ఆంధ్రప్రదేశ్ సంగీత, రంగస్థల కళారంగం: ఒక పర్యావలోకనం

6. జానపదుల ఇతర కళలు

పుట్టినది మొదలు గిట్టేవరకు జానపదుల ప్రతి కదలిక, మాట, పాట, చేష్ట, నడక, తిండి, వస్త్రధారణ అన్నీ కళాత్మకమైనవే. కాకిపిల్ల కాకికి ముద్దు, అత్తకాలము కొన్నాళ్ళు – కోడలి కాలము కొన్నాళ్ళు వంటి సామెతలు, చాపచుట్టనూ లేము రూకలెంచనూ లేమూ – (సమాధానం ఆకాశం, చుక్కలు) వంటి పొడుపుకథలు, కానివారితోను కావించు చెలిమి – కట్టి విరిచి పొయిని పెట్టినట్లుండు వంటి ఆలంకారిక వాక్కులు, దేవుడికి అర్పించిన టెంకాయ చెడిపోతే అశుభం, బాలింతరాలు చచ్చిపోతే తప్పక దయ్యమవుతుందనే విశ్వాసాలు, కులదేవతను పూజించే భక్తి, వివిధ పండుగలు జరుపుకొనే విధానం, (ఒక పండుగను శిష్ఠులు ఒక రకంగా జరుపుకుంటే జానపదులు అదే పండుగను మరో రకంగా జరుపుకొంటారు), వివిధ రోగాలకు గాయాలకు వారుచేసే మూలికా వైద్యం (గాయాలకు: ఊటి ఆకు, పిచ్చిక బీర ఆకు, రాగి చెక్క దంచి పూస్తారు), వారు ఆడే బొంగరాలాట, బిళ్ళంగోడు, పుట్టసెండు, ఉప్పరపట్టె, కోతికొమ్మచ్చి, దాగుడు మూతలు, తిరుగుడు జక్కీలు, చెడిగుడు తదితర ఆటలు, వారు ఆహారంగా తీసికొనే సజ్జ, రాగి, జొన్న అడవిలో దొరికే వివిధ కాయలు, ఆకు కూరలు, వారు సేవించే ఇప్పసారా, ఊటసారా వారు ధరించే కుప్పె, రాగతి బిళ్ళ, పాపట బట్టు, కమ్మలు, బావిలీలు, ముక్కర, కంకణాలు, గజ్జెలు మొదలగు ఆభరణాలు, వారు నిర్మించుకన్న పూరి గుడిసెలు ఇంటిముంగిట వేసే ముగ్గులు, గోడలపై చిత్రించే చిత్రాలు, వారుపయోగించే మట్టిపాత్రలు, పడుకునే చాపలు, జంతువులను అలంకరించే వస్తువులు, కొయ్యబొమ్మలు మొదలగునవన్నియు కూడా కళాత్మకమైనవే.

సంక్రాంతి కనుమ పండుగరోజు పశువులను అలంకరించి ఊరేగించడం, శ్రీకృష్ణాష్టమి రోజు ఉట్టికట్టడం, వినాయకుని విగ్రహాలు తయారు చేయడం, పెళ్ళిళ్ళలో అలివేణి కుండలు తయారుచేయడం, మొలకల పౌర్ణమి (ఏప్రిల్‌ నెలలో) సందర్భంగా పెద్దల సమాధుల వద్ద కృత్రిమ బాణా సంచా (పెట్లుప్పు, బొగ్గులు, ఎండిన చక్కపొడితో చేసినవి) తయారుచేసి పేల్చడం, వ్యవసాయానికి అవసరమైన నాగలి, గొడ్డలి, కడవలి తదితర వస్తువులను కళాత్మకంగా చేయడం వంటివి కోకల్లులుగా జానపదుల కళలున్నవి. ‘కర్రతిప్పుట’ కూడా ప్రధానమైనదే.

7. సాంప్రదాయక, మధ్యతరగతి కళలు

కళలన్నిటికి జన్మస్థానం ప్రకృతి. ప్రకృతితో అనుబంధం పెంచుకుంటూ జీవితాన్ని గడిపే వారు జానపదులు. వారి పరిశీలన అనుకరణ ఫలితమే కళలకు ఆలంబనము. అట్టి కళలు సంస్కరించబడినప్పుడు వాటి ఔన్నత్యం పెరుగుతుంది. వాటిని ఆదరించే వారు ఉన్నత వర్గాల వారైతే, ఎన్నో ఆటుపోట్లకు గురౌతూ కాపాడుకుంటూ వచ్చే వారు మధ్య తరగతి ప్రజలు. కాల క్రమమున అవి సాంప్రదాయక కళలుగా పరిణామము చెందుతాయి. Art is the free play of the soul అన్నారు పాశ్చాత్యులు. కళ ఆత్మ యొక్క స్వైర క్రీడ. కళాస్రష్టచేత అది తీర్చిదిద్దబడును. కళాకారుడు వ్యసనమును ఉల్లాసమును గూడా పరిశీలన ద్వారా చిత్రీకరించును. కళాజగత్తులో నియమబద్ధత, హేతుబద్ధత, వైశిష్ఠ్యము కలవు. అట్టి కళకు భావవ్యక్తీకరణమే గమ్యస్థానం. కళ పుట్టుకకు మానవుని క్రీడా కుతూహలమే ప్రధాన కారణంగా చెప్పవచ్చును. “Art conducts us from the vestibule of reality into the innermost shrine and reveals itself” అన్నారు Shelling. కళ వాస్తవికత కక్ష్యద్వారా మనలను ఆంతరంగిక పరంధామమునకు చేర్చి స్వయం వ్యక్తమగును. కళకన్న సాధికారమైన వస్తువు లేదు. దాని అర్హతనదే గుర్తింపగలదు. ఈ మాటలు కళ విషయంలో అక్షర సత్యాలు. సాంప్రదాయక మధ్య తరగతి కళలన్నపుడు మనం ముఖ్యంగా నాటక కళనే తీసికోవాలి. నాట్యం, నృత్తం, నృత్యం, అభినయం. వాచికం, ఆంగికం, ఆహార్యం అన్నీ కలగలిసినది నాటకం. ఈ నాటక కళను పోషిస్తూ ఆయా పట్టణాలు నగరాల్లో నాటక సమాజాలు ఏర్పడ్డాయి. కళాకారులు వేర్వేరు వృత్తుల్లో ఉంటూ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలలో కళాప్రదర్శనలిస్తూ నాటక కళను కాపాడుతున్నారు. విజయవాడకు చెందిన శ్రీ సాయిబాబా నాట్యమండలి వారు ‘ఉషాపరిణయం’ అనే నాటకాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మనస్సును దోచుకుంటున్నారు. శైవభక్తి, విష్ణుభక్తి మార్గాలలో తేడా లేదనే తత్వసారాన్ని రసరమ్యమైన ప్రేమ కథతో జోడించి చెబుతుంది ఈ నాటకం. ఇబ్రహీంపట్నంకు చెందిన వి.టి.పి.ఎస్‌.అసోసియేషన్‌ కళాకారులు ‘పరమాత్మ వ్యవస్థిత:’ అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. అన్ని మతాల సారం ఒక్కటే అనేది ఈ నాటక ఇతివృత్తం. మతం, కులం, ఆచారం పేరుతో పట్టింపులకు పోవడాన్ని ఈ నాటకం వ్యంగ్యంగా విమర్శించింది. ఈ నాటక కళాకారులు రాష్ట్ర విద్యుత్‌ సంస్థలోని ఉద్యోగులు కావడం చెప్పుకోదగ్గ విశేషం. నరసరావుపేటకు చెందిన ‘కల్పనా నికేతన్‌ సంఘ కళాకారులు ‘నోట్‌ దిస్‌ పాయింట్‌’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. అనాథ బాలలకు కాస్తంత ఊరట ఇస్తే సమాజంలో మంచితనము వెల్లివిరుస్తుందని ఈ నాటకం ఉద్భోదిస్తున్నది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గరిడేపల్లి కళాకారుల సంఘం అనేక వ్యయప్రయాసల కోర్చి ‘శ్రీ సీతాకళ్యాణం’ అనే నాటకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. ఇది పద్య నాటకం కావడం మరొక విశేషం. ఒంగోలుకు చెందిన శ్రీ విజయవాణి కళాసమితి వారు, సి.వి.ఎస్‌ కల్చరల్‌ వింగ్‌ వారు సంయుక్తంగా ‘సామ్రాట్‌ అశోక’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. కళింగ యుద్ధానంతరం సాత్వికుడై అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించి ప్రచారం చేసిన విషయం చూపరులను కట్టిపడేస్తున్నది. ఇది చారిత్రక నాటకం. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కళానికేతన్‌ కళాకారులు ‘వలస’ అనే సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన అరవింద్‌ ఆర్ట్స్‌ వారు ప్రదర్శిస్తున్న ‘ఏరువాక సాగాలి’ నాటకం రైతుల సమస్యలను కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. విశాఖపట్నానికి చెందిన కళాతరంగిణి సంస్థ ప్రదర్శించే ‘వరవిక్రయం’ నాటకం వివాహ వ్యవస్థ లోపాలను చాటి చెబుతున్నది. కడపకు చెందిన సవేరా ఆర్ట్స్‌ వారు ‘వాసవి కన్యక’ పద్య నాటకం రాజుల పాలనలోని నిరంకుశత్వాన్ని ఎండగడుతున్నది. హైదరాబాదుకు చెందిన అమృత వర్షిణి కల్చరల్‌ అసోసియేషన్‌ వారు ప్రదర్శించే ‘అజమాయి‘షి’’ నాటకం మహిళల మనోగతాన్ని వెల్లడి చేస్తుంది. పెద కాకానికి చెందిన గంగోత్రి సంస్థ ప్రదర్శిస్తున్న ‘మిస్‌డ్‌ కాల్‌’ సాంఘిక నాటిక సెల్‌ఫోన్ల రాద్ధాంతాన్ని విచ్ఛిన్నమౌతున్న మానవ విలువలను వివరిస్తున్నది. పెద కాకానికి చెందిన గంగోత్రి సంస్థ ప్రదర్శిస్తున్న ‘పల్నాటి భారతం’ నాటకం గత చరిత్రను కళ్ళకు కట్టడమే గాకుండా సమైక్యతను ఉద్భోధిస్తుంది. కాకినాడకు చెందిన ది యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ ప్రదర్శించిన ‘‘మూడో పురుషోత్తముడు’’ నాటకం మానవ విలువలను బోధిస్తున్నది. హైదరాబాదుకు చెందిన విశ్వశాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ వారు ప్రదర్శిస్తున్న ‘వేట’ సాంఘిక నాటిక లైంగిక వేధింపులకు గురౌతున్న స్త్రీల స్థితిని తెలుపుతుంది. హైదరాబాద్‌కు చెందిన వంశీ నిరంజన్‌ కళాకేంద్రం వారు ‘‘న’కు దీర్ఘమిస్తే’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. వయస్సు మళ్ళిన వృద్ధుల దీన బతుకులను ఈ నాటకం చిత్రిస్తున్నది. ఇవేగాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు పట్టణాలు పల్లెల్లో వివిధ కళాసంస్థలు స్థాపించబడి సాంఘిక, పౌరాణిక, ఆర్థిక, సామాజిక ఇతివృత్తాలతో నాటకాలు రచింపబడి వివిధ ప్రాంతాలలో ఆర్ధికాపేక్ష లేకుండా ప్రదర్శిస్తూ నాటక కళను పోషిస్తున్నాయి.