనాలుగా ఉన్నాయి. పాండవ జననం, లంకాదహనం, కీచక వధ, ప్రహ్లాద చరిత్ర, మైరావణ చరిత్ర మొదలగు ఇతివృత్తాలతో తోలు బొమ్మలాటను ప్రదర్శిస్తారు. సూత్రధారులు ముఖారి, మధ్యమావతి, ఆరభి, ఆనంద, భైరవి రాగాలలో గేయాలను ఆలపిస్తారు. తోలుబొమ్మలాట ఊరి బయట ఖాళీ బీడు ప్రాంతంలో వేదిక నేర్పాటుచేసి ప్రదర్శిస్తారు. కృత్రిమంగా వేదికను నిర్మిస్తారు. ముందు భాగాన తెరగా (screen) తెల్లచీర ఉంటుంది. మగపాత్రల వెనుక మగవారు, ఆడపాత్రల వెనుక ఆడవారు ఉండి బొమ్మలను కదిలిస్తూ కథను నడిపిస్తారు. ఆట రాత్రి సుమారు పది గంటలకు ప్రారంభమై తెల్లవారు జాము వరకు జరుగుతుంది. మొదట వినాయకుని తరువాత సరస్వతిని, విష్ణువును ప్రార్థించి ఆట ప్రారంభిస్తారు. బంగారక్క, కేతిగాడు ముఖ్యంగా వినోదాన్ని ప్రదర్శిస్తారు. వీరు baffoon లాంటివారు. ఈ తోలు బొమ్మలను తయారుచేయుటకు జింక, దుప్పి, కణితి, గొర్రె, గాడిదల చర్మాన్ని ఉపయోగిస్తారు. మొదట తోలును పారదర్శకముగా చేసి కలతలు గీసుకని కత్తిరిస్తారు. రంగులను ఒక్కసారిగా వేయకుండా దశల వారిగా వేస్తారు. జిగురు పూసి దారము పురిపెట్టి బొమ్మల అవయవాలను కీళ్ళ దగ్గర కుట్టి కలుపుదురు. ఏ కోణములోనైనా త్రిప్పుటకు అనుకూలముగా కుట్టుదురు. తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తే తమ ఊరికి పట్టిన శనిపీడ విరగడౌతుందని జానపదుల గట్టి నమ్మకం. దీనివల్ల కరువు కాటకాలు నశించిపోతాయని విశ్వసిస్తారు. ఈ తోలు బొమ్మలాట ప్రదర్శకులు ముఖ్యంగా దేశ దిమ్మరులు. నేటి చలనచిత్రాల రూపకల్పనకు తోలుబొమ్మలే ఉత్ప్రేరకాలనుటకు సందేహం అవసరం లేదు.

తోలుబొమ్మల తయారీలో అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట ఖండాంతర ఖ్యాతినార్జించినది. ఈ జిల్లాలో సుమారు ఐదు వందలకు పైన కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. ఈ కళను కాపాడుకుంటూ వస్తున్నారు.

11. కోలాటము: జానపదులకు అత్యంత ప్రియమైన వినోదాన్ని కలిగించేది కోలాటము. పాట, దానికి తగిన లయ, దానికి తగిన నృత్యం, దానికి తగిన సంగీతం, దానితోబాటు వినోదం కలగలసిన క్రీడ కోలాటం. కోలాటమనేది నృత్తభేదాల్లో ఒకటి. అన్నమయ్య కీర్తనల్లో కోలాట కీర్తనలు అనేకం ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహోత్సవాలలో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ స్త్రీపురుషులు, బాలలు కోలాట నృత్యం చేయుదురు. కోలాటంలో ఎనిమిది లేదా పన్నెండు మంది పాల్గొంటారు. సరిసంఖ్యతో ఇంకెంతమందైనా ఉండవచ్చు. ఆటలో రాటుదేలినవాడు నాయకుడుగా ఉంటాడు. ఇతన్ని పెన్నుద్ది, అయ్యగారు, మేళగాడు అంటారు. వెలుపల కక్ష్యలో సవ్యంగా తిరిగే వారిని వెలియుద్దులని, లోపలి కక్ష్యలో అపసవ్యంగా తిరిగే వాళ్ళను లోయుద్దులని అంటారు. జట్టులోని వారందరూ కాళ్ళకు గజ్జలు, చేతికి గజ్జలు కట్టిన కోలాటం కట్టెలు ధరిస్తారు. మొదట ‘తయ్యక తద్ధిమితా’ అని పెన్నుద్ది విలంబగతిలో కోలాటం మొదలు పెడతాడు. నిలబడి, తిరుగుతూ, మోకాలి మీద కూర్చుని కూడా కోలాటం వేస్తారు. సాధారణంగా కోలాటాలు గణనాయకుని పాటతో మొదలౌతాయి. రాముడు, కృష్ణుడు మొదలగు దేవతల కీర్తనలతో కోలాటం వేస్తారు. పల్లవి కోలాటం పాటలో లయాత్మకంగా కోలల శబ్దానికి తగినట్టుగా ఉంటుంది.

‘‘శివశివ మూర్తివి గణనాథా నీవు
శివుని కుమారుడవు గణనాథా’’

అనే తెలుగు కీర్తన జానపదుల కోలాటంలో అత్యంత ప్రసిద్ధమైనవి. గ్రామ దేవతలు, పండుగలు, ఉత్సవ ఊరేగింపులు సందర్భంగా ఈ కోలాట నృత్యాన్ని ప్రదర్శిస్తారు.

12. గంగిరెద్దు మేళము: జానపదులు తమ పొట్టకూటికోసం కొన్ని జంతువులకు విద్యలు నేర్పారు. కోతి, ఎలుగుబంటు, ఎద్దు అందులో ప్రధానమైనవి. సీతారామ లక్ష్మణులని ఆవు, ఎద్దులకు పేర్లుపెట్టి సీతారామ కళ్యాణం జరిపిస్తారు. ఎద్దుకు కళ్ళకు గంతలు కట్టి సంగీతం వాయిస్తూ ఎక్కడో దూరంగా వదలి వచ్చిన దానిని వేదిక వద్దకు రప్పిస్తారు. గంగిరెద్దుల వాడు ఎద్దు నాలుగు కాళ్ళను తనపై పెట్టుకొంటాడు. ఎంతో బరువైన ఎద్దు ఊపిరి బిగబట్టి వాని తొడలపై నిలబడుతుంది. అది బరువు మోపితే వాని పిక్కలు ఊడిపోతాయి. కాని తన యజమానికి ఎంతమాత్రం అది భారం మోపదు. ఇది నోరులేని ఎద్దుకు వారు నేర్పిన విద్య. ‘సీత’ పేరుతో ఉన్న గోవు రాముని పేరుతో వున్న ఎద్దును పెళ్ళి చేసుకోకుండా అలిగి దూరంగా పోతుంది. రాముడు నల్లగా ఉంటాడని మా సీతమ్మ అలిగిందంటాడు ఒకడు. ‘మా రాముడు మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడు’ అని ఇంకొక్కడు బుజ్జగిస్తాడు. అపుడు దూరంగా వెళ్ళిపోయిన ఆవు తిరిగి వస్తుంది. వీటికి పెళ్ళి చేసే ఘట్టం చూచుటకు కన్నులు చాలవు. ‘అయ్య గారికి దణ్ణం పెట్టు’ అంటే ఎద్దు తలతో నమస్కరిస్తుంది. గంగిరెద్దులను రకరకాల బట్టలతో, రంగులతో చక్కగా అలంకరిస్తారు. గంగిరెద్దు మేళంలో తోలు, నాదస్వరమూ ఉంటాయి. వాద్య సంగీతమూ, జంతువుల నృత్యం వారి మేళంలో విశిష్ఠమైనవి.

13. గుర్రపు నృత్యం: కీలు గుర్రం అనే పేరుతో గుర్రపు నృత్యాన్ని పర్వ దినాలలో జానపదులు ప్రదర్శిస్తారు. జానపదుల కథల్లో గూడ కీలు గుర్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. గుర్రపు ఆకారాన్ని వెదురు దబ్బలతో తయారుచేస్తారు. గుర్రపు తల మాత్రం కాగితాలు బాగా రుబ్బి, దానిలో కొన్ని మెంతులు కలిపి జిగురుగా ఏర్పడిన తరువాత తయారుచేస్తారు. గుర్రపు కాళ్ళకు కొయ్యలు కట్టుదురు. రంగురంగుల గుడ్డలను గుర్రం మీద వేస్తారు. గుర్రపు మధ్య భాగంలో ఖాళీ ఉంచుతారు. పురుషుడు రాజుగా, స్త్రీ రాణిగా వేషాలు ధరించి ఖాళీ భాగంగుండా దూరి నిలబడి నడుము వరకు గుర్రాన్ని లేపుతారు. ఈ దృశ్యం చూచు వారికి వారు గుర్రము నెక్కినట్టు కనిపిస్తుంది. వాద్యాలు కొందరు పాటలు పాడుతుండగా రాజు రాణి స్వారీ చేస్తూ నృత్యం చేస్తారు. కొయ్యలతో ఈ విధంగా చేసేది ఒక కళ అయితే గుర్రాలనెక్కి స్వారీచేస్తే నృత్యం చేస్తారు. ఇది మరొక కళ. స్వారీ చేసే వ్యక్తిని ‘వేమయ్య’ అంటారు. వీరు గుర్రమును స్వారీ చేస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ మిరిచ్చే భిక్షను స్వీకరిస్తారు. ప్రతి ఇంటి వారు గుర్రాన్ని పూజిస్తారు.

14. చెంచుల కథలు: వీరు పూర్తిగా ఆదివాసీలు. అప్పటికప్పుడే ఆశువుగా పాటలు పాడుతూ స్త్రీ పురుషులు నృత్యం చేస్తారు. వీరి ఆటల్లో సింగి సింగడు ప్రధాన పాత్రధారులు, నాయికా నాయకులు. డప్పుకు తగినట్టుగా గంతులేస్తారు. ఇప్పపువ్వు సారాలు తాగితే మైమరచి కుప్పిగంతులేస్తారు. నెమలి నృత్యం, కోతి నృత్యం వీరి నృత్యాల్లో ముఖ్యమైనవి.

15. జట్టిజాము: జట్టిజాము తాళ ప్రధానమైన కళ. చేతులు చరపడము ఇందులో ప్రధానం. తిన్నగా నిలబడి ఇరుప్రక్కలందలి ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడి ప్రక్కకు. మరొకసారి ఎడమ ప్రక్కకు ఓరగా తిరిగి ఆయా ప్రక్కలనుండు వారి అరచేతులను తన అరచేతులతో తట్టుచూ పాటలు పాడేది జట్టిజాము. ఇది పూర్తిగా స్త్రీల ఆట. జట్టుజాములో నలుగురు గాని అంతకు ఎక్కువైనా సరిసంఖ్యలో గాని పాల్గొంటారు. వీరు రెండు జట్లుగా ఉంటారు. ఒక జట్టు వారు ఒక పాదం చెబితే, మరో జట్టు వారు వంత పాడుదురు. తుమ్మెద, నడియలో, వెన్నిటి, రామరామా, కోదండరామా మొదలగు పల్లవులు జట్టిజాముల్లోని పాటల్లో కనిపిస్తాయి.

16. జేగంట భాగవతులు: ఈ నృత్యంలో జేగంట ప్రధాన భూమిక కలిగియుంటుంది. రామదాసును తానీషా జైలులో బంధించిన ఇతివృత్తం ఇందులో ప్రధానమైనది. ‘ఎందుకయ్యా ఉంచినావు బందిఖానాలో’ అనే పాట పాడుతూ పెద్ద జేగంటతో రామలక్ష్మణ సీతా విగ్రహాలతో కూడిన దీపపుస్తంభాన్ని పట్టుకని గజ్జల కాళ్ళతో నృత్యం చేస్తూ చిరుతలతో తాళంవేస్తూ స్తంభం చుట్టూ తిరుగుదురు.

17. జో కుమార సంప్రదాయము: బోయలు, తలార్లు జోకుమారుని విగ్రహాన్ని తయారుచేసి ఊరూరా తిప్పుదురు. ఏడు నుంచి తొమ్మిది రోజులలో వివిధ ప్రాంతాలు తిరిగి వస్తారు. ఆడవాళ్ళు తంగేడు ఆకు, తంగేడు పువ్వులు, జిల్లేడు ఆకులు పువ్వులతో అలంకారం చేసుకుంటారు. వర్షం కోసం ఈ పూజ చేస్తారు. జోకుమారుడు వినాయకుని తమ్ముడని జానపదుల విశ్వాసం. తిరిగిన ఊర్లలో వచ్చిన ధాన్యంతో వంటచేసి జోకుమారుణ్ణి పూజించి ఒక చోట నెలకల్పి అందరూ కలిసి భుజిస్తారు. ఈ పుజావిధానం రాయలసీమలోని అనంతపురము జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది.

18. తప్పెటగుళ్ళు: తప్పెటలు, గజ్జెలు ఇందులో ప్రధాన వాద్యాలు. పొట్టిచేతుల జుబ్బాలు, నిక్కర్లు వేసుకున్న కళాకారులు గుండెలకు ఆనుకన్న తప్పెటల్ని లయాన్వితంగా వాయిస్తూ నృత్యం చేస్తారు. కాళ్ళకు గూడా గజ్జెలు ధరిస్తారు. వీరు ఎక్కువగా ఎర్రరంగు వస్త్రాలు ధరిస్తారు. ఇది ప్రధానంగా పురుషులు ప్రదర్శించే కళ. తప్పెట గుళ్ళతో బాటు గాత్ర సంగీతం కూడా ఉంటుంది. వివిధ భంగిమలలో తప్పెట్లు వాయించడం ఇందులో చెప్పుకోదగ్గ విశేషం. ఒకరి మీద ఒకరు ఎక్కి ఇటకరిని అటకరిని వ్రేలాడదీస్తూ తప్పెటలు వాయించడం ఒక ఎత్తైతే, ఒక్కకసారి కళాకారులు రెండు జట్లుగా విడిపోయి తప్పెట్లు వాయిస్తూ నాట్యం చేయడంలో పోటీపడతారు. పెద్దకుండ పైన ఒకడు నిలబడుకని, అతని భుజాలపైన మరొకడు నిలబడుకని అతని తలపైన నీళ్ళ పాత్రను పెట్టి కూడా తప్పెట్లు వాయిస్తారు. ఈ ప్రదర్శన సుమారు ఐదారు గంటలు సాగుతుంది.

19. పగటి వేషం: యక్షగానాలు, వీధిభాగవతాలు రాత్రివేళ ప్రదర్శించే కళలైతే ఆ వేషాలనే కందరు పగలు ధరించి నాట్యనర్తన చేస్తారు. వీరినే పగటి వేషగాళ్ళు అంటారు. గ్రామ్య భాషలో వీరిని ‘పగలేసిగాళ్ళు’ అంటారు. వీరు వివిధ పురాణ పాత్రల్ని ధరిస్తారు. గాత్ర సంగీతం వాద్య సంగీతంతో ఇల్లిల్లూ తిరుగుతారు. వీరిలో పరిహాస ప్రియత్వం గూడా ఉంటుంది. వీరు దేశ దిమ్మరులు.

20. పాముల వాళ్ళు: బుట్టలో పామును తీసికని బుంగ ఊదుతూ ఇల్లిల్లూ తిరుగుతూ భిక్ష స్వీకరిస్తారు. వాడు బుంగ తిప్పినట్లల్లా పాము పడగవిప్పి తిరుగుతుంది. కందరు కండచిలువను మెడకు ధరించి ఇల్లిల్లూ తిరుగుదురు.

21. పులివేషం: పులివేషగాళ్ళు చెడ్డీ మాత్రం ధరిస్తారు. మిగిలిన శరీరానికంతా పులిలాగా శరీరానికి చారలు పూసుకుంటారు. పులి తలలాంటి విగ్గును తలకు ధరిస్తారు. అదే విధంగా తోకను గూడా ధరిస్తారు. తప్పెట మోతకు తగినట్టుగా ఆడుతాడు.

22. బయలాట: బహిరంగ ప్రదేశాల్లో ఆడే ఆటలే బయలాటలు. వీటిలో పాటలు, పద్యాలు, దరువులు ఉంటాయి. శబ్దాలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇందులో ఉంటుంది. వేషభూషణాలు, అభినయము యక్షగానానికి బయలాటకు ఒక్కటే. ఇందులో వాచికము ఎక్కువ. నాయకుడు వేదిక మీదకు రాగానే వంత పాటగాండ్రు దిష్టి (దృష్టి) తీయడానికి గుమ్మడికాయో, టెంకాయో కట్టి, ఊరిపేరు, సభలోకి రావడానికి కారణం అడుగుతారు. కథా వివరాలన్నీ అతడు చెబుతాడు. పిమ్మట కథ ప్రారంభమౌతుంది. వీరు ధరించే ఆభరణాలు తళతళ మెరుస్తాయి. ఆయుధాలను కయ్యతో తయారుచేస్తారు. కీచకవధ, ఉత్తర గోగ్రహణము, పాండవ జననము మొదలగు పౌరాణిక కథలను ప్రదర్శిస్తారు.

23. బహురూపులు: బహురూపులు, పగటి వేషగాళ్ళు ఒకటేనని విమర్శకుల అభిప్రాయం. భావుకత కలిగి ఉండాలని, కళా విమర్శకుడై ఉండాలని, యువకుడు అందగాడై ఉండాలని, అంతపొడుగు మరీ పొట్టి కాకూడదని కాకతీయుల కాలంనాటి జాయాపసేనాని నృత్తరత్నావళిలో బహురూపుల లక్షణాలను తెలిపాడు. బహురూపి బహుభాషాభిజ్ఞుడై ఉండాలి. బలశాలిగా, రూపధారణను వేగంగా చేయగలిగిన వాడుగా ఉండాలి. శివరాత్రి పర్వదినాల్లో శ్రీశైలంలో బహురూపులు తమ వేషాలను ప్రదర్శించే వారని పాల్కురికి సోమనాధుడు పండితారాధ్యుల చరిత్రలో (5-62) తెలిపాడు. వీరు మిమిక్రీ కళాకారుల వంటి వారై ఉండవచ్చు.

24. బాలసంతువారు: వీరు తెల్లవారు రaామున గంట వాయిస్తూ ఇంటింటికి వచ్చి జోస్యం చెప్పుదురు. ఇంటి యజమాని విన్నా వినకపోయినా వారు చెప్పేది చెప్పి వెళ్ళిపోవుదురు. వీరు ముఖ్యంగా శైవులు.

25 బుట్టబమ్మలు: వెదురు దబ్బలతో అల్లిన పెద్ద బమ్మలకు పైన కళ్ళు జిగేలుమనిపించే రంగులుంటాయి. ఈ బమ్మలు చాలా ఎత్తుగా ఉంటాయి. బమ్మల నడుము దగ్గర మనిషి తల పెట్టుకోవడానికి ఒక అడ్డు పలక వంటిది ఉంటుంది. అక్కడే కళ్ళు రెండు రంధ్రాల్లోంచి మిలమిల మెరుస్తుంటాయి. తప్పెటల వాద్య సంగీతానికి తగినట్టుగా అడుగులు కదిలిస్తూ నృత్యం కూడా చేస్తారు.

26. బుడబుక్కలవారు: ‘బుడబుడక’ అనేది ఒక వాద్యం. బుడబుడక అనేది చర్మ వాద్యం. వీరు భవిష్యత్తు చెబుతూ ఇల్లిల్లూ తిరిగి భిక్ష కోరుదురు. వీరు తలకు పెద్ద రుమాలు ధరిస్తారు. అది వివిధ రంగులలో ఉంటుంది. ఒంటిపై రంగు రంగుల వస్త్రాలు ధరిస్తారు. నడుము కింద మాత్రం తెల్లపంచె ధరిస్తారు. నుదుట నామము పెట్టుకని గొడుగు ధరించి ‘బుడుకు బుడుకు’మని శబ్దం చేస్తూ తిరుగుదురు. అర్ధరాత్రి స్మశానంలో భవిష్యత్తు తెలుసుకని వచ్చి పొద్దునే వచ్చి చెబుదురు. శకునపక్షి భాష వీళ్ళకు తెలుసునని, స్మశానంలో ఆ పక్షి వీళ్ళకు చెబుతుందని జానపదుల విశ్వాసం.

27. బుర్రకథ: వీరు బుర్రతో పాటు గుమ్మెట వాద్యాన్ని ఉపయోగిస్తారు. వంతలు పాడటానికి ఇద్దరు ముగ్గురుంటారు. వీరు కథకునికి ఇరుప్రక్కలా ఉంటారు. వీర పురాణ కథలను, వీర గాథా గేయాలను గాత్రం నృత్యం ద్వారా ప్రదర్శిస్తారు. వినరా ఆంధ్రా కుమారా ధీరా విజయం మనదేరా, తందానా తాని తందనానా వంటి పల్లవి ప్రధానమైనది. తలకు కిరీటాకృతిలో పెట్టుకున్న వర్ణరంజితమైన కుళ్ళాయి ఉంటుంది. చెవులకు కుండలాలుంటాయి. గురువు లేక నాయకుడు కరపాల మేళములో ప్రధాన భూమిక పోషిస్తాడు.

28. భజనకూటాలు: ‘కూటమి’ అంటే గుంపు. ప్రతి ఊరిలోనూ భజన కూటములుంటాయి. గుడిలో పర్వదినాలలో భజనలు చేస్తారు. శివభజన, రామభజన, హరిభజన, పండరి భజన అనేవి ముఖ్య విభాగాలు. వీరు తాళాలు, చెక్కలు ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్ని భజనలలో నృత్యం కూడా ఉంది. గురువు పాటపాడి నృత్యం చేయగా శిష్యులు అతనిని అనుసరిస్తారు.

29. మారెమ్మ: పంట చేతికొచ్చిన రోజుల్లో చేసే ఉత్సవమిది. మారెమ్మ దేవతను పూజించి (విగ్రహాన్ని) ఊరి పొలిమేరల్లో వదులుతారు. స్త్రీ పురుషులు, వరుసలో నిలబడి నృత్యం చేస్తారు. ఇందులో ఎంతమందైనా పాల్గొనవచ్చు.

30. మోడి: ఇది చూస్తేమనకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇది పూర్తిగా హస్తలాఘవముపై ఆధారపడినది. దీనినే ఇంద్రజాలమంటారు. మోడి చేసేవారు రెండు పక్షాలుగా ఉంటారు. తమ విద్యలను ఎదుటి పక్షంపై ప్రయోగిస్తారు. కాగితాన్ని రూపాయి నోటుగా మార్చడమూ, నీళ్ళలో మట్టివేసి రక్తంగా మార్చడం, వేపాకును తేళ్ళుగా మార్చడం మొదలైన విద్యలను ప్రదర్శిస్తారు. ఇది వంశపారంపర్యంగా వచ్చిన కళ. ఊరి బయట ఈ కళను ప్రదర్శిస్తారు. నల్లకోటు వేసుకొని తలపాగా చుట్టుకొని అంగవస్త్రం వేసుకోవడం వీరి సంప్రదాయం. కాలిన గుండును నోటితో తాకడం, ఇనుప కత్తిని మింగడం, కళ్ళు పీక్కోవడం, కళ్ళలో పుల్లలు గుచ్చడం వంటి భయంకర క్రీడలు ప్రదర్శింతురు.

31. యక్షగానము: ఊరి బయటనో, గుడి ముంగిటనో తాత్కాలికంగా నిర్మించిన పందిరి యక్షగానానికి వేదిక. రంగు వస్త్రాన్ని గాని, తెల్లని వస్త్రాన్ని గాని తెరగా కట్టుదురు. తెరకిరువైపుల నూనె దివిటీలు, తెరవెనుక హంగుదారులు, వంత పాటకులుందురు. తెరపై ముందుగా సూత్రధారుడు ప్రవేశించి కథామూలాలను తెలిపి నిష్క్రమిస్తాడు. పాత్రలకు తగిన వేషాలు ధరించిన వారు గాన నృత్య వాచికముతో అభినయింతురు. మధ్య మధ్యలో హాస్య ప్రసంగాలుంటాయి. ఒక రాత్రంతా ప్రదర్శన ఉంటుంది. యక్షగానాల ప్రస్తావన శిష్టసాహిత్యంలో గూడా చాలాచోట్ల గలదు.

32. గిరిజనుల కళలు: గిరిజనుల కళల్లో ముఖ్యమైనది చిందు నాట్యం. యానాదులు, ఎరుకలు, సుగాలీలు పండుగ పర్వదినాలలో చిందులేస్తారు. వివిధ పురాణ పాత్రలు గూడా ధరిస్తారు. వీరు ప్రయోగించే భాష పూర్తిగా గ్రామ్యమే. యానాదులు ‘రంగము’ అనే క్రీడ ఆడుదురు. ఏదైనా వస్తువు పోయినదని తెలిస్తే బాగా సారాయి తాగి వాద్యం వాయిస్తూ నృత్యం చేస్తూ వారి కులదైవాన్ని గొంతెత్తి ఆలపిస్తారు. వారి దేవత వారి శరీరంలో ప్రవేశించి పోయిన వస్తువు జాడ తెలుపుతుందట. దీనిని వారు పూనకము అంటారు.

33. వాలకము: నలుగురు జానపదులు గుమిగూడి ఆశువుగా మాట్లాడతారు. వారి మాటల్లో సమకాలీన సమస్యలుంటాయి. గ్రామల్లో పెద్దలు చేసిన మోసాలను వ్యంగ్యంగా బయటపెడతారు. విదూషకుడు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాడు.

34. వీధి భాగోతము: దీనినే వీధి నాటకమని కూడా అంటారు. యక్షగానం లక్షణాలు ఇందులో చాలా ఉన్నాయి. వివిధ పురాణ పాత్రలను నటులు ధరిస్తారు. నాటకం రాత్రి పది గంటలకు ప్రారంభమై సూర్యోదయం వరకు నడుస్తుంది. ఇందులో పాత్రలు అనేకం. వాద్య, గాత్ర, వాచిక, అభినయము ఇందులో ప్రధానం. భుజకీర్తులు, హారాలు, కర్ణాభరణాలు, కత్తి, డాలు, ఖడ్గం, గద మొదలగు వానిని ధరిస్తారు. వాటిలో అమర్చిన అద్దాల వలన అవి ధగధగ మెరిసిపోతాయి. పాత్రధారులు ఇందులో నటించడం కంటే జీవిస్తారు. ద్రౌపది వస్త్రాపహరణము నాటకంలో భీముని ఉగ్రరూపాన్ని అదుపు చేయుటకు తాళ్ళతో కట్టిపట్టుకుంటారు. వీరి వేషధారణ అచ్చం రాజుల లాగానే ఉంటుంది. పాటలు, పద్యాలు, హాస్యప్రసంగాలతో బాటు నవరసాలు పోషించబడతాయి. శాస్త్రసాంకేతిక రంగం ఎంతగా అభివృద్ధి చెందినను, చలనచిత్ర రంగములో వచ్చిన సాంకేతికాభివృద్ధిని కూడా తట్టుకొని నిలబడిన జానపదకళ వీధి భాగవతం ఒక్కటే.

ఈ సంగీత రంగస్థల వగైరా కళల ఉద్ధరణకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది. సువిశాలమైన రాష్ట్రంలో అనంతాలైన కళల పోషణకు అటువంటి అకాడమీ, సంస్థలు మరికొన్ని నెలకొల్పితే గాని వాటిని సమగ్రాభివృద్ధి చేయడం సాధ్యపడదు.