ఆ ఇల్లు మూతవడ్డది

“బాపూ, మక్కప్యాలాలే ”

“వద్దు బిడ్డ. కడుపుకొడ్తది.”

“ఏం నొయ్యదే! అబ్బకొనియ్యే. అమ్మా, కొనియ్యే! ఊ … ఊ …”

“పాప్‌కార్న్! గరం గరం పాప్‌కార్న్! పోతే దొరుకయి” బస్సులో అటూ ఇటూ తిరుగుతున్నాడు పన్నెండేళ్ళ పిల్లగాడు. చేతిలో బుట్ట. బుట్ట నిండా ఆలూ చిప్స్‌, పాప్‌కార్న్‌ పాకెట్లు. ఏడుపు విని అక్కడే నిలబడి మరోసారి “పాప్‌కార్న్‌” అన్నాడు.

ఈసారి తల్లివైపు తిరిగి “అవ్వా! కొనియ్యే … ఒక్కటేనే … మల్లడుగనే” సీటు మీద నిలబడి తల్లిని కుదుపుతున్నాడు కొడుకు.

“వద్దుబిడ్డ. ఇంటికి పోయినంక బుగ్గలేంచిపెడుత” తల్లి సముదాయించింది. కొడుకు వినలేదు. రాగం తీయడం మొదలెట్టినాడు. ముగ్గురునీ చూసి నవ్వుకుంటూ దగ్గరగా వచ్చి నిలబడి “పాప్‌కార్న్‌, గరంగరం” అన్నాడు అమ్ముకునే పిల్లగాడు.

కొడుకు రాగం ఎక్కువయింది. ధర్మయ్యకు కోపమచ్చింది. అమ్ముకునే పిల్లగానివైపు కోపంగా ఇరుగజూసి బుట్టలోంచి ఒక పాకెట్‌ను మునివేళ్ళతో తీసి కొడుక్కు ఇచ్చాడు. అదే చేత్తో అంగి జేబులోంచి రూపాయి బిళ్ళను తీసి పిల్లగాని కిచ్చాడు. బిళ్ళను అటూ ఇటూ తిప్పిచూసి జేబులో వేసుకుంటూ “ఇంకో రూపాయి” అన్నాడు పిల్లగాడు.

“ఏంది? ఈ పొట్లంకు రెండ్రూపాయలా? చారెడులెవ్వూ. అడ్డికి పావుశేరు అమ్మవట్టి” పొట్లంను ఒత్తి చూస్తూ అన్నది దేవవ్వ. తల్లి చేతిలోంచి పొట్లంను గుంజుకుని పండ్లతో చింపాడు కొడుకు.

“రెండ్రూపాయలు కాదు. వట్టిగనే ఇత్తరు.” ఎక్కసంగా అంటూ చేతిని చాపాడు పిల్లగాడు. ధర్మయ్యకు రేషమచ్చింది. అంగిజేబు బనీనుజేబు వెదికి రూపాయి బిళ్ళను ఇస్తూ “నా పెరట్ల మక్కకర్ర మీద ఒక్క చిలుక బుక్కినన్నికాదు” అన్నాడు నవ్వు మొఖంతో. అతడి మాటల్లో ఆత్మాభిమానం వినిపించినా గొంతులో మాత్రం ఏదో నొక్కిపెట్టి వదిలిన బాధ.

ఇంతకు ముందు ఎన్నోసార్లు పాకెట్లను చూశాడు ధర్మయ్య. ఇప్పుడు మాత్రం మనసు దేవినట్టుగా అనిపిస్తుంది.

తనమాంసపు ముక్కలనే కోసి గోలిచ్చి అమ్ముతున్నట్టుగా, బాధగా అసహ్యంగా అనిపిస్తుంది. కొడుకును దగ్గరగా జరుపుకుని భార్యవైపు చూసాడు. ఆమెకూడా పాప్‌కార్న్‌ పాకెట్లనే చూస్తుంది బాధగా.

“చూసినవా? మన చేన్లనే పండిన గింజలు. ఎక్కడెక్కడో తిరిగి మల్లా మననోట్లోకే వచ్చినయి. కాకపోతే పైసలు పెడుతున్నం. గంతే!” భార్యవైపు చూస్తూ అన్నాడు ధర్మయ్య.

“ప్యాలాల మిషిని కొన్నడా?” కిటికీలోంచి బస్టాండ్‌లోకి చూస్తూ అడిగింది దేవవ్వ.

“కొనలేదు. గుత్తకి పట్టుకున్నడట. యాడాది దాటింది. అక్కడ మిగిలిన మక్కలను ఇక్కడికే తెచ్చిండట.” చెప్పాడు ధర్మయ్య. దిగులుగా చూసింది దేవవ్వ. కళ్ళల్లో ఏబాధ కదిలిందో! కరిగి నీరయింది.

భర్త కంట పడకుండా కళ్ళు తుడుచుకుంది. తుడుచుకుంటూ “పిల్లకాయ పంటవేసినోళ్ళను గూడా మనలెక్కనే ఆగంజేత్తడు” అన్నది పొలం యాదికి వచ్చి.

అప్పటికి ఇంకా బస్సు నిండలేదు. ప్లాట్‌పారం మీద నిలబడింది. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. దిగే వాళ్ళు దిగుతున్నారు. ఈగలు ముసురుకున్నట్టు “పల్లీలు” అంటూ “కంకులు” అంటూ “దోసకాయలు” అంటూ అమ్మేటోళ్ళు బస్సుచుట్టూ ముసురుకుంటున్నారు. పోటీ పడుతున్నారు.

ఇద్దరూ సీటు మీద బీరుపోయి కూర్చున్నారు. ఇద్దరిమనుసుల్లో సుడితిరిగే బాధ ఒక్కటే! ఒకరినొకరు అడగాలనుకుని ఇష్టంలేక ఆగిపోతున్నారు. చివరికి తనే బయటపడింది దేవవ్వ.

“ఎట్ల? ఊర్లెకు పోతున్నము గని మనను ఉండనిత్తరా? ఆరునెలల జీతం ముట్టె. ఇప్పుడు ఇయ్యిమంటే యాడనుండి తెస్తం. వచ్చి వారమన్న గడువకపాయె.” భయం భయంగా అన్నది. ఊర్లెకు వెళ్ళాక జరిగే పరిస్థితులను ఊహించుకుంటేనే భయమేస్తుంది ఆమెకు. సగం ఊరు సేటు చేతికిందే ఉంది.

ధర్మయ్యకు రేషమూ కోపమూ రెండూ పొడుచుకచ్చాయి. మొహం బిరుసుకపోయింది. “ఉండనియ్యక సంపుతడా? సంపేదాక పురస్తు. దుకాణంల జీతముండుడు అంటే వచ్చినగనీ పెండ అమ్ముడుకు వచ్చిన్నా? అదీ నా ఎద్దుపెండను నాతోనే అమ్మిత్తడా? వట్టిగకాదు. ఆవుపెండ అని అవద్దమాడి అమ్మాలెనట” బిరుసుగా అన్నాడు.

“ఔ అమ్మాలె. తవ్వెడుకైకిలు ఇచ్చినంక తంగేళ్ళు పీకుమన్నా పీకాలె” కొత్తగొంతు వినబడింది విసురుగా అప్పుడే “నువ్వచ్చిందే కైకిలికి. బిచ్చానికచ్చి అంబిల్లు గరుత్తవా”.

అదివిన్నగొంతే! భార్యాభర్తలిద్దరూ ఉల్కిపడి భయం భయంగా పక్కకు తిరిగి చూసారు. ఎదురుగా లింగయ్య సేటు. బగ్గున మండుతున్నాడు. మొఖం నిండా కోపం. ఇద్దరినీ గుంజుకపోదామా అన్నట్టున్నాడు.

“చెప్పక చెయ్యక బస్సెక్కిండ్రూ. ఇదేనా మునాసం. ఇయ్యంగ కట్టలకు కట్టలు అందుకున్నరు. ఇసొంటోడు ఎందుకచ్చిండు. నడుమల నన్ను పరిషాన్‌ జేత్తండు” గాయికెత్తుకున్నట్టు అన్నాడు. ఇద్దరూ భయపడ్డారు. నోట్లో తడారిపోయింది. ముందుగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు అట్లా వస్తాడని కూడా అనుకోలేదు. చూస్తే కదలనియ్యడని కనిపించకుండానే బస్సెక్కారు. ఎలా పసిగట్టిండో అర్థం కాలేదు. దేవవ్వ భయం భయంగా ముడుచుకుకుని కూర్చుంటే ధర్మయ్యనే అన్నాడు నసిగినట్టు.

“పరిషాన్‌ అయింది నువ్వా నేనా? ఏంపనికి తోలుకచీనవు? ఏంపని జేపిత్తన్నవు. నీకు అమ్ముడుపోయిన్నను కుంటున్నవా? నీతిలేని పని నువ్వు జెయ్యచ్చు. నేను జెయ్య. నాకు అవద్దం రాదు”.

అతడు పూర్తిగా మాట్లాడనే లేదు. అందుకున్నాడు సేటు. “నాకు నీతి లేదు. సరే! నువ్వు నీతి ఉన్న మనిషివే గదా? ఆరునెలలు జీతముంటనని ఆరువెయిలు ముందుగనే అడుక్కున్నవు. నాయి నాకు ఇయ్యి. నీజోలికత్తే పాతచెప్పుతోని కొట్టు” నిలదీసినట్టుగా అన్నాడు దగ్గరగా జరుగుతూ.

బస్సంతా బొబ్బ. అందరూ లేచి నిలబడి చూస్తున్నారు. ఆ జనం గుంపుగా తయారయింది. భార్యాభర్తలిద్దరూ కూర్చున్నారు. ఇద్దరి మధ్యన కొడుకు భయంతో ఒదిగిపోయాడు. సేటు వాళ్ళకు అడుగు దూరంలోనే నిలబడ్డాడు.

“ఇత్త. ఇయ్యకపోతే ఎగవెడుతనా? ఇప్పటికిప్పుడు ఇయ్యమంటే నడుముకు ముడేసుకున్ననా! ఇంటికి పోయినంక ఇత్త.” తనకు తాను ధైర్యం తెచ్చుకుంటూ చుట్టూ బిడియంగా చూస్తూ అన్నాడు ధర్మయ్య.

“ఇత్తవు ఇత్తవు. ఇంటికాడ ముల్లెగట్టి మూలకు దాచినవు. పోంగనే ఇడిసి కట్టగట్టిత్తవు. గట్ల ఇచ్చేటోనివైతే బజార్ల చెప్పుదెబ్బలు ఎందుకు తిన్నవు. అప్పుడు నేను ఆదుకోకపోతే అయ్యగాని ఆట ఏర్పడుతుండె. పాపమని దగ్గరికి దీత్తే నాకిందికే నీళ్ళు దెచ్చినవు. అవన్ని జెప్పకు. ఇత్తవా? ఇంటికత్తవా? ఏదో ఒకటి జెప్పు.” కోపంగా అన్నాడు సేటు. సన్నగా వణుకుతున్నాడు కూడా.

అసలే బక్కపల్చటి మనిషి ధర్మయ్య. సేటేమో కుంభకర్ణుడిలా సీట్ల మధ్య ఇరుక్కుపోయినట్టున్నాడు. అతడి ఆకారం, కోపం, బొబ్బ చుట్టూ చూస్తున్న జనం గుండె దడను పెంచింది. దేవవ్వనైతే అవమానంతో తలెత్తడం లేదు.

“చెప్పు! ఇత్తవా! ఇంటికత్తవా? రెండే ముచ్చట్లు.” సేటు రెట్టించాడు.

చుట్టూ మూగిన జనానికి ఏదో కొద్దికొద్దిగా అర్థమైనట్టుంది. ధర్మయ్యను పారిపోతున్న దొంగను చూసినట్టుగా చూస్తున్నారు. వెనుకనుండి ఎవరో “ఏఁ కొట్లాట. ఏం కొట్లాట. కిందికి దిగుండ్రి. ఎక్కేటోళ్ళను ఎక్కనిత్తలేదు” అన్నారు గట్టిగానే.

సేటు అడుగు కూడా ముందుకు కదలలేదు. తీక్షణంగా ధర్మయ్యనే చూస్తున్నాడు. ధర్మయ్యకు ఏం చెయ్యాలో తోచడం లేదు. కానీ ఏదో ఒకటి చేయాల్సిన అవసరముంది. భార్య వైపు చూసాడు. గుడ్లల్ల నీళ్ళు తిప్పుకుని మొహం మాడ్చుకుంది. తనే ధైర్యం చేసాడు.

“నేను నీ ఇంటికి రాను. మన ఊరికి పోతున్న. ఇంటికి పోయినంక నీపైసలు నీకు లెక్కగట్టి ఇస్త. ఇక్కడ నువ్వు బర్రకు ఇజ్జత్‌ తియ్యకు.” మొండిగానే అన్నాడు గట్టిగా ధర్మయ్య.

సేటు ధర్మయ్య మాటలు వింటూనే, అతడిని అదిలిస్తూనే తమ మధ్య కుదిరిన ఒప్పందం గురించి పక్కవాళ్ళకు చెబుతున్నాడు. వాళ్ళు “అరే నిజమే అట్ల జేసుడు మూనాసమేనా” అంటున్నారు. “జర నోట్లెవట్టి ఊంచుండ్రి. నామీదికే ఎగవడుతుండు” అంటున్నాడు వారితో. వారు ధర్మయ్యను తలోమాట అంటున్నారు.

దేవవ్వ గుండె కలుక్కుమంది. ధర్మయ్య ఇనరానట్టే ఉన్నాడు. “జీతమున్ననని వీడు చెప్పింది చయ్యన్నట. రేపు నాలుగు ఇండ్లు దోసుకరమ్మంటే దోసుకురావాలె గద” అంటున్నాడు తనను తాను బలపరుచుకున్నట్టు.

“ఏయ్‌, చెప్పు. ఇత్తవా! వత్తవా! నన్ను ఒర్రియ్యకు. నిన్ను నమ్ముకుని వెయిల మాలు గుత్తకు పట్టుకచ్చిన. నప్పతుగ బస్సు ఎక్కితే ఎవలు మునుగుతడడనుకున్నవు” సేటు ఎగపోత్తుండు. చెమటలు కక్కుతుండు. మొఖం గండుపిల్లి లెక్కయింది.

గావువట్టే బైండ్లోని లెక్క ఉగ్రం మీదున్నది. కండ్లు ఎర్రగైనయి. అతని రూపం చూసి చాలామంది భయపడ్డరు. దేవవ్వ జడుసుకుంది.

ధర్మయ్యకు భయం కాలేదు. తెగింపు వచ్చింది. సూటిగా చూస్తూ నిలబడి అన్నాడు. “ఐదుపైసలియ్య. నీ దమ్మున్న జాగల చెప్పుకో. ఇట్లనే ఒర్రితె లావట్టి బస్సుకింద ఎత్తేత్త. ఇక్కడిదిక్కడ ఇయ్యమంటే యాడినుండి తెచ్చియ్యాలె”

“పెండ్లాన్ని కుదవెట్టాలె. అంత రోషమున్నోనివి ఎందుకు జీతమున్నవు” సేటు అంటనే ఉన్నాడు. అంతవరకూ మౌనంగా కుమిలిపోయిన దేవవ్వ పక్కుమన్నది . తల్లిని చూసి కొడుకు ఏడుపును అందుకున్నాడు. ధర్మయ్యకు కోపం ఆగలేదు.

“బోషిడికే. నాపెండ్లాంను కుదవెట్టాలెనారా! నీకావురం పీసునెగొడుదు. నీకు పైసమదం బాగుందిరా” అంటు లేచి గల్లను అందుకున్నాడు.

“నన్ను గల్లవడుతావురా. నీతల్లి. నీదమ్మెంత? వొసతెంత?” సేటు చెయ్యెత్తాడు. సీట్లసందుల ఇద్దరూ కలెవడ్డారు. చుట్టూ ఉన్నజనం ఇద్దరినీ నవ్వుతూ చూస్తున్నారు.

డ్రైవర్‌ ఎక్కినట్టున్నాడు. బస్సు చాలయింది. “ఏయ్‌. వాళ్ళిద్దర్ని కిందికి నూకుండ్రి” కండక్టర్‌ అరిచాడు. చుట్టు పక్కలోల్లు ఇద్దరినీ విడదీసారు.

సేటు ఆగకుండా ఎగపోస్తూ తిడుతూనే ఉన్నాడు. ఎవరో అతడిని ముందుకు నెట్టుకపోయారు. ధర్మయ్య ఆయాసంగా సీట్లో కూర్చున్నాడు. దేవవ్వ దించిన తల ఎత్తలేదు. ఎగతడుతుంది.

సేటు బస్సు దిగుతూ దిగుతూ మందినందరిని దులపరిచ్చుకుని రెండడుగులు ముందుకు వచ్చి ఆగి “నువ్వు ఊర్లెకైతె నడువు. నిన్నుగావువట్టి మమ్మాయండుత బిడ్డా. నీకు నిలువ నీడ లేకుంట జేసి ఉప్పగాళ్ళు పుట్టకుంట చెయ్యకపోతే నాపేరు లింగమే కాదు.” చూపుడువేలును ఊపుతూ అంటూ బస్సు దిగిపోయాడు.

ఇద్దరూ చాలా సేపటివరకు తేరుకోలేదు. అందరూ తమనే చూస్తూ నవ్వుతున్నట్టుగా అనిపించింది. చాలా సేపటి వరకూ ఒకరినొకరు చూసుకోలేదు. మాట్లాడుకోలేదు. కిటికీలోంచి బయటకు చూస్తుండిపోయారు. బస్సు స్టేజి స్టేజికి ఆగుతూ సాగిపోతుంది.

“వాడు ఊర్లెకు పోయినంక పంచాది పెట్టిత్తడు. బస్సుకంటె ముందే ఊర్లె చేరుతడు. మనం ఇంటికి చేరకముందే పంచాది బలిత్తడు. నన్నే కొట్టిండని తప్పదీత్తడు. అగ్గెరగాండ్ల ఆరువెయిలు యాడతెత్తాము? ఎట్లనన్న కాలిపోని, ఆరునెలలు ఉందామా మరి? ఇప్పుడు ఉన్నా వద్దంటడు గని” గొంతు పెకిలిచ్చుకుని అన్నది దేవవ్వ.

మొదటినుంచీ సేటును తిట్టిపోత్తనే ఉంది ఆమె. వాని అంటుకు పోవద్దని హెచ్చరిస్తనే ఉంది. పోగూడదనుకుంటూనే ఉచ్చులో చిక్కుకున్నట్టు సేటువద్దకే పోతున్నాడు ధర్మయ్య. పరిస్థితులు అట్లా తయారవుతున్నాయి. చివరకు తనకు తాను అమ్ముడు పోయేవరకు, ఎప్పటికప్పుడు ఇదే ఆఖరుసారి అనుకుంటూ సాలీడు గూళ్ళో చిక్కుకున్నట్టయింది.

“వాడు వద్దనా ఉండ. ఉండుమన్నా ఉండ. ఇయ్యల్ల పెండ అమ్మమన్నడు. రేపు రోత తినుమంటడు. పాపపు ముండకొడుకు.” తెగాయింపుగా అన్నాడు ధర్మయ్య.

ఏదో స్టేజి. బస్సు ఆగి మళ్ళీ కదిలింది. కొడుకు జోగుతుంటే తొడమీద పండుకోబెట్టుకుంది. ఊరు దగ్గరవుతుంటే ఇద్దరిలో భయం ఎక్కువైతనే ఉంది.

“ఎట్ల మరి? మా అన్న దగ్గరికి పోదామా? ఇంతగాకున్నా ఇంతనన్న సదురుతుడు. ఏదన్న పనిజూపిత్తడు” దేవవ్వ అన్నది.

“అన్నలేదు. తమ్ముడులేదు. ఎవ్వడు గాడు. వాల్లే పొక్కగాని పాములెక్క తిరుగుతుండ్రు. ఎకురం మడికట్టు ఉంటె అమ్మెదాక పట్టువట్టె. నాగటిమీది ఎడ్లుంటె అవ్విటినీ కొనె. ఇగేముంది నా దగ్గర. ఏం జేసుకుంటడో చేసుకోని. పాణం తీత్తడేమో తియ్యని.” విరక్తిగా అన్నాడు.

దేవవ్వకు మరోసారి కళ్ళల్ల నీళ్ళు తిరిగినయి. మొదటినుంచి ధర్మయ్య మొండిధైర్యంతో ఉన్నాడు. ఆమెనే ఉండలేకపోతుంది.

పొయ్యిమీది నుంచి మొదలైన గుత్తాధిపత్యం మెల్లెమెల్లెగా చేను మీదికి… మనుషుల మీదికి ఎలా ముసురుకున్నదో ఆలోచిస్తుంది. పొయ్యిల బొగ్గులు, పండిన పంట, చేసిన పిడుకలు కూడా ఎలా అమ్ముడు సరుకయిందో ఆలోచిస్తుంది.

చెరుకుకు గండమాల తలిగి చెరుకురసాన్నంతా పీల్చినట్టు మనుషుల్లో జీవశక్తి కోల్పోవడం ఎప్పుడు ఎక్కడ మొదలయిందో గుర్తుకు తెచ్చుకుంటుంది దేవవ్వ.


నాగటిసాళ్ళల్లో అడుగులు కూరుకుపోతున్నాయి. ఆయిటిమూనంగనే వాన. ఇరువాలు మూడు సాల్లు. మడికట్టు అల్లం లెక్కన పొతమయింది. దేవవ్వ గడ్డిపరుకలేరి కుప్పపోస్తుంటే ధర్మయ్య ఎత్తిపోత్తున్నాడు. భూమి కాకతీరినా వేడి తగ్గలేదు. దుక్కలో కాళ్ళు సుర్రుమంటున్నాయి.

“ఇంకో వారం పదిరోజులు ఆగుదాం తియ్యి. ఎవ్వలు దున్నత లేదు. మనమొక్కలమే మక్క ఏత్తే కుక్కలు నక్కలకు సాలది.” నలేరుతూ అన్నది దేవవ్వ. రోణికార్తి. రోకండ్లు పగిలే ఎండ. తల దిగపార చెమటలు.

“నీకు తెల్వది మొత్తుకోదు. రోణిల మక్కెలేస్తే రోకల బండలోలె కంకులు పెడతయి. ఇప్పుడు ఎంత ముందుగేస్తే అంత నయం. లేటుగా కాలమైతే చెరువు నిండేవరకు మక్కపంట కోతకత్తది.” ధర్మయ్య అన్నాడు.

దేవవ్వకు నిజమే అనిపించింది. ఒకసారి ఇట్లనే తన బలవంతం మీద పెసర అలికింది. వర్షాలు పడి చెరువులు నిండేవరకు పెసరపంట చేతికచ్చింది. కానీ అంతలోకే ఒక అనుమానం. అది మడికట్టుభూమి. వట్టి సౌటకట్టు. రెండువానలు లగాయించి కొడితే ఊటలు పుట్టి కప్పలు గుడ్లు వెడతయి. వరుసగా వారం రోజులు ఎండకొడితే పర్రెలు వాసి చెక్కలు వడ ఎండిపోతది. వానలు ఎక్కవైనా ఎండలు ఎక్కవైనా కష్టమే! ఎట్లా…? అనుకుంది. అదేమాట భర్తతో అన్నది.

“నమ్ముకం తక్క సుట్టానికి సుఖం లేదట. నీకు అన్నీ అనుమానాలే. చేసినోడు చెడిపోతాడే! అటీటు జూసేవరకు తలజుట్టు కత్తది. రేపు కాలమైనా కాకున్నా వడ్లు పండినా పండకున్నా పొట్టమందం మక్కలు పండతయి.” అన్నాడు కుప్పలు ఎత్తుతూ.

కొత్తగా అచ్చుకట్టిన పొలం. అద్దెకు దానికి ఒకమడి చొప్పున చెరువులోలె రెండే మడ్లు. ఎక్కడ గడ్డిపోస లేకుండా చేసారు. మరునాడే సేటు దగ్గర ఇత్తునాలు తెచ్చాడు ధర్మయ్య. భూమిపదన తేలిపోక ముందే ఇత్తనం పడాల.

“నాలుగు రోజులు ఆగుదాం తియ్యి. మల్లాక్క వానపడని. పిరం ఇత్తునాలు. భూమిల పోసినంక ఎండలు మండిపోతే మొలకలు మాడిపోతయి.” మరోసారి చెప్పింది దేవవ్వ అనుమానంగా.

ధర్మయ్య వినలేదు. “వాన పడితే భూమి గరివడుతది. మళ్ళీ రెండు సాల్లు దున్నాలె. ఇప్పటికే ఎడ్లు తినుకుతున్నయి. నోరు లేని పశి. కలకలంటది.” నవ్వుతూ నాగలి కట్టాడు ధర్మయ్య.

ఒడిలో మక్కలు పోసుకుని వెంట నడిచింది దేవవ్వ. పురిసిట్లో గింజలు సాలులో పడుతున్నాయి. గింజగింజనూ చేతివేళ్ళు తడుముతున్నాయి. చంటి పిల్లకు స్నానం చేయించి కాళ్ళు చేతులు తీడి పెయ్యంతా తడిమినట్టు వేళ్ళ సందుల్లో మక్కగింజలు తిరుగుతున్నాయి. చెమటను అద్దుకుంటున్నాయి. సృష్టికార్యంలో కొత్తసృష్టి కొరకు తండ్రి నుంచి తల్లిలోకి రాలిన భీజపు చుక్కల్లా మక్కగింజలు మట్టిపొరల్లోకి కూరుకుపోతున్నాయి.

సాలెనకసాలు. సాలు సాలును కప్పుతుంది. కప్పని సాలును కాలుతో కప్పుతుంది దేవవ్వ.

“ఇత్తులు బలే ఉన్నయి. బిళ్ళలకు బిళ్ళలు. బరువు గూడా బాగానే ఉన్నయి.” సాలెంట నడుస్తూ అన్నది.

“మనమిచ్చిన పైసలు గూడా. రూపాయి తక్కవుంటే తీసుకోలేదు లింగయ్యసేటు.” నవ్వుతూ అన్నాడు ధర్మయ్య.

పైన ఎండ, కింద భూమి పెంకలా కాలుతున్నాయి. అటు భూమిలోంచి ఇటు సరీరాల్లోంచి తేమను బయటకు తియ్యాలని సూర్యుడు మండుతున్నాడు.

చెమటను కొంగుతో తుడుచుకుని బేలగా నవ్వుతూ “ఎండ పాడుగాను. ఏమెండ పాడైంది. కాళ్ళు సుర్రుమంటున్నయి. లేచిన మొలుక లేచినట్టే మాడిపోయేట్టున్నది. మొగులు మీద మచ్చు మైల లేదు.” ఎండమీది కోపంతో ఎండతోనే అన్నట్టుగా తన అనుమానాన్ని మరోసారి బయటపెట్టింది దేవవ్వ. అది గ్రహించి ఎండతో అన్నట్టుగానే అన్నాడు ధర్మయ్య.

“ఎండెనుక వాన. కుండెనుక గూన. మొగులిడిసిన ఎండ. మొగడు లేని ముండ. ఇవన్నీ ఉన్నయేనాయె.” నవ్వుతూనే.

చుట్టూ చెట్టూ చేమా లేని బీడుభూములు. మధ్యన దీక్షగా కదులుతున్న నాగలి. మట్టిపాదాలను ముద్దాడుతూ, పాదాల మట్టేలను ముద్దాడుతూ, నట్టింట్లో రాశులమై మొలుస్తామని మట్టిలో మాయమవుతున్న మక్కగింజలు. ఇది పోశమ్మ గింజ, ఇది మైసమ్మ గింజ, ఎల్లమ్మ గింజ అంటూ దేవతల పేర్లు పెట్టి భయం భయంగానే అయినా నమ్మకంగా జార్విడుస్తుంది దేవవ్వ.

పొద్దుగూకింది. మక్కేసుడయింది. మొగులుగుడ్డు కమ్ముకుంది. అది చూసి ధర్మయ్యకు బుగులు మొదలయింది. దేవవ్వకు దిగులు పట్టుకుంది. అటు ఇత్తనాలెయ్యంగానే ఇటు వానకొడితే భూమి భరకట్టి ఇత్తునం మొలువది.

వాళ్ళ బుగులుతో దిగులుతో పనిలేకుండా రాత్రికి రాత్రే కుండపోత వానకొట్టింది. ఇద్దరూ నెత్తికి చేతులు పెట్టారు. మూడు రోజులు గడిచింది. భూమి కయ్యలు గొట్టింది. పుండుమీద పక్కుగట్టినట్టు దుక్కిమీద మట్టిపొర గడుసువారింది. ఎక్కడా భూమి పొక్కలేదు. మొలుక మొలువలేదు. ఇద్దరి నాడులూ సల్లవడ్డాయి. సేటు దగ్గరికెళ్ళాడు ధర్మయ్య.

“ఆగం అక్కగాదు. కుడుం బుక్కగాదు. ముగులుకే నోరు తెరిచినట్టు అటువానబడ్డదో లేదో ఇటు ఇత్తునమేత్తివి. ఎట్ల మొలుత్తది. ఇత్తునాలు మంచియే! ఇంక నయమైంది. నేను గూడా దున్నిపిచ్చి ఏపిద్దామనుకున్న.” అన్నాడు సేటు మందలిస్తూ.

ధర్మయ్య పొలం పక్కనే పావుబిగెడు శీరుకుంది సేటుకు. గాండ్లోళ్ళది బాకీ కిందికి మలుపుకున్నాడు. నంబరేకు ఇత్తునాలని మల్లా తీసుకపోయి దున్ని అలుకుమని సలహా ఇచ్చాడు. ధర్మయ్య వినలేదు. “పండితే పండె. ఎండితే ఎండే మల్లా ఏసేది లేదు” అన్నాడు.

మట్టిలో రాలిన మక్కగింజల మీద నమ్మకం పోలేదు దేవవ్వకు. ఆనవాళ్ళు వెతుకుతున్నట్టు కెలుకుతూ ఆశగా చూస్తుంది. ధర్మయ్యవైతే ఆశను వదులుకున్నాడు.

వారం దాటింది. యుద్ధరంగం లోంచి పోరాడి కత్తి డాలు పట్టుకుని బయటకు వచ్చిన సైనికుల్లా ఒక్కొక్క మొలుక. భూమిలోనే వంకలు తిరిగి బయటకు వచ్చినయి. ఇచ్చినమాట తప్పకుండా మొలకెత్తిన ప్రతీ మొక్కను చూపులతోనే తడిమి కొంకను అందుకుంది దేవవ్వ. తప్పిపోయిన బిడ్డ ఇంటికే వచ్చినంత సంబూరంగా ఉంది ఆమెకు. మొక్కలు లేని చోట తవ్వి మక్కలేసింది. లేచిన కర్ర చుట్టూ తవ్వింది.

మక్కలేచిన సంగతి వీళ్ళిద్దరికంటే సేటునే ఎక్కువ సంతోషపెట్టింది. “అన్ని కాలాలకు తట్టుకుని అన్నిరకాల భూముల్లో నీళ్ళు ఉన్నా లేకున్నా మొలిచే కొత్తరకం ఇత్తునం ఇది.” అని ప్రచారం చేస్తూ అప్పటికప్పుడు ధరను పెంచాడు. ఇచ్చిన ధర ఎవరికీ చెప్పకూడదని చెప్పడానికి ధర్మయ్య ఇంటికి వచ్చాడు.

దేవవ్వ పొయ్యిముందు కూసుంది. పొయ్యి లంకలా మండుతుంది. చెప్పేది చెప్పినంక సేటు కన్ను మండుతున్న పొయ్యి మీద, కుప్పజేసిన నిప్పుమీద పడింది.

“ఏంటిదే దేవా. అడివినంత పొయ్యినే పెడుతున్నట్టున్నవు. సల్లార్చిన బొగ్గులను ఏం చేత్తవు.” అడిగాడు.

“అంత బూడిదైతది. ఎత్తి అవుతల పారవోత్త.” నవ్వుతూ అన్నది దేవవ్వ.

“నీ ఇగురమిచ్చుకపోను. బొగ్గులను సల్లార్పవు? రేపటినుంచి నీకు రోజుకు ఒక రూపాయి ఇత్త. బొగ్గులను సల్లార్చి సంచిల పొయ్యి.” అన్నాడు. తలూపింది దేవవ్వ. అప్పటికప్పడు ఎట్ల సల్లార్పాలే. ఎట్ల తొడాలే. ఎక్కడ దాయాలేనో చేసి చూపించాడు. కాయకో కూరకో అయితయనుకుంది దేవవ్వ. పొద్దుమాపు బొగ్గులు సల్లార్పి సంచిల పోస్తుంది.

మక్కతో పోటీపడి గడ్డిగాదం లేచింది. ఎండలో ఎండి ఎండలోనే తడిసి పోటీపడి మునుములు పెట్టుకున్నారు. మునిగాళ్ళ మీద దుక్కనంతా తవ్వి గడ్డిని ఏరేసారు. మునుము మునుముకూ పంటను అమ్మి ఏంచేయాలో ముచ్చట పెట్టుకున్నారు. దేవవ్వ పాత బాకీలు తీసెయ్యాలంది. ధర్మయ్య ఒప్పుకోలేదు. పుస్తెలతాడు కొనాల్సిందే అన్నాడు.

“కాలం ఇప్పుడైతే పునాసకాలమే ఐతుంది. కాని ముందట మురిపిచ్చి ఎనుక ఏడిపిచ్చినట్టు ఆఖరికి ఏం జేత్తదో! అసలే మక్కకు మగకు పగ. అయితే జాకేత్తది లేకుంటే ఎండగడుతది.” బెంగగా అంది దేవవ్వ.

“ఏమన్నగాని. నశివనారాయణ. రెక్కలిరుగ కట్టం జేత్తున్నం. ముంచితె మునుగుతం. లేకుంటె పైకివత్తం.” ధర్మయ్య అన్నాడు.

రెండు వారాలు గడిచాయి. మక్క మోకాలు ఎత్తయింది. ఎండకు ఎండ. సానుపు తడుపువాన. మక్కకు తగిన కాలం. చుట్టు పక్కలోళ్ళు పునాసకాలమే అని తెలుసుకుని మక్కలు వేసే లోపే ధర్మయ్య మక్క దున్నుకానికచ్చింది.

“పండుడుకో ఎండుడుకో గాని నీమక్క మర్రనిత్తలేదురా! ఒక్కొక్క కర్ర మోకాలు దొడ్డుంది. ఈ పంటకు నీదరిద్రం పోతది. రేటు కూడా బాగానే ఉంది.” ఒకనాడు ఇంటికి వచ్చి అన్నాడు సేటు. అప్పుడప్పుడూ బొగ్గులసంచి చూసి పోతున్నాడు.

“మరి నీపావుశీరుకల మక్కెయ్యవా సేటూ…” అడిగాడు ధర్మయ్య.

“గా దోతిబట్టంత శీరుకల ఏమెయ్యాలెరా! మీలెక్క ఎకురాల భూమి ఉందా! ఎక్కడన్న కాల్చుక తినడానికి ఇయ్యరా మీరు” అంటూ పొయ్యి దిక్కు చూసాడు సేటు.

అన్నం కుతకుత ఉడుకుతుంది. నిప్పులు పొయ్యిలెనె ఉన్నాయి. సేటు కండ్లు నిప్పులయ్యాయి.

“ఏమాయెనే దేవా. మిమ్ముల్ని నమ్మి రోజు రూపాయి ఇత్తున్న. తట్టెడు బొగ్గులన్న జమచెయ్యలేదు. ఇట్ల జేసినంక యాడైతయి.” అంటూ చెంబుతో నీళ్ళందుకుని పొయ్యిల పోసాడు. సుయ్యిమని పొయ్యి సల్లారింది. నీళ్ళూ మడుగు గట్టినయి. పొయ్యిమీద అన్నం నామునాలు వడ్డది. పొయ్యిల బూడిది అన్నంల వడ్డది.

దేవవ్వ నోరెత్తలేదు. ధర్మయ్య గూడా నోరెత్తలేదు. బొగ్గులపేరుజెప్పి రోజు ఎనిమిది బీడీల కాతా పెట్టుకున్నాడు.

“రూపాయి ఏంది? రోజు ఎనిమిది బీడీలు తీసుకపో. బయటకూడా కొనుడే గదా!” అని సేటే ధర్మయ్యతో ఖాతా పెట్టించాడు. ఆరోజు నుండి ఎన్నడూ మరిచినట్టు ఉండలేదు దేవవ్వ. పొయ్యి, పొయ్యిల అగ్గి తనది కాదని తెలిసినాక ఒక కొత్త బావన కలిగింది ఆమెకు. అగ్గినీ బొగ్గునూ తక్కట్లపెట్టి జోకినట్టు పొయ్యిమొత్తం సల్లారేదాక వేరేపని చేసేది కాదు.

మక్క దున్నకమయింది. వేర్లు తెగి వాడిపోయేలా దున్నాడు ధర్మయ్య. ఆడుకుంటున్న బిడ్డను చెంపపిండి, ఏడిపించి ఎత్తుకుని లాలించిన తల్లిలా ఇరిగిన కర్రలను పెరిగిపోయిన కర్రలను ఎత్తిపట్టి చుట్టూ మన్ను కప్పింది దేవవ్వ. యాకాషి ముసుర్లకు కనుపులకాడ ఏర్లుపుట్టి మొద్దులోలె కర్రలు లేచినయి. దానితో గడ్డి పాయిలికూర కూడా లేచింది.

“తలజుట్టు యాళ్ళ. గడ్డిపీకాలె. మందు వెయ్యాలె. లేకుంటే కర్ర బలువది.” భర్తకు చెప్పింది దేవవ్వ. ఆమె మనుసునిండా మక్కకర్రలే! కర్రల చుట్టూ ఎన్నో ఆశలు గూడ కట్టుకున్నాయి.

“ఈ ముసుర్ల మన ఇద్దరితో అయ్యేపనిగాదు. కైకిళ్ళు పెడుదాం” అన్నాడు ధర్మయ్య.

చేతుల ఒక్కపైస లేదు. తిరిగితిరిగి సేటు దగ్గరికే పోయాడు. దేవవ్వ పెయ్యి మీది నగలు పంటకొక్కటి మాయమైనంక కుదవెడుదామన్నా గురిజెత్తు మాలు లేదు.

సేటు అప్పు ఇయ్యననలేదు గానీ యూరియా బస్తాలు తన దగ్గర కొంటేనే అప్పు ఇస్తానన్నాడు. అవికూడా ఉద్దెరనే కాబట్టి సరేనన్నాడు ధర్మయ్య. మక్కపంట మీద ఖాతా తెరిచాడు సేటు.

వారంలో గడ్డిపీకుడయింది. మందేసుడయింది. కర్రలను చూస్తుంటే ఇద్దరికీ కడుపు నిండుతుంది. ఏదో ఒకపని ఓదిచ్చుకుని పొద్దుమపు మక్కలోనే ఉంటున్నారు. కర్రకర్రనూ తడిమి చూస్తున్నారు. తలజుట్టు మొలువగానే ఇరిసి కుప్పవేసారు. మల్లోసారి మొలిచిన గడ్డిని కైకిల్లు పెట్టి పీకించారు.

వెన్నులోంచి మక్కపేసులు ఎల్లినయి. మరోసారి దుక్కిమసాల అందుకున్నారు. కర్రకర్రకూ తమ కథను చెబుతూ వెతను చెబుతూ వంగి మొదట్లో మసాలా వేత్తున్నారు. ఎన్నుదగ్గరి పీసును బూరును తడుముతున్నారు. చెట్టులెక్కెన మక్క పెరిగింది. సేటు దగ్గర ఖాత పెరిగింది. మనసులో ధైర్యం కూడా పెరిగింది. పంట పండుతదన్న ఆశ కూడా పెరిగింది.

చుట్టూమక్కలు మోకాలెత్తు కాలేదు.ధర్మయ్య మక్క కైలువారి కర్రకు రెండేసి మూరెడు పేసులు ఎల్లినయి. “అబ్బ ధర్మయ్యది మక్కనే మక్క” అన్నరు. కాకులు చిలుకలు చేనుచుట్టూ సుట్టుకున్నయి. మక్కల రెండంతురాల మంచె వేసి జిట్టిబొమ్మను బెదురు పెట్టాడు ధర్మయ్య. అక్కడనే పొద్దుగూకి అక్కడనే తెల్లారుతుంది.

వానలు బందయి మెల్లెమెల్లెగ కాలం గుంజుకున్నది. ఎండలు మండుతున్నయి. కర్రలు బీరిపోయినయి. దానికితోడు పగటిపూట చిలుకలు, కాకులు. రాత్రిపూట నక్కలూ, అడివిపందులు. నిద్రలేదు. ఆగారంలేదు. అయినా రోజు గంపెడు పేసుల్ని ఏరిపోత్తుంది దేవవ్వ.

“ఎట్ల? కాలంల మన్నువడ. ఎంతపనిజేసే! నప్పుతుగ బొండిగె ఇరిసినట్టుజేసె. నీళ్ళులెవ్వని ఏడుద్దామా నిద్రలేదని ఏడుద్దామా? చిలుకలు పాడుగాను కర్రలకే యాల్లాడతున్నయి. పందులకు గత్తర్రాను. కావలిగాత్తనే ఉంటిమి. యానంగ వత్తన్నయో! పొట్టు పొట్టు జేత్తున్నయి. చేను ఒంటిదయింది. తరువాయికి నాలుగుంటే ఇట్లగాకపోవును.” ఏడుస్తూ అన్నది దేవవ్వ.

వాన కొరకు “ఎట్ల, ఎట్ల” అని ఇద్దరూ తొక్కులాడుతుండంగ సేటు శీరుకల బోరుబండి వచ్చి ఆగింది. తెల్లారే సరికల్లా బోరు, మోటారు, టెంపరరీ కరెంటు కనెక్షన్‌ అన్నీ పూర్తయ్యాయి. పావుశీరుకలో సేటు బోరును ఎందుకేసిండో అర్థం కాకపోయినా ఏదో ఆశ మొదలయింది ధర్మయ్యకు.

మరునాడు రెండుతట్టల బొగ్గులైతే జమచేసుకుని సేటు ఇంటికి నడిచాడు ధర్మన్న. సేటు ముందుగా నీళ్ళు ఇయ్యనే ఇయ్య నన్నాడు. తరువాత బలవంతాన ఒప్పుకుంటున్నట్టు చెరిసగం పంట అన్నాడు. ధర్మయ్య గుండెల రాయివడ్డట్టయింది. మనాదితో ఇంటికచ్చాడు. భార్యతో విషయం చెప్పాడు.

మరో రెండ్రోజులయింది. వాన జాడలేదు. మక్క తెట్టెగీలేసింది. కనపడ్డోల్లంతా ఏదో ఒకటి అంటున్నారు. చుట్టుపక్కల మక్కచేనులున్నోళ్ళు సేటుతో ఏదో ఒప్పందం చేసుకుని నీళ్ళను తీసుకుంటున్నారు. క్షణం తీరిక లేకుండా బోరుకు గిరాకీ పెరిగింది.

“ఏంజేద్దాం! నొట్లొకచ్చిన మక్క ఎండిపోవట్టె. వట్టిగ ఎండిపోతే ఏమత్తది. చెరిసగమైతే చెరిసగమే గాని. సగమన్నా మిగులుతయి. నీళ్ళు ఇయ్యమను.” మక్కను సూడలేక తెగాయించి అన్నది దేవవ్వ. అప్పటికి అదే నిర్ణయానికి వచ్చాడు ధర్మయ్య.

సేటు వాటం చూసి బోరును ఎందుకు వేసాడో అర్థమైంది.

భార్యభర్తల్ని ఇద్దరినీ కూర్చోబెట్టాడు సేటు. ఇద్దరు ముగ్గురు రైతుల్ని కూడా జమచేసాడు.

“ఇగో, ధర్మా! నాకు ఎర్రసం కొత్త. చేను మీదే అనుకోండ్రి. ఇప్పుడు ఎట్ల కావలి గాసిండ్రో అయిపోయేదాక అట్లనే కావలికాయాలె. నేను సగమే పొత్తు. నేనెందుక పోతా. అంటే నడువది. ఏదో నీగోస జూడలేక ఇస్తున్నగనీ నీ పంటనే రావాలె. నేనే బతుకాలె అని కాదు. అట్ల ఒప్పుకుంటేనే సరి. ఇంతవరుదాక అయిన లాగోడి ఖర్చు నువ్వే కట్టుకోవాలె” అన్నాడు.

చేసేదేంలేక ఇద్దరూ తలూపారు. ఒప్పందం ఒకటికి పదిసార్లు చెప్పాడు సేటు. గవాయిలను కూడా పెట్టాడు. నీళ్ళను ఇడిసి పారిచ్చుకోమన్నాడు.

రెండు తడులు తిరిగినయి. మక్కమల్లా మొదటిలెక్కయింది. సోంటలోలె కంకులు. జొన్నిత్తులేసినయి. అడివిపందులు నక్కలు ఎక్కువైనయి. చిలుకలు కాకులు వశమైతలెవ్వు. పొలమంతా తాళ్ళుకట్టి ఊపుతున్నారు. డబ్బను అందుకుని “లే… లే… ఖడే .. ఖడే..” అంటూ కాకుల్ని చిలుకల్ని తరుముతుంది దేవవ్వ.

కర్రలన్నీ తనయనుకున్నాక కలిగిన భావన, ఇప్పుడు సగం కర్రలు తనయికావని తెలిసినాక కలిగిన భావన పొయ్యితో కలుపుకుంటే ఏదో దూరపుతనం ఏర్పడుతున్నట్టనిపించింది దేవవ్వకు. ఇంట్లో పొయ్యిని చూసినా, అడవిలో పొలంను చూసినా ఏదో అంటరాని వస్తువును చూసినట్టుగానే అనిపిస్తుంది. పొలంలో తిరుగుతుంటే తనకు తాను ఒంటరిగా తెలియని జాగలో తిరుగుతున్నట్టనిపించింది.

ఈబావన రోజురోజుకు ఎక్కవైతుంటే కావలికాయడం మానేసింది ఒకనాడు దేవవ్వ. అదేరోజు సేటు మక్కలోకి వచ్చాడు. కాకులు చిలుకలు వాలడం చూసి నలుగురినీ పిలిచి చూపించాడు. ఇంటికిపోయి లొల్లిలొల్లి జేసాడు. రెండు మూడు సార్లు రాత్రి పూట గూడా కావలిపోతుండా లేడా చూసాడు. ఇంట్లో పడుకుంటే అదిలిచ్చాడు.

కంకులు ముదిరినయి. బుక్కే తట్టయినయి. భయానికి రాత్రి పగలు కావలి కాస్తున్నారు భార్యాభర్తలు. రాత్రిపూట ఒకనాడు ఒడ్డుమీది నుంచి జారిపడ్డడు ధర్మయ్య. దవాఖాండ్లకు పైసలు గావాలె. అడుగకముందే అప్పు ఇచ్చాడు సేటు. దెబ్బ చిన్నదే కాబట్టి రెండు మూడు రోజుల్లోనే కోలుకున్నాడు.

ధర్మయ్యను ఒకనాడు పిలిపిచ్చి లెక్కలు జూసాడు సేటు. కైకిళ్ళ పైసలు, మందు బస్తాలు, దవాఖాన పైసలు, అప్పుడప్పుడు చేపోయి పైసలు, ఇంట్లకు చిల్లరఖాతా — మొత్తం మూడు వెయిల బాకీ జమయింది. పద్దు పద్దుకూ పేరుజెప్పి ధర్మయ్యతోనే జమచేయించాడు.

“అరే ధర్మా, మన చేను మంచిగ పండితే ఎన్నిమక్కలైతవో చెప్పరా” లెక్క తర్వాత అడిగాడు సేటు. పక్కన ఇద్దరు ముగ్గురు రైతుల్ని కూడా కూసోబెట్టుకున్నాడు. అట్లా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు ధర్మయ్యకు.

“పన్నెండు పదమూడు కింటళ్ళు అయితయి.” లెక్కగట్టి చెప్పాడు ధర్మయ్య.

“పదుమూడు అనుకుందాం. నువ్వు చెప్పిందే ఇంటున్న. నీవంతుకు ఎన్ని కింటళ్ళు వత్తయిరా” అడిగాడు.

అప్పటిగ్గాని ధర్మయ్యకు పూర్తివిషయమేంటో అర్థం కాలేదు. బాధతో గుండె బరువెక్కింది.

“ఆరున్నర” అన్నాడు గొంతును పెకిలించి.

“ఇప్పుడు కింటలుకు నాలుగుయాభయే నడుత్తంది. గరీబుగానివి. ఐదువందల లెక్క కడుదాం. ఆరుకింటాళ్ళ నరకు ఎంతయితయి.” సేటు అడిగాడు.

ధర్మయ్య సమాధానం చెప్పలేదు. నేలగీతలు గీస్తూ బీరిపోయాడు. పక్కనున్న రైతు మాత్రం టక్కన లెక్కగట్టి “మూడు వెయిల రెండువందల యాభై.. ఇంకేంది.. మంచిగనే కట్టినవు.” అన్నాడు.

“వారీ ధర్మా, చెరిసగం పంట నువ్వు ఒప్పుకున్నదే! బాకీ నువ్వు తీసుకున్నదే! ఇండ్ల అవద్దం ఉంటె చెప్పు. రేపు కోత కోపియ్యాలె. మక్కలు ఒలిపియ్యాలె. నాలుగైదు వందల కైకిళ్ళు అయితయి. అందులో సగం నువ్వు పెట్టుకోవల్సిందే. కానీ నేను అడుగుతలేదు. మూడువెయిలు నాకు బాకీ ఉన్నవు. ఎవ్వీటికవ్వి తేరిపోంగ రెండువందల యాభై తేలిన. ఇగో తీసుకో…” మూడు నోట్లను అందించాడు సేటు.

ధర్మయ్యలో ఏభావమూ లేదు. దించిన తల ఎత్తలేదు. లెక్క సరిగానే ఉన్నదనిపిస్తుంది. ఎక్కడో మోసం జరిగినట్టనిపిస్తుంది. నాలికసందుల ముల్లు ఇరికినట్టు ఎటు మాట్టాడదామన్నా సందు దొరుకుతలేదు. నోట్లను అందుకుని ఇంటికి వచ్చాడు. లెక్కనంతా దేవవ్వకు చెప్పి మలుసుకపన్నాడు. దేవవ్వ మనసు కలికలయింది. అట్లనే మలుసుక పన్నది. కన్నీళ్ళతో మెత్తనానింది. సగమే పోయిందనుకున్న మక్కచేను ఇప్పుడు మొత్తంపోయింది.

మరునాడు పొద్దుగూకేముందు ఇంటికి వచ్చాడు సేటు. భార్యాభర్తలిద్దరూ మాట్లాడలేదు. కావలి పోలేదని అడుగుతాడేమో నాలుగు దులుపుదామనుకుంది దేవవ్వ. కాని అట్లా అడగలేదు సేటు.

“రేపు ఒక కైకిలి మనిషి గావాలె. నలుపై రూపాయలిత్త. కంకులు కాల్చి అమ్మాలె. రమ్మంటె మత్తుగత్తరు. మీరు రానంటే వేరోల్లకు చెబుదామనుకుంటున్న” అన్నాడు పొయ్యిదిక్కు బొగ్గులసంచి దిక్కు చూస్తూ.

ఎవరూ బదులు చెప్పలేదు. సేటు బొగ్గులసంచితో వెళ్ళిపోయాడు. చాలాసేపటికి “వట్టిగ ఉండి ఏంజేత్తవుపో” అన్నది దేవవ్వ.

“నువ్వేపో” అన్నాడు ధర్మయ్య. నువ్వంటే నువ్వనుకుని చివరికి ధర్మయ్యనే వెళ్ళాలని నిశ్చయించుకుని పోయి చెప్పివచ్చాడు. ఆగమైన పిల్లికూనల్లా ఇద్దరూ అటూ ఇటూ తిరుగుతున్నారు.

ఇద్దరికీ రోజు ఉండే ఆగం లేదు. చేను ఏమైపాయెనో అన్న రందిలేదు. కర్రలమీద ప్రేమలేదు. తెల్లారంగనే సేటుతో మక్కలకు పోయాడు. మక్కను చూస్తుంటే తుపాకిగొట్టాలను చూస్తున్నంత భయమేసింది. సేటు ఒడ్డుమీద కూసుంటే సంచినిండా కంకులు ఇరిసాడు. భూమి తనదే. కష్టం తనదే. పంట మాత్రం తనది కాదు. ఏడుపచ్చింది.

తట్టెడు బొగ్గులు. సంచెడు కంకులు. మూడుతొవ్వలకాడ కూసున్నాడు ధర్మయ్య. చిట్టచిట్ట ఏగుతున్న కంకులు పట్టపట్ట అమ్ముడుపోతున్నాయి. కంకుల్ని లెక్కజేసి ఎంతెంతకు అమ్మాలో ముందుగల్లనే చెక్కజెప్పాడు సేటు. పైస ఫరకు రాకుండా కాల్చి అమ్ముతున్నాడు ధర్మయ్య. పదిపైసల ధర తగ్గిస్తలేడు.

బజారు ముంగటనే తన ఇల్లు. కొడుకు కంకులని ఏడుత్తున్నాడు. తల్లి కొడుతుంది. ఆ కంకులు బుక్కేబదులు ఇసంతిని సావు అంటుంది. తల్లిని ఇడిపిచ్చుకుని కొడుకు బయటకు ఉరికత్తుండు. ఉరికచ్చిన కొడుకును లోపలికి గుంజుకపోయి తలుపేసుకుంటుంది దేవవ్వ. కాలుస్తున్న కంకుల వైపు కన్నెత్తి చూస్తలేదు.

ధర్మయ్యకు కాటికాపరికి అమ్ముడుపోయిన హరిశ్చంద్రమారాజు యాదికచ్చిండు. కాలే బొగ్గు నాది. కాల్చే కంకె నాది. అమ్మేది నేను. సేటు ఎక్కడ సొచ్చిండు..? ఎక్కడ ఎల్లిండు. ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే మంట పుట్టుకచ్చింది. అర్థరాత్రి పూట దొంగతనంగా పదిరునై కంకుల్ని ఇరుసుకుని ఇంటికిపోయాడు అదేరోజు. కంకివైపు కాదుగదా. దానివాసన కూడా చూడలేదు దేవవ్వ. పాములబుట్టను చూసినట్టుగా చూసి దరిదాపులకు పోలేదు.

ధర్మయ్యనే దొంగతనంగా కాల్చుకుని కొడుక్కి ఇచ్చి తను బుక్కాడు. అవి బుక్కాలంటే కూడా భయం. కొడుకును అర్రల తోలి బుక్కినంకగాని బయటకు పంపలేదు. కంకులు అయిపోయేదాకా దడదడ తగ్గలేదు.

సేటు మక్కచేన్లో దుకాణమే పెట్టాడు. పచ్చికంకులను కాల్చి అమ్మడమే కాదు. సిరిసిల్ల కామరెడ్డి మార్కెట్లకు సరఫరా చేసాడు. కల్లు దుకాణం ముందు, మార్కెట్లో పొద్దుమాపు కంకులతేటు పెట్టించాడు.

ధర్మయ్యకు వారం కూలీ దొరికింది. చూస్తుండగానే మక్క ఖాళీ అయినది. పచ్చికంకులు అడ్డికి పావుశేరు అమ్ముడుపోయినయి.

ఆడికొకటి ఈడికొకటి ముదిరిన కంకులుంటే బూరుదీసి ఒలిపిచ్చి పాప్‌ కార్న్‌ మిషినికి పంపించాడు సేటు.

ఎడ్లకు గడ్డిలేదు. కంకులన్నీ అయిపోయినాక సొప్ప కోసుకుందామని సేటును కలిసాడు ధర్మయ్య.

“సొప్పల నాది సగం ఉండదారా. నాసగం నాకియ్యి” అన్నాడు సేటు కానూన్‌గా.

“అది గోజలు తినేది. నాకు రెండు ఎడ్లున్నయని అడుగుతున్న. నువ్వేం చేసుకుంటవు?” అడిగాడు ధర్మయ్య.

“తీసుకుంటె తీసుకోగని. ఆ ఎడ్లపెండ ఇయ్యి” అన్నాడు సేటు.

ధర్మయ్యకు కోపం ఆగలేదు. “పెండ ఎందుకు? తింటవా?” అన్నాడు బిరుసుగా సేటు పకపక నవ్వి “పిడుకలురా, పిడుకలు చేసుకుంటం” అన్నాడు. పెండనే కదా అని ధర్మయ్య సరేనన్నాడు.

రోజూ పొద్దున ఎడ్లపాకలకచ్చి సానుపుకు మిగిలియ్యకుంట తీసుకపోయేవాడు. ఎన్నడైనా తట్టకు తక్కువైతే మీరే తీసుకున్నరని లొల్లిజేసేవాడు. పొయ్యిమీదినుంచి పంట మీదికి, పంట మీది నుంచి పెండ మీదికి మారింది సేటు చూపు. ఒకరోజు పొలంలో మళ్ళీ పల్లిపంట వేసుకొమ్మని సలహా ఇచ్చాడు సేటు. ధర్మయ్య వినలేదు.

“ఏం పనిజెయ్యక ఎట్లబతుకుతవురా. పల్లీ ఏసుకో. మంచి పంటస్తది” అన్నాడు సేటు సముదాయిస్తూ.

“నాయిష్టం. గోటీలాడుకుంట. నీకెందుకు?” ధర్మయ్య ఎక్కసంగా అన్నాడు. సేటు నవ్వుకున్నాడు.

మరునాడే పాతబాకీలోళ్ళు ధర్మయ్యను ఒత్తిడి చేసారు. కాదు కక్కు సంబాకీ కట్టాలన్నారు. వాళ్ళ వెనుక సేటు ఉన్నాడన్న నిజం తెలిసిపోయింది ధర్మయ్యకు. పొలంను వాళ్ళకే కుదువ పెట్టాడు. ఎడ్లను మాత్రం అంగడి కొట్టాడు. “అరే ఎడ్లను ఎట్టమ్ముతవు. మనపెండ పొత్తు లేదా?” అంగట్లకు ఎదురచ్చి యాదిజేసాడు సేటు.

“అయితే నువ్వే కొను. బజారు ధర” చెప్పాడు ధర్మయ్య.

ఎడ్లను కొని పొలం రైను పెట్టుకున్నోళ్ళకు ఇచ్చాడు సేటు. మరునాడే పల్లీ ఇత్తునం పడింది ధర్మయ్య పొలంలో.

“మనల్ని ఇడిసిండు. వాళ్ళను పట్టిండు. రక్తం తాగుతడు పిచాచిముండకొడుకు. వాని మొదలార” దేవవ్వ సపెనపెట్టి సోకం పెట్టింది. ధర్మయ్యకు కూడా ఏడుపచ్చింది. దొంగతనంగా వెళ్ళి పొలాన్ని చూసివచ్చాడు.

అన్నీ ఉన్నయె! తన చేతుల మీదినుండి జరిగినయే! ఎక్కడా మోసం జరుగలేదు. కానీ ఎక్కడో ఏదో జరిగింది. ఒక్కొక్కటీ తననుండి దూరమైనవి. తను మెల్లెమెల్లెగా ఆక్రమించబడ్డాడు. ఎట్లా..? అన్న ఆలోచనల్లో పడ్డాడు. ఇక్కడ బతుకుదెరువు లేదు. ఎటన్న పోవాలె అనుకున్నంతలనె మల్లా సేటునుండి పిలుపు.

వద్దనుకుంటూనే వెళ్ళాడు ధర్మయ్య. ఇంట్లోకి అడుగుపెడుతుంటే సాలెగూడు యాదికచ్చింది.

“వారీ ధర్మా, నీపెండ్లాం అందరితోని సేటు మమ్మల్ని ముంచిండు అంటుందట. ఏం ముంచినమురా? నీదేమన్న గుంజుక తిన్నమా?” బీడీకట్ట అగ్గిపెట్టె అందిస్తూ అన్నాడు సేటు. వద్దనుకున్నా మనుసు బీడీపైకి గుంజింది. కట్టను అందుకుని మౌనంగా బీడీ ముట్టించాడు.

“కామరెడ్డిల మాకు దుకాణముంది. దుకాండ్ల పనుంటది. నెలకు వెయ్యిరూపాయలిత్త. ఆరునెల్ల జీతం ముందుగల్లనే ఇత్త. వస్తనంటె జెప్పు. అక్కడ చెప్పినపని జెయ్యాలె మరి.” అన్నాడు.

ధర్మయ్యకు మంచిగనే అనిపించింది. ఇప్పుడే గాదు. ఎప్పుడైనా సేటు ముచ్చటజెప్పుతుంటే న్యాయమే అనిపిస్తది. చివరికి ఏదో కిరకాట్కముంటది. ఇందులోగూడా ఏదన్న మోసముందా అని ఆలోచించాడు. ధర్మయ్య మౌనంగా ఉండటం చూసి “ఇప్పుడు గాకపోతే రేపు జెప్పు. ఇంట్లగూడా అరుసుకో. ఎనుకశీరి ఇట్లనా అట్లనా అంటే నడువది” అన్నాడు సేటు ఖచ్చితంగా.

ఇంటికివచ్చి భార్యతో చెప్పాడు ధర్మయ్య. ఆరునెలల జీతం అడ్వాన్సుగా ఎందుకిస్తున్నాడో అర్థంకాలేదు.

“వానికంట్ల మన్నువాడ. ఆఖరికి మనం మిగిలినమేమో. అట్లగూడా కొంటనన్నడా? బాగా మండుతుందని పొయ్యినిగొన్నడు. మంచిగ పండుతుందని పంటనుగొన్నడు. ఇంటిముంగట పచ్చగుందని పెండగొన్నడు. ఇప్పుడు నిన్నుగొంటడు. రేపు నన్నుకొంటడు” పక్కున పలిగింది దేవవ్వ.

భార్యను సముదాయించి ఆరువెయిలు తీసుకున్నాడు ధర్మయ్య. పాకలాంటి ఇంటిగూనను ఉరువకుంటా సదిరిచ్చాడు. ఆరునెలల గాసం కొనిపెట్టాడు. చిల్లరఖర్చులకు భార్యకు కొంత ఇచ్చాడు. అక్కడక్కడ చేతిబదల్లుంటే తీర్చేసాడు. వారానికొకసారి వచ్చి చూసిపోతానని భార్యకు చెప్పి సేటుతో కామారెడ్డి బస్సు ఎక్కాడు.

వారం రోజులు వట్టిగనే ఉన్నాడు. తెల్లారితే డ్యూటీ మీదికి ఎక్కుడు. ముంగట పిడుకల రాశి ఉంది. అది తన ఎడ్లపెండనే అని తెలుసు ధర్మయ్యకు. ఏంజెయ్యాలో ముందుగా అర్థం కాలేదు. చిన్నరేకుల షెడ్డు ఉంది. ముంగట బ్యానరు ఉంది.

“ఏంలేదురా. ఈ పిడుకల్ని నీళ్ళతో తడిజేసి పెండజెయ్యాలె. ఇప్పుడు కార్తీకనోములున్నయి. కోటికుంకుమార్చన పండుగుంది. నెల్లాల్ల సీజను. ఇక్కడ ఆవుపెండ దొరుకది. దీనినే ఆవుపెండ అని నువ్వు అమ్మాలె. ఈపని మాకొడుకో మనుమడో జేత్తుండె. వాళ్ళు రైతుల్లెక్క ఉండరుగదా. వాళ్ళ మాటలు జనం నమ్మరు. నువ్వయితే ఇది నాదొడ్లెపెండెనే అని చెప్పచ్చు.” సేటు వివరంగా చెప్పాడు.

ధర్మయ్య తల తిరిగిపోయింది. “చివరికి వీడు నారైతుతనాన్ని కూడా అమ్మకానికి పెట్టాడే” అన్న విషయం జీర్ణించుకోలేక పోయాడు. ఆరునెలల జీతం అడ్వాన్సుగా ఎందుకు ఇచ్చాడో అర్థమయిందిప్పుడు. తనను గుత్తకు కొని ఆరునెలలు నోరుమూయించి ఇష్టమున్న పని చేయించాలనుకున్నాడు.

“నీకు నీతి లేకపోవచ్చు. నాకుంది. ఎండిన పిడుకల్ని ఆవుపెండని అమ్మలేను. అవద్దమాడలేను. ఒకలను మోసం జెయ్యలేను.” ధర్మయ్య అన్నాడు ఖచ్చితంగా.

“నువ్వు నామనిషివి. ముందుగల్లనే చెప్పిన. అప్పుడు సై అన్నవు. ఇప్పుడు కిర్‌కిర్‌ వెడుతున్నవు.” అన్నాడు బెదిరిస్తూ సేటు.

వారం దాటినా రాని భర్తను చూడడానికి అదేరోజు కామారెడ్డి వచ్చింది దేవవ్వ కొడుకుతో. ధర్మయ్య భార్యకు విషయమంతా చెప్పాడు. చెప్పాచెయ్యకుండ ఇద్దరూ బస్సు ఎక్కారు.


బస్సు ఆగింది. కుదుపుకు ఇద్దరూ ఉలిక్కిపడి చూసారు. తమ ఊరే! ఎప్పుడు ఎక్కడ దిగిపోయారో కాని, బస్సు పూర్తిగా ఖాళీ అయింది.

కొడుకును భుజాన వేసుకుని కిందికి దిగాడు ధర్మయ్య. వెంట దేవవ్వ దిగింది. చీపురునెత్తి. ఉబ్బినకండ్లు. ఏండ్లకొద్ది జరమచ్చి పన్నట్టయింది. ఎక్కడానికి చాలామందే ఉన్నారు. కిందికి దిగుతుంటే గుండెల దప్పులేగినయి.

“అగో, పనిదొంగ ధర్మడు రానేవచ్చిండురా” మందిలోంచి ఎవరో అన్నారు.

“వీడు యాడ పోగువొయ్యడు. రేపు ఆరువెయిలు ఎట్లగడుతడో” ఇంకెవరో.

“ఒక్క ఆరువెయిలేనా? చెప్పుదెబ్బలు. దండుగు, జురుమాన లేదు.” జనంలోంచి మాటలు.

“ఎంత కావురం గాకపోతే అన్నం బెట్టినోనికి సున్నం బెడతాడురా. సేటునే కొట్టిండట.”

ధర్మయ్య ఎటూ చూడలేదు. మందిని పాపుకుంటూ విననట్టే బయటకు వచ్చి ఇంటివైపు నడిచాడు. విషయం తనకంటే ముందే ఊరు చేరుతుందని ఊహించినదే.

తొవ్వపొంట పోతుంటే నలుగురు నాలుగు రకాల మాటలు. భార్యాభర్తలిద్దరూ పులుకాశులోలె మొకం చూసుకున్నరు. దొంగతనం చేసినట్టు భయం భయంగా ఇల్లు చేరుకున్నారు.

దేవవ్వకు ఇప్పుడు భర్త ఎక్కడ బెంగటిల్లి మనుసు సెంచరిల్లుతడో అని కొత్తభయం మొదలయింది. అతడిని మాటల్లోకి దింపడానికి ప్రయత్నించింది. ధర్మయ్య పెదవికూడా విప్పలేదు. రాయి లెక్కనే కూసున్నాడు. దేవవ్వకు ఇంకింత భయమేసింది.

పొద్దుగూకింది. బయట రకరకాల మాటలు వినబడుతున్నాయి. సేటు పెద్దమనుషులను జమచేస్తున్నడని ఒకరు, పోలీస్‌ ఠాణాకే పట్టిత్తడట అని ఒకరు. నానారకాల మాటలు. మొత్తం మీద అందరి గొంతుక ఒక్కటే!

“ధర్మానికి కాపురమా! కరువుల కాలంల ఊరును ఆదుకునే సేటునే కొడుతడా! ఇంకొకనికి బుద్ధి వచ్చేటట్టు గట్టి శిక్షనే ఎయ్యాలె గాడిదికొడుక్కు” అని.


తెల్లారింది.

ఊరు పంచాదికి తయారయింది. చిన్నపెద్దను సేటు ఎగేత్తున్నాడు.

ధర్మయ్య ఇంటికి మాత్రం తాళం కప్ప యాలాడుతుంది. ఎప్పుడూ పచ్చగా సానుపుజల్లి ముగ్గులేసే వాకిట్ల పొక్కిలి లేచింది.