పునీత

ఇవ్వాళ్ళ సోమవారం. ఇంకా వారం సరిగ్గా మొదలన్నా కాలేదు… ఇవ్వాళ్ళ రెండు విచిత్రాలు జరిగాయి.

ఆఫీసుకి వెళ్తూనే నా మేనేజర్‌ పాల్‌ దగ్గర్నించి ఈమెయిల్‌ — క్రిస్‌, పదింటికి మీటింగ్‌. ఫలాని కాన్ఫరెన్సు గదిలో.

వీడికేం కావాలో సోమవారం పొద్దున్నే అనుకుంటూ నా పనిలో మునిగి పోయా. మీటింగ్‌ టైమయిందని కంప్యూటరు హెచ్చరించింది. నోటు పుస్తకం తీసుకుని గది కెళ్తే అక్కడ పాల్‌తోబాటు ఇంకో మేనేజర్‌ కూడా ఉన్నాడు. ఇంత తతంగం నా ఉద్యోగం ఊడగొట్టడానికి. పొద్దునే ఒక మెయిలు పెట్టుంటే అసలు ఆఫీసుకి వచ్చేవాణ్ణి కాదుగా. ఆహా… ఈ వారం భలే గొప్పగా మొదలైంది అనుకుని ఇంటికి బయల్దేరాను. నిజానికి ఇది పెద్ద విచిత్రం కాదు, రేపో ఎల్లుండో జరుగుతుందని నేను ఎదురుచూస్తున్నదే. నా జీవితంలో గత పదేళ్ళుగానూ జరుగుతూ ఉన్నదే. అందుకే పెద్ద ఫీలవలేదు.

పదిన్నరకి ఆఫీసు వదిలిపెట్టాను. పదకొండుకల్లా అపార్టుమెంటు కాంప్లెక్సుకి వచ్చేశాను. వస్తూ వస్తూ దార్లో స్టెర్లింగ్‌ హైట్సులో హాల్‌ రోడ్డు మీద బుషేమీ లిక్కర్‌ షాపులో రెండు సీసాల స్మిర్నాఫ్‌ వోడ్కా కొనుక్కొచ్చాను. ఇంతకు మునుపు తాగేవాణ్ణి కాదు. అమ్మ ఉండేది. రెండేళ్ళ కిందట అమ్మ పోయాక తాగడం మొదలెట్టాను. అపార్టుమెంటు కాంప్లెక్సుకి చేరే లోపల ఒక సీసా పావు వొంతు తేలికపడింది. నా బుర్రలో ఒక జోరీగ సుర్రుసుర్రని సుడులు తిరుగుతోంది. బలే సమ్మగా ఉంది. అలవాటు చొప్పున మెయిల్‌ బాక్సు తెరిచాను కాబోలు. ఎదురుగా ఉంది ఉత్తరం. తెల్ల కవరు. మామూలు ఉత్తరం లాంటి తెల్ల కవరు. పైన నీట్‌గా నీలపు సిరాతో రాసిన నా పేరూ ఎడ్రసూ. నాకు ఉత్తరమొచ్చింది. ఇదే రెండో విచిత్రం. అప్పుడే ఇంత కిక్కెక్కేసిందా అని కళ్ళు నులుముకుని చూశాను, పోనీ ఇంకెవరిదైనానేమో అని. నాదే. అదిగో నా పేరు- క్రిస్టొఫర్‌ తాడిపర్తి. నా ఈ ముప్ఫయ్యేడేళ్ళ జీవితంలో నాకంటూ ఎప్పుడన్నా ఉత్తరమొచ్చిందా? వెరైజన్‌ బిల్లులూ, కార్నివాల్‌ క్రూజ్‌ ఆఫర్లూ కాదు- నిజ్జంగా ఒక మనిషి రాసిన ఉత్తరం. ఈమెయిలు కాదు, నిజమైన కాయితం మీద రాసిన ఉత్తరం, నిజమైన కవర్లో, పైన నిజమైన చేతి రాతలో నా ఎడ్రసుతో. ఏమో వచ్చిందేమో ఎప్పుడన్నా. ఈ మధ్యకాలంలో అయితే కాదు. కొన్ని యేళ్ళయి ఉండొచ్చు.

సీసాలోంచి ఇంకో గుక్క తాగి, తలుపు తెరుచుకుని ఇంట్లోకొచ్చాను. తాళాలతో బాటు ఉత్తరాన్ని కూడా పక్కనున్న బల్ల మీద పడేసి, రెండు సీసాలూ పట్టుకుని వెళ్ళి సోఫాలో చతికిలబడ్డాను. ఎదురుగా టీవీ. దాని పక్కన అమ్మా నాన్నా ఫొటో. అలా చూస్తూనే ఇంకో గుక్క తాగాను. ఫొటోలోనించి అమ్మ కళ్ళు నన్నే చూస్తున్నై. ఇంకో గుక్క. అమ్మ కళ్ళు పెద్దవయ్యాయి. ఇంకో గుక్క. అమ్మ కళ్ళు కోపంగా, అసహ్యంతో నిండి. ఇంకో గుక్క. అమ్మ కళ్ళు కాళిక కళ్ళల్లే. గటగట నాలుగు గుక్కలు.


క్రిస్టొఫర్‌ ఆ రోజు బడి అయిపోయాక గంటన్నరసేపు ఫుట్‌బాల్‌ ఆడుకుని వచ్చాడు, అమ్మ చేతిలో ఏం తిట్లు తినాల్సి వస్తుందో అని భయపడుతూ. పదో తరగతి పరీక్షలు ఇంకా రెణ్ణెలల్లో ఉన్నాయి. కానీ ఆశ్చర్యంగా నిర్మలాదేవి వాణ్ణి తిట్టకపోగా, వాడు ఇంట్లోకి రాగానే కేకు పెట్టింది. వాళ్ళ కుటుంబానికి అమెరికా వలసవెళ్ళే అవకాశం వచ్చింది ఆ రోజు, ఫేమిలీ ఇమ్మిగ్రేషన్‌ అట. తిట్లూ తన్నులూ తప్పాయని సంతోషపడ్డాడు క్రిస్టొఫర్‌. కానీ ఈ సంఘటన తన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో వాడికి ఆ క్షణంలో తోచలేదు.

నిర్మలాదేవి సులభంగా తృప్తిపడదు. ఒక ప్రభుత్వాసుపత్రి డాక్టరు భార్యగా, ఒక చిన్న క్రిస్టియను బడి ప్రిన్సిపాలుగా విజయవాడలాంటి వూళ్ళో మగ్గుతూ, ఇద్దరు పిల్లల తల్లిగా ఇమిడిపోవడం ఆవిడ ఉద్దేశం కాదు. ఎగరాలి పైకెగరాలి. రెక్కల సత్తువ అందుకే ఇచ్చాడు దేవుడు. డా. థామస్‌తో పెళ్ళైనప్పటి నించీ ఆయన కెరీర్‌ని ముందు ఆకాశానికెత్తాలని ప్రయత్నించింది. ప్రభుత్వాసుపత్రికి అలవాటు పడిపోయిన ఆయన ప్రాణం ఆవిడ స్కీములకి లొంగలేదు. ఆయన్ని వదిలేసి తన పరిధిలో చేతికందిన చిన్నచిన్న వ్యాపారాలు మొదలుపెట్టింది. చీటీలు కట్టింది. బీమా ఏజెన్సీ చేసింది. చర్చిలో అత్తమామల పరపతీ, బడిలో తన అధికారమూ, ఆస్పత్రిలో భర్త అధికారాన్నీ పూర్తిగా వినియోగించుకుంది. పిల్లలిద్దర్నీ చిన్నప్పటినించీ తన లక్ష్యాలకి తగినట్టు తీర్చిదిద్దుతూ ఉన్నది. కూతురు జెన్నిఫర్‌ మంచి ప్రైవేటు జూనియర్‌ కాలేజిలో కామర్సు గ్రూపుతో ఇంటరు చదువుతోంది. ఆమె ఎంబీయే చదవాలి. క్రిస్టొఫర్‌ డాక్టరవ్వాలి. ఒట్టినే డాక్టరవడం కాదు, అమెరికాలో న్యూరోసర్జన్‌ అవ్వాలి. ఎటొచ్చీ వాడికి ఆటల మీద ఉన్న ధ్యాస చదువుమీద లేదు. నిర్మలాదేవి దృష్టిలో ఈ వలస ఆహ్వానం సరిగ్గా రావలసిన సమయంలోనే వచ్చింది. కొడుకునీ కూతుర్నీ కూర్చోపెట్టి, అమెరికాకి ఎలా వెళ్ళాలో, అమెరికాలో తమ భవిష్యత్తు ఎంత ఉజ్జ్వలంగా ఉండబోతుందో ఉత్సాహంగా చెబుతున్నది.

డా. థామస్‌కి ఇప్పుడు ఉన్నట్టుండి అమెరికాకి వలస వెళ్ళాల్సి రావడం ఏమీ నచ్చలేదు. తన ఇష్టప్రకారంగా నడిచే ఉద్యోగం. సాయంత్రం పూట క్లబ్బు కెళ్ళి రెండు రౌండ్లు డ్రింక్సు, నాలుగు రౌండ్లు బ్రిడ్జీ, ఊళ్ళో కావలసినంత గౌరవం, చుట్టూతా బంధువులూ స్నేహితులూ. కానీ ఈ విషయంలో ఆయన ఇష్టాయిష్టాలకి తావులేదు. నష్టం రాకుండా త్వరితంగా నగదు ముట్టే వస్తువులూ ఆస్తులూ అన్నీ అమ్మేశారు. అన్నీ నిర్మలాదేవే జాగ్రత్తగా పద్ధతి ప్రకారంగా నిర్వహించింది. ఇక్కణ్ణించి ఏమేమి పట్టు కెళ్ళాలో, కొత్తగా ఏమేమి కొనాలో అన్నీ సమకూర్చుకోవడం అంతా యుద్ధ ప్రాతిపదికన జరిగింది. నిర్మలాదేవి ఒక జెనరల్‌. జెన్నిఫర్‌ ఆమె కింద లెఫ్టెనెంట్‌. డా. థామస్‌కి కానీ క్రిస్టొఫర్‌కి కానీ పెద్ద పని లేదు, వస్తువుల్ని పాక్‌ చెయ్యడం తప్ప.


ఫోను మోగడంతో మెలకువొచ్చింది. అక్క! టైము ఐదున్నర చూపిస్తోంది. పేగులు కరకరలాడుతున్నాయి. నోరంతా పచ్చిగా ఉంది. సీసా తీసి నోటినిండా వోడ్కాతో నోరు పుక్కిలించి మింగాను. ఫోను అదే ఆగిపోయింది. ఏమన్నా తినాలి. పేగులు కరకర. ఫోను మళ్ళీ మోగుతోంది. మళ్ళీ అక్కే. మాట్లాడాలని లేదు. ఫోను అక్కడే వదిలేసి బాత్రూముకి పోయొచ్చాను. వుత్తరం గుర్తొచ్చింది. పేగులు కరకర. టర్కీ శేండ్విచ్‌ చేసుకుని తిన్నా వోడ్కా నంచుకుంటూ.

ఉత్తరం గుర్తొచ్చింది. ఆకలి తీరిందిగానీ తల దిమ్ముగా ఉంది. ఇప్పుడా ఉత్తరం చదవబుద్ధి కాలా. ఫోను తీసుకుని అక్క మెసేజి విన్నాను.

‘‘ఒరే క్రిస్‌, నీకేవన్నా ఉత్తరమొచ్చిందా ఇవ్వాళ్ళ? నువ్వు ఫోనెందుకు ఎత్తట్లేదు? ఇదిగో, ఆ ఉత్తరం తెరవకు, ఓకే? పారేసెయ్యి. కాదు కాదు, స్టవ్‌ మీద నిప్పులో కాల్చేసెయ్యి, ఓకే? మెసీజి చూసుకోగానే ఫోన్‌ చెయ్యి.’’

ఏంటిది? ఇన్వెస్టుమెంట్‌ బేంకుల్లో పని చేసీ చేసీ ఈ జెన్నిఫర్‌కి పిచ్చేవన్నా ఎక్కిందేమో? ఉత్తరమేంటీ? ఓ అవును, ఉత్తరం, వచ్చింది కదా. వోకే. అవునూ, నాకు ఉత్తరం వచ్చినట్టు అక్కకి ఎలా తెల్సు? తనే పంపిందా? తనే పంపితే చదవకుండా కాల్చెయ్య మంటదేంటి? హం. ఏదో మిస్టరీ. ఇప్పుడీ మిస్టరీ ఒద్దు, ఏ హిస్టరీ వొద్దు. మిస్టరు స్మిర్నాఫే ముద్దు.


తాడిపర్తి కుటుంబం అమెరికాలో మిషిగన్‌ రాష్ట్రంలో ట్రాయ్‌ అనే నగరానికి వచ్చారు. ట్రాయ్‌లో ప్రసిద్ధి చెందిన సెయింట్‌ అనాస్టసియా కేథలిక్‌ చర్చిలో చేరారు. ఆ చర్చిలో అందరూ విద్యాధికులూ, ట్రాయ్‌ నగరంలోని ప్రముఖులూ వుంటారని ముందుగానే విచారించి నిర్మలాదేవి ఈ నిర్ణయం తీసుకున్నది. డా. థామస్‌ అయిష్టంగానే ఏదో చిన్న ఉద్యోగంలో చేరి, అంతకన్నా అయిష్టంగా మెడికల్‌ పరిక్షలకి చదవడం మొదలెట్టాడు. నిర్మలాదేవి ఒక బేంకులో టెల్లరుగా చేరి తన కుటుంబ వృక్షం వేళ్ళూనుకోవడానికి ఏమేం చెయ్యాలో పథకాలు వెయ్యడం మొదలెట్టింది. జెన్నిఫర్‌ విషయం కొంచెం కష్టమయింది. నేరుగా కాలేజీలో చేరేందుకు ఆలస్యమయింది. అందుకని ముందు ఓక్లాండ్‌ కమ్యూనిటీ కాలేజిలో వ్యాపారవిద్యకి సంబంధించిన కోర్సులో చేరింది. క్రిస్టొఫర్‌ పదోతరగతి మళ్ళీ చదవాల్సి వచ్చింది. కానీ ప్రఖ్యాతి గాంచిన ట్రాయ్‌ హైస్కూల్లో సీటు దొరికింది.

ఎటొచ్చీ డా.థామస్‌ విషయంలోనే నిర్మలాదేవి అంచనాలు అనుకున్నట్టుగా సాగలేదు. పైపై అజమాయిషీకి బాగా అలవాటు పడిన డా. థామస్‌ ఆ వయసులో అమెరికా వైద్య ప్రవేశపరీక్షలు గట్టెక్కలేకపోయాడు. రెండేళ్ళు ఆ పరీక్షలతో కుస్తీపట్టి బోలెడు డబ్బులు తగలేశాక అతను చేతులెత్తేశాడు నావల్ల కాదని. పరిస్థితులు వేరేగా ఉంటే నిర్మలాదేవి అతన్ని సులభంగా విడిచిపెట్టి ఉండేది కాదుగానీ సరైన ఆదాయం లేక పోవడమూ, ఈ పరీక్షల పేరిట ఖర్చు విపరీతంగా జరుగుతుండడమూ గమనించుకున్నాక వేరే దారులు వెతకక తప్పలేదామెకి. అతను అప్పటికే అక్కడికి కొంత దూరంలో ఉన్న భారతీయ గ్రోసరీ షాపులో పని చెయ్యడం వల్ల దానికి సంబంధించిన అనుభవం కొంత అబ్బింది. ట్రాయ్‌ చుట్టుపక్కల భారతీయ జనాభా బాగా పెరుగుతుండడం గమనించింది ఆవిడ. పప్పులు ఉప్పులు కావాలంటే కనీసం పది మైళ్ళ దూరం పోవాల్సి వస్తోంది. బాగా ఆలోచించి భారతీయ గ్రోసరీ షాపు తెరవడానికి నిర్ణయించింది.

చర్చిలో తను పెంపొందించుకున్న స్నేహాల బలంతో ఆమె దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చురుకుగా సాగించింది. ఎప్పటి లాగానే జెన్నిఫర్‌ ఆమెకి తగిన లెఫ్టినెంట్‌. అప్పటికే జెన్నిఫర్‌ వేష భాషల్లో అమెరికను పోకడలని బాగా సాధించింది. డా. థామస్‌ కేవలం ఒక విగ్రహమూర్తి. చూస్తుండగానే ట్రాయ్‌కి నడిబొడ్డు లాంటి కూడలిలో ఒక చిన్న షాపు తెరిచారు. అందులో అన్నిరకాల పప్పులు, ఉప్పులు భారతీయ తిండి పదార్ధాలతో పాటు తెలుగు, హిందీ, తమిళ సినిమాల విడియో టేపులు అద్దె కివ్వడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు మాత్రం నిర్మలాదేవి అంచనా సరిగ్గా పనిచేసింది. డా. థామస్‌కి కూడా ప్రాణం హాయిగా ఉంది. గల్లా పెట్టి దగ్గర కూర్చోవడం, వచ్చేపోయే కస్టమర్లతో బాతాఖానీ వెయ్యడం – అంతే ఆయన చెయ్యాల్సింది. వ్యాపారం నడవడానికి వెనక జరగాల్సిన తతంగమంతా ఎలాగూ నిర్మలాదేవే చూసుకునేది జెన్నిఫర్‌ సహాయంతో.


వోడ్కా మత్తు మెత్తగా హాయిగా ఉంది. కౌచ్లో పడుకోవడంతో నడుము నొప్పెడుతున్నా లేవబుద్ధి కాలేదు. మధ్య మధ్యలో ఫోను మోగుతోంది. కిటికీలోనించి సూర్యకాంతి నేరుగా మొహమ్మీద పడి ఇంక భరించరాకుండా అయింది. లేవక తప్పలేదు. ఫోను తీసుకుని టైము చూశాను. మూడు చూపిస్తోంది. వారం మంగళారం. పక్కన టేబుల్‌ మీదికి చెయ్యి పోనిచ్చి బాటిల్‌కోసం తడిమాను. ఖాళీ. నిన్న రెండు బాటిల్స్‌ తెచ్చినట్టు గుర్తు? బలవంతంగా కౌచ్‌లో లేచికూర్చుని రెండోదాని కోసం వెతికాను. అది పక్కకి దొర్లిపోయి ఉంది- అదీ ఖాళీ. వోకే. నో ప్రాబ్లం. బయటి కెళ్దామని కారు తాళాలకోసం చూస్తే, తాళాల కింద ఉత్తరం.

నిన్న అక్క మెసేజి గుర్తొచ్చింది.

అనాలోచితంగా కవరు తెరిచాను.

ప్రియమైన క్రిస్టొఫర్‌,

ఎలా ఉన్నావు? నేను గుర్తున్నానా?

నువ్వు మరిచిపోయావేమోగాని, నేను మాత్రం నిన్నెప్పుడూ మర్చిపోలేదు. నువ్వు చర్చి కార్యక్రమాలకి రావడం మానేసినా, తరవాత నేను ట్రాయ్‌ నించి బదిలి అయి వెళ్ళిపోయినా నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను.

అప్పటి నీ స్నేహితురాలు, కినేషా గుర్తుందా? … .. …


ఇంట్లో అప్పటిదాకా ఒక కారే ఉంది. దానితోనే సర్దుకుంటున్నారు కిందమీదవుతూ. జెన్నిఫర్‌ కాలేజి క్లాసులు, క్రిస్టొఫర్‌ హైస్కూలు క్లాసులు, నిర్మలాదేవి ఉద్యోగానికి వెళ్ళడం, డా. థామస్‌ వ్యాపారం- పిల్లలకి తోటి విద్యార్ధులు రైడ్‌ ఇవ్వడం, చుట్టుపక్కల వాళ్ళు సహాయం చెయ్యడం, ఎలాగో నెట్టుకొస్తున్నారు. వ్యాపారం రెండేళ్ళు నడిచాక, పరవాలేదు, కొంచెం నిలదొక్కుకున్నాం అన్న ధైర్యం వచ్చాక ఇంకో కారు కొనాలని నిర్ణయించింది నిర్మలాదేవి. పాతకారు ఇక తమ కోసమే అని జెన్నిఫర్‌, క్రిస్టొఫర్‌ ఇద్దరూ సంతోషిస్తున్నారు. తమతమ అవసరాలని బట్టి ఇద్దరూ దాన్ని పంచుకుని వాడుకోవచ్చు నిజానికి. కానీ ఒకరోజు రాత్రి భోజనాల దగ్గర నిర్మలాదేవి నోరు జారి కారు ముఖ్యంగా క్రిస్టొఫర్‌ది జెన్నిఫర్‌ ఎప్పుడైనా కావాలంటే వాడుకోవచ్చు అన్నట్టుగా ఒక మాట అన్నది. జెన్నిఫర్‌కి తిక్కరేగి వాళ్ళమ్మతో పోట్లాటకి దిగింది. పిల్లల దగ్గర్నించి ఎదురు ప్రశ్నించని విధేయత తప్ప ఇంకెటువంటి ప్రవర్తన చూడని నిర్మలాదేవి మొదట తెల్లబోయింది. జెన్నిఫర్‌కి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. తల్లి శాంతం గా మాట్లాడినకొద్దీ జెన్నిఫర్‌ శాంతించకపోగా ఇంకా చెలరేగి పోయింది. క్రిస్టొఫర్‌, డా. థామస్‌ ఇద్దరూ మ్రాన్పడిపోయి చూస్తు న్నారు. జెన్నిఫర్‌ కోపంతో ఊగిపోతూ, చూపుడువేలు క్రిస్టొఫర్‌ మొహమ్మీద ఆడిస్తూ- ఎందుకు వీడికి కారు? వాడి నల్లముండని వేసుకుని షికార్లు తిరగడానికా- అనరిచింది కీచుగొంతుతో.