నీ నుంచి నేను మరలిపోయినప్పుడల్లా
నిజం తెరుచుకుంటూనే ఉంది.
నే పారిపోతున్నానని అనుకున్న కాలం…
తన రొమ్ము విరుచుకుంటూనే ఉంది
పాపం!.. జమానాకి తెలియదు
నన్ను ధిక్కరించడం ఎంత పాపమో…
నా మాటలు నేలవిడిచి సాము చేసినప్పుడల్లా
నాలోపల నేను తడబడుతూనే ఉన్నాను
అడుగుల్ని మాటలు నిర్ధరించినప్పుడల్లా
పరిగెడుతూనేఉన్నాను
నేను నిట్టూర్పుల కుంపటిసెగ అనుకున్న
వాడి తల ప్రాలు పొర్లించక తప్పలేదు…
చెమిర్చిన చెమటచుక్కలద్దుకున్న వాడి శ్రమను
ఫలితాన తేల్చాకగాని నాకు మనసొప్పలేదు
నాడి కొట్టుకోవడం ఆగే వరకూ
మౌనాన్ని ఎవరికీ తాకట్టు పెట్టలేను
తిట్టుకునే నుదుటిరాతను మార్చమని
ఏ దేవుడికీ ఏకరువు పెట్టలేదు
ఎవడెటైనా సాగిపోనీ..
నా మాట వినిపించేంత దూరమైనా
పారాహుషార్ పాటని కట్టిపెట్టలేను
ఓయ్.. లోకమా!!
నీ దారి అటుకాదు..
నా వెనుకే నడచిరా
నువు చూడని కొత్త పుంతలు
అందుకునేటందుకు వెళుతున్నా..
నన్ననుసరించు..
దిగంతాల వెలుగుపువ్వుల్ని
నీ దారిన పరుస్తాను
నాతో నడుస్తావా!!…
ఎవరనుకుంటున్నావు నన్ను!!
కవిని నేను…
చీకటి లోకమా!!
నిను వెలిగించే రవిని నేను.