ఆంధ్రప్రదేశ్ సంగీత, రంగస్థల కళారంగం: ఒక పర్యావలోకనం

8. గ్రామాలలో ఇతర కళలు

హరి కథ, గొల్లసర్దులు, పగ్గు కథలు, కావమ్మ – మారయ్య కథలు, ఎల్లమ్మ కథ, జాజర పాటలు, రంగుల్రాట్నము, పాచికలు (దాయాలు), కోడి పందెములు, మేష యుద్ధాలు, జంతు బలులు, గొండ్లినృత్యము, వైష్ణవ భాగవత వేషము, భోగముసాని వేషము, దాసరి వేషము, దసరా వేషములు, జంగాల వేషము, ఎరుకలి వాని వేషము మొదలగు వివిధ వర్గాల వారి వేషాలు అచ్చన గాయలు, పట్టె ఆట, మట్టి ఆట, దాగుడు మూతలు మొదలగు ఆటలు, వివిధ వర్గాల స్త్రీల అలంకరణలు, తాయెతలు ధరించుట, శకునాలు పాటించుట, బావులు, చెరువులు, నదుల వద్ద దేవర్లు చేయుట, మున్నగు సాంప్రదాయ కళారూపాలను జానపదులు పాటిస్తూ ఆదరిస్తూ ముందు తరాల వారికి వారసత్వంగా అందిస్తున్నారు. ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో జానపదుల ఆటలు, ఆచారాలు సమగ్రంగా వర్ణించాడు. వానిలో కనీసం యాభై శాతానికి పైగా కనుమరుగయ్యాయి. అయితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ‘సిడిమ్రాను’ను తలపించే క్రీడలు నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో కొనసాగుతున్నాయి. సుమారు డెబ్బై(?) అడుగులు పొడవు ఒక సెంటీమీటరు మందము కలిగిన ఇనుప కమ్మిని దవడలో ఇటువైపు నుంచి అటువైపుకు దూర్చి సమంగా వేలాడదీస్తూ ఒక రోజంతా నడవడం, శరీరమంతా సూదులు గుచ్చుకోవడం, నూరు కిలోగ్రాముల బరువుగల బండరాతిని తాడుతో కట్టి ఒక కొనలో ఇనుప కక్కీ తగిలించి, ఆ కక్కీని వీపుకు తగిలించుకొని ఆ రాయిని కొండపైకి లాగడం, వీపు చర్మానికి కొక్కీలు తగిలించుకొని తాడు ద్వారా హనుమంతుని వలె గాలిలో ప్రయాణం చేయడం (సుమారు 20 అడుగులు) మొదలగు విన్యాసాలు చూచువారికి గగుర్పాటు కలిగించడంతో బాటు ఆశ్చర్యపడి ముక్కున వేలేసుకుంటారు. సుబ్రహ్మణ్యస్వామి గుడికి కావడి ఎత్తితే రోగాలు నయమౌతాయని నమ్మకం. మనకు వచ్చే రోగాలకు మూల కారణం దేవుళ్ళు కోపించారని భావించి మొక్కులు తీర్చుకోవడం, ఆడపడుచులకు ప్రతి ఏటా పసుపు కుంకుమ కొత్త వస్త్రాలు ఇవ్వడం, ఇండ్ల నిర్మాణం, గోడలపై బొమ్మలు గీయడం, గోమయముతో ఇల్లు అలకడం, సున్నిపిండితో ముగ్గులు వేయడం పండుగలు, ఉత్సవాలను సామూహికంగా జరపుకోవడం, వ్యవసాయానికి మూలస్తంభాలైన పశువులను సంక్రాంతి రోజు అలంకరించి ఊరేగించడం, గోవును తల్లిగా భావించి పూజించడం ఒకటననేమి జానపదుల కళలు, అనంతములు, విశిష్ఠములు, గత చరిత్రకు చిహ్నాలు, వర్తమానానికి ప్రతీకలు, భవిష్యత్తుకు వైజయంతికలు.

9. కళలు – నేటి స్థితి

ఆంధ్రదేశంలోని ప్రతిగ్రామం కళలకు పుట్టినిల్లే. ఒక గ్రామంలోని కళ మరో గ్రామంలో ఉండదు. కొన్ని కళలు ఆంధ్రా అంతా వ్యాపించడమే గాకుండా ఖండఖండాంతరాలకు విస్తరించి ఆంధ్రుల ఖ్యాతిని ఇనుమడింపజేశాయి. అగ్గిపెట్టెలో పట్టే చీరను మన చేనేత కళాకారులు నేత నేయడం, వీధి నాటకాలూ మనకు అట్టి ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. విదేశీయులెందరో మన కళలపై సమగ్ర అధ్యయనం చేసి వారి దేశాల్లో ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలోని కళలు గూడా మన రాష్ట్రంలో ప్రవేశించాయి. కళకు సరిహద్దులు లేవు. కళలు వారసత్వంగా మనకు ప్రాప్తించిన ఆస్తి. నేడవి ఒకటొకటిగా తెరమరుగౌతున్నాయి. ‘కర్ణుడీల్గె ఆర్గురి చేతన్‌’ అన్నట్టు కళలు తెరమరుగు కావడానికి కారణాలు అనేకం.

అ) కళలు తెరమరుగవడానికి కారణాలు

• నాగరికత పేరుతో సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రజలు పాటించక పోవడం.

• శాస్త్రసాంకేతిక రంగం బాగా అభివృద్ధి చెందడం వాని ద్వారా సినిమాలు ఎలక్ట్రానిక్‌ మీడియా అభివృద్ధి చెందడం.

• కరువు కాటకాల వలన కళాకారులకు దానధర్మాలు లభించకపోవడం, కళాపోషకులు లేకపోవడం.

• కళాకారులు అదే వృత్తిలో కొనసాగినను వారి సంతానం మాత్రం విద్యావంతులై వేరే ఉపాధి చూసుకోవడం.

• ముఠాకక్షలు, ప్రాంతీయ తత్వం, నగరీకరణ.

• కళాకారుల ఆదాయం వారి అవసరాలు తీర్చలేకపోవడం.

• కళాకారులకు సమాజంలో గౌరవం లభించకపోవడం, మరియు ఆదరణ లేకపోవడం – అనేవి ప్రధాన కారణాలు.

ఆ) కళల ఉద్ధరణకు తీసికోవాల్సిన చర్యలు

• కళలు ప్రజల ఉమ్మడి ఆస్తిగా ప్రభుత్వం ప్రకటించాలి.

• కళాకారులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి.

• వృద్ధ కళాకారులకు ప్రభుత్వం పింఛను ఇవ్వాలి.

• కళాకారులకు అవసరమైన ఉపకరణాలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి.

• ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రంలో కళామందిరం నిర్మించాలి.

• ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ కళల మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలి.

• ప్రతి కళలో ప్రతిభ, నైపుణ్యం చూపే కళాకారులకు పంచాయితీ, మండలాల్లో ప్రతి ఏటా ఉగాది రోజు పురస్కారాలివ్వాలి.

• కళలకు ఒక మంత్రిత్వ శాఖను నెలకల్పాలి.

• మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని కళలు పరిచయమగునట్లు పాఠ్యాంశాల్లో చేర్చాలి.

• టెలివిజన్‌, ఆకాశవాణిలలో కళలను తరచూ ప్రసారం చేయునట్లు చూడాలి.

• కళా సంఘాలకు ఆర్థిక సహాయం చేయాలి.

• కళలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఒక మాసపత్రికను ప్రారంభించాలి.

• ప్రతి కళారంగంలోనూ ప్రతి ఏటా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలి.

• ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి కళాకారులను ఉపయోగించుకోవాలి.

• ఉన్నత మధ్య తరగతి ప్రజలు కళల ఉద్ధరణకు భాగస్వాములు కావాలి.

• ప్రవాసాంధ్రులు కళాపోషణకు విరివిగా విరాళాలివ్వాలి.

• శిల్పకళారామము, అర్బన్‌హాట్‌ వంటి కళాకేంద్రాలు అన్ని జిల్లాల కేంద్రాల్లో నెలకల్పాలి.

• స్వచ్ఛంద సంస్థలు కళోద్ధరణకు ప్రజలను చైతన్యవంతులను చేయాలి.

• కులమత వర్గ ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు కళలను తమ వారసత్వపు ఆస్తిగా భావించి అనుకరించాలి, పోషించాలి.

• కళలలో ప్రతిభ చూపిన వారికి ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యమివ్వాలి.

10.ముగింపు

ప్రతి జాతికి కళలు అమూల్య సంపదలు. కళలు మరుగునపడితే ఆ జాతి చరిత్ర సంస్కృతి మరుగునపడినట్టే. గతమనేది వర్తమాన భవిష్యత్తులకు పునాది. పునాది లేకుంటే సౌధం నిలబడదు. ‘పురోభివృద్ధి కోరు వారు పూర్వ వృత్తాంతం మరువ రాదు’ అను సూక్తి సార్వకాలిక సత్యం. కాబట్టి మనం మన కళాసంపదను భద్రపరచాలి, ఆచరించాలి, భావితరాలకు అందించాలి. మన ముత్తాతలు కనిపించలేదు కాబట్టి వారులేరనుట ఎంత అవివేకమో, అదే విధంగా పూర్వపు కళలు లేవు ఉన్నవన్నీ నేటి సినిమాలు, టెలివిజన్‌లే అనుట కూడా అంతే అవివేకం. మన కళలలో ఆనందముంది. ఆరోగ్యముంది, ఐశ్వర్యముంది, అభివృద్ధి ఉంది, ఆహ్లాదమూ ఉంది, అనిర్వచనీయమైన రసానుభూతి ఉంది, నిరుపమానమైన మహత్తు ఉంది, వారసత్వముంది, విజ్ఞానముంది, విశాల దృక్పధముంది, వినూత్నమైన సృజన ఉంది. ఇటువంటి సకల కళల జీవనదులలో మునిగి పునీతులు కావడం మన ధర్మం, లక్ష్యం. ఆ దిశగా మన మందరం కలసికట్టుగా కళామతల్లికి సేవచేద్దాం.

ఈ వ్యాసరచనకు ఉపకరించిన గ్రంథాలు, పత్రికలు మొ॥వి

1. తెలుగునాటక వికాసము, డా॥ పోణంగి శ్రీరామ అప్పారావు

2. సాహిత్య భావలహరి, ఆచార్య యస్వీజోగారావు

3. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి

4. కామసూత్రాలు, వాత్సాయన ముని

5. తెలుగు సాహిత్య సమీక్ష – రెండవ సంపుటము, ఆచార్య జి.నాగయ్య

7 బసవ పురాణము, పండితారాధ్యచరిత్ర, పాల్కురికి సోమనాధుడు

8 క్రీడాభిరామము, పల్నాటి వీరచరిత్ర, శ్రీనాథ మహాకవి

9 ఆంధ్రుల జానపద విజ్ఞానము, ఆర్‌.వి.ఎస్‌.సుందరం

10. దాక్షిణాత్య నాటకాల్లో హాస్యగాడు, ఆచార్య కె.ఆనందన్‌

11. జానపద కళారూపాలు – సాహిత్యం, ఆచార్య కె.ఆనందన్‌

12. హిందూ సంప్రదాయాలు, గాజుల సత్యనారాయణ

13. ఆంధ్రవాగ్గేయకార చరిత్రము, బాలాంత్రపు రజనీకాంతరావు

14. ఆంధ్రమహాభారతము – ఆదిపర్వము, నన్నయ మహాకవి

15. సాహిత్య శిల్పసమీక్ష, ఆచార్య పింగళి లక్ష్మీకాంతం

16. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, ఖండవల్లి బాలేందుశేఖరం

ఇంకా ఆంధ్రజ్యోతి, నవ్య, ఆంధ్రభూమి, వార్త, ఆంధ్రప్రభ, ఈనాడు తదితర పత్రికలలో వచ్చిన వ్యాసాలు – మొదలగునవి.g