కర్ణాటక సంగీతం కాస్తో కూస్తో పరిచయమున్న ఎవరికైనా కొన్ని పాటలు ఖచ్చితంగా తెలుసుంటాయి – ఎందరో మహాను భావులు, సామజ వరగమన, వాతాపి గణపతిం భజే, ఇలా. చెప్పాలంటే సంగీత ప్రియులకే కాక, సామాన్యులక్కూడా పరిచయమున్న పాటలు. ఈ పాటల కోవలోకే చెందిన మరో ప్రసిద్ధి చెందిన పాట ‘రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ’ కృతి.
సంగీతం నేర్చుకున్న ప్రతీ వ్యక్తీ ఈ పాట నేర్చుకోకుండా ఉండడు అంటే అతిశయోక్తి కాదు. చాలా సంగీత కచేరీలలో ఈ పాట తరచు వినిపిస్తూ ఉంటుంది. ఈ పాట తమ ఆల్బంలలో పాడని ఏ సంగీత విద్వాంసుడూ కనబడడు. ఇంతగా అందర్నీ అలరించిన ఈ కృతిని స్వరపరిచిన రాగం పేరు ‘కదనకుతూహలం’. కదన కుతూహలం అంటే యుద్ధానికి ఉవ్విళ్ళూరడమన్న మాట. వినడానికే విచిత్రంగా ఉంటుంది.
చాలామంది ఈ కృతి రచన, స్వరమూ చూసి త్యాగరాజ కీర్తన అని అపోహ పడతారు. పల్లవీ, చరణంలో ముందు పాదాల సాహిత్యం విని త్యాగరాజ కృతిగానే భావిస్తారు. చివరకొచ్చే సరికి త్యాగరాజు ముద్ర కనిపించదు. ‘వేంకటేశ’ అనే ముద్ర చివర వినిపించగానే అది ఏ అన్నమాచార్య కీర్తనో అనుకుంటారు. ఈ ‘రఘువంశ సుధాంబుధి’ కున్న ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. ఇంత ప్రసిద్ధి చెందిన కృతిని స్వరపరిచింది పట్నం సుబ్రమణ్య అయ్యర్ అనే వాగ్గేయకారుడు. సంగీత ప్రియులకి ఈయన పేరు పరిచయమే కానీ, అన్యులకి ఈ పేరు అంతగా తెలీదు.
త్యాగరాజు కర్ణాటక సంగీతానికి ఒక దిశానిర్డేశం చేయడమే కాదు, పాతికమంది పైగా ప్రధాన శిష్యులకి గురువుగా తన సంగీత స్రవంతినీ, రచనా సరళిని నేర్పాడు. ఆ శిష్యుల ద్వారా మరికొంతమంది ప్రశిష్యులు పారంపర్యంగా త్యాగరాజు కృతుల ప్రాచుర్యానికి దోహదపడ్డారు. ఇదేవిధంగా త్యాగరాజులాగే దాదాపు ప్రధాన శిష్యులందరూ తెలుగులోనే కృతులు కట్టారు. అందువల్లే శిష్యులు కూర్చిన కొన్ని కృతులు మొదట విన్నప్పుడు ముఖ్యంగా సాహిత్యంలో త్యాగరాజ కృతుల్లానే అనిపిస్తాయి.
ఈ త్యాగరాజ శిష్య పరంపరకి చెందిన వాడే పట్నం సుబ్రమణ్య అయ్యర్. త్యాగరాజు ప్రధాన శిష్యుళ్ళలో ఒకడైన మానాంబుచావడి వెంకట సుబ్బయ్యర్ శిష్యుడే ఇతను. త్యాగరాజు అత్తయ్య కొడుకు మానాంబుచావడి వేంకట సుబ్బయ్యర్. ఇతను త్యాగరాజు కన్నా పదిహేనేళ్ళు చిన్నవాడు. చాలాకాలం త్యాగరాజు వద్ద సంగీతం విద్య నభ్యసించాడు. కొంతకాలమయ్యాక తంజావూరు దగ్గర్లో ఉన్న ఇతని సొంతూరు మానాంబుచావడిలో స్థిరపడ్డాడు. పల్లవి శేషయ్యర్, పట్నం సుబ్రమణ్య అయ్యర్ ఈయనకి ప్రధాన శిష్యులు.
త్యాగరాజు శిష్యులందరూ కొత్త కృతులూ, వర్ణాలూ కట్టినా పట్నం సుబ్రమణ్యయ్యర్ చేసిన రచనలకొచ్చిన ప్రాముఖ్యత, పేరూ మిగతా వారికి అంతగా రాలేదు. వందకు పైగా కృతులూ, వర్ణాలూ, జావళీలు, తిల్లానాలు ఈయన రచించాడు. ఇవి తెలుగు, సంస్కృతము, తమిళ భాషలలో ఉన్నాయి. వర్ణములకు సంగీతములో ఒక ప్రత్యేక స్థానముంది. కచేరీలు సామాన్యంగా వర్ణములతో ప్రారంభమవుతాయి. వర్ణము రాగపు వైశాల్యాన్నీ, కల్పన్నీ, నడకనీ, గంభీర్యాన్నీ, దర్జానీ తెలుపుతుంది. వర్ణాలను రాసిన వారిలో సుబ్రహ్మణ్య అయ్యర్ తరువాతే ఎవరైనానని సంగీతజ్ఞులు భావిస్తారు.ఆయన రాసిన వర్ణాలు సరళంగా సులభ శైలిలో ఉంటాయి. వీటికి పెద్ద ఉదాహరణ సుబ్రమణ్యయ్యరు ఆభోగి రాగంలో స్వర పరిచిన ‘ఎవ్వారి బోధన’ వర్ణం.
ఇతని పూర్వీకులందరూ సంగీత కుటుంబం నుండి వచ్చిన వారే. సుబ్రమణ్య అయ్యర్ 1845లో తంజావూరులో జన్మించాడు. ఇతని తండ్రి భరతం వైద్యనాథ అయ్యర్. ఇతని తాతగారు భరతం పంచనద శాస్త్రి తంజావూరు రాజు శరభోజి (శర్ఫోజీ) కొలువులో ఆస్థాన విద్వాంసుల్లో ఒకరు. ఇతని మేనమామ మెలట్టూరు గణపతి శాస్త్రి, సుబ్రమణ్య అయ్యర్‌కి చిన్నతనంలోనే సంగీతం నేర్పాడు. తన వంశీయులు తంజావూరులోనే గడిపినా సుబ్రమణ్యయ్యర్ మాత్రం తంజావూరు వదిలి (త్యాగరాజు ఉన్న ఊరు) తిరువయ్యారు వచ్చి స్థిరపడ్డాడు. మైసూరు రాజాస్థానంలోనూ, ట్రావన్‌కోరు, విజయనగరం, రామనాథపురం ఆస్థానాలలో తరచు సంగీత కచేరీలు చేసేవాడు. ఇతనికి పిల్లలు లేరు. పరమేశ్వరయ్య, కెంపెగౌడ అనే శిష్యులు చిన్నతనం నుండీ ఈయన వద్దే ఉంటూ సంగీతం అభ్యసించారు. రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, కాకినాడ కృష్ణస్వామి అయ్యర్, జి. నారాయణస్వామి అయ్యర్, మైసూరు వాసుదేవాచార్య, గురుస్వామి అయ్యర్, టైగర్ వరదాచారి, ముత్యాలపేట శేషయ్యర్, ఎం.ఎస్.రామస్వామి అయ్యర్, ఏనడి లక్ష్మి మొదలగు వారు సుబ్రమణ్యయ్యర్ శిష్యుల్లో ప్రథానమైన వారు.
కదనకుతూహలం పేరు చెప్పగానే పట్నం సుబ్రమణ్య అయ్యరూ, ఆయన పేరు తల్చుకోగానే చటుక్కున కదనకుతూహలమూ మనసులో మెదిలేంతగా ఈ రఘువంశ సుధాంబుధి కృతి ప్రాచుర్యం పొందింది. సంగీతం నేర్చుకునే వారికి, ముఖ్యంగా వర్ణాల వరకూ వచ్చే సరికి కొన్ని ఖచ్చితంగా నేర్పి తీరుతారు. అందులో సుబ్రమణ్యయ్యరు ఆభోగి రాగంలో స్వర పరిచిన ‘ఎవ్వారి బోధన‘ వర్ణం ఒకటి. ఇది నేర్చుకోని సంగీతకారులుండరు. అలాగే వలచి వచ్చీ అనే నవరాగ మాలిక వర్ణమూ అత్యంత ప్రాచుర్యం చెందిన వర్ణమే. (చాలామంది ఈ నవరాగమాలిక వర్ణం కొత్తవలస వెంకట్రామయ్యర్ రచించినట్లుగా తలుస్తారు. కానీ పార్థసారధి ‘గాన కళా బోధిని’, సాంబమూర్తి ‘సౌత్ ఇండియన్ మ్యూజిక్’ లో మాత్రం పట్నం సుబ్రమణ్యయ్యరే స్వరకర్తని వుంది. నేనూ అదే ఆధారంగా తీసుకున్నాను.)
ఇవి కాక, ఏరా నాపై- తోడి రాగ వర్ణమూ, ఏరా నాపై – ముఖారి వర్ణమూ, మనసేటికి – సావేరి వర్ణమూ, పలుమారు నిన్నే – నాట వర్ణమూ, సరసాంగి రాగంలో సరసాంగి వర్ణమూ చాలా పేరొందినవి.
ఇవేకాకుండా రామప్రియ రాగంలో ‘కోరిన వారము‘, సౌరాష్ట్రంలో ‘నిన్ను జూచి’, బిలహరిలో ‘పరిదానమిచ్చితే‘ మరికొన్ని ప్రసిద్ధి చెందిన కృతులు.
సుబ్రమణ్యయ్యరు తన రచనలని, ముఖ్యంగా తిల్లానాలూ, జావళీలని వివిధ తాళాల్లో పాడేవారనీ, తాళాల్లో అతిక్లిష్టమయిన సింహనందన తాళంలో కూడా పాడారనీ చెబుతారు. కర్ణాటక సంగీతం తాళ ప్రధానమయినది. ఈ తాళ శాస్త్రంలో 128 పైగా వివిధ తాళగతులున్నాయి. తాళ రీతుల్లో సింహనందన తాళం గాయకులకి ఓ పట్టాన కొరుకుడు పడదు. ఇందులో 128 మాట్లు (బీట్స్) ఉంటాయి. ఆదితాళం తీసుకుంటే ఒక ఆవృతానికి 8 మాట్లుంటాయి. ఇటువంటివి 16 ఆవృతాలు కలిపితే సింహనందన తాళంలో ఒక ఆవృతం అవుతుంది. మామూలు తాళాల్లో గురు, లఘు, దృతం వంటి అంగాలుంటాయి. ఈ సింహనందన తాళంలో మాత్రం ఇవే కాకుండా ప్లుతం, కాకపాదం వంటివి కూడా ఉంటాయి. ఈ సింహనందన తాళంలో – గురు-గురు-లఘు-ప్లుత-లఘు-గురు-ధృత-ధృత-గురు-గురు-లఘు-ప్లుత-లఘు-ప్లుత-గురు-లఘు-లఘు-కాకపాద అంగాలు వరుసగా వస్తాయి. సాధారణంగా వేళ్ళతో లెక్కిస్తూ తాళం వేయడం చూస్తూఉంటాం. ఈ తాళానికి వేళ్ళు లెక్కకు గుర్తుంచుకోడం చాలా కష్టం.
ఈ సింహనందన తాళం కూచిపూడి నాట్యంలో ఉంది. సింహనందిని నృత్యమని చేస్తారు. ఈ నృత్యంలో 128 అడుగులు వేస్తూ పాదాల పారాణితో సింహం చిత్రపటాన్ని వేస్తారు. ఈ సింహనందన తాళానికి ప్రాముఖ్యత తెచ్చి కచేరీల్లో పాడిన ఘనత సుబ్రమణ్యయ్యరుకే దక్కుతుందని సంగీత శాస్త్రకోవిదుడు సాంబమూర్తి రాశారు.
సుబ్రమణ్య అయ్యర్ శిష్యుడు మైసూరు వాసుదేవాచార్య (ఈయన 1961 వరకూ బ్రతికే వున్నాడు) ‘నా కండ కలావిదరు’ పుస్తకంలో సుబ్రమణ్యయ్యర్ గురించి చాలా విషయాలు పొందుపరిచారు. పట్నం సుబ్రమణ్యయ్యర్ రచనలన్నీ స్వరాలతో సహా భద్రపరిచారు.అందులో కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.
సుబ్రమణ్య అయ్యర్ తరచు మైసూరు మహరాజ ఆస్థానంలో కచేరీలు ఇచ్చేవారు. ఒకనొక సందర్భంలో మైసూరు వాసుదేవాచార్య ఆయన కచేరీ విన్నాక ఆయన వద్ద సంగీతం నేర్చుకోవాలన్న అభిలాష వ్యక్తం చేస్తే, “దైవానుగ్రహం ఎలా వుంటే అలా జరుగుతుంది” అని సుబ్రమణ్య అయ్యర్ సెలవిచ్చారట. వాసుదేవాచార్య ఆయన వద్ద శిష్యరికం చేయడానికి తిరువయ్యారు వెళ్ళిన సంఘటన ఆసక్తికరంగా ఉంటుంది.
కొంతకాలం తరువాత మైసూరు ఆస్థానం నుండి ఒక సిఫార్సు ఉత్తరం తీసుకొని వాసుదేవాచార్య తిరువయ్యారు వెళ్ళాడు. ఆ వూరెళ్ళడం అదే ప్రథమం. సుబ్రమణ్య అయ్యర్ ఇల్లెక్కడని వాకబు చేస్తే, ప్రణతార్తి హరస్వామి ఆలయం పక్కన అని చెప్పారు. అది పట్టుకొని ఆలయం ఎడంపక్కన వున్న ఇంటి తలుపు కొట్టాడు. ఒక పెద్దాయన తలుపు తీసి ఎవరు కావాలని ప్రశ్నిస్తే, తను మైసూరు సంస్థానం నుండి వచ్చానని చెప్పి, సుబ్రమణ్యయ్యర్ ఇల్లిదేనా? అని అడగ్గానే ఆ పెద్దమనిషి కోపంగా వాసుదేవాచార్య మొహమ్మీదే దభాలున తలుపేసాడుట. ఆ పెద్ద మనిషి కోపానికి కారణం తెలీక, సుబ్రమణ్యయ్యర్ కోసం మరోసారి వాకబు చేస్తే, కోవెల కుడి వైపునున్నది సుబ్రమణ్యయ్యర్ ఇల్లని తెలిసింది. తన సిఫార్సు ఉత్తరం చూపించగానే సుబ్రమణ్యయ్యర్ సంతోషంగా వాసుదేవాచార్యకు సంగీతం నేర్పడానికి ఒప్పుకున్నాడు. అప్పటికే ఆయన వద్ద పరమేశ్వరయ్య, కెంపెగౌడ అనే శిష్యులున్నారు.
కొన్ని రోజుల తర్వాత వాసుదేవాచార్యకి తెలిసిందేమిటంటే, ఊరొచ్చిన కొత్తలో తనపై తలుపేసిన వ్యక్తి తిరువయ్యారులోనే ఉండే మరో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు వైద్యనాథయ్యరని, సంగీత విద్యా పరంగా సుబ్రమణ్యయ్యరుకీ, వైద్యనాథయ్యరుకీ వైరం ఉందనీ, ఇద్దరికీ చాలా కాలంగా సఖ్యత లేదనీ తెలిసింది. గురువుగారి వద్ద శిష్యరికం లభించిన సంఘటన తనెప్పుడూ మర్చిపోలేదని వాసుదేవాచార్య రాసారు. “తెలియని రాగాలు పాడి అందర్నీ అతి సులభంగా మెప్పించగలం. కానీ అందరికీ పరిచయమున్నా, వాడుకలో ఉన్న రాగాలు పాడి, అందులో ఉన్న కొత్త అందాలూ, సొబగులూ చూపించి మెప్పించడంలోనే ప్రజ్ఞా, గొప్పతనమూ ఉందనీ” చాలాసార్లు సుబ్రమణ్యయ్యరు అనేవారట. బేగడ రాగాన్ని వీరు పాడినత విస్తృతంగా ఎవరూ పాడలేదని అంటారు. ఈయనకి బేగడ అయ్యర్ అన్న పేరుకూడా ఉంది.
వైద్యనాథయ్యరుకీ, సుబ్రమణ్యయ్యరుకీ అస్సలు పడేది కాదని వాసుదేవాచార్యకి తెలిసినా ఎందుకు వైరమొచ్చిందో మొదట్లో తెలీదు. ఓనాడు రాత్రి పంచనదీశ్వరాలయంలో వైధ్య నాథయ్యరు సంగీత కచేరీకి వెళ్ళాడు. ఆ కచేరీలో వైద్యనాథయ్యర్ అద్భుతంగా పాడాడు. సుబ్రమణ్యయ్యరుదీ, ఈయనదీ సంగీత శైలి వేరయినా ఇద్దరూ ఒకర్ని మించిన దిట్ట మరొకరని అర్థమయ్యింది. ఆ మర్నాడు గురువుగారికి తను వైద్యనాథయ్యరు కచేరీకి వెళ్ళిన సంగతి తెలిసింది. జరిగిన విషయం చెప్పినప్పుడు, సుబ్రమణ్యయ్యరు తన బీరువాలోంచి ఒక పుస్తకం తీసి చూపించాడు. అది వైద్యనాథయ్యరు సంగీతంపై రాసిన విజయ సంగ్రహం అనే గ్రంథం. దాన్ని విమర్శిస్తూ సుబ్రమణ్యయ్యరు విజయ సంగ్రహ ఖండనం అనే పుస్తకం రాసాడు. ఈయన విమర్శపై ప్రతివిమర్శగా విజయ సంగ్రహ ఖండన దండనం అనే మరో గ్రంధాన్ని వైద్యనాథయ్యర్ రాసాడని చెప్పారట. సంగీత పరంగా ఇద్దరి మధ్యా వైరుధ్యాలు ఉన్నాయి తప్ప, విద్య పరంగా ఒకరంటే మరొకరికి అమితమైన గౌరవముండేది.
ప్రతీ ఏటా తప్పని సరిగా మూడు నాలుగు సార్లయినా సుబ్రమణ్యయ్యరు కచేరీ మైసూరు ఆస్థానంలో ఉండేది. కచేరీల్లో ఆయన స్వర కల్పనకీ, తాళ వాద్య తని ఆవర్తనానికీ ఎక్కువ సమయం కేటాయించేవారు కాదు. కేవలం రాగ భావన స్ఫురించేలాగనే అందరికీ సులభంగా అర్థమయ్యేటట్లే పాడేవారట. సుమారు 108 తాళ పద్ధతులు తెలిసినా, అతి సులభ తరమైన తాళాల్లోనే పాడేవారట. ముఖ్యంగా పక్క వాయిద్యకారులకి ఏమాత్రం కష్టం కలగనీయకుండా కచేరీ జరిగేదని వాసుదేవాచార్య తన పుస్తకంలో రాసారు.