ఆంధ్రప్రదేశ్ సంగీత, రంగస్థల కళారంగం: ఒక పర్యావలోకనం

5.రంగస్థలంపై జానపదుల కళలు

జానపద సంగీతం, నృత్యం, రూపకమూ అనునవి రంగస్థలంపై జానపదులు ప్రదర్శించు కళలలో ముఖ్యమైనవి. ఈ కళల ప్రదర్శనలో స్థల కాలాల్లో స్వల్ప తేడాలుంటాయి. కళాసృజన మానవ సహజం. నాగరికుల్లోనూ అనాగరికుల్లోనూ జ్ఞానపదుల్లోనూ, జానపదుల్లోనూ ఈ లక్షణం స్వతస్సిద్ధంగానే ఉంటుంది. జానపదుల కళాభేదాలు ఎంత ప్రాచీనమైనపో అంత వినూత్నమైనవి కూడా. వీరి కళల సెలయేర్లు ఎన్ని నాగరికతలకు మూలకేంద్రాలయ్యాయో మన ఊహకందవు. జానపదుల ప్రతిమాట, ప్రతి కదలిక కళారూపమేననుటలో సందేహించాల్సిన అవసరం లేదు.

అ) జానపద సంగీతం: వేల సంవత్సరాల నుంచి సాంప్రదాయకంగా ప్రజా సముదాయంలో ప్రచారం పొందినది జానపద సంగీతం. అరువది నాలుగు కళల్లో సంగీతం విశిష్ఠమైనది. ఇది జానపదుల్లో సామూహికంగా వికాసం పొందిన కళగా భావించవచ్చు. శిష్ట సంగీతానికి సంకీర్తనకారులుంటారు. అయితే జానపద సంగీతం మాత్రం అందరి సొత్తు. శిష్టసంగీతం కంటే ఇది చాలా సరళమైనది. దీనికొక ప్రామాణిక కొలబద్ద లేదు. వివిధ తాళాలతో జానపద సంగీతాన్ని పాడుదురు. ఏదైనా తంత్రీవాద్యమో, చర్మవాద్యమో ఉంటే చాలు. వీటిద్వారా వారు పరమానందాన్ని పొందుదురు. వాద్యసంగీతం, గాత్ర సంగీతమని జానపదుల సంగీతం రెండు విధాలుగా ఉంటుంది. జానపదుల వాద్యాలు తంబుర, మృదంగం, వీణ, ఫిడేలు, నాదస్వరం, తంతార, ముఖవీణ, శంఖం, గంట, నగారా, జేగంట, భేరి, దుందుభి, ఏకనాదరి, కొమ్ము, పిల్లనగ్రోవి, డప్పు మొదలగునవి ఉన్నాయి. ఇవన్నీ వాద్యసంగీతం కోవకు వస్తాయి. జానపద కళాకారుడు ఆయా వాద్యాలకు అనుగుణంగా తన గాత్రంతో గానం చేస్తాడు. వీరి గాత్రగానానికి వాద్యం తోడైతే బంగారానికి తావి అబ్బినట్టు – ఉంటుంది. జాతరలు, రథోత్సవాలు, వివాహాది శుభకార్యాలు, చావు, రాజకీయ ఊరేగింపు తదితర కార్యక్రమాలలో జానపదులు తమ సంగీత ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శిస్తారు. జానపద సంగీతం సామాజిక స్పృహతో వెలువడుతుంది. జానపదులు సంతోషాన్నో, దు:ఖాన్నో వ్యక్తం చేయడానికి కూనిరాగాలు తీసిననాడే సంగీతం పుట్టుకకు కారణమై ఉంటుంది. తెలుగు జానపద సంగీతానికి వేల సంవత్సరాలుగా ప్రాణభిక్ష పెట్టిన వారు భిక్షుక గాయకులు. పిచ్చుకుంట్లు, శారదకాండ్రు, వీరముష్టులు, జంగాలు, దాసర్లు, బుడబుక్కల వారు, బవనీలు, జక్కులవారు, బొమ్మలాటకాండ్రు, జానపద సంగీతాన్ని గాత్ర సంగీత రూపంగా కాపాడుతున్నారు. తమ సంగీత పరికరాలను వారే తయారు చేసుకొనుట విశేషం.

జానపదుల సంగీతాన్ని ‘ఇంట్లో సంగీతం, బయట సంగీతం’ అని రెండు విధాలుగా విభజించవచ్చు. పొద్దున మజ్జిగ చిలుకుతూ స్త్రీలు పాడే పాటల్లో, పూజ ముగిసిన తర్వాత పాడే మంగళహారతులు, పిల్లలను నిద్రపుచ్చటానికి పాడే లాలి. జోల పాటలు ఇంట్లో సంగీతానికి, వరికోత సమయంలో, కపిలె తోలునప్పుడు, బరువులు మోయునప్పుడు తదితర సందర్భాల్లో పాడేపాటలు బయట సంగీతానికి ఉదాహరణలు. జానపదుల సంగీతంలో పల్లవి ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది. జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథా గేయాలు గాయకులు ఆలపించునప్పుడు పల్లవి గొప్ప ఊపునిస్తుంది. బొబ్బిలి యుద్ధం, రాణి రుద్రమ దేవిగాథ మొదలగునవి ఆలపించునప్పుడు పల్లవి గాయకుల్లో ప్రేక్షకుల్లోను గొప్ప రసానుభూతిని కలిగిస్తుంది. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి’ అను పెద్దలమాట శిష్టుల, జానపదుల విషయంలో శిలాక్షర సత్యంగా నిలుస్తున్నది. వినోదానికి, విజ్ఞానానికి, ప్రజాచైతన్యానికి, ప్రజా ఉద్యమాలకు జానపద సాహిత్యం పెట్టనికోట వంటిది. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి జానపద బాణీల్లో గేయాలద్వారా ప్రచారం చేస్తున్నది. కుటుంబ నియంత్రణ, పొదుపు మొదలగు కార్యక్రమాలు దీనికి ప్రబల ఉదాహరణలు. విశ్వవిద్యాలయాల్లో, రాజకీయ సభల్లో జానపద గేయాలను వినోదానికి ఆలపిస్తున్నారు. సంఘవిద్రోహ శక్తుల ఆట కట్టించడానికి ప్రజలను చైతన్య పరచుటకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పాటలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలైన రోడ్డు రవాణా సంస్థ, ఆప్కో తదితర యాజమాన్యాలు ప్రజా సమూహాన్ని చైతన్యపరచి తమ సంస్థ సదుపాయాలను ఉపయోగించుకోవాలని బహుళ ప్రచారం చేస్తున్నాయి. సామాన్య జనాన్ని దళితులను ఆకర్షించి తమ ఉద్యమం వైపు తిప్పుకోవడానికి విప్లవ సంస్థలు కూడా జానపద గేయాలను పాడుతున్నాయి. మాన్యుల నుంచి సామాన్యుల వరకు, పండితుల నుంచి పామరుల వరకు, ఆబాల గోపాలాన్ని ఆకర్షించి చైతన్యపరచే శక్తి యుక్తి జానపద గేయ సంగీతానికే ఉన్నదనుట నిర్వివాదాంశం.

నేడు ప్రజా గాయకుడైన గద్దర్‌, వంగపండు ప్రసాదరావు, వందేమాతరం శ్రీనివాస్‌, గోరటి వెంకన్న, గూడ అంజయ్య తదితరులకు ప్రజలు నీరాజనాలు అర్పించుటకు వారు ఎన్నుకున్న జానపద గేయ బాణీలే ప్రధాన కారణం. జానపద గేయాల్లోకి సంగీతం ఫిరంగి గుండులా మనసును తాకుతుంది. తల్లి కౌగిలిలా హృదయానికి హత్తుకుంటుంది. మనం అణుయుగంలో నివసిస్తున్నా, నాగరికత పెరిగిందని ఎంతగా విర్రవీగినా మన నరనరాల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంటుంది. దాని ఆకర్షణ శక్తి నుంచి బయటపడడం అసాధ్యం. ఇది కేవలం మన ఆంధ్ర జాతీయులకే గాదు సర్వభాషీయులకు కూడా.

ఆ) జానపద నృత్యం: క్రీస్తుశకమునకు పూర్వమే ఆంధ్రదేశంలో నృత్యం ప్రచారంలో నున్నట్టు హాలుని గాథా సప్తశతి ద్వారా మనకు తెలుస్తున్నది. అటుపిమ్మట భరతుని నాట్యశాస్త్రాదులలో నృత్యమునకు సంబంధించిన లక్షణాలు ప్రస్తావన ఉన్నప్పటికి పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రలో దేశినృత్య పద్ధతుల వర్ణన ఉంది. అదేవిధంగా సోమనాధుని బసవ పురాణంలో పూజానృత్య వర్ణన కలదు. అది ఇలా ఉంది.

ద్విపద: ‘మంగళ హర్షోదితాంగ విక్రియల సంగతి నాత్మనుప్పొంగి యుప్పొంగి
భయభక్తి యుక్తిదద్భక్తాంఘ్రి చయము పయిు జక్కజాగిలబడి మ్రొక్కి మ్రొక్కి
పటుతర సద్భక్త పాదాబ్జరేణు పటల పర్యంకంబుపైబొర్లి పొర్లి
…………………..
సెల్లించుచును భక్తిసేయుచున్నెడను

ఈ కవి కవిత్వం మొత్తం జానపదులను ఆలంబనంగా చేసికొని రచించినట్టున్నది. జానపద విజ్ఞానంలోని అత్యంత ప్రాచీన విభాగాలలో నృత్యం కూడా ఒకటి. జానపదులు నిత్యజీవితంలో అనుభవించే సంతోషం, దు:ఖం, వేదన, ఆప్యాయత, పుట్టుక, చావు మొదలైనవి లయాత్మకంగా కదిలి నృత్యమనిపించుకున్నాయి. నృత్యం మానసికమైన ఆనందాన్ని కలిగిస్తుంది.

మానవుడు నృత్యాన్ని నెమలి వంటి జంతువులను చూచి నేర్చుకున్నాడనవచ్చును. గణ వ్యవస్థలోనున్న మానవులు సామూహికంగా నృత్యం చేసినట్టు మనం ఊహించగలము. వీరి నృత్యం ముఖ్యంగా చిందులతో గూడి ఉంటుంది. జానపదుల నృత్యాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. వానిలో మొదటిది ధార్మిక నృత్యం. రెండవది లౌకిక నృత్యం. గుడుల వద్ద, పురాణ కార్యక్రమాల వద్ద చేసే నృత్యాలు ధార్మిక నృత్యాలు. పండుగలు, పెళ్ళిళ్ళు తదితర కార్యక్రమాల సందర్భంగా చేసే నృత్యాలు లౌకిక నృత్యాలు. జానపదుల నృత్యాలను సంస్కరించడం ద్వారా శ్రాస్తీయ నృత్యమైనదని పరిశోధకుల అభిప్రాయం. మొసలి నృత్యం, తాబేలు నృత్యం, ఎలుగుబంటి నృత్యం, పక్షి నృత్యం, గోండుల గూసాడి నృత్యం, కండరెడ్ల మామిడి నృత్యం, అరకు ప్రజల దిమ్సా నృత్యం, లంబాడీ నృత్యం, సిద్ధి నృత్యం, బతుకమ్మ నృత్యం, బడ్డెమ్మ నృత్యం, తప్పెట గుళ్ళ నృత్యం, డప్పు నృత్యం, పులివేష నృత్యం, బుట్ట బమ్మలాట నృత్యం, గొబ్బి నృత్యం, గుర్రపు నృత్యం, కరువ నృత్యం, కోలాట నృత్యం, గరగ నృత్యం, వీరనాట్యం, చెక్క భజన, పండరి భజన, ఘట నృత్యం మొదలగు నృత్యరీతులు జానపదుల కళావైదుష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. శ్రీనాథ మహాకవి పల్నాటి వీరచరిత్రలో రాజాస్థాన నృత్యాన్ని విపులంగా వర్ణించాడు. నృత్యం జనులందరికీ ఆనందాన్ని, వినోదాన్ని, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. బుగ్వేదం నందలి దశమ మండలము పద్దెనిమిదవ సూక్తం మూడవ బుక్కునందు ‘నృతయే’ శబ్దం ప్రయోగింపబడినది. నర్తనాయ కర్మణి, గాత్రవిక్షేపాయ అని వ్యుత్పత్తిని విద్యారణ్యులు వ్యాఖ్యానించారు.

చిలుక జోస్యం, పుల్లల జోస్యం, రాగుల జోస్యం, చిప్పకట్టె జోస్యం, అంజన పసరు జోస్యం, చెంబు జోస్యం మున్నగునవి జానపదుల జోస్యానికి ప్రతీకలు. నృత్య కార్యక్రమాల వద్ద, తిరునాళ్ళ వద్ద వీరు జోస్యం చెప్పించుకొందురు.