‘‘ఏం చేద్దాం…’’ ఆందోళనగా అడిగాడు జనార్థన్.
‘‘అవును… ఏం చేద్దాం,’’ నీరసంగా అన్నది నీరజ, మళ్ళీ తనే భర్తను నిలదీస్తున్నట్టుగా, ‘‘ఏం చేస్తారో తెలియదు. ఈ పెళ్ళి మాత్రం జరగాల్సిందే. అమెరికా సంబందం ఇంత మంచి సంబందం రావాలంటే రాదు,’’ అన్నది.
జనార్థన్ నీరసంగా సోఫాలో కూర్చుంటూ, ‘‘అదేదో నేనే అడ్డుకుంటున్నట్టు,’’ అన్నాడు విసుగ్గా. గ్లాస్‌తో మంచి నీళ్ళు ఇస్తూ, ‘‘ఎవరు అడ్డుకుంటున్నారని వాదన కాదు. ఎలా చేయాలో ఆలోచించండి,’’ అన్నది నీరజ.
“నాకు మాత్రం తొందర లేదా నీరజా… మన చేతిలో ఏముందో చెప్పు. ఏడాది నుండి సంబంధాలు చూస్తున్నామా… ఒక్కటి కుదరలేదు. ఇప్పుడు నాన్న ఆరోగ్యం బాగులేదని మానుకున్నామా… సంబంధం వచ్చింది. నాన్న నేడో రేపో అన్నట్టుండె. ఇప్పుడు పెళ్ళి ఎలా కుదుర్చుకుంటాం చెప్పు. ఒకవేళ కుదుర్చుకుని అన్ని సర్దుకుని రేపో మాపో పెళ్ళనగా కళ్ళుమూస్తే ఎలా చెప్పు. ఆడపిల్ల పెళ్ళి కాదుగదా… తప్పు లేదనడానికి… మగపిల్లవాడి పెళ్ళి. సుష్టి ముట్టుడు…’’ గ్లాసు అందుకుంటూ అన్నాడు.
కోపాన్ని అణిచిపెట్టుకుని, ‘‘అలాగని ఏడాది వరకు ఆగు దామా,’’ అన్నది నీరజ.
‘‘తప్పదు మగపిల్లవాడు కదా… పైగా కర్మకాండ చేయాల్సింది నేనే… ఏడాది దినం జరిపి పిండాలు పెట్టేవరకు ఎలాంటి శుభ కార్యం జరగడానికి కూడదు కదా…’’ ఆమెను ఒప్పిస్తున్నట్టుగా అన్నాడు.
కోపంగా మునివేళ్ళపై లేచింది నీరజ. ‘‘అయితే సంబంధం వదులుకుందామంటరా,’’ అన్నది.
‘‘అలా ఎందుకంటాను చెప్పు. ఇప్పుడు కుదుర్చుకుందాం. ఎంగేజ్‌మెంట్ చేద్దాం. ఏడాది తర్వాత పెళ్ళి,’’ ఆమెను ఒప్పిస్తున్నట్టుగా అన్నాడు. నీరజ వెటకారంగా చూసి నవ్వింది. ‘‘ఇప్పుడు ఎంగేజ్ మెంట్ అట. ఏడాది తర్వాత పెళ్ళట. దేశంలో నీ కొడుకు ఒక్కడు తప్ప ఎవరూ లేనట్టు…’’ అన్నది.
జనార్థన్ మౌనంగా నీళ్ళు తాగి గ్లాస్ పక్కన పెట్టాడు. నీరజ అతని పక్కకు వచ్చి కూర్చుంటూ, ‘‘ఇంకో మాట చెప్పండి,’’ అన్నది. జనార్థన్ నవ్వడానికి ప్రయత్నిస్తూ, “ఇదేం బేరమా… ఏం చెప్పాలి. నాన్న రెండు మూడురోజుల కంటే ఎక్కువ బదకడు,’’ అన్నాడు.
నీరజ అతన్ని ఒప్పిస్తున్నట్టుగా గొంతు తగ్గించి, ‘‘మీ పట్టు మీరే కాని నా మాట వినే ప్రయత్నం చేయడం లేదు. అమ్మాయికి అమెరికాలో మంచి ఉద్యోగం. మంచి కుటుంబం. ఒక్కటే కూతురు. పెళ్ళి కాగానే అబ్బాయిని అమెరికా తీసుకెళ్తారు. మంచి ఉద్యోగం చూపిస్తారు. అలా వాడో దారిన పడతాడు. ఈ సంబంధం ఒప్పించడానికి మా అన్నయ్య ఎంత కష్టపడ్డాడని… ఇప్పుడు మనం జారవిడుచుకుంటే మళ్ళీ దొరకదు,’’ అన్నది.
జనార్ధన్ కూడా అదే ఆలోచిస్తున్నాడు. కాని ఏంచేయాలో తోచడంలేదు. తండ్రి పరిస్థితి అలా ఉంది.పెళ్ళి సంగతి ఇలా ఉంది. ఇన్నేళ్ళు బతికి ఇప్పుడే తొందరపెడుతున్న తండ్రి పై కోపం వచ్చింది.
‘‘ఏం చేద్దాం చెప్పు… నాకు మాత్రం వదులుకోవాలని వుందా… పైగా అనుకున్నంత కట్నం,’’ అన్నాడు.
నీరజ కూడా ఆలోచనలో పడిపోయింది. రెండు మూడేండ్లుగా కొడుకు కోసం ఎన్నో సంబంధాలు చూశారు. ఒక్కటీ కుదరలేదు. కుదురుతుందనుకున్న సంబందానికి ఇలా ఆటంకం ఎదురుకావడంతో మనసంతా ఆందోళనగా ఉంది.
‘‘వాళ్ళను ఓ సారి అడిగి చూస్తే,’’ జనార్ధన్ అన్నాడు.
‘‘ఏమనీ…’’
“అదే… ఇప్పుడు మాట ముచ్చట మాట్లాడుకుని ఏడాది తర్వాత…’’
భర్త మాటలు పూర్తికాక ముందే అందుకుంది నీరజ. ‘‘కుదరదన్నరట. అయినా అది పద్దతికాదు…’’ అన్నది.
జనార్ధన్‌లో ఎక్కడో మిగిలి ఉన్న చిన్న ఆశ కూడా అడుగంటింది. “చ… చేజేతులా ఒక మంచి సంబంధాన్ని పోగొట్టు కుంటున్నం. ఈ సంబందం కుదిరితే మన రొట్టే నేతిలో పడ్డట్టే,’’ అన్నాడు.
‘‘ఇప్పుడు నూతిలో పడ్డట్టుంది బతుకు. మీ నాన్న మనను ఎప్పుడు ఉద్దరించాడని… బతికి అలా సాధించాడు. చచ్చి ఇలా సాధిస్తున్నాడు,’’’ నీరజ అన్నది కోపంగా.
‘‘ఇంకా చావలేదుగా… చస్తేనన్నా పీడ విరగడవుతుండె,’’ కోపంగా అన్నాడు జనార్ధన్.
‘‘చస్తే పీడ విరుగడ కాదు. కొత్తగా పీడ చుట్టుకుంటుంది. చావక ముందే ఏదో ఒకటి చేయాలి,’’ అన్నది నీరజ.
అప్పుడే జనార్ధన్ జేబులో సెల్ మోగింది. చూస్తే అమ్మ. కోపంగా కట్ చేసి జేబులో వేసుకున్నాడు.
‘‘ఎవరు…?’’ అడిగింది నీరజ.
‘‘అమ్మ…’’ ఉసూరుమంటూ చెప్పి సోఫాలో జారిగిల బడ్డాడు జనార్ధన్.
‘‘ఎందుకటా… మందో మాకో తెమ్మని చెప్పడానికి చేసి ఉంటుంది. ఇంకో ఇద్దరు కొడుకులున్నారుగా… లక్షలు సంపా దిస్తున్నారు. వాళ్ళుకు తెమ్మని చెప్పచ్చుగా. అయినా ఎవరినని ఏం లాభం. అన్ని పనులు మీదేసుకుని మీరే ముందు నడిస్తేను…’’ కోపంగా భర్తను అన్నది నీరజ.
సంభాషణ ఎటో మలుపు తిరుగుతుందని గ్రహించిన జనార్థన్ తెలివిగా, ‘‘ముందు పెళ్ళి విషయం ఆలోచించు,’’ అన్నాడు భార్యతో.
కొద్దిసేపు ఆగి, ‘‘ఒకే ఒక మార్గం. అంతకుమించి మరో మార్గం లేదు,’’ అన్నది నీరజ.
జనార్ధన్ ఆసక్తిగా ఏమిటన్నట్టు చూశాడు. దగ్గరగా జరిగి, ‘‘మనం గట్టిగా నిర్ణయించుకుంటే చెయ్యవచ్చు,’’ అంటూ తన ఆలోచన చెప్పింది నీరజ.
కొద్దిసేపు ఆలోచినల్లో మునిగిపోయాడు జనార్థన్. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చినట్టు లేచి నిలబడ్డాడు. అతడు అవును, కాదు అని ఏదీ చెప్పనకుండా లేవడంతో అర్థంకాక అతడివైపు చూసింది నీరజ. చదవడానికి అతడి మొహంలో ఏభావము లేదు.
‘‘ఏమంటారు,’’ అడిగింది నీరజ.
అప్పటికే తల్లి నుంచి రెండుమార్లు ఫోన్. మౌనంగా బయటకు నడిచాడు జనార్థన్. ఏ విషయం చెప్పకుండా వెళ్ళి పోతుంటే బయటవరకూ వచ్చింది నీరజ. జనార్థన్ మౌనంగా కారు ఎక్కి వెళ్ళిపోయాడు.
అతనికి కోపం తెప్పించానా అనిపించింది ఒక్కక్షణం. తర్వాత సర్దుకుని, ‘నాకు మాత్రం అలా చెయ్యాలనుందా… ఏంచేద్దాం. ఈ విషయంలో ఎలాగైనా అతడిని ఒప్పించాలి. ఈ మార్గం తప్ప మరోమార్గం లేదు,’ అనుకుంది.
కారులో బయలుదేరిన జనార్దన్ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ముగ్గురు కొడుకులు మూడు ఇళ్ళు కట్టుకుని బయటకు వచ్చాక తల్లి దండ్రి పాత ఇంట్లోనే ఉంటున్నారు. నెలకు ఇంత అని కొంత డబ్బు ఇస్తే అందులోనే సర్దుకుంటున్నారు.
జనార్ధన్‌ను చూడగానే తల్లి ఏడుపు అందుకుంది. ‘‘ఒరే… పెద్దోడా… మీ నాన్నను చూడరా… నిన్నమొన్న కాసిన్ని పాలన్నా తాగేవాడు. ఈరోజు పాలు పోస్తే కారిపోతున్నాయిరా… నాకేదో భయంగా ఉంది,’’ అన్నది.
“నీకే కాదు. నాక్కూడా…” అనుకుంటూ తండ్రిని పరిశీలనగా చూశాడు జనార్ధన్. రోజూ కనీసం కళ్ళు తెరిచి చూసేవాడు. మాట్లాడక పోయినా సైగలతో ఏదో చెప్పేవాడు. ఈ రోజు కనీసం కళ్ళు కూడా తెరవలేదు. ‘కొంపదీసి ఈ రోజే రేపో పోడు కదా,’ అనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే భయం పట్టుకుంది. వెంటనే తెలిసిన డాక్టర్‌కు ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు. తర్వాత ఇద్దరు తమ్ముళ్ళకు ఫోన్ చేశాడు. అరగంటలో ఇద్దరు వచ్చారు.
‘‘నాన్న కండీషన్ సీరియస్‌గా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళాలి,’’ తమ్ములతో అన్నాడు.
తమ్ములిద్దరూ విచిత్రంగా చూస్తూ, ‘‘ఇప్పుడు హాస్పిటల్ ఎందుకు. డబ్బు దండగ. ట్రీట్‌మెంట్ ఇస్తే మాత్రం లేచి తిరుగుతాడా,’’ అన్నారు.
జనార్ధన్ తమ్ముళ్ళిద్దరిని చీత్కారంగా చూసి, ‘‘తప్పకుండా తీసుకుపోవలసిందే. మీరు అవునన్నా కాదన్నా నేను తీసుకువెళ్తా. కన్నతండ్రి ఈ స్థితిలో ఉంటే చూస్తు ఊరుకోవాలా,’’ అన్నాడు.
‘‘నీ ఇష్టం. మేం మాత్రం ఒక్కరూపాయి డబ్బు ఇవ్వం,’’ ఇద్దరూ దురుసుగా అన్నారు.
తల్లి కూడా కొడుకు మాటలకు ఆశ్చర్యపోతూ, ‘‘అదేంట్రా… పెద్దోడా ఇప్పుడు హాస్పిటల్ ఎందుకురా… ఇన్ని రోజులు నేను నెత్తినోరు మొత్తుకున్నా డాక్టర్‌కు చూపించలేదు. కనీసం చచ్చే ముందయినా నా కళ్ళ ముందు ఉండనీయిరా…’’ అన్నది బతిమాలుతున్నట్టు.
జనార్ధన్ పట్టుదలగా “నీకు తెలియదమ్మ… ఊర్కో… ఇప్పుడు మంచి ట్రీట్‌మెంట్ అందిస్తే జబ్బు నయం కావచ్చు… మన ప్రయత్నం మనం చేయాలిగా…’’ అన్నాడు.
అంతవరకు ఊరకే అంటున్నాడనుకున్న తమ్ముళ్ళు అతని పట్టుదలను చూసి డబ్బుల విషయంలో మరోసారి తమ నిర్ణయం చెప్పారు.
‘‘అదెట్లా…నేనొక్కడినే కొడుకునా… మీరుకాదా… నాన్న మనందరినీ సమానంగా చదివించ లేదా…?’’ కోపంగా అడిగాడు.
ముగ్గురికి వాదన జరిగింది. తల్లి ఏడుస్తూ కూర్చుంది. నలుగురిని పిలుస్తానన్నాడు జనార్ధన్. వందమందిని పిలిచినా తమ నిర్ణయం మారదన్నారు ఇద్దరు తమ్ముళ్ళు.
‘‘మీ సంగతి తర్వాత చూస్తా,’’ అంటూ అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు జనార్ధన్. తల్లి వద్దంటుంది. బతిమాలుతుంది. ఏడుస్తుంది. అయినా వినిపించుకోకుండా అంబులెన్స్ ఎక్కించాడు జనార్థన్. తమకేం సంబంధం లేనట్టు తమ్ముళ్ళిద్దరు వెళ్ళిపోయారు.
పేషెంట్‌ను చూడగానే పెదవి విరిచాడు డాక్టర్. ‘‘సారీ… అవుటాప్ కండీషన్. ఇప్పుడేం చేయలేము. కిడ్నీస్ ఫంక్షనింగ్ పూర్తిగా ఆగిపోయింది. డయాఫ్రం పాడైపోయింది. ఫిల్టరింగ్ లేదు. కాబట్టి ఏ క్షణంలోనైనా స్ట్రోక్ రావచ్చు… ఇప్పుడు ఇంటి వద్ద ఉండడమే బెటర్…’’ అన్నారు.
జనార్థన్ దీనంగా ముఖంపెట్టి, ‘‘తెలుసు డాక్టర్… ఈ పరిస్థితుల్లో ఈయనకు ఇబ్బందిపెట్టడం మాకు మాత్రం ఇష్టమా… కాని తప్పని పరిస్థితి. వారంలో నా కొడుకు పెళ్ళి. ఇప్పుడు నాన్నకు ఏదైనా జరిగిందనుకో… ఏడాది వరకు శుభ కార్యం పనికిరాదు. ఏడాది ఆగితే సంబంధం పోయేట్టుంది. ఒక్కపది రోజులు ఎలాగైనా బతికించండి. ఎంత ఖర్చయినా ఫరవాలేదు…’’ అన్నాడు బతిమాలుతున్నట్టు.
డాక్టర్ విచిత్రంగా చూస్తూ, ‘‘మా చేతుల్లో ఏముందండి. మేమెలా బతికిస్తాం,’’ అన్నాడు.
జనార్ధన్ బ్యాగ్‌లోంచి నోట్లకట్టలు తీసి టేబుల్ మీద పెడుతూ, ‘‘ఇది అడ్వాన్స్ సర్… ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచండి. మెడికల్లి డెడ్ అనుకొండి. శవాన్నే భద్రపరుస్తున్నామనుకొండి. పదిరోజుల తర్వాత ఒక్కక్షణం కూడా ఇక్కడ ఉంచను,’’ అన్నాడు.
డాక్టర్ నవ్వుతూ, ‘‘మా ప్రయత్నం మేం చేస్తాం… తర్వాత మీ అదృష్టం,’’ అన్నాడు.
జనార్థన్ తండ్రి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. తండ్రి కొడుకు వైపు దీనంగా చూసాడు. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. కదల డానికి కాళ్ళు చేతులు సహకరించడం లేదు. ఏదో మాట్లాడాలని పెదవి విప్పుతున్నాడు. కాని మాట పెకలడంలేదు. బలవంతంగా చేతిని ఎత్తి వెళ్ళిపోదామంటున్నాడు.
తల్లి తల్లడిల్లిపోతుంది. “నాన్న కళ్ళు తెరిచాడురా. ఇంటికి వెళ్దామంటున్నాడు,’’ అన్నది కొడుకుతో. జనార్ధన్ మౌనంగా వున్నాడు. క్షణాల్లో నర్సులు, డాక్టర్లు ప్రత్యక్షమయ్యారు. తండ్రి సైగలు చేస్తూనే ఉన్నాడు. తల్లి ఏడుస్తూనే ఉంది. ఎవరితో సంబంధం లేకుండా ఐసీ యూనిట్‌లోకి మార్చారు.
లోపలికి వెళ్తానని తల్లి పట్టుపడుతుంది. బయటనే ఉండాలని సర్దిచెప్పుతున్నారు నర్సులు.
‘‘ఒరే… చివరిరోజుల్లోనైనా దగ్గర ఉండనివ్వండిరా… మీకు దండం పెడతా…’’ తల్లి ఏడుస్తుంది.
ఆమె ఏడుపును పట్టించుకోకుండా బయటకు నెట్టుకొచ్చారు నర్సులు. తల్లిపై విసుక్కుంటూ బయటకు వచ్చిన జనార్థన్ భార్యకు ఫోన్ చేసాడు.
‘‘పదిరోజులు మేనేజ్ చేసా… ఓ రెండురోజులు అటూ ఇటూ… నా పని పూర్తయింది. ఇక నీదే. ఎలా ఒప్పిస్తావో ఏం చేస్తావోగాని వారంల పెళ్ళి కుదుర్చు… పదిరోజుల్లో అన్నీ పూర్తయి పోవాలి,’’ అన్నాడు. నీరజ భర్తను మెచ్చుకుంటూ కులాసాగా నవ్వింది. అంతా అనుకున్నట్టే జరిగింది.
జనార్ధన్ కొడుకు పెళ్ళి వారంలోనే చేశాడు. మరో రెండు రోజుల్లో మిగతా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అంతవరకు అరచేతిలో ప్రాణం పెట్టుకున్న నీరజ, ‘‘హమ్మయ్య…ఓ పనైపోయింది టెన్షన్‌తో చచ్చిపోయాననుకో,’’ అన్నది భర్తతో తేలిగ్గా.
“నేను మాత్రం ఆనందంగా ఉన్నానేంటి… గంట గంటకు డాక్టరుకు ఫోన్ చేస్తున్నాను,’’ అన్నాడు జనార్ధన్.
‘‘ఇంకేం… వెంటనే వెళ్ళి హాస్పిటల్ నుంచి తీసుకు రండి,’’ అన్నది పురమాయిస్తూ.
“అరే… ఈ రోజే కదా… పనులన్ని పూర్తయినవి. ఇప్పుడే తెస్తే ఎవరన్నా ఏమనుకుంటారు,’’ విసుగ్గా అన్నాడు జనార్థన్.
భర్తను విచిత్రంగా చూస్తూ నవ్వింది నీరజ. నవ్వుతూనే, ‘‘ఇప్పటికి మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పడు కూడా చెబుతున్నాను. మనం మనకొరకు బతకాలి కాని ఇతరుల కొరకు కాదు. ఎప్పుడూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. నువ్వెంత మంచిపని చేసినా అందరూ మంచివారనరు. నువ్వెంత చెడ్డపని చేసినా అందరూ నిన్ను చెడ్డవారనరు. అందుకే మనం మనంగా బతకాలంతే. ఒక్కరోజుకు పదివేలంటే మామూలా? ఇప్పటికే హాస్పిటల్ బిల్లు లక్షదాటి ఉంటుంది’’ అన్నది.
లక్ష పేరు వినగానే జనార్ధన్ గుండె వేగం హెచ్చింది. వెంటనే హాస్పిటల్‌కు పరిగెత్తాడు. జనార్థన్‌ను చూస్తూనే డాక్టర్ నవ్వుతూ, “కంగ్రాచ్యులేషన్స్ సర్… రండి రండి…” అన్నాడు.
‘‘థాంక్యూ డాక్టర్… ఎలాంటి ఆటంకం లేకుండా మీ దయవల్ల ఓ శుభకార్యం జరిగిపోయింది,’’ అన్నాడు జనార్ధన్.
డాక్టర్ నవ్వుతూ, ‘‘మీరు అదృష్టవంతులండి… అందు కని అన్నీ శుభాలే జరుగుతున్నాయి,’’ అన్నాడు.
‘‘ఏదో మీ సహకారం… సార్. మీరు చొరవ చూపకుంటే ఈ పని జరిగేదే కాదు,’’ అన్నాడు జనార్థన్ కృతజ్ఞతగా.
‘‘నాదేముందండీ… మీరు అదృష్టవంతులు అంతే! అటు మీ కొడుకు పెళ్ళయింది. ఇటు మీ నాన్న కోలుకుంటున్నాడు,’’ అన్నాడు.
జనార్థన్‌కు అర్థంగాక డాక్టర్ వైపు విచిత్రంగా చూశాడు. డాక్టర్ విజయగర్వంతో నవ్వుతూ, ‘‘అవునండీ… మీకు సర్‌ప్రైజ్ ఇద్దామనే ఫోన్‌లో చెప్పలేదు. విచిత్రంగా మూడోరోజు నుంచే డయాఫ్రం ఫంక్షనింగ్ మొదలయింది.. కిడ్నిస్ రికవరీ అవుతున్నాయి. ఇది గమనించి మేం ట్రీట్‌మెంట్ స్టార్డ్ చేసాం… రోజురోజుకు పలితం కనిపించింది. ఇంకో ఇరవై రోజులు ఐసీయు లో ఉంచితే మనిషి నార్మల్ అయ్యే అవకాశముంది…’’ డాక్టర్ చెప్పుకుపోతున్నాడు.
జనార్ధన్ బిత్తరపోయి చూస్తున్నాడు. మనసులోనే లెక్కలు వేసుకుంటున్నాడు. అతని పరిస్థితి చూసి వేరుగా అర్థం చేసుకున్న డాక్టర్, ‘‘నేను చెప్పితే మీరు నమ్మకం లేనట్టుంది. చూద్దురుగాని రండి…’’ అంటూ లోనికి తీసుకెళ్ళి తండ్రిని చూపించాడు. రిపోర్ట్స్ చూపించాడు. వాడుతున్న కాస్ట్‌లీ మందుల గురించి చెప్పాడు. ట్రీట్‌మెంట్ గురించి కూడా చెప్పాడు.
జనార్థన్‌కు కళ్ళు బైర్లుకమ్మాయి. ‘ఒక లక్ష అనుకున్నాను. రెండు దాటేట్టున్నవి,’ అనుకుంటూ తండ్రి వైపు చూశాడు.
తండ్రి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మొఖంలో కళ వచ్చింది. కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు. కాళ్ళలో వాపు తగ్గింది. వీటన్నింటి కంటే బిల్లు సమస్యనే వేధిస్తుంది అతన్ని. అతనిలోని కంగారును చూసిన డాక్టర్ తృప్తిగా నవ్వుకుంటూ, ‘‘చనిపోతాడనుకున్న తండ్రి కోలుకుంటే ఎవరికైనా ఇలాగే ఉంటుందండీ… మీకు మీ తండ్రి అంటే ఎంత ప్రేమో మీ అమ్మ చెప్పింది. ఒకరకంగా ఈ క్రెడిట్ అంతా ఆమెకే దక్కుతుంది. మేం ట్రీట్‌మెంట్‌కు వెనకాడిన ప్రతీసారి ఎంత ఖర్చయినా ఫరవాలేదని మాకే ధైర్యం చెప్పిందనుకో…’’ అన్నాడు.
జనార్థన్ మనసులోనే పటపట పళ్ళు కొరుక్కున్నాడు. మమ్మల్ని అడక్కుండా ఇంత ఖరీదైన ట్రీట్‌మెంట్ ఎలా ఇచ్చారని అడక్కముందే బరువంతా తల్లి మీద తోసేసాడు డాక్టర్. అక్కడ ఏమీ అనలేక బయటకు వచ్చాడు జనార్థన్. బయటకు వెళ్ళిన తల్లి అప్పుడే వచ్చింది. కొడుకును చూస్తూనే సంతోషంగా, ‘‘ఓరే జానా…ఏదో అనుకున్నాను కానీ నీవు చేసింది మంచిపనేరా…నాన్న కోలుకుంటున్నాడురా….ఇంకో పదిహేను రోజులుంటే బాగైపోతాడట,’’ అన్నది.
అంతవరకు అనిచిపెట్టుకున్న కోపం ఒక్కసారిగా బయట పడిరది. ‘‘ఆ… పదిహేను కాదు. నెలరోజులుంచుదాం. డబ్బులు మనింట్లో చెట్టుకు కాస్తున్నయి… కోసుకొచ్చి ఇక్కడ ఇస్తా… నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా అమ్మ… ఇదెంత ఖరీదైన వైద్యమో తెలుసా… నువ్వు ఇలా చేస్తావని తెలిస్తే నిన్ను ఇక్కడ ఉండనిచ్చేవాడినే కాదు,’’ అన్నాడు అరుస్తున్నట్టు.
తల్లి మొహంలో నవ్వు మాయమై పోయింది. కొడుకువైపు భయం భయంగా చూసింది. ఏమాత్రం పట్టుసడలినా తల్లి సెంటి మెంట్‌తో కొడుతుందని గ్రహించిన జనార్థన్ గొంతును పెంచి తీవ్రస్థాయిలో, ‘‘ఈ ఖర్చంతా నేనొక్కడినే భరించాలి. వాళ్ళిద్దరిని అడగవు… పదిహేనురోజులు కాదు. గంట కూడా ఇక్కడ ఉండ డానికి లేదు. బట్టలు సర్దుకో…’’ అన్నాడు.
తల్లి ఏడుస్తూ బతిమాలడం మొదలుపెట్టింది. ‘‘జానా… ఒద్దురా… ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు రా… నేను తమ్ముళ్ళి ద్దరిని ఒప్పిస్తానురా…’’ అన్నది.
‘‘అయితే ఒప్పించు… ఇప్పుడే,’’ నిష్ఠూరంగా అంటూ సెల్‌ఫోన్ ఇచ్చాడు. తల్లి కొడుకులిద్దరికీ ఫోన్ చేసింది. మాకేం తెలియదని కచ్చితంగా చెప్పేసారు.
‘‘చూసావా… చూసావా… నన్ను ఇరికించాలని చూస్తున్నావు. అదేం కుదరదు. వెంటనే నడు,’’ అన్నాడు జనార్ధన్.
డాక్టర్ చెప్పడానికి ప్రయత్నించాడు. తల్లి నెత్తినోరు మొత్తుకొని ఏడ్చింది. అయినా వినలేదు జనార్ధన్. అరగంలో బిల్ పే చేసి తండ్రిని అంబులెన్స్ ఎక్కించాడు. వారంలో తండ్రి పరిస్థితి మొదటికి వచ్చింది.
సరిగ్గా నెల తరువాత రెండవ కొడుకు ఇంట్లో కూడా ఒక శుభకార్యం మొదలయింది.
(పెద్దింటి అశోక్‌కుమార్ దాదాపు వంద కథల వరకూ రాశారు. ఐదు కథా సంపుటాలు ఊటబాయి, వలస బతుకులు, మా ఊరి బాగోతం, భూమడు, మాయిముంత, రెండు నవలలు – దాడి, జిగిరి, పోరుగడ్డ వ్యాససంపుటి ప్రచురించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. వీరి కథలు కొన్ని ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. వివిధ కథల పోటీల్లో వీరి కథలకు బహుమతులు లభించాయి. email – peddintiak@gmail.com)