ఆంధ్రప్రదేశ్ సంగీత, రంగస్థల కళారంగం: ఒక పర్యావలోకనం

2. కళ

సౌందర్య తృష్ణను వ్యక్తీకరించుట ద్వారా కళ ఏర్పడినది. కళావిర్భావమునకు మానవునిలోని పంచమయకోశాలలో ఆనందమయ కోశము మూలము. కళలు మిగిలిన వస్తువులు ఇవ్వలేని ఉదాత్తమైన అనుభూతిని, అలౌకికమైన ఆనందాన్ని మనకు ఇచ్చుచున్నవి. ప్రకృతి పరిమాణమే భగవంతుని కళ. అది అనుకరణ ఫలము. కళకు భావ వ్యక్తీకరణమే గమ్యము. కళలు 64గా భారతీయులు గణించారు. వీటిని చతుష్షష్ఠి కళలంటారు. అవి వరుసగా: 1. గీతం, 2. వాద్యం, 3. నృత్యం, 4. అలేఖ్యం, 5. విశేష కచ్ఛేద్యం, 6. పుష్పాస్తరణం, 7. తండుల కుసుమబలి వికారం, 8. దశనవ సనాంగరాగం, 9. మణి భూమికా కర్మ, 10. శయన రచనం, 11. ఉదక వాద్యం, 12. ఉదకాఘాతం, 13. చిత్రయోగాలు, 14. మాల్య గ్రథన వికల్పాలు, 15. శేఖర కాపీడయోజనం, 16. నేపధ్య ప్రయోగాలు, 17. కర్ణపత్ర భంగాలు, 18. గంధయుక్తి, 19. భూషణ యోజనం, 20. ఇంద్రజాలం, 21. కౌచుమారం, 22. హస్తలాఘవం, 23. వంటకాలు, 24. సూచీవాన కర్మ, 25. సూత్ర క్రీడ, 26. వీణా డమరుక వాద్యాలు, 27. ప్రహేళికలు, 28. ప్రతిమాల, 29. దుర్వాచక యోగాలు, 30. పుస్తక వాచనం, 31. నాటకాఖ్యాయికా దర్శనం, 32. కావ్య సమస్యా పూరణం, 33. పట్టికా వేత్ర వాసవికల్పాలు, 34. తర్కు కర్మలు, 35. తక్షణం, 36. వాస్తువిద్య, 37. రూప్యరత్న పరీక్ష, 38. ధాతువాదం, 39. మణిరాగాకర జ్ఞానం, 40. వృక్షాయుర్వేద యోగాలు, 41. మేష కుక్కుట లావట యుద్ధ విధులు, 42. శుకశారికా ప్రలాపాలు, 43. ఉత్సాదనే, సంవాహనే, కేశమర్దనేచ కౌశలం, 44. అక్షర ముష్టికా కథనం, 45. మ్లేచ్చిక వికల్పాలు, 46. దేశభాషా విజ్ఞానం, 47. పుష్పశకటిక, 48. నిమిత్త జ్ఞానం, 49. యంత్రమాతృక, 50. ధారణ మాతృక, 51. మానసీక్రియ, 52. సంపాఠ్యం, 53. కావ్యక్రియ, 54. అభిధానకోశం, 55. ఛందోజ్ఞానం, 56. క్రియాకల్పం, 57. చలితక యోగం, 58. వస్త్రగోపనం, 59. ద్యూతవిశేషాలు, 60. ఆకర్షక్రీడం, 61. బాల క్రీడనకాలు, 62. వైనయికే జ్ఞానం, 63. వైజయికీ విద్యలు, 64. వ్యాయామికీజ్ఞానం. వీటిని వాత్సాయన ముని తన కామశాస్త్రంలో వివరించాడు. వీనిలో కవిత్వం, సంగీతం, నాట్యం, చిత్రకళ, శిల్పం అనువానిని లలిత కళలంటారు. పాశ్చాత్యులు. వీనిని Fine Arts అన్నారు. మనోహరత్వం, విశ్వజనీనత, అనుకరణం అనునవి లలితకళల ధర్మాలు. చిత్రకళ, శిల్పకళలు దృశ్యకళలు, సంగీతం, కవిత్వం శ్రవ్యకళలు, నాట్యం ఉభయ ప్రయోజనము కలది.

3.రంగస్థలం

రంగస్థలమనగా వేదిక అని అర్థం. పూర్వం జరిగిన వృత్తాంతాన్ని గాని, ప్రస్తుతం జరుగుచున్న విషయాలను గాని, జరుగబోవు విషయాలనుగాని ఆట – పాట ద్వారా ప్రేక్షకుల మనోఫలకంపై చెరగని ముద్రవేయు కళారంగ ప్రదేశమే రంగస్థలం. ప్రదర్శన విషయం సాంఘిక, ఆర్థిక, చారిత్రక, పౌరాణిక, రాజకీయ తదితరాలలో ఏదైనా కావచ్చును. విషయానికి తగినట్టు వేదిక అలంకరణ ఉండాలి. ఆహార్యం, అభినయం, సంగీత వాద్యాలు, స్పష్టమైన వాచికం ఉండాలి. అప్పుడే ఆ కళ రక్తిగడుతుంది. పాశ్చాత్యులకు ఏ మాత్రం తీసిపోని విధంగా మన పూర్వులు వివిధ కళలను సృష్టించి పోషించారు. సర్వకళల సృష్టికర్తలు పోషకులు నాడు నేడు రేపటికి కూడా జానపదులే. ఉన్నత వర్గాల వారు కళలను విని చూచి తరిస్తారు. మధ్య తరగతి, పేదవారు కళలను అనుసరించి, కళలలో జీవించి తమ జీవితాలను కళలకే అంకితం చేస్తున్నారు. వీరిని స్థూలంగా జానపదులు అనవచ్చు.

4.జానపదులంటే?

‘జానపదుల్‌ పురీ జనుల్‌’ అన్నాడు ఎర్రన. ‘జనపదం’ అంటే ఒకప్పుడు పల్లెటూరు అని అర్థం. అందులో నివసించు వారు జానపదులు. వారికి సంబంధించిన విజ్ఞానమే జానపద విజ్ఞానం. ఇందులో వారికి సంబంధించిన వాఙ్మయమే గాక జానపదకళలు, భాష, నృత్యం, సంగీతం, నాటకం, జానపద వైద్యవిధానం, జానపదుల ఆచార వ్యవహారాలు, వేషభూషణములు, సాహిత్యం మొదలైనవి అన్నియు జానపద విజ్ఞానంలో చేరును. పురాణ ప్రబంధాదులు శిష్టసాహిత్యమందురు. ఇవి నాగరికులలో పండిత లోకంలో పుట్టి ప్రచారం పొందును. జానపద సాహిత్యం మాత్రం సామాన్య జనులలో పుట్టి ప్రచారం పొంది జీవించును. శిష్టసాహిత్యం కంటే జానపద సాహిత్యమే ముందుగా పుట్టినది. శిష్టసాహిత్యంలో జానపద సాహిత్య ప్రస్తావన కనిపిస్తుంది. ఆదికవి నన్నయ మూలభారతంలో లేకున్నను ఆంధ్రమహా భారతంలో ‘నాగ గీతముల’ను పేర్కొన్నాడు.

నీ గుణములు దొల్లియు
నాగీ గీతములందు విని తగిలి ఇప్పుడు మనోరాగమును జూడఁ
గంటిని, భాగీరధియందు నిన్నుఁబరహిత చరితా.
(ఆంధ్రమహాభారతము- ఆదిపర్వము – అష్టమాశ్వాసము – 131వ పద్యము.)

అటు తరువాత కాలంలో శిష్టకవులెందరో జానపదుల వాఙ్మయాన్ని ప్రస్తావించారు. ఇచ్చట వారందరిని ప్రస్తావించుట అప్రస్తుతమని భావించి మచ్చుకు నన్నయను మాత్రమే ఉటంకిస్తున్నాను. నిరక్షరాస్యులైన జానపదులు అప్రయత్నంగా తమ సహజ భావాలను కవిత్వ రూపంలో వెలువరించినప్పుడు ఆవిర్భవించేది జానపద కవిత్వం. సంతోషం, విషాదం, కరుణ, శృంగారం తదితర మానసిక భావాలను వెలిబుచ్చడానికి, పనిపాటలు చేసుకొనేటప్పుడు కలిగే శ్రమను మరిచిపోవడానికి, తీరిక సమయాల్లో వేడుకల్లో సంబరాల్లో పాడుకునే పాటలు, కథాగేయాలూ వంటివి జానపద కవిత్వ శాఖలోకి వస్తాయి. నైసర్గికంగా భావ ప్రకటన ఆధారంగా వెలువడుతుంది కాబట్టి జానపద కవిత్వానికి ఛందోబంధాలూ, అలంకార సంప్రదాయాలూ అడ్డురావు. జానపద కవిత్వం మౌఖికము, ఆశువుగా పుట్టడం. లయ, అను లక్షణాలను ప్రధానంగా కలిగియుంటుంది. జానపద సాహిత్యం దృశ్య రూపమైన ఆకృతిని పొందినప్పుడు అది నాట్యం, నృత్యం, నాటకం, శిల్పం తదితర కళలుగా రూపాంతరం చెందుచున్నది. మన భారతదేశం సకల కళలకు కాణాచి, అందులో ఆంధ్రదేశం ఎన్నో కళలకు జన్మస్థానమై విరాజిల్లుచున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సంగీత రంగస్థల కళారంగాన్ని నాటినుంచి నేటి వరకు పర్యావలోకనం చేయుట ప్రస్తుత వ్యాస ఉద్దేశము.